top of page

బాబోయ్ టెన్త్ క్లాస్

Writer: Srinivasarao JeediguntaSrinivasarao Jeedigunta

#JeediguntaSrinivasaRao, #జీడిగుంటశ్రీనివాసరావు, #Baboy Tenth Class, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు


Baboy Tenth Class - New Telugu Story Written By - Jeedigunta Srinivasa Rao

Published In manatelugukathalu.com On 20/03/2025

బాబోయ్ టెన్త్ క్లాస్ - తెలుగు కథ

రచన : జీడిగుంట శ్రీనివాసరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



“డాడీ! నేను టెన్త్ క్లాస్ కి వచ్చానుగా, మోటార్ బైక్ కొనిపెట్టవా” అని అడిగిన కొడుకు తేజ్ తో “టెన్త్ క్లాస్ లోకి రావడం గొప్పకాదు, మంచి మార్కులు తో పాస్ అవ్వు .అప్పుడు షోకులు గురించి ఆలోచిద్దాం” అన్నాడు రాజేష్. 


“అంటే యింకో ఏడాది దాకా గవర్నమెంట్ బస్సు లో వెళ్లాలా” అన్నాడు. 


“నేను పదిహేను ఏళ్ళ నుంచి వెళ్ళటం లేదా, నా కంటే దేనిలో గొప్ప అనుకుంటున్నావు” అన్నాడు రాజేష్. 


“మీ కొడుకు గా పుట్టడమే నా గొప్ప, అందుకే కొనివ్వమంటున్నాను” అన్నాడు తేజ్. 


తండ్రి కొడుకుల గొడవ విన్న రాజేష్ భార్య రజని కలిపించుకుని, “మీ నాన్నగారి కి ప్రామిస్ చెయ్యి టెన్త్ క్లాస్ లో ర్యాంక్ తెచ్చుకుంటాను అని, రేపే కొనిపెడతారు, కదండీ” అంది. 


“నీ తెలివితేటలకి సంతోషించాను, తల్లీకొడుకులు బలవంతంగా నా చేత వాడికి మోటార్ బైక్ కొనిపించలేరు” అనేశాడు రాజేష్. 


రాత్రి ఏమైందో తెలియదు, మర్నాడు కొడుకుతో “నీకు ఏ కంపెనీ మోటార్ బైక్ కావాలి రా” అని అడిగాడు. 


తేజ్ తల్లి వంక చూసి, తండ్రితో “బుల్లెట్ బండి కావాలి” అని కొనిపించుకున్నాడు. 


స్కూల్స్ తెరవగానే మంచి స్కూల్ లో తేజ్ ని టెన్త్ క్లాస్ లోకి చేరిపించాడు రాజేష్. కొత్త మోటార్ బైక్ ని వేసుకుని హుషారుగా వెళ్తున్నాడు తేజ్. 


ఆ రోజు ఆఫీసులో రాజేష్ తన స్నేహితుడు సుమన్ తో తన కొడుకుని కృష్ణవేణి స్కూల్ లో చేరిపించినట్టు, తన భార్య, కొడుకు పోరు పడలేక మోటార్ బైక్ కొని పెట్టి నట్టు చెప్పాడు. 


ఆ మాట విన్న సుమన్ “అరే! మా అమ్మాయి గీత కూడా అదే స్కూల్ లో చేరింది, అయితే నా అదృష్టం! నన్ను స్కూటీ కొనమని అడగలేదు” అన్నాడు నవ్వుతూ. లంచ్ టైం అయిపోవడం తో ఎవ్వరి రూంకి వాళ్ళు వెళ్లిపోయారు. 


మర్నాడు సుమన్ రాజేష్ దగ్గరికి వచ్చి “నువ్వు పార్టీ యివ్వాలి, మోటార్ బైక్ కొన్నందుకు. పదా హోటల్ కి వెళ్దాం” అన్నాడు. 


“మరి మీ అమ్మాయి ని మంచి స్కూల్ లో చేరిపించినందుకు నువ్వు కూడా పార్టీ యివ్వాలి” అన్నాడు. 


“అలాగే, టిఫిన్ ఖర్చు నీది, కాఫీ ఖర్చు నాది” అన్నాడు నవ్వుతు సుమన్. 


ఇద్దరూ ఆటో మాట్లాడుకుని ద్వారకా హోటల్ కి బయలు దేరారు. వీళ్ళ ఆటో హోటల్ గేట్ లోకి ప్రవేశిస్తోవుండగా లోపల నుంచి రాజేష్ కొడుకు తేజ్ మోటార్ బైక్ మీద ఎవ్వరో అమ్మాయిని కూర్చోపెట్టుకుని రివ్వున వెళ్ళిపోవటం చూసి రాజేష్ కంగారు పడ్డాడు. అప్పటివరకు ఒకటే వాగుతున్న సుమన్ కూడా మూగపోయాడు. తిన్నామని అనిపించుకుని ఇద్దరు హోటల్ నుంచి మనస్సులో మనసు లేకుండా బయటపడ్డారు. 


సాయంత్రం రాజేష్ ఇంటికి త్వరగా వెళ్ళాడు. భార్య యిచ్చిన కాఫీ తాగుతో “తేజ్ యింకా రాలేదా” అన్నాడు.


“వాడు అప్పుడే ఎలా వస్తాడు, ఆ స్కూల్ వాళ్ళు స్పెషల్ క్లాసులు పెట్టి ఎనిమిది గంటల వరకు వదలటం లేదుట” అంది రజని. 


“స్పెషల్ క్లాస్సేస్ ఎక్కడ పెడుతున్నారుట? ఇందిరా పార్క్ లోనా” అన్నాడు, దగ్గర వున్న కుర్చీ లాక్కుని కూర్చుంటూ.


“ఏమిటండి ఆలా అన్నారు” అంది రజని. రాజేష్ ఆరోజు చూసింది చెప్పాడు. 


భర్త చెప్పిన విషయం విని ఉలిక్కిపడి, “మీరు రేపు ఆఫీసు కి సెలవు పెట్టి వాడి స్కూల్ కి వెళ్ళి ప్రిన్సిపాల్ ని కలిసి వీడి వ్యవహారం కనుక్కోండి.. మొక్కలోనే తుంపేయకపోతే చాలా ప్రమాదం” అంది. ఇంతలో బయట మోటార్ బైక్ శబ్దం వినిపించడం తో, “వచ్చాడు, మీరు ఏమి అనకండి చూద్దాం” అంది రజని. 


“నీరసంగా ఉందమ్మా కొద్దిగా కాఫీ యిస్తావా” అంటూ పుస్తకాలు టేబుల్ మీద పడేసాడు. 


“అంత నీరసంగా వుంటే షుగరకేన్ జ్యూస్ తాగాలిసింది” అన్నాడు రాజేష్ కొడుకు వంక చూడకుండా. 


“స్కూల్ దగ్గర జ్యూస్ ఎందుకు దొరుకుతుంది నాన్నా, ఏమిటమ్మా.. చచ్చి చెడి చదువుకొని వస్తే నాన్న అర్ధం లేని మాటలు” అంటూ తల్లి దగ్గరకి వెళ్ళాడు. 


అన్నం తిని పుస్తకం తీసుకొని రూమ్ లోకి వెళ్ళాడు తేజ్. తెల్లారింది, టిఫిన్ తినేసి మోటార్ బైక్ మీద స్కూల్ కి వెళ్ళిపోయాడు. పన్నెండింటికల్లా తేజ్ చదువుతున్న స్కూల్ కి వెళ్లి ప్రిన్సిపాల్ ని కలిసాడు. 


“సార్! నేను తేజ్ టెన్త్ క్లాస్ స్టూడెంట్ వాళ్ళ తండ్రిని” అని పరిచయం చేసుకున్నాడు రాజేష్. 


“హలో! ఎలా వుంది మీ ఆరోగ్యం” అని అడిగాడు ప్రిన్సిపాల్. “తండ్రి కోసం ఎంతో బాధపడ్డాడు మీ తేజ్, నాలుగు రోజులు చదువు పోయినా పర్లేదు అంటూ సెలవు పెట్టి మీతో హాస్పిటల్ లో వున్నాడు. హి ఇస్ గ్రేట్” అన్నాడు. 


“నాకు ఏ రోగం లేదు సార్, వాడు స్కూల్ కి ఎందుకు రావడం లేదో మీరే పిలిపించి అడగండి నా ముందు” అన్నాడు. 


అటెండర్ ని పిలిచి “తేజ్ ని పిలుచుకుని రా” అన్నాడు. 


రెండు నిమిషాలలోనే అటెండర్ తిరిగి వచ్చి “ఫస్ట్ పీరియడ్ అవగానే వెళ్ళిపోయాడు” అని చెప్పటం తో, “సార్! మా వాడు ఏదో తప్పు దారిలో వెళ్తున్నట్టు వుంది, ఈరోజు నేను వాడితో మాట్లాడి రేపటి నుంచి స్కూల్ కి పంపుతాను, వాడు ఏ రోజైన స్కూల్ కి రాకపోతే నా ఈ నెంబర్ కి ఫోన్ చెయ్యండి” అని చెప్పి భారంగా బయటకు వచ్చాడు. మెట్లు దిగుతో వుంటే సుమన్ ఎదురు పడ్డాడు. “మీ వాడు స్కూల్ ఎగకోట్టాడా” అని అడిగాడు సుమన్, “అవును” అని వెళ్ళిపోయాడు రాజేష్. 


ఇంటికి చేరుకుని భార్య రజనికి విషయం చెప్పి, కొడుకుకి ఫోన్ చేసాడు. 


“ఏమిటి డాడీ స్కూల్ కి కూడా ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తారు, టీచర్ నా వంక కోపంగా చూస్తున్నారు, చదవకపోతే చదవలేదు అంటారు, క్లాస్ జరుగుతోవుండగా ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తారు” అన్నాడు తేజ్. 


“సరేలే నువ్వు వెంటనే ఇంటికి రా, నాకు ఒంట్లో బాగోలేదు, హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళాలి” అన్నాడు రాజేష్. 


“నేను క్లాస్ మధ్యలో ఎలా రాను డాడీ, అసలే మాథ్స్ క్లాస్, అమ్మని తీసుకుని వెళ్ళు” అన్నాడు. 

“ఒరేయ్! పుత్రుడు పున్నామ నరకం నుంచి తప్పిస్తాడుట, నువ్వు వెంటనే రా” అని ఫోన్ కట్ చేసాడు. 


ఒక గంటికి ఇంటికి చేరుకున్న తేజ్, తండ్రి సోఫాలో కూర్చొని పేపర్ చదవటం చూసి, “బాగానే వున్నారు గా” అన్నాడు. 


“సరే మాథ్స్ క్లాస్ ఎలా వుంది, అర్ధం అవుతోందా” అని అడిగాడు. 


“ఈసారి మార్క్స్ బాగా తెచ్చుకుని మీ చేత కారు కొనిపించుంటా” అంటున్న కొడుకుని చూసి సోఫాలో నుంచి రివ్వున లేచి రాజేష్ బెల్ట్ తో కొడుకుని చావకోడుతో, “వెధవ, నాలుగు రోజులు నుంచి స్కూల్ కి వెళ్లకుండా ఎవ్వరితో తిరుగుతున్నావు, ఎవ్వరా అమ్మాయి” అంటూ కొడుతోనే వున్నాడు. 


“బాబోయ్ నాన్న నన్ను చంపేస్తున్నాడే” అంటూ తల్లి వెనుక నుంచున్నాడు. 


“యిటు వచ్చి నుంచుని నిజం చెప్పు, ఎవ్వరా అమ్మాయి, నీ వయసు కి ఆడపిల్ల కావలిసి వచ్చిందా” అన్నాడు. 


“పొరపాటు అయ్యింది, ఆ అమ్మాయి పుట్టినరోజు అని పార్టీ యిచ్చింది, అందుకే నా మోటార్ బైక్ మీద హోటల్ కి వెళ్ళాము. అంతే, నన్ను నమ్మండి” అన్నాడు తేజ్ తండ్రితో. 


“అయితే నేను రోగం తో హాస్పిటల్ లో వున్నాను అని ప్రిన్సిపాల్ కి ఎందుకు చెప్పి స్కూల్ మానేశావు, యిదే చివరి వార్నింగ్, రేపటి నుంచి బుద్దిగా స్కూల్ కి వెళ్ళు, వెధవ స్నేహాలు మానేసి చక్కగా చదువుకో, మోటార్ బైక్ తీసుకుని వెళ్ళద్దు” అన్నాడు. 


“మోటార్ సైకిల్ వాడకపోతే బ్యాటరీ పాడయిపోతుంది” అన్నాడు తేజ్. 


“నేను ఆఫీసు కి వేసుకుని వెళ్తాను, నువ్వు స్కూల్ బస్సు లో వెళ్లి రావాలి” అన్నాడు బెల్ట్ కింద పడేసి. 


ఆఫీస్ లో లంచ్ టైం లో సుమన్ మొహం సీరియస్ గా పెట్టుకుని రాజేష్ దగ్గరికి వచ్చి, “మీ అబ్బాయి ని కంట్రోల్ లో పెట్టు, మా అమ్మాయి ని వలలో వేసుకొని తన చుట్టూ తిప్పుకుంటున్నాడు” అన్నాడు. 


“ఓహో.. అయితే మా అబ్బాయి మోటార్ సైకిల్ మీద తిరుగుతున్నది మీ అమ్మాయా, నేను మా వాడిని ఎంత ఉతికినా చెప్పలేదు. నేను మా అబ్బాయి ని కంట్రోల్ చేస్తాను, నువ్వు మీ అమ్మాయి ని అదుపులో పెట్టుకో” అన్నాడు. 


“ఈ స్నేహం పెరిగి పెళ్ళివరకు వెళ్తే మీరు ఆకులు అలమలు తినేవాళ్లు. మీతో మాకు పడదు. గుర్తుకు పెట్టుకుని మీ అబ్బాయిని కంట్రోల్ చేసుకో, లేదంటే వాడికి నూకలు చెల్లినట్టే” అని హెచ్చిరించి వెళ్ళిపోయాడు సుమన్. 

***


“ఏమిటో టెన్త్ క్లాస్ కూడా అయిపొయింది. ఒక్కడిని కూడా వలలో వేసుకొని పెళ్లిదాకా తీసుకొని రాలేదు మన అమ్మాయి” అని అన్నాడు ఆటో పార్క్ చేసి యింట్లోకి వస్తో వెంకట్రావు. 


“కంగారు పడకండి, మన అమ్మాయి ఏ గొప్పింటి పిల్లడు కోసం వెతుకుతూందో, ఇంటర్ మొదటి సంవత్సరం లో మీకు మంచి అల్లుడు వస్తాడు, ఆటో డ్రైవింగ్ మానేసి అల్లుడు వాళ్ళతో ఉందాం యించక్కా” అంది వెంకట్రావ్ భార్య. 

***


“అవతలకి పో వెధవ, చక్కగా చదువుకోమని కాలేజీ కి పంపితే మన కులం కాని పిల్లని ప్రేమించి పెళ్లిచేసుకుని వస్తావా, ఏం పెట్టి పోషిస్తావు” అన్నాడు గుమ్మం లో మెడ లో పువ్వుల దండలతో నుంచున్న కొడుకు ని చూసి అరిచాడు రామిరెడ్డి. 

***


“ఏమండీ పంతులుగారు.. మా అబ్బాయి కి మంచి సంబంధం వుంటే చెప్పండి” అని అడిగింది సుష్మ. 


“యింకా పాతకాలం లో వున్నావేమిటి సుష్మాతల్లి. యిప్పుడు సంబంధాలు, పెళ్లి చూపులు మొదలగునవి కాలేజీలలోనే జరిగిపోతున్నాయి. ఇష్టమైన తల్లిదండ్రులు యింట్లోకి రానిస్తున్నారు, ఆతరువాత వాళ్ళు వృద్దాశ్రమం లో వుంటున్నారు. మా గిరాకీ తగ్గిపోయి, చివరికి క్రిమినల్ కేసులు తీసుకుంటున్నా” అంటూ వెళ్ళిపోయాడు శాస్త్రి గారు. 


తస్మాత్ జాగ్రత్త.. పిల్లలు ఎదుగుతున్నారు, ఆకర్షణల కి లోనవ్వుతారు. తల్లిదండ్రులు మొదటి నుంచి మంచి నడవడిక నేర్పి, వాళ్ళు చదువుతున్న స్కూల్, కాలేజీల కి తరచు వెళ్ళి వాళ్ళు ఎలా చదువుతున్నారు, ప్రవర్తన ఎలా వుంది గమనించకపోతే అయస్కాంతం ఆకర్షణ కి లోను అయ్యి పోతారు. 

ప్రేమించేటప్పుడు తల్లిదండ్రులని దృష్టిలో పెట్టుకొని, తరువాత పెళ్ళికి యిబ్బంది రాని పద్ధతి లో వుంటే మంచిదే. కాని తల్లిదండ్రులని క్షోభలో పెట్టి ఆనందించలేరు. ప్రేమ ఒకరితో పెళ్లి ఒకరితో విలువలకి ప్రమాదం. 

 

గమనిక.. ఎవ్వరిని కించపరచడానికి ఉద్దేశ్యం లేదు. జరుగుతున్న సంఘటనలుకు స్పందన మాత్రమే. 


 శుభం


జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
















 
 
 

Commenti


bottom of page