ఆవేదన
- Neeraja Prabhala
- Nov 6, 2023
- 5 min read

'Avedana' - New Telugu Story Written By Neeraja Hari Prabhala
Published In manatelugukathalu.com On 06/11/2023
'ఆవేదన' తెలుగు కథ
రచన, కథా పఠనం: నీరజ హరి ప్రభల
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
ఇంటిపని పూర్తిచేసుకుని భర్త రమేష్ కు కాఫీ ఇచ్చి తనూ ఆయన ప్రక్కన కూర్చుని కాఫీ త్రాగుతూ అమెరికాలో ఉంటున్న కొడుకు ధీరజ్ ఫోన్ కోసం ఎదురు చూస్తోంది వసంత. వారం వారం ధీరజ్ ఫోన్ చేయడం, కోడలు సుమ, ఆరేళ్ల మనవరాలు అనిత మాట్లాడటం మాములే.
ఇంతలో ఫోన్ రింగయితే లిఫ్ట్ చేసింది వసంత.
"హలో ! అమ్మా! నీవు, నాన్న ఎలా ఉన్నారు?" అన్న కొడుకు పలకరింపుకి ప్రాణం లేచొచ్చినట్టయి " హాయ్ ! ధీరజ్! మేము బాగానే ఉన్నాము. మీరెలా ఉన్నారు?" అంది వసంత.
"బావున్నాము " అని ఆతర్వాత చాలాసేపు సుమ, అనిత కూడా మాట్లాడారు. రమేష్ కూడా వాళ్లతో మాట్లాడాడు.
ధీరజ్ మాట్లాడుతూ ' అనితకు స్కూలు చదువు అయ్యాక ఇంట్లో ఆన్లైన్ లో కంప్యూటర్ క్లాసులతో చాలా బిజీ ' అని నవ్వుతూ చెప్పాడు.
అది విని "అదేమిట్రా! పట్టుమని ఆరేళ్ల పిల్లకు ఇప్పటినుంచీ కంప్యూటర్ క్లాసులు ఏంటిరా? సోద్యం కాకపోతేనూ? హాయిగా ఆటపాటలతో గడపాల్సిన వయసు దానిది. " అన్న వసంత మాటలకు అడ్డొస్తూ " అమ్మా! మీ కాలంనాడు ఉన్నవి మాకాలానికే కొంత మార్పులు వచ్చాయి. ఇప్పుడు దీని కాలం ఆధునిక సాంకేతిక యుగం. చాలా మార్పులు వచ్చాయి, వస్తున్నాయి. మారుతున్న కాలంతో మనమూ నడవాలి అమ్మా. " అన్న ధీరజ్ మాటలకు అయిష్టంగానే మిన్నకుండి పోయింది వసంత. ఆతర్వాత ధీరజ్ తనకు ఆఫీసు సమయం అవుతోందని ఫోన్ పెట్టేశాడు.
ధీరజ్ ఫోన్ పెట్టేశాక భర్తతో వసంత " ఏమండీ !, విన్నారా? మన అనిత చదువుతో పాటు కంప్యూటర్ క్లాసులతో చాలా బిజీట. హాయిగా నవ్వుతూ, తృళ్లుతూ ఆడే పసివయసు బాల్యం దానిది. ఈవయసులో అది ఆ కంప్యూటర్ కు అతుక్కుని బుర్ర వేడెక్కించుకోవడం ఏమిటో? నాకైతే ససేమిరా ఇష్టం లేదు " అంది వసంత.
"మన తరం, ధీరజ్ తరం మారి ఇప్పుడు మనవరాలి తరం వచ్చింది. అదీ అమెరికాలో ఇవన్నీ మామూలే" అన్న భర్త మాటలకు తన చిన్ననాటి జ్ఞాపకాలలోకి వెళ్లింది వసంత.
చక్కటి కృష్ణా నది ఒడ్డున అందమైన పల్లెటూరు తమ ఊరు రామాపురం గ్రామం. పచ్చని తివాచీలు పరిచినట్టు ఉండే మాగాణి పంటపొలాలు, పురాతన దేవాలయం, ఎరుపు, తెల్లని కలువలతో నిండిన పెద్ద సరస్సు, అందులో తెల్లని కొంగలు, హంసలు, చాలా ఆహ్లాదంగా ఉండేది ఆ ఊరు. వ్యవసాయమే ప్రధాన వృత్తి కల ఆ గ్రామంలోని ప్రతి ఇల్లు పాడిపంటలతో కళకళలాడుతూ ఉండేది. ఆ ఊరిలో బాంకు, ఒక హాస్పిటల్ ఉండి చుట్టుపక్కల ఊర్లకు బస్సులు వంటి రవాణాసౌకర్యాలు ఉండేవి.
ఆ గ్రామ ప్రజలకు మంచితనం-మానవత్వం సహజ భూషణాలు. వారికి అభిమానం ఆభరణం, మర్యాదే మూలధనం. పరువు - ప్రతిష్టలే వారికి ప్రాణం. పరిసర గ్రామ ప్రజలందరితో కలుపుగోలుగా ఉంటూ, అందరితో స్నేహ సంబంధాలను నెరుపుతూ, తమకు తోచిన సాయాన్నందిస్తూ ఉండేవారు. ఆ గ్రామంలో కోర్టులు, తగాదాలు ఉండేవి కావు. ఎప్పుడు అందరూ ఎంతో ఐకమత్యంగా ఉంటూ వరసలు పెట్టుకుని పిలుచుకుంటూ చాలా ఆప్యాయంగా ఉండేవాళ్లు.
వసంత తండ్రి యాదయ్య వ్యవసాయదారుడు. తల్లి సుమతి గృహిణి. తనకు ఊహతెలిసిన మొదలు తమ ఊరిపిల్లలతో ఉప్పుడుగుప్పా - వయ్యారిభామా, చెమ్మాచెక్కా, అచ్చంగిల్లాలు, చింత గింజల ఆటలు మొ.. వాటితో గడుపుతూ ఎంతో ఉల్లాసంగా ఉండేవాళ్లు. సాయంత్రాలు ఆ ఊరి పంటచేల గట్లమీద తోటిపిల్లలతో షికార్లు, ఆకాశంలో ఎగిరే పక్షుల కిలకిలారావాలను ఆలకిస్తూ సందడిగా గడిపి ఇంటికొచ్చాక రాత్రిపూట ఆరుబయట పెరట్లో బాదంచెట్లక్రింద నులకమంచాలమీద పడుకుని తల్లి తండ్రులతో హాయిగా కబుర్లు చెప్పుకునేది. ఆతర్వాత నీలాకాశంలోకి చూస్తూ నక్షత్రరాశులను లెక్క బెట్టే ప్రయత్నం చేసి క్రమంగా నిద్రలోకి జారుకునేది.
పండుగలు వస్తే ఊరిలో అందరూ కలిసి రకరకాల పిండింటలను చేసుకుని ఒకళ్లకొకళ్లు పంచుకునేవాళ్లు. ఆ ఊరిలో ప్రతిఏటా పేరంటాలమ్మ తిరణాల, జాతర లాంటివి జరిగేవి. ఆరోజున చిన్నా, పెద్దా అందరూ క్రొత్త బట్టలు ధరించి అమ్మవారికి పూజలు జరిపి, ఎడ్లబండి మీద ప్రభలు కట్టి అమ్మవారికి మ్రొక్కులు చెల్లించుకుని ఎంతో వైభవంగా జాతర జరుపుకుని సంతోషంగా గడిపేవాళ్లు.
వినాయక చవితికి పూజకు పిల్లలందరూ వేకువజామున పత్రికోసం ఊరంతా తిరిగి పత్రిని సేకరించటం, గణపతి పూజలయ్యాక ఆ ఊరి సరస్సులో గణపతిని భక్తితో నిమజ్జనం చేసేవాళ్లు. దసరా, సంక్రాంతి, ముగ్గుల హడావుడి, సందె గొబ్బిళ్లు, సంక్రమణం, ఊరేగింపు, పేరంటాలతో అందరూ చాలా సందడిగా గడిపేవాళ్లు. వసంతకాలంలో మామిడి చిగుర్లు తిన్న కోయిల కుహు కుహూలతో, వాటిని అనుకరిస్తూ అందరూ చాలా ఉల్లాసంగా గడిపేవాళ్లు
ఆ ఊరి స్కూలు హైస్కూలు చదువు పూర్తి కాగానే మంచిసంబంధాన్ని చూసే ప్రయత్నాలలో అదే ఊరిలో బాంకులో పనిచేసే రమేష్ తో పెళ్లి, సంతోషంగా సంసారం, ఆ తర్వాత ధీరజ్ పుట్టడం జరిగింది. ధీరజ్ పుట్టినాక అమ్మమ్మా, తాతయ్యల గారాబంతో పెరుగుతూ వాళ్ల ప్రేమానురాగాలను పొందుతూ ఉండేవాడు. చక్కగా చదువుతూ తన తోటి పిల్లలతో చక్కగా ఆటపాటలతో చాలా ఉల్లాసంగా గడిపేవాడు. స్కూలు చదువు పూర్తికాగానే పట్నంలో కాలేజీలో ఇంజనీరింగ్ చదువు, అయింది. ఇంకో రెండేళ్ల తర్వాత వసంత తల్లి తండ్రులు వృధ్ధాప్యం కారణంగా ఒకరి తర్వాత ఒకరు కాలక్రమేణా తనువు చాలించారు. జరిగిన దానికి వసంతావాళ్లు చాలా బాధపడ్డారు.
ఆ తర్వాత M. S. చదువుకోసం ధీరజ్ అమెరికా వెళ్లడం జరిగింది. చదువు పూర్తైనాక అక్కడ మంచి కంపెనీలో సాఫ్టువేరు ఇంజనీర్ గా అతనికి ఉద్యోగం వచ్చింది. ధీరజ్ తన సహొద్యోగి సుమని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొడుకు కోరికను ఏనాడూ కాదనలేని వసంత దంపతులు తమ అంగీకారాన్ని తెలిపారు. తర్వాత రెండేళ్లకు అనిత పుట్టడం, వీళ్లు కూడా అమెరికా వెళ్లి ఆరునెలలు ఉండి మనవరాలి ఆలనాపాలనా చూసి సంతోషంగా గడిపివచ్చారు.
వంటింట్లో ఏదో అలికైడైన చప్పుడికి తృళ్లపడి గతస్మృతులనుంచి తేరుకుని వంటింట్లోకి వెళ్లింది వసంత.
ఆ తర్వాత ప్రతి ఏటా ధీరజ్ భార్యాబిడ్డలతో వీళ్ల వద్దకు వచ్చి నెల రోజులు సంతోషంగా గడపడం జరుగుతోంది. బాంకులో రిటైర్డ్ అయినాక రమేష్ వసంతతో ప్రశాంత జీవనం గడుపుతున్నాడు. వీడియో కాల్ లో ధీరజ్ కుటుంబాన్ని చూస్తూ వాళ్ల యోగక్షేమాలను తెలుసుకుంటూ సంతోషంగా ఉంటున్నాడు.
ఒకరోజున టీవీలో వార్తలను చూస్తుంటే ఒక. వార్త విని హతాశురాలైంది వసంత. వీడియోగేమ్సు, రమ్మీ ఆటలకు అలవాటు పడి ఒక బాలుడు ఇతరులతో పందెం కట్టి ఇంట్లో తన తల్లి తండ్రులకు తెలీకుండా డబ్బులు దొంగిలిస్తే, విషయం తెలిసి వాళ్లు ఆ బాలుడిని కోప్పడితే అందుకు అతను ఆత్మహత్య చేసుకున్నాడుట. "అయ్యో! ఎంత దారుణం జరిగింది " అని ఆవేదన చెందింది వసంత.
ఆ తర్వాత పేపర్లో తరచూ చదువు వత్తిడిని తట్టుకోలేక ఒక బాలిక పురుగుమందు త్రాగి ఆత్మహత్య, పదవతరగతి తప్పాడని రైలుక్రిందపడి ఇంకొక బాలుడు ఆత్మహత్య ఇలా ఏదోఒకటి వింటూఉంటే మనసంతా చాలా బాధతో బరువెక్కి "ఏంటి? ఎందుకిలా ఈ దారుణాలు జరుగుతున్నాయి ?" అని బాధపడి దీనికేదైనా ఏదైనా పరిష్కారం చూడాలని అనుకుంది వసంత.
నేటి బాలలే రేపటి పౌరులు. మానసిక వత్తిడికి లోనై పిల్లలు క్షణికావేశానికి గురయ్యి తమ బంగారం లాంటి ఉజ్జ్వల భవిష్యత్తుని కోల్పోయి విగతజీవులుగా మారుతున్నారే! ఇలాంటివి జరుగకుండా తను ఏదో ఒకటి చేయాలి. తమ కాలంలో తోటి స్నేహితులతో చక్కగా ఆరుబయట ఆటపాటలు, తోటి వారితో మనసువిప్పి మాట్లడుకోవడంతో మానసిక వత్తిడి అనేది తమలో ఉండేదికాదు. ఇప్పటి పిల్లలు తమ తల్లి తండ్రులు ఉద్యోగస్తులవటం చేత బయటకు వెళ్లి తోటి పిల్లలతో ఆటాపాటా, కబుర్లు లేవు. అపార్ట్మెంట్ లలో ఎవరికి వారే బిజీ లైఫ్. పిల్లలు పూర్తిగా కంప్యూటర్, వీడియోగేమ్సు, రమ్మీ లాంటివి, ఇంకా కొన్ని చోట్ల డ్రగ్స్ లాంటి వాటికి అలవాటు పడడం వింటోంది.
దీనికి తను ఏదన్నా మంచి పని చేసి పిల్లలను మంచిమార్గంలో పెడితే కొంతవరకైనా ఈ సమాజంలో మార్పు వచ్చి పిల్లల భవిష్యత్తు బావుంటుందని ఆలోచించింది. రమేష్ సహకారంతో తమకున్న ఖాళీస్ధలంలో తనే ఒక కౌన్సెలింగ్ సెంటర్ ను ఏర్పాటు చేసి విద్యార్థులకు ఉచితంగా కౌన్సెలింగ్ ను ఇచ్చేట్టుగా చేసింది. అక్కడే పెద్ద ఖాళీ స్ధలంలో పిల్లలందరూ రకరకాల ఆటపాటలతో గడిపేటట్టు ఏర్పాట్లు కూడా చేసింది. పాంప్లెట్సు ను వేయించి ప్రచారం చేయించింది. తమకు తెలిసిన డాక్టర్లను, విద్యావేత్తలను పిలిచి వాళ్ల చేత అవగాహనా సదస్సులను ఏర్పాటు చేసింది. కౌన్సెలింగ్ సెంటరు మొదట్లో కాస్త మందకొడిగా సాగినా నెమ్మది నెమ్మదిగా ఊపందుకుంది. చాలా మంది తల్లి తండ్రులు తమప్రయత్నాన్ని అర్థం చేసుకుని తమ పిల్లలను పంపుతున్నారు. పిల్లలు కూడా తమ స్కూలు అయిపోగానే ఇక్కడికి రావడానికి ఉవ్విళ్లూరుతున్నారు. కొంతమంది పిల్లలలో కూడా చాలా మార్పు రావడం గమనించి చాలా సంతోషంతో పొంగిపోతున్నారు వసంత, రమేష్ లు. పిల్లల కోసం భవిష్యత్తులో ఇంకా మరిన్ని మంచి కార్యక్రమాలను చేపట్టే యోచనలో ఉన్నారు ఆ దంపతులు.
.. సమాప్తం.
***
నీరజ హరి ప్రభల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ నీరజ హరి ప్రభల గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం :
Profile Link:
Youtube Play List Link:
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు


"మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు బ్రాంచి పోస్ట్ మాస్టర్, వ్యవసాయ దారుడు, పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని. చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు. మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ.. ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కధలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కధలు, కవితలు వ్రాస్తున్నాను . నాకధలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి. గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ.. నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం.. అయినది. నాకు నా మాతృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏
Comments