top of page
Writer's picturePandranki Subramani

ఆశలతో మోసులెత్తకు

#PandrankiSubramani, #పాండ్రంకిసుబ్రమణి, #ఆశలతోమోసులెత్తకు, #AsalathoMosuletthaku



'Asalatho Mosuletthaku' - New Telugu Story Written By Pandranki Subramani

Published In manatelugukathalu.com On 16/10/2024

'ఆశలతో మోసులెత్తకు' తెలుగు కథ

రచన: పాండ్రంకి సుబ్రమణి

(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



ఒక సామాజిక వర్గానికి గాని, కర్మాగార కార్మికుల మధ్యగాని- ఆఫీసు సిబ్బంది నడుమ గాని- అనుకునో అనుకోకుండానో అగ్రాసనం అందుకునే ఒక అగ్రజుడుంటాడు. అగ్రజ పౌరుడుంటాడు. ముత్యాల పాలెం మెరక వీధిలో ఉన్న ఎక్స్రాగాళ్ళు ఒప్పుకు న్నా లేకపోయినా నా ఎరుకలో అక్కడ చుట్టుప్రక్కల నేనే అగ్రజుణ్ణి- వయసులో అనుభవంలో- ఇంకా చాలావాటిలోనే అగ్రాసుణ్ణి. 


ఆ మాటకు వస్తే ఎంత మంది మాఊళ్ళో పటాలంలో చేరి సరాసరి యుధ్ధభూమిని ముద్దాడి రక్తాన్ని కళ్ల చూసి బట్టకట్టి బైటపడిన వారున్నారని-- అందుకే అంటాను- నేను పెద్దరికాన్ని సముపార్జించుకున్న అగ్రజుణ్ణని. ఆ వరసన చూస్తే మావీధిలోనే కాకుండా చుట్టుప్రక్కల ఎక్కడేమి శుభకార్యం జరుగుతున్నా మొదటి కబురు నాకే— ఆ విషయంలో నేను మాత్రం తక్కువ తిన్నానా- వెళ్ళే ప్రతి చోటుకీ వెలసిన పటాలం యూని ఫారమ్ లోనే వెళ్లి కనిపించి వస్తుంటాను. అదో తృప్తి-- 


ఇక అసలు విషయానికి వస్తాను. కర్రి గిరిరాజు మేముంటూన్న ఇంటికి ఎదురింట్లో వయసు మీరిన వాళ్ళ అమ్మానాన్న లతో గుట్టుగా బుధ్ధిగా ఒదిగి ఉంటున్నాడు. అతడంటే నాకిష్టం. అతడికంటే అతడు వాయించే మృదంగ వాద్యమంటి మరింత ఇష్టం. అప్పుడప్పుడు ఉదయాన సాధన చేస్తూ సంప్రయాద సిధ్దమైన రీతిన అతడు దూకుడుగా వాయించే మృదంగ విన్యాసాన్ని మనసుతో ఆస్వాదించి తరించవలసిందే- విని తన్మయత్వంతో వెండి మబ్బుల్లో తేలవలసిందే- 


కైలాసంలోఇప్పుడే మూలన కూ ర్చున్నారో గాని- అప్పటి మృదంగ విద్వానులు పాల్ఘాట్ మణిశంకర్ అయ్యర్- తంజావూరు ఉపేంద్ర ఇక్కడకొకసారి తొంగి చూస్తే తెలుస్తుంది వాళ్ళకు ధీటుగా‘సొగసుగా మృదంగాన్ని వాయించే “వీరుడొకడు” ఇక్కడే- మా ముత్యాలపాలెం మెరక వీధిలోనే ఉ న్నాడని-- మా ఊరి ఆంజనేయ స్వామి ఆలయ ఉత్సవాలలో కర్రి గిరిరాజు మృదంగ వాద్యం తరవాతనే మిగతావారి భజనలూ - హనుమాన్ భక్తి కీర్తనులూను. ఎప్పుడో విన్నట్టు గుర్తు మృదంగ విన్యాసానికి ఎసరు తానుగా ఉడికిపోతుందిని. నిజమేనేమో!


అటువంటి వర్థమాన మృదంగ కళాకారుడి మృదంగ విన్యాసం చాలా రోజులుగా వినిపించడం లేదు. అలా మృదంగ నాదం వినిపించకపోవడం ఒకటీ రెండురోజుల పాటు కాదు. ఏకంగా ఐదురోజులు అతడి మృదంగ విన్యాసం నాకు దూరమైంది. మృదంగ గాన విన్యాసానికి అలవాటు పడ్డ నా చెవులు తట్టుకోలేక పోయాయి. అమ్మానాన్నలు వయసు ముదిరిన వాళ్లు కాబ ట్టి వైద్య ఖర్చులు మితిమీరి డబ్బు కష్టాలలో పడ్డాడేమో! లేక ఉద్యోగ నెలవున ఏవైనా ఇక్కట్లు ఎదుర్కుంకుటున్నాడేమో! 


ఎందుకు వచ్చిన ఆరాటాలు, వాళ్ళ ఇల్లు కూతవేటు దూరానే కదా-- సరాసరి వెళ్లి అడిగితే పోలా! ఏది ఏమైనా ఒక కళాకా రుడు అలా ఉన్నపాటున నిశీధి నిశ్శబ్దంలోకి జారుకోవడం నావంటి సంగీతాభిమాని మాత్రమే కాదు- ఉదయకాల మృదంగ విన్యాసానికి అలవాటు పడ్డ ప్రకృతి సహితం భరించ లేదు. కాదా మరి-- 


తిన్నగా ఇంటికి వెళ్లాను. నన్ను చూసి పటాలం పోతురాజునని గ్రహించి తడబాటుకి లోనవుతూ లేచి వచ్చారు వృధ్ధ దంపుతులిద్దరూ. తడబడుతూనే లోపలకు సాదరంగా ఆహ్వానించారు. నేను స్టూలుపైన కూర్చున్నవెంటనే పెద్దావిడ లోటాలో మజ్జిగ నింపుకుని రెండు వడియాలూ అందిచ్చింది. కృతజ్ఞతా పూర్వకంగా తీసుకుని అడిగాను- “ఏంవిటి మాఁవా!ఈ మధ్య మృదంగం వినిపిం చడం లేదు. అదలా ఉంచు-- మృదంగ విద్వానే కనిపించడం లేదు. ఒంట్లో సుస్తీగాని చేసిందా?” 


నేను చెప్పింది వినిపించిందో లేదో మరి- వృధ్ధ దంపతులిద్దరూ మౌనంలోకి వెళ్లిపోయారు. మళ్లీ రెట్టించి అడిగాను గిరిరాజు గురించి. 


అప్పుడు పెద్దావిడ దు:పూరిత స్వరంతో అంది- “ఎక్కడేమి జరిగిందో మరి- ఈ మధ్య మనిషి మనిషిలా లేడయ్యా!మృదంగం మాట అటుంచి భోజనం చేయడమే బాగా తగ్గించేసేడయ్యా! పనిచేసే చోట గాని ఏమైనా జరిగిందా అంటే నోరువిప్పడు. ప్రతి రోజూ గడ్డం నున్నగా గీసుకుంటాడా- ఈమధ్య గుబురుగా పెంచే సాడయ్యా! పెళ్లికాని వాడు కదా- గాలి గాని సోకిందేమోనని ఆంజనేయుడి కి ముడుపు కూడా చెల్లిం చి వచ్చామయ్యా-- ” 


ఉదంతం విని నేను ఉలిక్కిపడ్డాను. కాసేపు అలానే ఉండిపోయాను కాళ్లూ చేతులూ కూడదీసుకుంటూ-- వ్యధా పూరితంగా వినిపించిన గిరిరాజు తల్లి గొంతు నా గుండె కవాటాలను తాకింది. 


“కార్యాలయం నుండి ఎప్పుడు వస్తాడు? అప్పుడు మరొక సారి మా ఆవిడతో కలసి వస్తాను. ఆమె కూడా నాలాగే మృదంగ విన్యాసమంటే చెవులు కోసుకుంటుంది. విద్వాన్ విశ్వనాథం ప్రియ శిష్యురాలు కదూ-- ” అని లేవడానికి సంసిధ్ధడునవుతూ నిదానంగా అన్నాను. 


ఈసారి పెద్దాయన బదులిచ్చాడు- “మీకు తెలీదేమో- వారం రోజులుగా వాడు కార్యాలయానికి వెళ్ళడం లేదు” 


ఈమాటవిని దిగ్గున తలేత్తి చూసాను. అంటే విషయం గంభీరమైనదే! కాసేపు తరవాత ఆశ్చర్యం నుండి తేరుకుంటూ అడిగాను- “ఇప్పుడు మీ ఇంటి మృదంగ విద్వాన్ ఎక్కడుంటాడు? అతగాడి నేస్తాలతో తిరుగుతుంటాడా?” 


 “లేదు నాయనా! ఈ మధ్య ఎందుకో మరి ఒంటరిగానే ఉంటున్నాడు. ఒంటరిగానే ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి గుడిలోని మృదంగాన్ని అలుపుదీరా వాయించి వస్తున్నాడు. లేదా నిమ్మతోటలోకో, కొబ్బరి తోపులోకో వెళ్లి గంటల తరబడి గడ్డం క్రింద చేతులుంచుకుని నిశ్శబ్దంగా కూర్చుంటాడు. గుండెలూ తరుక్కుపోతున్నాయింటే నమ్ము నాయనా!” 


నేనిక మాట్లాడలేదు. నిజానికి నా నోట మాట రాలేదు. చకచకా ఊరి శివార్ల వేపు నడిచాను. నలువైపులా వెతికాను. 


అదిగో- చెరువు కట్టమైన చెట్టు చప్టాపైన సన్యాసం పుచ్చుకున్న మౌనమునిలా కూర్చున్నాడు గిరిరాజు. అతడి వాలకం చూసి మనసు చివుక్కుమంది. రేపు తెలుగు నాట గొప్ప మృదంగా కళాకారుడిగా పెంపొందవలసిన గిరిరాజు అలా దీనంగా ని స్సహాయంగా కూర్చోవడం కళా హృదయం గల ఏ వ్యక్తిమాత్రం తట్టుకోగలడు గనుక- నేను వెనుక పాటున వెళ్లి అతడి భుజం పైన చేయివేసాను. మనిషి అలికిడి అక్కడ వినిపిస్తుందని ఊహించలేదేమో మరి- గిరిరాజు ఉలిక్కిపడ్డట్టయాడు. మర్యాద పూర్వ కంగా లేచి నిల్చున్నాడు. 


అప్పుడు నా వరసన సంభాషణ ఉపక్రమించాను- “వడగండ్ల కష్టాలు మనిషికి కాక— మ్రానుకా వస్తా యి?ఒక వేళ నిప్పురవ్వల్లాంటి బాధలు ముప్పిరిగొన్నా నువ్వు తట్టుకోలేక డీలా పడిపోయినా మేమెందుకున్నామని? మేం చూస్తూ ఊరుకుంటామా! ఆ మాటకు వస్తే మొన్న మీ సిబ్బంది అందరూ కలసి చేసిన వర్క్ టు రూల్ ఉద్యమం వల్ల కొత్త ప్రభు త్వానికి చిరాకు వచ్చి నీపైన మాత్రమేనా యాక్షన్ తీసుకుంటున్నారు? అందరి పైనా క్రమశిక్షణా చర్యను ప్రయోగించనారం భించారు. ముగ్గురినేమో దూర ప్రాంతాలైన శ్రీకాకుళం వేపు తరలించారు. ఇద్దరినేమో సస్పెండు చేసి మేజర్ పెనాల్టీ విధించడానికి డిపార్టుమెంటల్ ఇంక్వయిరీ ఆరంభించారు. 


అంతమంది పైన అన్నన్ని ప్రతికూల చర్యలు తీసుకున్న మీ డిపార్టమెంట్ నిన్ను మాత్రం ఎలా విడిచి పెట్టేస్దుంది? లా- ఆఫ్- ఈక్వాలిటీ అన్నది ఒకటున్నది కదా! అంతేకాదు— డిపార్డు మెంటుకి వ్యతిరేకంగా వర్క్ టు రూల్ ఆరంభించకముందే మీకందరకూ తెలుసు కదా— దాని పర్యవసానం ఎలాగుంటుందో-- ” 


అంతావిన్న గిరిరాజు మౌనంగా చూస్తూ ముఖం అటు తిప్పుకున్నాడు. ఆ తరవాత నిదానంగా నా వేపు తిరిగి సూటిగా చూస్తూ గాలి వీచికలా అతి మెల్లగా అన్నాడు- “ఎందు చేతనో మరి- నాపైన డిపార్టుమెంటు ఎటువంటి యాక్షనూ తీసుకోలేదు అంకుల్“


ఆ మాట విన్నంతనే అవాక్యయాను. గొంతు హెచ్చించాను- “మరెందుకీ దిగులు- కొత్త పెళ్లాం దారితప్పి పోయినట్టు— నీ వాలకం చూసి మీ అమ్మానాన్నా ఎంతటి గుబులు పెంచుకున్నారో తెలుసా! వయసు మళ్ళిన తల్లి దండ్రుల పట్ల నడచుకోవల సిన పధ్ధతి ఇదేనా!” 


నేనుపయోగించిన ఆ పదప్రయోగంతో గిరిరాజు కళ్లు ఎర్రబడ్డాయి. బొటబొట కన్నీరు కార్చనారం భించాడు. నేనప్పుడతణ్ణి గుండెలకు హత్తుకున్నాను “నన్ను నీ స్వంత మేనమామగానే భావించు. నేను మాటిస్తున్నాను- నీ కష్టా న్ని పంచుకుంటాను” 


నా అనునయ పూర్వకమైన మాట విన్నంతనే గిరిరాజు కళ్లు తుడుచుకుంటూ అన్నాడు- “నేనిప్పుడు మీకొక సీరియస్ విషయం చెప్పబోతున్నాను. మీకు మాత్రమే చెప్పబోతున్నాను. మీరెవ్వరికీ చెప్పనని మాటివ్వాలి. ప్రామిస్?” 


నేను మరు పలుకులేండా అతడి చాచిన కుడి చేతిలో నా చేతినుంచాను ఎవరికీ చెప్పనని అభయమిస్తూ-- “ గిరిరాజు చెప్పనారంభించాడు- “గత మూడురోజులుగా మరెక్కడికీ వెళ్ళడం లేదు. ఈ చెరువు కట్టపైకే వస్తున్నాను ఈ తాడు పట్టుకుని- ఎందుకో తెలుసా?” 


తెలియదన్నట్టు తల అడ్డంగా ఆడించాను.


“ప్రాణ త్యాగం చేసుకోవడానికి—”


తుళ్ళిపడ్డాను. 

చెవులు రెండూ గింగురుమన్నాయి. కళ్ళు బైర్లు కమ్మినట్లయింది.


“ఆత్మహత్యా! అంత పెద్ద కష్టమూ నీకెలా వచ్చిందోయ్! అక్కడ నిన్ను నమ్ముకున్న ఇద్దరు వృధ్ధ తల్లిదండ్రులుండగా- బంగారం లాంటి ప్రభుత్వ ఉద్యోగముండగా ఈ మతిలేని ఆలోచన్లెందుకూ? నీకు పిచ్చి గాని పట్టలేదు కదా! మరంతటి దైనందిన కళారాధన చేస్తున్నది ఇందుకేనా-- ” 


“నేను చాలా పెద్ద గట్టి దెబ్బ తిన్నాను ఆంకుల్! జీవితంలో కనీ వినీ ఎరుగని దెబ్బ తిన్నాను- అదీను అకారణంగా-- గుండె పగిలి ఇక్కడికిక్కడే ప్రాణాలు వదలాలని పిస్తూంది ఆంకుల్—”


నేను నిదానంగా గిరిరాజు జుత్తులోకి చేతులు పోనిచ్చి అడిగాను- 

“నువ్విష్టపడ్డ అమ్మాయెవరైనా నీ చేరువను తిరస్కరించిందా?” 


“తిరస్కరించడం కాదు అంకుల్— ఇంకా చెప్పాలంటే— నాకు ద్రోహం చేసింది. గుండె కోత కోసింది” 


“భలేవాడివోయ్! నిన్ను వద్దంటే ద్రోహం చేసినట్లా? స్వేఛ్ఛ అనేది ఒన్ వే ట్రాఫిక్కా! నిన్ను వద్దనే స్వేఛ్ఛ ఆమెకు లేదంటావా?” 


“మీరు నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం లేదు. ఆమె చేసినది మాములు ద్రోహం కాదు. దారుణం. మీరు గాని నా చోట ఉంటే ఈ పాటికి మీ డబుల్ బ్యారెల్ గన్నుతో కాల్చి పడేద్దురు” 

నివ్వెరపోయి చూసాను. నేను అభిమానించే మృదంగ విద్వానుది తీవ్రమైన ఆత్మక్షోభలాగే ఉంది. ఆలోచనలనుండి తేరుకుంటూ గిరిరాజు ప్రక్కన చోటు చేసుకుని కూర్చుంటూ అన్నాను సాధ్యమైనంత మృదు కంఠస్వరంతో- “సరే-  ఒప్పుకుంటాను— నీ దు:ఖానికి బలమైన కారణమే ఉందని- తడబడకుండా నన్ను అయోమయానికి లోను చేయకుండా సావధానంగా చెప్పు నీ ప్రేమ కథ” 


గిరిరాజు చెప్పసాగాడు- “నాది సాధారణమైన భగ్న ప్రేమ కాదు అంకుల్. తలచుకుంటేనే గుండె తరుక్కుపోతుంది. ఒక నెలా రెండు నెల్లూ కాదు. రెండు సంవత్సరాలు కలసి తిరిగాం. మనూరి ప్రక్కనున్న కొండవాగు జాతరలు- మావూళ్లమ్మ జాతరలు- రంగుల రాట్నాలు- చీరెల ఎగ్జిబిషన్లూ- ఎన్నెన్ని తిరిగామని కలసి చెట్టాపట్టాలేసుకుని-- చివరకు తల కొట్టేసినంత పని చేసిందది. 

అంతకంటే బాధకరమైన విషయం ఏమంటే- మానేస్తాలకు నాకు క్లోజ్ గా ఉండే ఆఫీసు సిబ్బంది అందరికీ చెప్పేసాను నేను ఆమెనే పెండ్లి చేసుకోబోతున్నానని. చివరకు నా నెత్తిన నిప్పులు పోస్తూ మరొకడితో జత కట్టేసి నాతో తిరిగినట్లే వాడితో నూ కలసి ఊళ్ళన్నీ తిరుగుతూంది. అది చేసిన ఘనకార్యం వల్ల నేనెక్కడా తలెత్తుకు తిరగలేక పోతున్నాను. చివరకు మరణమే శరణ్యమని తేల్చుకున్నాను” 


”ఇక నా తరపున నేను కూడా కొంత చెప్పేదా— చెప్పేముందు నాదొక డౌట్ క్లియర్ చేయాలి” 


ఏమిటన్నట్టు కళ్ళెత్తి చూసాడు గిరిరాజు-- 


“చెరువులో మునగాలనుకున్నవాడివి- మరి నీ చేతిలో ఈ త్రాడెందుకు?” 


“ఇక మోసపూరిత ప్రపంచంనుండి నిరంతరంగా వెళ్లిపోవడానికి బండరాయిని నడుముకి చుట్టుకుని చెరువులో దుమకటానికి” 


“సరే- నీ మెంటల్ ఎగొనీ అర్థం అయింది. ఇక నేను చెప్పేది అడ్డు చెప్పకుండా ఆవేశానికి లోనుకాకుండా విను. నువ్విప్పుడు దు:ఖంలో ఉన్నావు. తీవ్రమైన దు:ఖంలో ఉన్నావు. ఐతే, షాకింగ్ ఇచ్చే ఇటువంటి దు:ఖం నీకే కాదు. చాలామందికి ఎదురవు తుంటుంది. నాకెదురైంది పలుసార్లు. భారత సరిహద్దుల్లో తీవ్రవాదులతో తలపడేటప్పుడు నాతో కలసి పహరా కాసి నాతో కలసి భోజ నం చేసి ఒకే శిబిరంలో నిద్రపోయే తోటి సైనికులు నాకళ్ల ముందు శత్రువుల తూటాలకు కూలిపోతున్నప్పుడు నాకెంతటి దు:ఖం కలిగేదో మాటలతో చెప్పలేను. కాని వెనువెంటనే నేను తేరుకునేవాణ్ణి.


ఎందుకంటే- ఈ దు:ఖ సాగరంలో నేను పడి కొట్టు కుపోతే నేను కర్తవ్యాన్ని విస్మరించిన వాణ్ణవుతాను. మానిసికంగా నిర్జీవుణ్ణవుతాను. అది క్షమించరాని నేరం. దేశానికి ద్రోహం. 

ఇక నీ విషయానికి వస్తాను. ఆశించావు. అది అందని మ్రానై అందకుండా పోయింది. ప్రేమకున్న మృదుత్వాన్ని గౌర విస్తూనే ఒక మాట చెప్తాను. ద్రోహం జరిగింది. అవమానం ఎదురైంది. ఈ రెండూ చేరి దు:ఖ తరంగంలా నీలో చెలరేగింది. దీనికి వి రుగుడుగా నువ్వీ తీవ్రమైన నిర్ణయానికి వచ్చావు, కాని నన్నడిగితే- నీకు అసలు దు:ఖమంటే యేమిటో తెలియదంటాను. 


నీ ఆలోచనా శక్తికి నీకు నీవుగా పొర కప్పుకున్నావంటాను. నీవనుకున్నదొకటి జరగలేదు. ఆశించినది అందలేదు. దానిని నువ్వు తీవ్రమైన దు:ఖంగా భావిస్తూ సతమతమయిపోతున్నావు. ఇప్పుడిది విను. హిమాచల్ ప్రదేశ్ లో నాకు వరసకు మేనత్త ఒకావిడ ఉంది. అక్కడి యూనివర్సిటీ ప్రొఫెసర్. ఇద్దరే ఇద్దరు కొడుకులు. ఒకసారి ఏమైందంటే— చిన్న కొడుకు విహారయాత్రకని బయల్దేరి సరా సరి హిమాలయ కొండుల్లోకి చొరబడి తప్పిపోయాడు. మళ్లీ ఇప్పటి వరకూ కనిపించలేదు. 


పెద్దకొడుకేమో- బాగా వృధ్ధిలోకి వస్తున్నవాడు. ఒక రోజు తల్లీ కొడుకులిద్దరూ కబుర్లాడుకుంటూ టీ తాగుతున్నారు. ప్రక్కన కోడలు పిల్ల ఒదిగి కూర్చుని ఆసక్తిగా వింటూంది. ఎవరూ కలలో కూడా ఊహించని ఘోరం జరిగిపోయిందప్పుడు. మా మేనత్త కళ్లముందే పెద్ద కొడుకు గిర్రున తిరుగుతూ నేల కూలాడు. ఇద్దరూ పరుగెత్తుకు వెళ్లి తట్టి చూస్తే అప్పటికే మా పెదమేనల్లుడు ప్రాణాలు వదిలాడు. 


ఇంతకూ అతడు డాక్టర్. ఇప్పుడామె కోడలు పుట్టింటికి వెళ్లిపోయింది. మా మామయ్యేమో అంతకుముందే పోయాడు. ఇప్పుడామె ఒంటరిగా బాధను శ్వా సగా మార్చుకుని జీవిస్తూంది. కనీసం మనవడో మనవరాలో కలిగినా బావున్ను. కొడుకుని వాళ్ళలో చూస్తూ బ్రతుకును. మొన్న ఆమె కూడా చనిపోయింది. ఇదీ దు:ఖమంటే- చివరి మాటగా ఒకటంటాను. నిన్ను నొప్పించడానికి మాత్రం కాదు. చెప్పేదా-- ” 


 అంతవరకూ మౌనంగా ఉండిపోయిన గిరిరాజు ఎర్రబడ్డ కళ్లతో తలూపాడు. “అందర్నీ అన్ని వేళలా అలా అనను కాని- ఆత్మహత్యలకు పాల్పాడే చాలా మందిని నేను స్వార్థపరులంటాను. ఎందుకంటే— వాళ్లలో చాలామంది తమ క్షోభ గురించి తల పోస్తూ తమ వేదనల గురించి పరిపరి విధాల ఆలోచిస్తూ పైలోకాలకు వెళ్లిపోయేందుకు సిధ్ధమవుతుంటారు గాని— తమ నిర్ణ యం వల్ల తోటివారు- ముఖ్యంగా కావలసిన వాళ్ళు- ఎంతగా— ఎంత తీవ్రంగా కుమిలిపోతారో ఊహించరు” 


“అంటే నన్ను మీరు స్వార్థపరుణ్ణి అంటారా అంకుల్!”


 “తప్పకుండా! ముమ్మాటికీ నువ్వు స్వార్థపరుడివే!”


దిగ్గున లేచి నిల్చుని ఎలా అన్నట్లు చూపులు సూటిగా సారించాడు గిరి రాజు. 


“నువ్వు జబ్బో రోగమో వచ్చి పోతే అది వేరే విషయం- కాని నువ్వు అర్దాయుష్షు పోసుకుని పోతే నీతో చిన్నప్పట్నించి కలసి మెలసి తిరిగిన నీ నేస్తాలు ఎంతటి దు:ఖానికి లోనవుతారు— కొన్ని సంవత్సరాలుగా నీతో కలసి పనిచేసే మీ ఆఫీసు సిబ్బంది యెంతగా బాధపడతారు. నీ మృదంగ విన్యాసాన్ని వింటూ అనువణువే ఆనందించే నేనూ మీ ఆంటీ ఎంతగా దు:ఖిస్తాం-- అసలు నువ్వుగాని లేకపోతే నేనీ ఊళ్లోనే ఉండనేమో! ఇంతటి క్షోభను అనుభవించడానికి మేమేం పాపం చేసాం? చివరిగా చిట్ట చివరిగా-- పెండ్లికాకుండాన పరమపదాన చేరుకున్న కొడుకుని తలచి తలచి కన్నీరు విడుస్తూనే ప్రాణాలు విడు స్తారు ఇద్దరు ముసలి దంపతులూను. అటువంటి అంతిమ దశ చేరడానికి వాళ్లేం పాపం చేసారు?”


ముఖాన్ని రెండు చేతులతోనూ కప్పుకుని మౌనంగా రోదిస్తున్నాడు గిరిరాజు. 


నేను లేచాను. లేస్తూ అన్నాను- ”ఇంత చెప్పిన తరవాత కూడా నీది అదే నిర్ణయమైతే ఇక నేను చేసేదేమిలేదు” అంటూ ముందుకు కదిలాను. 


చటుక్కున లేచి నాచేయి పట్టుకున్నాడు గిరిరాజు. నేను వేసిన రాయి మృదువుగా సూటిగా తగిలిందని తెలుసుకున్నాను- మనసున వ్యాపించిన నిండుదనంతో తృప్తిగా నవ్వుకుని అక్కున చేర్చుకున్నాను వాత్సల్య పూరితంగా-- 

 

---------------------------------------------------------------- 

  

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.


aa




80 views0 comments

Comments


bottom of page