top of page

అసలు దెయ్యం ఎవరు..?

#MallavarapuSeetharamKumar, #మల్లవరపుసీతారాంకుమార్, #AsaluDeyyamEvaru, #అసలుదెయ్యంఎవరు, #తెలుగుకొసమెరుపుకథ, #TeluguSuspenseStory


Asalu Deyyam Evaru - New Telugu Story Written By Mallavarapu Seetharam Kumar Published In manatelugukathalu.com On 01/04/2025

అసలు దెయ్యం ఎవరు - తెలుగు కథ

రచన, కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



సికింద్రాబాద్ లో చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ఎక్కాను. చెన్నై వెళ్ళాలి. A2 బోగీలో నా సీట్ దగ్గరకు వెళ్ళాను. నాది లోయర్ బెర్త్. నేను వెళ్ళేసరికే నా సీట్లో ఒక అమ్మాయి, ఎదురు సీట్లో ఇద్దరు అమ్మాయిలు కూర్చొని ఉన్నారు. బహుశా నాంపల్లిలో ఎక్కి ఉంటారు. అందరూ బి టెక్ స్టూడెంట్స్ లా ఉన్నారు.


నా సీట్ లో కూర్చొని ఉన్న అమ్మాయి కిటికీ వైపు జరుగుతూ, "అప్పర్ బెర్త్ కి వెళ్తారా.. ప్లీజ్.." అంది.


"అలాగే.. నో ప్రాబ్లమ్. ఇప్పుడే వెళ్ళమంటారా..?" అడిగాను.


"ఎదురు సీట్లో ఉన్న వాళ్లలో ఒక అమ్మాయి "తొందరేమీ లేదు. మేము పదకొండు వరకు మాట్లాడుకుంటూ ఉంటాము. అక్కడే.. శవం పక్కన కూర్చోండి" అంది.


తెల్లబోయాను నేను.


కిసుక్కున నవ్విందా అమ్మాయి.


"ఆ అమ్మాయి పేరు శనగల వందన. మేము షార్ట్ కట్ లో శవం అంటాము. నా పేరు కీర్తి. నా పక్కనున్న అమ్మాయి సెల్వి. తమిళ్ అమ్మాయి" అంది నవ్వు ఆపుకుంటూ.


సెల్వి అనే అమ్మాయి కీర్తి చెవిలో ఏదో చిన్నగా చెప్పింది. ఆ మాటలు వినబడలేదు కానీ తమిళ్ లో చెప్పిందని మాత్రం అర్థం అయింది.


"మీకు తమిళ్ తెలుసా?" అడిగింది కీర్తి.


"బొత్తిగా రాదండీ" అన్నాను. ఆలా అంటే నా గురించి మాట్లాడుకోవాల్సి వస్తే తప్పకుండా తమిళ్ లో మాట్లాడు కుంటారు. నిజానికి నాకు తమిళ్ కొద్దిగా అర్థం అవుతుంది.

నా ప్లాన్ ఫలించింది. 


ఈ సారి సెల్వి కాస్త గట్టిగా "ఆకారం ప్రభాస్ లా వుంది కానీ బాగా భయస్తుడిలా ఉన్నాడు. శవం పక్కన కూర్చున్నాడు. ఏమైపోతాడో." అని తమిళ్ లో అంది.


నాకు తెలిసిన తమిళ పరిజ్ఞానం ప్రకారం ఆలా అర్థం చేసుకున్నాను.


సెల్వి మాటలకూ మిగతా ఇద్దరు పకపకా నవ్వేశారు.


"నా ఫెవరేట్ హీరో ప్రభాస్ ని తక్కువ చెయ్యొద్దు" తమిళ్ లో అంది శవం.. అదే.. శనగల వందన.


మొత్తానికి నా పర్సనాలిటీ చూసి వాళ్ళు నాకు ప్రభాస్ అని పేరు పెట్టారన్నమాట.

నిజానికి నా పేరు ప్రదీప్.


"మేము ముగ్గురం హైదరాబాద్ లో బి టెక్ చదువుతున్నాం. మీరు?" అడిగింది కీర్తి.


"నేను కూడా బి టెక్ స్టూడెంట్ నే. నా పేరు ప్రదీప్. ఐ ఐ టి ఖరగ్ పూర్ లో చదువుతున్నాను. ఫైనల్ ఇయర్" చెప్పాను.


తరువాత వాళ్ళు ముగ్గురూ సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నారు. మధ్యమధ్యలో నన్నుకూడా పలకరిస్తున్నారు. ప్రభాస్ పేరు వినపడ్డప్పుడల్లా నా గురించేనని ఫీలవుతున్నాను.

 

రాత్రి తొమ్మిదయింది. 

"గేమ్ ఆరంబిక్కలామా" అంది సెల్వి.


'ఆట మొదలు పెడదామా..అని అన్నట్లు సులభంగానే అర్థమైంది. అది విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ డైలాగ్ కదా.. అర్థం కానట్లు ముఖం పెట్టాను.


"ఆఫ్టర్ డిన్నర్ " అంది కీర్తి. 


ట్రైన్ మహబూబ్ నగర్ దాటింది.


ఎదురు సీట్లో ఉన్న ఇద్దరూ వాళ్ళు తెచ్చుకున్న బాక్స్ లు విప్పారు.

పక్క సీట్ వందన మాత్రం ఖాళీగా ఉంది.

అమ్మ నాకోసం కట్టిచ్చిన పులిహోర పాకెట్ విప్పుతూ వందనకు ఆఫర్ చేసాను "షేర్ చేసుకుందామా.." అంటూ.


"మేము షేర్ చేసుకుంటాము. దాని తిండి, టైమింగ్స్..అన్నీ ఈ మధ్య మారిపోయాయి. మనుషులు తినే టైం లో తినదు. ఏ ఒంటి గంటకో దయ్యంలాగా తింటుంది" అంటూ కీర్తి తన ప్లేట్ జాపింది పులిహోర కోసం.


'దయ్యంలాగా' అన్నమాట వినగానే ఉలిక్కిపడింది వందన.


ఆందోళనగా నా వైపు చూసింది.

నా ఫీలింగ్స్ చదవడానికి ప్రయత్నిస్తోందని అర్థమైంది నాకు.


తన ముఖంలో ఏదో తేడా కనిపిస్తోంది నాకు.

నా ఫీలింగ్స్ ని కవర్ చేసుకుంటూ నవ్వాను.


కానీ ఆ అమ్మాయి నా వంక సూటిగానే చూస్తూ అంది.."నిజం చెప్పండి. నేను దయ్యంలా అగుపిస్తున్నానా" అని.


"లేదండీ. పొగిడితే లైన్ వేస్తున్నానని అనుకుంటారని గమ్మునున్నాను. సినిమా ప్రొడ్యూసర్లు చూస్తే ఎగరేసుకు పోతారు, హీరోయిన్ వేషం ఇవ్వడానికి" అన్నాను.


దాంతో ఆ అమ్మాయి నార్మల్ అయింది.

"చూశారా.. నేను ప్రభాస్ లాంటి వాళ్ళకే నచ్చుతాను" స్నేహితురాళ్ళతో అంది తమిళ్ లో.


వాళ్ళేమీ మాట్లాడలేదు. టిఫిన్ తినడం పూర్తి అవడంతో హ్యాండ్ వాష్ కోసం ఇద్దరూ ఒకేసారి టాయిలెట్స్ వైపు వెళ్లారు.


వాళ్ళు వెళ్లారని రూఢి చేసుకొని వందన నన్ను దగ్గరకు జరగమని సంజ్ఞ చేసింది. నేను జరగగానే నా చెవి దగ్గర చిన్నగా "వాళ్లిద్దరూ దయ్యాలు" అంది.


అర్థం కానట్లు చూశాను.


"సరిగ్గానే విన్నారు. ఇద్దరిదీ నెల్లూరు దగ్గర ఇనమడుగు అనే వూరు. ఓ సారి ఊరి వాళ్లతో పందెం వేసుకుని అర్థరాత్రి స్మశానానికి వెళ్లారు. అప్పట్నుంచి వాళ్ళు మామూలు మనుషుల్లా లేరు. వీళ్లని దెయ్యం ఆవహించిందో.. వీళ్ళే దయ్యాలుగా మారారో అర్థం కావడం లేదు. వీళ్ల సంగతి కవర్ చెయ్యడానికి నన్ను దయ్యం అంటున్నారు. వీళ్ల విషయం కాస్సేపట్లో మీకే అర్థమవుతుంది" అంది వందన. 


ఆ మాటలు చెప్పేటప్పుడు ఆమె గొంతు వణుకుతూ ఉండటం గమనించాను. ఇంతలో కీర్తి, సెల్వి వచ్చారు. కీర్తి ఓ సారి మిగతా వాళ్ళ వంక చూసి, మధ్యలో ఉన్న కర్టెన్లు పూర్తిగా మూసింది. వందన, ఒక చేతితో తన నోరు నొక్కుకుంటూ, మరో చేత్తో నా భుజం తట్టి కీర్తివంక చూపించింది. కీర్తి కళ్ళు నిప్పు కణికల్లా మెరుస్తున్నాయి. మరోసారి కర్టెన్ సరి చేసి ఇటు తిరిగింది కీర్తి. ఇప్పుడు తన కళ్ళు మామూలుగా ఉన్నాయి.


వెంటనే సెల్వి వైపు చూసాను. తను బాగ్ సర్దుకుంటూ ఇయర్ ఫోన్స్ బయటకు తీస్తోంది.


"ఏమిటి ప్రదీప్? ఆ శవం ఏదో సాకు చెప్పి నిన్ను టచ్ చేస్తోందా?" అని అడిగింది కీర్తి నవ్వుతూ. 


"కీర్తీ! నువ్వు లోయర్ లో పడుకో." అని తెలుగులో చెప్పి, "నేను అప్పర్ నుండి ప్రభాస్ కు సైట్ కొడతాను.." అని తమిళ్ లో అంటూ పైకి ఎక్కింది సెల్వి. మరో నిముషం తరువాత నన్ను తట్టి పైకి చూడమని సైగ చేసింది వందన.


సెల్వి ఇయర్ ఫోన్ లో పాటలు వింటూ తల ఊపుతోంది. ఆమె జుట్టు మాత్రం నాగుపాము పడగలా పైకి లేచి అటూ ఇటూ ఆడుతోంది. నేను తన వంక చూడటం గమనించిన సెల్వి ఇయర్ ఫోన్స్ తీసేసింది. ఆశ్చర్యం.. ఆమె జుట్టు మామూలుగా అయిపొయింది.


" మిస్టర్ ప్రదీప్. వందనతో బెర్త్ షేర్ చేసుకునేలా ఉన్నారు.. పైకి రండి" అంది సెల్వి.


ఇంకా భయం భయం గా ఉన్న వందన వంక చూసి, "వాష్ రూమ్ వెళ్లి, ముఖం కడుక్కుని రండి. నార్మల్ అవుతారు" అన్నాను.


"నేను వెళ్తాను. మీరు జాగ్రత్త" అంటూ వెళ్ళింది వందన.


ఆమె వెళ్ళగానే ఎదురు సీట్ లో పడుకుని ఉన్న కీర్తి ఒక్కసారిగా పైకి లేచింది.


"ప్రదీప్! వందనకు ఎవరో చేతబడి చేశారు. అప్పట్నుంచి ఆమెను దయ్యం పట్టుకుంది. మీరు తొందరగా బెర్త్ పైకి ఎక్కండి. మేమిద్దరం ఫ్రెండ్స్ కాబట్టి మమ్మల్ని ఏమీ చెయ్యదు" అంది. 


అవునన్నట్లు తలాడించింది సెల్వి.


ఇంతలో వందన తిరిగి వచ్చింది. ఆమె మెడలోంచి ఏవో తీగలు బయటకు వచ్చి ఉన్నాయి.

నన్ను చూసి ఏమీ తెలియనట్లు ఆ తీగల్ని గొంతులోకి నెట్టేసింది.

నేను లేచి వాష్ రూమ్ వైపు కదిలాను. వచ్చేటప్పటికి ముగ్గురి నవ్వులు వినిపించాయి.


కర్టెన్ తొలగించుకొని లోపలికి వచ్చాను.

నా సీట్ లో కూర్చున్నాను.

ముగ్గురూ నావంక చూస్తున్నారు.

నేను చిన్నగా గొంతు సవరించుకున్నాను.


"నిజమైన దయ్యానికి కాళ్ళు వెనక్కి తిరిగి ఉంటాయని చిన్నప్పుడు మా నాయనమ్మ చెప్పింది.మీ కాళ్ళు నార్మల్ గా ఉన్నాయి. కాబట్టి మీరు దయ్యాలు కాదు" అన్నాను నా కాళ్ళు ఊపుతూ.


అప్రయత్నంగా వాళ్ళ కళ్లు, నా కాళ్ళమీద పడ్డాయి. ముగ్గురి కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. ఎందుకంటే నా కాళ్ళు వెనక్కి తిరిగి ఉన్నాయి.


"ఏం ఆలోచిస్తున్నారు? కాళ్ళు మామూలుగానే ఉన్నాయనీ, షూస్ తిప్పి వేసుకున్నానని అనుకుంటున్నారా? సరే. మీలో ఎవరైనా నాలుకతో ముక్కును అందుకోగలరా?" అడిగాను.


ముగ్గురూ నాలుకలు జాపి ట్రై చేసారు. వీలు కాలేదు.


"నన్ను చెయ్యమంటారా?" అడిగాను.


"అదేం దయ్యాల విద్య కాదు. కొంతమంది అలా చెయ్యడం ఇంటర్ నెట్ లో చూసాను" అంది వందన.


"ఆ మాట నేను చేశాక చెప్పండి. అయితే ఒక కండిషన్. భయంతో కేకలు పెట్టకూడదు. ఇక్కడినుంచి పారిపోకూడదు" అన్నాను.


ఒప్పుకున్నట్లు తలలూపారు కాస్త భయంగానే..


నెమ్మదిగా నా నాలుకను బయటకు జాపాను. 


నాలుక నా ముక్కును తాకింది. తరువాత మరింత పెరిగింది. వందన ముక్కును సమీపించింది.


నాలుకను గబుక్కున వెనక్కి లాక్కున్నాను.


ఈ సారి నా నాలుక రెండుగా చీలింది. ఒక భాగం వందన వైపు, మరొకటి కీర్తి వైపు సాగాయి.

మళ్ళీ వెనక్కి లాగాను. ఈ సారి నాలుక మూడు చీలికలుగా మారింది. ముగ్గురి వైపు కదలసాగింది.


ముగ్గురూ భయంతో బిగుసుకు పోయారు. ఏ సి లో కూడా చెమటలు ధారగా కారుతున్నాయి.


గబుక్కున నాలుకను వెనక్కి లాగేసుకున్నాను.


"రిలాక్స్ కండి. భయంతో ఏదైనా జరిగితే నిజం దయ్యాలుగా మారుతారు" అన్నాను.


నా గొంతులో మృధుత్వాన్ని గమనించి కాస్త కుదుట పడ్డారు ముగ్గురూ. అయినా నా వంక భయంగానే చూస్తున్నారు.


వాళ్ళు పూర్తిగా నార్మల్ అయ్యేదాకా ఆగి చెప్పడం ప్రారంభించాను.

 

"మా నాన్నగారు విగ్నేష్ గారు మంచి మెజీషియన్. ఈ మధ్య ఇంజనీరింగ్ కాలేజీలో ప్రదర్శన ఇచ్చారు. తరువాత ప్రిన్సిపాల్ గారికి, కొందరు లెక్చరర్లకు కొన్ని టెక్నీక్స్ నేర్పి, చిన్న చిన్న వస్తువులు.. కళ్ళల్లో నిప్పులు.. నాట్యమాడే జడ..లాంటివి గిఫ్ట్ గా ఇచ్చారు. బహుశా మీలో ఎవరైనా ఆ స్టాఫ్ పిల్లలు అయి ఉంటారు" అన్నాను.


అది తానేనన్నట్లు సైగ చేసింది వందన.


"అవి తయారు చేసింది నేనే. నేను కూడా మ్యాజిక్ నేర్చుకున్నాను. చెన్నై ఐ ఐ టి లో సరదాగా ఒక ప్రోగ్రాం ఇవ్వడానికి వెళ్తున్నాను. ఇంతకూ ఎలా వుంది నా షో" నవ్వుతూ అడిగాను.


"ఏముంది.. చిన్న మ్యాజిక్ తో ముగ్గుర్నీ పడేసాడు" కీర్తితో అంది సెల్వి తమిళ్ లో.


"నా ప్రభాస్ ను షేర్ చెయ్యనబ్బా.." తమిళ్ లో అంది వందన నవ్వుతూ.


నాతో సహా అందరూ నవ్వేశారు వందన మాటలకు.


శుభం 


మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ మల్లవరపు సీతారాం కుమార్ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


Vijaya Dasami 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ నిర్వహిస్తున్నాము.

 








1 comentário


@sudhavishwam

•2 hours ago

బావుందండీ వెరైటీ గా

Curtir
bottom of page