కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link
'Avakaya Prasavam' New Telugu Story Written By Jidigunta Srinivasa Rao
రచన : జీడిగుంట శ్రీనివాసరావు
ప్రసవానికి ఎంత కష్టపడాలో ఆవకాయ పెట్టడానికి కూడా అంత కష్టపడాలి. మరి ఆ ఆవకాయ తయారీలో ఓ కిలో హాస్యాన్ని కూడా కలిపి ప్రముఖ రచయిత జీడిగుంట శ్రీనివాసరావు గారు రచించిన ఈ కథను చదవండి.
“ఏమండోయ్! తెల్లారితే చాలు.. ఆ ఫోన్ పట్టుకుని మేడమీదకి వెళ్ళిపోతారు. వీళ్ళ మీదా, వాళ్ళ మీదా మాట్లాడు కోవడమే గానీ, ఉపయోగపడే విషయం ఒక్కటి వుండదు మీ అన్నదమ్ములకి. ఒకసారి క్రిందకి దిగి బజార్ వెళ్ళి, మామిడికాయలు కొని, ఆవకాయ ముక్కలు కొట్టించుకుని రండి” అని అరుస్తోంది సుబ్బారావు భార్య రమణి.
"వదిన పిలుస్తున్నట్టు వుంది, వెళ్ళు. తరువాత మాట్లాడుకుందాం," అని అటునుంచి తమ్ముడు అనగానే, ఈ అరుపులు అన్నీ తమ్ముడు వినేసాడు అని అవమానం అనిపించింది.
ఊడిపోతున్న లుంగీని బిగించుకుంటో, క్రిందకి దిగి వస్తో, “ఎందుకు ఆలా అరుస్తావు? మానాన్నకి వున్న కోడళ్లలో నువ్వు శాంతస్వరూపం కలదానివి అనుకుంటున్నారు. ఈ రోజు నీ అరుపులు మా తమ్ముడు వినేశాడు. యిహ అందరికి చాటించేస్తాడు” అన్నాడు సుబ్బారావు.
“ఆ.. నేను కాబట్టి అరుస్తో చెబుతున్నాను. మీ తమ్ముడి భార్య అయితే అట్లకాడ కాలుస్తుంది” అంది రమణి.
“నీ మొహం లే, ఎందుకు పిలిచావు?” అన్నాడు సుబ్బారావు.
“యిప్పుడే గా చెప్పాను, ఆవకాయకి కాయలు కొట్టించుకుని, కారం, ఆవపిండి, నూనె తీసుకొని రావాలని! ఎండ ముదిరే లోపు వెళ్ళి రండి” అంది సంచీలు చేతికి యిస్తో..
“ఏమిటి.. లుంగీతోనే వెళ్ళమంటావా? యిలా వెళ్తే నేనే మామిడికాయలు కొట్టే వాడిని అనుకుని నా వెంట పడతారు. వుండు.. ప్యాంటు వేసుకుని వస్తా” అంటూ సంచీలు కుర్చీలో పడేసి, ప్యాంటు వేసుకుని వచ్చి కుర్చీలో కూలబడ్డాడు సుబ్బారావు.
వంటింటిలోనుంచి బయటకొస్తో కుర్చీలో కూర్చొని వున్న భర్తని చూసి, “అయ్యో రాత! మళ్ళీ కూర్చుండి పోయారే” అంది.
“ఏమీ లేదు. క్రితం సారి పెట్టిన ఆవకాయ జాడీ యిటు తీసుకొని రా. ఎంతవుందో చూస్తా” అన్నాడు సుబ్బారావు.
“ఎంత వుంటే మాత్రం కొత్తగా ఆవకాయ పెట్టుకోకపోతే విదేశాల్లో వున్న పిల్లలకి ఏమి పంపుతారు” అంది రమణి జాడీ తీసుకురాకుండా. సుబ్బారావు మెల్లిగా లేచి, వంట గదిలోకి వెళ్ళి, వాసిన కట్టిన జాడీ ని బయటకు బలంగా లాగి మూత విప్పి చూసి, “బాబోయ్! యింత ఆవకాయ వుంచుకుని, మళ్ళీ కొత్త ఆవకాయ పెట్టడానికి తయారు అయ్యావా?” అన్నాడు కోపంగా రమణి వంక చూస్తో.
“ఊరుకోండి. ఆ జాడీ ఎందుకు తీసారు? అసలే చేతులు కూడా కడుగుకోరు” అంటూ వచ్చేసి, జాడికి మళ్ళీ బట్ట కట్టేసింది.
“ముందు యిది చెప్పు. అసలు యింత ఆవకాయ వుంచుకుని ఎందుకు మళ్ళీ యిప్పుడు ఆవకాయ పెట్టడం? ఇందులోనే కొద్దిగా గుంటూరు కారం, నూనే, వేసి కలుపు. కొత్తగా పెట్టిన ఆవకాయలాగా వుంటుంది” అన్నాడు.
“ఈ ఆవకాయ పంపితే, మీ పిల్లలు యిట్టే కనిపెట్టేస్తారు. మీ బాధంతా డబ్బులు ఖర్చు అవుతాయి అనేగా.. నేను యిస్తాను. వెళ్లి అన్నీ తీసుకుని రండి” అంది.
“ఏమిటి.. నీ దగ్గర అంత డబ్బు వుంటే, వెధవ ఉల్లిపాయల బండి వాడికి కూడా నా పర్సు లో నుంచి తీసి యిస్తావు” అన్నాడు సుబ్బారావు.
“సరే కొద్దిగా కాఫీ కలిపి యివ్వు. తాగి వెళ్తాను” అన్నాడు చివరికి లొంగిపోయి.
కారులో కూర్చున్న మొగుడితో, “యిదిగో.. పాతిక కాయలు చాలు, రెండు కొసరు వేయమని అడగండి. యిరవై ఏడు అవుతాయి” అంటున్న రమణి ని చూసి నవ్వు కుంటూ కారు ముందుకు పోనిచ్చాడు.
మొత్తానికి రైతు బజార్ దగ్గరకి చేరుకుని, కారు ఒక పక్కన పార్క్ చేసి, ఈగల గుంపులా మూగి వున్న ఒక చోటకి చేరుకున్నాడు.
ఒక పది గంపలనిండా మామిడికాయలు పెట్టుకుని ఒక్కొక్కళ్ళకి ఒక్కొక రేట్ కి అమ్మేస్తున్నారు షాప్ లోని కుర్రాళ్ళు.
“బాబూ! ఆవకాయ కాయలు వున్నాయా?” అని ఆడిగాడు సుబ్బారావు.
“ అన్నీ ఆవకాయ కాయలేనండి, మీకు ఏ కాయ కావాలి?” అన్నాడు.
“వుండు బాబు! ఒకసారి యింట్లో వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కుంటా” అని, యింటికి ఫోన్ చేసి, ఇంతకీ ఏ కాయ తీసుకోవాలి అని ఆడిగాడు రమణి ని.
“మామిడికాయలు అండీ” అంది రమణి.
“అది తెలుసులే, యిక్కడ చాలా రకాలు వున్నాయి. ఏవి తీసుకోవాలి” అన్నాడు సుబ్బారావు.
“ఉండండుండండి.. కిందటి సారి తీసుకున్న కాయ ముక్కలు మెత్తబడ్డాయి. ఒకసారి మా చెల్లెల్ని అడుగుతా” అంటూ వేరే ఫోన్ నుంచి వాళ్ళ చెల్లెలికి ఫోన్ చేసి కాయలు గురించి అడగటం మానేసి, లోకాభిరామాయణమ్ మొదలుపెట్టారు.
‘ వీళ్ళ దుంపలు తెగ, నన్ను లైన్లో వుంచి ఈ పలకరింపులేమిటి’ అనుకుని, గట్టిగా అరిచాడు “ఏ కాయ కొనాలో ఆవకాయ కి అడగవే! వెధవ కబుర్లూ మీరూను” అన్నాడు.
ఆ అరుపు లకి పక్కనుంచి వెళ్తున్న ఆవిడ, “ఎందుకు బాబూ అరుస్తావు? కొత్తపల్లి కొబ్బరి కాయలు అని అడుగు. ఆవకాయకి బాగుంటుంది. యిప్పుడే అరవై కాయలు కొట్టించా” అంటూ ఆటో ఆటో అని పిలుస్తోంది.
ఫోన్ కట్ చేసి “రక్షించారండీ! ఏ కాయ తీసుకోవాలో తెలియక యిబ్బంది పడ్డాను. యింతకీ మీకు బీపీ, ఆసిడీటీ లేవుగా” అన్నాడు సుబ్బారావు.
దాంతో సుబ్బారావు వంక కోపంగా చూస్తో, “బలే వాడివే! నాకు ఏ జబ్బూ లేదు” అంది.
“అదేమిటి? యిన్ని కాయల ఆవకాయ తిన్నా మీకు ఏ జబ్బూ రాకపోవడం ఆశ్చర్యం గా వుందే” అన్నాడు సుబ్బారావు.
దానితో ఆవిడ యిక్కడే వుంటే ఏ రోగం అంతకడతాడో అనుకుంటూ సంచిని లాక్కుంటూ ముందుకెళ్లి నుంచుంది.
‘పోనిలే, కాయ పేరు చెప్పింది’ అని షాప్ దగ్గరకి వెళ్ళి, బాబు కొత్తపల్లి సుబ్బారాయుడు’ కాయలట. అవి యివ్వు. ఒక యిరవై అయిదు కాయలు” అన్నాడు.
అంత హడావిడి లో వున్నా కూడా షాప్ అతను ఒక్కసారి గా పెద్దగా నవ్వుతూ “బలే వారు బాబాయ్! కొత్తపల్లి సుబ్బారాయుడు ఒకప్పుడు MLA గారు. కొత్తపల్లి కొబ్బరి మామిడి కాయ అనేది ఒక రకం” అంటూ నవ్వుతూ, యిరవై అయిదు కాయలు తీసి సంచిలో వేసాడు.
“యింకో రెండు కాయలు కొసరు వేస్తారుటగా, అవి కూడా వెయ్యి” అన్నాడు సుబ్బారావు.
“రెండేంటి.. నాలుగు తీసుకోండి, యింత నవ్వించారు” అంటూ యింకో రెండు కాయలు వేసి, “బాబాయ్! ఈ రద్దీ లో మీరు కాయలు ముక్క కొట్టించుకోలేరు. నేను కొట్టిస్తా, ఆ కుర్చీ మీద కూర్చోండి” అన్నాడు షాప్ వాడు కాయల సంచి, ముక్కలు కొట్టేవాడికి యిస్తో.
అలాగే అని కూర్చొని, మనసులో అన్నీ కాయలు కొడతాడా, లేక మోసం చేసి ఒక పది కాయలు దాచేస్తాడా అని అనుమానం పట్టుకుంది సుబ్బారావు కి. ‘ఛీ అలా కనిపించడం లేదు. కొసరు నాలుగు కాయలు అన్నా రెండు వేసినా మంచివాడు గా కనిపిస్తున్నాడు. అందరిని అనుమానించకూడదు’ అనుకుని సరిపెట్టుకున్నాడు.
“యిదిగో బాబాయ్! ముక్కలు మరీ పెద్దవి కాకుండా మీడియం గా కొట్టించాను” అని సంచి చేతికి యిచ్చాడు.
“ఎంతా?” అన్న సుబ్బారావు తో “అక్కర్లేదు లేదు బాబాయ్! జాగ్రత్త గా వెళ్ళండి” అని పనిలో ములిగిపోయాడు షాప్ అతను.
‘అబ్బా! అప్పుడే ఒంటిగంట అయ్యింది. ఈ ఎండలో కారం కొనడానికి వెళ్తే గంగవెర్రులెత్తుతుంది. రేపు కొనచ్చులే’ అనుకుంటూ ఇంటికి బయలుదేరి, యింకో అరగంట కి ఇంటికి చేరుకుని గుమ్మంలో తను యింకా రాలేదేమిటా అని ఎదురుచూస్తున్న భార్య కి సంచి అందించి, “అన్నం వడ్డించు! నీరసం తో చచ్చేటట్లున్నా” అన్నాడు.
“ఛీ.. అదేమీ అశుభం మాటలు. అసలే ఆవకాయ పెట్టుకుంటూ వుంటే” అని సంచి అందుకుని, “ఏమిటి.. యిరవై అయిదు కాయలంత బరువు లేదు…?” అంది.
‘చచ్చాం రా నాయనా, షాప్ వాడు కొన్ని కాయలు నొక్కేసుంటాడు’ అనుకుని, “చేత్తో ఎలా బరువు తెలుస్తుంది గాని నన్ను లోపలకి రాని” అని వెళ్ళి కాళ్ళు కడుక్కుని, ‘కాయలు నొక్కేసాడా, ఎంత మంచి గా మాట్లాడాడు, ఎవరినీ నమ్మకూడదు’ అనుకుంటూ, ఏదో తిన్నానని తిన్నట్టు అన్నం తిని మంచం మీద పడుకున్నాడు గాల్పు కొట్టినట్టు అనిపించి.
టైం ఎంతైందో తెలియదు, రమణి అరుపులు తో ఉలిక్కిపడి లేచి, “మళ్ళీ ఏమైంది?” అన్నాడు సంచి వంక చూస్తో.
“నా బొంద, ఉట్టి ముక్కలు కొట్టించుకుని వస్తే ఎలా? కారం, నూని, ఆవపొడి ఏవి” అంది.
“ఎండలో చస్తోవుంటే యింకా అవి తీసుకొని రాలేకపోయాను, రేపు ఉదయం వెళ్తాను లే” అన్నాడు.
“బాగానే ఉన్నాయి మీ తెలివితేటలు! రేపటివరకు ముక్కలు వుండవు. కొట్టించిన రోజునే ఆవకాయ పెట్టేసుకోవాలి. అదిగో ఆరు అయిందిగా.. ఫోన్ అరుస్తోంది. మీ తమ్ముడు అనుకుంటా, కిందనే వుండండి. నేను షాప్ కి వెళ్ళి కావలిసినవి తెచ్చుకుంటా” అంటూ సంచి పట్టుకొని, నా పర్సు తీసుకొని బయలుదేరింది.
రాత్రి పడుకుంటో, “ఏమిటో అనుకున్నాను గాని చాలా ముక్కలు వచ్చాయి. కలపలేక చేతులు పడిపోయాయి అనుకోండి. యిరవై అయిదు కాయలేనా లేదంటే ఏ నలభై కాయలో కొన్నారా?” అంది రమణి.
అంటే అంది కానీ పాపం షాప్ వాడు మోసం చేయలేదు, అన్నీ కాయలు ముక్కలు కొట్టిచ్చాడు, అందరూ మోసగాళ్లు వుండరు అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు సుబ్బారావు.
***శుభం***
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలు చదవాలంటే కథ పేరు పైన క్లిక్ చేయండి.
Himabindu's World • 4 hours ago
కళ్లకు కట్టినట్లు చూపించారు వినిపించారు వ్రాశారు
Sai Praveena jeedigunta • 1 hour ago
Too good 👍