top of page

అతిచిన్నది జీవితము

Writer's picture: Gadwala SomannaGadwala Somanna

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #AthiChinnadiJivithamu, #అతిచిన్నదిజీవితము, #సోమన్నగారికవితలు, #SomannaGariKavithalu

సోమన్న గారి కవితలు పార్ట్ 15

Athi Chinnadi Jivithamu - Somanna Gari Kavithalu Part 15 - New Telugu Poems Written By - Gadwala Somanna Published In manatelugukathalu.com On 04/02/2025

అతి చిన్నది జీవితము - సోమన్న గారి కవితలు పార్ట్ 15 - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


విలువైనది జీవితము

కాదు కాదు కాగితము

శ్రేష్టమైన పనులతో

చేసుకొనుము సార్ధకము


అద్దంలాంటి జీవితము

చేసుకోకు పలు ముక్కలు

వహిస్తే నిర్లక్ష్యము

మిగిలేదిక రక్త హస్తము


అపూర్వము,అపురూపము

మలుసుకుంటే అద్భుతము

అవుతుంది ఆదర్శము

మిగులుతుంది ఆనందము


మానవ జన్మ ఉన్నతము

భగవంతుని బహుమానము

చేతులార! చేసుకోకు

ఉప్పెనలా కల్లోలము


అతిచిన్నది జీవితము

కాకూడదు అయోమయము

జాగ్రత్తలు పాటిస్తే

అగునోయ్!స్వర్గధామము

















చదువుకున్న బాలిక దీపిక

----------------------------------------

చదువుకున్న బాలిక

వెలుగునిచ్చు దీపిక

అవనిలో అవుతుంది

నింగిలోని తారక


బాలికలు చదివితే

వృద్ధి చెందు దేశము

గొప్పగా ఎదిగితే

బాగుండు! జీవితము


బాలిక చదవాలోయ్!

ఏలిక కావాలోయ్!

వివక్షత విడిచిపెట్టి

భరోసా ఇవ్వాలోయ్!


వంటింటి కుందేలు

కారాదోయ్! బాలిక

పంజరంలో చిలుక

కాకూడదు బాలిక












ఋతు చక్రం

----------------------------------------

వసంతము అడుగిడింది

చెట్లకు ఊపొచ్చింది

లేలేత చిగురులతో

క్రొత్తదనం తెచ్చింది


హేమంత ఋతువుతో

మంచు పలకరించింది

ఎముకలు కొరకు చలితో

మేను కాస్త వణికింది


శరదృతువు రాకతో

వెన్నెల తోడొచ్చింది

అమావాస్య రాత్రులకు

విశ్రాంతి దొరికింది


శిశిర ఋతువు వచ్చింది

చెట్లను కుదిపేసింది

ఆకులను రాల్చేసి

అందాన్ని హరించింది


వర్ష ఋతువు మొదలై

రైతు గుండె మురిసింది

పొలంలోని పైరుకు

ప్రాణమే పోసింది


పుడమి వేడెక్కింది

వడదెబ్బ కొట్టింది

గ్రీష్మ ఋతువు రాకను

చెప్పకనే చెప్పింది


ఋతువులే లేకుంటే

అవి కనుక రాకుంటే

మానవ మనుగడ ఇల

సాఫీగా! సాగేనా!!


ఋతు చక్రం ముఖ్యము

ఉంటేనే లాభము

భగవంతుడే ఇలా

పెట్టాడోయ్! నేస్తము












పిల్లలు పిల్ల తెమ్మెరలు

----------------------------------------

పిల్ల తెమ్మెరలు పిల్లలు

మల్లెల వంటివి మనసులు

పల్లెసీమల అందాలు

వల్లిలాంటి బంధాలు


వెన్నముద్దలే పలుకులు

వెన్నెల జల్లులు తలపులు

చిన్నారులు సన్నజాజులు

సన్నాయిల నాదాలు


ముద్దులొలికే బాలలు

ముద్దబంతుల తావులు

వృద్ధికి వారే బాటలు

పెద్దలకెంతో ఇష్టులు


హద్దులు దాటని పిల్లలు

సుద్దులు తేనె చినుకులు

ముద్దులనిన ప్రియం! ప్రియం!

పద్ధతి నేర్పిన జ్యోతులు


అల్లరిలోన ప్రథములు

కల్లలెరుగని బాలలు

చల్లని చంద్రుని కాంతులు

తెల్లని మంచు బిందువులు


కొమ్మకు కాసిన ఫలములు

అమ్మ గుండెకు శ్వాసలు

బొమ్మలు బోలిన పిల్లలు

అమ్మానాన్నల ఆస్తులు












అవ్వ సూక్తులు

----------------------------------------

రవిబింబము అందము

కవి కావ్యము మధురము

చవి ఉంది తెలుగులో

దివిని పారిజాతము


వరి చేనుల గట్టున

విరిజాజుల వనమున

ఆహ్లాదము మనసున

ఆనందము బ్రతుకున


మహిళలున్న గృహమున

అభివృద్ధే జగమున

వారు లేక మహిలో

అంతులేని వేదన


అతిముఖ్యము సాధన

కాదు నరకయాతన

విజయానికి వంతెన

అదే లక్ష్య ఛేదన
















అమ్మలాంటి తెలుగు పదాలు

---------------------------------------

చిరుగాలి వీచింది

మరుమల్లె విరిసింది

కనువిందు చేసింది

మేను పులకించింది


విరిజాజి నవ్వింది

హరివిల్లు వెలసింది

సప్త వర్ణాలతో

హృదయాలు దోచింది


శశి వోలె పసిపాప

ముద్దుగా తోచింది

వెన్నెలమ్మ వెలుగై

చీకటిని తరిమింది


ఇంటిలో మా అమ్మ

ముద్దలే చేసింది

చందమామను చూపి

బొజ్జలే నింపింది












చిరునవ్వు ఒక వరము

---------------------------------------

చిరునవ్వులు తేజము

వదనానికి అందము

పెదవులతో వాటికి

అంతులేని బంధము


ఉంటే దరహాసము

ముఖమున మధుమాసము

లేకుంటే మాత్రము

కడు కళావిహీనము


తరువుల ఆకుల్లా

తనువుల వలువల్లా

అందాలే పంచును

ఆరోగ్యం పెంచును


ఖర్చు అసలు లేనిది

హానికరము కానిది

వరము మందహాసము

ఔషధం లాంటిదది














అమ్మ హితోక్తులు 2

---------------------------------------

మొక్కలాగ జీవితాన

మౌనంగా ఎదగాలి

చుక్కలాగ ప్రపంచాన

ఉన్నతంగా వెలగాలి


చిగురులాగ జనుల మధ్య

వినయంగా బ్రతకాలి

తరువులాగ పదిమందికి

గొప్పగా సాయపడాలి


గురువులాగ బుర్రలో

అజ్ఞానం దులపాలి

విజ్ఞాన జ్యోతి వెలిగించి

బ్రతుకు బాగు చేయాలి


మిత్రునిలాగ ఆపదలో

కొండలా అండ ఉండాలి

దండంలోని దారంలా

ఆధారం కావాలి


పాపలాగ చిరునవ్వులు

పువ్వులాగ రువ్వాలి

అధరాల గగనంలో

వెన్నెల్లా కురియాలి












మంచిది

---------------------------------------

ఆపదలో సాయము

అభాగ్యులకు న్యాయము

చేస్తేనే మంచిది

పేదోళ్లకు ధర్మము


చీకటిలో దీపము

ప్రేమకు ప్రతిరూపము

అయితేనే మంచిది

అగరబత్తి ధూపము


పరిమళించు పుష్పము

చిన్నారుల వినయము

అయితేనే మంచిది

విజయానికి చిహ్నము


మితిమీరిన కోపము

ఇతరులతో కలహము

మానితేనే మంచిది

చెడ్డ వారి స్నేహము


హద్దులేని గర్వము

బ్రతుకున పిరికితనము

వీడితేనే మంచిది

ఓర్వలేని నైజము


పదిమందికి జ్ఞానము

అక్కరలో దానము

చేస్తేనే మంచిది

ప్రతిరోజూ ధ్యానము
















తాతయ్య ప్రబోధం 2

---------------------------------------

నిను నమ్మిన వారికి

ద్రోహం చేయరాదు

శరణన్న శత్రువుకు

హాని తలపెట్టరాదు


చెప్పుడు మాటలు విని

చేటు తెచ్చుకోరాదు

నిజానిజాలు తెలియక

నిందలు వేయరాదు


గురువాజ్ఞ ఎన్నడూ

తిరస్కరించరాదు

కన్నవారి మనసులు

కష్టబెట్టకూడదు


నష్టాలే వచ్చినా

న్యాయాన్ని వీడరాదు

కష్టాలే క్రమ్మినా

ఎదబాదు కోరాదు


-గద్వాల సోమన్న


19 views0 comments

Comments


bottom of page