top of page
Writer's pictureNarasimha Murthy Gannavarapu

అశ్వ మేధం ఎపిసోడ్ 3


Written By Gannavarapu Narasimha Murthy

'అశ్వ మేధం - ఎపిసోడ్ - 3' తెలుగు ధారావాహిక

రచన : గన్నవరపు నరసింహ మూర్తి


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


జరిగిన కథ...

చరణ్ ఒక లా గ్రాడ్యుయేట్. ఢిల్లీలో జరిగే ఒక కోర్స్ కి అటెండ్ అవుతాడు. అక్కడ అతనికి సౌదామిని అనే యువతి పరిచయం అవుతుంది. తాజ్ మహల్ వద్ద ఇరువురూ మళ్ళీ అనుకోకుండా కలుస్తారు.


ఇంటికి తిరిగి వచ్చిన చరణ్ ని శాంతి అనే యువతి కలిసి న్యాయ సహాయాన్ని అభ్యర్థిస్తుంది.

సుక్కు అనే గిరిజనుడు చనిపోయిన సంఘటనను తన భర్త చైతన్య వీడియో తీసాడనీ, ఆ కోపంతో పోలీసులు తన భర్తను అరెస్ట్ చేశారనీ చెబుతుంది ఆమె. చరణ్, కేస్ వేయడంతో చైతన్యను కోర్ట్ లో హాజరుపరుస్తారు పోలీసులు. అతను బెయిల్ పై బయటకు వస్తాడు.


ఇక అశ్వ మేధం ఎపిసోడ్ 3 చదవండి..


ఆరోజు ఆదివారం కావడంతో ఉదయాన్నే బయలుదేరి తన ఊరు వచ్చాడు చరణ్; ప్రతీ ఆదివారం తన ఊరువచ్చి వ్యవసాయ పనులు చూడటం చరణ్ కి అలవాటు; అతనికి ఆఊళ్ళో వారసత్వంగా వచ్చిన పాతికెకరాల పల్లం పొలం ఉంది. అందులో అతను వరి, చెఱకు పండిస్తాడు. వాటికోసం నలుగురు రైతులు వున్నారు. పకీరు, పోలన్న, సోమన్న, రావుడు.. వీళ్ళు చరణ్ అంటే ప్రాణం పెడతారు. పల్లానికి తోడు ఏటికి అవతల ఐదెకరాలు మామిడితోట ఉంది. ఏటి నుంచి మోటార్ల ద్వారా తోటలోకి నీరు వెళ్ళేటట్లు పైపులైను వేయించాడు. ప్రతీ సంవత్సరం ఐదారు వేల మామిడి కాయలు.. ముఖ్యంగా బంగినపల్లి, కలెక్టర్ మామిడి కాయలు పండుతాయి. పల్లం పొలాల్లో రెండు ట్యూబ్ వెల్స్ వేయించి మొత్తం మడు లన్నిటికీ పైపుల ద్వారా, బట్టీల ద్వారా అనుసంధానం చెయ్యడంతో వరి పంట సమృద్ధిగా పండుతోంది ; వాళ్ళ తాతగారు ఏభై సంవత్సరాల క్రితం కట్టిన పాత పెంకుటిల్లు స్థానంలో పెద్ద డాబా ఇల్లు కట్టి చుట్టు మొక్కలు వేసాడు. పెరడు రెండెకరాలుంటుంది. పెద్ద ట్యూబ్ వెల్.. రోజూ చరణ్ అమ్మ విమల ఆతోటలోని అన్ని పాదులకు నీళ్ళు పెడుతుంది. దొండ, బీర, వంగ, బెండ, చిక్కుడు, ఆనప, గుమ్మడి, పొదులతో పాటు చింత, వేప, నేరేడు చెట్లు కూడా ఉన్నాయి. ఇంత పొలం, ఇల్లు ఉండటం అదీకాక తను ఒక్కడే కొడుకు కావడంవల్ల చరణ్ లా చదువుకున్నా దగ్గరలో ఉన్న చిన్న పట్టణంలో కేసులు చూస్తూ ఇంటి దగ్గర వ్యవహారాలు చూసుకోవలసి వచ్చింది. అతని నాన్నగారు చనిపోయిన తరువాత అమ్మ తనిని పెంచి పెద్ద చెయ్యటానికి ఎంత కష్టపడిందో చరణ్ కి బాగా తెలుసు; ఆదివారం నాడు తాను వస్తాననీ, చరణ్ ని స్టేషను కి రమ్మనమని సౌదామిని చెప్పడంతో చరణ్ స్టేషన్ కి వచ్చాడు; తొమ్మిదన్నర ప్రాంతంలో అతను స్టేషన్ కి చేరుకున్నాడు; వాళ్ళ ఊరికి రైల్వేస్టేషన్ 15 కిలోమీటర్లు ఉంటుంది;. మరో అరగంటలో పాసింజర్ వచ్చి ఆగింది. కొంచెం సేపటికి తరువాత సౌదామిని స్లీపర్ బోగిలో నుంచి దిగింది. చరణ్ ఆమెను చూసి చేయి చూపించడంతో ఆమె త్వరగా అతని దగ్గరకు వచ్చింది. “హాయ్! ఎలా ఉన్నారు?" అన్నాడు చరణ్; “బాగున్నాను ; మీరు” “ఫైన్.. ఏమిటి చెప్పకుండా ఇంత సడన్ గా దిగారు. ” అన్నాడు ఆమె బాగు అందుకుంటూ.. “పదండి.. వెళ్తూ మాట్లాడుకుందాం” అని ఆమె చెప్పడంతో చరణ్ ఆమెని జీపు దగ్గరకు తీసికెళ్ళాడు. మరో పది నిముషాల్లో వాళ్ళ జీపు రోడ్డు మార్గం పట్టింది. ఆమె జీపు కదిలిన తరువాత అద్దాలు తీసి చల్లటి గాలి ని ఆస్వాదించసాగింది. ఢిల్లీ లాంటి నగరంలో విపరీతమైన జన ప్రవాహానికి, ఉక్కిరిబిక్కిరి అయ్యే వాతావరణానికి అలవాటు పడ్డ ఆమెకి ఒక్కసారిగా నిర్మానుష్యంగా ఉండే రోడ్డుని, పచ్చనిచెట్లు , నిర్మలమైన నీలాకాశాన్ని, అందులో ఎగురుతున్న పక్షుల్ని చూస్తుంటే ప్రశాంతంగా అనిపించింది. "చాలా బాగుంది ఈ ప్రదేశం.. మీరు చాలా అదృష్టవంతులు" అంది సౌదామిని; “మీరు చెప్పింది నిజమే.. మనదేశంలో 60 శాతం ప్రజలు కేవలం 50 నగరాల్లో ఉన్నారు. పల్లెలన్నీ ఇప్పటికీ కాలుష్యానికి దూరంగానే ఉన్నాయి. అందుకే మీకలా అనిపిస్తోంది. అదిసరే.. మీ రేంటి చెప్పాపెట్టకుండా ఇలా ఊడిపడ్డారు. నిజానికి నేను ఈరోజు మా స్నేహితుడి పుట్టినరోజు కోసం విశాఖపట్నం వెళ్లాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో మనసు మార్చుకుని మా ఊరు వచ్చేసాను. బహుశా మీరొస్తున్నారని నా మనసుకు తెలిసిందేమో".. అన్నాడు నవ్వుతూ.. రోడ్డు కిరువైపులా చెట్లు.. చెట్లపై పక్షుల కిలా కిలా రావాలు; ఆమెకి తిలక్ అమృతం కురిసిన రాత్రిలోని ఒకగేయం గుర్తుకు రాసాగింది. “చరణ్! ఈరోజు మీఊళ్లో మా అన్నయ్య కి పెళ్లిచూపులు.. నన్ను ఎలాగయినా రమ్మనమని చెప్పాడు. వాడు మా దొడ్డమ్మ కొడుకు. మా ఇద్దరిదీ ఒకే వయస్సు; చిన్నప్పటుంచి కలిసి చదువుకున్నాము. వాడు హైదరాబాద్ నుంచి నిన్ననే బయలుదేరాడు; అందుకే నేను అకస్మాత్తుగా ఫ్లైట్ లో విశాఖవచ్చి ఇలా రావలసి వచ్చింది" అని చెప్పింది.. “ఓహూ అదా విషయం.. ఇంతకీ ఏ ఇంటికి వస్తున్నారు . మాఊళ్ళో ఉన్నవే మూడు వందల ఇల్లు.. నాకందరూ తెలిసిన వాళ్ళే.. చెప్పండి. " అన్నాడు చరణ్ ; కారు నిశ్శబ్దంగా సాగిపోతోంది. “ఎవరో సుబ్బారావు గారట.. టీచరు.. బాగా డబ్బున్న వాళ్ళట; వాళ్ళ అమ్మాయి. మాఅన్నతో కలిసి ఇంజనీరింగ్ చదువుకుంది. ఇద్దరూ ఇష్టపడ్డారు. ఇరు కుటుంబాలకు నచ్చిన సంబందంమే, ఇపుడు పెళ్లిచూపులు జస్ట్ ఫార్మాలిటీ. అంతే"! అంది. చరణ్ ఆమాటలకు మౌనం దాల్చేడు. కొద్ది సేపటి మౌనం తరువాత ఆమె అడిగింది. "అందరూ మీకు తెలుసన్నారు కదా. ఈ సుబ్బారావు గారు మీకు తెలియదా?" "అదే ఆలోచిస్తున్నాను.. మా మేనమామ పేరు కూడా సుబ్బారావు.. అతనూ మీరంటున్నట్లు టీచర్.. ఇంకెవరైనా సుబ్బారావు ఉన్నారా అని ఆలోచిస్తున్నాను" అన్నాడు నవ్వుతూ.. అతని నవ్వుని ఆమె అర్ధం చేసుకొని "అంటే పెళ్లికూతురు మీ మేనమామగారి కూతురేనన్న మాట.. మరింకేం.. మీకు తెలిసే ఉంటుంది" అంది నవ్వుతూ ; “తెలుసు; ఆ అమ్మాయి నాకన్నా మూడేళ్ళు చిన్నది. మానాన్నగారు, మామ కలిసి మాఊరి ప్రాధమిక పాఠశాలలో పనిచేసేవారు. వాళ్ళద్దరివీ భిన్న దృవాలు.. అందుకని మొదట్నుంచీ మా కుటుంబాలు కొంచెం దూరంగా ఉంటాయి;" అన్నాడు చరణ్ ; “అంటే ఇప్పుడు మీరు వాళ్ళ ఇంటికి రారన్న మాట".. "అదేం లేదు ; అంత శతృత్వ మేమీ లేదు.. నేను చాలా తక్కువ రోజులు మాఊళ్ళో ఉండటంవల్ల నాకు చాలా కుటుంబాలతో పరిచయాలు తక్కువ. అంతే.. పదండి ఆఇంటి దగ్గర మిమ్మల్ని దించు తాను. నేను వాళ్లింట్లోకి వస్తే వాళ్ళు ఇంకోలా అనుకునే ప్రమాదం ఉంది;" అన్నాడు చరణ్ ; ఎందుకులెండి. నన్ను వాళ్ళింటిముందు దించేయుండి. ఇంతకి ఆకుటుంబం, ఆ అమ్మాయి ఎలాంటి వాళ్లో చెప్పండి? అలా అడగటం తప్పు అయితే ఏమీ అనుకోకండి" "అదేంలేదు.. ఆ అమ్మాయి పేరు హరిణి.. చాలా మంచిది. తెలివైన అమ్మాయి కూడా.. మా మేనమామ కూడా మంచివాడు.. మాకు మొత్తం ముగ్గురు మేనమామలు.. మిగతా ఇద్దరు కూడా ఈ ఊళ్ళోనే ఉన్నారు. ఒక మేనత్త ది ప్రక్క ఊరు.. ఒక విధంగా ఈ పెళ్ళియితే మనం చుట్టాలమవుతాం” అన్నాడు నవ్వుతూ.. "అవును” అంది ఆమె.. ఇంతలో స్కార్పియో ఊళ్ళోకి ప్రవేశించింది. ఊరు మొదట్లో శివాలయం.. పక్కనే ఏరు.. పచ్చటి పొలాల మధ్య ఊరు.. మరి కొద్ది సేపటికే జీపుని ఒక ఇంటి ముందర ఆపాడు చరణ్ ; "ఇదే మీరు వెళ్ళవలసిన ఇల్లు; మామేనమామగారిల్లు.. మీరు వెళ్ళండి. సాయంత్రం మా ఇంటికి రండి. అదిగో ఆ కనిపిస్తున్నదే మా ఇల్లు" అంటూ తన ఇంటిని చూపించాడు. సౌదామిని చరణ్ కి కృతజ్ఞతలు చెప్పి జీపు దిగి ఇంట్లోకి వెళ్ళింది . మళ్ళీ సాయంత్రం నాలుగు అవుతుండగా చరణ్ ఇంటికి వచ్చింది సౌదామిని ; చరణ్ ఆమెకు తన తల్లి విమలను పరిచయం చేసాడు. సౌదామిని తో తనకు స్నేహం ఎలా ఏర్పడిందో చెప్పడంతో ఆమె చాలా ఆనందించింది. సౌదామిని కి దగ్గరుండి ఇల్లంతా చూపించాడు. ముఖ్యంగా పెరటిలోని తోటంతా తిప్పి ఏటి వైపు తీసికెళ్లాడు. సంధ్యా సమయం అవుతోంది. దూరంగా బండరాళ్ళ మధ్య సన్నటి ఏటిపాయ గలగల శబ్ధం చేస్తూ పారుతున్న దృశ్యం ఆమెని కట్టిపడేసింది. ఎర్రటి సంజె కిరణాలు పరావర్తనం చెందుతున్నాయి. ఆ దృశ్యాన్ని చూడగానే " సంజె పెదవుల ఎరుపు కడలి అంచుల విరిగి ఏటి కొంగల నిదుర ఎర్రగా ప్రాకింది " అన్న తిలక్ గేయం గుర్తు కొచ్చిందామెకు.. "చాలా బాగుంది మీ ఏరు” అంది సౌదామిని ; “ఇపుడిలా ఉంది గానీ వర్షాకాలంలో అయితే కనుచూపు మీరంతా నీరే. అది సరే ఇంతకీ మీ అన్న పెళ్లి చూపులు అయిపోయాయా? భోజనాల స్పెషల్స్ ఏమిటి? పెళ్ళి కూతుర్ని పాటలు పాడమన్నారా? మా మామ వాళ్ళకు నాగురించి చెప్పారా?” అని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసాడు.. "ఉండండి, అన్ని ప్రశ్నలూ ఒకేసాడి అడిగితే ఎలా? పూర్వకాలంలో అయితే పెళ్ళి చూపులు.. ఇప్పుడవన్నీ పోయాయి. ఇప్పుడెవరూ మనసు విప్పుకొని మాట్లాడుకోరు. హరిణి అయితే బాగుంది. వాళ్ళద్దరిది చూడముచ్చటైన జంట.. అంతవరకు ఓకే.. ” “కనీసం మా మామా వాళ్ళూ ఆమె పెళ్ళి చూపులనీ మా అమ్మకి కూడా చెప్పలేదు. మా మేనమామకు లోలోపల మా కుటంబమంటే ఇంకా ద్వేషం ఉందన్నమాట. మా అమ్మకి మాత్రం తన తమ్ముళ్లన్నా, అన్న కుటుంబమన్నా ఎంతో ప్రేమ" అన్నాడు చరణ్ ; అన్నయ్య ఈ సాయంత్రం వెళ్ళిపోతాడు. నేనిక్కడ రెండురోజులుంటానని చెప్పాను. అందుకేనా బేగ్ కూడా తెచ్చేసాను ఇక్కడికి. నాకెందుకో ఇక్కడ కొన్ని రోజులుండాలనిపిస్తోంది. మీకేం అభ్యంతరంలేదుగా..' అంది సౌదామిని ; “భలేవారే .. హాయిగా ఉండండి. రేపు మాపొలం చూద్దురుగాని.. మీరుండటానికి సెపరేట్ రూమ్ కూడా ఉంది" అని చెప్పాడు;. ఆరోజు రాత్రి వాళ్ళిద్దరూ వెన్నెల్లో డాబా మీద చాలాసేపటి వరకు మాట్లాడుకున్నారు. సౌదామిని కి ఆ వెన్నెల నచ్చింది. ఢీల్లీలో ఎప్పుడూ ఆమె వెన్నెలని చూడలేదు. అటువంటిది కొబ్బరాకుల సందుల్లోంచి వెన్నెల కిరణాలు పడుతుంటే ఆకాశం నిండా మెరుస్తున్న చుక్కల్ని చాలా ఆనందంతో చూసింది. జీవితంలో మొదటిసారిగా పాలపుంతని చూసింది. అపుడపుడు పడమర నుంచి వస్తూ పలకరించే మలయ మారుతానికి ఆమె ఉక్కిరిబిక్కిరి కాసాగింది. ఆమె మౌనంగా వెన్నెలని ఆస్వాదిస్తుంటే చరణ్ దాన్ని భరించలేక "సౌదామిని గారు! ఏమిటి మీరు కూడా చక్రవాకం పక్షిలా వెన్నెలని తాగేస్తున్నట్లున్నారు" అన్నాడు నవ్వుతూ ; ఆతరువాత ఇద్దరు కిందకు వచ్చారు; ఆ మర్నాడుదయన్నే స్నానానికి ఏటికి తీసుకెళ్ళాడు చరణ్ .. మంచుపూల వర్షం.. అమాయకంగా సవ్వడి చేస్తున్న ఏరు.. ఎదురుగా తూర్పునుదుటన సింధూరంలా ఎర్రటి సూర్యబింబం.. ఆసమయంలో ఆమెకు కృష్ణశాస్త్రి కవిత్వం గుర్తుకు వచ్చింది;. "గలగలని వీచు చిరుగాలిలో కెరటమై జలజలని పారు సెలపాటలో తేటనై” ఆకవిత్వం ఆప్రభాతనమయానికి అన్వయించినట్లనిపించిందామెకు. చాలా సేపు ఏటిలో స్నానం చేసి ఇంటికి వచ్చారు. విమల వాళ్ళకి వేడివేడి ఉప్మా నెయ్యి వేసి వడ్డించింది. సౌదామిని కి ఉప్మా అంటే పెద్దగా ఇష్టం ఉండదు. కానీ ఆరోజు అమృతంలా అనిపించింది. అవురావురు మంటూ మారు అడిగి వేయించుకొని మరీ తిన్నాది.. ముఖ్యంగా అందులో వడ్డించిన తీపి మామిడి ఆవకాయ బాగా నచ్చింది. ఆతరువాత హాల్లో కాఫీలు తాగుతున్నపుడు ఎదురుగా చరణ్ , ఇంకో వ్యక్తితో ఉన్న ఫోటోని చూసి సౌదామిని కొంచెం సేపు అలాగే ఉండిపోయింది. ఆమె ఎందుకలా ఆ ఫోటో వంక చూస్తోందో అర్థం కాలేదు చరణ్ కి .. ఆ తర్వాత పొలానికి బయల్దేరారిద్దరూ ఒక కిలోమీటరు తరువాత గోర్జ.. అంటే దారి.. దాని కిరువైపులా తాటి పెండెలు.. అంటే వరస చెట్లు.. అందులోంచి వెళ్తుంటే ప్రకృతి ఆరబోసినట్లు అనిపించింది ఆమెకు. దాని తరువాత పొలం మొదలైంది. ఆకుపచ్చటి తివాచీ పరిచినట్లున్నాయి వరి చేలు.. మధ్య మధ్యలో నీటి బట్టెలు.. కొంచెం దూరంలో ఆ పొలాల మధ్య చెట్ల కింద బోరింగ్ షెడ్.. అక్కడ డీప్ ట్యూబ్ వెల్ నుంచి పైపుల ద్వారా పొలంలోకి నీళ్ళు.. గలగల శబ్ధంలా సంగీతంలా వినిపిస్తోంది. వాళ్ళరైతు సోమన్న వచ్చి మామిడి చెట్టు కింద కుర్చీలు వేసాడు.. ఆ తర్వాత కొబ్బరి చెట్టు ఎక్కి బొండాలు కోసి ఇచ్చాడు. ఆఎండలో నడిచి రావడం వల్ల ఆకొబ్బరి నీళ్ళు అమృతంలా అనిపించాయి ఆమెకు. "ఇక్కడ మాకు పాతిక ఎకరాలు పొలం ఉంది. ఉద్యోగాలు అనుకుంటాం గానీ వ్యవసాయం జాగ్రత్తగా చేసుకుంటే ఒక కుటుంబం హాయిగా బ్రతకవచ్చు. పైగా దేశానికి పంట రూపంలో మనవంతు సహాయం కూడా.. ఇప్పటి యువతకి ఎంతసేపు ఇతర దేశాలు వెళ్ళిపోవాలన్న ఆరాటం తప్ప ఇంత చక్కటి పల్లెల్ని కోల్పోతున్న విషయాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. నాకెందుకో చిన్నప్పట్నుంచీ మాపల్లెన్నా, ఈ నిశ్శబ్ధం అన్నా చాలా ఇష్టం. రణగణ ధ్వనులు నాకు చిరాకు కలిగిస్తాయి. సాయంత్రం పూట ఈ పొలంలో కూర్చుంటే నాకు సమయమే తెలియదు. అందుకే ప్రతీ శనివారం ఇక్కడికి కొచ్చేస్తాను. శ్రీశ్రీ మహాప్రస్థానంలో చెప్పినట్లు " పొలాలన్నీ హలాలదున్ని ఇలా తలంలో హేమం పిండగ జగానికంతా సౌఖ్యం నిండగ విరామ మెరుగక పరిశ్రమించే బలం ధరిత్రికి బలికావించే కర్షక వీరుల కాయం నిండా కాలువ కట్టే ఘర్మ జలానికి ఘర్మజలానికి ధర్మజలానికి, ఘర్మజలానికి ఖరీదు లేదోయ్‌!” ఎంత చక్కగా వ్రాసేడు శ్రీ శ్రీ .. “పదండి మీకు మా పెద్ద చెరువుని చూపిస్తాను" అంటూ దూరంగా ఉన్న చెరువుకి తీసికెళ్ళాడు. సౌదామిని జాగ్రత్తగా పొలం గట్లని దాటుకుంటూ ఆచెరువు గట్టుకి చేరుకుంది. గట్ట మీదకు వెళ్ళగానే ఒక్కసారిగా చల్లటి గాలి పవనాలు ఆమెని ఉక్కిరి బిక్కిరి చేసాయి. దూరంగా కనుచూపు మేరంతా నీటి వలయం.. ఆచెరువు మధ్యలో ఎగురుతున్న తెల్లటి కొంగలు, నల్లటి నీటి బా తులు.. అవి ఎగురుతుంటే నీరు వలయాలు వలయాలు గా తిరుగుతునాది . అదృశ్యం ఒక తైలవర్ణ చిత్రంలా ఆమెకి గోచరించసాగింది. "చాలా బాగుంది మీ చెరువు.. మొత్తానికి ఈ ప్రాంతమంతా ప్రకృతికి ఆలవాలంలా ఉంది" అని చెప్పింది . అలా చూస్తున్న సమయంలో పడమర సంధ్య ఎరువు వర్ణంలోకి మారిపోసాగింది. సూర్యుని కిరణాలు చెరువులో పడి ఎర్రటి గీతల్లా రూపుదిద్దుకుంటున్నాయి . దూరంగా గోర్జలో ఆవులమంద కనిపించింది. వాటిమీద ధూళి.. ఇంటికి వెళ్ళి పోతున్నాయి. "సౌదామిని ! పదండి.. చీకటి పడుతోంది. గట్లమీద ఈసమ యంలో ప్రయాణం మంచిదికాదు. మీరెపుడైనా 'గోధూళివేళ' అని విన్నారా? ఆపశువులమంద ఇంటికి వెళ్ళేసమయాన్ని అంటే సూర్యాస్తయమానికి ముందర సమయాన్ని అంటారు. ” అన్నాడు చెరువు గట్టు దిగుతూ.. ఇద్దరూ గట్టు మీద వడివడిగా నడవసాగారు ఇల్లు కొంచెం దూరంలో ఉండగా సౌదామిని అడిగింది. “ఉదయం మీ వరండాలో ఒకఫోటో చూసాను. మీతోపాటున్నది. ఎవరు?” ఆమె మాటల్లో తీక్షణత వినిపించింది. "ఓ హెూ! అదా.. నా స్నేహితుడు విహారి ది. మేమిద్దరుం కలిసి చదువుకున్నాము. వాళ్ళది ఇక్కడికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్నపల్లె.. ఏం.. మీకాయనతెలుసా?” ఆమె కొద్దిసేపు మౌనం వహించింది. ఆతరువాత ఇల్లు వచ్చేదాకా ఆమె మాట్లాడకపోవడం అతనికాశ్చర్యం కలిగింది. రాత్రి భోజనాల తరువాత ఇద్దరూ డాబామీద వెన్నెట్లో కూర్చున్నారు. ఇంతలో చరణ్ కి ఫోన్ రావడంతో అతను దూరంగా ఉన్న పిట్టగోడ దగ్గరకు వెళ్ళి చాలాసేపు ఎవరితోనో మాట్లాడి ఆ తరువాత అతను వచ్చి నిశ్శబ్దంగా ఆమె ప్రక్కన కూర్చున్నాడు. "సౌదామిని గారు.. నా స్నేహితుడు విహారి గురించి అడిగి తరువాత మీరు ఎందుకు మౌనం దాల్చేరు. అతను మీకు తెలుసా? ఏదో ఉంది.. చెప్పండి?"అని అడిగాడు. "నాకాయన వ్యక్తిగతంగా తెలియదు. కానీ నా స్నేహితురాలు దీపాంజలి అతన్ని ప్రేమించింది. దీపాంజలి నేను ఇంటర్ దాకా కలిసి చదువుకున్నాం. తరువాత ఆమె విశాఖపట్నం వెళ్ళిపోయింది. వాళ్ళ నాన్నగారికి ట్రాన్సుఫర్ అయిపోవడంతో అక్కడే డిగ్రీలో చేరింది. అపుడే మీ స్నేహితుడు ఆమెకి పరిచయం అయ్యాడు. ఆమెని ప్రేమలోకి దించాడు. దీపా వాళ్ళ నాన్నగారు బాగా డబ్బున్నవాడు. ఆ ఆస్తికోసమే అతను దీపని ప్రేమలోకి దించాడని దీపావాళ్ళ నాన్నగారికి తెలిసింది. ఇది నాలుగేళ్ళ క్రితం సంగతి. ఆతరువాత ఇప్పటిదాకా వాళ్ళ మద్య గొడవలు జరుగుతునే ఉన్నాయి. నేను రెండేళ్ళ క్రితం దీపా వాళ్ళ ఇంటికి వెళ్ళినపుడు ఈ సంగతులన్నీ తెలిసాయి . ఆతరువాత వాళ్ళ కుటంబంలో ఎన్నో ఘర్షణలు.. గొడవలు.. అందుకే ఆ అబ్బాయి ఫోటోని చూడగానే అవన్ని గుర్తుకు వచ్చాయి. ” అంది సౌదామిని. “అతను మంచివాడు కాదనీ, డబ్బుకోసమే ఆమెని ప్రేమించాడనీ మీకెలా తెలుసు? ఆ అమ్మాయి అలా మీకు చెప్పిందా?” చరణ్ అసహనంగా అడిగాడు. "దీప చెప్పలేదు కానీ వాళ్ళ అమ్మ, నాన్నలిద్దరూ చెప్పారు” "మీ ఫ్రెండ్ దీప చిన్న పిల్లేమీకాదు.. పైగా వాడు మోసం చేసే వాడైతే వాళ్ళ ప్రేమ ఇన్నాళ్ళుండదు. ఆ అమ్మాయి వాడినెపుడో వదిలేసేది. ఇక తల్లితండ్రులెపుడూ కొంచెం నెగిటివ్ గా ఆలోచిస్తారులెండి.. ” అన్నాడు చరణ్; "మీ స్నేహితుడు కాబట్టి మీరు అలాగే అంటారు. అతని మంచే మీకు కనిపిస్తుంది. నాణేనికి రెండో వైపు తెలియదు. ”సౌదామిని కూడా కోపంగానే చెప్పింది ; “అదేంలేదు.. మీకు అతని గురించి వాళ్ళు తప్పు చెప్పినట్లున్నారు. ఇపుడు ఫోన్ వాడి దగ్గర్నుంచే.. వాడు ఓ సమస్యలో యిరుక్కున్నాడు. అందుకు రేపు నేను వాళ్ళ ఊరు వెళుతున్నాను ”అన్నాడు చరణ్ ; “సరే.. నన్ను రైల్వే స్టేషన్ లో దింపేయండి. నేను ఏ పి ఎక్సుప్రెస్ లో ఢిల్లీ వెళ్ళిపోతాను. ” అంది సౌదామిని. "సౌదామిని గారు.. రేపు నాతో రండి. వాళ్ళ ఊరు చూద్దురు గాని.. మీకు అతని గురించి తెలుస్తుంది. ” అన్నాడు. సౌదామిని ఇంకేమీ మాట్లాడకుండా మౌనం దాల్చింది.

=================================================================================

ఇంకా వుంది...

=================================================================================

గన్నవరపు నరసింహ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

Podcast Link

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం

గన్నవరపు నరసింహ మూర్తి గారు ఎం టెక్ చదివారు.ప్రస్తుతం విశాఖ పట్నంలో రైల్వే శాఖలో జాయింట్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. వీరు ఇప్పటిదాకా 300 కథలు ,10 నవలలు రచించారు. ఏడు కథా సంపుటాలు ప్రచురించారు. స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి దగ్గర ఒక గ్రామం.

26 views0 comments

Comentarios


bottom of page