top of page
Writer's pictureLV Jaya

అత్తగారే గొప్ప   

#అత్తగారికథలు #అత్తాకోడళ్ళకథలు, #LVJaya, #LVజయ, #అత్తగారేగొప్ప, #AtthagareGoppa


'Atthagare Goppa' - New Telugu Story Written By L. V. Jaya

Published in manatelugukathalu.com on 22/10/2024 

'అత్తగారే గొప్పతెలుగు కథ (అత్తగారి కథలు - పార్ట్ 8)

రచన: L. V. జయ

కథా పఠనం: పద్మావతి కొమరగిరి



సమర్థ్ కి, జాగృతి ల పెళ్ళై వారం రోజులు అయ్యింది. పెళ్ళికి వచ్చిన చుట్టాలు, దగ్గరవాళ్ళు అందరూ వెళ్లిపోయారు. సమర్థ్ కి, జాగృతికి పెళ్ళికని తీసుకున్న సెలవులు అయిపోయాయి. సమర్థ్, వాళ్ళ అమ్మ రాధని కూడా తమతో పాటు రమ్మన్నాడు. కానీ రాధ అందుకు ఒప్పుకోలేదు. 


"నువ్వు వెళ్ళు. కోడలిని నాతో కొన్ని రోజులు ఉండనీ. మన పద్ధతులు, ఇంటి పనులు నేర్చుకున్నాక వస్తుంది. " అని చెప్పింది రాధ. సమర్థ్ కూడా వెళ్ళిపోయాక, ఇక ఇంట్లో మిగిలింది, కొత్తకోడలైన జాగృతి, కొత్తగా అత్తగారైన రాధ. 


జాగృతి, రాధ అప్పటివరకూ మాట్లాడుకోలేదు. మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా రాలేదు. పెళ్ళిచూపుల్లో కూడా రాధ, జాగృతిని ఏమీ అడగలేదు. అందువల్ల, ఒకళ్ళ గురించి ఒకళ్ళకి పెద్దగా తెలియదు. 


రాధ పెద్దగా చదువుకోలేదు. చిన్నప్పుడే పెళ్ళి అయ్యిపోయింది. ఇంటిపనులు, వంటపనులు చేసుకోవడం, పనులన్నీ అయ్యాక, టీవీ సీరియల్స్, సినిమాలు చూస్తూ రోజు గడపడం రాధకి అలవాటు. 


జాగృతికి చదువంటే చాలా ఇష్టం. కష్టపడి చదివి, మంచి ర్యాంకులు తెచ్చుకుని, చదువుల సరస్వతి అని పేరు తెచ్చుకుంది. చదువు అవ్వగానే, ఉద్యోగంలో చేరి, అందులో కూడా ప్రమోషన్లు, అవార్డులు పొంది, మంచిపేరు సంపాదించుకుంది. ఆఫీస్ పనుల్లో తనమునకలై, క్షణం కూడా తీరికలేకుండా గడుస్తుంది జాగృతి రోజు. 


రోజు గడిపే విధానంలోనే కాదు, అత్తాకోడళ్ళకి మనస్తత్వాల్లోనూ, అభిరుచుల్లోనూ కూడా చాలా తేడా ఉందన్న విషయం వారిద్దరికీ తెలియదు. 

 

వంట పనుల్లో, ఇంటి పనుల్లో రాధకి సాయంచేద్దామనుకుంది జాగృతి. జాగృతిని ఏ పని చెయ్యనివ్వలేదు రాధ. పనులన్నీ అయ్యాక, ఎప్పటిలాగే, టీవీ సీరియల్ పెట్టుకుని చూసింది. 


రాధతో మాట్లాడడానికి జాగృతి ప్రయత్నించినా, రాధ మాట్లాడలేదు. 'ఇంటి పనులు, పద్ధతులు నేర్పిస్తానని చెప్పి, పనులు చెయ్యనివ్వకుండా, మాట్లాడకుండా ఉంటే ఎలా? ఈవిడ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు?' అనుకుంది జాగృతి. 


టీవీ సీరియల్ చూస్తున్న రాధ కూడా జాగృతి గురించే ఆలోచిస్తోంది. 'చదువుకున్న పిల్ల. తెలివైనది అని సమర్థ్ చెప్పాడు. సమర్థ్ ని పూర్తిగా లొంగదీసుకుంటుందా ఈ పిల్ల? సమర్థ్ ఇక నన్ను పట్టించుకోడా? నా స్థానాన్ని, అధికారాన్ని కూడా తీసుకుంటుందా?' లాంటి అనుమానాలున్నాయి రాధకి. 


'తన స్థానాన్ని, అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే ఏం చెయ్యాలి?' అని ఆలోచించింది రాధ. తను చూసే సీరియల్ లోని అత్తగారిలా, కోడలిని అన్నింటిలోనూ తక్కువచేసి చూస్తే, జాగృతి నేనంటే భయపడుతుంది. నా స్థానం, నా అధికారం ఎప్పటికీ తననుండి పోవు అనుకుంది రాధ. ఆలోచన వచ్చిందే తడవుగా, అమలుపరచాలని నిర్ణయించుకుంది. 


"నువ్వు ఏ సీరియల్స్ చూస్తావ్?" అని జాగృతిని అడిగింది రాధ. రాధ తనతో మాట్లాడినందుకు ఆనందపడింది జాగృతి. 


తనతోపాటు, సీరియల్ చూడమని రాధ అడిగిందనుకుంది. "నాకు టీవీ సీరియల్స్ చూసే అలవాటు లేదు అత్తయ్యగారు. మీరు చూడండి. " అంది జాగృతి. 


"అయితే సమాజంలో ఏం జరుగుతోందో నీకు తెలియదన్నమాట. " అంది రాధ. 


"దానికోసం, న్యూస్ చూస్తానండి. " అంది జాగృతి. 


జాగృతి చెప్పిన సమాధానం నచ్చలేదు రాధకి. "నీకు ఫ్యాషన్ గురించి కూడా తెలిసుండదు అయితే. ఈ సీరియల్ లో, అత్తగారు ఎలాంటి చీరలు కట్టుకుంటుందో, నేనూ అలాంటివే కొనుకుంటాను. " గొప్పగా చెప్పింది రాధ. 


"నేను ఫ్యాషన్ ని ఫాలో అవ్వనండి. నాకు నచ్చింది వేసుకుంటాను. చూసిన వాళ్లందరూ బాగున్నాయి అంటారు." అంది జాగృతి. 


ఈ సమాధానం కూడా నచ్చలేదు రాధకి. "నిన్ను చూస్తేనే తెలుస్తోందిలే. నీకు ఫ్యాషన్ అంటే తెలియదని. నీవి బాగున్నాయని అన్నవాళ్ళు ఎలాంటివాళ్ళో మరి?" అంది మూతి తిప్పుకుంటూ. 


'ఈవిడ మాటతీరే ఇంతా? లేక, నాతోనే ఇలా మాట్లాడుతున్నారా?' అనుకుంది జాగృతి. 


"వంట వచ్చా?" అడిగింది రాధ. 


"వచ్చండి. మేనేజ్ చేసుకుంటాను. " అంది జాగృతి. 


"మేనేజ్ చేసుకోవడేమిటి? నాకైతే చిన్నప్పటినుండే వంటచెయ్యడం వచ్చు. నా చేత్తో చేసింది, మా వాడు లొట్టలేసుకుని తింటాడు. అసలు వాడికి బయటతినే అలవాటే లేదు. నువ్వు ఇలా అయితే, నా కొడుకుకి ఏం పెడతావ్? రోజూ పస్తులుంటాడేమో వాడు నీవల్ల. " అంది రాధ కోపంగా. 


"చేస్తుంటే, అదే వచ్చేస్తుంది లెండి. " అంది జాగృతి. 


'ఏమిటో ఈ పిల్ల' అని మనసులో అనుకుని, "ముగ్గులు వెయ్యడం వచ్చా?" అని జాగృతిని అడిగింది రాధ. 


"చిన్న చిన్న ముగ్గులు వెయ్యడం వచ్చండి. " అంది జాగృతి. 


"అన్నిటికి ఇలా సమాధానం చెప్తావేంటి? నేను ఇంటి ముందు వేసే ముగ్గు గురించి, వీధివీధంతా మాట్లాడుకుంటారు. ముగ్గులు వెయ్యడమంటే అదీ. ఏమిటో? కనీసం కుట్లు, అల్లికలూ వచ్చా నీకు?" అడిగింది రాధ. 


"రావండి. నేర్చుకునే అవకాశం రాలేదు. " అంది జాగృతి. 


'పెళ్ళిచూపుల్లో ఒక్క మాట కూడా మాట్లాడని ఈవిడ, ఇప్పుడేంటి ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారు?' అనుకుంది. 


"ఏ పనీ రాని నీలాంటిది దొరికిందేమిటి నాకు? నా ఖర్మ. " అంది రాధ చిరాకుగా. 


"చిన్నప్పుడంతా, పూర్తిగా చదువులో మునిగిపోయేదాన్ని. ఇవన్నీ నేర్చుకునే అవకాశం రాలేదు. " అంది జాగృతి, వివరణ ఇస్తున్నట్టుగా. 


"నీ చదువుని, నీ సర్టిఫికెట్స్ ని నేనేం చేసుకోను? వాటితో నాలుక గీసుకోనా?" అంది రాధ కోపంతో ఊగిపోతూ. 



'ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారు? ఇంజనీరింగ్ చదివిన అమ్మాయి కావాలని చెప్పి, పెళ్ళి అయ్యాక ఇలా మాట్లాడ తారేమిటి? నా సర్టిఫికెట్స్ తో నాలుక గీసుకుంటారా?' జాగృతికి, రాధ మీద కోపం పెరిగిపోతోంది. 


"నేనైతే, వంట, కుట్లు, అల్లికలూ, మొగ్గలు అన్నీ ఇష్టంకొద్దీ నేర్చుకున్నాను. మీ మావగారి జీతం ఇంటి అవసరాలకి సరిపోకపోతే, స్వేట్టర్లు కుట్టి, అవి అమ్మి, సంపాదించి ఇచ్చేదాన్ని. ఎంత కష్టపడేదాన్నో. బతుకుతెరువుకోసం నీకేంవచ్చు ఇలాంటి పనులు?" అంది రాధ వ్యగ్యంగా. 


రాధ, తనని తక్కువచెయ్యటానికే ఇలా మాట్లాడుతోందన్న విషయం అర్ధమయ్యి, అసహనం పెరిగిపోయింది జాగృతికి. "నేను కష్టపడుతున్నానండి. ఉద్యోగం చేసి, సంపాదిస్తున్నాను. ఇంకేం చెయ్యాలి బతుకుతెరువుకోసం?" అని అడిగింది జాగృతి. 


"నాకావాల్సింది కోడలు. నీలో కోడలి లక్షణాలు ఒక్కటికూడా కనపడటం లేదు నాకు. ఏదో మావాడికి నచ్చావని పెళ్ళిచేసాను. నీకు, నాకు సరిపోదు. నాకు తగ్గట్టుగా మారి, నాకు లొంగివుంటే సరే. లేకపోతే. " అంటూ జాగృతికి వేలుచూపిస్తూ బెదిరించింది రాధ. 


"అవును. మీకు, నాకు అస్సలు సరిపోదు. " అని అక్కడనుండి లేచి వెళ్ళిపోయింది జాగృతి. 


'సమర్థ్ కి ఇష్టమైన అమ్మాయిని ఇచ్చి పెళ్ళిచేసారు. కానీ, చదువుకుని, ఉద్యోగం చేస్తున్న కోడలు అక్కరలేదు ఈవిడకి. ఈవిడతో పాటు, ఇంట్లోనే ఉంటూ, టీవీ సీరియల్స్ చూసే కోడలు కావాలి. ఈవిడతో ఉంటే, నేను ఎలా బతకాలనుకుంటున్నానో, అలా బతకలేను. నన్ను, ఈవిడలా పూర్తిగా మార్చేసినా మార్చెయ్యగలరు. ' అనుకుంది మనసులో. మర్నాడే, అక్కడనుండి బయలుదేరి వెళ్ళిపోయింది. 


జాగృతిని చూసి, ఆశ్చర్యపోయాడు సమర్థ్. "ఏమయ్యింది? అప్పుడే వచ్చేసావ్? కొన్నాళ్ళుండి పనులు, పద్ధతులు నేర్చుకోమని చెప్పింది కదా మా అమ్మా. " అని అడిగాడు సమర్థ్. 


"పనులు, పద్ధతులు అన్నీ నేర్చుకున్నాను. నేర్చుకున్నది చాలనిపించింది. " అంది జాగృతి. 


"ఒక్కరోజులోనా? ఇంతకీ ఏం నేర్చుకున్నావు ఒక్కరోజులో?" అని అడిగాడు సమర్థ్ కుతూహలంగా. 


"మీ అమ్మగారు చాలా గొప్పవాళ్ళని. మీ అమ్మగారంత గొప్పదాన్ని నేనుకానని అర్ధం అయ్యింది. ఇంకొన్నాళ్ళు ఆవిడతో ఉంటే, నేను కూడా ఆవిడ అంత గొప్పగా అయిపోతానేమో అని భయం వేసింది. అందుకే వచ్చేసాను." అంది జాగృతి. 


జాగృతి ఏదో దాస్తున్నట్టు, వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటున్నట్టు అనిపించింది సమర్థ్ కి. "అసలేంమయ్యింది. సరిగ్గా చెప్పు. " అని అడిగాడు సమర్థ్ జాగృతిని. 


"కోడలు అంటే ఎలా ఉండాలో చక్కగా చెప్పారు మీ అమ్మగారు. కుట్లు, అల్లికలూ చేసుకుంటూ, ముగ్గులు వేసుకుంటూ, టీవీ సీరియల్స్ చూసుకుంటూ హాయిగా ఎలా బతకాలో చెప్పారు. " అంది జాగృతికి. 


"ఓకే. అయితే?" అన్నాడు సమర్థ్. 


"అవన్నీ చేసుకుంటూ, హాయిగా బతకచ్చని తెలియక, చిన్నప్పటినుండి కష్టపడి చదివి, నా టైమంతా వేస్ట్ చేసుకున్నానని చాలా బాగా అర్ధమయ్యేలా చెప్పారు మీ అమ్మగారు. " అంది జాగృతి. 


సమర్థ్ కి విషయం అర్ధం అయ్యింది. 'అమ్మ, నాకు నచ్చిన అమ్మాయినిచ్చి పెళ్ళిచేసింది కానీ, జాగృతి తన పద్ధతిలో లేదని, తనకి నచ్చలేదన్న విషయాన్నీ మొదటిరోజే చెప్పిందన్నమాట' అనుకున్నాడు. 


జాగృతిని దగ్గరకి తీసుకుని, "జాగృతి, నాకు నీలాంటి మంచి అమ్మాయి, చదువుకున్న, తెలివైన అమ్మాయే కావాలనుకున్నాను. నువ్వు నీలానే ఉండు. మా అమ్మంత గొప్పదానివి నువ్వు అవ్వక్కరలేదులే. " అన్నాడు సమర్థ్ నవ్వుతూ. 


'భిన్న మనస్తత్వాలు, అభిరుచులు ఉన్న అత్తాకోడళ్లు ఒకచోట చేరారు. ఈ అత్తాకోడళ్ళని వీలైనంత దూరంగా ఉంచితేనే మంచిది. ' అని నిర్ణయించుకున్నాడు సమర్థ్. 

***


L. V. జయ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : LV జయ

నా పేరు LV జయ. 
https://www.manatelugukathalu.com/profile/jaya

నాకు చిన్నప్పటి నుండి తెలుగు కథలు, పద్యాలూ, సాహిత్యం, సంగీతం అంటే చాలా ఇష్టం. 
ఏ విషయాన్ని అయినా సరదాగా తీసుకునే అలవాటు. అదే నా కథల రూపంలో చూపించాలని చిన్న ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను.

ధన్యవాదాలు



92 views0 comments

Comments


bottom of page