#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #BulusuRavisarma, #బులుసురవిశర్మ, #Asha, #ఆశ
Asha - New Telugu Poem Written By - Bulusu Ravi Sarma
Published In manatelugukathalu.com On 24/01/2025
ఆశ - తెలుగు కవిత
రచన: బులుసు రవి శర్మ
కిటికీ చువ్వల నుండి
దూకిన ప్రభాత కిరణాలు
ఏటవాలుగా
దుమ్ముతో ఆడుకుంటాయి
నేల మీద ఎవరో సాగదీసినట్టు
కిటికీ ఆకారాన్ని
చువ్వలు కోసాయి
ప్రక్కగా కర్టెన్ ముడుచుకొని
అప్పుడప్పుడు కదులుతూ
కుచ్చిళ్ళు సవరించు కుంటుంది
నేల మీద వెలుగు
గది కప్పు మీద
పరావర్తనం చెంది
ఫ్యాన్ రెక్కల్లో చిక్కుకున్న గాలిపటంలా కదులుతోంది
ఇప్పటివరకు
రాజ్యమేలిన చీకటి
బీరువా క్రింద దాక్కుంటోంది
పొద్దు ఎక్కే కొద్ది వెలుతురు
మెల్లగా వెనక్కి జరుగుతూ
కిటికీ నీడను
తనవైపు లాక్కుంటూ
మళ్లీ చీకటికి
గదిని అప్పజేపుతుంది
రేపటి కిరణాల కోసం
ఆశగా ఎదురు చూస్తుంది
మంచం మీద
మనిషి లాటి ఆకారం
-బులుసు రవి శర్మ
Comments