top of page
Writer's pictureSurekha Puli

అర్జీ

#SurekhaPuli, #సురేఖ పులి, #Arjee, #అర్జీ #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ


'Arjee' - New Telugu Story Written By Surekha Puli

Published In manatelugukathalu.com On 26/10/2024

'అర్జీ' తెలుగు కథ

రచన : సురేఖ పులి

కథా పఠనం: పద్మావతి కొమరగిరి



ఉదయాన్నే కాచిగూడ ఎక్స్ప్రెస్ ట్రైన్ బెంగళూరు మెజెస్టిక్ రైల్వే స్టేషన్ లో అలసట తీర్చుకుందామని ఆగింది. 


“అత్తా, మనం దిగాల్సిన స్టేషన్ వచ్చింది, లేవాలి” అని హడావిడి చేసింది శశిబాల. 


కనకం ఉలిక్కిపడి జుట్టు సవరించుకుంటూ లేచి కూర్చుంది. సీటు కింద వున్న బ్యాగ్ తీసుకొని, చీర కుచ్చిళ్ళు సరిచేసుకుంది. 


“ఇదే ఆఖరు స్టేషన్ కదా, ఎందుకు తొందర? మెల్లిగా దిగొచ్చు.. ”


“ఇంత క్రితం వచ్చినప్పుడు బెంగళూరు స్టేషన్ ఆఖరు స్టాప్ గా ఉండేది, కానీ ఇప్పుడు ఇంకా ముందుకు మైసూర్ వరకు వెళుతుంది” అంటూ శశిబాల మేనత్త చేతిలో బ్యాగ్ తీసుకొని ఇద్దరూ రైలు దిగారు. 


కనకం మేనకోడలు చేయి పట్టుకొని భయంగా ఎస్కలేటర్ ఎక్కి స్టేషన్ బయటకు వచ్చారు. 


‘ఎల్లి బిళబేకు?’ అంటూ ఆటో డ్రైవర్లు మున్ముందుకు వచ్చి చిరాకు కలిగిస్తున్నారు. ఎంతకీ జవాబు రానందుకు ‘ఓహో, తెలుగ’ అని నిర్ధారణ చేసుకుని ‘ఎక్కడికి పోఏది?’ అని అడుగు ముందుకు వేయనీయలేదు. 


రైల్వే స్టేషన్ పక్కన ఉన్న బస్ స్టాండ్ వైపు దారి తీశారు. సబ్వే మెట్లు అశుభ్రంగా వున్నాయి. పైగా కీళ్ళ నొప్పులున్న కనకం దిగాలంటే కష్టంగా అనిపించి “అంతగా ఆటో వాళ్లు అడుగుతుంటే కాదని.. ఇదిగో ఇలా కష్టపడి దిగాల్సి వచ్చింది” చిరాకు పడ్డది. 


“నువ్వే కదా, వీలున్నంత తక్కువ ఖర్చు పెట్టాలని అన్నావు, ఇప్పుడేమో గొణుగుతున్నావు. నా చేయి పట్టుకుని మెల్లిగా నడు. ”


 మేనకోడలు శశిబాల చేతిని పట్టుకుని మెల్లిగా బి. ఎం. టి. సి. చేరుకున్నారు. సిటీ అన్ని మూలలకు బస్సులు రెడీగా ఉన్నాయి. రిచ్మండ్ రోడ్డు వెళ్లే బస్సు ఎక్కారు. 

***

అమరేందర్ తనకు నచ్చిన బి. ఫార్మసీ చదివి, ఉద్యోగం చేస్తున్న మృదులను ఇష్టపడి వివాహం చేసుకున్నాడు. అందం, చదువు, కులం, గోత్రం అన్నీ సరిగ్గా కుదిరాయి; కానీ తన ప్రమేయం లేకుండా భార్యను నిశ్చయించు కున్నాడని మింగుడు పడని అసహనం, బాధ కనకంలో మార్పును తెచ్చాయి; పర్యావసానంగా కొడుకు, కోడలు అంటే చిరాకు పెంచుకుంది కనకం. కానీ తప్పదు; ఎవరు ఏం చేసినా, చేయకపోయినా తన బ్రతుకు తనకు నచ్చిన విధంగా సాగిపోవాలి. 

వంశోద్దరకుడు పుట్టలేదని, గర్వంగా చెప్పుకోలేక పోతున్నానని వరుసగా దేవతలకు మొక్కులు, కానుకలు సమర్పించే క్రమంలో అమరేంద్ర కుటుంబ నియంత్రణ అమలు చేసే కబురు అమ్మ చెవిన వేశాడు, విని తాండవం చేసింది కనకం. 


“నాకు మనవడు కావాలి” మొండి పట్టు పట్టింది కనకం. 


“అమ్మా, మళ్లీ ఆడపిల్ల పుడితే? అమర్ మనసులోని మాట చెప్పాడు. 


“పుట్టనీ, మగపిల్లాడు పుట్టే వరకు ఆపేది లేదు” తల్లి శాసించింది. 


“వరుసగా ముగ్గురు అమ్మాయిలు, ఆరోగ్యంగా వీళ్ళను పెంచి, ఉన్నతమైన చదువు చెప్పించి మన శక్తి ఉన్నంతలో పెళ్ళిళ్ళు చేశామంటే చాలు; మనవడి గురించి ఆలోచన మానుకో” నచ్చచెప్పాడు కొడుకు. 


తల్లీ కొడుకుల సంభాషణ వింటున్న మృదుల మౌనంగా మనసులో మధన చెందింది. జీవితంలో ఒక్కోసారి ఏటికి ఎదురీదడం అవుతుంది. ఆ ఎదురీతకు మనిషిలో బలమైన విశ్వాసం, దృఢచిత్తం, అమితమైన సహనం కావాలి. ఏది ఏమైనా ఇప్పుడున్న సంతానం చాలు. 


‘పిల్లల్ని కనడం మీ వంతు, పెంచడం మాత్రం నా వంతు కదా’ అని చాలా సార్లు కోడల్ని నచ్చచెప్పాలని ప్రయత్నించింది. మృదుల అత్తగారి మాట వినక పోగా భర్త చేత చెప్పిస్తుంటే కనకం కోపం తారాస్థాయి నందుకుంది. ఆశ విఫలమైంది, మనవరాళ్లను సరిగ్గా చూడటం మానేసింది. 


“నేను ఆఫీసు నుండి ఇంటికి వచ్చేసరికి పిల్లలు వాకిట్లో మట్టిలో ఆడుతున్నారు. స్కూల్ డ్రెస్ మార్చలేదు. అత్తయ్య ఏమీ పట్టనట్టు ఇరుగుపొరుగు అమ్మలక్కలతో ముచ్చట్లు! ఇలాగైతే ఎలా?” అని భర్తను నిలదీసింది. అన్నీ భరిస్తున్నాడు భర్త! 


ఇంకొన్నాళ్ళకి ఓర్పు నశించి పెళ్లికి ముందు చేసిన సంభాషణ గుర్తు చేసింది. ‘మీ అమ్మానాన్న ఇవ్వగలిగినంత సుఖం నేను ఇవ్వగలనో లేదో కానీ ఆపేక్ష-ఆదరణకు మాత్రం కొదువ రాదు. ’ 


“వింటున్నారా, నాకు ఈ ఇంట్లో అన్ని విధాల బాగానే వుంది, కానీ మనం జన్మనిచ్చిన పసివాళ్లకు మనం లేని సమయాల్లో పోషణ సరిగా లేదు, పోనీ నేను ఉద్యోగం మానేస్తాను సరేనా?” మృదుల పరిష్కారం వెతుక్కుంది. 


“మనిద్దరం వేరు వేరు కాదు.. ఒక్కటే! ప్రేమంటే ఒకరికి ఒకరం దానం ఇచ్చుకునేది కాదు. ఆనందాన్ని, వెలితిని కూడా సమానంగా పంచుకోవాలి. ప్లీజ్! నువ్వు ఉద్యోగం మానకు, పిల్లల భవిష్యత్తు కోసమే మనం డబ్బు దాచాలి. నేను అమ్మతో నయానో-భయానో నచ్చ చెపుతాను. ” 

***

“మా అన్నయ్య అదే.. నీ మేనమామ శంకర్ ఆరోగ్యం బాగాలేదట, నేను వెళ్లి చూసి పలకరించి వస్తాను” హైదరాబాద్ శివార్లలో వుంటున్న శంకర్ మామ ఇంటికి వెళ్ళింది. 


కూతుళ్లను స్కూల్కు తయారు చేయడం టిఫిన్ బాక్స్ సద్దడం వరకు రోజు చేసే పని, కానీ ఇప్పుడు అత్తగారు లేనందుకు స్కూల్ బస్ ఎక్కించి మళ్లీ వాళ్ళు బస్ దిగిన మొదలు దగ్గరుండి శుభ్రంగా స్నానం, ఏదైనా ఫలహారం, ఆటలు, చదువు అన్నీ సక్రమంగా జరగాలని మృదుల నెల సెలవు పెట్టింది. అత్తగారు ఇంటికి తిరిగి వచ్చే సూచన కాన రాలేదు. 


అమరేందర్ ఆదివారం పొద్దున్నే శంకర్మామ ఇంటికి భార్య పిల్లలతో బయలుదేరాడు. అత్తా మామా తమ కూతుర్ని పెళ్లి చేసుకోలేదని కొన్నాళ్ళు అమరేందర్ పైన అలుక వహించారు. మేనరికం నచ్చక, పదేళ్ళ వయసు తేడా వున్నందుకు పెళ్లికి ఒప్పుకోలేదు. పాత సంగతులు మనసులో కుదించుకుని ఆప్యాయంగా ఆహ్వనించారు.

 

“అమ్మా.. మన ఇంటిని-పిల్లల్ని కాదని వీళ్ళతో ఉంటున్నావు, మరి.. కంటి ఆపరేషన్ అయి ఇప్పుడు మామ బాగానే వున్నాడు. నువ్వు ఇంటికి వచ్చేయి” అర్ధించాడు. 

“నాకు నీ ఇంటికి రావాలని లేదు, రాను కూడా.. ” కోమలి పూరీలు ఒత్తుతుంటే కనకం కాగిన నూనెలో వేసి తీస్తుంది. 

“ఎందుకమ్మా అంత కోపం, మేము ఇద్దరం ఆఫీసుకు వెళ్లి పోతే మనవరాళ్లను చూసుకునే బాధ్యత నీది కదా?” ఆర్ధత!!


శశిబాల పూరీలు-కూర కంచాలలో అమర్చి అందరికీ ఇచ్చింది. 


మళ్లీ అడిగాడు “అమ్మా, ప్లీజ్ చెప్పమ్మా.. మా ఇద్దరి వలన జరిగిన పొరపాటేంటి?” 


కోమలి మేనల్లుడితో “అమర్.. నువ్వు ముందు టిఫిన్ తిను, తరువాత మాట్లాడుకోవచ్చు” 


అయిష్టంగానే పూరీ తిన్నాడు. మృదుల బిడ్డలకు తినిపించే కార్యక్రమంలో తాను తినలేదు. 


“సరే, అడిగావు కాబట్టి చెబుతున్నా.. ఒకటి, రెండు కాదు ఎన్నో కారణాల మూలంగా నాకు మీ వద్ద ఉండాలని లేదు. ” 


“మేము సరిదిద్దుకుంటాము, చెప్పమ్మా.. ” ప్రాధేయంగా అన్నాడు. 


గుక్క తిప్పుకోకుండా చెప్పనారంభించింది “నా కోరిక మేరకు శశి నీకు భార్య కాలేదు. మృదుల నేను ఆశించిన కట్నం తేలేదు. మీరిద్దరూ ఆఫీసులో వుంటే నేనొక్కదాన్నే ఇంటి కుక్కలా కాపలా కాయాలా? పైగా అందరి ముందు నాకు మనవడు లేడు, ఇక పుట్టడు అని తలవంచుకు తిరగాలి. నేను అమ్మను. అంతే కానీ ఆయాను కాను. నీ భార్యను ఉద్యోగం మానేసి నన్ను, నా బాగోగులు చూడమను. 

పొద్దున్నే వంట చేసి పోతే మధ్యాహ్నం వరకు చల్లబడి, చప్పబడ్డ కూడు నేను తినను. నేను సుఖ పడాలి అని నీకు ఎందుకు అనిపించడం లేదు?” గుక్కతిప్పుకోకుండా ఏకరువు పెట్టింది. 


అమరేందర్ మృదుల అవాక్కయి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు, కోపంలో ఉన్న అమ్మకు ఏం జవాబు చెప్పాలో తెలియ లేదు. కోమలి మృదులను బయటకు రమ్మని సైగ చేసింది. 


“మీ అత్తగారు అదే మా వదిన చాలా మొండి మనిషి. నువ్వు కాళ్ళు పట్టుకొని బ్రతిమాలు, ఎప్పటికైనా వాళ్ళిద్దరూ ఒకటే, బయటి నుంచి వచ్చిన కోడలు ఎప్పటికీ పరాయిదే” హితబోధ చేసింది. సరేనంది మృదుల. 


“అత్తయ్య మీ అవసరాలు గుర్తించాను. మీరు కేవలం ఇంట్లో పెద్ద దిక్కుగా ఉంటే చాలు. నేను లేని టైం లో మరో మనిషిని మీకు తోడుగా వుండేట్టు చూసుకుంటాను” అంటూ అత్తగారి పాదాలు మొక్కింది. 


“అందరూ వినండి, కొడుకు కోడలు వాళ్ళతో పాటు పిల్లలు వెళ్లిపోతారు నేనొక్కదాన్నే ఇంట్లో బిక్కు బిక్కుమంటూ ఉండాలి, నా కాలక్షేపానికి మనిషిని పెడతారట” వెటకారంగా కనకం దుయ్యబట్టింది. 


తన వాళ్ళ నుంచి ఆదరాభిమానాలు మరింత ఎక్కువగా ఆశించి వాటిని పొందలేకపోతే బలహీనులు అంటారు. ఇప్పుడు అమరేంద్ర కూడా బలహీనుడైనాడు. 


సెలవు రోజుని శౌర్య, శశాంక్ ఆలస్యంగా లేచి ఫ్రెష్ అయ్యి టిఫిన్ కోసం వచ్చారు. ఆప్యాయంగా పరస్పరం పలుకరించుకొని బావకు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. 


“ఈ రోజుల్లో అందరూ ప్రైవేట్ జాబ్స్ లేదంటే ఐటి జాబ్స్ చేస్తున్నారు, ఇంకా నువ్వు ఆ పాత పబ్లిక్ సెక్టార్ జాబ్ చేస్తున్నావ్.. గ్రేట్!” 


శౌర్య మాటలకు జవాబు చెప్పలేదు. 


“కనకత్తను తీసుకుపోదామని వచ్చారు, కానీ అత్త మనింట్లోనే ఉండాలని అంటుంది” శశిబాల అన్నలిద్దరికి అక్కడ జరుగుతున్న సీన్ విడమర్చింది. 


“అత్తకు ఎక్కడ సౌకర్యంగా ఉంటే అక్కడ ఉండనీ, మనకేం బరువు కాదు. ”


“అదే మాట చెప్తున్నా, నాకు ఇక్కడ ఉన్నంత సుఖం అక్కడ లేదు. ” తల్లి ఇచ్చిన నిర్ణయం తర్వాత మాటలు పెంచలేదు. 


‘నేను కోరుకునేది ఒక్కటే మృదులా, మా అమ్మ బంగారం, ఆమెను సంతోష పెట్టాలి’ పెళ్లికి ముందు అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. అమరేందర్ కళ్ళల్లో ఉబుకుతున్న కన్నీటిని కష్టంగా అదుపులో పెట్టుకున్నాడు, మనసు బరువెక్కి వెళ్లిపోయారు. 

***

జీవితం వడ్డించిన విస్తరి కాదు. జీవితంలో పోరాడే శక్తి లేక, పరిస్థితి తారుమారైతే చక్కబెట్టుకునే చతురత వుంటే చాలు. 

అమరేంద్ర బెంగళూరు హెడ్ ఆఫీసుకు బదిలీ చేయించుకున్నాడు. కంపెనీ క్వార్టర్ ఇచ్చింది, మృదుల చేస్తున్న నౌకరి వదిలి భర్త చేసే కంపెనీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో నడుస్తున్న మెడికల్ షాప్ లో తక్కువ జీతం ఐనా చేరింది. పిల్లలు టౌన్షిప్ స్కూల్ జాయిన్ అయ్యారు. 


ఉద్యోగ కాలం ఐదు సంవత్సరాలు ఉండగా స్వచ్ఛంద పదవీ విరమణ పొంది రిచ్మండ్ రోడ్డు లో ఇల్లు కొనుకున్నారు. ముగ్గురు కూతుర్లు మెడిసిన్ చదువులకు విదేశాలకు వెళ్లారు. 


అంతా సమకూరింది అనుకుని తృప్తిగా ఊపిరి పీల్చుకునే వేళ అమరేంద్ర ఊపిరి పీల్చుకో లేక హఠాన్మరణం మృదులకు వెన్నుపోటు ఐయింది. వార్త తెలిసిన వెంటనే కనకంతో పాటు అంతా వచ్చారు. కొడుకు పోయిన బాధ కంటే రిటైర్మెంట్ డబ్బు సాంతం బెంగళూరులో బంగాళా కొనుక్కున్నారు అని నెత్తి-నోరు కొట్టుకుంది కనకం.

 

“వదినా, మా పరిస్థితి అంత బాగాలేదు. ఒక్క మనిషి తగ్గినా మాకు ఖర్చులు తగ్గినట్టే.. నీ హక్కుగా భావించి ఇక్కడే కోడలు వద్ద ఉండిపో, ఒంటరిగా వున్న మృదులకు తోడుగా..” బెంగళూరులోనే కోడలు వద్ద ఉండి పొమ్మని చెవిలో సొద పెడుతున్న కోమలి మాటలు సోదిగా వుండిపోయాయి. 


‘ఇది నా ఊరు కాదు, ఊరు గాని ఊళ్ళో నేనుండలేను’ అని పెడచెవిన పెట్టింది. 


‘మృదుల తనకు తానుగా నన్ను వుండమని అడగాలి. అవసరం తనది, నాది కాదు. పైగా మా అన్న ఇంట్లో నేను వుంటే నీకేంటి అభ్యంతరం?’ 


వదిన పెడసరి మాటకు మరో మారు అడిగే ధైర్యం చేయలేదు. 


శశాంక్, శౌర్య పెళ్ళిళ్ళు అయి, ఆఫీసుకు దగ్గర్లో వేరే ఉంటున్నారు, అడపాదడపా వచ్చి పోతుంటారు. శశి పెళ్లి వయసు దాటుతున్న పెళ్లి కాలేదు. శంకర్ పెన్షన్ డబ్బులతో ఇల్లు నడుస్తుంది. వయసు తెచ్చే మార్పులకు తలవంచారు, అందుకే కనకం భారమైంది. 

***

“మృదుల ఆంటీ మాకు ఇల్లు రెంట్ ఇచ్చారు. మీరు వస్తున్నట్లు ఫోన్ చేయలేదా?” మధ్య వయస్కురాలైన యువతి ఇంటి ఓనర్ బంధువులని ఇంట్లోకి రానిచ్చి ప్రశ్నించింది. 


“చాలా సార్లు ఫోన్ చేశాను, నెంబర్ చెక్ చేసుకోమని వచ్చింది. ఇంతకీ మా అక్క ఎక్కడుంది?” శశిబాల తన ఫోన్లో డైల్డ్ డీటైల్స్ చూపించింది. 


“ఈ నెంబర్ కాదు, ఆంటీ ఇప్పుడు ‘సురక్ష హోమ్’ లో ఉంటున్నారు. ”


“అదెక్కడ? అక్కడెవరు వున్నారు?” కనకం అనుమానంగా అడిగింది. 


“అది ఒక టేక్ కేర్ అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్. ఆంటీ డాటర్స్ విదేశాల్లో ఉంటున్నారని లోన్లీనెస్ కారణంగా అక్కడ ఉంటున్నారు” సౌమ్యంగా సమాధానం ఇచ్చింది. 


“ప్లీజ్, అక్కడి అడ్రస్ ఇస్తారా, మేము వెళ్లి కలవాలి” శశిబాల అభ్యర్థన. 


“అలాగే ఇస్తాను, ఒక్క నిమిషం!” అని ఫోన్ కలిపింది. 

“హలో, ఆంటీ.. నేను సంయుక్త.. బాగున్నారా ఆంటీ? 

.. 

“ఆ, ఐ అమ్ ఫైన్ ఆంటీ, మీ బంధువులు సికింద్రాబాద్ నుంచి వచ్చారు. మీ నెంబర్ అడుగుతున్నారు, ఇచ్చేదా ఆంటీ?”


“అమ్మో! దీని షోకు మాడిపోను, ఫోన్ నెంబర్ కావాలంటే పర్మిషన్ తీసుకోవాలా?” కసితో దవడలు ఉబ్బి పోయాయి. 


“ఆంటీ ఇక్కడికే వస్తానంది. మీరు ఫ్రెష్ అయ్యి బ్రేక్ ఫాస్ట్ చేయండి” సంయుక్త వాష్రూమ్ దారి చూపించింది. 


ఎంత అందంగా, శుభ్రంగా ఉంది ఇల్లు! ఇదంతా నా అమర్ సంపాదన! వేరే వాళ్ళు అనుభవిస్తున్నారు!! శశిబాల, కనకం మనసుల్లో ముల్లు గుచ్చుకుంది. 


డైనింగ్ టేబుల్ మీద కమ్మటి నేతి వాసనతో పొగలు చిమ్మే దోశ! సాంబారు, కొబ్బరి చట్నీ! నిన్న సాయంత్రం హడావిడిగా కడుపులోకి తొక్కేసిన టీ-బ్రెడ్; ఆకలి ఆవురావురుమని తొందర చేసింది. టిఫిన్ తరువాత మధురమైన కాఫీ తాగారు. 


మృదుల ఏమీ మారలేదు, అనుకుంది శశిబాల. “అత్తయ్య.. కొంచెం మీరు బలహీనంగా అయ్యారు. వచ్చిన పనేమిటో చెప్పండి?” అంది. 


“..” 


“అక్కా నిన్ను చూసి చాలా రోజులైంది. నీ కొత్త ఫోన్ నెంబర్ ఇవ్వు. ” 


ఇచ్చింది. 


“అసలు ఎందుకు మార్చావు? మాకు తెలియక తికమక పడాలనా?” అనుమానం తెలియపర్చింది. 


“కాదు. పాత నెంబర్ హాక్ అయింది, ఫ్రాడ్ కాల్స్ ఎక్కువైనాయి. ”


“మేము ఈ సాయంత్రం రిటర్న్ వెళ్లాలి. అత్తకు ఏదో కావాలట. ”


“కొంచెం డబ్బులు ఇబ్బందిగా ఉంది మృదుల.. నా వద్ద ఏమీ ఆధారాలు లేవు. నేను ఒంటరినని, ఎటువంటి ఆర్థిక రాబడి లేదని ధ్రువీకరణ పత్రం పెడితే ప్రభుత్వం ఏదో కొంత పెన్షన్ ఇస్తున్నారట.. అందుకని.. అదే.. మీ మామగారి డెత్ సర్టిఫికెట్, అమర్ డెత్ సర్టిఫికెట్.. రెండు నీ దగ్గరే ఉన్నాయి.. ఒరిజినల్స్ కావాలి.. ” నసుగుతూ మొహమాట పడుతూ చెప్పింది కనకం. 


ఒక్క నిమిషం ఆగి, “అన్ని డాక్యుమెంట్స్, అవసరమైన వస్తువులన్నీ ఇక్కడే నా బెడ్ రూమ్ లో భద్రపర్చాను” సంయుక్త వద్ద తాళం చెవుల గుత్తి తీసుకుంది. 


“అత్తయ్య లోపలికి రండి” 


బెడ్రూమ్ వైపు నడిచారు. శశిబాల కొత్తగా విడుదలైన సినిమా కోసం నెట్ ఫ్లిక్స్ పెట్టుకుంది. మృదుల బీరువా అడుగు అరలో క్రమంగా అమర్చిన ఫైల్ తీసి రెండు డెత్ సర్టిఫికెట్లు కనకం చేతిలో పెట్టింది. అత్తగారు అమాంతం తలుపులు మూసేసింది. ఎందుకు తలుపులు మూసారో అర్థం కాలేదు. కళ్ళతోనే కారణం అడిగింది. 

“అమ్మా.. మృదుల నాకు అక్కడ.. నా పుట్టిల్లే అయినా నచ్చలేదు. నీ వద్ద ఉండి పోతాను. ”


“తప్పకుండా, మనిద్దరం కలిసి ‘సురక్ష హోమ్’ లో వుందాము. ”


“ఎందుకు? ఇద్దరం కలిసి ఇక్కడ ఈ సుందరమైన ఇంట్లో ఉండొచ్చు.. ఆ సుభిక్ష, సురక్ష వద్దు. ”


“మనకు ఇంత పెద్ద ఇల్లు అవసరం లేదు. ఇప్పుడున్న సంయుక్త వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ, అందరూ ఆదివారం అని ‘మాల్’ పోయారు. తనకు ఆరోగ్యం నలతగా వున్నందుకు ఇంట్లో వుంది. మీరు, నేను కలిసి ఒకే చోట హోమ్ లో వుందాము, అక్కడ సౌకర్యంగా ఉంటుంది. ట్రైన్ సాయంత్రం కదా, ఇంకా టైమ్ వుంది. ఆలోచించుకోండి, మీ ఇష్టం” మృదుల పాత ఫోటో ఆల్బమ్ చేతికిచ్చింది. 


కనకం అక్కడే వున్న రివాల్వింగ్ చైర్లో కూర్చుని ఆల్బమ్ తిరగేస్తుంది, మనసు పరిపరి విధాల పరిభ్రమిస్తుంది. 

ఇంటి పనులన్నీ తానే చూసుకుంటూ, అన్నా వదినల సూటిపోటి మాటలు భరిస్తున్నది. మేనల్లుళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని వేరే వెళ్లిపోయారు. తన వంతు ఇంటి ఖర్చులకు గుడిలో ప్రసాదం ఫలహారాలు వండివారుస్తున్నది. 


శశిబాల టీవీలో వచ్చే ప్రతి సీరియల్, ఓటిటి సినిమాలన్నీ ఠంచనుగా చూసి తరించాలి. ఇప్పుడు కొత్తగా నన్ను ‘అనాధ’ అని పెన్షన్ అర్జీ పెట్టమని మరణ ధృవీకరణ పత్రం కోసం బెంగళూరుకు తీసుకొచ్చింది. 


శశిబాలను కాదని మృదుల నన్ను తన వద్దనే వుండమని మొండి పట్టు పట్టాలి. కుదిరే పనేనా? 


ఇదంతా అసలు నాదే తప్పు, నా బాగోగులు నేనే బాగానే చూసుకోగలను అనుకున్న.. మనిషి ఏదైనా పొరపాటు చేసినప్పుడు ఏనాటికైనా అది పొరపాటు అని తెలిసికోవడం, పశ్చాత్తాప పడటం అవసరం. నా ప్రారబ్ధమో, దురదృష్టమో జరిగిందేదో జరిగిపోయింది. నేను ఎంత కుమిలి పోతున్నానో, ఎంత క్షోభిస్తున్నానో ఎవ్వరు గ్రహించడం లేదు. 


“అత్తా చాలా సేపైంది ఏం చేస్తున్నావ్” అంటూ శశిబాల హాల్ నుండి బెడ్రూమ్ లోపలికి వచ్చింది. 


సమాధానం రాకపోవడంతో తానే మళ్లీ అంది “ఈ ఆల్బమ్ కూడా మనతో పాటు తీసుకెళ్దామా?” అంటూ ప్లాస్టిక్ కవర్లో విడివిడిగా అమర్చిన రెండు డెత్ సర్టిఫికేట్లను తీసుకుంది. 

***

“సంయుక్త గారు మీరు ఒంట్లో నలతగా ఉన్నా మా కోసం టిఫిన్, భోజనం తయారు చేశారు, చాలా థాంక్స్ అండీ మీకు శ్రమ కలిగించాము. ” 


“ఇట్స్ మై ప్లేషర్! జస్ట్ నలుగురికి వంట చేస్తే శ్రమ ఏముంది?” 


“అత్తయ్య నాతోనే ఉండాలనుకుంటున్నారు, ఏమంటావు శశీ?” 


“నేను వుండాలనుకోలేదు, మృదుల నన్ను వుండమని బలవంతపెడితే నిన్ను అడగమన్నాను” కనకం ఠక్కున మాట మార్చింది. 


“అదెలా కుదురుతుంది, అమర్ బావ నన్ను కాదని నిన్ను కోరుకున్నాడు, మా మంచి అత్త నిన్ను కాదని నా వద్ద ఉంటుంది, అంతే! అత్తా.. నువ్వు మాతో పాటే వున్నావు, వుంటావు! మనకు కావాల్సిన డెత్ సర్టిఫికెట్లు మనతో ఉన్నాయి. రిటర్న్ టిక్కెట్స్ బుక్ చేసుకున్నాం, ఇంకా ఇక్కడేం పని?” అంటూ కనకత్త వీపును హత్తుకొని పెనవేసుకుంది. 


హక్కు కోల్పోతున్నానని కనకం కళ్ళు మృదుల వంక బేలగా చూశాయి. 


‘నేను కోరుకునేది ఒక్కటే మృదులా.. మా అమ్మ బంగారం. ఆమెను సంతోష పెట్టాలి’ అమరేందర్ మాటలు మారుమ్రోగాయి. 


“శశీ.. అత్తయ్య నాతోనే ఉండనీ.. అప్పుడప్పుడు వస్తూ-పోతూ ఉంటుంది. ”


“నా మేనత్త.. మా రక్తసంబంధం. నా బంగారం.. నాతో పాటు మా ఇంట్లో ఉంటుంది. ఇక్కడ వుండదు. ” పరుషమైన స్వరం!


ఎప్పుడూ తన మాటే గెలవాలని తలచే కనకం (బంగారం) ఎందుకో వెలవెల బోయి మారు మాట్లాడలేక పోయింది. 

*****


సురేఖ పులి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సురేఖ పులి  గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

Profile Link:

Youtube Play List Link:

 

పేరు :సురేఖ  ఇంటి పేరు: పులి

భర్త పేరు: స్వర్గీయ పి. అరుణ్ కుమార్

వయసు : 70 సంవత్సరాలు. పుట్టి, పెరిగింది హైదరాబాద్ లో.

మా అమ్మనాన్నలు స్వర్గీయ లక్ష్మి అర్జున్ రావు గార్లు నా మార్గదర్శకులు.

ప్రస్తుత నివాసం బెంగళూరు  విశ్రాంత సీనియర్ సిటిజన్ ను.

ఎంఏ (సోషియాలజీ&ఇంగ్లీష్) చేశాను.  స్కూల్, కాలేజీ మ్యాగజైన్ కు రాయడంతో నా రచనా వ్యాసంగం ప్రారంభమైంది.

HMT Hyd లో నా ఉద్యోగం, 2008  లో స్వచ్ఛంద పదవీ విరమణ.

చందమామ, యువ, స్వాతి,  ఈనాడు,  మన తెలుగుకథలుడాట్ కాం, నెచ్చెలి, ఉష పత్రిక, కెనడా డే  లలో నా కథలు, కథానికలు ప్రచురితమయ్యాయి. కొన్నిటికి బహుమతులు కూడా వచ్చాయి. మూడు నవలలు మాత్రమే రాశాను. అందులో “కల్పతరువు” నవలకు మన తెలుగు కథలు డాట్ కాం వారి బహుమతి లభించింది. మరిన్ని రచనలతో పాఠకులకు దగ్గర కావాలన్నది నా ఆశయం.

Surekha Puli 


70 views3 comments

3 Comments


rakhee venugopal

12 hours ago

Very nice 👍 interesting!

Like

Surekha Puli

9 hours ago

ధన్యవాదాలు 🙏

Like


Dipti Puli

6 hours ago

Bagundi 🎉

Like
bottom of page