top of page

అయ్యో పాపం సత్తిపండుగాడు!



'Ayyo Papam Sattipandugadu ' - New Telugu Story Written By Nallabati Raghavendra Rao Published In manatelugukathalu.com On 13/09/2024 

'అయ్యో పాపం సత్తిపండుగాడు!తెలుగు కథ

రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



రాత్రి 9:00 అయింది. 


వెంకటలక్ష్మి పని చేసి చేసి నీరసంగా మంచం మీద పడుకుంది. 


ఆమె భర్త సత్తిపండు కంప్యూటర్ వర్క్ చేసుకుంటు న్నాడు. 


''ఏవండీ కాళ్ళు లాగుతున్నాయి కొంచెం పట్టండి..'' అంటూ పిలిచింది వెంకటలక్ష్మి భర్తను. 


''మొన్న కూడా ఇలాగే అడిగావు.. తలలో పేలు తీయమని.. తీశాను.. ఎవరికీ చెప్పనన్నావు. మరి.. మన ఇరువు పొరుగు అమ్మలక్కలకు.. ఆ విషయం ఎలా తెలిసిందే?'' అన్నాడు అమాయకంగా మొఖం పెట్టి సత్తిపండు. 


''అయ్యో కృష్ణ.. నేను అలాంటి దాన్ని కాదండి బాబు. నిజంగా నేను ఎవరికీ చెప్పలేదు. గోడలకు చెవులు ఉంటాయంటారు ఇదేనేమో మరి. '' అంది వెంకటలక్ష్మి పెదాలను నొక్కుకుంటూ. 


''నువ్వు మన ఇరుకు ఇరుగుపొరుగుకు చెప్తే.. నేను వీధిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ నా ముఖం కేసి అదోలా చూస్తున్నారే బాబు.. నాకు తల తీసి జేబులో పెట్టుకోవాలని పిస్తుంది. అదేమో.. ఊడి రాదు. '' అన్నాడు భార్య కాళ్ల దగ్గర కూర్చుంటూ. 


''నేను ఎవరికైనా చెప్పేదాన్నా.. అలాంటిదాన్నా?” అంది వెంకటలక్ష్మి బేలగా ముఖం పెట్టి. 


''మరి ఎవరికీ చెప్పవు కదా..'' అన్నాడు కనురెప్పలు పైకి ఆడిస్తూ.. సత్తిపండు. 


''కృష్ణ కృష్ణ నేను అలాంటి దాన్నా''.. అంటూ భర్త ఒడిలో కాళ్లు పెట్టింది వెంకటలక్ష్మి. 


కట్ చేస్తే.. 


రోజు కన్నా కొంచెం ముందే కూసేసింది పక్కింట్లో కోడి.. సూర్య భగవానుడు కూడా ఏదో కొంప మునిగిపోయి నట్టు కాస్త పెదరాలే వచ్చేసాడు. 


తూర్పు వైపు గోడ దగ్గర వెళ్లి నిలబడింది.. వెంకటలక్ష్మి. 


''సూరేకాంతం అత్తయ్య గారూ.. ఇలా రండి ఒకసారి.. మరే.. రాత్రే మా ఆయనగారు నా కాళ్లు పట్టారు.. పాపం ఎంత భయపడ్డారో నేను ఎవరికైనా చెప్తానని.. నేను అలాంటి దాన్నా అత్తయ్య గారూ. ''.. అంది కొంచెం పంచదార అప్పు అడుగుతూ.. 


మళ్లీ కాసేపు ఉన్నాక పడమర వైపు గోడ దగ్గర నిల బడింది.. వెంకటలక్ష్మి. 


''ఛాయాదేవి పిన్ని గారూ.. ఒకసారి ఇలా రండి బాబు.. 

మరిగంటే.. రాత్రే.. ''.. అంటూ వెంకటలక్ష్మి చెప్ప బోతుండగా.. 


''తెలిసిందమ్మా ఇప్పుడే సూర్యకాంతం చెప్పింది మీ ఆయన గారు.. నీ కాళ్లు పట్టారట కదా. ఎంత మంచోడో మీ ఆయన..'' అంది ఛాయాదేవి. 


''నేను ఎవరికైనా చెప్తానని ఎంతెలా భయపడ్డారో పాపం.. పిన్నిగారూ నేను అలాంటి దాన్నా.. ''.. అంది బేలగా ముఖం పెట్టి కరివేపాకు అప్పు తీసు కుంటూ.. వెంకటలక్ష్మి. 


కాసేపున్నాక ఉత్తరం వైపు గోడ దగ్గర నిలబడింది

వెంకటలక్ష్మి. 


''ఒసేయ్ గిరిజక్క.. ఇలా రా అంటూ పిలిచింది.. 


పిలుస్తూనే.. ''నేను అలాంటి దాన్నా.. '' అంది తల గోక్కుంటూ. 


''అయ్యయ్యో.. కాదు చెల్లి. ఇంట్లో విషయం ఎప్పుడూ బయట చెప్పలేదు నువ్వు.. అదే మేమంతా అను కుంటాం. రాత్రి మీ ఆయన కాళ్లు పట్టావట కదా నువ్వు.. మీ ఛాయాదేవి పిన్ని చెప్పింది'' అంది. 


''అయ్యో కృష్ణ.. నేను పట్టలేదు. ఆయనే నా కాళ్లు పట్టారు. ఈ విషయం మీకు ఎవరికీ చెప్పొద్దు అని ఎంత భయపడ్డారో పాపం.. అక్క.. నేను అలాంటి దాన్నా.. అందరికీ చెప్పేదాన్నా.. ఎవరైనా ఇంటి పరువు వీధిని పాడేసుకుంటారా.. ఏదో అలా అలా నీకు తెలి సింది కానీ ఇప్పుడు నేను మాత్రం నీకు చెప్పానా గిరిజక్క?'' అంటూ లోపలకు వెళ్ళి పోయింది.. తల విదిలించుకుంటూ.. వెంకటలక్ష్మి. 


ఇంకాసేపున్నాక దక్షిణం గోడ మీద చెయ్యి పెట్టి నిల బడింది.. 


''రమాప్రభ దొడ్డమ్మ గారు.. '' అంటూ పిలిచింది. 


ఆవిడ వస్తు.. 


''తెలిసిందమ్మాతెలిసింది.. రాత్రి మీ ఆయన గారు నీ కాళ్లు పట్టారట కదా. '' అంది రమాప్రభ దొడ్డమ్మ. 


''అదే దొడ్డమ్మా.. ఈ విషయం అందరికీ తెలిసిందీ.. 

నాకెందుకు చెప్పలేదు అని నువ్వు నామీద దెబ్బ లాడ తావని గుర్తు చేసుకుని పరిగెట్టుకు మరీ వచ్చాను.. నీ చెవిలో వేద్దామని.. నేను నీకు తప్పించి ఎవరికైనా చెప్తానా ఇంట్లోవిషయo.. నేను అలాంటి దాన్నా?''అంటూ లోపలకు వెళ్ళిపోయింది వెంకటలక్ష్మి. 


ఇంటర్మీషన్ అయ్యింది 


సెకండ్ హాఫ్ మొదలైంది


సత్తిపండు కాల కృత్యాలు తీర్చుకొని చేత్తో ఫైల్ పట్టు కొని నడుచుకుంటూ ఆఫీసుకు వెళ్లడానికి గుమ్మందాటి బయటకు వచ్చాడు.. చెంబు చేత్తో పట్టుకుని ఖాళీ ప్రదేశంలోకి కంగారుగా వెళుతున్న వాడిలా.. 


ఆ లొకాలిటి ఆడంగులు అందరూ తనను.. గోడ అవ తల నుండి.. తలుపు ఇరుకుల్లోనుండి.. తలకాయలు పెట్టి చూస్తున్నారేమో అని.. అతనికి కాస్త అనుమానం గానే ఉంది


అయితే.. 


రాత్రి అతను తన పెళ్ళానికి కాళ్లు పట్టిన విషయo

ఆ నలుగురు నుండి అనతికాలంలోనే నాలుగు ప్లస్ నాలుగు ఎనిమిది మందికి.. ఎనిమిది ఇంటూ 8 = 64 మందికి అలా అలా వైరస్ లా పాకిపోయింది. 


స్త్రీ జనమంతా వీధిలోకి వచ్చి నోరులు నొక్కు కుంటూ తన వైపు వింత జీవిలా చూడడం పసిగట్టేసాడు సత్తిపండు. 


వెనక్కు తిరిగి చూశాడు.. తన భార్య వైపు.. 


ఆమె.. '' అయ్యో నేను అలాంటి దాన్ని కాదు''' 


అన్నట్టు తల అడ్డంగా ఊపుతున్నట్టు అనిపించి.. చేసేదిలేక జేబులోంచి జేబురుమాలు తీసి ముఖా నికి కప్పుకుంటూ నడక మొదలు పెట్టాడు. ఆ జేబురు మాలు కాస్త గాలికి ఎగిరి సైడ్ కాలవలో పడిపోయింది. 


ఏం చేస్తాడు పాపం కుడి చేత్తో మెడ దగ్గర కాలర్ పట్టుకుని.. తన చొక్కా తల మీద నుండి పైకి లాగి ఎలాగో ముఖం కప్పుకున్నాను.. అన్నట్టు ఫీల్ పొంది గబగబా ఆ లొకాలిటీ దాటి బయట పడ్డాడు.. పాపం సత్తిపండు గారు. 


 కాదు కాదు అయ్యో పాపం సత్తిపండు గాడు!


****

నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.







రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


ముందుగా  " మన తెలుగు కథలు"  నిర్వాహకులకు నమస్సులు..

"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.

రచయిత తన  గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.

పునాది....

-----------

ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు  ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం  నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద  దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.


ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా..   రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.


తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో

టెన్త్ క్లాస్ యానివర్సరీ కి  15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.

అప్పుడే నేను రచయితను కావాలన్న

ఆశయం   మొగ్గ తొడిగింది.

నా గురించి..

---------------

50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.

450  ప్రచురిత కథల రచన అనుభవం.

200 గేయాలు  నా కలం నుండి జాలువారాయి

200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి

20 రేడియో నాటికలు ప్రసారం.

10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.

200 కామెడీ షార్ట్ స్కిట్స్

3  నవలలు దినపత్రికలలో


" దీపావళి జ్యోతి "అవార్డు,

"రైజింగ్స్టార్" అవార్డు

" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.


ప్రస్తుత ట్రెండ్ అయిన  ఫేస్బుక్ లో  ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు  నాకథలు,  కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..

రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం  కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!

ఇదంతా ఒక్కసారిగా  మననం చేసుకుంటే...  'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.

ఇక నా విజయ ప్రయాణగాధ....

------+------------------------------

పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన  నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ  నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!


తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ...   నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి  ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి  వారైన  సినీ గేయరచయిత

" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.


1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి  కథ.


2. రేడియో నాటికలు  గొల్లపూడి మారుతీ రావు    గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.


3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర"  ద్వితీయబహుమతి కథ..  "డిసెంబర్ 31 రాత్రి"


4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ


5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ


6.  దీపావళి కథలు పోటీలో  "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.


7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ


8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"


9. "స్వాతి "   తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."


10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్  "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"


11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం  కురిసింది"


12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ


13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..


14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం"  న్యాయనిర్ణేత   జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.


15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .


16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ

" ఇంద్రలోకం".


17.  కొమ్మూరి సాంబశివరావు స్మారక  సస్పెన్సు కథల పోటీలో  "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.


18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ "  గాంధీ తాత"  రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.


19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్  రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.


20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".


21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".


22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి  కథ "ఆలస్యం అమృతం విషం"


23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ  "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.


24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.


25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.


26.  రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ  పోటీ లో ఎన్నికైన కథ.


27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".


28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.


29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.


30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం"  వారం వారం 30 కథలు.


31. "కళా దర్బార్"  రాజమండ్రి.. రాష్ట్రస్థాయి  కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ  కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.


32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన  "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి"    కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు  ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.


33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో  సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో  ప్రథమ బహుమతి  పాటకు వారి నుండి  పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక   రంగస్థల ప్రదర్శనలు పొందడం.


34. విశేష కథలుగా  పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు

  నలుగురితోనారాయణ

  కొరడా దెబ్బలు

  అమృతం  కురిసింది.

  వైష్ణవమాయ

  ఐదేళ్ల క్రితం

  ఇంద్రలోకం

  బిందెడు నీళ్లు

  చంద్రమండలంలో స్థలములు అమ్మబడును

  డిసెంబర్ 31 రాత్రి

  మహాపాపాత్ముడు

 

35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.


ప్రస్తుతం...


1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం


2. పరిషత్ నాటికలు జడ్జిగా..


3.  కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..

సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.


4. ..  4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.


5. ఒక ప్రింటెడ్ పత్రిక  ప్రారంభించే ఉద్దేశ్యం.


భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.

కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.

కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.

కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.

మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.

నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.

నల్లబాటి రాఘవేంద్ర రావు 



91 views0 comments

Comments


bottom of page