top of page
Writer's pictureNarasimha Murthy Gannavarapu

అశ్వ మేధం ఎపిసోడ్ 4


Written By Gannavarapu Narasimha Murthy

'అశ్వ మేధం - ఎపిసోడ్ - 4' తెలుగు ధారావాహిక

రచన : గన్నవరపు నరసింహ మూర్తి

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


జరిగిన కథ..

చరణ్ ఒక లా గ్రాడ్యుయేట్. ఢిల్లీలో జరిగే ఒక కోర్స్ కి అటెండ్ అవుతాడు. అక్కడ అతనికి సౌదామిని అనే యువతి పరిచయం అవుతుంది. తాజ్ మహల్ వద్ద ఇరువురూ మళ్ళీ అనుకోకుండా కలుస్తారు.


ఇంటికి తిరిగి వచ్చిన చరణ్ ని శాంతి అనే యువతి కలిసి న్యాయ సహాయాన్ని అభ్యర్థిస్తుంది.

సుక్కు అనే గిరిజనుడు చనిపోయిన సంఘటనను తన భర్త చైతన్య వీడియో తీసాడనీ, ఆ కోపంతో పోలీసులు తన భర్తను అరెస్ట్ చేశారనీ చెబుతుంది ఆమె. చరణ్, కేస్ వేయడంతో చైతన్యను కోర్ట్ లో హాజరుపరుస్తారు పోలీసులు. అతను బెయిల్ పై బయటకు వస్తాడు.


తన అన్నయ్య పెళ్లి చూపుల కోసం చరణ్ ఉన్న ఊరు వస్తుంది సౌదామిని. చరణ్ ఇంట్లో విహారి ఫోటో చూస్తుంది. అతడు తన స్నేహితురాలు దీపను మోసం చేసాడని చెబుతుంది. విహారి వాళ్ళ ఉరికి వెళ్తే నిజం తెలుస్తుందంటాడు చరణ్.


ఇక అశ్వ మేధం ఎపిసోడ్ 4 చదవండి..



విహరితో పరిచయం గురించి ఇలా వివరిస్తాడు చరణ్.


"నేను ఇంటర్లో చేరగానే మొదటి రోజు పరిచయమయ్యాడు విహారి. మొదట్లో ఆ పేరును చూసి వింతగా ఉందే అనుకున్నాను.


అతనిదే మాజిల్లాయే కావడంతో మా ఇద్దరికీ స్నేహం బాగా కుదిరింది. ప్రతీ శలవులకు ఇద్దరం ఒకే బస్సు ఎక్కి స్వంత ఊళ్ళకు బయలుదేరే వాళ్ళం.


మొదటి వాళ్ళ ఊరు కృష్ణాపురం వచ్చేది, ఇంకో గంటన్నర ప్రయాణం తరువాత మాఊరు వశిష్ట పురం వచ్చేది. మొదటి సంవత్సరం దసరా శలవులకి నేను వాళ్ళ ఊరు వెళ్ళాను. వాళ్ళ నాన్నగారు పాతికెకరాల భూస్వామి; ఆ ఊరికి పంట కాలవ ఉండటంతో పంటలు బాగా పండుతాయి. ఇద్దరం సాయంత్రం పూట పంట కాలువకి వెళ్లి ఈత కొట్టేవాళ్ళం.


సాయంకాలాలు ఆఊరి ఏటిగట్టు దగ్గర చాలామంది వాలీబాల్ ఆట ఆడేవారు . నాకు కూడా ఆ ఆట ఆడాలని ఉండేది. కానీ విహారి మాత్రం వాళ్ళతో ఆడొద్దనేవాడు.


విహారి ముందు నుంచి కమ్యూనిష్ట్ భావాలు కలవాడు. ఎప్పుడూ సమ సమాజం, పేదవాళ్ళు, పీడిత ప్రజలు, భూస్వాములు, విప్లవం.. ఇలాంటి మాటలు ఎక్కువగా వాడి నోటంట వస్తుండేవి. శ్రీశ్రీ సాహిత్యాన్ని ఎక్కువగా చదువుతుండేవాడు. విరసం సభలకు వెళ్తూ ఉండేవాడు.

సిందూరం రక్త చందనం

బంధూకం, సంధ్యారాగం

పులిచంపిన లేడి నెత్తురు


అన్న కవిత ప్రతీ సభలో గానం చేసేవాడు. డిగ్రీ తరువాత నేను లా చదువుకునేందుకు యూనివర్సిటీకి వెళ్ళిపోయాను. విహారి ఇంటి దగ్గర ఉన్నపుడు ఎక్కువగా వ్యవసాయం పనులు చూసేవాడు.


ఆ వేసవి శలవుల్లో ఆ ఊళ్ళో వారికి ఒక సమస్య బాక్సైట్ ఖనిజ రూపంలో వచ్చింది. తూర్పున ఏటి కవతల పెద్ద కొండలున్నాయి. పదిహేనేళ్ళ క్రితం జియాలిజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు సర్వే చేసి ఆ కొండల్లో భారీగా బాక్సైట్, మైకా గనులున్నాయనీ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది.


ఆ తరువాత రాష్ట్ర మైనింగ్ శాఖ మరిన్ని సర్వేలు జరిపి కొన్ని వేల టన్నుల బాక్సైట్ ఆకొండల్లో నిక్షిప్తమై ఉందనీ, దానిని తవ్వి తీస్తే కొన్ని లక్షల కోట్లు రాష్ట్రానికి ఆదాయం వస్తుందనీ ప్రకటించింది.


మరో రెండు నెలలకి ప్రభుత్వం రెండు పెద్ద కంపెనీలకు ఆ బాక్సైట్, మైకా గనుల్ని తవ్వితీయడానికి, కాంట్రాక్ట్ లిచ్చింది. ఆసమయంలో కొన్ని వందలకోట్లు అధికారపార్టీకి ఆ కంపెనీలు ముట్టచెప్పాయని పత్రికల్లో వార్త లొచ్చాయి.

వెంటనే ఆ కంపెనీలు వందలు ఎక్సవేటర్స్, టిప్పర్స్ ని తీసుకొచ్చి బ్లాస్టింగ్ చేసి తవ్వడం మొదలు పెట్టాయి.

అంతే! ఒక నెలలోనే ఆఊరి స్వభావమే మారిపోయింది. ఎక్కడ చూసిన ధూళి, దుమ్ము.. పొలాలమీద ఎర్రటి మట్టి, పచ్చటి చేలన్నీ ఎర్రగా మారిపోవడం మొదలైంది. నిర్మలంగా ఉండే నీలాకాశం కాస్తా ఎర్రగా మారిపోయింది. చెట్లన్నీ ఆ దుమ్ము, ధూళికి చని పోవడం , పక్షులు ఉక్కిరిబిక్కిరి అవడం మొదలైంది. తోటలన్నీ మోడు లయ్యాయి;.


నెలరోజుల తరువాత ఆ ఊరితోపాటు చుట్టుప్రక్కల పది ఊళ్ళకు ఆ దుమ్ము, ధూళి వ్యాపించింది. వాతావరణ కాలుష్యం కోరల్లో ఆచుట్టు పక్కల గ్రామాలన్నీ చిక్కుకు న్నాయి.


అప్పటికి విహారి గ్రాడ్యూయేషన్ పూర్తైంది. వెంటనే విహారి నన్ను పిలిచాడు. నేను వారం రోజులు తరువాత కృష్ణాపురం వెళ్ళాను. అప్పటికే అక్కడ మైనింగ్ పోరాట సమితి పేరిట ఆందోళనలు మొదలయ్యాయి. విహారి కూడా అందులో చురుగ్గా పాల్గొంటున్నాడు.


ప్రతీరోజు ఆచుట్టు పక్కల ఊళ్ళోనుంచి ప్రజలు వేలాది మందిగా వచ్చి మైనింగ్ ప్రాంతాల్లో లారీలను అడ్డుకోవడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి అరెస్ట్ లు చెయ్యడం మొదలు పెట్టింది. చుట్టుపక్కల ఊళ్ళల్లో 144వ సెక్షన్ పెట్టారు. కృష్ణాపురం ఊళ్లో పోలీస్ పికెటింగ్..


ఈ అల్లర్ల వెనుక అక్కడి ఎమ్యేల్యే హస్తం ఉందనీ, ఆజిల్లా మంత్రికి ఆమైనింగ్ కాంట్రాక్ట్లో వాటాలున్నాయనీ పేపర్లలో వచ్చింది. ఈమైనింగు తవ్వకాలకు ముఖ్య కారణం హర్షవర్ధనరావ్.. అతను ఆమైనింగ్ కంపెనీ చైర్మన్. ముఖ్యమంత్రికి కావలసినవాడు. రాష్ట్రంలో పెద్ద పెద్ద నీటిపారుదల ప్రాజెక్ట్ కాంట్రాక్టులన్నీ అతని కంపెనీయే దక్కించుకుంది.


సంవత్సరానికి 50, 000 కోట్ల టర్నోవర్.. దేశంలో పెద్ద కంపెనీల్లో చోటు సంపాదించుకుంది. ఏ ప్రభుత్వం అతన్ని ఏం చెయ్యలేదు. ఒక వేళ అతని మీద కేసులు వేసినా వాదించడానికి పెద్ద పెద్ద లాయర్లున్నారు. అతనితో ఏ అధికారి ఢీకొన్నా శంకరగిరిమాన్యాలు పట్టవలసిందే.


అటువంటి సమయంలో నేను అక్కడికి వెళ్ళాను. అప్పటికి నా 'లా' పూర్తైంది. దగ్గర్లోని పట్నంలో అప్పుడే 'లా' సిండికేట్ పెట్టి కేసులు వాదించడం మొదలుపెట్టాను.


నేను వెళ్ళేసరికి విహారి లేడు. ఊళ్లో జనాలని పోగుచేసుకొనీ ఆ గని తవ్వకాల వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరిస్తున్నాడు.


"ఊళ్లో చాలా రోజుల నుంచి మనం అందరం ఏటికి ఎగువన కొండ దగ్గర చిన్న ఆనకట్ట కడితే చుట్టు పక్కల ఊళ్ళన్నీ సశ్యశ్యామలం అవుతాయనీ ఎమ్యేల్యేకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోలేదు. కానీ మనకు నష్టంతెచ్చే ఈబాక్సైట్ మైనింగు ని మాత్రం మొదలుపెట్టించి మనకు అన్యాయం చేస్తునాడు.

ఈసారి అతను మన ఊరువస్తే అతన్ని వదలిపెట్టద్దు. ” అనీ విహారి ఆవేశపూరితంగా మాట్లాడటం చూసాను. అతను చెబుతున్నది ఊళ్ళో వాళ్ళంతా ఆసక్తిగా వినడం నాకు ఆశ్చర్యం కలిగింది.


ఆసాయంత్రం వాడు ఇంటికి వచ్చినపుడు నన్ను చూసి ఆనందించాడు.


" చరణ్! నిన్నెందుకు రమ్మన్నానో అర్థ అయింది కదా? ఇలా ఊళ్ళల్లో ఉద్యమాలు చేస్తే ప్రభుత్వం పోలీసుల చేత దమనకాండ చేయించి ఉద్యమకారుల్ని జైల్లో పెట్టిస్తుంది. దీనివల్ల కొన్నాళ్ళకు ఉద్యమం నీరు కారిపోతుంది.


అందుకనీ దీన్ని మనం న్యాయపోరాటం ద్వారా సాధించాలి. నీకు లాయర్ గా బాగా తెలివితేటలున్నాయి. వెంటనే మనం హైకోర్టులో ఒక 'పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్' పిటిషన్ వేద్దాం. అలాగే ఈ మైనింగ్ వల్ల ఈచుట్టూ పక్కల ఊళ్ళలోని పర్యావరణానికి ముప్పు ఏర్పడుతోందని, దీనికి రాష్ట్రప్రభుత్వం ఎలా అనుమతులిచ్చిందని, జాతీయ హరిత ట్రిబ్యునల్ (నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్. జి. టి) లో ఫిర్యాదు చేద్దాము ;..


ఇలా పోరాడితే తప్ప ఫలితాలు రావు. అందుకే నిన్ను పిలిచాను. నువ్వు ఈవిషయంలో సీరియస్ గా ఆలోచించి పిటిషన్లు తయారుచెయ్యి. ఓ స్నేహితుడిగా ఈసహాయం చెయ్యమని నిన్ను అభ్యర్ధిస్తున్నాను” అన్నాడు ఆవేశంగా విహారి.

"అది సరే.. అలాగే చేస్తాను. కానీ నువ్వేంటి ఇలా తయారయ్యావ్.. బాగా చదువుకున్నావ్. సైన్స్ లో పీజీ చేసావు. రీసెర్చి చెయ్యాలన్నావ్.. సైంటిస్టు నవుతానన్నావు. ఆఖరికి ఉద్యమకారుడిగా మారిపోతున్నావ్ ఏమిట్రా? " అని అడిగాను.


"చరణ్! మొదట్లో బాగా చదివి పెద్ద సైంటిస్టుని కావాలనీ తద్వారా దేశానికి సేవచెయ్యాలనీ అనుకున్నాను. కానీ దీనివల్ల నీనొక్కడికే మహా అయితే నా కుటుంబానికే ప్రయోజనం. అది స్వార్ధం అవుతుంది. మానవుడు సామాజిక జీవి అని అరిస్టాటిల్ అంటే మానవుడు భయంకరమైన ప్రాణి అని థామస్ హాబ్స్ చెప్పాడు. ఈరెండింటిలోనూ సత్యం ఉంది. ఈలక్షణాలను ఉపనిషత్తులు కూడా చెబుతున్నాయి.


అలాగే చాణక్యుడు అర్ధశాస్త్రంలో 'మత్స్యన్యాయం' గురించి చెప్పాడు. అంటే పెద్ద చేపలు చిన్న చేపల్ని తినేయడం. ఇవన్నీ చదివి, సమాజాన్ని చూసిన తరువాత నాకెందుకో వ్యక్తిగత ఎదుగుదల మీద విముఖత కలిగింది.


"నాహమర్ధరోదేవి లోకమా వస్తుముత్సహే

విద్ధిమామృషిభిస్తుల్యం కేవలం ధర్మ మాస్తితమ్"


అని రాముడు తాను అరణ్యానికి వెళతాడో వెళ్ళడో అని శంకిస్తున్న కైకేయితో అంటాడు. తాను అర్ధం ప్రధానుడను కాననీ, ధర్మానికీ ప్రాధాన్యత ఇస్తాననీ చెబుతాడు..

అందుకే నేను ఈవూరి బాగుకోసం, చట్టుపక్కల ఊళ్లకోసం నిలబడతాను. ఇది నాకు నేనుగా తీసుకున్న వ్యక్తిగతనిర్ణయం. కాబట్టి నువ్వు వారం రోజుల్లో ఈపిటిషన్లు వెయ్యాలి. ఈదుర్మార్గాన్ని ఆపాలంటే ఇవే ఆయుధాలు" అన్నాడు విహారి..


నేను కాలేజిలో చదువుతున్నపుడు చూసిన విహారికి ఇపుడు చూస్తున్న విహారికి ఎంతటి తేడా? అతనిలో వచ్చిన ఈ పరిణామ క్రమానికి కారణం నాకర్ధం కాలేదు..


ఆ రాత్రి ఇద్దరం భోజనాల తరువాత ఏటివైపు వెళ్ళాం. పౌర్ణమి కావడంతో శరత్ వెన్నెల ఆహ్లాదకరంగా ఉంది.

“దీప సంగతి చెప్పావు కాదు” అని అడిగాను.


దీప అతనికి డిగ్రీలో క్లాస్ మేట్. అది కొద్దికాలంలోనే పరిచయానికి, ఆపరిచయం ప్రణయానికి దారితీసింది. కానీ దీప తల్లితండ్రులకు ఎందుకో విహారితో పరిచయం నచ్చలేదు. వాళ్ళు వ్యతిరేకించడం మొదలు పెట్టారు. మొదట్లో ఒకటి రెండు సార్లు విహారి దీప ఇంటికి వెళ్ళి నా పెద్దగా పట్టించుకోని తల్లితండ్రులు ఆతరువాత ఆపరిచయం ప్రణయంగా మారకుండా అడ్డుకట్ట వెయ్యడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఒక సారి విహారి దీప ఇంటికి వెళ్ళినపుడు ఆమెతండ్రి రామ్మూర్తి తన కూతురిని కలవవద్దని గట్టిగా హెచ్చరించడంతో విహారి ఆమె ఇంటికి వెళ్లడం మానుకున్నాడు.


అయినా దీప తండ్రి మాట లెక్కచెయ్యకుండా అతన్ని కలుస్తునే ఉంది. ఈలోగా రామ్మూర్తి దీపకు పెళ్ళి సంబంధం చూసి పెళ్ళి చెయ్యాలని ఆలోచించి ఆమెకి ఓ అమెరికా సంబంధం చూస్తే దీప ఆ అబ్బాయితో తన ప్రేమ వ్యవహారం గురించి ఫోన్లో చెప్పడంతో ఆ సంబంధం తప్పిపోయింది.


ఆతరువాత వాళ్ళ రెండు కుటుంబాల మధ్య గొడవలు ముదిరాయి. దీప తల్లితండ్రులతో గొడవపడి యూనివర్సిటీ హస్టల్లో ఉంటోంది. విహారి అప్పుడప్పుడు వెళ్ళి ఆమెని కలిసి వస్తుంటాడు.


"చరణ్! అన్నీ సమస్యలేనురా.. ఇవతల ఊళ్లో ఈసమస్య, అవతల నాప్రేమ, పెళ్లి ఓ సమస్య.. ఇవన్నీ ఎపుడు తీరతాయో' అన్నాడు.


ఆమర్నాడే నేను గ్రీన్ ట్రిబ్యునల్, హైకోర్టుల్లో కేసుల్ని దాఖలు చేసి ఇంటికొచ్చాను"


ఇదీ నా స్నేహితుడు విహారి కధ.. ఈకేసుల విషయం గురించి మాటలాడటానికే రేపు నన్ను రమ్మన్నాడు. రేపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఓ ఉన్నతస్థాయి బృందం ఆఊరు వస్తోంది. ఈబాక్సెట్ విషయమై ఆసంస్థ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపడం, దాన్ని శాసనసభలో ప్రతిపక్షాలు ప్రస్తావించి సభను స్తంబించిచేయడంతో ఇపుడు రాష్ట్రంలో ఇది ఒక ప్రధాన సమస్యగామారింది.


అందుకే రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ నాయకత్వంలో ఓ ఉన్నతస్థాయి బృందాన్ని పంపిస్తోందని వార్తలు రావడంతో నన్ను అక్కడికి రమ్మనమని విహారి ఫోన్ చేసి రమ్మన్నాడు.. " అని జరిగినదంతా మర్నాడు ఆమెను స్టేషనుకు తీసుకువెళుతున్నప్పుడు సౌదామిని కి చెప్పాడు చరణ్.


కొద్ది సేపటికీ జీపు స్టేషను కి చేరుకుంది. అప్పటికింకా పాసింజరు రాలేదు.


" మీరే చెబుతున్నారు ఆ వూళ్ళో ఉద్యమాలు జరుగుతున్నాయని.. అందుకే దీపకు నేను తండ్రిని వ్యతిరేకించవద్దనీ, తల్లితండ్రులు చెప్పిన ప్రకారం నడుచుకుంటే మంచిదనీ చెప్పినా అది వినలేదు. ఇపుడు చూడండి ఏంజరుగుతుందో ఎవ్వరికీ తెలియదు" అంది సౌదామిని చెట్టు కింద ఉన్న బెంచీమీద కూర్చుంటూ..


పాసింజర్ కి బెల్ కొట్టడంతో అపుడే జనాల రాకమొదలైంది.


" జీవితం మనం అనుకున్నట్లు సాగితే అందులో గొప్పతనం ఏముందిచెప్పండి? ప్రతీదానికి భయపడితే ఏపనీ చెయ్యలేము. ఆఅమ్మాయి తనకిష్టమైన పని చేస్తున్నందుకు అభినందించాలి. అంటే ఆమె విహారిని మనసా, వాచా కర్మణా ప్రేమిస్తున్నట్లు అనుకోవచ్చు" అన్నాడు చరణ్ ;


ఇంతలో పాసింజర్ వస్తున్నట్లు రెండవ బెల్లు కొట్టారు.


సౌదామిని బేగు పట్టుకుంటూ లేచి నిలబడి” చరణ్ గారూ! మరో పదిరోజుల తరువాత నేను కోనసీమ దగ్గర ఒక పల్లెటూరు వెళ్ళాలి. అక్కడ నా స్నేహితురాలుఉ వరూధిని ఉంది. వాళ్ళ నాన్నగారు మా ఊరిస్కూల్లో టీచరుగా పనిచేసారు. నేను ఢిల్లీ వెళ్ళకముందు అక్కడ 8వ తరగతి దాకా చదువుకున్నాను. ఆతరువాత విడిపోయాము. వాళ్ళ నాన్నగారు మంచి సంగీతకారులు. మేం అందరం ఆయన దగ్గర వర్ణాల దాకా సంగీతం నేర్చుకున్నాము. ఇపుడు అది సంగీత పాఠశాల నడుపుతూ అందరికీ సంగీతం, వీణ నేర్పుతున్నాది. వాళ్ళ ఊళ్ళో రామాలయం కొత్త గా కట్టించారుట. దాని ధ్వజరోహణం, విగ్రహప్రతిష్ట చేస్తున్నారు ; ఆరోజు మీరు నాతో రావాలి.. కాదనకూడదు. " అంది సౌదామిని;


ఇంతలో పాసింజర్ ప్లాట్ ఫారం మీదకు వచ్చింది. ఆమె రిజర్వుడు భోగీలో ఎక్కుతూ అతనికి వీడ్కోలు పలికింది.

చరణ్ కూడా ఆమెకు చేయి ఊపుతూ వీడ్కోలు పలికాడు.

సౌదామిని గారు! వెళ్లగానే చేరినట్లు ఫోన్ చెయ్యండి. మీరు మళ్ళీ ఎప్పుడు మాఊరు వస్తారు.


కార్తీకంలో రండి. బాగుంటుంది.. " అన్నాడు. అప్పటికే రైలు కదిలిపోయింది.


"అలాగే.. మరి మీరు కోనసీమ వస్తారా లేదా? అంది కిటికిలోంచి అతన్ని చూస్తూ..


అతను చేయి ఊపుతూ “ వస్తాను లెండి”.. అన్నాడు..


అలా రానురాను ట్రైను పూర్తిగా కనుమరుగయ్యే దాకా అక్కడే ఉండి అతను కృష్ణాపురం బయలుదేరాడు. కృష్ణాపురం అతను చేరేసరికి మధ్యహ్నం అయింది. అప్పటికీ ప్రభుత్వ బృందం సభ్యులు ఆబాక్సైట్ గనులు తవ్వుతున్న కొండల్ని పరిశీలించడం మొదలైంది. వాళ్ళ దగ్గర జియోలాజికల్ మేపులున్నాయి.


ఆ బృందంలో కలెక్టర్, సబ్-కలెక్టర్, తహసీల్దార్, మైనింగ్ డైరెక్టర్స్.. ఇలా రాష్ట్ర ప్రభుత్వం చాలా పెద్ద బృందాన్నే పంపింది. ఎందుకంటే పర్యావరణ విషయంలో హరిత ట్రిబ్యునల్ చెప్పిందే వేదం. ఒకసారి గానీ అది రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగాని తీర్పు ఇస్తే సుప్రీం కోర్టుకూడా ఏమీ చెయ్యలేదు. మధ్య మధ్యలో వాళ్ళు తహశీల్దార్ని, కలెక్టర్ని కొన్ని ప్రశ్నలు వేస్తుంటే సరియైన సమాధానలు ఇవ్వటంలేదు వాళ్ళు.


ఆ సమయంలో చరణ్ కల్పించుకొని " సార్! నాపేరు చరణ్ ;ఇతను విహారి. మేమే ఈమైనింగ్ విషయమై ఫిర్యాదు చేసాము. ” అని పరిచయం చేసుకున్నాడు చరణ్.


" ఓకే! చెప్పండి మీ అభ్యంతరాలు? దీనివల్ల మీకు ఏవిధంగా నష్టం? " అని అడిగారు కలెక్టర్ ;


"సార్! రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద మైనింగ్ ప్రాజెక్టుని మొదలు పెట్టే ముందు జాతీయహరిత ట్రిబ్యునల్ యొక్క అనుమతి తీసుకోలేదు. అసలు దీన్ని ప్రారంభించే ముందు గ్రామసభల అనుమతి తీసుకో లేదు. పర్యావరణానికి హాని కలిగించే ఇటువంటి ప్రాజెక్టులకు గ్రామ సభల అనుమతి తప్పనిసరి అని మీకు చెప్పనవసరం లేదు;ఈ చుట్టు పక్కల ఉన్న సుమారు 25 గ్రామాలు అన్నీ వ్యవసాయం ప్రధాన వృత్తిగా బతికే రైతులున్న గ్రామాలు. ఇక్కడ రెండు పంటలు పండుతాయి. నీటికి కొదవలేదు. 20 అడుగుల్లోనే ఏటి ఒడ్డున ఉండడంవల్ల నీరు పడుతుంది.


అటువంటిది ఈబాక్సైట్ ఖనిజాన్ని వెలికితీస్తే దాని వల్ల పర్యావరణానికి ముప్పుఏర్పడి మా గ్రామాలన్నీ నష్టపోతాయి; గ్రామాల్లో ఎక్కడ చూసిన దుమ్ము, ధూళి పేరుకుపోతోంది ; పక్షులన్నీ మాయమైపోతునాయి. నీటికాలుష్యం వల్ల చాలా మంది రోగాల బారిన పడుతున్నారు. సాయంత్రం అయ్యేసరికి రోడ్లమీద, ఇళ్లమీద రెండు ఇంచీల మందంతో ఎర్రటి ఖనిజం పేరుకుపోతోంది. మంచి నీటి బావులు, చెరువులు ఈ బాక్సైట్ ధాటికి విషపూరితంగా మారిపోతున్నాయ్.


రెండునెలలకే ఇలా అయితే మరికొన్నాళ్ళకు ఎంత హాని జరుగుతుందోనని భయం వేస్తోంది; దీన్ని వెంటనే ఆపకపోతే ఈచుట్టూ పక్కల గ్రామాలన్నీ నాశనం అయిపోతాయి. ” అన్నాడు అతనికి దండం పెడుతూ.


కలెక్టరు గారు వీళ్ళు చెప్పింది విని తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు;


ఆమర్నాడు కూడా ఆబృందంతో పాటు పర్యటించి నివేదిక త్వరగా ప్రభుత్వానికి ఇచ్చి వెంటనే స్టాప్ ఆర్డర్స్ వచ్చేలా చూడమని వాళ్ళను కోరారు.


ఆబృందం ఇంకో రెండుసార్లు వచ్చే అవకాశం ఉందని తెలిసింది.


మరో వారం రోజుల తరువాత కోర్టులో పిటిషన్ వాద్యానికి వచ్చింది ; రాష్ట్ర ప్రభుత్వం యొక్క అడ్వకేట్ జనరల్ వాదిస్తూ ఈకేసుకి వాదనార్హత లేదని, రాష్ట్ర మైనింగ్ శాఖ అన్ని జాగ్రత్తలు, అనుమతులు తీసుకొని ఈపనులు మొదలు పెట్టిందని, కాబట్టి ఈకేసుని అడ్మిట్ చెయ్యరాదని కోరాడు.


అపుడు చరణ్ పిటిషనర్ తరపున వాదిస్తూ " రాష్ట్ర ప్రభుత్వం కోర్టును తప్పుదారి పట్టిస్తోంది. గనుల తవ్వకాలకు ఏఅనుమతులు తీసుకోలేదు. జాతీయ హరిత ట్రిబ్యునల్ యొక్క ఆమోదం తీసుకోలేదు. ఈమైనింగ్ వల్ల చుట్టుపక్కల వందల గ్రామాల్లో పర్యావరణ సమస్యలు తలెత్తి ప్రజల ప్రాణాలకు, జంతువులు, పక్షుల ఉనికికి ప్రమాదం ఏర్పడా బోతోంది. మేము హరిత టిబ్రునల్కి ఫిర్యాదు చేస్తే ఆబృందం మొన్ననే పర్యటించి అనుమతులకు ముందు గ్రామ సభలు నిర్వహించాయి ఆ నివేదికను వారికి పంపమని చెప్పింది;


కానీ ప్రభుత్వం గ్రామసభలు నిర్వహించకుండా, హరిత ట్రిబ్యునల్ అనుమతి లేకుండా తవ్వకాలకు అనుమతులు మంజూరుచేసింది; ఈ విషయం తెలిసి హరిత ట్రిబ్యునల్ రాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే గ్రామ సభలు నిర్వహించమని వుత్తరం రాసింది; కాబట్టి కోర్టువారు వెంటనే దీన్ని ఆపివేసే ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతున్నాను” అంటూ తన వాదనలు ముగించాడు చరణ్.


మొత్తంమీద రెండురోజులు ఈ కేసులో చరణ్, అడ్వకేట్ జనరల్ తమ వాదనలు వినిపించారు.


మూడవరోజు కోర్టు పిటిషన్ని స్వీకరించి రాష్ట్రప్రభుత్వానికి, హరిత ట్రిబ్యునల్కి, మైనింగ్ శాఖకి నోటీసులు జారీ చేసి కేసును పదిహేనురోజులు వాయిదా వేసింది.


హై కోర్ట్ నిర్ణయానికి విహారి చాలా ఆనందించి "చరణ్! ఇది నీ విజయం! అసలు హైకోర్ట్ లో కేసు అడ్మిట్ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రయత్నాలుచేసింది. అందుకోసం లక్షల రూపాయలుఖర్చు పెట్టి పెద్ద న్యాయకోవిదులను రంగంలోకి దించింది. అయినా నీ వాదనలో ఉండే వాస్తవికత, నిజాలు కేసుకి బలమై నోటీసుల దాకా వచ్చింది; నాకు మొదట్నుంచీ నీ తేలితేటల మీద, వాదనల మీదా బాగా నమ్మకం..


నీవాదనా పటిమ, కేసు పరిశోధనలో తీసుకునే జాగ్రత్తలు, ప్రత్యర్ధ వ్యూహాల్ని పసికట్టే నేర్పు.. వీటి వల్ల నువ్వు భవిష్యత్తులో గొప్ప న్యాయవాదినయ్యే సూచనలు మెండుగా ఉన్నాయి. న్యాయవాది వృత్తి చదరంగం ఆటలాంటిది. ప్రత్యర్ధి ఎత్తుల్ని ఎవరైతే ముందుగా పసికట్టి తదనుగుణంగా వ్యూహత్మాకంగా ఎత్తులు వేస్తారో వారు గెలుస్తారు. అది నీలో పుష్కలంగా ఉ న్నాయి. “ అంటూ ఆకాశానికి ఎత్తేసాడు ;


ఆసమయంలో చరణ్ కి తను చదివిన న్యాయశాస్త్రం గుర్తుకు వచ్చింది.


ఎప్పుడైతే జాతీయహరిత ట్రిబ్యునల్ వాళ్ళ ఫిర్యాదుపై స్పందించి తనిఖీ బృందాన్ని పంపించిందో అప్పుడే ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది;


కోర్టు వాళ్ళ కేసుని స్వీకరించి అందరికీ నోటీసులు జారీచేయడంతో కృష్ణాపురంతోపాటు చుట్టు పక్కల గ్రామాల్లో ఉద్యమాలు ఊపందుకున్నాయి. మైనింగ్ కంపెనీకి చెందిన టిప్పర్స్ ని కొందరు ఆందోళనకారుల తగుల బెట్టుడంతో మైనింగ్ కార్యకలాపాలను ఆ కంపెనీ తాత్కాలికంగా ఆపివేసింది.

=================================================================================

ఇంకా వుంది...

=================================================================================

గన్నవరపు నరసింహ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

Podcast Link

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం

గన్నవరపు నరసింహ మూర్తి గారు ఎం టెక్ చదివారు.ప్రస్తుతం విశాఖ పట్నంలో రైల్వే శాఖలో జాయింట్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. వీరు ఇప్పటిదాకా 300 కథలు ,10 నవలలు రచించారు. ఏడు కథా సంపుటాలు ప్రచురించారు. స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి దగ్గర ఒక గ్రామం.


32 views0 comments

Comments


bottom of page