'Aswamedham - Episode - 8' - New Telugu Web Series Written By Gannavarapu Narasimha Murthy
'అశ్వ మేధం - ఎపిసోడ్ - 8' తెలుగు ధారావాహిక
రచన : గన్నవరపు నరసింహ మూర్తి
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
జరిగిన కథ:
చరణ్ ఒక లా గ్రాడ్యుయేట్. ఢిల్లీలో జరిగే ఒక కోర్స్ కి అటెండ్ అవుతాడు. అక్కడ అతనికి సౌదామిని అనే యువతి పరిచయం అవుతుంది.
ఇంటికి తిరిగి వచ్చిన చరణ్ ని శాంతి అనే యువతి కలిసి న్యాయ సహాయాన్ని అభ్యర్థిస్తుంది.
సుక్కు అనే గిరిజనుడు చనిపోయిన సంఘటనను తన భర్త చైతన్య వీడియో తీసాడనీ, ఆ కోపంతో పోలీసులు తన భర్తను అరెస్ట్ చేశారనీ చెబుతుంది ఆమె. చరణ్, కేస్ వేయడంతో చైతన్యను కోర్ట్ లో హాజరుపరుస్తారు పోలీసులు. అతను బెయిల్ పై బయటకు వస్తాడు.
చరణ్ ఇంట్లో విహారి ఫోటో చూస్తుంది సౌదామిని. అతడు తన స్నేహితురాలు దీపను మోసం చేసాడని చెబుతుంది. విహరితో తన పరిచయం గురించి సౌదామినికి వివరిస్తాడు చరణ్.
విహారి కోరికపై బాక్సయిట్ తవ్వకాలు నిలిపివేయాలని కోర్టులో కేస్ వేస్తాడు చరణ్. తవ్వకాలు తాత్కాలికంగా ఆగుతాయి.
సౌదామినిని తాను పనిచేసే కంపెనీ లో చేరమంటాడు చరణ్. అలాగే చేరుతుంది సౌదామిని.
జాతీయ హరిత ట్రిబ్యునల్ సెక్రటరీ రాఘవన్ ని ఎవరో హత్య చేస్తారు. ఆ సంఘటనను చూసిన దీప ను కూడా చంపాలని ప్రయత్నిస్తారు. రాఘవన్ హంతకుల చిత్రాలు గీస్తుంది దీప.
పోలీస్ స్టేషన్ లో వాళ్ళ ఫోటోలను గుర్తు పడుతుంది.
ఇక అశ్వ మేధం ఎపిసోడ్ 8 చదవండి..
చరణ్ కి వారంరోజులు తరువాత రాఘవన్ హత్యకేసు సెషన్స్ కి రాబోతున్నట్లు కోర్టు నుండి ఉ త్తరం వచ్చింది. ఇదవరకే దీప తరపున లాయర్ గా కోర్టుకి ఎఫిడవిట్ ఇవ్వడంతో ఆరోజు అతనిని దీపతో సహా హాజరు కమ్మని అందులో ఉంది. చరణ్ పోలీసు స్టేషన్ కి వెళ్ళి రాజారాంని కలిస్తే కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసినట్లు తెలిపాడు. ఏవన్ ముద్దాయిగా విక్రంసింగ్, ఏ2 గా రాంసింగ్ లను నిర్ధారిస్తూ ఛార్జి షీట్లో పొందుపరిచారు. సాక్షిగా దీపని పేర్కొన్నారు.
ఆ ఛార్జ్ షీట్ తో పాటు కొన్ని రిపోర్టులను కూడా పొందుపరిచారు; అందులో డాక్టర్ ఇచ్చిన పోస్ట్ మార్టెమ్ రిపోర్ట్ ముఖ్యమైనది; అందులో రాఘవన్ ది హత్యేనని , ప్రమాదం కాదన్న వివరాలున్నాయి అనీ రాజారాం చెప్పాడు. ఈ కేసు సెషన్ కి రాబోతోంది కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇంకా అఫిడవిట్ దాఖలు చేయలేదని తెలిసింది. ఇంకా గ్రీన్ ట్రిబ్యునల్ కూడా తన జవాబుని కోర్టుకి సమర్పించలేదు.
చరణ్ కు మొత్తం సమయమంతా ఈ రెండు కేసుల పరిశోధనతో నే సమయం గడిచి పోతోంది; రాజారాం గారు "ముద్దాయి లిద్దరూ దొరకలేదనీ, వారిని పట్టుకునేందుకు మరింత సమయం కావాలనీ కోర్టుని కోరుతాము" అని చెప్పాడు.
సౌదామిని ఢిల్లీ వెళ్ళి వారం రోజులైంది. రేపు తను వస్తున్నట్లు ఫోన్ చేసి చెప్పింది . ఆసమయంలో చరణ్ కి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే సౌదామిని కి ఫోన్ చేసి " మీరు పాట్నా వెళ్ళి అక్కడ డీజీపీ ఆఫీసులో విక్రమ్ సింగ్ , రామ్ సింగ్ ల వివరాలు కనుక్కొని రండి. అది మనకు కేసులో బాగా ఉపయోగపడుతుంది. ” అని చెప్పాడు..
ఆమె పాట్నా వెళ్ళి డీజీపీ ఆఫీసుకి వెళ్లి వాళ్ళ వివరాలు సేకరించడానికి నాలుగు రోజులు పట్టింది. అదృష్టవశాత్తు ఆమె స్నేహితురాలి అన్నయ్య అక్కడ ఎస్సీగా పనిచేస్తుండడంతో పని సులువైంది.
అక్కడ నుంచి ఆమె చరణ్ ఊరు వెళ్లింది. ఆమె చెప్పిన వివరాలు విని చరణ్ కి మతిపోయింది. విక్రం సింగ్, రాంసింగ్ లిద్దరూ రెండు వేరు వేరు కేసుల్లో జైలుశిక్ష అనుభవిస్తున్నారనీ , రాఘవన్ హత్యకి పది రోజుల ముందు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఒక లెటర్ వచ్చిందనీ , అందులో విక్రంసింగ్, రాంసింగ్ లిద్దరూ ఒక దొంగతనం కేసులో అనుమానితులనీ, వాళ్ళిద్దర్నీ తమకు అప్పచెప్పాలని వ్రాసి ఉండటంతో ఆ ఇద్దర్నీ ఆంధ్ర పోలీసులకు అప్పచెప్పామనీ ఆఎస్పీ గారు చెప్పారు . ఆమె ఆ లెటర్ మీద సంతకం చూసింది. దానిమీద చక్రపాణి అని ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ సంతకం ఉంది.
ఆ వివరాలు అన్ని నోటు చేసుకున్నాడు చరణ్ . రాఘవన్ హత్య కేసులో సెషన్స్ కోర్టులో వాదనలు మొదలయ్యాయి. ముందుగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ సన్యాసిరావు తన వాదనలు మొదలు పెట్టాడు..
"రాఘవన్ జాతీయ హరిత ట్రిబ్యునల్ స్పెషల్ ఆఫీసర్. కృష్ణాపురం మైనింగ్ విషయంలో పంపిన బృందానికి ఆయన హెడ్.. అతను మొత్తం నెల రోజుల్లో మూడు సార్లు వచ్చి ఆ ప్రాంతమంతా పర్యటించి సర్వే చేసి తిరిగి ఢిల్లీ వెళ్ళే సమయంలో హత్యకి గురయ్యాడు. ఈకేసుని రాజారాం అనే సర్కిల్ ఇన్స్పెక్టర్ బృందం పరిశోధించింది. అదే సమయంలో ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి మిస్ దీప పోలీసుస్టేషన్ కు వచ్చి తాను ఆహత్యని చూసినట్లు చెప్పడంతో ఆమె వాజ్మాలం కూడా పోలీసులు తీసుకున్నారు.
ఆమర్నాడు ఆమె ఉంటున్న హాస్టల్ కి సమీపంలో ఆమె మీద హత్యా ప్రయత్నం జరిగింది. ఆమె చెప్పిన ఆధారాలతో క్రిమినల్స్ ని పరిశీలించి ఇందులో విక్రంసింగ్, రాంసింగ్ లనే అంతర్రాష్ట్ర నేరస్థులు ముద్దాయిలుగా నిర్ధారణకు వచ్చింది స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్..
ఈకేసులో ఇంకా చాలా విషయాలు తెలియవలసి ఉన్నాయి. 90 రోజుల సమయం పూర్తి కావస్తోంది కాబట్టి ఛార్జిషీట్ దాఖలు చేస్తున్నామనీ, కానీ ఇంకా పరిశోధన చెయ్యవలసి ఉందనీ, నేరస్తులను అరెస్ట్ చేయవలసి ఉన్నదనీ, దానికి ఒక నెలరోజుల సమయం కావలసి ఉందనీ కోర్టుకి వివరించాడు అతను .
ఆతరువాత మెజిస్ట్రేట్ గారు చరణ్ వైపు తిరిగి "మీరు చెప్పవలసినది ఏమైనా ఉందా"? అని అడిగాడు.
చరణ్ కొద్దిసేపు మౌనం వహించి ఆ తరువాత చెప్పడం మొదలు పెట్టాడు.
"యువర్ ఆనర్.. ఈకేసులో పోలీసులు చాలా విషయాలు దాస్తున్నారని పిస్తోంది. కృష్ణాపురం బాక్సైట్ ఖనిజం తవ్వకాలను ఆపు చెయ్యాలనీ మేము వేసిన కేసుకి ఈ రాఘవన్ హత్యకేసు కి సంబంధం వుంది . ప్రభుత్వం బాక్సైట్ మైనింగ్ కేసులో జాతీయ హరిత ట్రిబ్యునల్ యొక్క అనుమతి తీసుకోకుండా టెండరు ని ఖరారు చేసింది.
అసలు ఏ ప్రాంతంలో ఖనిజాన్ని తవ్వి తీయాలన్నా ట్రిబ్యునల్ అనుమతి తప్పనిసరి. ఆ బాక్సైట్ తవ్వకంతో మాప్రాంత గ్రామాలన్నీ కాలుష్యబారిన పడుతున్నాయి . అందులో ఉండే విషపు పదార్ధాల వల్ల ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారు . చివరకు కోర్టు వారి జోక్యంతో హరిత ట్రిబ్యునల్ తమ అధికారుల బృందాన్ని సర్వే కోసం పంపింది. ఆ సర్వే బృందానికి ప్రస్తుత కేసులో హత్యకు గురైన రాఘవన్ అధిపతి. మాకు తెలిసిన సమాచారం ప్రకారం అతను ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్ట్ ఇచ్చినట్లు తెలిసింది.
ఆ మైనింగ్ వల్ల ఆ ప్రాంతమంతా కాలుష్యం బారినపడి పర్యావరణానికి హాని కలుగుతోందనీ , ప్రజలు రోగాల బారిన పడతారనీ, అక్కడనదిలోని నీరు, రిజర్వాయర్లో ఉన్న నీరు మొత్తం విషపూరితం అవుతాయనీ ఆయన తన రిపోర్టులో పేర్కొన్నాడనీ, అది తెలిసీ ఆ కాంట్రాక్ట్ పొందిన కంపెనీవారు, ప్రభుత్వంలోని కొందరు పెద్దలు, అధికారులు అతని మీద వత్తిడి తెచ్చి ఆ రిపోర్టుని ఇవ్వకుండా ఆపే ప్రయత్నం చేసారనీ, కానీ అతను ముక్కు సూటి అధికారి కావడం వల్ల వీళ్ళ మాట వినలేదని, అందుకే అతన్ని హతమార్చారని పేపర్లలో, ఛానల్స్ లో కథలు, కథలుగా వస్తున్నాయ్” అని చెబుతుండగా మెజిస్ట్రేట్' మిస్టర్ చరణ్! కట్టు కథలు, ఆధారాలు లేని వార్తలు చెప్పకండి. మీదగ్గర ఏదైనా ఆధారాలుంటే కోర్టుకి సమర్పించండి' అని చెప్పారు.
ఆ సమయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ సన్యాసిరావు లేచి ' అబ్జెక్షన్ యువర్ ఆనర్ ! లాయర్ చరణ్ చెప్పినవి కట్టు కధలు.. ఒక్కటీ నిజం కాదు.. అన్ని ఇలా జరిగి ఉండవచ్చు అన్న ఊహలు.. వీటిని కోర్టు పరిశీలనలోకి తీసుకోవద్దని కోరుతున్నాను". అన్నాడు.
చరణ్ లేచి "యువరానర్. ఈకేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ముద్దాయిలు దొరకలేదనీ, అరెస్ట్ లు చెయ్యలేదనీ చెబుతోంది. కానీ వాస్తవ మేమిటంటే ఈహత్యకు ముందు ఈపట్నంలోని రెండవ పట్నం పోలీసు స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బీహార్ ప్రభుత్వానికి ఉత్తరం వ్రాసి ఆ ఇద్దరు క్రిమినల్స్ ని ఇక్కడకు తీసుకువచ్చినట్లు మాకు బీహార్ పోలీసులు సమాచారం ఇచ్చారు. కోర్టువారు ఆసి. ఐ. వ్రాసిన ఉత్తరాన్నీ, బీహారు పోలీసులు అప్ప చెప్పినపుడు ఇచ్చిన ఉత్తరాలను కోర్టువారి దృష్టికి తీసుకువస్తున్నాను" అంటూ రెండు ఉత్తరాలను జడ్జిగారి కిచ్చాడు.
అంటే పోలీసులకు వీళ్ళు ఎక్కడున్నారో తెలుసన్నమాట. దొంగతనం కేసులో ముద్దాయిలు అని బీహార్ ప్రభుత్వానికి అబద్ధం చెప్పారు; కానీ ఈ ఊరి రెండు పోలీసు స్టేషన్లలో వాళ్ళ మీద ఏ దొంగతనం కేసు నమోదు కాలేదు. ” అన్నాడు.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ నిలబడి రకరకాల కేసుల్లో అనుమానితులను పిలిపించుకోవడం ఎప్పుడూ జరుగుతూ ఉండే ప్రక్రియ. అందులో తప్పేంలేదు” అన్నాడు.
ఎంక్వైరీ కి పిలిస్తే తప్పులేదు. కానీ ఎంక్వైరీ కి పిలిచిన వాళ్ళను రెండురోజులు పాటు పోలీసు స్టేషన్ లాకప్ లో ఎందుకు పెట్టారు. వాళ్ళను లాకప్లో పెట్టినట్లు రిజిష్టర్లో ఎందుకు రాయలేదు. అంటే ఇందతా ఒక కుటట్రతో వ్యవహరించనట్లు అర్ధం అవుతోంది. యువరానర్..
ఈ విషయంలో ఆ రెండవపట్టణ పోలీసు స్టేషన్ ఎస్సై రాఘవరావు ని మీరనుమతిస్తే కొన్ని ప్రశ్నలు వెయ్య దల్చుకున్నాను” అన్నాడు చరణ్;
మెజిస్ట్రేట్ గారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వైపుతిరిగి 'ఎస్సై గారువచ్చారా "? అని అడిగారు.
" వచ్చారు సారు” అని ఆయన్ని పిలిచారు; అతను ఐదు నిముషాల తరువాత బోను లోకి వచ్చాడు.
'మీపేరు చెబుతారా?" చరణ్ అడగటం మొదలుపెట్టాడు.
“రాఘవరావు”
"మీరెన్ని సంవత్సరాల నుంచి ఆపోలీసు స్టేషన్లో పని చేస్తూన్నారు"
"మూడేళ్ళ నుంచి”
"రాఘవన్ అనే అధికారి హత్య 15వ తేదీన జరిగింది. ఆ తేదీల్లో ఈ నేరస్థులిద్దరూ మీ పోలీసు స్టేషన్ లాకప్ లో ఉన్నారా లేదా?” అంటూ విక్రంసింగ్, రాంసింగ్ల ఫోటోలు ఆయనకు చూపించాడు.
అతను ఆఫోటోలను ఓరెండు నిముషాల పాటు చూసి, కొద్ది సేపు ఆలోచించి చివరకు “ ఉన్నారు” అన్నాడు;
"వాళ్లని ఎందుకు లాకప్ లో పెట్టారు?"
"ఏదో దొంగతనం కేసని మా సీఐ గారు చెప్పారు”
" మరి ఆ విషయం ఎక్కడైనా పొందు పరిచారా? అసలు మీ రూల్స్ ఏమిటి?"
"ఎవరినైనా అనుమానితులను విచారణకు పిలిస్తే వారి దగ్గర స్టేట్మెంట్ తీసుకొని వదిలేస్తాము"; లాకప్ లో పెట్టాలంటే వారిని అరెస్ట్ చెయ్యాలి. అప్పుడు కేసుని రిజిస్టర్ చేసి రిజిస్టర్ లో నమోదు చెయ్యాలి. వాళ్ళను 24 గంటల లోపు కోర్టులో ప్రవేశపెట్టాలి"; అని చెప్పాడు అతను;
"మరి ఈ ఇద్దర్నీ, అరెస్ట్ చేసారా, ఆకేసు వివరాలు కేస్ షీట్లో వ్రాసారా; ? వారిని కోర్టు లో ప్రవేశపెట్టారా" ? చరణ్ నోట్లోంచి ప్రశ్నలు బాణాల్లా వస్తున్నాయి;
"నాకు తెలిసి రాసినట్టు లేదు" అన్నాడు అతను;
" ఇంక మీరు వెళ్ళవచ్చు; యువరానర్! అంటే ఈ కేసులో ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చెయ్యకుండా లాకప్పు లో ఎందుకు పెట్టారు? అరెస్ట్ చేసిన వాళ్ళను కోర్టులో ఎందుకు ప్రవేశపెట్టలేదు?వాళ్ళను పోలీసు స్టేషన్ లాకప్ లో పెట్టిన విషయాన్ని చార్జిషీట్ లో ఎందుకు పేర్కొనలేదు;?అంటే ఇద్దరు నేరస్తులను బీహార్ నుంచి తెచ్చి లాకప్పు లో ఉంచి వాళ్ళచేత రాఘవన్ గారిని హత్య చేయించారు పోలీసులు అని అర్ధం అవుతునాది ;అంటే ఈకేసులో పోలీసుల పాత్ర ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది" అన్నాడు చరణ్ .
ఈలోగా ఒంటి గంట సమయం కావడంతో ఆ మర్నాటికి కేసు వాయిదా పడింది. మర్నాడు పదకొండు గంటలకు కోర్టుకి చరణ్ సౌదామిని తో కలసి వచ్చాడు; పదకొండు గంటలకి కి జడ్జిగారు కోర్టుకి వచ్చారు. మరో అరగంట లో వాదనలు మొదలయ్యాయి.
" మిస్టర్ చరణ్ ! మీరు మీ వాదనలు ప్రారంభించండి;” అన్నారు జడ్జి గారు;
" ఎస్ యువర్ ఆనర్ ! రాఘవన్ హత్య జరిగిన రోజుకి రెండు రోజులు ముందు నుంచి ఇద్దరు ముద్దాయిలు విక్రంసింగ్, రాంసింగ్లు పోలీసుస్టేషన్ లాకప్ లో ఉన్నట్లు యస్సై రాఘవరావు గారి స్టేట్మెంట్ ద్వారా తెలిసింది. దీన్ని బట్టి ఈ కేసులో వల్లే రాఘవన్ ని గారిని హత్య చేసారని తెలుస్తోంది. ” అన్నాడు చరణ్ ..
ఇంతలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేచి నిలబడి "అబ్జెక్షన్ యువరానర్! ఈ కేసులో మొదట్నుంచి డిఫెన్స్ లాయర్ చాలా తెలివిగా తన వాదనలు వినిపిస్తూ కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.
ముద్దాయిలు కట్టుదిట్టమైన పోలీసు స్టేషన్ లోని లాకప్ రూమ్ లో ఉన్నపుడు రాఘవన్ని వాళ్ళు ఎలా హత్య చేస్తారు. లాకప్ ని బద్దలు కొట్టి వెళ్లారా? డిఫెన్స్ వారు కోర్టుని తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు;కాబట్టి కోర్టు వారి దీన్ని గమనించాలి" అన్నాడు సన్యాసి రావు
" అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్ ;మీరు కొనసాగించండి" అన్నాడు మేజిస్ట్రేట్ చరణ్ తో .
"ఈ కేసులో ఆరోజు డ్యూటీలో ఉన్న ఎస్సై సీతారామారావు వాంగ్మూలం చాలా కీలకమైనది యువరానర్.. అతన్ని ఇంటరాగేట్ చేస్తే చాలా విషయాలు తెలుస్తాయి. కాబట్టి కోర్టువారు అనుమతిస్తే ఆయన్ని కొన్ని ప్రశ్నలడుగుతాను”అన్నాడు చరణ్.
"అయ్యా! పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారూ! ఆ సీతారామారావు గారిని ప్రవేశపెట్టండి.. ” అని కోర్టు క్లర్కు చెప్పాడు.
"సార్! ముందు చెప్పకుండా సడెన్ గా రావాలి అంటే కుదరదు. అతను ఇపుడు డ్యూటీలో ఉన్నాడు. ఇపుడు రావడం కుదరకపోవచ్చు" అన్నాడు సన్యాసిరావ్.
"ఒకే.. ఈకేసుని మధ్యాహ్నం మూడు గంటలకి వాయిదా వేస్తున్నాను. అతన్ని పిలిపించండి" అంటూ జడ్జి గారు వెళ్లిపోయారు;.
ఈలోగా చరణ్, సౌదామిని కేసువిషయాలు మాట్లాడుకుని , దగ్గర్లోని హోటల్లో భోజనం చేసి మళ్ళీ 3 గంటలకు కోర్టుకి వచ్చారు.
ఈలోగా ఎస్సై సీతారామారావు కోర్టుకి వచ్చారు. బోనులోకి రాగానే చరణ్ ఇంటరాగేషన్ మొదలైంది.
సీతారామారావు గారూ! రాఘవన్ హత్య జరిగిన రోజు రాత్రి డ్యూటీ లో ఎవరున్నారు".. చరణ్ అడిగాడు.
"నేనే ఉన్నాను". అని అతను చెప్పాడు;
"ముద్దాయిలు విక్రంసింగ్, రాంసింగ్ లిద్దరూ ఆరాత్రి ఎక్కడ ఉన్నారు?”
“ ఆరోజు వాళ్ళిద్దరూ లాకప్లో ఉన్నారు. ”
"మీరు పోలీస్ స్టేషన్లో ఎంతవరకు ఉన్నారు?”
"నేను తెల్లవార్లు అక్కడే ఉన్నాను. ”
“నిజం చెప్పండి; మీరు అక్కడనుంచి బయటకు వెళ్లలేదా?”
“ లేదు.. నేను నాడైరీ చూసి చెబుతున్నాను. నేను స్టేషన్ లోనే ఉన్నాను. బయటకు వెళ్ళలేదు"; అన్నాడు సీతారామారావు.
"ఒక్కసారి ఈ పేపర్ చూడండి.. ఇందులో ఒక వార్త ప్రచురింపబడింది. అదే రోజు రాత్రి 9 గంటలకు ఇద్దరు రౌడీలు తాగి కారు డ్రైవ్ చేస్తూ ఒక ఆటోని గుద్దేయడంతో నలుగురు వ్యక్తులు ప్రమాద స్థలంలోనే మరణించడంతో అక్కడ పెద్ద గొడవ జరిగింది. ఆరౌడీలిద్దర్నీ ప్రజలు చితకబాదారు. అపుడు తీసిన ఫోటో ఇది; అందులో ఉన్నది మీరేనా"? అంటూ అతనికి పేపర్ చూపించాడు చరణ్;
అతను ఆఫోటోని చూసి ఒక్క క్షణం మౌనం దాల్చేడు. అతని ముఖంలో రంగులు మారటాన్ని గమనించాడు చరణ్.
ఈలోగా “ అబ్జెక్షన్” అంటూ సన్యాసిరావు లేచాడు.
" అతను ఎస్సై.. ఎక్కడో జరిగిన గొడవకి దీనికి సంబంధం ఏమిటి? డిఫెన్స్ లాయర్ మళ్లీ అనవసరమైన విషయాన్ని లేవనెత్తుతున్నారు.” అన్నాడు.
"యువరానర్! ఈకేసుకీ ఈ సంఘటన కీ సంబంధం ఉంది. చెప్పండి.. సీతారామారావు గారూ! ఈఫోటోలో ఉంది మీరా కాదా"? ప్రశ్నించాడు చరణ్;
"అవును ఆ ఫొటోలో వున్నది నేనే; ఇప్పుడు గుర్తుకు వస్తోంది. ఆరోజు సుమారు 9 గంటల ప్రాంతంలో నేను డ్యూటీలో ఉన్నపుడు ఒక ఫోన్ వచ్చింది. ఎవరో ఫోన్ చేసి లక్ష్మీనగర్ జంక్షన్ దగ్గర ఒక ప్రమాదం జరిగిందనీ, నలుగురు వ్యక్తులకు బాగా గాయాలయ్యాయనీ, గొడవ జరుగుతోందనీ వెంటనే రావలసిందిగా చెప్పి ఫోన్ పెట్టేసాడు. ఆ సమయంలో నేనొక్కణ్ణే స్టేషన్లో ఉన్నాను. ఏంచేయ్యాలో తోచక ఆలోచిస్తున్న సమయంలో మా సర్కిల్ ఇన్ స్పెక్టర్ చక్రపాణి జీపులో వచ్చారు. నన్ను చూసి కోప్పడి ‘లక్ష్మీనగర్ లో గొడవ జరుగుతోంది. నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళు’ అన్నారు.
అప్పుడు నేను ‘సార్.. స్టేషన్లో ఎవ్వరూ లేరు. నేను వెళ్ళిపోతే ఎలా?" అని అడిగితే ‘నేనుంటాను లే.. నువ్వెళ్లు’ అని చెప్పడంతో నేను ఆప్రమాదస్థలానికి వెళ్ళిపోయాను. ” అన్నాడు సీతారామారావు ఆ సంఘటనని గుర్తుకు తెచ్చుకుంటూ..
“యువర్ ఆనర్! ఇతను చెప్పిన వివరాలు విన్న తరువాత కేసులో నిజా నిజాలు బయటకు వస్తున్నాయి. అంటే హత్య జరిగిన రోజున 9 గంటలనుండి పోలీసుస్టేషన్ లో చక్రపాణి అనే సర్కిల్ ఇనస్పెక్టర్ తప్ప యింకెవ్వరూ లేరు. ఇదే చక్రపాణి గారు బీహార్ డిజిపికి ఉత్తరం రాసి ప్రస్తుత ముద్దాయి లిద్దరికీ ఆంధ్రలో జరిగిన దొంగతనం కేసుతో సంబంధాలున్నాయనీ, వాళ్ళని విచారించవలసిన అవసరం ఉందనీ, కాబట్టి ఆ ఇద్దర్నీ ఆంధ్ర పోలీసులుకు అప్పచెప్పాలనీ ఆ ఉత్తరంలో కోరారు.
నిజానికి ఏదైనా కేసులో ఇంకో రాష్ట్ర డీజిపికి ఉత్తరం రాయాలంటే కనీసం ఎస్పీ స్థాయి అధికారి సంతకం చెయ్యాలి. ఆవిషయాలన్ని తెలిసిన చక్రపాణిగారు ఆఉత్తరం మీద సంతకం ఎందుకు చేశారో, ఆబీహారు పోలీసులు ఈముద్దాయిలిద్దర్నీ ఎలా వీళ్ళకి అప్పచెప్పారో అర్ధంకాని విషయాలు.. అంటే ఈకేసులో చాలా పెద్ద కుట్ర జరిగింది. ప్రీప్లాన్డ్ గా, ముందు చూపుతో జరిగిన హత్య ఇది. చక్రపాణి తన ఎస్పీకి ఈ విషయంచెప్పారో లేదో లేక ఇతను బీహారు పోలీసులకు ఉత్తరం రాసిన విషయం అతనికి తెలుసో లేదో ప్రభుత్వం చెప్పాలి.
ఈకేసులో అతి కీలక అనుమానితుడు సీ. ఐ. చక్రపాణి. ఆరాత్రి కావాలనే సీతారామారావు ఎస్సైని స్టేషన్ నుంచి బయటకు పంపించి ఆ సమయంలో లాకప్పులో ఉన్న ఇద్దరు ముద్దాయిలను బయటకు వదిలేసాడు. వాళ్ళు బయటకొచ్చి పోలీస్ స్టేషనులో వున్న మోటార్ సైకిలు మీద వెళ్లి రాఘవన్ని హత్యచేసి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చి లాకప్పులోకి వెళ్లిపోయారు;ఇందువల్ల వాళ్ళని ఎవరూ అనుమానించలేరు;వాళ్ళకి లాకప్పు మంచి ఎలిబీ ; అందుకే ఈ ముద్దాయిల అరెస్టుని పోలీసులు చూపించలేదు ;ఇదీ జరిగింది.
కానీ ఇందులో ప్రభుత్వ పెద్దలు, పోలీసు అధికారులు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు పాత్ర ఉందన్నది నిర్వివాదంశం. ఈకేసులో చక్రపాణిని విచారిస్తే అన్ని విషయాలు తెలుస్తాయి. అదృష్టవశాత్తు మిస్ దీప ఈహత్యని ఆ సమయంలో ప్రత్యక్షంగా చూడటంతో ఈ హత్య వివరాలు బయటకొచ్చాయి. లేకపోతే ఈకేసు అన్ని కేసుల్లాగే మరుగునపడిపోయి ఉండేది;. కాబట్టి చక్రపాణిని అరెస్ట్ చేసి ప్రశ్నిస్తే ఈకేసులో అసలు నేరస్తులు బయట పడతారు;. ” అని విపులంగా వివరించాడు చరణ్ .
అప్పటికి సమయం 4 గంటలవడంతో జడ్జి గారు కేసుని పదిరోజుల తరువాత కి వాయిదా వేసారు. బయటకొచ్చిన తరువాత చరణ్ వాదనలు బాగా వినిపించినందకు విహారి, దీప, సౌదామిని అభినందించారు.
=================================================================================
ఇంకా వుంది...
=================================================================================
గన్నవరపు నరసింహ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
Podcast Link
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం
గన్నవరపు నరసింహ మూర్తి గారు ఎం టెక్ చదివారు.ప్రస్తుతం విశాఖ పట్నంలో రైల్వే శాఖలో జాయింట్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. వీరు ఇప్పటిదాకా 300 కథలు ,10 నవలలు రచించారు. ఏడు కథా సంపుటాలు ప్రచురించారు. స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి దగ్గర ఒక గ్రామం.
Comments