'Aswamedham - Episode - 11' - New Telugu Web Series Written By Gannavarapu Narasimha Murthy
'అశ్వ మేధం - ఎపిసోడ్ - 11' తెలుగు ధారావాహిక
రచన : గన్నవరపు నరసింహ మూర్తి
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
జరిగిన కథ:
చరణ్ ఒక లా గ్రాడ్యుయేట్. ఢిల్లీలో జరిగే ఒక కోర్స్ కి అటెండ్ అవుతాడు. అక్కడ అతనికి సౌదామిని అనే యువతి పరిచయం అవుతుంది. ఇంటికి తిరిగి వచ్చిన చరణ్ ని శాంతి అనే యువతి కలిసి న్యాయ సహాయాన్ని అభ్యర్థిస్తుంది.
సుక్కు అనే గిరిజనుడు చనిపోయిన సంఘటనను తన భర్త చైతన్య వీడియో తీసాడనీ, ఆ కోపంతో పోలీసులు తన భర్తను అరెస్ట్ చేశారనీ చెబుతుంది ఆమె. చరణ్, కేస్ వేయడంతో చైతన్యను కోర్ట్ లో హాజరుపరుస్తారు పోలీసులు. అతను బెయిల్ పై బయటకు వస్తాడు.
జాతీయ హరిత ట్రిబ్యునల్ సెక్రటరీ రాఘవన్ ని ఎవరో హత్య చేస్తారు. రాఘవన్ హంతకుల చిత్రాలు గీస్తుంది దీప. పోలీస్ స్టేషన్ లో వాళ్ళ ఫోటోలను గుర్తు పడుతుంది. రాఘవన్ హత్యకేసు విచారణలో చరణ్ బాగా వాదిస్తాడు. దోషులు అరెస్ట్ అవుతారు.
దీప తండ్రి పరమేశ్వరం గారిని కలుస్తాడు చరణ్. దీప, విహరిలకు పెళ్లి చెయ్యమని కోరుతాడు.
మైనింగ్ కాంట్రాక్ట్ రద్దు చెయ్యమంటుంది కోర్ట్.
ఇక అశ్వ మేధం ఎపిసోడ్ 11 చదవండి..
చైనా, ఊహాన్ నగరాన్ని లాక్ డౌన్ చేసి నెలరోజుల్లో నియంత్రణలోకి తేగలిగింది. కానీ యూరప్ దేశాలైన ఇంగ్లాండ్, స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్, నెదర్లాండ్, ఇటలీ, టర్కీ, అమెరికా వంటి ధనిక దేశల్లో ఈ వ్యాధి బాగా ప్రబలింది. భారత్లో కూడా నెలరోజుల ఆలస్యంగా ప్రవేశించినా వేగంగా వ్యాపించడం మొదలు పెట్టడంతో భారత్ ప్రభుత్వం కూడా లాక్ డౌన్ ప్రకటించింది.
నెలరోజుల్లో సుమారు 80 దేశాలు లాక్ డౌన్ని ప్రకటించాయి. ప్రపందేశాలన్నీ ఒక్కసారిగా మూతబడ్డాయి. సుమారు 400 కోట్ల మంది ప్రజలు ఇళ్ళలోనే ఉండిపోయారు. విమానాలు, రైళ్లు, బస్సులు.. ఇలా అన్నీ ఆపివేయబడినాయి. మాల్స్, సినిమాహాళ్లు, అన్నీ మూతబడ్డాయి.
ఈ వైరస్ కరోనా జాతికి సంబంధించినది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ ఓ ) ప్రకటించింది. దీనికి ప్రజలు ఒకరికొకరు తాకకుండా దూరం పాటించడమే మంచిదనీ, దీనికి వేరే మందులేదనీ, దీనికి వాక్సిన్ కనుగొనడానికి కనీసం సంవత్సరం పడుతుందనీ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ప్రజల స్థితిగతులు ఒక్కసారిగా తారుమారు అయ్యాయి .
అసలు ఇటువంటి వైరస్ ల చరిత్రలోకి వెళితే మానవాళిని ఇవి చాలా సార్లు మృత్యు ముఖంలోకి తీసికెళ్లాయని తెలుస్తోంది.
ప్రభుత్వ లాక్ డౌన్ ప్రకటన వచ్చిన రోజున దీప, విహారి, సౌదామిని అందరూ చరణ్ ఇంటికి రావడంతో వారంతా అక్కడే ఉండిపోవడం జరిగింది. ఎక్కడికీ వెళ్ళడానికి లేదు. పోలీసులు, వైద్యాధికారులు ప్రజల సేవలో నిమగ్నమయ్యారు. అయినా రోజురోజుకు కేసులు పెరగసాగాయి. యూరప్, అమెరికాలో పోలీస్తే మనదేశంలో దీని వస్తరణ కొద్దిగా తక్కువగానే ఉంది.
"ఇటువంటి వైరస్ మానవాళి ఎప్పుడైనా బాధపడిందా?" అని విహారి ఒకరోజు చరణ్ ని అడిగాడు. అది పల్లె కాబట్టి ఉదయాన్నే వాళ్ల నలుగురు దూరదూరంగా మాస్కులు వేసుకొని బయటకు వెళ్లేవారు. అయితే అదృష్టవశాత్తు ఆజిల్లాలో ఒక్క వైరస్ కేసుకూడా బయటపడలేదు.
"ఇదే మొదటిసారి కాదు; విహారి.. . 1920లో మొదటి ప్రపంచ యుద్ధం తరువాత జర్మనీ సైనికుల వల్ల ఇదే కరోనా వైరస్ మొదటిసారి ప్రపంచాన్ని కుదిపేసింది. ఈ వైరస్ సుమారు 3. 90 కోట్లమందికి సోకింది. అపుడు ప్రపంచజనాభా 150 కోట్లు మాత్రమే. ఒక భారతదేశంలోనే 1. 40 కోట్ల మందికి సోకిందని చరిత్ర చెబుతోంది . అంటే జనాభాలో 40 శాతం మందికి సోకిందన్న మాట;ఆ సమయంలో సబర్మతి ఆశ్రమం లో ఉన్న గాంధీజీకి కూడా ఈవైరస్ సోకి చాలా రోజులపాటు బాధపడినట్లు మొన్న హిందూ పత్రిక ఫోటోతో సహా ప్రకటించింది.
అప్పట్లో దానికి స్పానిష్ ఫ్లూ అని పేరు పెట్టారు. అది స్పెయిన్ లో పుట్టింది. అలా ఆ వైరస్ ప్రపంచాన్ని మూడు సంవత్సరాల పాటు కుదిపేసింది. ఆతరువాత 1935 ప్రాంతంలో బుబోనిక్ ప్లేగ్ అనీ ఇంకో వైరస్.. . కొన్ని లక్షల మందిని పొట్టన పెట్టుకుంది. అది అప్పట్లో ఎలకల ద్వారా మనుషులకు వ్యాపించందని కనుగొన్నారు. ఆతరువాత 1940లో కలరా.. ఇది నీటి కాలుష్యం వల్ల సోకి ఊళ్లకి ఊళ్లుని స్మశానాలుగా మార్చింది. ఒకసారి అదిసోకితే ఇంక మరణమే.. ఆతరువాత మలేరియా, మశూచి, ఎయిడ్స్, స్వైన్ ఫ్లూ, ఇలా చాలా వైరస్ లు మనమీద దాడి చేస్తునే ఉన్నాయి. ప్రస్తుత ఈ కరోనా వైరస్ ని చైనా వాళ్ళు తమ ప్రయోగశాలలో తయారు చేసారని అమెరికా ఆరోపిస్తోంది. ” అని వివరంగా చెప్పాడు చరణ్;
"ఈ మహమ్మరి ఎప్పుడు తగ్గుతుంది? దీని తరువాత మన జీవితాలు ఏం కాబోతున్నాయి?మొన్నటి దాకా మన గమ్యం వేరు. ప్రతీ వాళ్లూ ఏదో సాధించాలనీ, జీవితంలో గెలిచి పైకి రావాలనీ , బాగా సంపాదించి ఆస్తులు కూడ బెట్టాలనీ, కార్లు, పెద్దపెద్ద ఇళ్ళు, ఏసీలు, పొలాలు, కంపెనీలు.. వీటన్నింటినీ సంపాదించాలన్న కోరికతో ముందుకెళ్లింది సమాజం;. ముఖ్యంగా 1990 తరువాత మన గమ్యం మారిపోయింది.
అందరూ అమెరికా, యూరప్ ల వలస బాట పట్టడం, బాగా డబ్బు సంపాదించడం, గ్లోబలైజేషన్ వల్ల మనదేశంలో నైతికతకు, సంప్రదాయాలకు విలువ ఇవ్వకపోవడం వల్ల మన భారత సమాజం ఎన్నో మార్పులకు గురైంది. మానవ సంబంధాల్లో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. నైతిక విలువలు పతనం అయ్యాయి. కులాంతర, మతాంతర, దేశాంతరలు వివాహాలు ఎక్కువయ్యాయి. అలాగే విడాకులు కూడా పెరిగాయి. తన సృష్టించిన డబ్బుకే మానవుడు విలువ ఇవ్వడం మొదలు పెట్టాడు. ఇటువంటి సమయం లో వచ్చిన ఈకరోనా ప్రపంచానికి, మానవాళికి ఒక ఛాలెంజ్ విసిరింది. మనుషుల జీవితాలను తారుమాఋ చేసింది;. జీడీపీలు తగ్గిపోయాయి. అనేక కంపెనీలు మూతపడుతున్నాయి. ఇప్పటి తరం వ్యవసాయం అంటే విముఖత చూపేవారు. బహుశా ఇపుడు మళ్లీ వ్యవసాయం మీద మొగ్గు చూపుతారేమో” అన్నాడు విహారి.
రెండు నెలల తరువాత లాక్ డౌన్ ఎత్తివేయడం జరిగింది. కానీ ప్రభుత్వం ఎన్నో నియమాలు ప్రకటించింది. 6 నెలలదాకా బస్సులు, రైళ్లు, విమానాలు పునరుద్ధించలేదు. ఇప్పటికి 80 శాతం మంది ఇళ్లలోనే ఉంటునారు.
వేలమంది అమెరికాలో ఉద్యోగాలు వదిలేసి ఇండియాకు వచ్చేసారు;. దేశంలో నిరుద్యోగం పెరిగింది. ప్రజలు తమ జీవన విధానంలో మార్పులు చేసుకున్నారు.
చాలా మంది యువకులు వ్యవసాయం వైపు మొగ్గు చూపారు. ప్రభుత్వం చాలా పధకాలను ఎత్తివేసింది. ప్రజలు విలాసాలను తగ్గించుకున్నారు. ఉమ్మడి కుటుంబాలు పెరిగాయి. ఒంటరిగా ఉండటాలు తగ్గేయి. సమాజంలో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. దుబారా తగ్గించారు. రియల్ ఎస్టేట్, సినిమా రంగం, విద్యా రంగాలు బాగా నష్టాలు చవిచూస్తున్నాయి. ప్రజల్లో ఒక విధమైన నైరాశ్యం, నిర్లిప్తత చోటు చేసుకుంది. ప్రజలు కొత్త ప్రదేశాలకు వెళ్లడం తగ్గించారు. పెళ్ళిళ్ళు చాలా తక్కువ మందితో తక్కువ ఖర్చుతో జరుగుతున్నాయి. ప్రజల్లో ఒక విధమైన నైరాశ్యం, నిర్లిప్తత చోటు చేసుకుంది.
నెలరోజుల తరువాత చరణ్ తన పల్లెలో ఇంటి దగ్గర తోటపని, వ్యవసాయం చూసుకుంటున్నాడు. సౌదామిని ఢిల్లీ వెళ్లి నెల రోజులు పైనే అయింది.
విహారి వ్యవసాయం చేసుకుంటున్నాడు. కాకపోతే ఆమైనింగ్ కంపెనీ వాళ్ళు ఆఊళ్లోనే ఉండి ప్రజల్లో గొడవలు సృష్టిస్తూన్నారనీ, వాళ్ళని ఆఊరి నుంచి పంపించాలనీ విహారి ప్రయత్నాలు చేస్తున్నాడు. రెండు వారాల క్రితం అతని మీద దాడి జరిగితే తప్పించుకున్నాననీ, పోలీసు కంప్లెంట్ ఇచ్చాననీ చరణ్ తో చెప్పాడు విహారి . దీప తన ఊరు వెళ్లిపోయింది.
ఆ సమయంలో చరణ్ కి దీప నుంచి ఫోన్ వచ్చింది. తన అన్నయ్య శ్రీహర్ష వచ్చాడనీ, ఇక ఇక్కడే ఉ౦టాడనీ, కాబట్టి ఒకసారి రమ్మనమనీ అతన్ని పిలిచింది.
కానీ ఆ సమయంలో పొలం నూర్పు పనులు అవుతుండడంతో వెంటనే వెళ్లలేకపోయాడు చరణ్ . వారం తరువాత దీపా వాళ్లింటికి వెళ్లాడు.
శ్రీహర్షలో ఇపుడు బాగా మార్పు వచ్చింది. పూర్వపు దూకుడు తగ్గింది. చరణ్ ని చూడగానే లేచి కావలించుకున్నాడు.. ఒక్క సారిగా అతని కళ్ళు చెమర్చడం చరణ్ గమనించాడు.
" చరణ్ ! నీ సహాయం లేకపోతే నేనీ రోజు ఇండియాకి వచ్చేవాణ్ణి కాదు. నువ్వు ఏం చెప్పాలో గానీ రంగనాథ్ లాయర్ గారు నాకోసం ఎంతో కష్టపడ్డాడు. ఎన్నో పిటిషన్లు వేసాడు. అమెరికాలో కోర్టుల్లో కేసులు వెయ్యడం, గెలవడం చాలా కష్టం. అతను చాల ధనవంతుడు, గొప్ప లాయర్ కాబట్టి నన్ను ఆ ఊబి నుంచి బయటకు లాగాడు ; దానివల్ల నేను కేసు గెలిచి, మళ్ళీ ఆ కంపెనీ నా వశమైంది. నన్ను మోసం చేసిన వాళు ఇపుడు జైల్లో ఉన్నారు. కానీ నాకెందుకో అమెరికా అంటే ఎలర్జీ పుట్టింది. ఇంక అక్కడ ఉండబుద్ధి కాలేదు. అందుకే నా స్నేహితుడు ద్వారా ఆ కంపెనీ ని అమ్మేసి వచ్చేసాను. ఇక నేను ఇక్కడే ఉండి అమ్మా, నాన్నలకు సేవ చేసుకుంటూ గడిపేస్తాను. ఇందుకు కారణమైన నీకు ఎలా కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తెలియటం లేదు" అన్నాడు శ్రీ హర్ష.
“ హర్షా !నేనెక్కడో చదివాను.. అందమైన పచ్చటి లోయను చూడాలంటే ఎత్తైన కొండని కష్టపడి ఎక్కాలి" అని! జీవితం కూడా అంతే.. కష్టాలు, నష్టాలు, బాధలు, ఆనందాలు వస్తూ పోతుంటాయి. ఏవీ శాశ్వతం కావు . ఇక్కడే ఉంటానన్న నీ నిర్ణయం చాలా గొప్పది. అది కొడుకుగా నీ బాధ్యత ;. మీనాన్న, అమ్మ చాలా అదృష్టవంతులు' అన్నాడు చరణ్.
" చరణ్ గారు! ఆరోజు మాదీప వివాహం గురించి మీరు చెప్పినప్పుడు నేను మీమాటని మన్నించలేదు. అందుకు క్షంతవ్యుణ్ణి.. మీ గురించి, మీరు మీ స్నేహితులకు చేస్తున్న సహాయాలు ఇప్పుడిపుడే తెలుస్తున్నాయి. మీ లాంటి వారు అరుదుగా ఉంటారు. కాబట్టి ఇపుడు చెబుతునాను.. కొద్దిరోజుల్లోనే దీప పెళ్లి విహారితో జరిపిస్తాను. ” అన్నాడు పరమేశ్వరం.
ఆ మాటలు లోపలి గదిలోంచి వింటున్న దీప కళ్ళలో నీరు.. చరణ్ లాంటి మనుషులు బయటకు సాదాసీదాగా కనిపిస్తారు. కానీ వాళ్ళు మంచు పల్లకి లాంటివాళ్ళు.. ఇతరుల కోసం చాలా చేస్తారు. అతనే లేకపోతే ఇన్ని చిక్కులు విడేవికావు.
ఆ రోజంతా చరణ్ అక్కడే ఉన్నాడు. శ్రీహర్ష, చరణ్ తమ కాలేజి కబుర్లు నెమరువేసుకున్నారు. ఏటికి వెళ్లారు. తరువాత పొలానికి వెళ్లారు. చాలా రోజులు తరువాత చరణ్ కి ఆనందం కలిగింది;. తను న్యాయవాది వృత్తిని ఎంచుకున్నపుడు ఎన్నో ఆలోచనలు.. కానీ ఇపుడు తను తీసుకున్న నిర్ణయం సహేతుకమనిపిస్తోంది. న్యాయవాది వృత్తి అనేది చాలా గొప్పది. డబ్బు సంపాదన కాదు. తోటి వాళ్ళకు సహాయం చేసే అవకాశాలు ఇందులో ఎక్కువ; ఆ మర్నాడు చరణ్ తన ఊరు బయలుదేరి వచ్చేసాడు.
వారంరోజుల తరువాత ఢిల్లీ నుంచి సౌదామిని ఫోన్ చేసి "వాళ్లమ్మ గారికి తరచు ఆరోగ్యం బాగుండడం లేదు అనీ , ఢిల్లీ వాతావరణం ఆమెకు నప్పటం లేదనీ, అందుకే ఢిల్లీని వదలి ఇంకెక్కడికైనా వెళ్ళిపోదామని అనుకుంటున్నట్లు" చెప్పింది.
" మరి ఉద్యోగం" అని అడిగాడు చరణ్.
“ ఈ కరోనాతో ఇంకేం ఉద్యోగాలు చేస్తాము చరణ్;ఎన్నో రెస్ట్రిక్షన్స్ ! ఎక్కడికీ వెళ్లలేము. అందుకని ఏ పల్లెటూర్లో నైనా ఉండాలని ఉంది. మా నాన్నగారి ఊరు వెళదామంటే అక్కడ నాకు తెలిసిన వారెవ్వరరూలేరు. ఈసమయంలో అమ్మని ఏదైనా వృద్ధాశ్రమంలో చేర్పిస్తే తప్ప నేను ఉద్యోగం చెయ్యలేను . ఆమెని ఒంటరిగా వదిలి వెయ్యటం నాకిష్టంలేదు.. ” అని చెప్పింది.
“ ఓ పని చెయ్యి. మాఊళ్లోనే వీధి చివర్లో మాకు ఇంకో ఇల్లు ఉంది. ప్రస్తుతం అది ఖాళీ. అక్కడ మొక్కలు, చెట్లు పెంచుతుంటాను. ఒకపుడు మా మేనత్త అందులో ఉండేది. ఇపుడావిడ కొడుకు దగ్గరకు వెళ్లిపోయింది. అందులో నువ్వు మీ అమ్మ ఉండండి. ప్రశాంతమైన జీవనానికి, మాఊరు చాలా బాగుంటుంది. చూసావుకదా?
" అమ్మకైతే బాగుంటుంది. పల్లెటూరు కాబట్టి కాలక్షేపం అవచ్చు. దాని ఆరోగ్యం కూడా కుదుటపడోచ్చు. ” అంది సౌదామిని.
" కరోనాతో మన జీవన విధానంలోనే మార్పులు వచ్చాయి. రాను రాను మనం బయటకెళ్ళి ఉద్యోగాలు చేసే అవకాశాలు తగ్గిపోతున్నాయి. అలా వెళ్లడం కూడా కొన్నాళ్ళ దాకా మంచిది కాదు. ఒక సంవత్సరం లోపు వ్యాక్సిన్ కనుక్కొంటే అపుడు ఈవైరస్ పూర్తిగా నిర్మూలించబడి పరిస్థితులు చక్కబడోచ్చు. ఏదైనా కొన్ని సంవత్సరాలు తక్కువ జనాభా ఉన్న పల్లెలే మంచివి.. . మీరింకేం ఆలోచించకుండా ఎల్లుండి ఆదివారం బయలుదేరి వచ్చేయండి. నేను స్టేషన్ కి వస్తాను. ” అన్నాడు.
అనుకున్నట్లు గానే ఆమె, వాళ్ళమ్మగారు కలిసి రైల్లో వచ్చారు. సందీప్ స్టేషన్ కి వెళ్ళి వాళ్ళను ఊళ్ళోకి తీసుకొచ్చి తిన్నగా తన ఇంటికి తీసికెళ్లి వివరాలను వాళ్ళమ్మకి చెప్పాడు. వాళ్ళమ్మ కూడా సంతోషించింది. అమధ్యాహ్నం భోజనాలు తరువాత వాళ్లని సామానులతో సహా ఆఇంట్లోదించి వచ్చాడు. ఆతరువాత తన ఇంట్లో వస్తువుల్ని, సామాన్లను చరణ్, వాళ్ళ రైతు ఆ ఇంటికి తీసుకెళ్లారు.
సాయంత్రం చరణ్ ఆ ఇంటికి వెళ్లేసరికి ఇంటి రూపురేఖలు మారిపోయి కనిపించింది;. ఇల్లు చాలా నీట్ గా సర్దింది సౌదామిని . ఇంటి పెరట్లో బోలెడు పాదులు, పూల మొక్కలు, చెట్లు, మంచినీటికి బోరువెల్, బాత్రూమ్స్ చాలా విశాలంగా ఉంది ఇల్లు.. .
" ఎలా ఉంది ఇల్లు” అన్నాడు చరణ్.
"పర్ణశాలలో ఉంది. నాకు నచ్చింది. మా అమ్మకైతే ఇంకా నచ్చింది. ఆమె ఆరోగ్యం ఈవాతావరణానికికుదుట పడుతుందని అనిపిస్తోంది. నాకు కొన్నాళ్లపాటు మొక్కలతో టైంపాస్" అంది సౌదామిని.
ఆ మర్నాడు ఉదయాన్నే చరణ్ మార్నింగ్ వాక్ కోసం ఏటీవైపు వెళ్తున్నాడు. దారిలో సౌదామిని ఇంటి ముందర నీళ్ళు కల్లాపి జల్లి ముగ్గులు పెడుతూ కనిపించింది.
అప్పటికీ రథం ముగ్గు పూర్తి చేసి ఆమె నిలబడింది. ముఖం నిండా చెమట.. సూరీడి లేత వెలుగు కిరణాల వెలుగులో పొడవైన వాలు జడ, తెల్లటి గుండ్రని ముఖం, శంఖం లాంటి మెడ తో ఆమె చాలా అందంగా కనిపిస్తోంది.
చరణ్ అక్కడ ఆగి " " ఇంత తెల్లవారి లేచి ఈముగ్గుల్ని వేస్తున్నారా?” అని ఆమెను అడిగాడు ;
"నాకు తెల్లవారి లేవడం చాలా ఇష్టం.. ముఖ్యంగా ప్రత్యూషపు వేళంటే చాలా ఇష్టం. సిందూరంలాంటి తూర్పు దిక్కన్నా , లేత బాలభానుడి కిరణాలన్నా ఇష్టం; ప్రాగ్దిశ వీణియపైన, దినకర మయూఖ తంత్రుల పైన” సంగీతాన్ని ఆలపించడం ఇష్టం.. ” అంది కవితాత్మకంగా.. .
"అబ్బో.. . మీకు కూడా కవిత్వం బాగా వచ్చునే".. .. అన్నాడు చరణ్ నవ్వుతూ.
"నిజంగా పల్లె అందాలు వర్ణించలేము.. పట్టణ రణగొణ ధ్వనులు నుంచి ఈనిశ్శబ్దపు లోయకి రావడం చాలా బాగుంది; " అంది సౌదామిని.
కాలచక్రం తన భ్రమణాన్ని కొనసాగిస్తోంది. రానురాను సౌదామిని తల్లి ఆరోగ్యం మెరుగు పడసాగింది. సౌదామిని కి కాలం త్వరత్వరగా గడిచిపోతోంది. ఆఊరు, ఆఇల్లు, అక్కడి వాతావరణం ఆమెకు ఎంతో దగ్గరై పోయాయి . చరణ్ వాళ్లింటికి ఆమె అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. చరణ్ మాత్రం ఆమె ఇంటికి వెళ్ళటంలేదు. పల్లె కాబట్టి అతనికి తన హద్దులు తెలుసు.. ఎవరికీ అవకాశం ఇచ్చే రకం కాదు అతను.
ఒక నెలరోజులతరువాత విహారి, దీప చరణ్ దగ్గరికి వచ్చారు. సౌదామిని ఊర్లో ఉంటోందని తెలిసి దీప చాలా సంతోషించింది.
ఇద్దరూ తమ వివాహం ముహూర్తం కుదిరిందని చరణ్ కీ, సౌదామినికీ పెండ్లి శుభలేఖలు యిచ్చి వారం రోజుల ముందే వివాహానికి రమ్మన్నారు. పెండ్లి దీప ఇంటి దగ్గరే జరుగుతుంది. విందు విహారి ఊళ్ళో..
ఆశుభలేఖల్ని చూసి చరణ్ , సౌదామిని చాలా సంతోషించారు. ఆమర్నాడే వాళ్ళు వెళ్లిపోయారు. ఇది జరిగిన రెండు రోజుల తరువాత విహారి చరణ్ కి ఫోన్ చేసి ఒక ఘోరం జరిగింది వెంటనే రమ్మనమని చెప్పడంతో చరణ్ వెంటనే తన జీపులో బయలుదేరాడు;. కానీ అక్కడ విహారి లేడు.
బాక్సెట్ మైనింగ్ కేసులో ఓడిపోయినందుకు ఆ కంపెనీ డైరక్టర్ సాంబశివరావు విహారి మీద కక్ష గట్టాడనీ, అతను ప్రస్తుతం బెయిల్ మీద వచ్చి ఆ ఊళ్ళోనే ఉన్నాడనీ, కొందరు వ్యతిరేక వ్యక్తులతో చేతులు కలిపి విహారిని చంపేందుకు కుట్రలు పన్నుతున్నాడనీ, ఇప్పటికి రెండుసార్లు అటువంటి ప్రయత్నాలు జరిగాయనీ చెప్పింది దీప.
రెండు రోజులు క్రితం విహారి స్నేహితుడి భార్యను అతని మనుషులు జీపులో తీసికెళ్ళి మానభంగం చేయబోతుంటే విహారి వెళ్లి అడ్డుకున్నడనీ, ఆ గొడవలో ఒక వ్యక్తి చనిపోయాడనీ, ప్రస్తుతం విహారి పోలీసు స్టేషన్లో లాకప్పులో ఉన్నట్లు చెప్పింది దీప..
=================================================================================
=================================================================================
గన్నవరపు నరసింహ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
Podcast Link
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం
గన్నవరపు నరసింహ మూర్తి గారు ఎం టెక్ చదివారు.ప్రస్తుతం విశాఖ పట్నంలో రైల్వే శాఖలో జాయింట్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. వీరు ఇప్పటిదాకా 300 కథలు ,10 నవలలు రచించారు. ఏడు కథా సంపుటాలు ప్రచురించారు. స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి దగ్గర ఒక గ్రామం.
コメント