top of page

ఆత్మావలోకనం - పార్ట్ 1



'Athmavalokanam - Part 1/2' - New Telugu Story Written By Ch. C. S. Sarma

Published In manatelugukathalu.com On 27/05/2024

'ఆత్మావలోకనం - పార్ట్ 1/2' పెద్ద కథ ప్రారంభం

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



"ఒరేయ్! విజయభాస్కరా!.. ఎప్పుడొచ్చినావ్?" హెచ్చు స్థాయిలో అడిగాడు వీరవెంకటరావు.


"ఓ పది రోజులైంది మామయ్యా!" మేనల్లుడు విజయభాస్కర్ జవాబు.


"ఏందీ పదిరోజులా!"


"అవును మామయ్యా!"


"ఏరా!.. ఈ నీ మామయ్య ఎటో ఎల్లిపోయాడనుకున్నావా!.. రాగానే వచ్చి మామయ్యను చూడాలనిపించలేదా నీకు!.. మీ అమ్మ కూడా చెప్పలేదా?" ఆశ్చర్యంతో వీర వెంకటరావు తన మేనల్లుడు విజయ భాస్కర్ ముఖంలోకి హేళనగా చూస్తూ అడిగాడు.


"అమ్మమ్మకు బాగాలేదని అమ్మ చెప్పింది. అందుకని తాతయ్యా అమ్మమ్మలను చూచేదానికి.. వచ్చిన మరుసటి రోజే వెళ్ళాను. నిన్ననే వచ్చాను మామయ్యా!"


"అలాగా!.."


"అవును మామయ్యా!"


"నిలబడే వున్నావేం.. కూర్చో!"


"వీధిలో నా స్నేహితులు నిలబడి వున్నారు మామయ్యా!" సాత్వికంగా చెప్పాడు విజయభాస్కర్.


"ఏమిటో విషయం?"


"మూడేళ్ళ తర్వాత వచ్చాను కదా మామయ్యా!.. నా అమెరికా అనుభవాలను.. నా చదువులను గురించి అడిగి తెలుసుకోవాలనుకుంటున్నారు"


"ఓహో.. అదా విషయం!.."


"అవును మామయ్యా!"


"మరి నాకు టైమ్ ఎప్పుడిస్తావ్?" వ్యంగ్యంగా అడిగాడు అదోలా నవ్వుతూ వీరవెంకటరావు.


విజయ్ కొన్ని క్షణాలు వీరవెంకట రావు గారి ముఖంలోకి చూచి నిట్టూర్చి.. "ఏ విషయంలో మామయ్యా!" మెల్లగా అడిగాడు.


"ఏ విషయమా!" వికటంగా నవ్వి.. "అదే.. మన రెండు కుటుంబాల మంచి చెడ్డల గురించి!.."


"మామయ్యా.. మీ మాటలు నాకేమీ అర్థం కావటం కాలేదు. నేను సాయంత్రం వస్తాను."


"రావద్దు"


"రావద్దా?!" ఆశ్చర్యపోయాడు విజయభాస్కర్.


"అవును.. రావద్దు"


"మరి ఎప్పుడు కలుద్దాం మామయ్యా!"


"ఎల్లుండి సాయంత్రం"


"నేను ఎల్లుండి వూర్లో వుండను మామయ్యా!"


"ఎక్కడికి వెళ్తావ్?"


"చెన్నై.. ఓ ఫ్రెండ్ అనారోగ్యంగా ఉన్నాడు. వాడి కోసం కొన్ని మందులు తెప్పించాను. వాడిని చూచి ఆ మందులు వాడికి ఇచ్చి రావాల్సి ఉంది."


"తిరిగి రాక..?"


"రెండు రోజుల తర్వాత.."


"ఇంతకీ నీవు కూర్చోనే లేదు?"


"చెప్పానుగా మామయ్యా! వీధిలో నా మిత్రులు నిలబడి వున్నారని. వెళుతున్నాను. చెన్నై నుంచి వచ్చాక కలుస్తాను" వెనుదిరిగి వేగంగా వీరవెంకటరావు గారి జవాబుకు ఎదురు చూడకుండానే వీధివైపునకు నడిచాడు విజయభాస్కర్.


"ఏమండే!.." పాలేరు పాండు పిలుపు.


"ఏందిరా?"


"బాబుగారు సూపరండే!" ఆనందంగా నవ్వాడు పాండు.


"చేస్తున్నపని ఆపి.. వచ్చి నాతో ఆ మాటల్ని ఇప్పుడు నేను చెప్పమన్నాన్‍రా! ఎదవా.. ఎదవ.. పోయి పని చూచుకో!" కసిరాడు వీరవెంకటరావు ఆవేశంతో ఇంట్లోకి వెళ్ళాడు.


’ఈ మనిషికి ఎప్పుడూ ముక్కుమీద కోపం’ అనుకొంటూ గొడ్డలితో తుమ్మమొద్దును పగులగొట్ట సాగాడు పాండు.

*

వీరవెంకటరావు.. విజయభాస్కర్‍కు మేనమామ. అతని తల్లి పేరు సుమతి. ఆమె భర్త విజయకు ఆరు సంవత్సరాల ప్రాయంలో విష జ్వరం వచ్చి గతించారు. ఆనాటి నుంచి వెంకటరావు సుమతికి విజయభాస్కర్‍కు నేటివరకు ఎంతో సహాయంగా వుంటున్నారు. చెల్లెలంటే వీర వెంకటరావుకు ఎంతో ప్రేమాభిమానం. వీరి ఇల్లాలు దివ్య ఉత్తమురాలు. అనుకూలమైన దాంపత్యం. వారి వివాహం జరిగిన ఆరుసంవత్సరాలకు పుట్టింది ఆడపిల్ల. ఆమని అని పేరు పెట్టారు ఆ దంపతులు.


ఆమనికి విజయభాస్కర్‍కు వయస్సులో వ్యత్యాసం ఎనిమిది సంవత్సరాలు. అయినా ఆమె పుట్టగానే.. వెంకటరావు.. దివ్య ఆనందంగా విజయకు భార్య పుట్టిందని సుమతితో.. ఇరుగుపొరుగు బంధుజాలంతో చెప్పుకొని ఆనందించారు.


ప్రస్తుతంలో అమెరికాలో మాస్టర్స్ చేసి వచ్చిన డాక్టర్ ఆమని. ఎం. ఎస్సీ చదివి కాలేజీలో లెక్చరర్‍గా పనిచేస్తూ వుంది. విజయభాస్కర్ అమెరికా నుండి తిరిగి వచ్చాక ఆమని విజయ భాస్కర్‍ల వివాహం ఘనంగా చేసి వారిని అమెరికాకు పంపాలనేది ఆ వెంకటరావు దివ్యల ఆశయం. వీరికి మరొక కూతురుంది. పేరు హారతి. హారతి ఆన్‍లైన్ క్లాసుల్లో ప్లస్ టూ చదువుతూ ఉంది. ఆమనికి ఆమెకు ఆరు సంవత్సరాల వ్యత్యాసం. హారతి ప్లస్ టూ సెకండ్ ఇయర్. డాక్టర్ కావాలనేది ఆమె ఆశయం.

*

"ఆ.. చెప్పండి మామయ్యా!" వరండాలో కూర్చొని పేపరు చూస్తున్న వెంకటరావును సమీపించి అడిగాడు విజయ భాస్కర్.


అతని గొంతు విన్న ఆమని.. హాల్లో నుండి వరండా వైపు తొంగి చూచింది. విజయభాస్కర్ ఆమెను చూచాడు. ఆమె చూపు త్రిప్పుకొని లోనికి వెళ్ళి వంట ఇంట్లో వున్న తల్లి దివ్యకు విజయభాస్కర్ వచ్చాడని చెప్పింది. దివ్య వేగంగా వరండాలోకి వచ్చింది.


"బాబూ విజయ్!.. ఎప్పుడొచ్చావ్!.. బాగున్నావా?" ఆప్యాయంగా పలుకరించింది.


"బాగున్నానత్తయ్యా! వచ్చి పదిరోజులైంది. రాగానే తాతయ్యగారి ఊరు వెళ్ళాను. నాలుగురోజులుండి రాగానే చెన్నై వెళ్ళి మూడు రోజులు వుండవలసి వచ్చింది. రాత్రి చెన్నై నుంచి తిరిగి వచ్చాను. మిమ్మల్ని అందరిని చూచి మాట్లాడి పోవాలని వచ్చాను అత్తయ్యా. మీరంతా బాగున్నారుగా!" చిరునవ్వుతో అడిగాడు విజయభాస్కర్.


"సంతోషం.. సంతోషం.. చాలా సంతోషం.. కూర్చో కాఫీతీసుకొని వస్తాను" నవ్వుతూ లోనికి వెళ్ళిపోయింది దివ్య.


దివ్య బి.ఎ పాసైంది. వీరవెంకటరావు మేనరికం.. వారు చదివింది ఎస్.ఎస్.ఎల్.సి (లెవెన్త్) ఆమె మంచి సంస్కారవంతురాలు. కానీ.. తన అత్తగారైన నారాయణమ్మకు ఆమెకు అభిప్రాయ భేధాలు. మామగారైన మార్తాండరావు.. (వీరవెంకటరావు తండ్రిగారు) వీరవెంకటరావు వివాహ విషయంలో నారాయణమ్మ తన తమ్ముడు విశ్వేశ్వరయ్య కూతురు సుశీల.. వీర వెంకటరావులకు పెండ్లి చేయాలనే సంకల్పం.. మార్తాండరావుకు తన చెల్లెలు శారద కూతురు దివ్యతో చేయాలనే నిర్ణయం..


భార్యాభర్తలు.. నారాయణమ్మ, మార్తాండరావులు మధ్యన వాదోపవాదాలు.. అభిప్రాయబేధాలు మాట్లాడుకోవడం మాని నాలుగు నెలలు జరిగాయి. తల్లిదండ్రుల ఈ పట్టుదల, ఆవేశాలను వీరవెంకట్రావు తన మాటలతో ఏమాత్రం మార్చలేకపోయాడు. తనకు ఎంతో ఇష్టం అయిన దివ్యను (తండ్రి సోదరి కుమార్తె) అమ్మా నాన్నలకు చెప్పకుండా వివాహం చేసుకొన్నాడు.వారి ఇంట్లోనే వుండిపోయాడు.


ప్రస్తుతంలో దివ్య తల్లిదండ్రులు లేరు. కానీ.. వీరవెంకటరావు.. సుమతీ తల్లిదండ్రులు నారాయణమ్మ.. మార్తాండరావులు డెబ్భై ఎనిమిది ఎనభై రెండు వయస్సులో వారి స్వగ్రామంలో వున్నారు. ఆ వూరికి ఈ వూరికి మధ్య దూరం పదికిలోమీటర్లు. హైవేకి తూర్పున మార్తాండరావుగారి గ్రామం.


ఆ రోజుల్లో మనుషుల్లో నీతి నిజాయితీ.. పంతం, పట్టుదలలు అధికం.. స్వతత్వానికి.. గౌరవానికి ఎంతో ప్రాధాన్యతను ఇచ్చేవారు. తమ ఇష్టానుసారంగా వీరవెంకటరావు దివ్యకు (మార్తాండరావు సోదరి శారద కూతురు) పెండ్లి చేసుకొన్నాడని.. వారి వూర్లోనే వుండిపోవటంతో.. నారాయణమ్మ మార్తాండరావులు.. వెంకటరావు కుటుంబానికి దూరమైనారు.


వారి కూతురు వీరవెంకటరావు సోదరి.. విజయభాస్కర్ తల్లి సుమతి ఆ వూరికి వెళ్ళి పెద్దవారైన తల్లిదండ్రులను చూచి.. కొంతకాలం వారితో గడిపి తమ గ్రామానికి వచ్చేది. మనుమడు అమెరికా నుండి వచ్చాడనగానే అతనిని చూడాలని వుందని కబురు చేశారు ఆ నానమ్మ, తాతయ్యలు.. విజయభాస్కర్ ఆ వూరికి వెళ్ళీ పెద్దవారిని చూచి అక్కడ తాను హాస్పిటల్ పెట్టాలని నిర్ణయించుకొని.. ఆ విషయం ఆ తాతా అవ్వలకు చెప్పి వారిని ఆనందపరిచి.. స్థలాన్ని చూచి తిరిగివచ్చాడు విజయభాస్కర్.


రెండు గ్లాసులను ప్లేట్లో పెట్టుకొని వరండాలోనికి వచ్చింది ఆమని.

ఆమెను చూడగానే విజయభాస్కర్ "గుడ్ మార్నింగ్ మేడమ్!" చిరునవ్వుతో చెప్పాడు.


ఆమని బెదిరిపోయింది. అతడు తనను ఆ రీతిగా పలకరిస్తాడని వూహించలేదు.

"ఆ.." తొట్రుపాటుతో "గుడ్ మార్నింగ్ కాఫీ!.." గ్లాసును విజయ భాస్కర్‍కి అందించింది.


వీరవెంకటరావు.. కూతురు.. అల్లుడి వాలకాలను చూచి.. కాబోయే భార్యాభార్తలు కదా అనుకొన్నాడూ. మనస్సున నవ్వుకొంటూ విజయభాస్కర్ ముఖంలోకి చూచాడు.

"నాన్నా!.. కాఫీ..!" అంది ఆమని.


"ఆ.. ఇవ్వమ్మా!"


ఆమని కాఫీగ్లాసును తండ్రికి అందించి ఇంట్లోకి వెళ్ళిపోయింది. 

"ఆ.. కాఫీ ఇచ్చావా!"


"ఆ.. ఇచ్చాను"


"బావతో ఏమైనా మాట్లాడావా?" అడిగింది దివ్య.


"ఏం మాట్లాడాలి!" అంది ఆమని.


"మూడేళ్ళ తర్వాత అమెరికా నుంచి వూరికి.. ఇంటికి వచ్చిన వరుసకు బావ అయిన అబ్బాయిని ప్రీతిగా పలకరించాలి కదే!"


"నాకంటే ముందు వారే పలకరించారు!"


"చూచావా.. దాన్నే సంస్కారం అంటారు. నేర్చుకో!" అంది దివ్య.


"ఆ.. సరే.. నేను వెళతాను" రోషంగా అంది ఆమని.


"ఎక్కడికి?"


"నా గదికి"


"వరండాలోకి వెళ్ళి కాఫీ గ్లాసులు తీసుకొని విజయభాస్కర్‍తో ’బావా! అమ్మ టిఫిన్ చేసింది. మీరు తిని వెళ్ళాలని చెప్పమన్నది’ అని చెప్పాలి అర్థం అయ్యిందా!" అసహనంగా అడిగింది దివ్య.


అయిందన్నట్టు ఆమని తలాడించి.. మెల్లగా వరండాలోకి వచ్చింది.

"మామయ్యా!.. ఈరోజు సాయంత్రం ఐదుగంటలదాకా నేను ఇక్కడే మీతో గడుపుతాను. మీరు ఏమైనా అడగండి.. నాకు తెలిసిన జవాబు చెబుతాను. మీ ఆనందమే నా ఆనందం" ఆమనిని చూస్తూ నవ్వుతూ చెప్పాడు విజయభాస్కర్.


ఆమని విజయభాస్కర్ మాటలను విన్నది. వెంటనే వెనుతిరిగి వంటగదిలో ప్రవేశించి..

"అమ్మా!.."


"చెప్పావా?"


"ఆయనే చెప్పారు!"


"ఏమని!"


"ఈ రోజు సాయంత్రం ఐదుగంటల వరకూ మన ఇంట్లోనే తిష్టవేస్తారట!"


"ఏమన్నావ్?"


"ఐదుగంటల వరకు ఉంటారట ఇక్కడే!"


"అహ అది కాదు.. నీవు వాడిన పదం వేరే!.. అదేమిటీ?"


"అమ్మా! నన్నొదులు" రుసరుసలాడుతూ వంట ఇంట్లోనుండి బయటకు వచ్చింది ఆమని.


=======================================================================

ఇంకా వుంది.. 

=======================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


50 views0 comments

Commentaires


bottom of page