top of page

ఆశయ పాలన

#ఆశయపాలన, #AsayaPalana, #ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #TeluguStory, #తెలుగుకథ


'Asaya Palana' - New Telugu Story Written By Ch. C. S. Sarma 

Published In manatelugukathalu.com On 28/10/2024

'ఆశయ పాలన' తెలుగు కథ

రచన: సిహెచ్. సీఎస్. శర్మ


"హల్లో!...."


"రేయ్!.... నేనురా!...."


"ఆ.....ఆ.... నీవా ముకుందా!..." నవ్వాడు శివానంద.


"ఎందుకురా నవ్వుతున్నావ్?"


"నీవు కాల్ చేశావుగా అందుకని!"


"ఏరా!... నా కాల్ నీకు అంత చీప్ అయిపోయిందా!..." విచారంగా అడిగాడు ముకుంద.


"నీవు ఎందుకు ఫోన్ చేశావో నేను చెప్పనా!"


"చెప్పు చూద్దాం!"


"నా గెస్ కరెక్ట్ అయితే నీవు నాకు ఏమిస్తావ్?"


"నీవు అడిగింది ఇస్తాను" చెప్పాడు ముకుంద.


"చెబుతున్నా!.... కోప్పడకూడదురే...!" నవ్వాడు శివానంద.


"చెప్పు!..."


"పదకొండవ పెండ్ళి చూపులు!"


ముకుంద ఆ మాట విని ఆశ్చర్యపోయాడు. వెంటనే జవాబు చెప్పలేకపోయాడు.

"ఏరా బామ్మర్ది!... వినబడిందా!" అడిగాడు శివానంద.


"ఆఁ...." అన్నాడు ముకుంద మెల్లగా.


‘వీడికి నేను విషయం చెప్పకుండానే ఎలా తెలిసిందబ్బా!’ స్వగతంలో అనుకున్నాడు.


"ఏ వూరు?"


"నెల్లూరు!"


"ఎప్పుడు చూపులు?"


"రేపే!"


"ఫోన్ ఎందుకు చేశావ్?"


"నీవు నాతో రావాలి కదరా!"


"రేయ్!... పదిరోజుల నాడు జరిగిన నీ గూడూరు దండయాత్రకు వచ్చిన నేను నీతో చెప్పిన మాటలు మరిచిపోయావా!" అడిగాడు శివానంద.


"ఒరేయ్! ఈ ఒక్కసారి రారా!" బ్రతిమిలాడాడు ముకుంద.


"నేను..."


"ఆ నీవు!..."


"నీతో పెండ్లి చూపులకు వచ్చేది ఇదే చివరిసారి"


"సెట్ కావాలని కోరుకోరా!..." దీనంగా అర్థించాడు ముకుంద.


"ఏందీ!"


"సెట్... సెట్ కావాలని!"


"సెట్టు... ఆహా!... ఎంత మంచిమాటరా!... సంబంధం చూచేటప్పుడు నీ భావనలు.... పిల్ల బాగా అందంగా తెల్లగా వుండాలి. బాగా ఉద్యోగం చేసే రీతిగా చదువుకొని ఉండాలి. ఇక నీ తండ్రి కోరికలు... లక్షలు కట్నం ఇవ్వాలి. పిల్ల తెల్లగా వుండాలి. పిల్ల నలుపైతే వంశం అంతా భావిలో నలుపైపోతుంది. ఒక్కపిల్లే అయితే చాలామంచిది. కొంతకాలానికి ఆ వారి ఆస్థి అంతా మాకు చెందుతుంది. ఇలాంటి భావాలు కల మీ తండ్రి కొడుకులకు ఏ పిల్ల అయినా ఎలా నచ్చుతుందిరా!..." ఆవేశంగా చెప్పాడు శివానంద.


"ఒరేయ్!... నా కోర్కెలు తప్పంటావా"


"తప్పు.... తప్పు.... తప్పు...."


"ఏందిరా!.... యాలంపాట పాడినట్లు మూడుసార్లు చెప్పావ్?"


"ఏరా నేను చెప్పింది తప్పా!.... ఒరేయ్!... నీవు నీ తత్వాన్ని మార్చుకోకపోతే, నీకు సంబంధం కుదరడం అసాధ్యం"


"ఏందిరా అలా అన్నావ్?"


"మీ తండ్రి కొడుకుల ధోరణి చూస్తుంటే నాకు అలా అనిపిస్తూ ఉంది"


"ఒరేయ్!..."


"చెప్పు!"


"ఈసారికి ఈ సంబంధం కుదరాలని మంచి మనస్సు చేసికొని రారా!" దీనంగా అడిగాడు ముకుంద.


"సరే!... వస్తాను!"


"సంతోషంరా!... థాంక్యూ!"


శివానంద సెల్ కట్ చేశాడు. నిట్టూర్చాడు.

అతను వుండేది ఒంగోలు. ముకుందవాళ్ల కుటుంబం వుండేది కావలి.


అతని తండ్రి సబ్ రిజిస్టార్. తల్లి మాధురి కాలేజి ప్రిన్సిపాల్. ముకుంద కూడా కాలేజీ లెక్చరర్.

శివానంద ఒంగోల్లో పి.డబ్ల్యూ.డి డిపార్టుమెంటులో అసిస్టెంట్ ఇంజనీర్. ఇరువురూ ఒకే వూరి వారు. స్కూలు, కాలేజీలలో కలిసి చదువుకొన్నవారు. బి.ఎ కాగానే శివానంద ఇంజనీరింగ్. ముకుంద ఎం.ఎ, పి.హెచ్.డి. ముకుంద స్వార్థపరుడు. స్త్రీ అంటే చులకన. శివానందకు స్త్రీలంటే గౌరవం. ఆశయవాది. 

*

మరుసటిదినం ఉదయం ఎనిమిదిన్నరకల్లా శివానంద కావలిలోని ముకుంద ఇంటికి చేరాడు.

ముకుంద సంతోషంతో మిత్రుడికి స్వాగతం పలికాడు. ముకుంద తల్లితండ్రులు మనోహర రావు, మాధవీలకు శివానంద చిన్నతనం నుండి తెలిసియున్నందున ఆప్యాయంగా పలకరించారు. శివానంద తల్లి తండ్రి కరోనా కాలంలో గతించారు. ఒక అక్క సౌదామిని పోలీస్ ఇన్‍స్పెక్టర్. అల్లూరులో వుంది. ఆమె భర్త భాస్కర్ సర్కిల్ ఇన్‍స్పెక్టర్. వారు పనిచేసేది నెల్లూరులో.

కావలి నుంచి కార్లో బయలుదేరి నలుగురూ పదకొండు గంటలకు నెల్లూరులోని పెండ్లి కూతురు ఇంటికి చేరారు.


వధువు తల్లితండ్రులు సీతారామయ్య, శకుంతల. వారి అబ్బాయి దినకర్ సంధాత తిరుమలగారు వారికి స్వాగతం పలికారు. 


"నమస్కారం బావగారూ!..." చెప్పారు అమ్మాయి తండ్రి సీతారామయ్య.


"నమస్కారం... నమస్కారం!..." అబ్బాయి తండ్రి మనోహర్‍రావు జవాబు.


"నమస్తే వదినగారు!" అమ్మాయి జనని శకుంతల విన్నపం.


"ఆఁ... నమస్తే... నమస్తే...!" అబ్బాయి మాతృదేవత మాధవీ సమాధానం.


"కూర్చోండి" సోఫాలు చూపుతూ ఎంతో వినయంగా చెప్పాడు సీతారామయ్య.


వచ్చిన నలుగురూ సుఖాశీనులైనారు.

సీతారామయ్యగారు సంధాత ముఖంలోకి చూచాడు.

ఆ చూపు యొక్క పరమార్థం ఎరిగిన సంధాత తిరుమల.....

"అయ్యా!... మనోహర రావుగారూ!... లైట్‍గా టిఫిన్  సేవిస్తారా? లేక అమ్మాయి గారిని చూచిన తర్వాతనా?" అన్నాడు.


"ముందు టిఫిన్" అన్నాడు పెండ్లికొడుకు. 


హాలుకు ప్రక్కన వున్న పడక గదిలోనుంచి వధువు వసంత వారి సంభాషణను వింటూ వుంది. వరుడు ముకుంద ఆ మాట అనేసరికి ఆశ్చర్యంతో అతని ముఖంలోనికి తొంగి చూచింది వసంత.

’అబ్బిగాడు తిండిపోతులా వున్నాడు’ అనుకొంది.


సీతారామయ్యగారు భార్య ముఖంలోకి చూచాడు.

అమ్మాయి జనని శకుంతల....

"ఐదు నిముషాలు...." అని వేగంగా వంటగది వైపుకు నడిచింది. 


పెద్ద స్టీల్ ప్లేట్లో నాలుగు చిన్న ప్లేట్లు వుంచి అందులో మిక్చర్, మైసూర్ పాక్ ఆ ప్లేట్లలో వుంచి, వేగంగా హాల్లోకి వచ్చి ఆ నలుగురికి అందించింది. నలుగురిలో ముగ్గురు ఆనందంగా తినసాగారు శివానంద తప్ప. 


శివానంద ముకుంద ముఖంలోకి ఆశ్చర్యంగా చూచాడు

ఆ చూపుల్లో అర్థం ’ఓరి వెధవా!... తిండికి వాచిపోయిన వాడిలా నీవు చెప్పిన జవాబు ఏమిటిరా!’ అని.


ముకుంద తింటూ ఒక వికారమైన నవ్వు నవ్వి శివానంద ముఖంలోకి చూచి మెల్లగా....

"తినరా!....." అన్నాడు.


"మా అబ్బాయికి ఆహార వ్యవహారాల్లో మొహమటం లేదు" మూతి మూడువంకరలు త్రిప్పి తినసాగింది తల్లి మాధవి.


ఆ తల్లికొడుకులు మాటలకు సీతారామయ్య, వారి అర్థాంగి శకుంతలా ఒకరి ముఖాలు ఒకరు చూచుకొన్నారు.

దాని భావన... ముగ్గురూ తిండిబోతుల్లా వున్నారని అర్థం...

శకుంతల నలుగురికీ మంచినీటి గ్లాసులను అందించింది. 

ఆ తరువాత కాఫీ గ్లాసులు....

అరగంటలో వధువు బృంద పలహార కాఫీ సేవనం ముగించారు.


"అయ్యా!... టిఫిన్, కాఫీ అద్భుతం" నవ్వుతూ చెప్పాడు సంధాత తిరుమల.


"మరి ఇక అమ్మాయిని రమ్మనండి." అన్నాడు మనోహరరావు.


శకుంతల బెడ్ రూములోకి వెళ్ళి పెండ్లి కూతురు వసంతతో కలిసి హాల్లోకి వచ్చారు. అందరికీ నమస్కరించింది.

వసంత పెండ్లి కొడుకు ముకుందకు ఎదురుగా కూర్చుంది. ఒక్కక్షణం ముకుంద ముఖంలోకి చూచి తలదించుకొంది. 


‘పర్సనాలిటీ సుమారు. గుణం సరే. తిండిబోతు అని అర్థం అయింది. చామనఛామ అయిన ఇతని కంటే వీరి మిత్రుడే బాగున్నాడు’ అనుకొంది వసంత.


"అయ్యా ముకుందగారు!... అమ్మాయిని ఏమైనా అడగాలనుకొంటే అడగండి" చిరునవ్వుతో చెప్పారు సంధాత తిరుమల.


"నేను పర్సనల్‍గా మాట్లాడాలి!" అన్నాడు ముకుంద.


వెంటనే వసంత కుర్చీనుంచి లేచి బెడ్ రూమువైపుకు నడిచింది.

"పోరా!..." అన్నాడు శివానంద.


ముకుంద చిరునవ్వుతో వసంత వెనుకాలే నడిచాడు.

ఇరువురూ బెడ్ రూములో ప్రవేశించారు.

"మీ పేరు?" అడిగాడు ముకుంద.


"వసంత మామిడాకుల" చెప్పింది వధువు.


"మామిడాకులు ఏంది?"


"మా ఇంటిపేరు"


"మీరు ఎంతవరకు చదివారు?"


"ఎం.ఎస్సీ గోల్డ్ మెడలిస్టు"


"మీకు సంగీతం, నాట్యం వచ్చా!"


"రావు!"


"మీరు నా ఇష్ట ప్రకారం ఉద్యోగం చేయాలి చేస్తారా!"


"మీ ఇష్ట ప్రకారం కాదు... నా ఇష్ట ప్రకారం!"


"అంటే!...."


"మీరు నన్ను ఉద్యోగం చేయమని నిర్భంధం చేయకూడదు. అవసరాలను బట్టి అది నా ఇష్టం!"


"వివాహం అయిన తరువాత నా ఇష్టం నీ ఇష్టం కాదా!"


"నీ కాదు మీ!... మర్యాద!...."


ముకుందుడు ఆ జవాబుకు ఆశ్చర్యపోయాడు. తెప్పరిల్లుకొని...

"మీ జీవితం ఆశయం?"


"నా తల్లిదండ్రుల వలే అత్తామామలను చూచుకోవడం.  నా జీవిత గమనం కేవలం నా స్వార్థానికి కాకుండా సాటి పదిమంది మనుషులకు ఉపయోగపడే రీతిలో సభ్యసమాజంలో నడుచుకోవడం!..." 

కొన్ని నిముషాలు మౌనంగా వుండిపోయాడు ముకుంద.


’ఏందిరా ఈ పిల్ల ఇంత టెంపర్‍గా ఉంది?’ అనుకొన్నాడు.


"నేను మీకు నచ్చానా!"


"ఈ ప్రశ్నకు జవాబు మా అమ్మా నాన్నలు చెబుతారు!"


"మీరు నన్ను ఏమైనా అడగాలా!"


"అనవసరం!"


"అంటే!...." 


"మీ ప్రశ్నలే మీరు ఎలాంటి వారు అనే విషయాన్ని నాకు తెలియజేశాయి! ఇంకా ఏమైనా అడగాలా!" ప్రశ్నార్థకంగా ముకుంద ముఖంలోకి చూచింది వసంత.


ముకుంద ముఖంలో రంగులు మారాయి. మౌనంగా ఆ గది నుండి బయటికి నడిచాడు. సోఫాలో శివానంద ప్రక్కన కూర్చున్నాడు.

"ఏరా!.... ఓకేనా!" మెల్లగా తలవంచి అడిగాడు శివానంద.


"ముకుంద ఓకేనా!" తల్లి మాధవి ప్రశ్న.


"ఓకే అమ్మా!" తలాడించాడు ముకుంద.


"సంతోషం అయ్యా!... సీతారామయ్యగారు అబ్బాయి సమాధానం విన్నారుగా. ఇక ఆపై మాట చెప్పండి." అన్నాడు సంధాత తిరుమల.


"ఐదు లక్షలు కట్నం ఇతర లాంఛనాలన్నింటికీ ఒక లక్ష. మొత్తం ఆరు లక్షలు ఇస్తానండి" ఎంతో వినయంగా చెప్పాడు సీతారామయ్య.


"కుదరదండీ!.... పది... పది ఇవ్వాలి. ఓకే అంటే మా వైపు నుండీ ఓక్!.... లేని పక్షంలో" మనోహరరావు పూర్తి చేయకముందే...

"ఆగండి... ఆగండి!.... అయ్యా సీతారామయ్యగారూ!... వారి వాంఛను విన్నారుగా తమరు కొంచం పైకి ఎక్కాలి!..." నవ్వుతూ చెప్పాడు సంధాత తిరుమల.


"స్వామీ!... తిరుమలగారూ!... ఎవరూ నేలవిడిచి సాము చేయలేరుగా.. నేను చెప్పింది నా స్థితి. అన్ని విధాలా ఆలోచించుకొనే ఆ మాట చెప్పాను. అంతకుమించి నేను ఏమీ చేయలేను" ఎంతో సౌమ్యంగా చెప్పాడు సీతారామయ్య.


"ఇదే మీ ఫైనల్ మాటనా?" అడిగాడు మనోహర రావు.


"అవును సార్!" మెల్లగా చెప్పాడు సీతారామయ్య.


వెంటనే మనోహరరావు సోఫా నుండి లేచాడు. భార్య కుమారుల ముఖాల్లోకి చూచాడు.

"ఇక లేవండి వెళదాం" ఆవేశంగా అన్నాడు.


"మామయ్యా! మీరు ఒక్కసారి..." శివానంద ఏదో చెప్పబోయే లోపలే....

"రేయ్!... శివనందా!... నీవు నాకు చెప్పేవాడివా!" తీక్షణంగా శివానంద ముఖంలోకి చూచాడు మనోహరరావు.


ఆ తండ్రి, తల్లి కొడుకులు ఇంటినుండి బయటికి నడిచారు. వారి వెనకాల సంధాత తిరుమల. అతని వెనుక శివానంద.


ముందుకు నడువబోయిన తండ్రి సీతారామయ్య చేతిని పట్టుకొంది వసంత.

ఆమె ముఖంలోకి దీనంగా చూచాడు సీతారామయ్య.


"నాన్నా!... అమ్మా!... అతను నాకు నచ్చలేదు" నిశ్చల స్వరంతో అంది.


శకుంతల ఆశ్చర్యంతో కూతురు ముఖంలోకి చూచింది.

"అవునమ్మా!... నేను చెప్పింది నిజం. అతని ప్రసంగం, అతను నాకు నచ్చలేదు. వీడు కాకపోతే మరొకరు!... బాధపడకండి!" అంది వసంత.


కారు ఎక్కబోయే ముందు శివానంద ఒకసారి ఆ ఇంటివైపుకు చూచాడు వసంత కనిపిస్తుందని. కనిపించలేదు.


కానీ..... వసంత తన బెడ్ రూము కిటికీ గుండా వారినందరినీ చూచింది.

*

కారును నడుపుతున్న శివానంద బస్టాప్ దగ్గర కారును ఆపి దిగాడు.

"రేయ్!.... ముకుందా!... నేను నేరుగా బస్సులో వెళతాను. నీవు కారును డ్రైవ్ చెయ్యి" అన్నాడు శివానంద.


"నేనూ నీతో వస్తానురా!" ముకుంద కూడా కారుదిగి....

"నాన్నా!... నేను తరువాత వస్తాను. మీరు కారును నడపండి" అన్నాడు.


"సరే నీ ఇష్టం!...." మనోహరరావు కారు దిగి డ్రైవర్ సీట్లో కూర్చొని కారును స్టార్ట్ చేశాడు.


ఇద్దరు మిత్రులు నిట్టూర్చి ఒకరినొకరు కొన్ని క్షణాలు చూచుకొన్నారు.

"ఏరా నీవెందుకు దిగావు?" అడిగాడు శివానంద.


"నీవు ఇలా దిగిపోవడం నాకు నచ్చలేదురా!... అందుకే దిగాను..."


"ఊఁ..... పదకొండవ పెండ్లి చూపులూ విఫలమే కదా!..."


"అవును... ఆ పిల్లకు చాలా గర్వంరా!"


"అలాగా!...."


"అవును...."


"నీకు ఎలా తెలిసింది?"


"ఆ పిల్లతో నేను మాట్లాడానుగా!"


"ఏం మాట్లాడావు?"


"ఉద్యోగం చేయాలన్నాను!"


"ఆమె ఏమంది?"


"చేసేది... చేయనిది తన ఇష్టం అంది. పెండ్లి అయిన తరువాత నేను ఎలా చెబితే తాను అలా నడుచుకోవాలి కదరా!"


"ఒరేయ్!... స్కూలు కాలేజీ రోజుల్లో నీవు పదే పదే వల్లే వేసిన ఆ ఆశయాలనన్నింటినీ మరచిపోయావా!"


"రేయ్!... నేటి ప్రపంచంలో ఆశయాలు కేవలం వల్లె వేయడానికి మాత్రం పనికొస్తాయి. ఆచరణకు అందవు. అంతా డబ్బు... డబ్బు.... డబ్బు లేనిదే ఎవరూ ఏమీ చేయలేరు. ఇది నా స్వానుభవం..."


"అలాగా!..."


"అవును..."


"నీ జీవితం నీ ఇష్టం. అదుగో బస్సు కదులుతూ ఉంది. నే వెళుతున్నాను." పరుగున వెళ్ళి శివానంద ఒంగోలు బస్సు ఎక్కాడు. 


బస్సు బయలుదేరింది. ముకుంద నిట్టూర్చి బయలుదేరిన బస్సును చూస్తూ వెర్రివానిలా నిలబడ్డాడు.

*

వారంరోజులు తర్వాత శివానంద నెల్లూరికి వచ్చాడు. సీతారామయ్యగారి ఇంటికి వెళ్లాడు.

అతన్ని చూచిన సీతారామయ్య, శకుంతల విస్మయంతో అతని ముఖంలోకి చూచారు.

"సార్!... నమస్కారం. నేను మీతో మాట్లాడాలని వచ్చాను" చేతులు జోడించాడు.


"రండి బాబు కూర్చోండి" సోఫాను చూపాడు సీతారామయ్య.


శకుంతల వంటగదిలోకి వెళ్ళి మంచినీటి గ్లాసును తెచ్చి శివానందకు చిరునవ్వుతో అందించింది.

"బాబూ!... కాఫీ తాగుతావా!" అడిగింది శకుంతల.


"మంచినీరు చాలమ్మా!... కాఫీ వద్దు."


మంచినీరు త్రాగి గ్లాసును టీపాయ్ పైన వుంచాడు శివానంద.

"విషయం!..." ఆగాడు శివానంద.


"ఏమిటో చెప్పండి బాబు!" మెల్లగా అడిగాడు సీతారామయ్య.


"నాకు తల్లి తండ్రి లేరు. అక్కా బావ అల్లూరులో వున్నారు. నా జీవితానికి సంబంధించిన విషయాలను నన్నే నిర్ణయించుకోమని, అది ఏదైనా సరే వారికి సమ్మతం అని, వారు నాకు చెప్పారు. నేను ఒంగోలులో పి.డబ్ల్యూ.డి డిపార్టుమెంటులో ప్రవైట్ ఇంజనీరుగా పనిచేస్తున్నాను. మీకు అభ్యంతరం లేకపోతే.... మీ అమ్మాయిగారికి నేను నచ్చితే నేను ఆమెను వివాహం చేసుకొంటాను. నాకు కట్నకానుకలు అనవసరం. నేను చిన్ననాడు నా గురువులు నేర్పిన ఆ ధర్మాలను పాటించేవాడిని. అలా చేయడం వలన నాకు తృప్తి ఆనందం కలుగుతుంది. వివాహ విషయంలో నా నిర్ణయం అలాంటిదే. మరోమాట, నా అర్థాంగి ఉద్యోగం చేయనవసరం లేదు. హౌస్ వైఫ్‍గా తన బాధ్యతలను నిర్వర్తిస్తే నాకు సంతోషం. అదే నా ‘ఆశయపాలన" చిరునవ్వుతో ఎంతో వందనంగా చెప్పాడు శివానంద.


అతని మాటలకు సీతారామయ్య, శకుంతలలు తమ చెవులను తామే నమ్మలేకపోయారు. ఆశ్చర్యంతో శివానంద ముఖంలోకి చూచారు.


"సార్!,.... మీరు మీ సమ్మతిని తెలియజేస్తే, నేను ఆ విషయాన్ని మా అక్కా బావలకు చెప్పి వారిని మీ ఇంటికి పంపుతాను. ఒకవేళ నా నిర్ణయం మీకు నచ్చకపోతే, ఆ విషయాన్ని మీరు నాకు చెబితే, నేను ఏమీ మీ గురించి తప్పుగా అనుకోను. ఈ రోజు ఆదివారం బహుశా మీ అమ్మాయిగారు కూడా ఇంట్లోనే వున్నారనుకొంటాను. ఆమెతో కలిసి మాట్లాడి మీ నిర్ణయాన్ని తెలియజేయండి సార్!" అనునయంగా చెప్పాడు శివానంద.


వసంత తన బెడ్‍రూం ద్వారం ప్రక్కన శివానందకు కనపడకుండా నిలబడి అతని మాటలన్నింటినీ విన్నది. సీతారామయ్య శకుంతలలు వసంత గదిలో ప్రవేశించారు. వారిని చూచిన వసంత ఆనందంగా నవ్వింది. సిగ్గుతో తలదించుకొంది.


"అమ్మా!..." మెల్లగా పిలిచాడు సీతారామయ్య.


"నాన్నా!... మీ ఇష్టమే నా ఇష్టం!" అంది వసంత.


సీతారామయ్య శకుంతల ముఖాల్లో పున్నమి జాబిలి మెరుపులు. వసంత చేతిని తన చేతిలోనికి తీసుకొని సీతారామయ్య, శకుంతలలు హాల్లోకి వచ్చారు. సోఫానుండి శివానంద ఆశ్చర్యంతో లేచాడు.


"బాబూ!... మీ నిర్ణయం మాకు పరిపూర్ణ సమ్మతం" ఆనందంగా చెప్పాడు సీతారామయ్య.


శివానంద క్షణంసేపు వసంత ముఖంలోకి చూచి "వెళ్ళొస్తానండి" చిరునవ్వుతో చెప్పి ముందుకు నడిచాడు. 


"సార్!..... అన్నయ్యా వదినలతో మీరూ రండి" చిరునవ్వుతో కోకిల కంఠంతో పలికింది వసంత.

వెనుతిరిగి క్షణంసేపు ఆమె ముఖంలోకి చూచి ముందుకు నడిచాడు శివానంద


సమాప్తి


సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


37 views0 comments

Comentarios


bottom of page