బాబోయ్! మీకో దండం
- Narasimha Murthy Gannavarapu
- Feb 20, 2023
- 5 min read

'Baboy Miko Dandam' New Telugu Story
Written By Gannavarapu Narasimha Murthy
రచన : గన్నవరపు నరసింహ మూర్తి
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
ముంబాయి- విశాఖపట్నం విమానం టేకాఫ్ అయిన ఇరవై నిముషాల తరువాత ఎమర్జన్సీ లేండింగ్ చేస్తున్నట్లు పైలట్ ప్రకటించాడు. పైలట్ ప్రకటన విన్న తరువాత అందులో ఉన్న రెండు వందల మంది ప్రయాణికులకు మొదట అతను ఏం చెబుతునాడో అర్థం కాలేదు.
అర్ధం అయిన తరువాత ఎక్కడ దించేసాడో అనీ గాబరా పడటం మొదలుపెట్టారు ;
ఇంతలో నిలువెల్లా నల్లశాలువాలు, ముఖానికి ముసుగు, చేతుల్లో ఏకె 47 తుపాకీలు పట్టుకున్న ఆరుగురు మనుషులు విమానం మధ్యలోకి వచ్చి "సైలెన్స్..ఎవ్వరూ కదలొద్దు. మేము కాశ్మీర్ తీవ్రవాదులం; ఈ విమానాన్ని హైజాక్ చేసాము. కాశ్మీర్ జైల్లో నిర్భంధించిన పాతిక మంది మా కాశ్మీర్ తీవ్రవాదుల్ని భారత ప్రభుత్వం విడిచిపెడితేనే మీరు ప్రాణాలతో బయటపడతారు.. అంతవరకూ నోరుముసూకొనీ కూర్చోండి".. అంటూ గట్టిగా మైకులో చెప్పారు.
తరువాత అందులో ఇద్దరు ఉగ్రవాదులు పైలట్లు ఉన్న కాక్‌పిట్‌లోకి వెళ్ళారు.
అందరూ అది ఎక్కడ దిగిందోననీ ఆందోళనతో అద్దాల్లోంచి చూడసాగారు. ఎదురుగా పెద్ద కొండ.. ఏదో బ్రిటిష్ కాలం నాటి పాత ఎయిర్ బేస్ లా ఉంది.
దూరంగా వరి చేలు, కొబ్బరి చెట్లు, డీజేల్లో పెద్ద సౌండ్‌తో అర్థం కాని తెలుగులో పాటలు వినిపిస్తూన్నాయంటే బహుశా ఆంధ్రలాగే ఉంది అన్న అభిప్రాయానికి వచ్చారు ;
ఇంతలో ఒక ఉగ్రవాది "24 గంటల్లోగా ఆ టెర్రరిస్టుల్ని జైలు నుంచి వదిలెయ్యాలనీ, లేకపోతే విమానాన్ని పేల్చేస్తామనీ" ఎవరితోనో గట్టిగా మాట్లాడుతుండడం వినిపించింది. బహుశా కేంద్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడినట్లు ఉన్నాడు.
ఆ తరువాత నరకం మొదలైంది. బాత్‌రూమ్‌కి వెళ్ళాలన్నా వాళ్ళకి చెప్పి వెళ్ళవలసి వస్తోంది. కాకపోతే టెర్రరిస్టులు మంచి వాళ్ళలా ఉన్నారు. అందరికి ప్రతీ గంటకు కాఫీలు , టీలు, టిఫిన్లు వాళ్ల సీట్ల దగ్గరికే తెచ్చి ఇస్తున్నారు.
అప్పటికే చాలా మంది వాళ్ళిచ్చిన టిఫిన్లు తింటూ సెల్‌ఫోన్లో వాళ్ళ వాళ్ళతో మాట్లాడుకుంటూ బిజీ అయిపోయారు. అలా ఒక రాత్రి గడిచింది. హైజాకర్లు గంట గంటకూ కేంద్ర ప్రభుత్వ అధికారులతో సెల్‌ఫోన్లలో బేరాలు సాగిస్తున్నారు.
అప్పుడు ప్రయాణికుల్లో ఒకతను "బాబూ! అంతసేపు సెల్లో మాట్లాడితే బోలెడు బిల్లుతో పాటు ఛార్జింగ్ అయిపోతుంది. ఛార్జింగ్ చేసుకోవడానికి విమానంలో బేటరీ కూడా అయిపోతున్నట్లుంది; కాబట్టి కొంచెం పొదుపుగా మాట్లాడండి” అన్నాడు..
వెంటనే మాట్లాడుతున్న ఆ నల్లశాలువా ఉగ్రవాది "ఛుప్ రహో" అనీ గట్టగా అరవడంతో అతను మౌనం దాల్చేడు. ఈ రెండు రోజుల్లో టెర్రరిస్టులతో ప్రయాణికులకు బాగా చనువు ఏర్పడింది. అంతటి హార్డ్‌కోర్ టెర్రరిస్టులు కూడా ఆంధ్రా వేడి వాతావరణానికి కొంచెం భయపడ్డట్టున్నారు. బయటకు మాత్రం మేకపోతు గాంభీర్యం ఒలకబోస్తున్నారు కానీ పైకి చెప్పేంత పెద్ద ఉగ్రవాదుల్లా కనిపించటం లేదు.
గంటలు గడుస్తున్న కొద్దీ ప్రయాణీకుల్లో భయం తగ్గిపోయి టెర్రరిస్టులతో పిచ్చాపాటి మొదలుపెట్టారు. విమానం ప్రయాణీకులతో నిలిచి పోయిందన్న సంగతి తెలిసి ఓ కేరళ కుర్రాడు బొగ్గుల కుంపటి మీద కెటిల్‌తో టీ తెచ్చి `ఛాయ్ ఛాయ్ అంటూ టీ అమ్మటం మొదలు పెట్టాడు. వెంటనే ప్రయాణికులందరూ నిచ్చెన ద్వారా కిందకి దిగి అక్కడున్న పచ్చగడ్డిలో కూర్చొని టీ తాగుతూ లోకాభిరామాయణం మాట్లాడుకోసాగారు.
కొందరు మా దగ్గర చిల్లర లేదంటే వాడు వెంటనే స్వైపింగ్ మిషన్ తీసి కార్డు ద్వారా పేమేంట్ తీసుకోవడం మొదలు పెట్టాడు. టీ తరువాత అందరూ గుంపులు గుంపులుగా కూర్చొని పిచ్చాపాటి మొదలుపెట్టారు. కొందరు సెల్‌ఫోన్లో మెసేజ్‌లు పంపుకుంటూ కనిపించారు. కొద్దిసేపటి తరువాత మిరపకాయ బజ్జీలు, చాక్‌లైట్లు అమ్మకానికొచ్చాయి. కొందరు వాడి చుట్టూ మూగి పది నిమిషాల్లో వాటిని ఖాళీ చేసేసారు.
కొందరైతే ఉగ్రవాదులకు కూడా ఆఫర్ చేసారు కానీ వాళ్ళు కోప్పడ్డంతో వెనక్కి తగ్గారు.
ఇంతలో ఓ న్యూస్ పేపర్ కుర్రాడు వచ్చి " బాబూ! హైజాకర్లతో ప్రభుత్వ చర్చలు విఫలం; హైజాకర్ల డిమాండ్లు కేంద్రప్రభుత్వం తిరస్కరణ! గాల్లో కలవబోతున్న 200 మంది ప్రాణాలు" అంటూ అరవడం మొదలు పెట్టాడు. వెంటనే అందరూ వెళ్ళి ఎగబడి మరీ పేపర్లని కొన్నారు.
మరికొందరైతే అలవాటు కొద్దీ ఆ పేపరు చదువుతున్న వాళ్ళ దగ్గరకొచ్చి"సార్! సెంటర్ పేజీ ఇస్తారా?" అంటూ వాళ్ళు ఇవ్వకపోయినా బలవంతంగా లాక్కొని మరీ చదవడం మొదలుపెట్టారు.
ఇంతలో ఓ ఉగ్రవాది అధికారులతో మాట్లాడుతూ తమ డిమాండ్లను చెప్పటం మొదలుపెట్టాడు. అప్పుడు ఆ గుంపు లోంచి ఒక ఏభై ఏళ్ళ స్త్రీ వచ్చి "బాబూ! ఎలాగూ డిమాండ్లు అడుగుతున్నట్లున్నావు.. మావాడు ఇప్పటికీ ఐదుసార్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్యూలకి వెళ్ళనా ఉద్యోగాలు రావటం లేదు. కొద్దిగా వాడికుద్యోగం ఇవ్వాలనీ ఓ డిమాండ్ పెట్టునాయనా? చచ్చి నీ కడుపున పుడతాను" అనీ చెప్పింది.
ఆమె మాటలు వినీ ఇంకో పెద్దాయిన వచ్చి ``బాబూ! అలాగే ఎమ్‌సెట్‌ని పేపర్ని ఇమ్మని చెబుదూ.. మా వాడికి ఇప్పటి దాకా నాట్ క్వాలిఫైడ్ వస్తునాది. నీ పుణ్యమా అనీ ఇంజనీరింగ్ చదువుకుంటాడు. ఇస్తే నీ ఋణం ఉంచుకోనులే. తృణమో పణమో ముట్ట చెబుతాను`` అన్నాడు.
ఆ మాటలు విన్న ఆ ఉగ్రవాది అతని వైపు కోపంగా చూస్తూ "షటప్" అంటూ గట్టిగా అరవడంతో అతను వెళ్ళిపోయాడు.
ఇంతలో ఇంకో ముసలాయన వచ్చి ``బాబూ! ఆ కేటీవీలోని "ఇద్దరు మొగుళ్ళు ముగ్గురు పెళ్ళాలు" సీరియల్‌ని ఆపేయమనీ డిమాండు పెట్టు నాయానా.. లేకపోతే మా ఆవిడ నాకు సమయానికి టిఫిన్ కూడా పెట్టటం లేదు``అనీ కళ్ళు తుడుచుకుంటూ చెప్పాడు.
అప్పుడు నల్లకళ్ళజోడు, ఖద్దరు బట్టలు వేసుకున్న ఓ రాజకీయనాయకుడు అక్కడికి వచ్చి ``బాబ్బాబూ! మా అధిష్టానం నాకు ఈ ఎలక్షన్‌లో సీటివ్వటం లేదు. ఇప్పటిదాకా నా నియోజకవర్గంలో 10 కోట్లు ఖర్చు పెట్టేసాను. అందుకనీ నాకు సీటిమ్మనీ డిమాండు పెట్టునాయినా.. పార్టీ ఫండ్ కిచ్చే ఆ ఐదుకోట్లు నీకే ఇచ్చేస్తాను’ అన్నాడు..
ఆ ఉగ్రవాది అతని వైపు కోపంగా చూడ్డంతో భయపడి వెళ్ళిపోయాడు.
ఇంతలో ఇంకో ఉగ్రవాది వాళ్ళ దగ్గరికి వచ్చి “మీలో ఎమ్మెల్యే అప్పారావ్ ఎవరు” అని గట్టిగా అడిగాడు. అందులోని టోపీ పెట్టుకొన్న ఓ రాజకీయ నాయకుడిలా ఉన్న వ్యక్తి వచ్చి ``నేనే సార్`` అన్నాడు.
``మీ ముఖ్యమంత్రి నుంచి ఇప్పుడే మెసేజ్ వచ్చింది. మీరు గడపగడపకు ఎమ్మెల్యే ప్రోగ్రాంలో వెనకబడి ఉన్నారట. వెంటనే మిమ్మల్ని ఇంటింటికి వెళ్ళిమన్నారు.. లేకపోతే టికెట్ ఇవ్వరట`` అన్నాడు; దాంతో ``చచ్చిపోయానురా బాబూ! దాన్ని తప్పించుకుందామనే నేను ముంబాయి వెళ్ళాను.. అయినా ఇది తప్పేటట్టు లేదు`` అంటూ వెళ్ళిపోయాడు ఏడ్చుకుంటూ.
ఇంతలో ఓ యాభై ఏళ్ళ స్త్రీ మూర్తి వాళ్ళ దగ్గరకు వచ్చి ``బాబూ! మీ హైజాకర్లందరూ మొగాళ్ళే.. కనీసం ఒక్క స్త్రీ కూడా లేదు అంటే మీరు కూడా స్త్రీలకు రిజర్వేషన్లు ఇవ్వటం లేదన్న మాట.. ఇదన్యాయం..రేపు పార్లమెంటులో ఈ విషయాన్ని మా పార్టీ తరపున ప్రశ్నిస్తాను; వుమన్ రిజర్వేషన్స్.. జిందాబాద్” అంటూ గట్టిగా అరవడం మొదలు పెట్టింది.
ఆ సమయంలో పదేళ్ళ పిల్లడు వాళ్ళ దగ్గర కొచ్చీ `` అంకుల్! ఒక్కసారి మీ సెల్ ఇస్తారా..నా గర్లఫ్రెండ్‌కు ఓ మేసేజ్ ఇవ్వాలి” అనీ అడిగాడు. వాడు “ఛుప్..ర హో” అని గట్టిగా అరవడంతో ``అరే !అంత కోపం ఎందుకు” అంటూ వెళ్ళిపోయాడు.
పది నిముషాల తరువాత నలుగురు యువకులు వచ్చి ``అంకుల్!సెల్లులో క్రికెట్ బజ్ ఓపెన్ చేసి మన టీం స్కోరెంతో చెబుతారా?.. కోహ్లీ అవుటయిపోయాడా? ఆడుతునాడా? చెప్పండి !" అనీ అడిగారు..
వాళ్ళలో ఇంకొక యువకుడు ``అంకుల్! రేపు మా మెగాస్టార్ సినిమా రిలీజ్.. ఐనాక్స్‌లో రెండు టిక్కెట్లు బుక్ చేస్తారా !`` అనీ అడిగాడు.
వెంటనే ఆ ఉగ్రవాది ఏకే 47ని తియ్యడంతో వాళ్ళు పారిపోయారు. అదే సమయంలో ఒక పెద్దావిడ వచ్చి ``నాయనా! ఈ రోజు కార్తీక సోమవారం. నేను విడిగా వండుకోవాలి. మీ దగ్గర తోటకూర, టమాటాలు, పప్పులు, బియ్యం ఇవ్వకూడదు.. ఈ పక్కనే అరటి ఆకులున్నాయి. కాబట్టి ఈ రోజుకి ఏదో అయిందనిపిస్తాయి`` అంది..
ఆ మాటలకు ఆ ఉగ్రవాదికి తిక్కరేగింది. "అరే ఛల్! నీకి తుపాకితో చంపేస్తాను`` అన్నాడు కోపంగా..
“ఏమిటో వీళ్ళు !. పిదపకాలం పిదప బుద్ధులు.. మా చిన్నప్పడు విమానాన్ని హైజాక్ చేసినవాళ్ళు చక్కగా మూడు పుట్లా కమ్మగా భోజనాలు పెట్టి మరీ పంపించేవారట. మీరు ఉన్నారు దేనికి నాయనా” అంటూ కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయింది.
ఇంతలో ఇద్దరు ఉగ్రవాదులొచ్చి ``అరే భాయ్! మన డిమాండ్లకు ప్రభుత్వం ఒప్పుకుందా?``అనీ ఫోన్లో మాట్లాడుతున్న వాడిని అడిగారు.
``అరే భాయ్! మాట్లాడుతుండగా దీన్లో ఛార్జింగ్ అయిపోయింది. ఇప్పుడు హేమి సెయ్యాలో తేలీటం లేదు`` అన్నాడువాడు.
ఇంతలో ఇంకో ఉగ్రవాది వచ్చి ``అరే భాయ్! జైల్లో ఉన్న మన టెర్రరిస్టు తముళ్ళు జైలు నుండి బయటకు రామంటునారట..జైల్లో మంచి భోజనం, పెద్ద టీవి, ఆడుకోవడానికి పేకలు, సెల్‌ఫోన్లో సినిమాలు, వారం వారం బయటకు షికార్లు.. అక్కడే బాగుందిట. బయటికొస్తే పాకిస్తాన్ సైన్యంతో గొప్ప చికాకులట`` అంటూ చావు కబురు చల్లగా చెప్పాడు.
ఇంతలో మరో ఇద్దరు ఉగ్రవాదులు ఉప్మా టిఫిన్ పేకెట్లను అందరికీ ఇస్తుంటే అందులోని నలుగురు స్త్రీలు `` బాబూ! మీకిది బావుందా! నిన్నట్నుంచీ ఉప్మా, చపాతీలే ఇస్తున్నారు. మెనూ మార్చొచ్చు కదా.. హయిగా ఇడ్లీ, శనగపలుకుల చట్టీ, రాత్రికి పూరీ, కూర్మా.. మధ్యాహ్నం హైదరాబాద్ బిరియానా.. ఇలా మెనూ మారుస్తే మీరెన్నాళ్ళు ఉండమన్నా ఉంటాము. ఇలాగే రోజూ ఉప్మా ఇస్తే మాత్రం మేం చచ్చినా ఉండం.. ఈ బోడి ఉప్మా మా ఆయనలు రోజూ చేస్తున్నదే`` అన్నారు..
అసలే డిమాండ్లు ఒప్పుకోక వాళ్ళు బాధపడుతుంటే ఈ కొత్త డిమాండ్లు వాళ్ళకి మరింత కోపాన్ని తెప్పించీ ``ప్లీజ్ గెటౌట్`` అనీ అరిచారు.
ఇంతలో పైలెట్లు ఇద్దరూ కిందకి దిగి ``బాబూ! విమానంలో పెట్రోల్ అయిపోయింది. అదీ కాక నా డ్యూటీ అయిపోయింది. ఈ నెల మాకు జీతాలు కూడా ఇవ్వలేదు కాబట్టి మేము అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి`` అంటూ విమానం తాళాలను వాళ్ళ కిచ్చి వెళ్ళిపోయారు..
వెంటనే అక్కడున్న పదిమంది ఉగ్రవాదులు గట్టిగా అరుస్తూ ``బాబూ! మా డిమాండ్లు మీ ప్రభుత్వం అంగీకరించలేదు. మా దగ్గర డబ్బులూ, పోన్లో ఛార్జింగ్ రెండూ అయిపోయాయి.. మీ తెలుగు వాళ్ళున్న విమానాన్ని హైజాక్ చేసి మేము పెద్ద తప్పు చేసాము. ఇంకాసేపు ఇక్కడే ఉంటే పిచ్చెక్కి పోయేటట్లున్నాము.. మీకో దండం. బతికుంటే బలుసాకు తింటాం ;; లేకపోతె టీ అమ్ముకొనీ బతుకుతాం.. మీరు ఏ బస్సో చూసుకొని ఇళ్ళకు వెళ్ళిపోండి`` అంటూ ఉత్తర దిశ వైపు వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంటే ప్రయాణికులందరూ వాళ్ళని జాలిగా చూడసాగారు..
(సమాప్తం)
గన్నవరపు నరసింహ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
Twitter Link
Podcast Link
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం
గన్నవరపు నరసింహ మూర్తి గారు ఎం టెక్ చదివారు.ప్రస్తుతం విశాఖ పట్నంలో రైల్వే శాఖలో జాయింట్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. వీరు ఇప్పటిదాకా 300 కథలు ,10 నవలలు రచించారు. ఏడు కథా సంపుటాలు ప్రచురించారు. స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి దగ్గర ఒక గ్రామం.
Comments