అతడే వీరుడు
- T. V. L. Gayathri
- Mar 27
- 1 min read
#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #అతడేవీరుడు, #AthadeVeerudu, #VasanthanikiSwagatham, #వసంతానికిస్వాగతం

గాయత్రి గారి కవితలు పార్ట్ 7
Athade Veerudu - Gayathri Gari Kavithalu Part 7 - New Telugu Poems Written By - T. V. L. Gayathri Published In manatelugukathalu.com On 27/03/2025
అతడే వీరుడు - గాయత్రి గారి కవితలు పార్ట్ 7 - తెలుగు కవితలు
రచన: T. V. L. గాయత్రి
అతడే వీరుడు
వీరసైనికుడతడు వెఱుపన్నదెఱుంగడు
వైరులను కూల్చుచూ ప్రాణాలకు తెగిస్తాడు
ధీరుడై దూకుతాడు దేశానికి రక్షకుడు
తేరిచూడగలేని దిశలనే గెలుస్తాడు
మంచుకొండలలో మాతృభూమికి తానే
కంచెలా నిలబడతాడు కాపరిగానుంటాడు
భార్యాబిడ్డలను వదలి పరిగెడతాడు
శౌర్యవంతు డెప్పుడు సాహసాలు చేస్తాడు
తెగువతో చరిస్తూ దేశ ధ్వజాన్ని మోస్తాడు
దిగులన్నది లేదంటూ దిక్కులనేకం చేస్తాడు
మన వీర జవానుని మరచి పోరాదెప్పుడు
ఘనుడైన శూరునికి కరము నందిద్దాము!
కలిసి మెలిసి నడుద్దాము గౌరవించుకొందాము!
చెలిమినే పంచుదాము చేవనొసంగుదాము!
"పదవోయి వీరుడా!" అంటూ బాసటగా వెళదాము!
కదను తొక్కుతూ దేశాన్ని కాపాడుకొందాము!//
************************************
వసంతానికి స్వాగతం

వెళ్లిపోతున్న శిశిరమా!బెంగలేదని చెప్పవమ్మ!
తుళ్లుతూ వాసంతాన్ని తీసికొని రావమ్మా!
అదిగదిగో వాసంతం అవనిలోకి వచ్చేస్తోంది!
మధురమైన తాయిలాలు మనకందించాలంది!
చివురులు వేస్తున్నాయి సింగారంగా తరువులు
కవితలు పాడుతున్నాయి కమ్మగా పులుగులు.
నదీనదాలు నయగారాలతో నాట్యమాడుతున్నాయి
ముదమొంది సమీరాలు భువిని చుట్టేస్తున్నాయి.
వసంత మొచ్చిందని వయ్యారాలు పోయాయి విరులు
కాసింత కొత్తదనమంటూ గారాలు పోయాయి తుమ్మెదలు.
కుహూ కుహూ మనుకుంటూ కూశాయి కోయిలలు
ఆహాహా యని బదులిచ్చాయి అంబరాన మేఘాలు.
పచ్చపచ్చని పట్టుచీర కట్టిందీ వసుధమ్మ ఘనంగా
వెచ్చని కిరణాలతో వచ్చాడు భానుడు విలాసంగా.
స్వాగతించింది ప్రకృతి వాసంతాన్ని పలకరిస్తూ
వేగంగా వచ్చిందీ వాసంతం దిశలను వెలిగిస్తూ
వాసంతలక్ష్మీ!రావమ్మా!విజయాలనందించవమ్మా!
మా సౌభాగ్యాలు నిలుపుతూ మమతలు పంచవమ్మా!//

టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
Profile Link:
Commentaires