#SujathaThimmana, #సుజాతతిమ్మన, #ఆశతోనే, #Asathone, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు
Asathone - New Telugu Story Written By - Sujatha Thimmana
Published In manatelugukathalu.com on 15/11/2024
ఆశతోనే - తెలుగు కథ
రచన: సుజాత తిమ్మన
"మరుగేలరా ఓ రాఘవా..
మరుగేలా పరాత్పర రూపా.. "
శ్రావ్యమైన కంఠంతో వినిపిస్తున్న త్యాగరాయ కీర్తనను
‘ఎవరు పాడుతున్నారబ్బా!’ అనుకుంటూ అటు ఇటు చూసింది ప్రమీల.
‘పెరటి వైపు నుంచి వినిపిస్తుంది’ అని అటుగా వెళ్ళి తొంగి చూసింది, ప్రక్కన ఉన్న ఇంటి వైపు. జాజి మొగ్గలను మాల కడుతూ.. పాడుతున్న అమ్మాయిని చూసి కళ్ళు తిప్పుకోలేకపోయింది.
చేతులు పని చేస్తూనే ఉన్నాయి, పాట పాడుతూ పసిమి వన్నె మోములోని హావభావాలను కళ్ళతోనే పలికిస్తూ ఉంది ఆ అమ్మాయి ముగ్ధమనోహరంగా.
జాజుల పరిమళం తో పాటు ఆ అమ్మాయి లావణ్యం చూపులు తిప్పనివ్వలేదు ప్రమీలను. పాట పూర్తి అయే వరకూ అలా చూస్తూ ఉండిపోయింది. ఆ సన్నివేశం ఎంతో ముచ్చటగా అనిపించింది ప్రమీలకు.
****
ప్రమీల భర్త అకాల మరణంతో ఊరిలోని ఆస్తుల విషయం చూసుకోవటానికి అవసరమై రెండు రోజులయింది ఆ ఊరికి వచ్చి.
పెరట్లో పని చేస్తున్న రాములమ్మను అడిగింది "పక్కింట్లో ఉన్న ఆ అమ్మాయి ఎవరు.. ?" అని
"ఆ పిల్ల పేరు జానకి, అమ్మగోరు.. తల్లి లేని పిల్ల. జానకమ్మ తండ్రి పోస్టాఫీసుల ఉద్దోగం. నానమ్మ అనసూయమ్మగారు సంగీతం నేర్పించేటోరు. ఆయమ్మ దగ్గరే ఈ జానకమ్మ కూడా నేర్చుకుంది. ఓ పెళ్ళిలో జనకమ్మని చూసిన పెద్దావిడ తన కొడుకుకు తగిన ఈడు అని, అమ్మాయి లక్షణంగా ఉందని, వాళ్ళంతకు వాళ్ళే వచ్చి అడిగిన పెద్దింటి సంబంధం ఒదులుకోవడం ఎందుకని అమ్మాయిని ఇచ్చి పెళ్లి జరిపించారు జానకమ్మ తండ్రిగారు.
జానకమ్మ పాతకాలం అమ్మాయిలాగా ఉంటారు కదా! అది నచ్చలేదు ఆ అబ్బాయికి. బాగా సతాయించేవారంట. అంత అందమైన ముఖం పైన సిగిరెట్టు తోటి కాల్చేవారట. జానకమ్మ అందాన్ని ఎవరూ చూడకూడదని, అనుమానం తో నానా మాటలు అంటూ గుమ్మంలోకి కూడా రానిచ్చేవోడు కాడట.
ఇంటికి ఎవరైనా వచ్చినా.. చివరికి పాలు పోసేటోడు వచ్చినా ఏదో ఒకటి అంటూ కొట్టేవాడట.
ఇవన్నీ ఆయమ్మ అస్సలు చెప్పలేదమ్మా వాళ్ళ నాన్నకి.
కానీ ఆమె అత్తగారు శానా మంచిది. చిదిమి దీపం పెట్టేలా ఉన్న అమ్మాయి తన ఇంట్లో దీపమౌతుందని ఎంతో ఇష్టంతో తన కొడుకుకు చేసుకున్నారు, పెళ్లి అయితే కొడుకు మారతాడు అన్న ఆశతో. అందుకే ఆ కొడుకు ఇలా కోడలిని బాధ పెడుతూ ఉంటే నచ్చలేదామెకు. ఆమె ఎంతగానో చెప్పి చూసిందట. అతను ఆమెపై కూడా తిరగబడుతూ ఉండేవాడట. అతనికి తల్లి అన్న గౌరవం కూడా లేదట.
ఆమే స్వయంగా జానకమ్మ తండ్రిని కలిసి ‘మీ బిడ్డని కాపాడుకోండి. నేను చెపితే వింటలేడు మా కొడుకు. ’ తను చేసిన తప్పు కొడుకు ఇష్టం తెలుసుకోకుండా పెళ్లి చేయడం అని, కనీసం జానకమ్మ ఇలా అయినా ఈ బాధలనుంచి విముక్తి దొరుకుతుంది అని, అన్నీ విషయాలు వివరంగా చెప్పిందమ్మా.
వాళ్ళ నాయిన వెళ్ళి జనకమ్మని తీసుకుని వచ్చిండు. విడాకులు ఇచ్చిండట ‘మా అమ్మ ఇష్టంతో చేసుకున్నా.. నాకు నీతో గడపడం ఇష్టం లేదు’ అని జనకమ్మతో చెప్పి.
పాపం ఆ జానకమ్మ గుండెలోనే తన బాధను దాచుకుని రోజు గుళ్ళో రాములోరికి జాజి పూల మాలలు కట్టి వేస్తారమ్మా!" అంటూ చెప్పుకొచ్చింది రాములమ్మ.
“అయ్యో! ఇంత అందమైన అమ్మాయి వెనుక ఇంతటి విషాదం దాగి ఉందా?” అని బాధ పడింది ప్రమీల. తాను ఏదైనా ఆ అమ్మాయికి సహాయం చేయాలి అన్న సంకల్పంతో జానకిని కలుసుకోవడానికి రాములమ్మని తీసుకుని వెళ్లింది మరుసటి రోజు ఉదయం జానకి వాళ్ళ ఇంటికి.
జానకి తండ్రి నారాయణగారు ముందు ఎవరా అని అనుకున్నారు. రాములమ్మ చెప్పింది పక్కింట్లో వచ్చారని.. “ప్రమీలమ్మగారు” అంటూ పరిచయం చేసింది.
నమస్కారాలు అయ్యాక.. జానకిని అడిగింది యశోద.
పూజ ముగించుకుని హారతి పళ్ళెంతో వచ్చిన జానకిని చూసి అచ్చంగా ఆ సీతమ్మవారిని చూస్తున్న భావన కలిగింది ప్రమీలకు.
నారాయణగారు జానకికి ప్రమీలను పరిచయం చేశారు.
విప్పారిన కళ్ళతో నమస్కారం చేసింది జానకి.
ప్రమీల తన గురించి చెపుతూ “నిన్న సాయంత్రం నీవు పాడుతున్న ‘మరుగేలరా ఓ రాఘవా.. ’కీర్తన విన్నాను. నీ కంఠంలో ఏదో తెలియని మాధుర్యం ఉంది. వినేవాళ్లను మైమరపింపజేస్తుంది. నీ పాట నన్ను రప్పించింది అంటే ఎంతటి శక్తి ఉందో తెలుసుకో.. ” అంటూ చెప్పుకొచ్చింది.
మనోహరంగా చిరునవ్వు నవ్వుతూ చూసింది కృతజ్ఞతగా జానకి తనను అంతగా పొగుడుతున్నందుకు ప్రమీల వైపు.
మెల్లగా తానే చనువుగా మాటలు కలిపించి జానకితో ప్రమీల.
ఆ అమ్మాయిలోని బిడియాన్ని పోగొట్టాలని ప్రయత్నం చేస్తూ, సాయంత్రం గుడికి వెళ్ళేటప్పుడు తనని కూడా తీసుకెళ్లమని చెప్పింది.
జానకి అలాగే అంటూ తల ఊపింది.
సంగీతంలో శిక్షణ తీసుకున్న జానకి ఇలా ఊరికే ఉండటం సరికాదు కదా అని నారాయణగారిని అడిగితే..
“తన జీవితంలో జరిగిన ఆటుపోట్లని తట్టుకుని ఇప్పుడిప్పుడే మనుష్యుల్లో పడుతుందమ్మా. బగవంతుడు తన నుదుటిన ఏమి రాశాడో” అంటూ నిస్పృహ వ్యక్తం చేసారు.
“ఈ విషయంలో నేను నా శక్తి కొలది సహాయం చెయ్యగలనండి మీరు మరోలా అనుకోకపోతే.. ” అంది ప్రమీల.
“సహృదయంతో మీరు ముందుకు వచ్చారు. తల్లిలేని పిల్ల. అమ్మలా ఆమెను ఆదుకుంటాను, అంటే నేను అడ్డు పెట్టనమ్మా” అన్నారు నారాయణగారు.
*****
సాయంత్రం జానకితో పాటు గుడికి వెళ్లింది ప్రమీల. అక్కడి సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ రామచంద్ర మూర్తులను చూసి ముగ్ధురాలైంది. నల్లటి రాతి విగ్రహాలు అయినా ఎంతో కళగా ఉన్నాయి. జాజి మాలలు వేసిన పూజారి జానకిని పలకరించారు.
పూజారికి ప్రమీలను పరిచయం చేసింది జానకి.
తీర్థ ప్రసాదాలు తీసుకున్నాక అక్కడి అరుగు మీద కూర్చొన్నారు ఇద్దరూ.
మాటల్లో ఆమె మనసు తెలుకోవలని ప్రయత్నించింది.
సంగీతం అంటే ఆ అమ్మాయికి ఎనలేని అభిమానం అని గ్రహించింది. చిన్నప్పటి నుంచి సంగీత సాధన చేస్తూ ఉన్నానని చెప్పింది జానకి.
ఇలా రెండు మూడు రోజులు ప్రమీలతో సమయం గడిపే సరికి జానకి కొద్దిగా అలవాటు పడింది సానుకూలంగా మాట్లాడేందుకు.
సంగీతం మీద ఉన్న ఆసక్తిని పసిగట్టింది. జానకికి మంచి గాయనిగా పేరు తెచ్చుకోవాలని ఉంది అని ఆమె మాటల్లో తెలుసుకుంది.
ప్రమీల అన్న కేశవ్ సినిమాలకు సంగీత దర్శకత్వం వహిస్తూ ఉంటాడు. అతనికి జానకి పాడిన పాటను రికార్డ్ చేసి పంపించింది.
జానకి పాత విన్న కేశవ్ చాలా రోజులుగా వెతుకుతున్న ‘కొత్త వాయిస్ ఇదే’ అని సంతోష పడ్డాడు.
వెంటనే ఆ అమ్మాయిని అడుగమని ప్రమీలకు చెప్పాడు కేశవ్.
అదే విషయం జానకితో చెప్పి ఒప్పించింది.
నారాయణగారిని కూడా తనతో రమ్మని చెప్పింది. కానీ ఆయన ఇంటివద్ద పనులు ఉన్నాయని.. జానకి ఒప్పుకుంటే నిరభ్యంతరంగా తీసుకెళ్లమని చెప్పారు. అలా జానకిని తనతో పాటు హైదరాబాదు తీసుకుని వచ్చి తన ఇంట్లోనే జానకిని ఉంచుకుని కేశవ్కి పరిచయం చేసింది ప్రమీల.
ముందుగా కేశవ్ జానకికి వాయిస్ టెస్ట్ చేయించాడు సంగీత దర్శకునితో. విస్మయం అవ్వటం ఆ సంగీత దర్శకునిది అయింది. “వినూత్నమైన ఓ కొత్త మాధుర్యం ఆ అమ్మాయి గొంతులో నుంచి జాలువారుతుంది.. తప్పకుండా మనం తనతో పాడించవచ్చు” అన్నాడు అతను.
సంతోషించిన కేశవ్ తను దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాలో జానకికి మూడు పాటలు పాడటానికి అవకాశం ఇచ్చాడు. మూడు మంచి మెలోడీ సాంగ్స్ అవ్వడంతో విపరీతంగా వ్యూస్ వచ్చాయి.
జానకి కళ్ళల్లో అనుకోని ఆనందం అంతా ‘కుప్ప పోసిన వెన్నెలలా వచ్చి ఒడిలో పడిందా’ అన్నట్టుగా కనిపిస్తుంది.
అలా ఆ మూడు పాటలతోనే ఆమె ప్రయాణం ఆగిపోలేదు. ఆ తరువాత తీరిక లేకుండా అవకాశాలు వెతుకుంటూ వచ్చాయి.
ప్రమీల ఆనందానికి అవధులు లేవు. ఒక నిండు జీవితం నిలబెట్టానే సంతృప్తి ఆమె గుండెను నింపేసింది.
‘ఒక చోట జీవితం ఒరిగిపోయినా క్రుంగి పోకూడదు. మరో చోట లోన దాగిన ఆశల సౌధం ఎప్పుడో ఒకప్పుడు మనదవుతుంది అన్న ఆశతోనే జీవించాలి’, అని అనుకుంది ప్రమీల లోలోన.
***సమాప్తం***
సుజాత తిమ్మన గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: పేరు సుజాత తిమ్మన.
డిగ్రీ చదువుతుండగానే వివాహం... ఆ తరువాత ఇద్దరు అమ్మాయిలు.
చిన్నప్పటి నుంచీ మనసులో కలిగిన భావాలను నోటు పుస్తకంలో వ్రాసుకోవడం అలవాటు.
అలా కవితలు లెక్కకు మించి వ్రాసాను, వ్రాస్తూనే ఉంటాను.
ఆంధ్ర భూమి సచిత్ర వార పత్రికలో తరచుగా ప్రచురితం అయ్యేవి.
బహుమతులు, ప్రశంసా పత్రాలు రావడం సర్వ సాధారణం.
ముఖ పుస్తకంలో అనేక సమూహాలలో నేను కనిపిస్తూనే ఉంటాను.
30 కథల వరకు వ్రాసాను. ఇక ఈ కథ "అర్థాంగి" నమస్తే తెలంగాణ వీక్లీ లో అచ్చయిన కథ.
మన తెలుగు కథలు లో నన్ను చేర్చుకున్నందుకు ధన్యవాదాలతో...
సుజాత తిమ్మన.
ఈ కథ ఒక మహిళా protagonist, ప్రమీల, మనోభావాలు, ఇతరులను ఆదుకోవడం, మార్పు తీసుకోవడంపై ఆధారపడి ఉంటుంది. ఆమె తన పర్సనల్ బాధలు మర్చిపోయి, జానకమ్మ అనే యువతికి సహాయం చేసి, ఆమెలోని ప్రతిభను వెలికితీస్తుంది. జానకమ్మ తల్లిలేని, బాధలతో జీవించే అమ్మాయి. కానీ ప్రమీల ఆమెకు అవకాశాలు ఇవ్వడం ద్వారా ఆమె జీవితం మారుతుంది.
కథలో సంగీతం ప్రతిభను వెలికి తీసే సాధనగా, సహాయం మానవీయ విలువగా, మరియు ఆశ జీవితం చెలామణీ చేసే శక్తిగా చూపబడింది. చివరికి, జానకమ్మ సంగీతంలో శ్రేష్ఠత సాధించి, తానూ మార్పు చెందింది. కథ అందించే ముఖ్య సందేశం: "మానవ సంబంధాల్లో సహాయం, ఆత్మవిశ్వాసం, ఆశ ద్వారా జీవితంలో మార్పు తెచ్చుకోవచ్చు."
బాగుంది