top of page
Writer's pictureSeetharam Kumar Mallavarapu

ఆత్మ విశ్వాసం

ఈ కథ వినడానికి ప్లే బటన్ నొక్కండి.


'Athma Viswaasam' written by Mallavarapu Seetharam Kumar

రచన : మల్లవరపు సీతారాం కుమార్

'సాయి నగర్ కాలనీ- థర్డ్ క్రాస్ రోడ్' బోర్డు చూసి ఆ వీధిలోకి స్కూటీ పోనిచ్చింది సుజాత.

"వద్దు మమ్మీ! వెనక్కి వెళ్ళిపోదాం." ఇంటి దగ్గర బయలుదేరినప్పటి నుండి, అది మూడో సారి ప్రియ తన తల్లితో చెప్పడం.

"ఎలాగూ ఇంతదూరం వచ్చేశాం కదా! సువర్చల గారు ఈ వీధిలోనే ఉంటారు. ఓ అరగంట మాట్లాడి వెళ్ళిపోపోదాం. మా బంగారు కదూ!" కూతురిని బతిమాలుతూ అంది సుజాత.

అయిష్టంగానే సరేనన్నట్లు తల ఊపింది ప్రియ. ఎదురుగుండా ఇద్దరు కాలేజీ స్టూడెంట్ లు వస్తూ ఉండటం చూసి వారి వద్ద స్కూటీ ఆపింది సుజాత.

"ఇక్కడ సువర్చల గారి ఇల్లు తెలుసా?" అని వాళ్లని అడిగింది.

"అదిగో ఆ జామ చెట్టు ఉన్న ఇల్లే సువర్చల గారిది. వాళ్ళ అబ్బాయి బయటే ఉన్నాడు. కాస్త జాగ్రత్త"అని చెప్పి, వెళ్ళిపోయారు వాళ్ళు. వాళ్ళెందుకలా అన్నారో ప్రియకు అప్పుడు అర్ధం కాలేదు.

నేరుగా సువర్చల ఇంటిముందు స్కూటీ ఆపింది సుజాత. కూతురితో కలిసి గేటు వద్దకు వెళ్ళింది. గేటు లోపలివైపు తాళం వేసి ఉంది. లోపల ఇంటి ముందు వరండాలో ఓ పాతికేళ్ళ అబ్బాయి పిచ్చి చూపులు చూస్తూ కనిపించాడు. గేటు దగ్గర వీళ్ళని చూడగానే 'అమ్మా..అమ్మా..' అంటూ కేకలు వేశాడు. ఆ కేకలు విని బయటకు వచ్చిన సువర్చల వీళ్ళను చూసి ఆశ్చర్య పోయింది.

గబగబా వచ్చి గేటు తాళం తీసి లోపలికి ఆహ్వానించింది. వచ్చిన కొత్త వ్యక్తులను చూసి తల్లి వెనక దాక్కోడానికి ప్రయత్నిస్తున్నాడు ఆ అబ్బాయి.

"యశ్వంత్! అల్లరి చేయకుండా నీ బొమ్మలతో ఆడుకో" అని తన కొడుకు తో చెప్పి, లోపలికి నడిచింది సువర్చల. ఇంట్లోకి వచ్చిన సుజాత, ప్రియలను సోఫాలో కూర్చో బెట్టి కాఫీ కలుపుకుని వచ్చింది.

కుశల ప్రశ్నలయ్యాక , "ముందుగా చెప్పి ఉంటే టిఫిన్ రెడీ చేసేదాన్ని. ఇప్పుడైనా పర్వాలేదు, మధ్యాహ్నం భోజనం చేసుకొని వెళ్ళండి " అంది ప్రియ ప్రక్కన కూర్చుంటూ .

"ఇప్పుడు అవేమీ పెట్టుకోవద్దు సువర్చలా.. మరోసారి వస్తాము. ఏమీ అనుకోవద్దు" చెప్పింది సుజాత.

"అన్నట్లు అడగడం మర్చిపోయాను. నీకు మెడికల్ ఎంట్రన్స్ లో మంచి ర్యాంకు వచ్చిందా?" ప్రియని అడిగింది సువర్చల.

జవాబు ఇవ్వకుండా మౌనంగా తల దించుకుంది ప్రియ.

సుజాత వంక ప్రశ్నార్ధకంగా చూసింది సువర్చల.

"ఆ విషయమే నీతో చెబుదామని తీసుకు వచ్చాను" అంది సుజాత.

"నాతోనా? నేనేమన్నా ఎంసెట్ కన్వీనర్ నని అనుకున్నావా? నాతో ప్రియకు చివాట్లు పెట్టించాలనుకొని వచ్చావేమో! తక్కువ రాంక్ వచ్చినా కొంపలేమీ అంటుకుపోవు. నేను ఇలాంటి విషయాలని తేలిగ్గా తీసుకుంటాను"అంటూ నవ్వింది సువర్చల.

"అసలు విషయం చెబుతాను.." అంటూ చెప్పబోతున్న సుజాతను కళ్ళతోనే వారిస్తోంది ప్రియ.

అది గమనించిన సువర్చల "మీ అమ్మ నాకు మంచి స్నేహితురాలు. టెన్త్ వరకు ఇద్దరం కలిసి చదువుకున్నాం. నేను మీ ఇంటికి చాలా సార్లు వచ్చాను . మా మధ్య దాపరికాలేవీ లేవు. అమ్మను మాట్లాడనివ్వు" అంది.

ఇంతలో బయటనుంచి సువర్చల కొడుకు లోపలికి వచ్చి కొత్త వ్యక్తులను పరిశీలనగా చూస్తూ వారి దగ్గరకు వచ్చాడు. అతనిచూపులని చూసి, ఏ క్షణంలో తన పైకి దూకుతాడోనని భయపడుతోంది ప్రియ.

"భయపడకమ్మా! వాడి వల్ల ఎవరికీ అపకారం జరగదు. పైగా బయట వాళ్ళని చూస్తే వాడే భయపడతాడు. కాకపోతే వాడి చూపుల వల్ల కొత్త వాళ్లకు భయం కలుగుతుంది. మా అబ్బాయికి ఇంట్లో నేనే చదువు నేర్పించాను. ఓపెన్ యూనివర్సిటీ లో డిగ్రీ కట్టిస్తున్నాను" అని చెప్పి, "యశ్వంత్! బయట ఆడుకోమన్నానుగా!" అంటూ చిన్నగా కసిరింది సువర్చల.

"అమ్మా! నువ్వు నన్ను తిట్టావు." అంటూ ఏడుస్తూ బయటకు వెళ్ళాడు అతను.

"ఇక ధైర్యంగా వుండు ప్రియా! వాడింక లోపలకి రాడులే" అని ప్రియతో చెప్పి, " అసలు విషయానికి వద్దాము సుజాతా! నువ్వు వచ్చిన విషయం చెప్పు" అంది సువర్చల.

"నిన్ననే మెడికల్ ఎంట్రన్స్ ఫలితాలు వచ్చాయిగా! దాంట్లో ప్రియకి మంచి ర్యాంకు రాలేదు. అప్పట్నుంచి ఒకటే ఏడుపు. ఎంత సముదాయించినా ఏడుపు ఆపలేదు. తన గదిలోకి వెళ్లి ఫ్యాన్ కి ఉరి వేసుకుంది. సమయానికి నేను చూడడంతో కాపాడుకున్నాం. వెంటనే వీళ్ళ డాడీ కి ఫోన్ చేసి ఆఫీస్ నుంచి పిలిపించాను. ఇద్దరం నిన్న రాత్రంతా తనని ఓదార్చాం. కుదుటపడ్డట్లే అనిపించింది. '

ఎందుకైనా మంచిది, ఎవరైనా మానసిక వైద్యుల దగ్గర కౌన్సిలింగ్ ఇప్పిద్దామ'న్నారు ఆయన.

'ఆ క్షణంలో తొందర పడ్డ మాట నిజమే. అంతమాత్రాన నన్ను పిచ్చిదానిలా జమ కట్టొద్దు. నేను డాక్టర్ దగ్గరకు రాను' అంటూ మొండికేసింది ప్రియ.

'అలాగయితే నా స్నేహితురాలు సువర్చల దగ్గరకు తీసుకొని వెళ్తాను. మన ఇంటికి ఎన్నోసార్లు వచ్చింది. నువ్వు కూడా చూసే ఉంటావు. ఆవిడ నీకు కౌన్సిలింగ్ ఇస్తుంది' అన్నాను నేను.

అయిష్టంగానే ఒప్పుకొంది ప్రియ. వచ్చే దారంతా వెనక్కి వెళ్ళిపోదామని ఒకటే గొడవ. నీతో కాస్సేపు మాట్లాడితే తనలో మార్పు వస్తుందని నాకు అనిపిస్తోంది" అంటూ తను వచ్చిన విషయాన్ని వివరించింది సుజాత.

సువర్చల ఆంటీ తనని బాగా కోప్పడుతుంది అని అనుకుంది ప్రియ.

కానీ "అయ్యో పాపం! ప్రియ చాలా బాధపడి ఆ డెసిషన్ తీసుకొని ఉంటుంది" అంటూ ప్రియ తల నిమిరింది సువర్చల.

"అందుకే నీ దగ్గరకు తీసుకుని వచ్చాను. జీవితాన్ని కాచి వడబోసిన దానివి నువ్వు. నీతో మాట్లాడితే తన మనసు కాస్త కుదుట పడుతుందని నాకు అనిపిస్తోంది. మీరు మాట్లాడుతూ ఉండండి. మా బంధువులు ఈ వీధిలోనే ఉంటున్నారు. ఒకసారి వాళ్ళను కలిసి వస్తాను." అని చెప్పి బయటకు నడిచింది సుజాత.

సువర్చల గేట్ వరకు వెళ్లి, తాళం తీసి సుజాతను పంపించి, తిరిగి తాళం వేసి లోపలకి వచ్చింది. "అమ్మా! నేను లోపలికి రావచ్చా" అడిగాడు యశ్వంత్.

"వద్దు బాబూ! ఇంకాసేపు ఆడుకో" అంది సువర్చల.

"ఆంటీ! ఇక మీరు కౌన్సిలింగ్ ఇవ్వండి. మీరు ఏం చెప్పినా వింటాను. మీకు చాలా ఓపిక ఉంది." అంది ప్రియ.

"నీకు చెప్పేదేముంది ప్రియా! ఏదో ర్యాంక్ రాలేదని తొందర పడ్డావు. పొరపాటు తెలుసుకున్నావు. ఇక నేను కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏదో మీ అమ్మ తృప్తి కోసం సరేనన్నాను. నేను చేయగలిగిందల్లా నా స్టోరీ నీకు చెప్పడమే!" అంది సువర్చల.

"చెప్పండి ఆంటీ! నాకు మీ గురించి తెలుసుకోవాలని ఉంది" అంది ప్రియ.

చెప్పడం ప్రారంభించింది సువర్చల.

"నేను యశ్వంత్ డెలివరీ టైంలో హాస్పిటల్లో ఉన్నాను. అప్పటికే నాకు రెండేళ్ళ పాప ఉంది. ఆఫీస్ నుండి నన్ను చూడడానికి వస్తున్న ఆయనకు యాక్సిడెంట్ జరిగి సరిగ్గా హాస్పిటల్ ముందే చనిపోయారు. విషయం తెలిసిన నేను బెడ్ మీద నుండి లేచి, బయటకు పరిగెత్తుకొని రావడంలో క్రింద పడిపోయాను. స్పృహ పోయింది. కళ్ళు తెరిచేటప్పటికి డెలివరీ అయిపోయింది. నేను క్రింద పడ్డప్పుడు తగిలిన దెబ్బవల్ల యశ్వంత్ కు మెదడు దెబ్బ తినింది. పుట్టడంతోనే మానసిక వైకల్యం ఏర్పడింది. ఆయన పోవడమే ఒక పెద్ద లోటు అయితే వీడు ఇలా పుట్టడంతో నా పరిస్థితి అగమ్యగోచరంగా అయింది. కర్మకాండలు పూర్తి అయ్యాక అత్తమామలు, ఆయన తరపు బంధువులు కాసిని సానుభూతి మాటలు చెప్పి మెల్లగా జారుకున్నారు.

అమ్మానాన్నలు ఓ వారం రోజులు నాతోనే ఉన్నారు. తరువాత ఒకరొజు నాన్న నన్ను పిలిచి, "సువర్చలా! నువ్వు కూతుర్ని తీసుకుని నా దగ్గరకు వచ్చెయ్యి. పిల్లవాడిని మానసిక వికలాంగుల ఆశ్రమం లో చేర్చుదాం. నువ్వు తిరిగి ఉద్యోగానికి వెళ్ళవచ్చు" అన్నాడు.

"లేదు నాన్నా! వాడిని ఇంట్లోనే ఉంచుకుంటాను. నా కంటికి రెప్పలా కాపాడుకుంటాను." అన్నాను. "అలా అయితే ఇక్కడే ఉండమ్మా. నీకు పెళ్లి కావాల్సిన ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. ఇంట్లో ఇలాంటి పిల్లవాడు ఉంటే వాళ్లకు సంబంధాలు రావు" మొహమాటం లేకుండా చెప్పాడు మా నాన్న.

"నిజమే నాన్నా! నీ భయం నీది. అందుకే నేను ఇక్కడే ఉంటాను" అని చెప్పాను.

పిల్లల్ని చూసుకోవడానికి ఒక ఆయాను పెట్టుకున్నాను. నా పాప శృతిని కాన్వెంట్ లో చేర్చాను. యశ్వంత్ ను ఎక్కడా చేర్చుకోలేదు. ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాక నేనే వాడికి చదువు చెప్పేదాన్ని.

శృతి ఇంటర్ చదివే టప్పుడు ఒక వెధవ లవ్ చేస్తున్నానంటూ వెంటపడేవాడు. శృతి ప్రిన్సిపాల్ కు కంప్లైంట్ చేయడంతో వాడిని కాలేజీ నుండి సస్పెండ్ చేశారు. వాడు కక్షగట్టి శృతి మీద యాసిడ్ దాడి చేశాడు. మొహం పూర్తిగా కాలిపోయింది. దాదాపు నెల రోజులు హాస్పిటల్లో మృత్యువుతో పోరాడి చివరికి ప్రాణాలు విడిచింది. మరణించే రోజు కూడా నాతో "అమ్మా! నాకు బతకాలని ఉంది" అంది. పాపం తన కోరిక తీరలేదు. ఇది జరిగి ఐదేళ్లు అయింది. చెప్పడం పూర్తి చేసింది సువర్చల.

వింటున్న ప్రియకు కళ్ళల్లో నీళ్ళు ఆగడం లేదు. "ఆంటీ! ఎన్ని కష్టాలు పడ్డారు మీరు! ఎలా తట్టుకోగలిగారు?ఎప్పుడూ చనిపోవాలని అనిపించలేదా?" ప్రశ్నించింది ప్రియ.

" నా జీవితంలో జరిగిన సంఘటనలను రెండు రకాలుగా విశ్లేషించుకున్నాను. ఒకవేళ పూర్వజన్మ ప్రారబ్దం వల్ల ఇలా జరిగి ఉంటే ఆ ఫలితాన్ని ఈ జన్మలోనే అనుభవించి పూర్తి చేసుకుంటాను. అంతేకానీ ఆత్మహత్య చేసుకొని మరో జన్మకు ఈ కష్టాలను వాయిదా వేసుకోను.

అలాకాకుండా యాదృచ్ఛికంగా జరిగే సంఘటనల్లో నా జీవితంలో చెడు సంఘటనలే ఎక్కువగా జరిగాయనుకుంటే వాటిని ఎదిరిస్తాను. సమస్యలతో పోరాడడంలోనే ఆనందం వెతుక్కుంటాను. అంతేకానీ ఓడిపోయి పారిపోను" ఆత్మవిశ్వాసంతో చెప్పింది సువర్చల.

"ఆంటీ! మీ ధైర్యానికి నా జోహార్లు. జీవితంలో మీరు పడ్డ కష్టాలు, వాటిని మీరు ఎదుర్కొన్న తీరుతో పోలిస్తే మీ ముందు నేను ఒక అణువును అనిపిస్తోంది. మీ జీవితమంతా ఒక పోరాటమే. నిజం చెప్పాలంటే ఒంటరి పోరాటం. మిమ్మల్ని ఓదార్చే వాళ్ళు లేరు. తోడుగా నిలిచిన వాళ్ళుకూడా లేరు. విన్న వాళ్ళకే కన్నీళ్లు తెప్పించే కష్టాలు స్వయంగా అనుభవించి భరించారు. ఒక స్త్రీ ఇలా విధికి ఎదురు నిలవడం ఎంతో అభినందించాల్సిన విషయం. మీ దగ్గరకు రాకుంటే నేను చాలా మిస్ అయ్యేదాన్ని.

ఇక నాకు వేరే కౌన్సిలింగ్ అవసరం లేదు. మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకోని జీవితంలో ముందుకు సాగుతాను" దృఢ నిశ్చయంతో చెప్పింది ప్రియ.

ఇంతలో యశ్వంత్ ఇంట్లోకి వచ్చి "అమ్మా! ఆంటీ ఎక్కడికీ వెళ్ళలేదు. గేటు బయటే చెట్టు నీడలో నిలుచుని వుంది" అని చెప్పాడు.

ఈసారి అతన్ని చూసి భయపడలేదు ప్రియ.

"యశ్వంత్! ఈ సారి మనమిద్దరం వెళ్లి గేటు తీద్దాం. సరేనా?" అంది అతనితో.

ఆమ్మ వంక అనుమతికోసం చూసాడు అతను.

సరేనన్నట్లు సువర్చల తల ఊపడంతో సంతోషంతో ఎగురుకుంటూ ప్రియతో పాటు గేటు దగ్గరికి వెళ్ళాడు యశ్వంత్.

గేటు తాళం కూడా తనే తీసి , సుజాత లోపలి రాగానే తిరిగి తాళం వేసాడు.

తల్లిని చూడగానే ప్రియ ఏడుపు ఆపుకోలేక పోయింది.

ఆమె భుజంపైన వాలిపోయి వెక్కివెక్కి ఏడుస్తోంది.

ఓదార్పుగా కూతురి తల నిమిరింది సుజాత.

"అమ్మా! నువ్వు అక్కడే ఉంటే నేను ఫ్రీగా మాట్లాడలేనని బయట నిలుచుని వున్నావు. నీ గురించీ, నాన్న గురించీ ఏమాత్రం ఆలోచించకుండా నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. ఎంత పొరపాటు చేశానమ్మా! సువర్చల ఆంటీతో మాట్లాడాక నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది.

ఇంకెప్పుడు ఇలాంటి పొరపాట్లు చెయ్యను" అంటూ తల్లికి ప్రామిస్ చేసింది ప్రియ.

"సరే! లోపలికి పద. ఆంటీకి చెప్పి, మన ఇంటికి వెళదాం. మీ నాన్నగారు ఆఫీసుకు లీవ్ పెట్టి నీకోసం ఇంటి దగ్గర ఎదురు చూస్తున్నారు" అంది సుజాత.

ఇద్దరూ ఇంట్లోకి వెళ్లి సువర్చలకు కృతజ్ఞతలు చెప్పి, యశ్వంత్ కు బై చెప్పి బయటకు నడిచారు.

***శుభం***

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.



రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 15 కథలు కౌముది, గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).




143 views2 comments

2 Comments


Good story

Like

Pravallika Pushpa
Pravallika Pushpa
Apr 25, 2021

Nice story

Like
bottom of page