'Badhyatha Muddu Baladur Vaddu' - New Telugu Story Written By Vijayasundar
Published In manatelugukathalu.com On 17/06/2024
'బాధ్యత ముద్దు.. బలాదూర్ వద్దు!' తెలుగు కథ
రచన: విజయా సుందర్
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
"ఇంకా నీకెంత టైం పడుతుంది మైథిలీ? నా కివాళ తొందరగా వెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఇదిగో ఇంకో పావుగంటలో నేను బైల్దేరుతున్నా!" భర్త అభిరామ్ అల్టిమేటం లాంటి మాటకి తలెత్తి చూసింది. మైథిలి!
ఆయన టిఫిన్ బాక్స్ సర్దుతోంది.. " మీ టైం లోపలే చేసేసుకుంటానండీ. " అన్నది గాభరాగా, అతను వెళ్ళిపోతే ఎక్కి వెళ్లాల్సిన రెండు బస్సులనీ తలచుకుంటూ!
అక్కడే కూర్చుని. వత్తులు చేసుకుంటున్న అత్తగారు వర్ధనమ్మ' అమ్మో ఈవిడ. రోజూ కంటే ముందే వెళ్తుందా! నాకు మధ్యాన్నానికి తినేందుకు అటుకుల ఉప్మా చెయ్యమనాలిగా' అనిపించాక ఇక ఆగేదేమీ లేదావిడ.
"అమ్మాయ్ ! ఆ రొట్టె నేను పీక్కు తినలేకపోతున్నా! నాకు ఓ గుప్పడు. అటుకులతో అదేదో. ఆ.. పోహా అంటారు అది కలియపెట్టి వెళ్లమ్మా. నిమ్మకాయ పిడవటం మరిచిపోయేవు మీ ఆయనతో వెళ్లాలన్న హడావిడిలో" కోడలికి చెప్పాల్సింది చెప్పేసి 'హరే రా రామ రామ హరే హరే’ వత్తులు డబ్బా పక్కన బెట్టి, తావళం చేతిలోకి తీసుకుని పెదవులు కదిలిస్తూ కోడలి వంకే చూస్తోంది వర్ధనమ్మ ఏమంటుందా అని! అది చూసి మైథిలి నవ్వుకున్నది తత్త్వ వేత్తలా, .. తనకి ఇంకో ఆప్షన్ ఉందా అని! అక్కడే ఒక పక్కన పారాయణ చేసుకుంటున్న మావగారు సూర్యం గారు వేదాంతిలా ఓ నవ్వు నవ్వుకున్నారు!
పిల్లల కి అన్నాలు ఒక్కసారి వడ్డించి, వాళ్లనే పెట్టుకోమని ఆరేళ్ళ పిల్లాడు ధృవ్, ఎనిమిదేళ్ల పిల్ల మయూఖకి చెప్పి, ఒక రొట్టె రోల్ చేసుకుని తింటూ'ఇంత మెత్తగా ఉంటే పీక్కోవడమెందుకో? అనుకుంటూ చెప్పుల్లో కాళ్ళు దూర్చబోతున్న మైథిలిని,
"నాకు రెండోసారి కాఫీ ఇవ్వనే లేదు వదినగారు" ఆడబడుచు పుల్లవిరుపు మాటలు ఆపేసాయి.
"కలుపుకునేందుకు చేతులేమయ్యాయిట" నోటి చివరిదాకా వచ్చిన మాట తరవాత జరిగే రాద్ధాంతం గుర్తుకొచ్చి ఆగిపోయాయి! కాఫీ చేతి కిచ్ఛాక సాధించేందుకు ఏమీ కనపడక వాసంతి, వదిన చీరె మీద దృష్టి సారించి, "నాకు కొనేప్పుడింత మంచివి దొరకవేమిటో"
మైథిలి సహనం హద్దు దాటింది.. '' తిన్నమ్మకే వాపి కన్నమ్మకే వాపి సామెత విన్నావా వాసంతీ?" అంటూ ఆగకుండా తలుపు దాకా వచ్చిన పిల్లలకి ముద్దుపెట్టి వెళ్ళిపోయింది!
కార్ ఎక్కి భర్త పక్కన కూర్చోగానే మైథిలికి జైల్లోంచి విడుదలయిన ఖైదీ లా అనుభూతి.. రోజూ అంతే!
ఇవాళ పొద్దున లేస్తూనే తన తలనెప్పి, తరవాత అందరూ కలిసి ప్రసాదించిన తల్నెప్పులు. వెనక్కి వాలి కళ్ళు మూసుకున్న మైథిలి ని చూసి అభి" చాలా అలిసిపోయావా అమ్మూ!? నేనేమీ చెయ్యలేకపోతున్నారా నీకోసం?" తలమీద చెయ్యి వేసి నిమురుతున్న భర్త చేతిని గట్టిగా నొక్కి పట్టుకున్నది. రోజంతటిలో ఈ క్షణాల కోసం ఎదురు చూస్తుంది మైథిలి! ఇంట్లో తన విషయమేమీ పట్టనట్లుండే భర్తతో మొదట్లో “పొట్లాడితే నీ బతుకింకా నరకం చేస్తారు అమ్మూ" అనేవాడు. మితి మీరినప్పుడు కలగచేసుకుంటే జరిగిన విషయాలు మరచిపోగలిగేవేనా.. అందులో ఇప్పుడు పిల్లలు స్కూళ్ళు మూతబడిన కారణంగా ఇంట్లో ఉంటున్నారు.. అక్కసు వాళ్ళమీద చూపడానికైనా వెనుకాడని రాక్షసులు!
"అభీ! పని ఎంతైనా చెయ్యచ్చు.. మాటలు తూటాలల్లే దిగిపోతున్నాయి గుండెల్లో. "
"అవును చూస్తూనే ఉన్నా. ఇంక లాభం లేదు అమ్మూ. మన దారి మనం చూసుకుందాము. "
"అలా అనకు.. పరిష్కారం ఆలోచించాలి గానీ సమస్య నుండి పారిపోతే ఎలా?" ఫోన్లో మెసేజ్ అలెర్ట్ మోగింది.
"మోహన్ మెసేజ్ అభీ. వదినగారికి" అంటూ చదవగానే,
"అబ్బో ఏం మర్యాదా. , ఇది ఇంకో కొత్త వేషమా.. చదువు ఏమిటో అయ్యగారి ఫర్మా యిష్?"
"నా ఆదృష్టం ఇంకా కొద్ది రోజుల్లో తిరగబోతోంది.. కొంచెం ఓర్చుకోండి! నాకు ఒక్క పది వేలు ఇచ్చారంటే.. ఆహా ఊరికేనే కాదు.. వడ్డీతో సహా ఇచ్చేస్తా"
విన్న అభి, చదివిన మైథిలి ఆలోచించడం కూడా అనవసరం అనుకున్నారు!
ఇద్దరి ఆఫీసులు బాగా దూరంగా ఉండటంతో ఈ గంట ప్రయాణం వాళ్లకి జీవితం దుర్భరం కాకుండా కాపాడుతున్నది!
"అమ్మూ! ఇంక లాభం లేదు నువ్వు నేను ఎంత సర్దుకున్నా, ఎన్ని మంచి మాటలు చెప్పినా ఈ రాళ్లు కరగవు. 'దండం దశ గుణం భవేత్' అని చేతలతోనే అంతా. ఆ సోమశేఖరం గారి అబ్బాయి వాసంతిని చేసుకోవడానికి ఇప్పటికీ సుముఖంగానే ఉన్నాడు! చక్కగా నెలకి లక్ష రూపాయల జీతం, బానే ఉన్నాడు.. దానికేం చెప్తుంది పొట్టిగా ఉన్నాడని. ఇద్దరూ సరిగ్గా ఒకే ఎత్తులో ఉన్నారు! అయినా అది చేసిన పనికి.. "
"వద్దులెండి గుర్తు చేసుకోవద్దు.. ఆ అబ్బాయిని ఖాయం చెయ్యండి!" మైథిలికి వాసంతి చేసిన పని మనసులో మెదిలింది! పిచ్చి పుస్తకాలు చదివే అలవాటున్న వాసంతికి మాయ మాటలు చెప్పి ఇల్లు దాటించిన ఆ లైబ్రరీ కుర్రాడితో బస్ స్టాండ్లో ఉన్న వాసంతి ని, ఆరోజే పనిమీద అటు వెళ్లిన అభిరామ్ చూసి ఇంటికి తేకపోతే.. అమ్మో!..
"మోహన్ కి ఇష్టం లేకపోయినా ఆ చిట్ ఫండ్ కంపెనీలో చేరమంటాను. అదృష్టం అక్కడికే వస్తుందని చెప్తాను.. లేదంటే ఇంక వాడి దోవ వాణ్ణి చూసుకోమంటాను. ఇంక మన పిల్లల గురించి కూడా ఆలోచించే టైం వచ్చేసింది"
అభిరామ్ మాటలకి మైథిలి" అవును అభీ ఇంక చెడ్డవాళ్లమైనా పర్వాలేదు. "
అభిరామ్ ఆఫీస్ వచ్చింది.. సున్నితంగా బుగ్గమీద సుతారంగా మీటి తన చెలియకి తామెప్పుడూ ఒక్కటి అని చెప్పి దిగి పోయాడు. సాయంత్రానికి ఆఫీస్ కార్లో వస్తాడు. మైథిలి కారు తీసుకెళ్తుంది.
అలసి సొలసి వచ్చింది మైథిలి.. ఆఫీసులోను రకరకాల టెన్షన్లు. అక్కడా అంతే బాధ్యత ఉండకూడదు.. అన్ని అలవెన్సులూ కావాలి! లోపలిదాకా వెళ్లే ఓపిక కూడా లేని మైథిలి, హాల్లోనే కూర్చున్నది కళ్ళమీద చేతులుంచుకుని. చిట్టి అడుగుల సవ్వడి తనకు దగ్గరగా! తలెత్తి చూసిన మైథిలికి, పదిలంగా కాఫీ కప్పు పట్టుకుని నిలబడ్డ బంగారు బొమ్మ, మయూఖ!
పడ్డ కష్టమంతా చేత్తో తీసేసినట్లే అయింది! చిన్న పిల్లకున్న ఇంగిత జ్ఞానం, పక్క అరిగి పోయేట్లు పడుకుని పుస్తకాలు చదవడం, టీవీ చూడటం చేసే అడబడుచుకి ఎందుకుండదో!. అనుకుంటూ పిల్ల చేతిలోనుండి నెమ్మదిగా కప్ తీసుకుంటూ" తల్లీ నువ్వెందుకు వెళ్ళావమ్మా స్టవ్ దగ్గరకి? "
" నేను కాదు నాన్న. చేశారు కాఫీ". రహస్యంగా. చెప్తూ చెవిలో నాన్న చెప్పద్దన్నారు!" అని చెప్పింది. మయూఖని ముద్దు పెట్టుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని, తమ్ముడేడమ్మా?" అన్నది.
"పడుకున్నాడు అమ్మా! ఇవాళ ఎంత నీట్ గా తిన్నా నో నేను. నాది, తమ్ముడిదీ ప్లేట్లు కూడా సింక్ లో వేసేసాను!" బాధ్యత నేర్చుకుంటున్న చిట్టి తల్లిని అపురూపంగా పొదువుకున్నది!
మైథిలి పెదవులు విచ్చుకున్నాయి, కనుబొమలు పైకి లేచాయి' ఈ టైం లో ఈయనేవిటీ ఇక్కడ' అనుకుంటూ!
చప్పుడు చెయ్యకుండా వంటిట్లోకి వెళ్తుంటే అత్తగారు
"ఏమిటో ఈ సంబడం. ఎన్నడూ ఎరగము మగవాళ్ళు వంటిళ్లల్లోకి రావడం" విచ్చుకున్న పెదవులు ముడుచుకు పోయాయి ఈ విదిలింపులతో!
వంటింట్లో ఉన్న అభిరామ్ కి మధ్య గదిలో తల్లి అన్న మాటలు వినపడలేదు.. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ కూరలు కట్ చ్చేస్తున్న అభిరామ్, మూడ్ పాడు చెయ్యలేక తన మూడ్ మార్చుకున్నది మైథిలి.. దీక్షగా ఒక్కటే సైజ్ లో దొండకాయలు కట్ చేస్తున్న తన మనోహరుడు ముద్దొచ్చాడు. 'అటు ఇటు చూసి వంటింటి తలుపు దగ్గరగా వేసింది 'నవ్వి పోతే పొదురు గాక నాకేటి సిగ్గు' అనుకుంటూ. దగ్గరగా వెళ్లి నడుం మీద తల ఆన్చి" సోస్వీట్ అభీ" అన్నది. నెమ్మదిగా మైథిలిని లేవదీసి..
తలుపు తీసుకుని సంతోషంగా వస్తున్న కోడలిని చూసి పలకరింపుగా మావగారు నవ్వితే, అత్తగారు అసలే వంకరమూతి ముప్పై మూడు వంకర్లు తిప్పింది. ధీమాగా నడచి వెళ్లిపోతున్న కోడలు కొత్తగా కనిపించింది! అప్పుడే లేచి వస్తున్న బాబుని చేతులు చాచి ఎత్తుకుంటే వాడు కీలకిలాడాడు!
బట్టలు మార్చుకుని వంటిల్లు తన హస్తగతం చేసుకున్న మైథిలి "ఏమిటీ శ్రీవారివాళ ఇలా వేళకాని వేళలో?"
"ఊ అనుకున్న దానికంటే ఫాస్ట్ గా, సక్సెస్ఫుల్గా పని అయిపోయింది. పొద్దున దేవిగారి మొటివేషన్ మరి!
ఇవాళ మన ఆపరేషన్ వన్ స్టార్ట్. సాయంకాలానికి పెళ్ళివారొస్తున్నారు అన్నీ మాట్లాడుకోవడానికి!" రూమ్ లోనించి మాటలు వినిపిస్తుంటే అక్కడక్కడే తచ్చాడుతున్న వాసంతిని చూసి, అభిరాం కర్టెన్ పక్కకి జరిపి" ఎందుకే దొంగ చాటేందుకు.. నీ గురించే. ఇలాంటి అలవాట్లే మానుకో.. పెళ్లి కాబోతోంది"
వాసంతి తెరిచిన నోరు తెరిచినట్లే ఉండి పోయింది!
తండ్రి సూర్యంగారు" అవునే.. ఆ రాజేష్ పెళ్లి కొడుకు!.
"అమ్మా! చూడవే. ఆ పొట్టి అబ్బాయినే కుదిర్చేస్తున్నారు!" వాసంతి గారాబంగా పిలుస్తుంటే,
"మీ అమ్మకి తెలుసు. రాత్రి ఏడుగంటల్కి బాగున్నది! తాంబూలాలు పుచ్చుకుంటున్నాము!. నోరు మూసుకుని కూర్చో!" ఎంతో మెతకగా ఉండే మావగారు నిజంగా అవసరమైనప్పుడు గట్టిగా నిలబడటం మైథిలికి చాలా నచ్చుతుంది!
"ఆ అత్తగారు మరీ గయ్యాళిదండీ!" భార్య నసుగుతుంటే సూర్యం గారు పెద్దగా నవ్వి,
"నీ కంటేనా! ఏం కోడలు నీతో పడట్లా? అలాగే పడుతుంది. అయినా మన పిల్లకి అలాంటి అత్తగారే రైట్.
ఇంక మాట్లాడేదేమీ లేదు. చేసిన జపం చాలు. లేచి అన్నీ సర్దు. పిల్లకి ఏం చెప్తావో చెప్పు. ఇంక మాటల్లేవు"
తల్లి కూతురికి ఏం చెప్పిందో కానీ ఆ తాంబూలాలు కార్యక్రమం బాగానే కానిచ్చారు తల్లీ కూతుళ్లు!
వర్క్ ఆర్డర్. చేతిలో పెట్టిన తండ్రిని ఎగాదిగా చూసాడు ఫ్రెండ్స్ తో సినిమాకెళ్లి ఈలవేసుకుంటూ వచ్చిన మోహన్!
"ఏమిటీ అర్ధం కాలేదా.. చదువు.. ఆమాత్రం చదివేడిచావుగా! నీకే ఉద్యోగం!"
" నేను అల్లాటప్పా ఉద్యోగాలు చెయ్యను.. నా అదృష్టం.. "
“నోర్ముయ్! చాలు చాలింక. ఉద్యోగం చేస్తావో ఇంట్లొనించి పోతావో ఆలోచించుకో! ఆ వచ్చే అదృష్టం అక్కడిదాకా రాకపోదు!" ఇంక మాట్లాడే ఛాన్స్ లేని మోహన్, కాగితం చేతిలోకి తీసుకున్నాడు!
ఇంటి పగ్గాలు చేతిలోకి తీసుకున్న, బాధ్యతగల ఇద్దరు మగవాళ్ల సామర్థ్యంతో ఆ ఇల్లు ఒక గాడిలో పడింది! ఆ కుటుంబం నుండి సమాజానికి పనికి వచ్చే పౌరులు తయారౌతారన్నది తేటతెల్లం కదా!
***
విజయా సుందర్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: https://www.manatelugukathalu.com/profile/vijayasundar
నా పేరు వారణాశి వెంకట విజయలక్ష్మి. కలం పేరు 'విజయాసుందర్'. నేను ముఖపుస్తక మాధ్యమాలలో రచనలు చేస్తుంటాను. గత 5 సంవత్సరముల నుండియే నేను వ్రాస్తున్నాను. ప్రముఖ ముఖపుస్తకము భావుకలో రెండు గొలుసు కథలు, రెండు సీరియల్స్, అనేక కథలు వ్రాసాను. పలు పోటీల్లో పాలుపంచుకుని అడపా దడపా బహుమతులు గెలుచుకున్నాను. భావుకథసలు పేరిట అచ్చు అయిన పుస్తకంలో నా కథ ' బాజా భజంత్రీలు' ఈనాడు పుస్తకపరిచయంలో చోటు చేసుకున్నది. 'కథాకేళి', 'ప్రియమైన నీకు, పిల్లలు చెప్పిన పాఠాలు' పుస్తకాలలో న కథలు అచ్చు అయ్యాయి. 'భావుక' లో 'బిజ్జు బామ్మ కబుర్లు' అనే శీర్షిక కొన్నాళ్ళు నడిపాను.మన కథలు మన భావాలు, ముఖపుస్తకం లో కూడా ఎన్నో కథలు రకరకాల కాన్సెప్ట్స్ కి తగ్గ రచనలు చేస్తూ ఉంటాను.
'లీడర్', 'ఉదయం', ఇంకా కొన్ని వెబ్ పత్రికలలో నా కథలు చాలా అచ్చయ్యాయి, పలువురి ప్రశంసలు అందుకున్నాయి. నా సాహితీ ప్రయాణంలో పలువురు సీనియర్ రచయితల సూచనలను అంది పుచ్చుకుంటూ నా రచనలను మెరుగు పర్చుకునే దిశలో ప్రయాణిస్తున్నాను. నమస్సులు!
Comments