ఆశావాది
- T. V. L. Gayathri
- Feb 24
- 6 min read
#TVLGayathri, #TVLగాయత్రి, #Asavadi, #ఆశావాది, #TeluguStories, #తెలుగుకథలు

Asavadi - New Telugu Story Written By - T. V. L. Gayathri
Published In manatelugukathalu.com On 24/02/2025
ఆశావాది - తెలుగు కథ
రచన: T. V. L. గాయత్రి
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
"రేపు మహారాష్ట్ర బంద్!"
స్కూల్ నుండి రాంగానే చెప్పింది పల్లవి.
"ఎందుకు?" అంది బామ్మ రుక్మిణి.
రుక్మిణి, పెద్ద కొడుకు మహేంద్ర దగ్గర మహారాష్ట్రలోని పూణేలో ఉంటోంది.
"మహారాష్ట్రలోనే నలుగురు అమ్మాయిల మీద అత్యాచారాలు జరిగాయట! కలకత్తా ఘోరం మర్చిపోకముందే నాలుగు కేసులు బయటకు వచ్చాయి!"
మౌనంగా ఉంది రుక్మిణి.
టెన్త్ క్లాస్ చదువుతోంది పల్లవి. ఆ చిన్నపిల్ల హృదయంలో ఈ సంఘటనలన్నీ ఎలాంటి ప్రభావం చూపిస్తాయి?.. సంఘంలో రక్షణ లేదు!.. బయటికి వెళ్లిన పిల్ల క్షేమంగా తిరిగి వస్తుందన్న నమ్మకం లేదు!.. క్రూర జంతువుల మధ్య క్షణక్షణం భయంతో బ్రతుకుతున్నట్లుగా ఉంది.. దినదిన గండంగా రోజులు వెళ్ళబుచ్చటంలాగా ఉంది.
"నేను కరాటే లో చేరతాను బామ్మా!" అందొకరోజు పల్లవి.
అక్కడే దగ్గరలో ఉన్న కరాటే స్కూల్లో చేర్పించారు. ఇరవై మంది ఆడపిల్లలు ఉన్నారక్కడ.
"దీన్ని నేర్చుకుంటే ఎంత మందితో పోరాడగలరు?"
అడిగింది రుక్మిణి టీచరుని.
"కనీసం ఐదారుగురిని మట్టికరిపించవచ్చు!" చెప్పింది టీచర్.
శిక్షణ మొదలైంది. యుద్ధ శిక్షణ తీసుకున్నట్టుగా నేర్చుకుంటున్నారు పిల్లలు. మెల్లమెల్లగా ధైర్యం వస్తోంది పల్లవికి.
ప్రమాదాన్ని ముందే పసిగట్టడం, కొంచెం అనుమానం వచ్చినా పోలీసులకు సమాచారాన్ని ఇవ్వడం, ఎప్పుడూ అలర్ట్ గా ఉండడం, పక్కింటి వాళ్ళను, ఎదురింటి వాళ్లను కూడా నమ్మకపోవడం, ఎక్కడికి వెళ్లినా నలుగురూ కలిసి వెళ్ళటం ఇలా ప్రతి నిమిషం జాగ్రత్తగా ఉండటం పిల్లలకు నేర్పిస్తున్నారు.
ప్రపంచంలో ఇలా జాగ్రత్తలు పిల్లలకు నేర్పించే దేశాలు ఉన్నాయా?" టీచరును అడిగింది రుక్మిణి.
"ఇజ్రాయిల్ లాంటి దేశాల్లో చిన్నపిల్లలకూ, ఆడవాళ్లకు కూడా యుద్ధ శిక్షణ ఇస్తుంటారు. జపాన్ లాంటి దేశాల్లో భూకంపాలు వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పిల్లలకు నేర్పిస్తారు. అమెరికాలో స్కూళ్లల్లో కాల్పుల ఘటనలు ఎక్కువ!
పిల్లలు వాటినుండి ఎలా తప్పించుకోవాలో చెప్తుంటారు!
మనదేశంలో కూడా మృగాళ్ల గురించి పిల్లలకు జాగ్రత్తలు చెప్పి యుద్ధ విద్యలు నేర్పించడం ఇంకా తక్కువే అని చెప్పాలి!.. ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఆడపిల్లలు క్షేమంగా ఉండాలంటే జాగ్రత్తలు తప్పనిసరి!"వివరించింది టీచరు.
"నిజమే!కానీ ఇంకా ప్రజల్లో కొంత నిర్లక్ష్యధోరణి కనిపిస్తోంది!"
"అవును! ఇలా ఏవైనా సంఘటనలు జరిగినప్పుడే కొంచెం ఆందోళనపడటం.. ఆ తర్వాత మనకేమీ కాదులే అనుకోవటం పరిపాటయింది. ఈ మూర్ఖత్వం జనాల్లో పోవాలి! ఎప్పటికపుడు జాగ్రత్తగా ఉండటం సరిపోదు! చిన్నపిల్లల పెంపకం మీద ప్రతి తల్లిదండ్రులు శ్రద్ధ పెట్టాలి! వాళ్ళు చూచే సినిమాలు, వీడియోల గురించి నిఘా పెట్టాలి!. విదేశీ ఛానళ్లను కట్టుదిట్టం చెయ్యాలి! క్లబ్బుల, పబ్బుల సంస్కృతిని తరిమెయ్యాలి! ఇవన్నీ జరుగుతాయా! చాలా వాటిని ప్రభుత్వమే పెంచి పోషిస్తోంది!"
ఆలోచిస్తూ వింటోంది రుక్మిణి.
"జాతికి ప్రమాదం ముంచుకొస్తుంటే మనకు మనం కొద్దికొద్దిగా జాగ్రత్తలు తీసికొంటే ఏమాత్రం ఫలితం వస్తుంది?"
టీచరు మాటలు రుక్మిణిలో ఆలోచనలను రేకెత్తించాయి.
ఆమె ఇంటికి వచ్చింది.
ఏదైనా చెయ్యాలి!.. ఏమి చెయ్యాలి?
తన స్నేహితులతో కలిసి శని, ఆదివారాలు దగ్గర్లో ఉన్న బస్తీకి వెళ్లి అక్కడున్న శివాలయంలో కూర్చుని పిల్లలకు నీతి కథలు బోధించటం మొదలుపెట్టింది. కథలు విన్న వాళ్లకు చాకలెట్స్ ఇస్తోంది. చాక్లెట్లకు ఆశపడి పిల్లలు వచ్చి కూర్చుంటున్నారు. మొదట ఒకళ్ళిద్దరు పిల్లలు వస్తున్నారు. మహా అయితే నలుగురో ఐదుగురో.. నిరాశపడలేదు రుక్మిణి. 'ఈ జనారణ్యంలో ఒకడు మారినా చాలు!ఒక మృగం సంఖ్య తగ్గినా చాలు!' అనుకొంది ఆశావాది రుక్మిణి.
కొద్దిరోజులయ్యాక శివాలయంలో ఉత్సవాలు జరుగుతాయని పిల్లలకు పాఠాలు ఇంకెక్కడయినా చెప్పుకోమని చెప్పారు దేవాలయం ధర్మకర్తలు.
ఇంకోచోటు వెదకసాగింది రుక్మిణి. కానీ ఉచితంగా పూణే మహానగరంలో చోటు ఎక్కడ దొరుకుతుంది? పైగా బస్తీ పిల్లలకోసం. సమస్య కొడుకుతో, కోడలితో చెప్పింది.
"నీకెందుకమ్మా ఈ బాధ్యత? మనపిల్లని మనం చూసుకుంటే చాలదు?.. ఎక్కడో ఏదో జరిగిందని ఊరికే వర్రీ పడకు! దేశాన్నాంతా మనం బాగుచేయగలమా!" అన్నాడు కొడుకు మహేంద్ర.
రుక్మిణికి కోపం వచ్చింది.
"అదేమన్నమాట! ఎవరో ఒకరు అడుగు ముందుకు వెయ్యాలి! అందరూ తమకు పట్టనట్లు కూర్చుంటే సమాజానికి పట్టిన రోగాలను ఎవరు తగ్గిస్తారు? మనకు జబ్బుచేస్తే వైద్యం చేయించుకోవటంలేదా? మురగబెట్టుకొని కూర్చుంటున్నామా? అలాగే కరోనా మహమ్మారిని తరిమికొట్టలేదా? కనీసప్రయత్నం చేద్దామంటే నువ్వు ఇలా మాట్లాడతావేంటి?"
'తల్లి తీరే అంత! పట్టు పట్టిందంటే ఉడుముపట్టే! పని అయ్యేదాకా వదిలిపెట్టదు '. అనుకుంటూ మౌనంగా ఉన్నాడు మహేంద్ర.
కొద్దిరోజులకు రుక్మిణికి శాలినిజోషి పరిచయం అయ్యింది.
కొంతమంది బస్తీలోని పిల్లలకు స్కూలు యూనిఫాములు ఉచితంగా పంచుతూ ఉంటుంది. తను చెయ్యాలనుకొన్న పనిగురించి వివరించింది రుక్మిణి.
కొంతయినా సహాయం దొరుకుతుందేమోననే ఆశ!
రుక్మిణి చెప్పిందంతావిని పెదవి విరిచింది శాలిని.
"ఇక్కడ చూడండి! అందరివీ చిన్న చిన్న ఇళ్ళు. మహా ఉంటే రెండు గదులు. దానికే అయిదు వేలు అద్దె కట్టాలి. ఆటోలు నడిపేవాళ్ళు, తాపీపని చేసేవాళ్ళదగ్గర్నుండి చిన్నా చితకా జీతగాళ్ళే! ఒక ఇంట్లో తల్లి దండ్రులు, పిల్లలతో కలిసి భార్యాభర్త ఉంటారు. అక్కడే అందరూ ఉంటారు. మన ఇళ్లల్లో లాగా మూడు బెడ్ రూముల ఇళ్ళు కావు.. చిన్నపిల్లలకు కూడా సెక్స్ గురించి బాగా తెలుసు. పైగా వాళ్ళ చేతుల్లో సెల్ ఫోన్లు.. వాటిల్లో చూసే ఫోర్న్ వీడియోలు.
ఇక్కడ ఉండే చిన్న చిన్న దుకాణాల్లో డ్రగ్స్ బాహాటంగా అమ్ముతారు. ఏది తప్పిస్తాము? కొంతమంది మాఫియా వాళ్ళు పిల్లల్ని రకరకాలుగా వాడుకుంటూ ఉంటారు. ఏదో చేద్దామని మనకు తపన ఉన్నా ఇప్పుడు ఎవరు స్పందిస్తారు?"
నిరాశగా ఇంటికి వచ్చింది రుక్మిణి.
నాలుగురోజుల తర్వాత పేపర్ తిరగేస్తుంటే ఒక మూల పడిన వార్త రుక్మిణికి ఆనందాన్ని కలిగించింది. పూనా కలెక్టరుగా కర్ణాటకకు చెందిన ఉమేష్ భట్ డ్యూటీలోకి వచ్చారు అనేదే ఆ వార్త.. అతడి ఫోటో చూసి చటుక్కున గుర్తుపట్టింది. రుక్మిణి భర్త వెంకటరమణది బ్యాంకు ఉద్యోగం. మూడేళ్ల కొకసారి ట్రాన్స్ఫర్లు. పిల్లలు చిన్న పిల్లలుగా వున్నప్పుడు రుక్మిణివాళ్ళు మూడేళ్లు మైసూరులో ఉన్నారు. అప్పుడు ఉమేష్ వాళ్ళ ఇంటి మేడమీద అద్దెకుండేవాళ్ళు.
వాళ్ళ అమ్మా, నాన్నలకిద్దరికీ ఉద్యోగాలు. పొద్దున్న ఉద్యోగానికి వెళితే సాయంత్రం వచ్చే సుఖదకు రుక్మిణి సపోర్టుగా ఉండేది. ఉమేష్ ని అతడి తమ్ముడు రమేష్ ని తమ పిల్లలతో పాటు కూర్చోబెట్టుకొని హోమ్ వర్క్ చేయించేది. సుఖద రావటం లేటయితే పిల్లలకు టిఫిన్ కూడా పెట్టేది. నలుగురు పిల్లలు కలిసి ఆడుకుంటూ, చదువుకుంటూ ఉండేవాళ్ళు. ఇన్నేళ్ల తర్వాత ఉమేష్ కలెక్టరుగా పునాకు రావటం చాలా సంతోషంగా ఉంది రుక్మిణికి.
ఫోన్ నెంబర్ కనుక్కొని ఉమేష్ కు ఫోన్ చేసింది రుక్మిణి.
"ఎన్నేళ్లకు ఆంటీ!"అంటూ చాలా సంభ్రమంగా మాట్లాడాడు ఉమేష్.
ఉమేష్ చెప్పంగానే ఫోన్ లోనే రుక్మిణిని పలకరించింది వసుధ. వీకెండ్ కు వాళ్ళని భోజనానికి పిలిచింది రుక్మిణి.
ఆ ఆదివారం ఫ్యామిలీతో వచ్చాడు ఉమేష్. ఆ కబురు ఈ కబురు చెబుతూ బస్తీ పిల్లల గురించి చెప్పింది రుక్మిణి.
"నిజమే అంటీ!మీరు చదువుకొనేటప్పుడు స్కూల్లో టీచర్లు పిల్లలకు మోరల్స్ చెప్పేవాళ్ళు. మీరు చదివింది గవర్నమెంట్ స్కూళ్లల్లో. మా తరం అప్పటికి చదువు అర్థం మారింది. ఇప్పుడు పిల్లలకు సంస్కృతి, సంప్రదాయాలు తెలియవు. వాటి గురించిన ధ్యాస అటు పేరెంట్స్ కు, ఇటు టీచర్లకు కూడా లేదు. మీరు మోరల్ క్లాసెస్ తీసికొందామంటే నేనొక బిల్డింగ్ చూపిస్తాను. కానీ దీనివలన ఎక్కువ ఫలితం వస్తుందని ఆశించవద్దు!"
"స్వచ్ఛభారత్, ఎయిడ్స్ నివారణ, మొక్కలు పెంచటం, ప్లాస్టిక్ నిషేధం.. ఇలాటివి కొంతైనా అక్కడక్కడా పని చేస్తున్నాయి. మార్పు అస్సలు రాదని ఏమీ చెయ్యకుండా వదిలేస్తామా! ప్రయత్నం చేస్తూ వెళదాము! ప్రయాణం మానుకోవటమెందుకు? ఒక పదిమందిలో మార్పువచ్చినా అది విజయమే కదా!"
తలపంకించాడు ఉమేష్.
"ఊరికే కథలు, కబుర్లు అంటే ఎవ్వరూ ఉత్సాహం చూపించరు. ఏదైనా ట్యూషన్ చెప్తామంటే పిల్లలు వస్తారు. అలాటి ఏర్పాటు చేద్దాము!"అన్నాడు ఉమేష్.
అతడి ప్రోద్బలంతో కొంతమంది రిటైర్ అయిన వాళ్ళు కూడా వచ్చి రుక్మిణితో పాటు చేరారు. అందరూ కలిసి బస్తీ పిల్లలకు చదువుతో బాటు నీతి నియమాలు నేర్పిద్దామని అనుకున్నారు.
ఉమేష్ బస్తీలో ఒక బిల్డింగ్ చూపించాడు. కలెక్టర్ ప్రారంభించటంతో ఆసక్తి కొద్దీ పిల్లల్ని పంపిస్తున్నారు అక్కడి బస్తీవాళ్ళు.
అలా పిల్లలకు సాయంత్రం లెక్కలు, సైన్స్ పాఠాలు చెప్తూ, మధ్యలో కథలు, కబుర్లు చెబుతూ పిల్లలకు దగ్గరయ్యారు రుక్మిణి వాళ్లు. మూడేళ్లకు ఉమేష్ కు పూనా నుండి ట్రాన్ఫర్ అయింది. ఒక రోజు పేపర్లో ఒక వార్త పడింది. పూనాలో ఒక సంవత్సరం నుండి క్రైం రేటు తగ్గుకొస్తూ ఉందని.. కొన్ని కొన్ని బస్తీల్లో పిల్లలు సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారని ఆ బస్తీల పేర్లు కూడా వ్రాశారు. వాటిల్లో రుక్మిణి వాళ్ళు పాఠాలు చెప్పే బస్తీ కూడా ఉంది.
రుక్మిణికి, ఆమె స్నేహితులందరికీ చాలా ఉత్సాహం వచ్చింది. దాదాపు ఎనిమిదేళ్లుగడిచాయి. రుక్మిణి, ఆమె స్నేహితులు నిరాఘాటంగా బస్తీ పిల్లలకు శ్రద్దగా క్లాసులు తీసికొంటున్నారు. రుక్మిణికి ఉత్తమ పౌరసన్మానం చేశాడు పూనా మేయర్. పేపర్లో రుక్మిణి చేస్తున్న సేవ గురించి ప్రముఖంగా వ్రాశారు పత్రికలవాళ్ళు.
ఈ మధ్య రుక్మిణికి తరచూ అనారోగ్యం చుట్టబెడుతోంది. హైదరాబాద్ నుండి చిన్నకొడుకు జితేంద్ర వచ్చాడు.
"అమ్మని హైదరాబాద్ తీసికెళ్తానన్నయ్యా! అక్కడయితే మామయ్య వాళ్ళు కూడా ఉన్నారు కదా! కొంత చోటు మారితే అమ్మ ఆరోగ్యం బాగుపడుతుంది. బంధువుల మధ్య ఉంటే కొంచెం బాగుంటుంది" అన్నాడు జితేంద్ర.
గాలి మార్పుఉంటుందని మహేంద్ర ఒప్పుకున్నాడు.
హైదరాబాద్ వచ్చింది రుక్మిణి. వచ్చిందే కానీ ఆమె మనసు పూనాలోని బస్తీలోని పిల్లలమీదే ఉంది.
'తను లేకపోతే మిగిలిన వాళ్ళు సరిగ్గా చూస్తారా? పిల్లల్ని వదిలేస్తారా! అందరూ రిటైర్ అయిన వాళ్ళే.. ఓపిక లేదని మానేస్తారా!' ఇలా అనుకుంటూ మథనపడుతూ ఎప్పటి కప్పుడు పూనాకు ఫోన్ చేసి కనుక్కుంటూ ఉంది. రెండేళ్ల కాలం గడిచింది.
రుక్మిణి కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ చెయ్యాలంది డాక్టర్.
హాస్పిటల్ లో చేర్చారు పిల్లలు.
ఆపరేషన్ అయింది.
కంటికి కట్టుకట్టారు. రేపు ఇంటికి వెళ్లొచ్చన్నారు.
కళ్ళుమూసుకొని పడుకొని ఉంది రుక్మిణి.
అంతలో లోపలికి ఆపరేషన్ చేసిన డాక్టర్ వచ్చింది. ఆమెతో పాటు ఒక అసిస్టెంట్ కూడా వచ్చాడు.
రుక్మిణిని చూస్తూనే ఆ కుర్ర డాక్టర్ "దాదీ! దాదీ!"అన్నాడు సంతోషంగా.
"నీకు తెలుసా?" డాక్టర్ అడిగింది.
"నాకు తెలుసు.. ఈ దాదీ నాకు ట్యూషన్ చెప్పింది "అని హిందీలో "దాదీ! నేను ప్రతాప్ కర్నేకర్ ని. మీ దగ్గర చదువుకొన్నాను.. గుర్తుపట్టారా!"అన్నాడు.
సంతోషం వేసింది రుక్మిణికి.
అవును. ప్రతాప్.. తమ దగ్గర చదివి మెడిసిన్ ఎంట్రెన్స్ వ్రాసి సీటు తెచ్చుకున్నాడు.
"పూనాలో మనవాళ్ళు అందరూ ఎలా ఉన్నారు ప్రతాప్?"
"అందరూ బాగున్నారు దాదీ! మిమ్మల్ని ఎప్పుడూ తల్చుకొంటూ ఉంటాము. మీ లాగే మనవాళ్ళల్లో కొందరు క్లాసులు తీసికొంటున్నారు. నాకు ఈ హాస్పిటల్ లో ఉద్యోగం వచ్చింది. అందుకని అమ్మానాన్నను తీసికొని ఇక్కడికి వచ్చాను. మీ లాగే శని, ఆదివారాలు దగ్గర్లో ఉండే స్లమ్ ఏరియాకు వెళ్లి క్లాసులు తీసికొంటున్నాను. నాతో పాటు ఇంకా కొంతమంది స్వచ్ఛందంగా చేస్తున్నారు. "
ప్రతాప్ చెబుతుంటే కొత్త బలం వచ్చింది రుక్మిణికి. 'తను వేసిన విత్తనం పెరిగి పెద్దదయి ఇంకొకరికి నీడనిచ్చే వృక్షమయింది. ఇంకేం కావాలి? ఇది చాలు!.. '
ఆమె కనుల నుండి ఆనందబాష్పాలు జలజలా రాలాయి.
"ఛ.. ఛ.. కంటికి ఆపరేషన్ అయిందికదా దాదీ! కళ్లనీళ్లు పెట్టుకోకూడదు!" అంటూ మృదువుగా ఆమె కళ్లనీళ్లు తుడిచాడు ప్రతాప్.
తృప్తిగా నవ్వింది ఆశావాది రుక్మిణి.
(సమాప్తం )
T. V. L. గాయత్రి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
Profile Link:
నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.
నా రచనావ్యాసంగం 2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది. శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.
కథ బాగుందండీ