top of page

అవ్వ వక్కాకు గుండు

#KasivarapuVenkatasubbaiah, #కాశీవరపు వెంకటసుబ్బయ్య, #AvvaVakkakuGundu, #అవ్వవక్కాకుగుండు, #తెలుగుపల్లెకథలు


Avva Vakkaku Gundu - New Telugu Story Written By - Kasivarapu Venkatasubbaiah

Published In manatelugukathalu.com On 24/04/2025

అవ్వ వక్కాకు గుండు - తెలుగు కథ

రచన : కాశీవరపు వెంకటసుబ్బయ్య

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



ఓ రోజు నేను, మా మనుమరాలు శాన్విక, ప్రొద్దుటూరు నుండి బెంగళూరుకు బస్సులో పోతున్నాం. శాన్వి ఆనందానికి అవధులు లేవు. బస్సు కిటికీలోంచి బయటకు అటు ఇటు మార్చి మార్చి ఉత్సాహంగా చూస్తుంది. బస్సు పెన్నా నదిని దాటింది. 


ఉన్నట్టుండి శాన్వి " తాతయ్య! అటు చూడు! చెట్టు ఎంత వంకరగా ఉందో, దాని మొదుల్లో తాటి చెట్టు మొలిచింది. " అంది ఆశ్చర్యపోతూ.. 


మరి కొద్ది దూరం పోయాక పాత కాలం నాటి సత్రం చూసింది. "పూలతీగలు మొలతో మొలిచిన స్తంభాలతో సత్రం ఎంత బాగుందో" అనుకుంది. 


మరికొంత దూరం పోయేసరికి అందమైన బొమ్మలు చెక్కిన కోనేరు ఒకటి కనపడింది. "కోనేరు దేవాలయం మాదిరిగా ఉంది" అనుకుంది శాన్విక. 


ఓ అర్ర గంట తర్వాత ఎర్రగుంట్ల కమలాపురం పట్టణాలను దాటింది బస్సు. అక్కడొక నది అడ్డు వచ్చింది. "తాతయ్య! ఈ నది పేరేమిటి" అడిగింది శాన్వి. 


"ఈ నది పేరు పాపాఘ్ని. ఇది మన పెన్నా నదికి ఉపనది. " చెప్పాను. 

మరో పదిహేను నిమిషాలకు కడప విమానాశ్రయం ఒక ప్లైట్ ఎగురుతూ మరొక ప్లైట్ దిగుతూ కనిపించింది. శాన్వి కేరింతలు కొడుతూ చూసింది. "తాతయ్య! మనం బెంగళూరుకి ప్లైట్ లో పోదామా?" అంది. 


"అదేమంత గొప్ప విషయం కాదు లేమ్మా! పోదాం! మామూలుగా అర్జంట్ పని ఉన్నవాళ్లు పోతుంటారు" అన్నాను. 


"కడప పేరు గడప పదం నుండి వచ్చిందట కదా తాతయ్యా!"


"ఔను శాన్వి. ఇది తిరుమల వెంకటేశ్వరస్వామికి తొలి గడప. గడపనే కాలక్రమంలో జనం నోళ్లలో పడి కడపగా మారింది. పూర్వం వెంకటేశ్వరుని దర్శించుకోవడానికి ఈ మార్గంలో పోయే భక్తులు ఇక్కడే మజిలీ చేసుకొని ఇక్కడ ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరెస్వామిని దర్శించుకొని పోయేవారంట. శ్రీకృష్ణదేవరాయలు ఈ మైదానంలోనే ఏడుసార్లు తన సైన్యంతో విడిది చేసి తిరుమల వేంకటేశ్వరుని దర్శించుకున్నారట. ఇక్కడ ఉన్న లక్ష్మీ వెంకటేశ్వరుని దేవాలయంను ఈయనే నిర్మించారట. " అని శాన్వికి చెప్పాను. 


ఇంకొక ఇరవై నిమిషాలకు గువ్వలచెరువు కనుమ ఎక్కింది బస్సు. కొండపై నుంచి కడప నగరాన్ని చూసింది శాన్వి. "తాతయ్య! కడప ఎంత అందంగా ఉందో చూడు!" అంది. 


"రాత్రి పూటైతే లైట్ల వెలుతురులో ఇంకా బాగా అందంగా కనిపిస్తుంది శాన్వి" అన్నాను నేను. 


ఐదు నిమిషాల్లో కనుమ దిగి గువ్వలచెరువు ఊరు చేరింది బస్సు. రోడ్డు ఇరువైపులా పెద్ద పెద్ద షాపులు ఉన్నాయి. ప్రతి షాపు మందర పెద్ద పెద్ద పాత్రల్లో పాలకోవా అమ్ముతున్నారు. జనం పెద్ద సంఖ్యలో గుమిగూడి ఎగబడి కొంటున్నారు. 


"ఏమిటి తాతయ్య! ఇది జాతరలా ఉంది. " అడిగింది ఆసక్తిగా. 


" ఔను శాన్వి. గువ్వలచెరువు పాలకోవా అంటే చాలా ప్రసిద్ధి. ఇటుగా అటుగా పోయే ప్రతి వాహనం నిలిపి పాలకోవా కొనుక్కుని పోతుంటారు ప్రయాణికులు. పాలకోవా ఓనర్లు కోవాను దేశ విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు కూడా. " చెప్పాను. 


"అట్లైతే నేను తెచ్చుకుంటాను అని బస్సు దిగిపోయి ఒక కేజీ పాలకోవా తెచ్చుకుంది శాన్వి. 


బస్సు కదిలి రాయచోటి చేరుకుంది. రాయచోటి పట్టణం మధ్యలో ఏరు ఉండడం చూసి "ఊరి మధ్యలో ఏరు ఉండడం ఏమిటీ తాతయ్య! దీని పేరేమిటి?" శాన్వి అడిగింది. 


" ఏటికి ఇటు వైపు ఒక ఊరు అటు వైపు ఒక ఊరు ఉండొచ్చు! వేరు వేరు పేర్లతో పిలుస్తూ ఉండొచ్చు! కాలం గడిచేకొద్దీ రెంటినీ ఒకే పేరుతో పిలుస్తుండొచ్చు! ఇంక ఏరంటావా! దీని పేరు మాండవ్య. మాండవ్య మహర్షి పేరు మీద ఈ ఏరుకు ఈ పేరు వచ్చింది. ఈ ఏరు ప్రవహిస్తూ పోయి చెయేరులో కలుస్తుంది. చెయేరు పోయి పెన్నా నదిలో కలుస్తుంది. మాండవ్యనది ఉపనదికి ఉపనదన్నమాట" చెప్పాను. 


"అలాగా బాగుంది " అని పరిసరాలు గమనిస్తూ ఉండి పోయింది శాన్వి. 


బస్సు చినమండెం దాటి ప్రయాణిస్తున్నది. హటాత్తుగా శాన్వి " తాతయ్య! తాతయ్య! అటు చూడు! అటు చూడు! ఆ గుట్టపైన గుండ్రటి గుండు ఎంత పెద్దది ఉందో చూడు తాతయ్య! ఎవరో పెట్టినట్లు ఉంది కదా! దాని గురించి చెప్పు తాతయ్య " అడిగింది సంబ్రమాశ్చార్యాలతో. 


"కిటికీ గుండా చూశాను. ఓఁ! అదా! దాని పేరు 'అవ్వ వక్కాకు గుండు' అని పిలుస్తారు ఇక్కడివారు" అన్నాను. 


"తాతయ్య! ఆ అవ్వ కథ చెప్పవా తాతయ్యా" చాల కుతూహలంగా అడిగింది శాన్వి. 


"అవ్వ పశువుల్ని మేపడానికి ఇక్కడికి తోలుకొచ్చి ఈ పచ్చిక మైదానంలోనే మేపేది. పశువులన్నిటిని చూసుకోవడం కోసం ఈ గుట్ట మీద కుర్చుని అన్నింటినీ చూస్తూ ఉండేది. తన దగ్గర ఉన్న అడపంలో నుంచి వక్క, ఆకు, సున్నం బయటికి తీసి గుట్టమీద ఉన్న బండ మీద పెట్టి ఈ గుండుతోనే దంచుకుని నోట్లో వేసుకునేది అవ్వ. అందువల్ల ఆ గుట్ట మీది గుండుకి 'అవ్వ వక్కాకు గుండు' అని ఈ చుట్టుపక్కల ప్రజలు పిలుస్తారు" అని శాన్వికి చెప్పాను. 


"ఆ అవ్వ ఎవరు? ఆమె కథా కమామీషు ఎమిటో చెప్పు తాతయ్యా!" అడిగింది బతిమాలుతున్నట్లు శాన్వి. 


"ఆ అవ్వ పేరు చిన్నక్క. ఒక పెద్ద వ్యవసాయ కుటుంబంలో కడగొట్టు సంతానంగా పుట్టింది. అందుకే ఆమెను అందరూ చిన్నక్క అని పిలిచేవారు. ఆమె అసలు పేరు చాల మందికి తెలియదు. బట్రాజు బడిలో పెద్దబాలశిక్ష వరకు చదివి మరో పెద్ద వ్యవసాయ కుటుంబంలో కోడలుగా అడుగు పెట్టింది. అడుగు పెట్టింది మొదలు అందరి మెప్పును, అందరి అభిమానాన్ని పొందింది చిన్నక్క. 


మెట్టినింటిలో అన్ని విషయాల్లో జోక్యం చేసుకొంటూ, అన్ని సమస్యల్లో సలహాలిస్తూ, అందరిపై పెత్తనం చెలాయిస్తూ, తన మాటే శాసనం అనే విధంగా ఎదిగింది చిన్నక్క. కుటుంబ సభ్యులందరూ ఆమె మాటకు బద్దులై నడుచుకొనేవారు. అచిరకాలంలోనే అత్తారింటి ఆస్తిని పదింతలు చేసి తన ఆధిక్యతను నిరూపించుకుంది. అత్తామామలు, బావలు మరుదులు, తోడికోడళ్ళు అందరికీ ప్రశంసలపాత్రురాలైంది. 


కాలం గడిచేకొద్దీ తనకు తన తోడికోడళ్ళుకు కొడుకులు కూతుర్లు పుట్టుకొచ్చారు. వారందరినీ పెంచి పెద్ద చేసి, విద్యాబుద్ధులు నేర్పించి, పెళ్ళిళ్ళు పేరంటాలు చేసింది. పాడిపంటలు వృద్ధిచేసి, తన అదుపాజ్ఞల్లో ఉంచుకొని వారికి అప్పగించింది చిన్నక్క. 


మరికొంత కాలానికి మనవళ్ళు మనవరాళ్ళు పుట్టారు. వారిని కూడా సాకి సంతరించింది. పెళ్ళిళ్ళు చేసింది. చిన్నక్క వయసు వృద్దాప్యంలోకి జారుకుంది. మునుపటిలా కుటుంబం మీద అధికారం చెలాయించ లేకపోతుంది. మాట కటువు తప్పుతున్నది. చిన్నక్క అంటే లెక్కలేని తనం పెరిగిపోతున్నది. కుటుంబం అన్ని విషయాలు వాళ్ళే చూసుకుంటున్నారు అతిముఖ్యమైన విషయాల్లో తప్ప.


 ముని మనవళ్ళు ముని మనవరాళ్ళు జన్మించారు. 

ఇప్పుడు చిన్నక్కకు తొంబై ఏండ్లు వచ్చాయి. పూర్తిగా కుటుంబంపై అజమాయిషీ కోల్పోయింది. తన ప్రమేయం లేకుండానే మునిమనవళ్ళుకు, మునిమనవరాళ్ళకు పెళ్ళిళ్ళు జరిగిపోయాయి. చీటికిమాటికి చిదరించుకుంటూ, చులకనగా చూడబట్టిరి. 


"ఊరికే కుర్చొని ఉండకపోతే అటుపోయి పశువుల్ని మేలుకొని రాకూదూ?” అన్నారు. అప్పటినుండి చిన్నక్కవ్వ పశువుల్ని తోలుకొని పోయి మేపుకొస్తున్నది. 


ప్రతిరోజూ ఉదయమే చద్ది బువ్వ తిని అడపం నిండా వక్కాకు సున్నం కట్టెలపొడి పెట్టుకుని, పశువుల్ని తోలుకొని ఈ గుండు ఉండే గుట్ట దగ్గరకే వచ్చి పచ్చిగడ్డి మేపేది. పశులన్నిటినీ చూసుకోవడం కోసం గుట్టెక్కి కుర్చొని పశువుల్ని తేరిపార చూసుకొనేది. అడపం విప్పి వక్క, ఆకు తీసుకుని బండపై పెట్టి గుండుతో దంచుకొని నోట్లో వేసుకొని నమిలేది అవ్వ. 


వక్కాకు వేసుకుంటూ చిన్నక్కవ్వ ఇలా అనుకొనేది "దేవుడా! నన్నెందుకు ఇంకా బతికిస్తున్నావు! విలువలేని జీవితం ఎంత కాలం గడపమంటావు స్వామి? తల్లిదండ్రులు పోయారు. అన్నదమ్ములు పోయారు. అక్కాచెల్లెళ్ళు పోయారు. అత్తామామలు పోయారు. బావలు మరుదులు పోయారు. వదినెలు మరదళ్ళు పోయారు. కొడుకులు కూతుర్లు పోయారు. అల్లుళ్ళు కోడళ్ళు పోయారు. 


నా వాళ్ళంతా పోయి కొత్త తరం వచ్చినారు. ఇప్పుడు వీరికి నా అవసరం లేదు. అభిమానం ఆత్మీయత అనుబంధం లేదు. నేను కొత్తవారితో బతుకుతున్నట్టు ఉంది. వీరి మధ్య బతకలేక పోతున్నాను. కాబట్టి నన్ను కూడా కొండబో స్వామి " అని గొణుక్కుంటూ, వాపోతూ, వేదనా పడుతూ ఉంటుంది చిన్నక్కవ్వ. 


ఒక రోజు అవ్వ కూడా పోయింది. కానీ అవ్వ వక్కాకు దంచుకున్న గుండు మాత్రం " అవ్వ వక్కాకు గుండు" అని పిలవబడుతూ స్థిరస్థాయిగా అక్కడే ఉండిపోయింది. " కథ చెప్పడం ముగించాను


"అవ్వ కథ గుండెను టచ్ చేసింది తాతయ్యా!" అంటూ నా ఒడిలో నిద్ర పోయింది శాన్వి. 


"నిద్ర పోకుంటే ఇక ముందు ముందు వచ్చే రెడ్డెమ్మ కోన, గుర్రం కొండ కోట, మదనపల్లె హార్సిలీ హిల్స్ గురించి అడిగేదేమో! బహుశా తిరుగు ప్రయాణంలో అడగోచ్చనుకుంటా!" అనుకుంటూ నేను కూడా నిద్రలోకి జారుకున్నాను. 


బెంగళూరు వైపుగా బస్సు ముందుకు వెళ్ళింది. 


 -------


కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ కాశీవరపు వెంకటసుబ్బయ్య  గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:

Youtube Play List Link:

పేరు: కాశీవరపు వెంకటసుబ్బయ్య

చదువు: B.com

పుట్టిన తేది: 1960

తల్లిదండ్రులు: వెంకటసుబ్బయ్య

రచనలు: ఎద మీటిన రాగాలు కవితా సంపుటి.

అముద్రితాలు: తుమ్మెద పదాలు మని కవితలు సంపుటి, పినాకిని కథలు కథల సంపుటి.

సాహిత్య సేవ: చైతన్య సాహిత్య కళా వేదిక సంస్థను స్థాపించి అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించడం.

సన్మానాలు సత్కారాలు: అనేక సాహితీ సంస్థల నుంచి సన్మానాలు సత్కారాలు పొందడం.

---------

Comments


bottom of page