'Athmaviswasam' - New Telugu Story Written By Ch. Pratap
Published In manatelugukathalu.com On 27/02/2024
'ఆత్మవిశ్వాసం' తెలుగు కథ
రచన: Ch. ప్రతాప్
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
పూర్వం కోసల దేశం లో నివసించే నారాయణాచార్యులు అనే బ్రాహ్మణుడు వర్తకం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఆతనికి భార్య, ఇద్దరు పిల్లలు వున్నారు. భార్యా చాలా అనుకూలవతి, సత్వ గుణ సంపన్నురాలు. ఫిల్లలను, భర్తనూ ఎంతో ప్రేమగా చూసుకుంటూ వుండేది. కోరికలను అదుపులూ వుంచుకుంటూ సంతృప్తి తో జీవి స్తుండడం వలన ఆందోళనలు, అశాంతి వారికి ఆమడ దూరం లో వుండేవి. అత్యాశకు పోకుండా కొద్దిపాటి లాభలతో వర్తకం చేస్తుండడం వలన నారాయణాచార్యులు యొక్క వ్యాపారం సాఫీగా సాగిపోతూ వుండేది. పైగా కల్తీ లేని సరుకులను తక్కువ ధరకు అమ్ముతాడన్న మంచి పేరు కూడా వచ్చింది.
రోజులన్నీ ఒకేలా వుంటే దానిని జీవితం అని ఎందుకు అంటారు? అన్నీ సాఫీగా గడిచిపోతున్నప్పుడు అనుకోని విధంగా ఎదురు దెబ్బలు తగిల్చి తద్వారా విలువైన జీవితపు పాఠాలు నేర్పించడమే కదా విధి యొక్క ముఖ్య కర్తవ్యం. యొనారాయణాచార్యులు భార్యకు అనారోగ్యం వచ్చింది. దూర దేశం లో వైద్యం చేయించడం మొదలుపెట్టాడు. ఇద్దరు పిల్లలకు పెళ్ళిళ్ళి కూడా చేసేసాడు. వయో భారం వలన ఇదివరకటిలా వ్యాపారం చెయ్యలేకపోతున్నాడు. ఆదాయం మందగించింది, ఖర్చులు ఎక్కువయ్యాయి. పిల్లలు వాపారం నిమిత్తం దూర దేశాలకు వలస వెళ్ళిపోయి తల్లిదండ్రులను పట్టించుకోవడం మానేసారు. జీవితం లో ఎదురైన ఈ కష్టాల పరంపరను తట్టుకోలేక తల్లడిల్లిపోయాడు. ఇంతటి ముళ్ళ పొద లాంటి కిరీటం తలపై పెట్టుకొని తిరిగేకంటే జీవితానికి ముగింపు పలకడమే మంచిదన్న అభిప్రాయానికి కూడా ఆ దశలో వచ్చేసాడు.
ఆ సమయంలో వారి గ్రామానికి ఒక సాధు పుంగవుడు వచ్చారు. ఆయన సర్వసంగ పరిత్యాగి. సకల వేద పారంగతుడు. ఊరూరూ తిరిగుతూ అధ్యాత్మిక గోష్టి గావిస్తూ ప్రజలను సన్మార్గంలో నడిపించ యత్నించేవారు. ఆయన వద్దకు వళ్ళి పాదాలపై పడి తన కష్టాలను విన్నవించుకున్నాడు నారాయణాచార్యులు.
" మహాశయా, ఈ లోకంలో ఎవరికీ రానంత కష్టాలు నాకు వచ్చాయి. సాఫీగా సాగుతున్న జీవితపు నావ ఒక్కసారిగా నడిసంద్రంలో మునిగిపోయంది. ఏ దిక్కూ తోచక, నడి సంద్రంలో కొట్టుమిట్టాడుతున్నాను. ఇక ఈ జీవిత భారాన్ని మోయడం నా వలన కాదు. అందుకే ఈ గృహస్థు ఆశ్రమానికి స్వస్థి పలికి సన్యాసంలో కలిసిపోదామనుకుంటున్నాను, లేదా ఆత్మహత్య చేసుకొని ఈ కష్టాల మయమైన జీవితాన్ని చాలించుదామనుకుంటున్నాను. ఏది శ్రేయో మార్గమో నాకు సెలవివ్వండి" అన్ని కణ్ణీళ్ళ పర్యంతమై ప్రార్ధించాడు నారాయణాచార్యులు.
ఆతని మాటలను విన్న ఆ సాధు పుంగవుడు చిరునవ్వుతో” నాయనా ! కష్టాలు, సుఖాల పరంపర ప్రతీ వారి జీవితం లో తప్పనిసరి. వాటిని ధైర్యం తో, ఆత్మ విశ్వాసం తో ఎదుర్కోవలే గాని పిరికితనంతో వాటి నుండి పారిపోకూడదు. పిరికి వానికి ఇహ పరములు రెండూ చెడుతాయి. ధర్మానికి మారుపేరైన శ్రీ రామ చంద్రునికి, మహలక్ష్మీ అవతారమైన సీతమ్మ తల్లికీ కష్టాలు తప్పలేదు కాదా! రాజ్య భోగాలు దూరమై పన్నెండేళ్ళూ వనవాసం చేసి పడరాని కష్టాలు పడ్డారు. సాక్షాత్తు శ్రీ కృష్ణుడు తోడున్నా పాండవులు ఎంతటి కష్టాలు పడ్డారో మనందరికి తెలుసు కదా! వారి కష్టాలతో పోలిస్తే నీకు వచ్చినవి ఎంతటివో ఒక్కసారి ఆలోచించు. జీవితాంతం సుఖాలు మాత్రమే వుండాలి కష్టాల నీలి నీడ మనపై పడకూడదని భావించడం అవివేకం. చేదు తిన్న తర్వాతే తీపి యొక్క తీయనత్వం అనుభవమగు అన్న రీతిన కష్టాలను చవి చూసినప్పుడే సౌఖాల లోని మాధుర్యం మనకు అర్ధమౌతుంది. ఆన్ని ద్వందాలనూ సమంగా స్వీకరించే ఓర్పు, నేర్పు మనం అలవరచుకోవాలి.
కష్టాలనేవి గురువు వంటివి. మనకు జీవిత సత్యాలను బోధించదానికి, ఓర్పు, సహనం, విశ్వాసం వంటి సద్గుణాలను నేర్పడానికే వస్తాయి. వాటిని చిరునవ్వుతో ఎదుర్కొని అధిగమించాలే కాని బెంబేలెత్తి పారిపోకూడదు. చీకటి వెలుగులు, అమావాశ్య పౌర్ణమి, రాత్రి పగలు వలె ద్వందాలు. ప్రతీవారి జీవితం లో ఈ చక్రభ్రమణం తప్పని సరి. కష్టాలు వచ్చినప్పుడు పరిస్థితులను, ఇతరులను నిందించకుండా భగవంతునిపై భారం వేసి ఆత్మ విశ్వాసంతో ఆ పరిస్థితి నుండి బయట పదే మార్గం ఆలోచించాలి.
సుఖాలలో మునిగి తేలుతున్నప్పుడు భగవంతుని విస్మరించరాదు. సదా భగవన్నామస్మరణ చేయడం, సత్కర్మలు ఆచరించడం, కరుణ, జాలి, క్షమలతో పరులను ప్రేమించడం, ఇతరులకు వీలైనంతగా సహాయం చేయడం, అన్నార్తులను ఆదుకోవడం వంటి సత్కార్యాలను చేస్తే భగవంతుడు సంతోషించి మానవులను భవిష్యత్తులో కష్టాల కడలిలో మునిగిపోకుండా కాపాడుతాడు. కామ, క్రోధాది అరిష్డ్వర్గములను లోబర్చుకొని సత్వ గుణ సంపన్నులమై శాంతియుత జీవనం సాగించడం ఎంతో అవసరం. ఇతరులను తమతో పోల్చుకొని తాము దురధృష్టవంతులమన్న నైరాశ్యాన్ని సత్వరం విడనాడాలి. ఈ సృష్టిలో జరిగే ప్రతీ సంఘటన ఈశ్వరేచ్చ ప్రకారమే జరుగుతుంది. సంపదలు కోల్పోతే తిరిగి సాధించుకోవచ్చు కానీ ఆత్మ విశ్వాసం, ధైర్యం కోల్పొతే మాత్రం తిరిగి సాధించుకోలేము” అని ఉద్భోదించారు.
అమృతతుల్యమైన ఆ మాటలకు నారాయణాచార్యులుకు జ్ఞానోదయం అయ్యింది. తానెంత తెలివి తక్కువగా ఇంతకాలం ఆలోచించాడో అర్ధం అయ్యింది. ఆ సాధువు మాటలను మదిలో జాగ్రత్తగా పదిలపరచుకున్నాడు. జారిపోయిన ఆత్మ విశ్వాసాన్ని మళ్ళీ నింపుకున్నాడు. ధైర్యంతో ముందుకు సాగి మళ్ళీ జీవితం లో ఉన్నత స్థాయిని సాధించాడు.
***
Ch. ప్రతాప్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
నా పేరు Ch. ప్రతాప్. నేను వృత్తి రీత్యా ఒక ప్రభుత్వ రంగ సంస్థలో సివిల్ ఇంజనీరుగా పని చేస్తున్నాను. ప్రస్తుత నివాసం ముంబయి. 1984 సంవత్సరం నుండే నా సాహిత్యాభిలాష మొదలయ్యింది. తెలుగు సాహిత్యం చదవడం అంటే ఎంతో ఇష్టం. అడపా దడపా వ్యాసాలు, కథలు రాస్తుంటాను.
Comments