top of page
Writer's pictureAchanta Gopala Krishna

అసలైన పండగ..

#AchantaGopalaKrishna, #ఆచంటగోపాలకృష్ణ, #అసలైనపండగ, #AsalainaPandaga, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ


'Asalaina Pandaga' - New Telugu Story Written By Achanta Gopala Krishna

Published In manatelugukathalu.com On 11/10/2024

'అసలైన పండగ' తెలుగు కథ

రచన: ఆచంట గోపాలకృష్ణ


ఫోన్ మొగుతోంది.. 

విజయ్ బైక్ మీద వెడుతూ చూసి పక్కనే ఆగాడు.. 


“ఏమండీ ఫోన్ తీసాడా” అని అడిగింది లక్ష్మీ.. 


“ఉండవే నీ కంగారు బంగారం కాను.. రింగ్ అవుతోంది.. తీయాలి గా” అన్నాడు ప్రసాద్.. 


“మీకు అలాగే ఉంటుంది.. తల్లి మనసు మీకేం తెలుసు” అంది.. 


“అవును మరి, నీ ఒక్కదానికే కొడుకు కదా.. నాకు కాదు మరి.. 

నాకు ఉండదా వాడిని చూడాలని.. కానీ వాడి చదువు కోసం

ఈ దూరం తప్పదు మరి..” అన్నాడు ప్రసాద్.. 


ఇంతలో ఫోన్ తీసాడు.. 


“ఈ సారి అయినా పండగకి వస్తావేమోనని ఫోన్ చేస్తున్నా..” 

అన్నాడు ప్రసాద్.. 


“ఈ ఏడాది తో చదువు అయిపోయింది.. నాన్నా. క్యాంపస్ సెలక్షన్ లో ఉద్యోగం కూడా వచ్చింది.. నేనే మీకు ఫోన్ చేసి చెబుదామని అనుకుంటూ ఉన్నా.. ఇంతలో మీరే చేశారు.. ఇంకా కొన్ని పనులు ఉన్నాయి చూసుకుని వచేస్తా..” అన్నాడు విజయ్.


“మనవాడి కి ఉద్యోగం కూడా వచ్చిందిటే” అన్నాడు ఆనందం గా.. భార్యతో.. 


“చాలా సంతోషం గా ఉంది రా.. ఆ పనులు అవి తొందరగా ముగించుకుని రారా.. చూసి చాలా కాలం అయింది” అన్నాడు ప్రసాద్.. 


మొన్ననే దసరాకు వచ్చాను కదా.. ఈ మధ్యలో పరీక్ష లు..” అన్నాడు విజయ్.. “అమ్మ ఎలా ఉంది” అన్నాడు.. 


“ఇక్కడే ఉంది.. నీతో ఎప్పడు మాట్లాడదామా అని.. మీ అమ్మకి కూడా చెప్పు సంతోషిస్తుంది..” అంటూ

ఫోన్ ఇచ్చాడు లక్ష్మి కి.. 


“వాడు నీకు ఏదో శుభవార్త చెబుతాడుట..” అన్నాడు..

 

ఆనందం గా ఫోన్ తీసుకుని.. “ఏరా ఎలా ఉన్నావ్” అంది గద్గద స్వరం తో.. 


“అదిగో మళ్ళీ కుళాయి విప్పేస్తున్నావ్.. ఇలా అయితే నేను మాట్లాడను” అన్నాడు.. విజయ్.. 


“ఏడవను లేరా.. ఏదో నీ గొంతు వినగానే.. అలా కళ్లలో నీళ్లు వచ్చేస్తాయి.. మాట బొంగురు పోతుంది..” అంది చెంగు తో కళ్ళు తుడుచు కుంటూ.. 


“ఇలా అయితే ఎలా అమ్మా.. నువ్వు అలా ఉంటే నేను ఇక్కడ ఎలా ఉండగలను.. ప్రశాంతం గా ఎలా చదవ గలను.. ఈ సంవత్సరం తో చదువు అయిపోతుంది.. అన్నట్టు ఉద్యోగం కూడా వచ్చిందే” అన్నాడు.. 


“ఎంత మంచి వార్త చెప్పావు రా.. ఇక్కడే ఉంటే నీ నోట్లో పంచదార పొసే దాన్ని..” అంది ఆనందం గా.. 


“ఇంతకీ ఏ ఊరు లో వచ్చింది.. వెంటనే వెళ్లి పోవాలా” అంది దీనం గా.. 


“ఆగాగు.. కంగారు పడకు.. ఉద్యోగం లో సెలెక్ట్ అయ్యాను అంతే.. ఇంకో ఎగ్జాం ఉంది. అది అయ్యాక.. రిజల్ట్స్ వచ్చాక.. 

సర్టిఫికెట్ లు తీసుకుని అప్పుడు.. ఇంకా చాలా టైం ఉంది.. 

ఈ లోగా అక్కడకి వచ్చి కొన్నాళ్ళు ఉంటాలే.. ఆ తరువాత తెలుస్తుంది ఏ ఊరి లో నో అని..” అన్నాడు.. 


“సరే రా అయితే.. ఇదిగో మీ నాన్నకి ఇస్తున్నా మాట్లాడు” అంది.. 


ప్రసాద్ ఫోన్ తీసుకుంటూ.. “కొంచెం కాఫీ ఉంటే ఇవ్వవే..” అన్నాడు.. 


“ఇదిగో తెస్తా” అంటూ వెళ్ళింది..

 

“చెప్పరా అబ్బాయి.. అమ్మ అలాగే అంటూ ఉంటుంది కానీ.. 

అన్ని పనులు తొందరగా ముగించుకుని నాలుగు రోజులు ఉండేలా రారా.. ఎదురు చూస్తూ ఉంటా.. భగవంతునిదయ వలన ఈ ఏడు పంటలుకూడా బాగా పండాయి.. అన్ని పనులు సవ్యంగా జరుగుతున్నాయి..”


‘ఈ సమయంలో వాడు కూడా ఉంటే.. ఎంత బాగుండేది.. ఎలా ఉన్నాడో ఏమో..’ అని స్వగతం గా అనుకుని

“ఇంకా ఏమిటిరా విశేషాలు” అన్నాడు.. ప్రసాద్.. 


“చెప్పు నాన్న, ఏదో అడగాలని సందేహిస్తున్నావ్..” అన్నాడు.. 


“అదేం లేదు రా..” అన్నాడు ప్రసాద్.. తడబడుతూ.. 


“చెప్పు నాన్నా ఏమిటి సంగతి” అన్నాడు.. 


“అదే, వాడు ఎలా ఉన్నాడు..” అన్నాడు.. 


“బాబాయా.. బాగానే ఉన్నారు.. కానీ..”

 

“కానీ ఏంట్రా.. ఏదైనా సమస్యా” అన్నాడు ఆతృతగా.. 


“అదేం లేదు.. పట్నం అంటూ ఇక్కడి కి వచ్చాడు.. 

ఇక్కడి వాతావరణం ఇంకా అలవాటు కాలేదు అనుకుంటా.. 

వ్యాపారం కూడా అంత బాగా సాగట్లేదు అని తెలిసింది.. 

కాలేజ్ లో చెల్లి పేరు నోటీస్ బోర్డ్ లో ఫీజ్ కట్టని వాళ్ళ లిస్ట్ లో ఉందిట. నా మిత్రుడు ఒకడు చూసి నాకు చెప్పాడు..” అన్నాడు.. 


“నువ్వు తెలిసి ఏం చేస్తున్నావ్.. ఆ ఫీజు ఏదో నువ్వేకట్టెయక పోయావా” అన్నాడు.. 


“ఇదిగో.. అసలు ఏమిటో తెలుసుకుందామని వెడుతున్నా.. 

ఇంతలో నీ ఫోను వచ్చింది..”

 

“సరే ముందు వెళ్ళరా.. ఆ తరువాత నాతో మాట్లాడుదువు గాని..” అన్నాడు ఆతృతగా.. 


“ఉంటామరి.. ఏవిషయం నీకు ఫోన్చేసి చెపుతా లే నాన్నా”

అని పెట్టేసాడు. 


కాలేజ్ కి వెళ్ళాడు.. 


అక్కడ, స్టూడెంట్ ని ఆపి “బాబు, ఇక్కడ శైలు అని ఫైనల్ ఇయర్ స్టూడెంట్” అనగానే.. 

“అదిగో శైలు అక్క అక్కడ ఉంది” అన్నాడు.


అక్కడికి వెళ్ళి “నీ కోసమే వచ్చా నే.. మా ఫ్రెండ్ కూడా

ఇదే కాలేజ్ లో ఉన్నాడు కదా.. వాడు ఫోన్ చేసాడు.. నీ పేరు నోటీస్ బోర్డ్ లో ఉందిట.. ఇంకా ఫీజ్ కట్టలేదని.. ఏమైంది అసలు.. ఎందుకు అలా.. ఉన్నావ్” అన్నాడు ఆప్యాయంగా.. 

“అదేంలేదు అన్నా.. కొంచెం నాన్నకి రావాల్సిన డబ్బు ఆలస్యం అయింది.. అందుకే” అంది.. 


“నాదగ్గరే దాస్తున్నవా.. నీ అన్నయ్య నే నేను.. పద ముందు ఫీజు కట్టేద్దాం తరువాత మాట్లాడుకుందాం”  అన్నాడు విజయ్.. 


“వద్దు వద్దు.. మళ్ళీ నాన్నకి తెలిస్తే బాధపడతాడు.. ఆయనే సర్దుబాటు చేస్తారులే” అంది.. 


“అంత పరాయి వాళ్ళం అయిపోయామే.. ఒక్కటి ఇచ్చాను అనుకో.. అపుడు తెలుస్తుంది ఈ అన్నఅంటే ఏమిటో..” అన్నాడు.. 


“నోరు మూసుకుని ముందు నడు. బాబాయ్ తో నేను చెబుతాలే..” అంటూ వెళ్లి ఫీజ్ కట్టేసాడు.. విజయ్.. 


“ఇప్పడు ఇంటికే గా, పద నేను దిగబెడతా.. పిన్నిని బాబాయ్ ని చూసి చాలా కాలం అయింది..” అన్నాడు.. విజయ్.


ఇద్దరు ఇంటికి వెళ్లారు.. 


“రా అన్న” అంటూ ఇంటి లోపలికి అని తీసుకుని వెళ్ళింది.. 

పిన్ని హల్ లోనే ఉంది.. 


విజయ్ ని చూసి “రా బాబు ఏలా ఉన్నారు.. అక్క, బావ గారు కులసాయేనా” అని పలకరించింది.. 

“బాగానే ఉన్నారు పిన్ని.. మీరు ఎలా ఉన్నారు” అన్నాడు విజయ్.


“ఏదో ఇలా..” అంటూ.. “స్వాతీ! అన్నయ్యకి కాఫీ పట్టుకుని రా” అంది.. 


అలాగే అంటూ లోపలికి వెళ్ళింది స్వాతి.. 


“నీ చదువు ఎలా ఉంది..” అని అడిగింది.. 


“ఈ ఏడాదితో అయిపోతుంది పిన్ని.. క్యాంపస్ లో జాబ్ వచ్చింది.. ఊరు వెడదాం అనుకుంటున్నా..” అన్నాడు.. 


“మా ఫ్రెండ్ ద్వారా తెలిసింది.. ఫీజు విషయం.. నేను కట్టేసాను..” అన్నాడు.


“అయ్యో నీకెందుకుబాబు శ్రమ” అంది.. 


“అదేమిటి పిన్ని.. ఇంతలోనే పరాయి వాళ్ళం అయిపోయామా.. చిన్నప్పుడు నీచేతి గోరు ముద్దలు తిని

పెరిగిన వాడిని.. నాకేమి కావాలన్నా మా అమ్మ కన్నా ముందే నువ్వు వండి పెట్టేదానివి.. ఆ ప్రేమ ఏమైంది.. 


నాన్న, బాబాయ్ అన్న దమ్ములు.. ఏదో మాట మాట అనుకున్నా, మళ్ళీ కలిసిపోతారు ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు.. అది భగవంతుడు ఇచ్చిన బంధం.. 

నాన్న ఫోన్ చేసినప్పుడల్లా అడిగే ప్రశ్న ఒకటే, వాడేలా ఉన్నాడు అని.. 


వాడికి ఇంకా కోపం తగ్గక పోతే దూరం నుంచి చూసి వచ్చేయి అంటారు.. అది బాబాయ్ అంటే నాన్నకి ఉండే ప్రేమ..” అన్నాడు విజయ్.. 


“అయ్యో కోపమా.. రోజుకి ఒకసారి అయిన ఆయన బావ గారిని తలవకుండా ఉండరు.. 


‘ఆ దుర్మార్గుడి మాటలు నమ్మి అన్నయ్యని వదిలేసి వచ్చా.. 

చాలా పెద్ద తప్పు చేశా’ అని మధనపడుతూ ఉంటారు.. 


ఏదో వ్యాపారం అన్నాడు.. బాబాయ్.. అదేమిటి ఉద్యోగం చేస్తున్నాడు అంటోంది.. 


“ఈ విషయం నాకు కూడా తెలియదు..” అన్నాడు విజయ్.. 


“ఆ ఫ్రెండ్ ని బాగా నమ్మి అన్ని అతనిమీద వదిలేశారు.. 

వాడు కాస్త మోసంచేసి వెళ్ళిపోయాడు.. ఈయనకి అనుభవం లేదు.. నష్టాలు, అప్పులు.. ఏదో లా అప్పుల బాధ నుంచి బైట పడ్డాం.. కానీ రోజు గడవాలిగా అందుకే ఉద్యోగంలో చేరారు.. నాన్న మీకు చెప్పొద్దు అన్నారు.. 


అన్నయ్య బాధపడతాడు.. ఇప్పటికే బైటకి వచ్చి ఆయన మనసు కష్టపెట్టాను.. ఇప్పడు ఇలా ఉన్నానని తెలిస్తే ఇంకా బాధ పడతారు అన్నాడు” అంది.. స్వాతి.


“బుద్ధిలేదు నీకు.. నాన్న వద్దంటే చెప్పవా.. ఇలాంటి విషయం.. ఇంత జరుగుతుంటే అలా ఏలా వున్నావ్.. స్వాతి.. అయిన ఇపుడు మించి పోయింది ఏమీలేదు.. నాతో వచ్చేసేయండి.. మన ఊరు కి పోదాం.. నాన్న మీ గురించి బెంగ పెట్టుకున్నాడు..” అన్నాడు విజయ్.


“మీ బాబాయ్ వచ్చే టైం అయింది.. ఆయనతో మాట్లాడు.. ఆయన వప్పుకుంటే.. నాదేముంది..” అంది.. 


పిన్ని తులసి ముఖం లో కాస్త ఊరట కనిపించింది.. నవ్వు ముఖం వేసింది.. 


“అమ్మ ముఖం లో నవ్వు చూసి ఎంతకాలం అయిందో.. అన్నయ్య.. నీ మూలం గా మళ్ళీ ఇన్నాళ్ళకి అది కనిపించింది” అంది అమ్మ మెడచుట్టూ చేతులువేసి.. 

ఆనందంగా.. 


“మన పెద్దవాళ్ళు ఎప్పుడూ ఇలా సంతోషంగా ఉండేలా చేసుకొనే బాధ్యత మన ఇద్దరిదీ.. అర్థం అయిందా..”

 

కొంత సేపటికి రాజు వచ్చాడు.. 

“హాయ్ బాబాయ్ ఎలా ఉన్నావ్” అంటూ పలకరించాడు విజయ్.. 


రాజు ఒక పేవలమైన నవ్వు నవ్వి.. “ఎరా ఎంత సేపు అయింది వచ్చి.. ఊరిలో అందరు ఎలా ఉన్నారు.. అన్నయ్య, వదిన..” అంటూ ఆగిపోయాడు.. 


“బాగానే ఉన్నారు.. కానీ మీరు లేక సంతోషంగా అయితే మాత్రం లేరు.. నాన్న ఎప్పడూ మిమ్మల్ని తలుచుకుంటూ ఉంటాడు..” అన్నాడు విజయ్.


ఇంతలో నాన్న దగ్గరనుంచి ఫోన్ వచ్చింది.. 

“చాలా జరిగింది నాన్నా.. ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారు.. అందుకే ఫీజు కట్టలేదు.. నేను కట్టేసా నాన్నా..” అన్నాడు.


“మంచి పని చేశావ్.. అసలు ఏం జరిగింది..” అన్నాడు. 

జరిగింది చెప్పాడు విజయ్.


“ఇన్ని కష్టాలు పడుతూ వాడు అక్కడ ఉంటే ఇక్కడ నేను సుఖం గా ఎలా ఉండగలను.. వచ్చేయమనరా.. ఇక్కడే ఉంటాడు.. హాయిగా వ్యవసాయం చేసుకుంటూ..” అన్నాడు.. 


“మరి మీకోపం?” అన్నాడు విజయ్.. 


“వాడిమీద నాకు కోపంఏమిటి, అర్థంచేసుకోకుండా మూర్ఖంగా వాడేవడో మాట నమ్మి వెళ్ళిపోయాడు కదా అందుకే కాస్త కోపం వచ్చినది, అంతే కాని వాడు అంటే ద్వేషంలేదు.. తోడ పుట్టినవాడు.. పుట్టుక తోవచ్చిన బంధం అంత తొందరగా ఎలా తెగిపోతుంది.. ఈ కోపాలు, తాపాలు బంధాన్ని తెంపలేవు.. అన్నీ తాత్కాలికంగానే ఉంటాయి..” అన్నాడు ప్రసాద్. 


“నేనే స్వయంగా రమ్మన్నానని చెప్పు.. ఇక్కడికి వచ్చాక అన్నీ మాట్లాడదాము” అన్నాడు.. 


“సరే నాన్న, నేను చూసుకుంటా.. నువ్వు పెట్టేయ్..” అని లైన్ కట్ చేసి.. (ఇది అంతా స్పీకర్ లో వినిపించాడు.. )

“విన్నావా బాబాయ్.. నాన్న మిమ్మలిని యెంత ప్రేమిస్తున్నారో..” అని

“నిజానికి నువ్వు వచ్చేసిన దగ్గర నుండి ఆయన సంతోషం గా లేరు.. ఏపని చెప్పినా మొదట నీ పేరు పిలుస్తారు.. తరువాత గుర్తుకు వచ్చి.. వేరే వాళ్ళకి పురమాయిస్తారు..” అన్నాడు విజయ్.. 


“ఇక్కడ సుఖాలు ఉంటాయి అనుకుంటారు.. ఒక్క సారి వస్తే గాని తెలియదు ఈ పట్టణ జీవితాల లోతు..” అన్నాడు.. విజయ్.


“నిజమే రా నువ్వు చెప్పేది.. ఇక్కడ అంతా మాయ రా.. 

ఎవరి స్వార్ధం వారిది.. పరుగుల జీవితం.. హాయిగా నవ్వుకుని ఎంత కాలం అయిందో.. ఆ కల్మషం లేని మనసులు.. 

పలకరింపులు.. ఇక్కడ దొరకవు..” అన్నాడు రాజు.. 


“ఎన్నోసార్లు అనుకున్నా.. అన్నయ్య దగ్గరకి వచ్చేద్దామని.. 

నేనే అన్ని మాటలు అని వచ్చేసా.. మళ్ళీ అన్నయ్యని పలకరించడానికి ధైర్యం రాలేదు..” అన్నాడు.. 


“నాన్నకి మీమీద కోపమా.. అసలు ఆ ఆలోచనే వదిలేయ్ బాబాయ్.. ఆయన సంగతి తెలుసు కదా.. ఇంకేం ఆలోచించకండి.. మిమ్మలిని వెంట పెట్టుకుని రమ్మని మరీ మరీ చెప్పారు.. కలిసి ఉంటే కలదు సుఖం అంటారు.. 


రేపే మన ఊరు వెడుతున్నాము.. పండగ బాగా ఎంజాయ్ చేద్దాం.. తరువాత.. ఇక్కడ ఖాళీ చేసేసి మన ఇంటికి వచేస్తున్నారు.. అంతే, ఇంకేమి అడ్డు చెప్పకండి.. 

వచ్చేయండి బాబాయ్..” అన్నాడు.. 


తన భార్య వైపు చూసాడు.. 


“ఇప్పటికే మనం చాలా తప్పు చేసాం. కనీసం మిగతా జీవితం వాళ్ళ చల్లని నీడలో గడిపేద్దాం” అంది.


శైలు వైపు చూసాడు.. తాను కూడా వెళ్లిపోదాం అని తల ఊపింది.. 


“సరే మీఇష్టం.. ముందు అన్నయ్య ని క్షమాపణ అడగాలి.. అందుకోసమైనా వస్తాను రా..” అన్నాడు.


మరునాడు ఊరు వెళ్ళారు అంతా.. 

రాజు అన్నయ్య కాళ్ళ కి నమస్కారం చెసి, “నన్ను క్షమించండి అన్నయ్యా, మీ మాట వినకుండా వెళ్ళాను.. ఇంత జరిగింది..” అన్నాడు.. 


“ఇందులో నీ తప్పేమీ లేదు.. వాడు నిన్ను ప్రలోభ పెట్టాడు.. పైగా అనుభవం లేని వ్యాపారం. విజయం ఎలా వస్తుంది.. జరిగింది ఏదో జరిగిపోయింది.. అందరం హాయిగా కలిసే ఉందాం.. ఈ పండగ నిజంగానే మనకి అసలైన పండగ మళ్ళీ మనందరం కలిసి మెలిసి జీవనం సాగిద్దాం.. 

అసలు అందరూ కలిసి మెలసి చేసుకుని, ఉండేదే పండగ.. మీరు రెస్ట్ తీసుకోండి” అన్నారు.. 


నేను ఇపుడే వస్తా ఆని.. వెనక్కి తిరిగి వెడుతూ.. ఏదో పని గుర్తుకు వచ్చి.. అలవాటు ప్రకారం “ఒరేయ్ రాజు” అంటూ అటు తిరిగాడు.. 


“ఆ అన్నయ్యా” అనేశాడు అలవాటుగా.. 


అందరూ నవ్వేశారు ఒక్కసారి అలా పలికే సరికి.. 


“ఎన్నాళ్ళు అయింది రా ఈ మాట విని” అంటూ ఆనందంగా, కౌగిలించు కున్నాడు.. ప్రసాద్.


“ఇవాళ మనం మన దగ్గర పనిచేసే వారికి కూడా బట్టలు పెట్టాలి.. ఆ సంగతి నువ్వు చూడు..” అంటూ ఆనందం గా చెప్పాడు ప్రసాద్.. 


“అలాగే అన్నయ్యా ఇపుడే వెడతాను” అన్నాడు రాజు.. హుషారుగా.


“ఒంటరి గా ఉంటే ‘సుఖం’ ఉంటుంది ఏమో కానీ అందరి తో ఉంటే ‘సంతోషం’ ఉంటుంది

అని నాన్న నమ్ముతారు బాబాయ్..” అన్నాడు విజయ్.. 

“పదండి నేను వస్తా మీతో.. మోటార్ సైకిల్ మీద పోదాం..” అన్నాడు విజయ్.


“అవును రా ఇకపై మనం కూడా ఆ సిద్ధాంతాన్ని పాటిద్దాం.. సంతోషంగా జీవనం సాగిద్దాం.. బండి తీయరా విజయ్” అన్నాడు హుషారుగా.. రాజు.


 సమాప్తం  


ఆచంట గోపాలకృష్ణ  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు ఆచంట గోపాలకృష్ణ

రచనలు..కథలు ,సిరీస్ ,కవితలు సమీక్షలు రాయడం ఇష్టం..

15 సంవత్సరాలు గా రచనలు చేస్తున్నా..

నాకు flyincoloursachantagopalakrishna.blogspot.com అనే బ్లాగ్ ఉంది..


ఇంకా pratilipi ane magazine lo సిరీస్ రాస్తున్నా..

40 views0 comments

Commentaires


bottom of page