top of page

అష్టమ రాగం

#DrKanupuruSrinivasuluReddy, #కనుపూరుశ్రీనివాసులురెడ్డి, #అష్టమరాగం, #AshtamaRagam, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు, #సామజికసమస్యలకథలు


'Ashtama Ragam' - New Telugu Story Written By Dr. Kanupuru Srinivasulu Reddy

Published In manatelugukathalu.com On 09/10/2024

'అష్టమ రాగం' తెలుగు కథ

రచన : డా. కనుపూరు శ్రీనివాసులు రెడ్డి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



రాత్రి ఎలాంటి ఉదయాన్ని ఇస్తుందో తెలియదు? ఆహ్లాదకరమైనదో, సమస్యల మయిమైనదో? 


ఈ మనసుకు ఎప్పుడు గ్రహణం పట్టుతుందో తెలియదు? దుష్ట ఆలోచన, అంతరాత్మను ఆక్రమించుకుని, వక్రపు దారి చూపిస్తుంది, యువతకు తిరుగుబోతులకు!! 


చీకటి పడగానే మెదడు కలుగుల్లోనుంచి వికృత రూపాలతో దూసుకు వచ్చి, రోడ్డునపడి వీరవిహారం చేస్తూ, పెడబొబ్బలు పెడుతూ, ఎందరి హృదయాలలో ఆర్తనాదాలు హాలాహలాలు నింపుతాయో? శబ్దంరాని నిశ్శబ్దంలోకి కలిసిపోతాయో? 


“అమ్మా !”అనే హృదయ విదారకమైన ఆర్తనాదం!!


భూమి బ్రద్దలయ్యిందో, పైకప్పు విరిగి నెత్తిన పడిందేమో అని ఉలిక్కిపడ్డాడు డాక్టర్ రేవంత్. 


ఇంతసేపు తనను వేధిస్తున్న ఆలోచనలన్నీ, ఒక్క సారిగా పారిపోయి, మెరుపు మెరిసి పిడుగుపడి వెంటనే చిమ్మ చీకటి కమ్మేసింది. తను ఏం చేస్తున్నాడో, ఎక్కడున్నాడో? ఆ క్షణంలో అర్ధంకాలేదు!?


కాస్త తేరుకుని చూస్తే, తన హాస్పిటల్రూంలో తలుపులన్నీ బిగించుకుని, ఒంటరిగా కూర్చున్నట్లు గమనించాడు.


ఏమిటా శబ్ధం? ఆతృత కన్నా వెను వెంటనే కమ్ముకున్న నిశ్శబ్దం, అతన్ని కదల నివ్వలేదు.చీమ చిటిక్కుమనేంత నిశ్శబ్దం. గుండెల్లో పెల్లుబికిన వేదనతో అణిచి వేయబడిన నిశ్శబ్దం!! వెను వెంటనే బాధను భరించలేక, ఆపులేకుండా చిన్న బిడ్డ ఏడుపు, కుక్కల అరుపులు వినిపించాయి.. రేవంతుకు గుండెలు పిండినట్లనిపించి, ఊపిరి బిగదన్నేసినట్లు అయ్యింది. 


విసురుగా లేచి తలుపులు తోసుకుని బయటకొచ్చాడు. ఎదురుగా హాస్పిటల్ స్టాఫ్ భయంతో అర్ధంగానట్లు, ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటూ నిలుచోనున్నారు. బిడ్డ ఏడుపు, కుక్కల అరుపులు ఎక్కువయ్యాయి. అందరూ, ఒక్కసారిగా దాడి చేసినట్లు, కేకలు పెడుతూ వాటి వెంట పరుగెత్తారు.


కుక్కలు, బిడ్డను ఎత్తుకెళుతున్నట్లు తెలుస్తుంది. ఏడుపు కూడా అరుపుల వెంట పోతూ వుంది. విషయం అర్ధం అయి, రేవంత్ కూడా వాళ్ళ వెంట పరుగెత్తాడు.


కుక్కల అరుపులు ఆగిపోయాయి. బిడ్డ ఏడుపు ఆగలేదు. ఎటు వైపునించి వస్తుందో ఏడుపు, ఆ చీకటిలో గమనించడానికి సమయంపట్టింది.


“ఈ వైపు లైటు వెయ్యండి. !”అని గట్టిగా అరిచాడు రేవంత్. 


ఏం జరిగిఉంటుందో అని ఆలోచన వచ్చేసరికి, ఒక్కడుగు ముందుకు వెయ్యలేక పోయాడు రేవంత్. తెలియకనే శరీరమంతా చెమటతో తడిచి పోయింది. ఎందుకో తెలియని ఆత్రుత, భయం, అతన్ని కదలనివ్వకుండా చేసింది.


బిడ్డను తీసుకుని రేవంతు దగ్గరకు వస్తూ “నయం, పెద్దగా గాట్లు ఏం లేవు సార్! అవి కొట్లాడుకుంటూ బిడ్డను వదిలేసాయి” ఆయాసపడుతూ, రేవంతుకు కనిపించేటట్లు చూపించి, ”ఇప్పుడే పుట్టినట్టుంది సార్! ఇంకా రక్తం కూడా ఆర్లేదు. ఆడపిల్ల సార్ !” అన్నాడు, పెద్ద వార్డు బాయ్ సుబ్బయ్య. 


ఆ మాటతో రేవంత్ ముఖంలో ఎన్నెన్నో రంగులు మారాయి!!

ఆడపిల్లని తెలిసి పారేసారో, అసలు వద్దు అని వదిలించుకున్నారో తెలియదు. బాధవేసి ఆలోచించ లేక పోయాడు రేవంత్. 


ఇలా హాస్పిటల్లో అప్పుడప్పుడు జరగడం సహజం, చాలా దారుణం కూడా! 

స్టాఫ్ అంతా ఆ బిడ్డ చుట్టూచేరి, ఏదో చెయ్యాలని ప్రయత్నిస్తున్నా, చూపులన్నీ అగ్నిగుండంలా రగిలిపోతున్న డాక్టరు రేవంత్ మీదనే ఉన్నాయి.


 “ఎలా జరిగింది? ” అనే అరుపుకు గుండెలు దడదడలాడాయి. అక్కడున్న వాళ్ళకు చెమటలు పట్టాయి, ఏం మాట్లాడాలో తెలియక. ఏం జరుగుతుందోనని, ఉద్వేగాన్ని అరచేతుల్లో పెట్టుకుని, బిక్కుబిక్కు మంటూ తలలొంచుకుని నిలుచున్నారు.

“సార్!” అనే పిలుపుతో వెనుదిరిగి చూసాడు.


“ఇప్పుడే ఒక డెలివరీ కేసు వచ్చింది సార్! వాకిట్లోనే అయిపోయింది. అదీ ఇదీ వెతుక్కునే లోగా, బిడ్డాలేదూ, వాళ్ళూలేరు. అందుకని !? వెళ్ళిపోయారని.. ఇలా చేస్తారని అనుకోలేదు. అంతా క్లీన్చేసి, మీతో చెప్పదామా వద్దా అని.. ఆలోచించే.. మాదే తప్పు !!” అంటూ స్టాఫ్ లో ఒకతను ముందు కొచ్చాడు.


బహుశా తనకు వినిపించిన అరుపు అదేనేమో?“ఎంతసేపయ్యింది?”


“ఎంతో సేపు కాలేదు సార్.. ఇప్పుడే !!”


“వెతకండి. పరుగెత్తండి అందరూ?” అంటూ కసురుకున్నాడు, డాక్టరు రేవంత్. 


చూస్తున్నాడు. ఆ బిడ్డనే తదేకంగా చూస్తున్నాడు.పాపం ఏం చేసిందని ఇంత నిరాదరణ? పుట్టడం, ఆ బిడ్డ చేసిన తప్పుకాదు కదా!!కసాయి వాళ్ళ కంటే కిరాతకులుగా ఉన్నారు. దొరికితే వాళ్ళను వదలకూడదు.ఆ బిడ్డకు, ఎలాంటి పరిస్థితుల్లో ఎక్కడ ఎవరితో ఉన్నామో, అనే జ్ఞానమే ఉండదు. కానీ ఆకలి తెలుస్తుంది. నొప్పితెలుస్తుంది!!

నోటి దగ్గర వేలు పెడితే, ఆవురావురుమని చప్పరిస్తుంది. ఎవరిచ్చారు ఈ జ్ఞానం? ఈ స్పృహ అంతు చిక్కని అనంత విశ్వంలోని మర్మం. మరో నిముషం ఆలస్యమైతే పరలోకానికి వెళ్ళిపోయి ఉండేది.


తను రాలేదు, బలవంతంగా అనవసరంగా కర్కోటకంగా లాక్కొచ్చి పడేసారు. దిక్కు లేకుండా వదిలేసా. ఇది నిజంగా అక్రమ సంబంధపు బహుమానమే !!

“సార్” అనే మాటతో, ఈ లోకం లోకి వచ్చాడు డాక్టర్రేవంత్.


ఎదురుగా, భయంతో వణికిపోతూ సిగ్గుతో తలదించుకున్న ఇద్దరు స్త్రీలను నిలబెట్టి, చుట్టూ చేరారు సిబ్బంది.


తలంతా చెదిరిపోయి, కళ్ళు పీక్కు పోయి, గుడ్డలు రక్తంతో తడిచి పోయి, కూలబడి పోతుందేమోనన్నంత బలహీనంగా, పద్నాలుగు, పదిహేను సంవత్సరాల యువతి !!

ఆ అమ్మాయికి ఆసరాగా నిలబడి, దరిద్రాన్నంతా తన నెత్తిన కుమ్మరించుకుని, అవమానంతో, దిగులుతో, ఎండిపోయి కాంతి లేని కళ్ళతో ఒక సారి రేవంతును చూసి తల దించకుంది మధ్య వయస్సులో ఉన్న మరొక ఆమె. 


చీకటిలో సరిగ్గా కనిపించలేదు. శోకదేవత, దరిద్ర దేవత కలిసి వచ్చారేమోననిపించింది రేవంతుకు.వెంటనే అమానుషంగా ప్రవర్తించారని, కర్కోటకులని చాలా అసహ్యం వేసింది. 


రగిలిపోతున్న తన కోపం, , , కానీ విచక్షణ, కాస్త ఆగు ! వాళ్ళు ఏ పరిస్థితుల్లో అలా చెయ్యాల్సివచ్చిందో? అని విజ్ఞత హెచ్చరించింది. ఏ కారణమైనా బిడ్డను దిక్కులేకుండా, వదిలేయడం క్షమించరాని నేరం !!


కోపంగా, చిన్న అమ్మాయిని చూసాడు. తూలి పోతున్నట్లు ఏ క్షణంలో నయినా నేలకు ఒరిగి పోగలదు అని అనుకుంటుండగానే, ఆ అమ్మాయి కాళ్ళపై నుంచి నేలపై కారుతున్న రక్తాన్ని చూసి పట్టుకోమని చెపుతూ ” సిస్టర్! ఆ రక్తం ఎందుకు వస్తుందో చూడండి. ప్లాసాన్టా.. మాయ పూర్తిగా వచ్చేసిందో లేదో చూడండి. వెంటనే సెలైన్ స్టార్ట్ చెయ్యండి. ఆ డ్యూటీ డాక్టర్ని రమ్మని చెప్పండి ” అంటూ తొందరచేసాడు రేవంతు.

చిన్నవయస్సులో కాన్పు జరగడం, అదీ మొదటిది అయినందు వలన, అలా జరిగి ఉండొచ్చు. ఆలస్యం అయితే ప్రమాదమే ! ఆత్రుతను అణుచుకోలేక పోయాడు. 


ఆ అమ్మాయిని, జవురుకున్నట్లు ఎత్తుకుని లోపలికి తీసుకెళ్ళారు నర్సులు. 

తల్లి కదల్లేదు. అలాగే కూలబడిపోయింది. తల దించుకుని ఉండిపోయింది.

ఏమిటీ మనిషి, ఎంత కర్కోటకురాలు, నిమ్మకు నీరెత్తినట్లుంది? అసహ్యం కలిగింది. 

 బహుశా అనుకోని పరిణామాలకు భయపడి, దిగులు పడి, ఏం చెయ్యాలో తోచక అలా ఉందేమో? 


అయినా కోపంగా ఆమెను చూస్తూ “ఎందుకు ఇంత కిరాతకంగా చేసావ్? ఆ పసికందును, అంత నిర్ధాక్షణ్యంగా ఎలా వీధిలో పారేసిపోతావు.. నువ్వు మనిషివేనా? ఆడదానివి కానేకాదు” తన కోపాన్ని అదుపు చేసుకోలేక పోయాడు రేవంత్. 


ఆమె ఒక్క మాటకూడా మాట్లాడలేదు. ఇంకా కుంచించుకు పోయి, తలను చేతుల్లో దాచుకుని, బాధను ఆపుకోలేక ఏడుస్తున్నట్లు అనిపించింది.ఆ అవతారాన్ని చూస్తే, ఎన్నో రోజుల నుంచి తిండి, నిద్ర లేనట్లు అనిపించి బాధ వేసింది. గుడ్డలు నలిగి మాసిపోయినా కాస్త ధరగల పాతబడినవిగా అనిపించాయి. 


“ఎంగిలి కూడని ” అంటూ ఆమె నెమ్మదిగా తలెత్తి పైట చెంగుతో కన్నీటితో తడిచిన ముఖం తుడుచుకుని, చెమటతో తడిసిన వెంట్రుకలను, ముఖం మీద నుంచి తప్పించింది.


ఎండిపోయి ఉన్న, ఆ ముఖంలో నిరాశా నిస్పృహల దాగుడు మూతలు కనిపించాయి. వేదన విరక్తి, నల్లమబ్బుల్తో కలిసి పచార్లు చేస్తునట్లు. ముందూ వెనుక అగడ్తలున్నట్లు, అడుగు ముందుకు వెయ్యాలన్నా ఒక్క మాట చెప్పాలన్నా వణికి పోతున్నట్లు అనిపించింది.


చలించాడు రేవంతు. ఎక్కువ సేపు చూడలేక, “గుట్టుగా అనాధ శరణాలయంలో..?”

“అలాగే అనుకున్నాను. ఈ లోగా ఇలా..? ఏం చెయ్యాలో తోచలేదు, పైగా మా ఆడ్రసు.. !”


“అడ్రసు ఎప్పుడైనా తెలుస్తుందిగా !” అన్నాడు రేవంత్. 


“తెలిసుండేది కాదు. ఇప్పుడు కూడా నా బిడ్డ స్పృహ తప్పి పోకుండా, పడి పోకుండా ఉంటే మీకూ తెలిసుండేది కాదు?” మళ్ళీ ముఖాన్ని చీరతో తుడుచుకుంటూ అంది. 


అప్పుడు అర్ధం అయ్యింది ఎందుకు దొరికారో రేవంతుకు. 

“దగ్గరుండి. నీ బిడ్డకు బాగయిన తరువాత ఇద్దర్నీ తీసుకెళ్ళు !! లేకుంటే పోలీసుల్ని పిలిపించాల్సి వస్తుంది. సమస్యలు చుట్టు కుంటాయి. మీడియా.. చాలా అవమానాలు పడాల్సివస్తుంది. ”


“ఇప్పుడు గాకనా !ఆ బిడ్డ పుట్టగానే చచ్చుంటే చాలా వరకు సమస్య తీరుండేది!” 


 ఆ మాటలోని క్రూరత్వానికి తెగింపుకు ఆశ్చర్య పోయాడు రేవంత్. అలాగే చూస్తుండిపోయాడు. 

గాఢంగా నిట్టూర్పు వదులుతూ, “మాకు అనవసరం. నువ్వు తీసుకెళ్ళకపోతే, ఇప్పుడే పోలీసుల్ని పిలిచి, కాపలా పెట్టిస్తాను” అన్నాడు రేవంత్. 


“ఏం, మూడు శవాల్ని మునిసి పాలిటీ వాళ్ళు ఎత్తయ్యలేరా?”


ఆ మాట విని నిరుత్తురడయ్యాడు రేవంత్. చెమటలు పోసాయి.“ఆ పసికందును చంపుతావా?”


“మేం కూడా కలిసి చస్తాం అంటున్నాను. విధిలేదు. నాకు భయపడి దాచుకుంది. నాకు తెలిసి ముక్కలు చెయ్యలేనంత పెరిగి, మా ప్రాణానికి వచ్చింది. ఆ బిడ్డను పెంచి నా బిడ్డకు జీవితం లేకుండా చెయ్యలేను, తప్పదు!!”


ఆ మాటల్లోని తెగింపుకి నివ్వెర పోయాడు. అది నిజం. ఈ సమాజంలో అంతకన్నా గత్యంతరం లేదు.

“మరెందుకు పంపించావు, కడుపు తెచ్చుకోమని? అలా ఎలా పెంచావు? ఆడపిల్లను !” తూటాల్లా దూసుకు వచ్చాయి రేవంత్ మాటలు. 


”డాక్టరుగారూ !” 


ఆమె అరుపుతో ఉలిక్కిపడి ఆశ్చర్యంగా చూసాడు రేవంత్. 

“చెడిపోలేదు, చెరచబడింది. నాకు మొగుడు లేడు. ప్రభుత్వ సారాయికి సమర్పించుకున్నాను. 


‘ఒంటరిగా ఉన్నావు అయ్యో! పాపం !’ మాటల్లో జాలి చూపిస్తూ కళ్ళల్లో వ్యామోహాన్ని పొంగించుకుని దాచుకోలేక ప్రేమగా తప్పుడు కూతలు కూస్తూ ఈ మగాళ్ళందరూ “మేం కట్తాం తాళి. అయినా అదెందుకు? కలిసి ఉందాం రా ! ఒక్కసారికి ఇంత, గంటకింత, రోజుకు అంత” అని నా మాంసపు బలుపుకు వెలకట్టలేం అన్నట్లు చప్పరిస్తూ నన్ను వేధించుకు తిన్నారు.


 సభ్య సమాజం - ఒంటరి ఆడది, అంగడి వస్తువుల రంగస్థలం !! అన్నింటిని ఎదిరించి, ఆడపిల్ల ఉందని అదుపులో బ్రతికాను. ఎంతో చక్కగా, ఎంతో గొప్పగా.


 ఎన్నో ఆశలతో భవిష్యత్తును సొంతం చేసుకోవాలనుకున్నా! ఆ పసిడి మొగ్గను చదువుల సరస్వతిని, నా ఒక్కగానొక్క ఆశాదీపాన్ని, డబ్బు పదవితో మదించి పోయిన ఈ నడిమంత్రపు సిరి గాళ్ళు, న్యాయాన్ని చట్టాన్ని చెప్పుక్రింద అణిచి, భద్రతను సారాయి గ్లాసుల్లో పోసి, మానమర్యాదలు మంట కలిపి, అడ్డంగా పెరిగిన పోరంబోకు గాడిద కొడుకులు నా చిన్నారి తల్లిని ఎత్తుకుపోయి చెరిచి రక్తం మడుగులో రోడ్డు మీద పారేసారు.

 

ఆ రోజు రాత్రి ఎక్కని పోలీసుస్టేషను లేదు. తెలిసిన ప్రజా ప్రతినిధులందరి దగ్గరకు పరుగులు తీసి వేడుకున్నాను. నా ఎద చూసారే గానీ దాని వెనుక ఏముందో వాళ్ళకు కనిపించలేదు. ఏం చెయ్యలేక నిద్రాహారాలు మాని తల బాదుకుంటూ ఏడుస్తూ కూర్చుంటే, ఏం జరగలేదని నా బిడ్డ పదే పదే నమ్మకంగా చెప్పింది, నన్ను తృప్తి పరచడానికని గ్రహించలేక పోయాను.


 గ్రహించినా ఏం చెయ్యలేని ఆశక్తురాలిని. ఆడదాన్ని. అక్రమంగా పుట్టిన ఆ బిడ్డను నేను పెంచలేను, చంపలేను. అందుకే హాస్పిటల్లో పారేసాను. దరిద్రం మళ్ళీ చుట్టుకుంది. మీ అజాగ్రత్త వలన కుక్కల పాలయ్యింది. ఆ ఆడ బిడ్డను కూడా పెంచి కామాంధులకు బలి చెయ్యలేను”


ఆ మాటల్లో చాలా నిజం ఉందనిపించింది. జాలి చూపకపోగా, మాటలు తూట్లు పొడుస్తుంటే, చూపులు అసహ్యాన్ని కుమ్మరిస్తుంటే బ్రతకడం, పెంచడం కూడా కష్టమే? 


నిజమే చిన్నపిల్లలు కిరాతకానికి బలి అయితే, పెద్దలకు చెప్పడానికి భయపడి దాచుకుంటారు. తెలిసిన తరువాత అబార్షన్ చేయడానికి వీలుగాక ఆ కల్మషాన్ని భరిస్తారు. అటువంటిదే ఈ అమ్మాయి అయిఉండాలి. అలా పుట్టిన ఆడబిడ్డలు అయితే మరీ కర్కశంగా కుప్పతోట్లులో పారేయ్యడమో రోడ్డుప్రక్కన చంపి విసిరేయ్యడమో జరుగుతుంది. 


మన దేశంలో అక్రమసంతతిగా పుట్టి, ఆనాధలుగా బ్రతుకుతున్నవారు మూడుకోట్లకు పైగా ఉన్నారట. చంపేసిన బిడ్డలు ఎంత మందో?? ప్రతి సంవత్సరం లెక్క పెరుగుతూనే ఉంది. గట్టిగా నిట్టూర్పు వదిలి ఆమె వైపు జాలిగా చూసాడు. ఈ లోకంలో లేదు ఆమె!


“అయినా, అంత కిరాతకంగా లేదు ఈ సమాజం” అన్నాడు రేవంత్. 


అలాగే ఉందని తెలుసు. చెప్పిన మాట అతడికే అసహ్యం వేసింది. నేటి యువతలో మానభంగమే మగతనానికి గుర్తు అనే సాడిస్టిక్ అభిప్రాయం నాటుకు పోయింది. వ్యభిచార గృహాలున్నాయి. డబ్బుకోసం అనుకున్న ఆడది దొరికే అవకాశం ఉంది. 

మరి ఈ చిన్నారులను, అమాయకులనే ఎందుకు బలాత్కరిస్తున్నారు? వాళ్ళ జీవితాలను చీకటిలో మగ్గేటట్టు ఎందుకు చేస్తున్నారు? క్రూరత్వపు ఆనందంతోనే తృప్తి పడుతున్నారు. 


అదుపులేని పిచ్చి అహంకారం !! ఇలాంటివాళ్ళు సమాజంలో ఉంటే పరిమళాలను అందివ్వబోయే పసిడి మొగ్గలు నేలపాలు కావాల్సిందే! అంతం ఉండాలి.. అంతం చూడాలి !! ఎవరు, , .?? పెంపకం, ప్రభుత్వం ప్రజానీకం!! అప్పుడే ఆడ పిల్లల తల్లిదండ్రులు కంటినిండా నిదురపోగలరు. అప్పుడే స్త్రీలకు నిజమైన స్వతంత్రం వచ్చినట్లు !! 


“నేను అందంగా లేనా! “సూటిగా రేవంత్ కళ్ళల్లోకి చూస్తూ ప్రశ్నించింది.

ఉలిక్కి పడ్డాడు రేవంత్. ఎందుకడిగిందో అర్ధంగాలేదు. ఏం జవాబు చెప్పాలో కూడా స్ఫురించలేదు.


మౌనంగా ఉన్న రేవంతును చూస్తూ, “ఉన్నాను!! వయసు మించిపోలేదు. తృప్తినిచ్చే ఆడతనం ఉంది. ఇవన్నీ మీకు ఎందుకు కనిపించలేదు?” 


ఆమె, జవాబు కోసం ఎదురు చూడలేదు “మీ సంస్కారం, చూసేదృష్టి, నేనున్న పరిస్థితులు. మరి అందరికీ ఆ చూపులు, ఆలోచన ఎందుకులేవు? 

ఉండవు!! వ్యభిచరించే, ఫ్రీడమ్ ఆఫ్ థాట్! యువతీ యువకులకే కాదు, పది సంవత్సరాల పిల్లలనుంచి పండుముసళ్లు వరకు స్త్రీల ఒంపు సొంపుల్ని గురించిగాక మరేదయినా మాట్లాడుతున్నారా, ఆలోచిస్తున్నారా? 


సినిమాలు, సెలఫోన్సు నిండుగా అవే కదా !! స్త్రీలో, తల్లి ఉందని మరిచిపోయారు ” అని కన్నీళ్ళతో తడిసిన ముఖాన్ని దాచుకుంది. 


బిగపట్టిన వ్యధను గట్టిగా ఊపిరి పీల్చి మెల్లగా వదిలి రేవంత్ వైపు కాసేపు చూసి, “కంఠశోష వినే వాళ్ళు, అర్దం చేసుకునే వాళ్ళు లేక, ఇంత కాలం నోరు తెరవ లేదు. అవకాశమే రాలేదు. వింటున్నారని కాదు. అర్థంచేసుకోగల మాననీయత, సంస్కారం, మీలో ఉందని మనసు విప్పాను. ”అంటూ నోరు తడుపుకోవడం చూసి, దప్పికగా ఉందేమోనని మంచి నీళ్ళు యిమ్మన్నాడు రేవంత్. 


ఆమె గ్రహించిన మాననీయత, మంచి, తనలో ఉందా అని ప్రశ్నించుకున్నాడు రేవంత్. ఆమె వైపు చూసాడు. అణిచి పెట్టుకున్న మానసిక అగ్నిపర్వతాల జ్వాలలను చల్లార్చు కోవడానికి ప్రయత్నిస్తుంది. 


పాపం !! గాఢ  నిట్టూర్పు వదిలి, ఆవిడ వదిలేసి వెళితే ఖచ్చితంగా కేసుపెట్టాలి. ఆమె మాటల్లో, ఎంతో పరిపక్వత, విజ్ఞత, కనిపిస్తున్నాయి. బాగా చదువుకొని ఉండాలి.

“విూరేం చేస్తున్నారు.. ఎంత వరకు చదువుకున్నారు?” మొహమాట పడుతూనే అడిగాడు.జవాబు చెప్పలేదు. రాదని తెలుసు!!


“ప్రతి ఒక్కస్త్రీ ప్రవర్తన మరో స్త్రీకి మచ్చగావచ్చు, మార్గ దర్శకం కూడా కావచ్చు. బాధ్యతతో కూడిన ప్రవర్తన. ఆడతనం, స్త్రీ ఔన్యత్వానికి , మాతృత్వానికి వజ్రకిరీటం. ” అని రేవంతు వైపు చూసింది.


“నేను అడిగింది, దాన్ని గురించికాదు. !”


“మీకు జవాబే నేను యిస్తున్నది. నా బ్రతుకు ముళ్ళకంప. నా ఉద్యోగం మాతృత్వం. నా అడ్రసు లోయర్ మిడిల్ క్లాసు. తల్లిగా పట్టభద్రురాలిని. ఇప్పుడు అమ్మమ్మగా పోస్టుగ్రాడ్యుయేట్ని.. అవమానాల్లో.. !! ” 


విని మాట్లాడలేక పోయాడు. ఎంత అడిగినా లాభంలేదని, ఆమె మాట తీరుకు ఆశ్చర్యపోయాడు రేవంతు. బరువెక్కిన హృదయాన్ని తేలిక పరచుకోవాలని ప్రయత్నిస్తూ, కాస్సేపు ఆమెనే చూసి, లోపలకెళ్ళి కూర్చున్నాడు.


ఈ బిడ్డ విషయం తనకు తెలియకుండా ఉంటే యిది సమస్య కాదు. తెలిసిన తరువాత సమస్యను గాలికి వదిలెయ్యలేడు.


బలవంతంగా అప్పగించినా, మరెక్కడైనా పారేస్తుంది. ఆమె తీసుకెళ్ళదు ! పోలీసులకు చెప్పేస్తే? హింస పెడతారు ! ఈవిడ్ని, ఆ బిడ్డని కూడా వాడుకోవచ్చు. తనకెందుకు?

ఆమె ఎవ్వరు?? ఎన్నో చిరిగి పోయిన బ్రతుకులు. అతికించలేని కాగితాలు? చిరిగిన ప్రతి ముక్కలో ఒక ఆవేదన ! అంతంగాని ఆక్రోశాలు ! అపశ్రుతి రాసిన చిరునామాలు !!


చీకటిలోనే కూర్చొని ఉన్నాడు. ఆ బిడ్డకు సురక్షితమైన జీవితం యిస్తే బాగుంటుందనే ఆలోచన పదే పదే మనసులో తిరుగుతుంది.


 మాఫియా గ్యాంగులకు తెలిస్తే నిముషాల మీద దబాయించో, లోయర్ స్టాఫ్ కు డబ్బులిచ్చి బెదిరించో ఎత్తుకుపోతారు. ఎవ్వరినీ నమ్మడానికి లేదు. అంత డిమాండు ఉంది ఆడపిల్లకు!!


ఎంతటి దుర్దశ పట్టింది ఈ మాతృత్వానికి? ఆ బిడ్డను, వాళ్ళిద్దరిని ఒప్పించి ఎలాగయినా బాధ్యత తీసుకునేటట్లు చెయ్యాలి. బ్రతిమలాడాలి అనే తపన మనసులో స్థిరపడింది. స్త్రీకి ఏడుపే జీవితంగా, వేదనే అష్టమరాగంగా మారకూడదు!! 

సలలిత రాగ సుధారస సారం కావాలి. కటిక చీకటిలో దారి చూపించే దివ్వ జ్యోతి గావాలి. స్త్రీ ఆటబొమ్మకాదు. అన్యోన్య అనురాగాల మనశ్శాంతి నిధి అని ఎప్పుడు గుర్తిస్తారు ఈ మగ జాతి?!


ఎప్పటికో ఈ లోకంలోకి వచ్చి, ఎదురుగా నిలుచున్న సుబ్బయ్యను చూసి లైటు వెయ్యమన్నాడు. 

“వాళ్ళకు ఎలా ఉంది?” అడిగాడు.


“ఏం ప్రమాదం లేదన్నారయ్యా !?”


“ఎక్కడున్నారు?”


“ఎప్పుడో వెళ్ళి పోయారయ్యా!”


 “వాట్!! బిడ్డ?”


“వదిలేసి.. !”నిర్ఘాంత పోయి అలాగే చూస్తూ కూర్చుండి పోయాడు.


సమాప్తం

*****


డా: కనుపూరు శ్రీనివాసులు రెడ్డి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : డా.కనుపూరు శ్రీనివాసులు రెడ్డి.. 

నమస్తే ! నా కధ ప్రచురణకు నోచుకున్నందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు. నా గురించి గొప్పగా ఏమీ లేదు. సాహిత్యం అంటే మక్కువ. ప్రయోగాలు చెయ్యాలని అభిలాష. చాలా సంవత్సరాల ముందు కధలు రాసేవాడిని. అన్నీ కూడా ఆంధ్రప్రభ, ఆంద్ర జ్యోతిలలో ప్రచురితమైనవి. కొన్ని కారణాల వలన సాహిత్యానికి దూరం అయినాను. 2010 నుండి నవలలు, భావకవితలు రాయడం మొదలుపెట్టాను. మరో హృదయం-మరో ఉదయం{నవల} ,గీతాంజలి అనువాదం, నీకోసం అనే భావకవిత్యం, చీకటిలో మలివెలుగు {నవల} ప్రచురించడం జరిగింది.


46 views0 comments

Comments


bottom of page