top of page

అశ్వ మేధం ఎపిసోడ్ 12

Updated: Jul 29, 2023


'Aswamedham - Episode - 12' - New Telugu Web Series Written By Gannavarapu Narasimha Murthy


'అశ్వ మేధం - ఎపిసోడ్ - 12' తెలుగు ధారావాహిక (చివరి భాగం)


రచన : గన్నవరపు నరసింహ మూర్తి


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


జరిగిన కథ:


చరణ్ ఒక లా గ్రాడ్యుయేట్. ఢిల్లీలో జరిగే ఒక కోర్స్ కి అటెండ్ అవుతాడు. అక్కడ అతనికి సౌదామిని అనే యువతి పరిచయం అవుతుంది. ఇంటికి తిరిగి వచ్చిన చరణ్ ని శాంతి అనే యువతి కలిసి న్యాయ సహాయాన్ని అభ్యర్థిస్తుంది.


సుక్కు అనే గిరిజనుడు చనిపోయిన సంఘటనను తన భర్త చైతన్య వీడియో తీసాడనీ, ఆ కోపంతో పోలీసులు తన భర్తను అరెస్ట్ చేశారనీ చెబుతుంది ఆమె. చరణ్, కేస్ వేయడంతో చైతన్యను కోర్ట్ లో హాజరుపరుస్తారు పోలీసులు. అతను బెయిల్ పై బయటకు వస్తాడు.


జాతీయ హరిత ట్రిబ్యునల్ సెక్రటరీ రాఘవన్ ని ఎవరో హత్య చేస్తారు. రాఘవన్ హంతకుల చిత్రాలు గీస్తుంది దీప. పోలీస్ స్టేషన్ లో వాళ్ళ ఫోటోలను గుర్తు పడుతుంది. రాఘవన్ హత్యకేసు విచారణలో చరణ్ బాగా వాదిస్తాడు. దోషులు అరెస్ట్ అవుతారు.


దీప తండ్రి పరమేశ్వరం గారిని కలుస్తాడు చరణ్. దీప, విహరిలకు పెళ్లి చెయ్యమని కోరుతాడు.


మైనింగ్ కాంట్రాక్ట్ రద్దు చెయ్యమంటుంది కోర్ట్.

దీప, విహారీల వివాహానికి అంగీకరిస్తాడు దీప తండ్రి పరమేశ్వరం.

విహారి పోలీసు స్టేషన్లో లాకప్పులో ఉన్నట్లు చరణ్ కి ఫోన్ చేసి చెబుతుంది దీప. .


ఇక అశ్వ మేధం ఎపిసోడ్ 12 (చివరి భాగం) చదవండి. .


ఆమర్నాడు దీపతో కలిసి చరణ్ పోలీసుస్టేషన్ లో ఉన్న విహారిని కలిసి “ఏం జరిగింది”? అని అడిగాడు. విహారి గెడ్డంతో నీరసంగా కనిపించాడు.

"మొన్న మా రైతు రాజయ్య భార్య సీత, పొలం నుంచి వస్తుండగా ఆ కంపెనీలో పనిచేస్తున్న సుధాకర్ అనే ఉద్యోగి ఆమెని జీపులో బలవంతంగా కంపెనీలోకి తీసికెళ్లి పోతున్నట్లు రాజయ్య వచ్చి చెప్పడంతో నేను నా పిస్టల్ తీసుకొని మోటారు సైకిల్ మీద అక్కడికి వెళ్లాను. రెండేళ్ళ క్రితం నేను లైసెన్స్ పిస్లల్ ని కొన్న విషయం నీకు తెలుసుకదా. . నేను అక్కడికి వెళ్ళే సరికి ఆమెని మానభంగం చెయ్యబోతున్నాడు సుధాకర్.


నేను ఆమెని వదిలేయమని ఎంతచెప్పినా వాడు వినలేదు. చివరకు పిస్టల్ తీసి వాడిమీద గురిపెట్టి ఆమెని వదిలి వెయ్యమని చెప్పినా వాడు వినలేదు. ఈలోగా పిస్టల్ పేలిన శబ్దం. . వాడు రక్తం కక్కుకుని పడిపోయాడు. నిజానికి నేను వాడిని భయపెట్టానే కానీ పిస్టల్ని పేల్చలేదు. అదీ జరిగింది” అని చెప్పాడు విహారి.


“నువ్వు పిస్టల్ని పేల్చకుండా అదెలా పేలింది. వాడెలా చనిపోయాడు. . ఆశ్చర్యంగా ఉందే. . పొరపాటున పేల్చావేమో చూసుకున్నావా?” అని అడిగాడు చరణ్.


"చూసుకున్నాను. పిస్టల్లో గుళ్ళు అన్నీ ఉన్నాయి. అయినా పోలీసులు వచ్చి నన్ను అరెస్ట్ చేసి లాకప్పులో పెట్టారు. నేను పేల్చలేదని చెప్పినా వాళ్ళు నాపిస్టల్ని సీజ్ చేసి వాడి బాడీని పోస్టు మార్టెమ్ కి పంపారు. ”


"మరి ఎవరి పిస్లల్ పేలింది? ఏం జరిగింది?అతను ఎలా చనిపోయాడు”?


"నేను గురిపెట్టిన సమయంలో ఎవరో నా వెనకనుంచి వచ్చి వాడిని కాల్చేసి పారిపోయాడు. నేను శబ్దం రాగానే వెంటనే వెనక్కి తిరిగి పిస్టల్ పేల్చిన వాడిని వెంబడించాను.


కొందిదూరం తరువాత వాడు నాచేతికి చిక్కాడు. ఇద్దరికీ పెద్ద పెనుగులాట జరిగింది. అప్పటికీ నాతో వచ్చిన మా రైతులు ఇద్దరు పరుగున వస్తుండడంలో నన్ను తోసేసి పారిపోయాడు. ఆసమయంలో వాడి మెడలోనున్న గొలుసుని పట్టుకోబోతే అది తెగిపోవడంతో వాడు తప్పించుకొని పారిపోయాడు. ”అని చెప్పాడు విహారి.


"మరి ఆ గొలుసు ఏది? అది దొరికితే వాడిని గుర్తించవచ్చు" అన్నాడు చరణ్.


ఆ గొలుసు అక్కడే పడిపోయింది. వెతికితే బహుశా దొరకవచ్చు" అన్నాడు విహారి.


"ఇప్పుడదే కీలకం. సర్లే. . మీ వాళ్ళకి ఎవరికైనా చెప్పి దాన్ని వెతికించి ఇక్కడికి తెప్పించే ఏర్పాట్లు చెయ్యి. . రేపు నేను పోలీసులతో మాట్లాడి నిన్ను బయటకు తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తాను. ” అన్నాడు చరణ్.


ఆమర్నాడు ఉదయం పదిగంటలకు పోలీసుస్టేషన్ కు వెళ్లాడు చరణ్. . అక్కడే విహారిని లాకప్పులో ఉంచారు. ఈలోగా అదృష్టవశాత్తు హత్య జరిగిన ప్రదేశంలో గొలుసు దొరకడంతో దానిని తీసుకువచ్చాడు రాము అనే రైతు. అది ఒక ఇత్తడి లాకెట్. . దాని చైన్ తెగిపోయి ఉంది. ఆలాకెట్లో సాయి బాబా బొమ్మ ఉంది. దానిమీద ఏవిధమైన పేరుగానీ, ఆనవాళ్ళు గానీ దొరకలేదు. అది ఒక చక్రం లాగ ఉంది. మరో అరగంటలో ఎస్సై వచ్చాడు స్టేషన్ కి. అతని పేరు ప్రతాప్. .


చరణ్ తనని పరిచయం చేసుకొని విహారి గురించి చెప్పాడు.


" కోర్టు చెప్పినా సరే మైనింగ్ కంపెనీ వాళ్ళు ఆఊరుని వదలకుండా ఊళ్ళో చాలా అల్లర్లు సృష్టిస్తున్నారు. వాళ్ళే విహారిని అక్కడికి రప్పించి ఇంకొకరి చేత ఈ హత్యను చేయించారు. విహారి పిస్టల్లో గుళ్ళు అన్ని ఉన్నాయి. అయినా పోలీసులు వచ్చి అతన్ని అరెస్ట్ చేసి లాకప్పులో పెట్టారు. నేను పేల్చలేదని చెప్పినా మీ వాళ్ళు అతని మాటలు వినకుండా పిస్టల్ని సీజ్ చేసి వాడి బాడీని పోస్టు మార్టెం కి పంపారు. ”అని చెప్పాడు చరణ్.


“అతని పిస్టల్ అసలు పేలలేదు. మీరు గమనించారా? అసలు ఆచనిపోయిన సుధాకర్ శరీరంలో దిగబడిన బుల్లెట్ ని పరిశీలిస్తే తెలుస్తుంది కదా అది ఏ పిస్టల్ నుంచి వచ్చింది అన్న విషయం. . అవన్ని పరిశీలించకుండా విహారిని ఎలా అరెస్ట్ చేసారు?ఇంకో ముఖ్య విషయం. ఆ సుధాకర్ని కాల్చింది రమణ అనీ ఆ ఊరి వాడే. అతను ఆ మైనింగ్ కంపెనీలోచాల రోజులనుంచీ పని చేస్తున్నాడు. పేల్చిన వెంటనే తను పారిపోతుంటే విహరి బాబు తనని వెంటపెట్టాడనీ, పెనుగులాటలో తన లాకెట్ తెగిపోయిందనీ, ఆ భయంలో వెళ్తున్నపుడు తన మోటారు సైకిల్ బ్రిడ్జిలోకి పడిపోవడంతో కిందపడి దెబ్బలు బాగా తగిలాయని, ఎవరో వచ్చి హాస్పిటల్లో చేర్పించారనీ డాక్టరు తో చెప్పాడు. ఆ లాకెట్ తనదేనని చెప్పాడు కూడా. మీరు హాస్పిటల్ కి వస్తే అతని వాంగ్మూలం తీసుకోవచ్చు" అని చరణ్ చెప్పాడు.


ఎస్సై, చరణ్ ఇద్దరు హాస్పిటల్ కి వెళ్లి రమణ వాంగ్మూలం తీసుకున్నారు. అతను తానే సుధాకర్ ని కాల్చి చంపానని, కంపెనీ డైరెక్టర్ రఘువీర్ ఆ పని చేస్తే అయిదు లక్షలు ఇస్తానని చెప్పడంతో ఆ హత్య చేశాననీ, ఆ పిస్టల్ కూడా అతనే ఇచ్చాడనే చెప్పడంతో అతని వాజ్మాలాన్ని డాక్టర్ సమక్షంలో రికార్డ్ చేసాడు ఎస్సై.

. . .

ఆతరువాత పోలీసులు ఆహత్యలో ముద్దాయిలు గా రమణని, రఘువీర్ లను చేర్చి కేసుని ఛార్జి షీటు ఫైల్ చేసారు. విహారిని ఆ కేసుతో సంబంధం లేదని విడిచి పెట్టేశారు.

మైనింగ్ కంపెనీ ఆ ఊర్లో ఉండి అనేక ఆకృత్యాలు చేస్తున్నదని చుట్టుప్రక్కల ఊళ్ళవాళ్ళు వచ్చి పెద్ద గొడవ చెయ్యడంతో ఎమ్యేల్యే రంగనాధం వచ్చి వాళ్ళను ఖాళీ చేయించాడు.


ఇపుడు ఆగ్రామం ప్రశాంతంగా ఉంది. విహారి చరణ్ కి కృతజ్ఞతలు చెప్పాడు.


"చరణ్! నువ్వు నాకోసం, మా ఊరికోసం, ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజల కోసం దుష్ట శక్తులతో, అవినీతి తిమింగలాలతో అలుపెరగని పోరాటం చేసావు. ఒక విధంగా నువ్వు నీ కేరీర్ ని మాకోసం పణంగా పెట్టి ఒక విధంగా అశ్వమేధం చేసావు. అందులో విజయం సాధించావు. అందుకు నీకు, నీకు సహకరించిన సౌదామిని గారికి మేమెంతో ఋణ పడివున్నాము. మీ మేలు మరచిపోము. " అని చెప్పాడు విహారి.


వారం తరువాత విహారి, దీపాల పెళ్లి జరిగింది. కరోనా వల్ల అది చాలా సింపుల్ గా జరిగింది.


వాళ్ళ తల్లితండ్రులు, సౌదామిని, చరణ్, మరికొద్దిమంది హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించి ఇంటికి వచ్చేసాడు చరణ్

********** ******** ********

ప్రత్యూషపు వేళ! తూరుపు దిక్కు సిందూర వర్ణం తో రాగరంజితం అవుతోంది.


చరణ్, సౌదామిని ఆ సమయంలో గుడికి బయలుదేరారు. వాళ్ళ వివాహమై అప్పటికి రెండు రోజులయింది . ఏటి వొడ్డున గుడి. పక్కన అమాయకంగా గల గల మని శబ్దం చేస్తూ పారుతున్న ఏరు . అది జల తరంగిణిలా వినిపిస్తోంది. కార్తీకం కావడంతో ఏట్లో వదలిన కార్తీక దీపాలు ఆకాశంలో చుక్కల్లా మెల్లమెల్లగా వస్తున్నాయి.


చరణ్, సౌదామిని మౌనంగా నడుస్తూ గుడిలోకి ప్రవేశించేరు. చరణ్ సౌదామినిని కన్నార్పకుండా చూస్తున్నాడు.


గుడి ప్రాంగణంలో సౌదామిని ఆకుపచ్చని పట్టుచీరలో ధగధగ మెరిసిపోతూ అప్సరసను గుర్తుకు తెస్తున్నాది. ఇంట అందమైన భార్య తనకు లభించినందుకు అతను చాలా ఆనందంగా వున్నాడు. ఆ ప్రభాత సమయంలో ఆమెను అక్కడ చూస్తుంటే అతనికి తిలక్ అమృతం కురిసిన రాత్రి లోని


"ఎన్ని సరదాల అగరువత్తులు వెలిగించుకున్నాను.

ఎంత కాంక్షా శ్రీ గంధమ్ము మైనలది కొన్నాను”.

అన్న గేయం గుర్తుకురాసాగింది.


దేవాలయం నుంచి గుడిగంటల ధ్వని లయబద్ధంగా వినిపిస్తోంది. శ్వేత వర్ణపు గుడి శిఖరంమీద తెల్లటి పావురాలు ఎగురుతూ శాంతి సందేశం వినిపిస్తూన్నాయి.


గుడిలోంచి అలలు అలలుగా మంద్రంగా "జగదానంద కారకా జయజానకీ"అన్న త్యాగరాజ కీర్తన వీనులకు విందు కలిగిస్తూ ఆ ప్రభాతానికి ఒక పవిత్రతని ఆపాదిస్తుంటే ఆ జంట గుడిలోకి ప్రవేశించారు.


ఇద్దరు గర్భగుడి లోకి ప్రవేశించి మహేశ్వరుని దర్శనం చేసుకున్నారు. పూజారి హారతి వెలిగించి మంత్రోచ్చారణ చేస్తూ వాళ్లకి తీర్థం ఇచ్చాడు.


ఆహారతి వెలుగులో నిటలాక్షుడు వెలిగిపోతున్నాడు.


"వాగర్థావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయేత్

జగతే పితరే వందే పార్వతీ పరమేశ్వరం" అని చదువుతూ తీర్ధం అందుకున్నారు వాళ్లిద్దరూ.


ఆతరువాత ఇద్దరూ బయటకొచ్చారు. గుడిగంటల శబ్దం వినిపిస్తుంటే వాళ్ళు మండపం లో కూర్చున్నారు. సౌదామిని అతనికి ప్రసాదం ఇచ్చింది. దూరంగా మైకులో


"పిబరే రామరసం రసనే

పిబరే రామరసం" మంద్రంగా వినిపిస్తోంది. ఆ సమయంలో సౌదామిని పక్కన ఉండటం అతనికి హాయిగా తోచింది.


"సౌదామినీ! నీ పేరుకి అర్ధం తెలుసా?" అని నవ్వుతు అడిగాడు చరణ్.


ఆమె కళ్ళను చక్రాల్లా తిప్పుతూ "తెలియదు. మీరు చెప్పండి?" అంది చిరు నవ్వుతో .


తెలిసో తెలియకో నీకు సరిగ్గా సరిపోయిన పేరే పెట్టారు. ఇప్పుడు చెప్పు దానర్ధం?" అన్నాడు చరణ్ మళ్ళీ నవ్వుతూ .


నా కంత పరిజ్ఞానం లేదు గాని మీరు చెప్పండి. " అంది.

"మెరుపు . నిజంగా నువ్వు మెరుపు తీగవే' అన్నాడు చరణ్.


అతని మాటలకు ఆమె చిరునవ్వు నవ్వి "నేను చాలా అదృష్ట వంతురాలిని" అని అంది.


సౌదామినితో తన భవిష్యత్ జీవితాన్ని అందంగా ఊహించుకుంటూ కళ్ళు మూసుకున్నాడు చరణ్.


అప్పుడు ఆ జంటను ఆశీర్వదిస్తున్నట్లు గుడి గంటలు మ్రోగ సాగాయి. ఆ గంటల సవ్వడి ప్రణవ నాదంలా వీనులకు విందు చేస్తుంటే ఆ జంట ఆనందంతో ఇంటికి బయలు దేరారు.

=================================================================================

*****సమాప్తం*****


ఈ ధారావాహికను ఆదరించిన పాఠకులకు మనతెలుగుకథలు.కామ్ వారి తరఫున, రచయిత శ్రీ గన్నవరపు నరసింహ మూర్తి గారి తరఫున అభివాదాలు తెలియజేసుకుంటున్నాము.

=================================================================================

గన్నవరపు నరసింహ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

Podcast Link:

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం

గన్నవరపు నరసింహ మూర్తి గారు ఎం టెక్ చదివారు.ప్రస్తుతం విశాఖ పట్నంలో రైల్వే శాఖలో జాయింట్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. వీరు ఇప్పటిదాకా 300 కథలు ,10 నవలలు రచించారు. ఏడు కథా సంపుటాలు ప్రచురించారు. స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి దగ్గర ఒక గ్రామం.




1 Comment


@vidyasagarvesapogu7043 • 9 hours ago

Vyakthi sukamkante samajasukam atyavasaram Ani thelipina kadha thankyou sir

Like
bottom of page