అత్తగారి కథలు - పార్ట్ 6
'Atthagaru - Allergy' - New Telugu Story Written By L. V. Jaya
Published in manatelugukathalu.com on 16/09/2024
'అత్తగారు - ఎలర్జీ' తెలుగు కథ (అత్తగారి కథలు - పార్ట్ 6)
రచన: L. V. జయ
కథా పఠనం: పద్మావతి కొమరగిరి
సమర్థ్, జాగృతి ల పెళ్లి ఇంకో వారంలో ఉందనగా, ఇద్దరూ ఉద్యోగాలకి సెలవు తీసుకుని, ఎవరి ఊళ్ళకి వాళ్ళు బయలుదేరారు.
జాగృతి ట్రైన్ లో ఎక్కి కూర్చోగానే, తన పక్కనే వచ్చి కూర్చున్న సమర్థ్ ని చూసి ఆశ్చర్యపోయింది. "ఈ ఊళ్ళో, ఈ ట్రైన్ లో ఉన్నారేంటి? మీరు ఎక్కాల్సిన ట్రైన్ మిస్ అయ్యారా?" అని సమర్థ్ ని అడిగింది.
"నేను ఎక్కాల్సిన ట్రైనే ఎక్కి, నిన్ను సర్ప్రైజ్ ఇద్దామని, ఈ ఊళ్ళో దిగి, ఈ ట్రైన్ ఎక్కాను. ట్రైను మిస్ అవ్వలేదు. పెళ్ళికి ముందు నీతో కలిసి ప్రయాణం చేసే ఛాన్స్ మిస్ కూడా అవ్వలేదు. మనం జీవితంలో కలిసి చేసే ప్రయాణం ఇప్పుడే మొదలు అయ్యింది. " అన్నాడు సమర్థ్ నవ్వుతూ.
సరదాగా నవ్వులతో, కబుర్లతో సాగింది ఇద్దరి ప్రయాణం. సమర్థ్, తను దిగాల్సిన ఊరు రాగానే జాగృతి ని కూడా తనతో పాటు దిగి, తన ఊరు, ఇల్లు చూడమని అడిగాడు. జాగృతి వద్దని చెప్తున్నా వినకుండా, జాగృతి బ్యాగ్ తీసుకుని ట్రైన్ దిగాడు. సమర్థ్ తో పాటు వాళ్ళ ఇంటికి వెళ్లకతప్పలేదు జాగృతి కి.
కొడుకు వస్తాడని, గుమ్మం దగ్గరే నించుని ఎదురుచూస్తున్న సమర్థ్ వాళ్ళ అమ్మ రాధ, కొడుకుతో పాటు వచ్చిన కాబోయే కోడలిని చూసి కోపంగా, "ఈ పిల్ల ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చింది?" అని సమర్థ్ ని అడిగింది.
"వస్తే ఏం? తను నాకు కాబోయే భార్యేగా. " అన్నాడు సమర్థ్.
"నీకు కాబోయే పెళ్ళామే, అయిపోయిన పెళ్ళాం కాదు. పంపించెయ్యి" అంది రాధ చిరాకుగా.
"ఇప్పుడే వచ్చింది కదమ్మా. కాసేపు ఉండి, మన ఊరు చూసి వెళ్తుంది. " అన్నాడు సమర్థ్, రాధని బతిమాలుకుంటూ.
"చెట్టాపట్టాలేసుకుని, పాటలు పాడుకుంటూ పొలాలగట్ల మీద తిరుగుదాం అనుకుంటున్నారేమో? అలాంటివేమీ కుదరవు నా దగ్గర. " అంది రాధ. రాధ మాటలకి, మొహం మాడ్చుకున్నాడు సమర్థ్. ఉండాలో, వెళ్ళిపోవాలో తెలియక, గుమ్మం బయటే నిలబడిపోయింది జాగృతి.
కాబోయే అత్తగారి ఇంటికి మొదటిసారి వచ్చింది. వస్తూనే, ఇలా జరుగుతుంది అనుకోలేదు. కాసేపు ఎవరూ మాట్లాడకపోయేటప్పటికీ, అక్కడ ఉండడం ఇక మంచిదికాదని, వెళ్లిపోవాలని నిర్ణయించుకుని, "సారీ అండి. నేను ఇక్కడికి రాకుండా ఉండాల్సింది. తప్పు చేశాను.
ఇంక బయలుదేరుతాను. " అని బ్యాగ్ పట్టుకుని, వెళ్ళడానికి బయలుదేరింది జాగృతి.
జాగృతి మాటలకి, కాస్త కరిగింది రాధ. "సర్లే. ఎలాగూ వచ్చింది కదా. ఏం చేస్తాం. లోపలకి రమ్మను. " అంది సమర్థ్ తో.
జాగృతి లోపలకి వచ్చాక, "ఏ షోకులు లేని ఇలాంటిపిల్ల నీకెలా నచ్చిందిరా. పెళ్ళిచూపుల్లో కూడా ఏమీ తయారవ్వలేదు. ఈ రోజయినా సరిగ్గా తయారవ్వమను. " అంది రాధ సమర్థ్ తో.
'తనతో మాట్లాడకుండా, అన్నీ సమర్థ్ కే ఎందుకు చెప్తున్నారు ఈవిడ. నేను వస్తానని ఊహించి ఉండరుకదా. అందుకేనేమో నా మీద అంత కోపం. పోనిలే. ' అనుకుంది జాగృతి. ఇంతకీ సరిగ్గా తయారవ్వటం అంటే ఏమిటో అర్ధం కాక, తన పద్దతిలో తయారయ్యి, వచ్చింది.
చుడిదార్లో వచ్చిన జాగృతిని చూసి మళ్ళీ కోపం పెరిగిపోయింది రాధకి. "అత్తగారి ఇంట్లో చీరలు కట్టుకోవాలని తెలియదా ఈ పిల్లకి?" అంది గట్టిగా.
"నా దగ్గర చీరలు లేవండి ఇప్పుడు. " అంది జాగృతి.
"ఏం? కట్టుకునే అలవాటు కూడా లేదేమో?" అంది రాధ.
"సమర్థ్ నన్ను ఇక్కడికి తీసుకొస్తారని నాకు ముందు తెలియదు. అందుకని ఏమీ తెచ్చుకోలేదు. " అంది జాగృతి నెమ్మదిగా.
"ఏమిటిరా ఈ పిల్ల? అత్తగారింటికి వస్తూ, చీరలు తెచ్చుకోలేదు. మాటకి మాట సమాధానం చెప్తోంది నాకు. వచ్చినప్పటి నుండి చూస్తున్నా, ఒక్కసారి కూడా గౌరవంగా అత్తగారండీ అని పిలవలేదు. నిన్నేమో పేరు పెట్టి పిలుస్తోంది. సరిగ్గా తయారవ్వటం కూడా రాదు. ఎలా నచ్చిందిరా ఈ పిల్ల నీకు?" అంది రాధ సమర్థ్ తో.
"ఇంకా పెళ్లి కాలేదు కదమ్మా. పెళ్లి అయ్యాక, నిన్ను అత్తయ్యగారండీ అని పిలుస్తుందిలే. నన్ను ఎలా పిలిచినా నాకేమీ ప్రాబ్లెమ్ లేదు. " అన్నాడు సమర్థ్.
"బాగానే వెనకేసుకునివస్తున్నావ్. ఇప్పుడే, ఇలా ఉంది వ్యవహారం. ఇక పెళ్లి అయ్యాక, ఎంతలా మార్చేస్తుందో నా కొడుకుని. అంతా నా ఖర్మ. ఏం చేస్తాం. " అని, జాగృతిని గదిలోకి తీసుకెళ్ళి, తనకి నచ్చినట్టు జాగృతిని తయారుచేసింది రాధ. రాధ, తనని తయారుచేస్తున్న విధానం జాగృతి కి నచ్చకపోయినా, అప్పటికే రాధ కోపాన్ని చూసిన జాగృతి, ఏమీ అనలేకపోయింది.
గదిలోనుండి, బయటకి వచ్చిన జాగృతిని చూసిన సమర్థ్ కి నవ్వాగలేదు. పెద్దవాళ్ళు కట్టుకునే చీర, లూస్ బ్లౌజ్, తలనిండా నూనె, గట్టిగా వేసిన జడ, పెద్ద బొట్టు, కళ్ళకి మందంగా కాటుకతో గుర్తుపట్టలేనట్టుగా ఉంది జాగృతి. ఎప్పుడూ సింపుల్గా, డిగ్నిఫైడ్ గా ఉండే జాగృతిని చూసిన సమర్థ్, అమ్మ చేతిలో పూర్తిగా మారిపోయిన జాగృతి ని చూసి, 'పాపం జాగృతి' అనుకున్నాడు.
"ఈ ఇంటి కోడలు అంటే ఇలా ఉండాలి. ఇలా సరిగ్గా తయారవ్వాలి. " అంది రాధ. ' సరిగ్గా తయారవటం అంటే ఆవిడకి నచ్చినట్టు తయారవ్వటం అన్న విషయం అర్ధం అయ్యింది జాగృతి కి.
"ఇంకా ఏమైనా మర్చిపోయినా?" అనుకుని, ఎదో గుర్తువచ్చినట్టు, వంటిట్లోకి వెళ్ళి, ఫ్రిడ్జ్ లోంచి, నాలుగు మూరలు మల్లెపూలు, నాలుగు మూరలు కనకాంబరాలు, గులాబీ పువ్వులు జాగృతి తలలో పెట్టడానికి తెచ్చింది రాధ.
"వద్దండీ. నాకు ఫ్లవర్స్ అంటే ఎలర్జీ. " అని రాధని పువ్వులు పెట్టనివ్వకుండా ఆపింది జాగృతి.
"అంటే?" అడిగింది రాధ కోపంగా. 'ఆవిడని పువ్వులు పెట్టనివ్వకుండా ఆపినందుకు, మళ్ళీ కోపం పెరిగిపోయినట్టుంది. ' అనుకుంది జాగృతి.
"నాకు పువ్వుల వాసనకి తుమ్ములు వస్తాయి. ఇంకా ఎక్కువైతే, జ్వరం కూడా వస్తుంది. పెట్టకండి ప్లీజ్. " అని బతిమాలింది జాగృతి.
"పువ్వులు పడవా? ఇదేం జబ్బు? ఇలాంటివాళ్ళు కూడా వుంటారా? ఏమిటిరా ఇలాంటిది దొరికింది నాకు కోడలిగా?" అని తలపట్టుకు కూర్చుంది రాధ.
"వద్దంటోంది కదమ్మా. వదిలెయ్యి. పువ్వుల వాసనకి ఆగకుండా తుమ్ముటం నేను చూసాను. తనకి ఫ్లవర్స్ ఎలర్జీ ఉందని నాకు ముందే చెప్పింది. సరే. నాకేమి ప్రాబ్లెమ్ లేదు అన్నాను. " అన్నాడు సమర్థ్.
"నువ్వాగు. వెనకేసుకొని వచ్చింది చాలు. ఇలాంటి జబ్బులు గురించి కనివిని ఎరగను. పెళ్ళికి, శోభనానికి కూడా పువ్వులు పెట్టుకోని పిల్లతో ఏం సుఖపడతావురా నువ్వు?" అని సమర్థ్ తో అంటూ, జాగృతి జడలో 8 మురాల్ని కుక్కి పెట్టి, వాటి పైన గులాబీ పువ్వులు పెట్టింది రాధ.
"నేనూ చూస్తాను. ఏమవుతుందో? చదువు, ఉద్యోగం ఉన్నాయని పొగరు. ఏం చెప్పినా చెల్లుతుంది అనుకుంటోంది. పద్దతి, సంప్రదాయం అన్నది కొంచెం కూడా నేర్పినట్టులేరు వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఈవిడకి. ఆడపిల్లంటే, చక్కగా తయారయ్యి, ఇంటి పనులు చేసుకుంటూ, మొగుడిని, పిల్లల్ని చూసుకుంటే చాలు. ఆ పెళ్లి ఏదో అయ్యాక, ఉద్యోగం మానిపించి, ఇంట్లో కూర్చోబెడతాను. అప్పుడు పద్ధతులన్నీ అవే వస్తాయి. పెద్దవాళ్ళ దగ్గర ఎలా ఉండాలో, ఎలా మాట్లాడాలో తెలుస్తుంది. " అంది రాధ కోపంగా.
అంతవరకూ, రాధ ఏమంటున్నా, ఏమి చేస్తున్నా ఓర్పుగా సహించిన జాగృతి, ఇక తట్టుకోలేకపోయింది. వస్తున్న కోపాన్ని, బాధని దిగమింగుకుంటూ, "నేను ఇక బయలుదేరుతానండి. నాకోసం మా అమ్మ వెయిట్ చేస్తూ ఉంటారు. " అని చెప్పి, జడలో ఉన్న పువ్వుల్ని తీసి, పక్కనపెట్టి, తను ఎప్పుడూ ఉండే పద్ధతిలోకి మారి, సమర్థ్ ఇంటి నుండి బయటకి వచ్చింది.
"జాగృతిని దింపి వస్తాను" అన్న సమర్థ్ ని, అక్కరలేదని ఆపింది రాధ.
జాగృతి, తన ఊరికి వెళ్లే దారిలో, ఆలోచించుకుంది. 'సమర్థ్, పెళ్ళికి ముందే, వాళ్ళ ఇంటికి
నన్ను తీసుకెళ్ళి, మంచిపనే చేసారు. పెళ్లి తరువాత, నా జీవితం ఎలా ఉండబోతోందో చూపించారు వాళ్ళ అమ్మ. ఆవిడ మాటతీరు, కోపం, మొండితనం చూస్తే, భయం వేస్తోంది. పెళ్ళికిముందే ఇలా ఉంటే, పెళ్లి అయితే, ఇంకెలా ఉంటారో? ఆవిడకి నచ్చినట్టు, నన్ను మార్చేస్తారేమో. నాకు నేను నచ్చనంతలా తయారుచేస్తారేమో? నా మాటకి, నాకు ఏమీ విలువ ఉండదేమో? ఈ పెళ్ళి నాకు వద్దు. ఇంటికి వెళ్తూనే, అమ్మకి నాకు ఈ పెళ్ళి ఇష్టంలేదని చెప్పేస్తా. " అని నిర్ణయించుకుంది జాగృతి.
కూతురు వస్తుందని, ఎదురుచూస్తున్న లత, ఏడుపు మొహంతో వచ్చిన జాగృతిని చూసి, కంగారుగా, "ఏమయ్యింది అమ్మా? అలా ఉన్నావేం?" అని అడిగింది.
"అమ్మా, నాకు ఈ పెళ్లి వద్దు. నాకు ఇష్టం లేదని వాళ్ళకి చెప్పెయ్యండి. " అంది జాగృతి.
"పెళ్ళికి వారం ముందు, పెళ్లి వద్దంటే ఎలా? అసలేమయ్యింది చెప్పు. " అంది లత.
జరిగిదంతా లతకి చెప్పింది జాగృతి. అంతా విన్న లత కి, ఏం చెయ్యాలో అర్ధం కాలేదు. అప్పుడే, సమర్థ్ నుండి ఫోన్ వచ్చింది. "ఆంటీ. జాగృతి ఇంటికి చేరిందా? నా ఫోన్ ఎత్తడం లేదు. నాకు చాలా కంగారుగా ఉంది. అంతా ఒకే నా?" అని అడిగాడు సమర్థ్.
"వచ్చింది బాబు. మొహం మాడ్చుకుని ఉంది. ఈ పెళ్లి ఇష్టంలేదంటోంది. ఏం చెయ్యాలో అర్ధం కావటం లేదు నాకు. " అని చెప్పింది లత.
"ఎందుకు అలా అంటోందో తెలుసు నాకు ఆంటీ. మా అమ్మ పాతకాలం మనిషి. నేను మా అమ్మకి చెప్పుకుంటాను. పెళ్లి తరువాత జాగృతి కి ఏ ఇబ్బంది ఉండదు. నన్ను నమ్మండి. జాగృతితో మాట్లాడతాను. ఫోన్ ఇవ్వండి. " అన్నాడు సమర్థ్.
"మాట్లాడనంటోంది బాబు. " అంది లత.
"అయితే, తనకి ఎలాంటి ప్రాబ్లెమ్ రాకుండా నేను చూసుకుంటానని మీరే తనకి నచ్చచెప్పండి. ప్లీజ్. " అన్నాడు సమర్థ్.
లత, జాగృతిని బతిమాలుకుంటూ, "జాగృతి, ఆవిడ ఎలాంటివాళ్లయినా, అబ్బాయికి నువ్వంటే చాలా ఇష్టం అని తెలుస్తోంది కదా. ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటాను అని మాట ఇస్తున్నాడు. ఆలోచించు. ఇంతవరకూ వచ్చాక, నువ్వంటే ఇష్టమున్న అబ్బాయిని వదులుకోవడం మంచిదా? ఆలోచింది చూడు. " అని, జాగృతిని పెళ్ళికి ఒప్పించింది లత.
సమర్థ్, జాగృతిల పెళ్లి జరిగింది. పెళ్ళి తరువాత కూడా రాధ మాటతీరు, కోపాన్ని, మొండితనం అలాగే ఉన్నాయి. 'ఇన్నాళ్లూ పువ్వులకి దూరంగా ఉన్నట్టే, ఇకనుండి ఈవిడకి కూడా వీలైనంత దూరంగా ఉండడం మంచిది. ఇన్నాళ్లూ ఒక ఎలర్జీ తో బతికాను. ..ఇప్పుడు, ఇంకో ఎలర్జీ తో బతకాలన్నమాట. ' అనుకుంది జాగృతి.
***
L. V. జయ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం : LV జయ
నా పేరు LV జయ.
https://www.manatelugukathalu.com/profile/jaya
నాకు చిన్నప్పటి నుండి తెలుగు కథలు, పద్యాలూ, సాహిత్యం, సంగీతం అంటే చాలా ఇష్టం.
ఏ విషయాన్ని అయినా సరదాగా తీసుకునే అలవాటు. అదే నా కథల రూపంలో చూపించాలని చిన్న ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను.
ధన్యవాదాలు
Comments