top of page

అస్తిత్వం



'Asthithvam' - New Telugu Story Written By Gannavarapu Narasimha Murthy 

Published In manatelugukathalu.com On 05/01/2024

'అస్తిత్వం' తెలుగు కథ

రచన: గన్నవరపు నరసింహ మూర్తి 



ప్రత్యూషపు  వేళ!

కాలింగ్ బెల్ మోగడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాను. ఒళ్ళంతా నొప్పులుగా ఉంది. కళ్ళు తెరుచుకోవడం లేదు. బలవంతంగా మంచం దిగి వాష్‌ బేసిన్ దగ్గరకు వెళ్ళి నా ముఖాన్ని చూసుకున్నాను. ముఖమంతా ఉబ్బినట్లు కనిపిస్తోంది. దానికి తోడు ఎర్రటి కళ్ళు.

మూసుకుపోతున్న రెప్పలు. కుళాయి ఆన్ చేసి ముఖాన్ని రెండు చేతులతో కడుక్కున్నాను. చల్లటి నీరు ముఖానికి తగలగానే హాయిగా అనిపించింది. వెంటనే బ్రష్ మీద పేస్ట్ పెట్టి అద్దంలోకి చూస్తూ బ్రష్ చేసుకో సాగాను. 


మనసు నిండా ఆలోచనలు. ఎంత ప్రయత్నిస్తున్నా ఏకాగ్రత  కుదరడం లేదు. రాత్రి నేను బాగా ఆందోళనకు   గురి అయ్యాను. అందువల్ల  త్వరగా నిద్ర పట్టలేదు. "మనసు ప్రశాంతంగా లేకపోతే నిద్ర పట్టదు. ఆలోచనలు కట్టిపెట్టి కళ్ళు మూసుకుంటే నిద్ర పడుతుంది" అని మొన్నటిదాకా మా అమ్మ రోజు రాత్రి 12 దాకా నేను మేల్కొని వున్నప్పుడు  చెప్పడం నాకు గుర్తుకు వచ్చి కళ్ళు చెమ్మగిల్లాయి. 


"మంచి హోదాలో ఉన్న తల్లిదండ్రులు,  చీకూ చింతా లేని కుటుంబం మాది. పైగా నేను ఒక్కత్తే కూతుర్ని. నేను ఏది కొరితే అది ఇచ్చే  అమ్మా నాన్న. అయినా నేను సక్రమంగా ఎందుకు పెరగలేదు?" అని ఈ మధ్య రోజూ  న‌న్ను నేను ప్రశ్నించుకుంటున్నాను. చదువుకుంటున్నప్పుడు  సాయంత్రం ఐదు దాటితే ఇంకా ఎందుకు ఇంటికి రాలేద‌ని ప్ర‌శ్నించే నాన్న ఉన్నా నేనెందుకు దారి త‌ప్పాను? ఏది మంచో,  ఏది చెడో రోజూ పురాణాల్లోని క‌థ‌ల ద్వారా నీతులు చెప్పే అమ్మ‌ నా వెంట నీడ‌లా ఉన్నా నేనెందుకు గీత దాటాను ?


మ‌స్తిష్కంలో ఆలోచ‌న‌ల హోరు. ఆలోచిస్తుంటే నా బుర్ర వేడెక్కిపోతోంది. ఎంత వ‌ద్ద‌నుకున్నా  ఆలోచ‌న‌లు న‌న్ను వెంటాడుతునాయి. 

****** ******* ******* 

అమ్మ   ఎమ్మే చదివి    లెక్చ‌ర‌ర్‌గా ఉద్యోగం చేస్తోంది. అయినా ఆమె చాలా సంప్ర‌దాయంగా పెరిగింది. మ‌రి నేనెందుకు అలా పెర‌గ‌లేక‌పోయాను?. బ‌హుశా అమ్మ పేదింట్లో పుట్ట‌డం వ‌ల్ల అలా ఒద్దిక‌గా పెరిగి ఉండొచ్చు. బహుశా  నేను డ‌బ్బున్న ఇంట్లో పుట్ట‌డం వ‌ల్ల జీవితాన్ని చాలా కేర్‌పిన్‌గా తీసుకున్నానేమో?


పైగా నా స్నేహితులంతా  ఎగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి వాళ్ళు. సంప్ర‌దాయాన్ని న‌మ్మ‌ని వాళ్ళు. వాళ్ళ‌లో  చాలా మందికి సింగిల్ పేరెంట్స్‌. గొడ‌వ‌లు ప‌డి వాళ్ళ త‌ల్లిదండ్రులు విడాకులు తీసుకున్న‌వాళ్ళు. వాళ్ళ‌కి పెళ్ళి అంటే చాలా చిన్న చూపు. వాళ్ళ అమ్మ‌లంతా ఫెమినిస్టులని గ‌ర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. ఫెమినిస్టులంటే   భ‌ర్త‌ల‌తో విడాకులు తీసుకున్న వాళ్ళ‌ని వాళ్ళ అభిప్రాయమేమో!


వాళ్ళ‌లో చాలామందికి జీవితాన్ని య‌వ్వ‌నంలో బాగా అనుభవించాలన్న  కోరిక‌లుండేవి  . వాళ్ల దృష్టిలో పెళ్ళికాకుండా మొగాళ్ళ‌తో స్నేహం  చెయ్య‌డం త‌ప్పు కాదు. సిగ‌రెట్లు,  మ‌ద్యం తాగ‌డం ఒక ఫ్యాష‌న్. జ‌డ‌వేసుకొనీ పువ్వులు పెట్టుకొనీ బుద్ధిగా చ‌దువుకునే అమ్మాయిలు వాళ్ళ దృష్టిలో  పిచ్చివాళ్ళు,  అమాయ‌కులు,  పిరికివాళ్ళు. అలాంటి స్నేహితురాళ్ళ‌తో క‌లిసి నేను చ‌దువుకున్నాను. అందుకే నేను కూడా వాళ్ళ‌లాగే పెరిగానేమో?


నాకు చిన్న‌ప్ప‌ట్నుంచీ పొడ‌వైన జుట్టు ఉండేది. ప‌ద‌వ త‌ర‌గ‌తి దాకా అమ్మ పెద్ద‌జ‌డ వేసి పువ్వులు పెట్టి స్కూలుకి పంపించేది. కానీ నేను డిగ్రీకి వ‌చ్చిన త‌రువాత నా స్నేహితురాళ్ళు ఎగ‌తాళి చెయ్య‌డంతో ఒక‌రోజు కాలేజీ వ‌దిలిన త‌రువాత బ్యూటీ పేర్ల‌ర్‌కి వెళ్ళి బాబ్డ్ క‌టింగ్,  ఫేషియ‌ల్ చేయించుకుని,  లిప్ స్టిక్ తో  ఇంటికి  వ‌చ్చిన న‌న్ను చూసి అమ్మ విరుచుకుపడింది.  . ఇంట్లో ఓ పెద్ద సీన్ క్రియేట్ చేసింది. దాన్నుంచి త‌ప్పించుకోవ‌డానికి నేను రెండు రోజులు అన్నం తిన‌కుండా బ్లాక్‌మెయిల్ చెయ్య‌వ‌ల‌సి వ‌చ్చింది. ఆ త‌రువాత అమ్మ ముఖంలో ఆందోళ‌న‌ని గ‌మ‌నించాను. 


అప్పట్నుంచి నేను కాలేజీ నుంచి రాగానే న‌న్ను ఆపాద‌మ‌స్త‌కం ప‌రిశీలిస్తుండ‌టం ఎంబ‌రాసింగ్‌గా అనిపిస్తుండేది. మా అమ్మ టీన్స్(యుక్త) వ‌య‌సు చాలా ప్ర‌మాద‌క‌ర‌మైన‌ద‌నీ,  దాని ఆకర్ష‌ణ‌కు లోనైతే జీవితం నాశ‌నం అవుతుంద‌నీ,  కాబ‌ట్టి ఈ వ‌య‌సులో ఎవ్వ‌ర్నీ న‌మ్మ‌కూడ‌ద‌నీ రోజూ చెబుతుంటే    నాకు నవ్వు   వచ్చేది. 


మా అమ్మా వాళ్ళు ఆరుగురు సంతానం. అందుకే ఆమెకు ఎమోష‌న‌ల్ బ్లాక్‌మెయిలింగ్ తెలియ‌దు. కానీ నేను మా త‌ల్లితండ్రుల‌కు ఒక్క‌దాన్నే కావడం వల్ల  నాకు అది ఒక ఆయుధంలా ప‌నిచేస్తుండేది. 


న‌న్ను,  నా ప్ర‌వ‌ర్త‌న చూసి అమ్మ నాన్న లిద్ద‌రూ కూడా బాధ‌ప‌డుతున్నార‌ని వాళ్ళ ప్ర‌వ‌ర్త‌న వ‌ల్ల తెలిసింది. నేనెంత సేపు నాణేనికి ఒక‌ వైపైన నా గురించే ఆలోచించాను  కానీ రెండోవైపు గురించి ఆలోచించ‌లేదు.  రెండు నెల‌ల త‌రువాత నా ప‌రీక్ష‌లు ముగిసాయి. బియ‌స్సీలో నాది కంప్యూట‌ర్స్ కాబ‌ట్టి ప‌రీక్షా ఫ‌లితాల త‌రువాత నాకు హైద‌రాబాద్‌లోని సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం వ‌చ్చింది. అమ్మ‌కు న‌న్ను అక్క‌డికి వంట‌రిగా పంప‌డం ఇష్టం లేదు. అందుక‌ని న‌న్ను ఎంసిఏలో చేర‌మ‌ని చెప్పింది. కానీ నేను ఆమె మాట విన‌కుండా హైద‌రాబాద్ వెళ్ళి ఉద్యోగంలో చేరిపోయాను. నాన్న‌గారు నేను వెళుతుంటే నిస్స‌హాయంగా చూస్తూ ఉండిపోయారు. 


ఆ త‌రువాత నేను ఒక కొత్త సాఫ్ట్  వేర్  ప్ర‌పంచంలోకి అడుగు పెట్టాను . కేర్‌పిన్ ప్ర‌పంచం. అంత‌వ‌ర‌కు నాలుగు గీత‌ల మ‌ధ్య గిరిగీసుకుని బ్ర‌తికిన వాళ్ళు ఇప్పుడు ఆ గీత‌ల్ని చెరిపేసుకొని బ‌తుకుతారు. 


వాళ్ళ‌దో ప్ర‌త్యేక ప్రపంచం.   మిగ‌తా స‌మాజంతో వాళ్ళ‌కి  ప‌నుండ‌దు. వారాంత‌పు ప్ర‌త్యేక పార్టీలు,  ప‌బ్‌లు,  విచ్చ‌ల‌విడిత‌నం,  కార్లు,  షికార్లు. రాత్రిపూట లేప్‌టాప్ మీద ప‌ని. ఉద‌యం నిద్ర‌. ఇలా అన్నీ అక్క‌డ విచిత్రాలే.. డ‌బ్బు ఎంత ఎక్కువ సంపాదిస్తారో అంత‌కు రెట్టింపు ఖ‌ర్చుల‌కు అల‌వాటు ప‌డ‌తారు. నేను,  ఇంకో ఇద్ద‌రు నా స్నేహితురాళ్ళు  వ‌ర్కింగ్ ఉమెన్స్ హాస్ట‌ల్లో చేరాము. రోజూ 9 గంట‌ల‌కు ఆటోలోనో,  కేబ్‌లోనో ఆఫీసుకి వెళ్ళటం ,  సాయంత్రం ఆరు,  ఏడు దాకా ఆఫీసులో ప‌ని,  ఆ త‌రువాత షాపింగ్,  సినిమాలు. 9 గంట‌ల‌కు మ‌ళ్ళీ హాస్ట‌లు చేర‌టం. 

నెల‌రోజులు త‌రువాత నాకు వంశీ అనే మా కొలీగ్ ప‌రిచ‌యం అయ్యాడు. అత‌ను య‌న్‌. ఐ. టి. లో ఇంజ‌నీరింగ్ చ‌దివాడు. మంచి తెలివైన‌వాడు.


మొద‌టి ప‌రిచ‌యంలోనే నాకు అత‌ను బాగా న‌చ్చేడు. అందుకు కార‌ణం అత‌ని చురుకుద‌నం,  తెలివితేట‌లు. సాఫ్ట్‌వేర్ డిజైన్స్‌లో మంచి పరిజ్ఞానం  ఉంది. అత‌నికి సీ ప్ల‌స్‌,  వొరాకిల్‌,  ఆర్టీఫిషియ‌ల్ ఇంజెలిజెన్స్‌,  రోబోటిక్స్ ఇలా అన్ని లాంగ్వేజ‌స్ మీద మంచి ప‌ట్టుంది. మాటీమ్‌లో అత‌ను ఏక్టివ్ మెంబ‌రు. మా టీమ్‌లో ఎవ్వ‌రికి ఏ స‌మ‌స్య వ‌చ్చినా అత‌నే ప‌రిష్కారం చూపుతాడు. మా టీమ్ లీడ‌ర్ ర‌ఘు అనే అత‌ను ఓ ఉత్స‌వ విగ్ర‌హం. మేము చేస్తున్న ప్రాజెక్ట్ పూర్తి చెయ్య‌డానికి ఆరు నెల‌ల స‌మ‌యం ఉన్నా వంశీ వల్ల  దాన్ని  ముందే పూర్తిచేసేసాము. కొత్త ప్రాజెక్ట్‌కి వంశీయే టీమ్ లీడ‌ర‌ని అంద‌రూ అను కుంటున్నారు. 


ఒక‌రోజు నేను ఆఫీసునుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌రువాత వంశీ వచ్చి  ``కొత్త ప్రాజెక్టుకి  త‌నే టీమ్ లీడ‌ర్న‌నీ,  న‌న్ను త‌న టీమ్‌లోకి తీసుకుంటున్న‌ట్లు" చెప్పాడు. 


నేను అత‌నికి థాంక్స్ చెప్పాను. ఆత‌రువాత ఇద్ద‌రం కేంటీన్ కి  వెళ్ళి టీ తాగాము. అలా మా ప‌రిచ‌యం మొద‌లైంది. ఆ త‌రువాత మేం ఇద్ద‌రం తరచు క‌లుసుకుంటూ ఉండేవాళ్ళం. ఎక్కువ సినిమాల‌కి వెళ్ళేవాళ్ళం. ఆదివారంనాడు బ‌య‌ట‌కు వెళ్ళేవాళ్ళం. ఒక‌సారి నాగార్జున సాగ‌ర్‌,  ఇంకోసారి రామ‌ప్ప టెంపుల్, మ‌రోసారి బాసర . ఇలా చాలా ప్ర‌దేశాలు తిరిగాము. 


ఆరునెల‌ల త‌రువాత సంక్రాంతి పండుగ‌కు ఇంటికి వెళ్ళిన‌పుడు అమ్మ నాతొ  "నాన్న‌గారికి నేను ఒంటరిగా  అక్క‌డ ఉండి ఉద్యోగం చెయ్య‌టం ఇష్టం లేద‌నీ,  కావాలనుకుంటే పెళ్ళి త‌రువాత ఉద్యోగం చేసుకోవచ్చనీ కాబట్టి  ఉద్యోగం మానేసి ఇంటికి వ‌చ్చేయ‌మ‌నీ చెప్పింది. నేను అందుకు ఒప్పుకోలేదు.   అప్ప‌టికే   నాకు రెండు సంబంధాలు చూసి ఉంచారు . నేనప్పుడే పెళ్ళి చేసుకోన‌ని చెప్పి హైద‌రాబాద్ వ‌చ్చేసాను. 


రాను రాను వంశీతో నాకు సాన్నిహిత్యం పెరిగింది. ఇప్పుడు అత‌ను త‌ర‌చు నేనుండే  హాస్ట‌ల్‌కి వ‌స్తునాడు. రాత్రి 12 గంట‌ల దాకా ఇద్ద‌రం ఫోన్లో మాట్లాడుకుంటున్నాము. 


ఒక‌సారి మేమిద్ద‌రం వీకెండ్  కి  హంపీ బ‌య‌లుదేరి వెళ్ళాము. ఉద‌యం ఆ చారిత్ర‌క ప్ర‌దేశాన్ని చూసి రాత్రి హోట‌ల్‌కి చేరుకున్నాము. ఇద్ద‌రివి వేర్వేరు గ‌దులు. అయినా అర్ధ‌రాత్రి 12 గంట‌ల‌ప్పుడు వంశీ నాగ‌దికి వ‌చ్చాడు. ఆ స‌మ‌యంలో వ‌చ్చిన అత‌న్ని చూసి నేను ఆశ్చ‌ర్య‌పోయాను. ఆ రోజు ఇద్ద‌రం  తొంద‌ర‌ప‌డి శారీరకంగా ఒక‌ట‌య్యాము. ఆ మ‌ర్నాడు నేను జ‌రిగినదానికి బాధ‌ప‌డుతుంటే అతను త్వ‌ర‌లోనే పెళ్ళి చేసుకుందామ‌ని చెప్పాడు. 


కానీ వారం త‌రువాత  వంశీ  ఆఫీసుకి వ‌స్తుండ‌గా అత‌ని కారు ప్ర‌మాదానికి గురై డివైడ‌ర్ని ఢీకొట్టింది. ఆ ప్ర‌మాదంలో వంశీకి   బాగా దెబ్బలు తగిలాయి. కోమాలో పది రోజులు వున్నాడు.. డాక్టర్లు  ఎంతో  కష్టపడి అతన్ని బతికించేరు  గానీ  అతని  వెన్నుపాముకి బాగా  దెబ్బ తగలడంతో  అత‌ను సంసార జీవితానికి  పనికిరాడని  చెప్పారు. అతన్ని చూస్తే   నాకు జాలి వేసింది. అన్నీ బావుంటే ఈపాటికి  మా పెళ్లి జరిగి ఉండేది. కానీ విధి వక్రించింది. 


ఇప్పుడేమి చెయ్యాలో అర్ధం కావటం లేదు . నా స్నేహితురాళ్ళు అతన్ని మరిచిపొమ్మని చెప్పారు. లేకపోతె నా జీవితం నాశనం అవుతుందనీ చెప్పారు. 


కానీ నాకెందుకో వాళ్ళ మాటలు నచ్చలేదు. అలా  చేస్తే  నమ్మక ద్రోహం అవుతుంది. ఒక వేళా పెళ్లి చేసుకున్న తరువాత ఇలా జరిగితే ఏంచేసి ఉండేది?ఈ ప్రశ్న నన్ను  వెంటాడింది. ఎలాగైనా  అతన్ని వదలకూడదనీ నిర్ణయించుకున్నాను. 


 ఆ మర్నాడు   నేను మా వూరు వెళ్లాను. బాగా చిక్కిన నన్ను చూసి మా అమ్మ ఆశ్చర్య పోయింది. నా ముఖంలో  ఆందోళన గమనించి ఏమి జరిగిందని అడిగింది .  నేను ఈ విషయం ఆమెకు చెప్పలేదు. 

మర్నాడు నేను హైదరాబాదు వస్తుంటే నేను వద్దన్నా నాతో  పాటు బయలుదేరింది. 


అటువంటి స‌మ‌యంలో ఒక పిడుగు లాంటి వార్త‌. ఒంట్లో న‌ల‌త‌గా ఉండి వాంతులు అవుతున్నాయ‌ని డాక్ట‌ర్ని క‌లిస్తే అత‌ను ప‌రీక్ష‌లు చేసి నేను గ‌ర్భ‌వ‌తిన‌ని చెప్పాడు. ఆరోజు హంపీలో నేను,  వంశీ ఆవేశపడీ చేసిన  తప్పుకి కు ఫ‌లితం ఈ  గర్భం . ఇప్పుడేం చెయ్యాలి? ఆ వార్త విన్న త‌రువాత ఇంటికి ఎలా వ‌చ్చానో నాకు అర్థం కాలేదు. 


ఆరోజు ఆఫీసుకి వెళ్ళ‌లేదు. ఏం జ‌రిగింద‌నీ,  డాక్ట‌రు ఏం చెప్పాడ‌నీ అమ్మ గుచ్చి గుచ్చి అడిగినా ఆమెకు నా గ‌ర్భం సంగ‌తి చెప్ప‌లేదు. చెబితే ఏం జ‌రుగుతుందో నాకు తెలుసు. మా నాన్న‌గారు ఈ విష‌యాన్ని జీర్ణించుకోలేరు. అస‌లే అత‌ని ఆరోగ్యం బాగులేదు. ఆరోజంతా గ‌దిలో ఒంట‌రిగా గ‌డిపాను. 


మ‌ర్నాడు ఆఫీసుకి వెళ్ళాను. అంద‌రూ నాతో మామూలుగానే ఉన్నా నేనే వాళ్ళు న‌న్ను అనుమానంతో నా క‌డుపు వైపు చూస్తున్నార‌నే  అపరాధ భావనలో  ఉన్నాను. మాటికి మాటికీ నా క‌డుపు వైపు చూసుకోసాగేను. 


ప‌ట్టుమ‌ని పాతికేళ్ళు కూడా లేవు.   పెళ్ళి కాకుండా గ‌ర్భం దాల్చేనన్న విష‌యం స‌మాజానికి తెలిస్తే ఇంకేమైనా ఉందా? కాకుల్లా  పొడుచుకు తిన‌రూ?! స‌మాజం మ‌న విజ‌యాల‌ను పట్టించుకోదు కానీ మన అపజయాల్లో అడ‌క్కుండానే త‌ల దూరుస్తుంది. వేలెత్తి చూపుతుంది. వారం త‌రువాత అమ్మ‌కి ఈ విష‌యం తెలిసిపోయింది. టేబుల్ మీద ఉంచిన డాక్ట‌ర్ గారిచ్చిన ప్రిస్ర్కిప్ష‌న్ చూసి తెలుసుకున్న‌ట్లుంది . 


న‌న్ను గుచ్చి గుచ్చి అడ‌గ్గానే కోపం వ‌చ్చి  ``అవును ! గ‌ర్భం దాల్చేను`` అని గ‌ట్టిగా అరిచాను. దాంతో అమ్మ ఒక్క‌సారిగా కుప్ప‌కూలిపోయింది. !


రెండు రోజుల త‌రువాత అమ్మ కోలుకుంది. నాన్న‌కింకా ఈ విష‌యం తెలియ‌దు. ఒక‌రోజు నేను ఆఫీసుకెళుతున్న‌ప్పుడు   టిఫిన్   పెడుతూ  అమ్మ ఎలా జ‌రిగింద‌ని  అడిగింది. 

నేను వంశీతో స్నేహం గురించి చెప్పి అత‌న్ని పెళ్ళి చేసుకుందామ‌న్న నిర్ణ‌యానికొచ్చిన త‌రువాతే తొంద‌ర‌పాటు వ‌ల్ల జ‌రిగింద‌ని చెప్పాను..

  

నే చెప్పింది విని అమ్మ విచారించింది. ఆ త‌రువాత ``నీకింకా పాతికేళ్ళు కూడా రాలేదు. బోలెడు భ‌విష్య‌త్తు ఉంది. అతనా  పెళ్ళికి పనికి  రాడు . ఈ విష‌యం న‌లుగురికి తెలియ‌క‌ముందే అబార్ష‌న్ చేయించుకో.  ఇంకా ఆల‌స్యం చేస్తే న‌లుగురికి తెలిసి నవ్వుల పాల‌వుతాము. ఈ స‌మాజం చాలా చెడ్డ‌ది. మ‌నం నిజం చెప్పినా  ఎవ్వ‌రూ న‌మ్మ‌రు. పైగా లేనిపోని నింద‌లు వేస్తారు. నువ్వు వెంట‌నే ఈ ప‌నిచేస్తే ఈ విష‌యం నాన్న‌గారికి కూడా తెలియ‌నివ్వ‌ను. నేను నీ  క‌న్న‌త‌ల్లిని కాబ‌ట్టి ఈ ర‌హ‌స్యాన్ని క‌డుపులో దాచుకుంటాను`` అని ఏడుస్తూ చెప్పింది. 


మా అమ్మ మాట‌లు నాకు ఆశ్చ‌ర్యం క‌లిగించాయి. ఆ రోజంతా నేను గ‌ది వ‌దిలి బ‌య‌ట‌కు రాలేదు. మ‌స్తిష్కం నిండా  ఆలోచ‌న‌లు. ఏం చెయ్యాలో తెలియ‌ని ప‌రిస్థితి. ఎటువైపు చూసినా అగ‌మ్య గోచ‌రం. అంధ‌కార బంధురం. క‌ళ్ళు విప్పాలంటేనే భ‌యం వేస్తోంది. మ‌రీ ముఖ్యంగా అద్దాన్ని చూస్తే మ‌రింత భ‌యం వేస్తోంది. అందులోకి చూడాలంటే ధైర్యం చాలటం లేదు. అందులో క‌నిపించే నా ప్ర‌తిబింబం చూసే సూటి చూపుల‌ను నేను త‌ట్టుకోలేను. దాని ముఖంలో క‌నిపించే ప్ర‌శ్న‌ల‌కు నా ద‌గ్గ‌ర జ‌వాబులు లేవు. 

****** ******* ***** *******

 ఆలోచ‌న‌ల నుంచి బయట పడ్డాను. ఇప్పుడు  నా దృష్టి ప‌దేప‌దే నా క‌డుపు మీద‌కు మ‌ర‌లుతోంది. దాన్ని చూడ‌గానే నాలో భ‌యం ప్ర‌వేశిస్తోంది. దాన్లో పెరుగుతున్న నా ప్రతిరూపం క‌నిపిస్తోంది. మ‌రో ఆరు నెల‌ల‌కు అది ఆకృతిగా రూపుదాల్చుకుని దాని ఉనికిని పెరిగే పొట్ట ద్వారా లోకానికి తెలియ‌బ‌రుస్తుంది. అప్పుడు లోకం క‌ళ్ళ‌తోటే న‌న్ను ప్ర‌శ్న‌లు వేసి చిత్ర‌వ‌ధ చేస్తుంది. 


అందుకే మర్నాడు వంశీ దగ్గరికి  వెళ్లి నేను గర్భం దాల్చిన విషయం  చెప్పాను. అతను ఆ వార్త  విని చాలా బాధపడ్డాడు. నాకు ఆరోగ్యం బాగుండి మన పెళ్ళైన తరువాత ఇది జరిగివుంటే నేను చాలా  ఆనందించే వాడిని. కానీ  ఇప్పుడు నేను పెళ్ళికి అనర్హుడిని. కాబట్టి నువ్వు అబార్షన్  చేయించుకొని ఇంకెవరినైనా పెళ్లి చేసుకొమ్మని చెప్పాడు. తన వల్ల  నా జీవితం నాశనం అవడం తనకి ఇష్టం లేదని చెప్పాడు. 


కానీ నేను అతని మాటలు వినలేదు. పెళ్లి చేసుకుందామని చెప్పాను.   కానీ పెళ్ళికి వంశీని ఒప్పించడానికి  చాలా కష్టపడవలసి  వచ్చింది . పెళ్లి అయినా తరువాత ప్రమాదం జరిగితే ఏమిచేసి వుండేవాడివి?అప్పుడు కూడా నన్ను వదిలేసేవాడివా?  అని ప్రశ్నించడంతో  ఇంకా   మాట్లాడకుండా పెళ్ళికి   ఒప్పుకున్నాడు.  


ఆ రాత్రి అమ్మ‌కి మా పెళ్లి విషయం చెబితే కోపం తో ఊగిపోయింది.  నావ‌ల్ల కుటుంబ ప‌రువు పోతుంద‌ని చెప్పింది. 


తండ్రి బెంగ‌పెట్టుకొని చ‌నిపోతాడ‌ని భ‌య‌పెట్టింది. లోకం కాకుల్లా మా కుటుంబాన్ని పొడుస్తుంద‌నీ జ‌ర‌గ‌బోయే విప‌త్తును భ‌విష్య‌త్తు య‌వ‌నిక మీద చూపించింది. 


అయినా నేను వెన‌క‌డుగు వెయ్య‌దల్చుకో లేదు. నా నిర్ణ‌యం మార‌ద‌నీ చెప్పేను. అమ్మ మ‌ర్నాడంతా ఏడుస్తూ,  భోజ‌నం తిన‌కుండా నిర్ణ‌యం వెన‌క్కి తీసుకోమని ఎమోష‌న‌ల్ బ్లాక్‌మెయిలింగ్ చేసింది. కానీ నేను ఒక‌సారి ఏ నిర్ణ‌యం తీసుకున్నా వెన‌క్కి వెళ్ళ‌ను  అన్న సంగ‌తి అమ్మ‌కి తెలుసు. 


 ఆ మర్నాడు   ఇద్దరం కొద్దిమంది స్నేహితులతో  యాదగిరి గుట్ట వెళ్లి పెళ్లిచేసుకున్నాము.   

రెండురోజుల త‌రువాత అమ్మ కోపంగా ``నీ ముఖం జీవితంలో చూడ‌ను. నా కూతురు చ‌నిపోయింద‌నుకుంటాను. `` అని చెప్పి మా ఊరు వెళ్ళిపోయింది.. 

******                     *******          **********

పెళ్లి అయినా తరువాత నేను వంశీ ఇంటికి మారిపోయాను. కాల‌చ‌క్రం ముందుకు క‌దులుతోంది. ఇప్పుడు నాకు ఏడ‌వ నెల‌. అన్నీ బాగుంటే ఇప్పుడు నాకు సీమంతం జ‌రిగేది కానీ న‌న్ను చూడ‌టానికి మా అమ్మానాన్నలు  రాలేదు.. వాళ్ళు ఎలా ఉన్నారో నాకు తెలియ‌దు. ఫోన్లు కూడా చెయ్య‌టంలేదు.. నేను చేసినా ఎత్త‌టం లేదు. 


ఇంత‌లో 9వ నెల ప్ర‌వేశించింది. ఇంకో నెల‌లో నాకు ప్ర‌స‌వం అవుతుంది. మంచి హాస్పిట‌ల్ని ముందే చూసుకోవాలి. అవ‌స‌రం అయితే ఒక ఆయాని పెట్టుకోవాలి. నన్ను వంశీ బాగా చూసుకుంటునాడు .   ఒక రోజు ఉద‌యాన్నే లేచి ముఖం క‌డుక్కొని పాల కోసం త‌లుపుతీసాను. 

ఎదురుగా మా అమ్మా నాన్న నా కోసం ఎదురు చూస్తూ క‌నిపించారు. వాళ్ళ‌ని చూడ‌గానే నాలో ఎక్క‌డ లేని ఆనందం. నా కళ్ళ‌లోంచి నాకు తెలియ‌కుండానే నీళ్ళ ధార మొద‌లైంది. 


ఒక్క‌సారిగ వెళ్ళి అమ్మను గ‌ట్టిగా కావ‌లించుకున్నాను. మా అమ్మ వెచ్చ‌టి స్ప‌ర్వ‌కు నా శ‌రీరం పుల‌కించి పోయింది. అమ్మ న‌న్ను త‌న క‌ళ్ళ‌తోటే ఆశీర్వ‌దించింది. మా నాన్న నా త‌ల‌మీద చెయ్యివేసి ఇంట్లోకి ప్ర‌వేశించారు. అత‌ని వెన‌కాలే నేను,  అమ్మ‌. ఆ తరువాత  వంశీ నేనూ  అమ్మా నాన్న లకు దండం పెడితే వాళ్ళు మా ఇద్దరినీ మనస్ఫూర్తిగా   ఆశీర్వదించారు. 

ఇప్పుడు నాకు లోకం అంతా అందంగా,  ఆనందంగా కనిపిస్తోంది . 


(స‌మాప్తం)


గన్నవరపు నరసింహ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం

గన్నవరపు నరసింహ మూర్తి గారు ఎం టెక్ చదివారు.ప్రస్తుతం విశాఖ పట్నంలో రైల్వే శాఖలో జాయింట్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. వీరు ఇప్పటిదాకా 300 కథలు ,10 నవలలు రచించారు. ఏడు కథా సంపుటాలు ప్రచురించారు. స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి దగ్గర ఒక గ్రామం.

 


81 views0 comments

Comments


bottom of page