'Apataku nirajanam' written by A. Annapurna
రచన : A. అన్నపూర్ణ
అవును ఆపాట వినిపిస్తుంది....ఆయన మాట పలకరిస్తూనే వుంది!
ఆ నిండైన రూపం కనిపిస్తూనే వుంటుంది అదే పాట అదే బాలూ నోటా వింటూనేవున్నాం !
మనసులోని భావాలన్నీ చెప్పుకుంటూనే వున్నాము. ఆపాట విని పరవశించాము !
ఆమాటవిని మురిసిపోయాము. ఆయన అనుభవాలసారం ఎందరో గాయకులకు రాజమార్గం!
మీపాఠాలన్నీ వెలకట్టలేని సంపద. ఆపాటలన్నీ ఆణిముత్యాల సరాలు!
జగతిలోలేరు అన్నిపాటలు ఆలపించినవారు బాలూ తప్ప!
ఎవరు ఆలపించగలరు 'మాటరాని చిన్నదాని 'మౌన గీతాలు ఆతడు తప్ప!
ప్రతిగుండెనూతాకేవి ప్రతీనోటాపలికేవి భాషా బేధం లేనివి బాలూ పాటలు !
ఆదిశంకరునికి ఆభరణమై విశ్వనాధునికి ఆప్తుడవై వెలిగినావు!
దేశదేశాలు పర్యటించి అందరి భాషనూ తేనెలోముంచి మెప్పించినావు!
ప్రతిరాత్రి వసంతరాత్రిగా 'పాడేవుతీయగా' గానజలధిలో ఓలలాడించావు మాయలమారిగా!
తుంబుర నారదులు నీతో పోటీ పడలేక ఓడిపోయారట!
దేవతలు దేవుళ్ళు మెచ్చి పులకించి పరవసించి పోయారట!
సంగీత సాహిత్య సమలంకృతే స్వరరాగ దేవగణ గన్ధర్వా కిన్నెరా సందర్శన భాగ్య శీల!
దివిలో విరిసిన పారిజాతాలు కనులారా తిలకించగా ఏగినావొ !
కైలాస శిఖరాన ఓంకారనాదాలు ప్రతిధ్వనించగా గానము చేయ దలచినావో.!
దేవలోకానికి' నీ మిమిక్రీ ' గీతాలను వినిపించగా తలచినావేమో!
దేవకన్యలతో కలసి ముల్లోకాలకూ ''అమృతాభిషేకం''చేయ ఆహ్వానం అందుకున్నవేమో!
జీవన యాత్రలో నీకు మరో మజిలీ ఆ దేవలోకం మాకు వినవస్తూనేవుంది ఆ గానం!
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ.
నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.
నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.
అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)
విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.
రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.
ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.
Comments