top of page

అసలైన అందం ఎక్కడుంది

#YasodaPulugurtha, #యశోదపులుగుర్త, #అసలైనఅందంఎక్కడుంది, #AsalainaAndamEkkadundi, ##TeluguHeartTouchingStories


Asalaina Andam Ekkadundi - New Telugu Story Written By Yasoda Pulugurtha 

Published In manatelugukathalu.com On 12/04/2025

అసలైన అందం ఎక్కడుంది - తెలుగు కథ

రచన: యశోద పులుగుర్త 

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)


"ఆ అమ్మాయి ఎంతందంగా ఉందీ, బాపూ బొమ్మలా" అని అనుకోకుండా ఉండలేకపోయాడు మనోహర్. 


పిరుదులు దాటిన ఒత్తైన జడ, మీనాల్లాంటి అందమైన కళ్లు, ఎప్పుడూ చిరునవ్వులను ఒలికించే ఆ అందమైన పెదవులు, ఎవరు పిలిచినా కెరటంలా దుమికే ఆ చలాకీ తనం అందరినీ సమ్మోహన పరుస్తోంది. 


ఈలోగా 'హాసినీ' అంటూ ఎవరో పిలవగా పరుగులాంటి నడకతో లోపలికి వెళ్లి మరలా వచ్చి ఆ పెళ్లి పందిరిలో అంతా తానై, ఎవరికేమి కావలసివచ్చినా తృటిలో అందిస్తూ, పొడవైన జడ అటూ ఇటూ ఊగుతుంటే ఒయ్యారంగా నడుస్తూ అందరినీ ఆకర్షిస్తోంది.

 

“హాసిని!” ఎంత అందమైన పేరూ?” అనుకోకుండా ఉండలేకపోయాడు. 


తన పక్కనే కూర్చున ఒక పెద్ద మనిషి ఆడపిల్ల వైపు వారే అయి ఉంటారు, ముందు వరుస కుర్చీలో కూర్చొన్న వ్యక్తి భుజం తడుతూ, వంగుని అతనితో “ఏదీ హాసిని భర్త ఎక్కడా కనపడడం లేదు, అతనికి ఒంట్లో బాగోలేదన్నారు, వచ్చాడా పెళ్లి”కంటూ అడుగుతున్నాడు. 

 

“ఆ, ఆ, నీకు కనపడలేదా ఏమి”టంటూ, ”ఒక పక్కన, అందరికీ కాస్త దూరంలో కూర్చుని ఉన్న వ్యక్తి వైపు చూపిస్తూ, “అదిగో, అతనే హాసిని భర్త” అని చెబుతుంటే, కుతూహలంగా తనూ ఆవైపు చూసాడు. 


"అతను ఆమె భర్తా"? నమ్మశక్యం అనిపించక ఆశ్చర్యంగా చూస్తున్నాడు మనోహర్. 


పీక్కుపోయిన ముఖంతో దగ్గుతూ, రొప్పుతూ ఒక మూల ఒరిగిపోయి కూర్చున్నాడు. మనిషి పీలగా నల్లగా అందవిహీనంగా ఉన్నాడు. 


అంత అందమైన అమ్మాయి ఇటువంటి వ్యక్తిని పెళ్లాడడంలో ఏదో బలీయమైన కారణం ఉండచ్చనుకుంటూ ఎవరిని అడిగితే తన అనుమానం నివృత్తి అవుతుందని, అయినా అడిగితే బాగుండదు కదా అని ఆలోచిస్తున్నాడు మనోహర్. 


తను వచ్చింది పిన్నికొడుకు నరేష్ వివాహానికి. నరేష్, తనూ చిన్నప్పటినుండీ మంచి స్నేహితులు. బంధుత్వం కంటే ఇరువురి మధ్యా స్నేహబంధం ఎక్కువ. 


“పెళ్లి కూతురు కంటే హాసినే బాగుంటుంది కదూ?” తన పక్కన కూర్చొన్న వ్యక్తి తన ముందు వరసలో కూర్చొన్న వ్యక్తితో అంటున్నాడు. 


“అవును సొంత అక్క చెల్లెళ్లైనా హాసిని చెల్లెలు రాగిణిది కాస్త ఛాయ తక్కువ. అయినా హాసిని కంటే బాగా చదువుకుని ఉద్యోగం కూడా చేస్తోంది. పెళ్లికొడుకు ఉద్యోగం చేసే అమ్మాయే కావాలని అందానికి ప్రాముఖ్యత ఇవ్వలేదని తెలిసింది. హాసిని తెలివైంది. కానీ రాగిణి అమాయకురాలు.”

 

“ఏం ఎందుకలా అంటున్నావ్?” తన పక్కనే కూర్చొన్న వ్యక్తి కుతూహలంగా అడుగుతున్నాడు. 


“అది అంతేలే, సైకాలజీ చదివిన వాడిని కదా, నీ కర్థమౌ”దంటూ నవ్వేసాడు. 


పెళ్లి అయిపోయింది. ‘ఒక వారమేనా ఉండాలిరా మనోహర్’ అంటూ ముందరే షరతు పెట్టిన మూలాన తను ఉండిపోయాడు. 


మరునాడు నరేష్, మనోహర్ కు హాసిని భర్త శేఖర్ ను పరిచయం చేసాడు. శేఖర్ ఆడిటర్ గా పనిచేస్తూ బాగా సంపాదిస్తున్నాడనీ, ఆస్తిపాస్తులవీ ఉన్నవాడని నరేష్ చెప్పాడు. 


ఇంతలో హాసిని వచ్చిందక్కడకు. పట్టుచీరలో, నగలతో మెరిసిపోతోంది. ఆమె రాకతో ఏదో దివ్య సుగంధం ఆ పరిసరాలను నింపేసింది. నరేష్ మనోహర్ కి మా వదినగారంటూ పరిచయం చేసాడు. 


హాసిని శేఖర్ తో చిరాగ్గా ఏదో మాట్లాడి అక్కడనుండి వెళ్లిపోయింది. 


ఆ తరువాత తనే శేఖర్ తో మాటలు కలుపుతూ సన్నిహితుడైనాడు. 


"నా భార్య చాలా అందంగా ఉంది కదూ మనోహర్ గారూ?” 


"మీరు చాలా అదృష్టవంతులు బ్రదర్" అనగానే గట్టిగా నవ్వాడు అతను. 



"మీతో నా భార్య అందం గురించి మాట్లాడడం సంస్కారం కాకపోవచ్చు. మీరు నాకు ఆత్మీయులుగా అనిపించి నా ఆవేదనను మీతో పంచుకోవాలనిపించింది". 


“నేను మీ ఆత్మీయుడినే, ఫరవాలేదు, చెప్పండి శేఖర్ గారూ!”


“మాది ప్రేమ వివాహం. హాసినే నన్ను మొదట ప్రేమించింది. మా చెల్లెలికి స్నేహితురాలు హాసిని, తరచుగా మా ఇంటికి వస్తూండేది. అప్పట్లో నేను ఆడిటర్ గా ప్రాక్టీస్ పెట్టి బాగానే సంపాదిస్తున్నాను. హాసినికి మా ఆస్తీ, ఐశ్వర్యం, నా సంపాదన పట్ల ఆకర్షితురాలైంది. 


తనది సాధారణమైన మధ్యతరగతి కుటుంబం. వాళ్ల నాన్న ఏదో గవర్న్ మెంట్ డిపార్ట్ మెంట్ లో క్లర్క్ గా చేస్తూ ఉండేవాడు. హాసిని కాక రాగిణి అనే అమ్మాయి కూడా ఉంది వారికి. రాగిణ్ బాగా తెలివైంది. మెరిట్ స్టూడెంట్. హాసిని ఆడుతూ పాడుతూ కాలం గడిపేసేది. 


ఒకరోజు మా ఇంట్లో ఎవరూ లేని సమయంలో వచ్చింది హాసిని. వస్తూనే సోఫాలో కూర్చుని ఏడవడం మొదలుపెట్టింది. 


‘ఏమైంది హాసినీ’ అంటూ ఆందోళనగా అడిగాను. 


‘నాకు పెళ్లిసంబంధం చూసాడు మా నాన్న. వయస్సులో నా కంటే పదేళ్లు పెద్ద. కట్న, కానుకలేమీ వద్దన్నారని మా నాన్న ఇంతకంటే గొప్ప సంబంధం తేలేనని పైగా గవర్న్ మెంట్ జాబ్ చేస్తున్నాడంటూ నన్ను అతన్ని పెళ్లి చేసుకొమ్మని బలనంతం చేస్తున్నారు. నాకా సంబంధం ఇష్టం లేదు శేఖర్.’

 

‘మరి ఆ విషయం చెప్పచ్చుకదా మీ నాన్నగారికి.’

 

‘అంతా అయింది శేఖర్, కానీ మా నాన్న తను తెచ్చిన సంబంధం చేసుకోపోతే చచ్చిపోతానంటున్నాడు. ”

బావురమని ఏడుస్తూ నన్ను చుట్టుకుపోయింది. 

‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను శేఖర్’ అనేసరికి తెల్లబోయాను. 


నేను అనాకారిని. చిన్నప్పుడు నా కుడికాలికి పోలియో సోకింది. ఎంత వైద్యం చేయించినా నా కాలు బాగు అవలేదు. కుంటుతూ నడుస్తాను. 


నేను అదే విషయం చెపితే నీ బాహ్యసౌందర్యం కంటే అంతర సౌందర్యాన్నే ప్రేమిస్తున్నానంటూ నన్ను ఇంకా తన కౌగిలిలో బిగించేస్తూ, ‘చెప్పు శేఖర్, నేనంటే నీకూ ఇష్టమే కదూ, మనం పెళ్లి చేసుకుందాం’ అంటూ మొత్తానికి నా చేత వప్పించింది. మా పేరెంట్స్ కు కూడా ‘ఆస్తి లేకపోతేనేమీ, మంచిమనసున్న అందమైన అమ్మాయి ఇంటికోడలిగా వస్తోం’దని సంబర పడ్డారు. 


మా పెళ్లి జరిగిపోయింది. 

ఒక సంవత్సరం పాటు అందరినీ నమ్మించింది. అదొక గొప్ప నాటకమని తరువాతగానీ నాకు అర్థం కాలేదు. 



హాసిని ని నేను పెళ్లి చేసుకుని మోసపోయాను మనోహర్. అప్పుడు ఆమె బాహ్య సౌందర్యం మాత్రమే చూడగలిగాను గానీ ఆమె అంతఃసౌందర్యం ఏమిటో ఎలా తెలుస్తుంది. హాసిని డబ్బు మనిషి. అహంకారం ఎక్కువ. నన్ను అసలు పట్టించుకోవడం మానేసింది. తన స్నేహితురాళ్లను ఇంటికి తీసుకొచ్చేది. ఆ సమయంలో నేను వాళ్ల సమీపంలో ఉండకూడదు. పొరాటున వెడితే, ఆ తరువాత నన్ను ఒకటే ఛీదరించుకునేది. ‘కాలు ఎగరేసుకుంటూ, కుంటుతూ నడుస్తావు, వాళ్లంతా కుంటి మొగుడంటూ నవ్వుకోరా’ అనేది. నేను నల్లగా, పీలగా ఉంటానుట. 


నన్ను నా కుటుంబం నుండి విడదీసి వేరుకాపురం పెట్టించింది. ఏదైనా అంటే చచ్చిపోతానని బెదిరిస్తుంది. తనమాటే నెగ్గాలి. ఇంట్లో తనదే రాజ్యం. నా బంధువులెవరూ మా ఇంటికి రాకూడదు. ఇదేమని అడిగితే రాధ్దాంతం చేసి ‘నేను కాబట్టి నీలాంటి అనాకారిని చేసుకున్నాను, నా ఖర్మకొద్దీ దొరికా’వంటుంది. 


నా భార్య మూలానే నా ఆరోగ్యం దెబ్బతింది. తను నన్ను మోసం చేసి పెళ్లి చేసుకుంది. నన్ను ప్రేమించానని చెప్పడం అబధ్దం. వాళ్ల నాన్న తనకు పెళ్లి సంబంధం చూసాడని చెప్పడం కూడా అబధ్దమే. మా ఆస్తిపాస్తులను చూసి నన్ను ట్రాప్ చేసింది. హాసిని నిజంగా నన్ను ప్రేమించిందనుకొని గుడ్డిగా నమ్మేసాను. 


ఇప్పుడు చెప్పండి మనోహర్, మీరు అనుకున్నంత అదృష్టవంతుడినా నేను?” నిర్జీవంగా నవ్వుతూ ప్రశ్నించాడు. 


శేఖర్ దీన గాథకు నా కళ్లమ్మట రెండు కన్నీటిబొట్లు రాలిపడ్డాయి. ఓదార్పుగా అతని భుజాన్ని తట్టాను. 


మనిషిలో ఉండే మానవత్వం, మంచితనాల వల్ల వచ్చేదే అసలైన అందమని అప్పుడు అర్ధమైంది. 


***

యశోద పులుగుర్త గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :  

నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.








Comments


bottom of page