top of page
Writer's pictureMohana Krishna Tata

బాధ్యత - పార్ట్ 1



'Badhyatha - Part 1/2' - New Telugu Story Written By Mohana Krishna Tata 

Published In manatelugukathalu.com On 06/04/2024 

'బాధ్యత - పార్ట్ 1/2' తెలుగు పెద్ద కథ

రచన: తాత మోహనకృష్ణ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



"ఉషా! ఏమిటే నీ పొట్ట రోజు రోజుకూ అలా పెరిగిపోతోంది.. బయట జంక్ ఫుడ్ తెగ తింటున్నావా.. ? వెంటనే తగ్గించు.. " అంది అమ్మ జానకి.


"అదేమీ లేదమ్మా.. కొంచం వాకింగ్ చేస్తే, అదే తగ్గిపోతుంది.. "

"అయితే, ఈ రోజు నుంచి అన్నం కూడా తగ్గించు కొంచం.. బాగుంటుంది. ఇంటిపని లో నాకు కొంచం సాయం చేస్తే.. అది కూడా మంచి ఎక్సర్‌సైజ్ లాంటిదే.. !"


"అలాగే లే అమ్మా.. !"


"ఇంకా నయం.. అమ్మకు డౌట్ రాలేదు కాబట్టి సరిపోయింది. లేకుంటే, నా పని అంతే.. !" అని అనుకుంది ఉష. 


ఉష తన అమ్మా, నాన్న తో కలిసి ఉంటుంది. తెలివైన అమ్మాయి అవడం చేత పెద్ద చదువులు చదవడానికి ఒప్పుకున్నాడు తండ్రి. అమ్మాయి కోసం అప్పు చేసి మరీ చదివిస్తున్నాడు. తన స్థాయికి మించినప్పటికీ కూతురి ఆనందం కోసం అప్పు చేసాడు తండ్రి కృష్ణారావు. ఒక మంచి కాలేజీ లో కూతురి ఇష్టం మేరకు గొప్పగా చదివిస్తున్నాడు. 


కృష్ణారావు ఒక ప్రైవేటు కంపెనీ లో పని చేసి మానేసాడు. అనారోగ్యం చేత, ఇంటి పట్టునే ఉంటున్నాడు. రిటైర్ అయ్యాక వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని నెట్టుకు వస్తున్నాడు. కూతురు గురించే ఎప్పుడూ కృష్ణారావు ఆలోచన. పని చేసే రోజుల్లో, కృష్ణారావుకి ఆఫీస్ లో మంచి పేరు ఉంది. నిజాయితీ కి మారు పేరు అని అందరూ పొగిడేవారు. అంతే ఉత్సాహంతో పని చేసేవాడు కృష్ణారావు. ఏ పని ఇచ్చినా, టక్కున పూర్తి చేసేవాడు. కృష్ణారావు పనితనం చూసి పై అధికారి టైం కన్నా ముందరే ప్రమోషన్ ఇచ్చాడు. కొడుకు సంపాదన పెరగడం తో, కృష్ణారావు తల్లి వెంటనే పెళ్ళి చేసేసింది. 


ఉష ఇప్పుడు కాలేజీ లో చదువుతోంది. కాలేజీ లో ఫ్రెండ్స్ తో కలిసి సినిమాలకు వెళ్లడం చేసేది. తల్లి అంటే భయం ఎక్కువ. తండ్రి అంటే చనువు ఎక్కువ. కూతురి ఆనందం కోసం కృష్ణారావు ఏదైనా చేసేవాడు. పెళ్ళాం ఎన్ని మాటలు అంటున్నా.. ఉద్యోగం మానేసినందుకు ఎన్ని తిట్టినా కూడా.. అన్నీ కూతురు కోసమే భరిస్తున్నాడు కృష్ణారావు.. 


ఇంకొన్నాళ్ళు పోయాక.. ఉష ని గమనించిన తల్లి కి అనుమానం వచ్చింది. "ఏమిటే ఉషా.. ! నీ పొట్ట ఇంకా ఎక్కువ అయ్యింది.. ? నిజం చెప్పు ! ఏమైనా దాస్తున్నావా.. ?"


"లేదమ్మా.. అంతా నీ భ్రమ అంతే.. ! నేను ఎప్పటిలాగే ఉన్నాను. నా డ్రెస్ టైట్ గా ఉంది అంతే.. !"


తల్లి అలా అడిగేసరికి.. ఉషకు గుండె ఆగినంత పనైంది. మంచం మీద పడుకుని కళ్ళు ముసుకున్న ఉషకి తన గతం గుర్తుకు వచ్చింది.. 


*****


"ఏమే ఉషా.. ! ఏమిటే నువ్వు అంటున్నది.. ?"


"అవునే.. నేను అదే చేద్దాం అనుకుంటున్నాను.. "


"ఇంకొకసారి ఆలోచించు.. ఇది నీ జీవితానికే ఒక సవాలు అవుతుంది.. కాస్త ఆలోచించవే.. "


"పర్వాలేదు రాణి.. ! తప్పదే.. నాకు వేరే దారి లేదు మరి. ఉద్యోగం చేసి తీర్చేసరికి వడ్డీ ఎక్కువైపోతుంది.. అమ్మ దగ్గర నాన్న రోజూ తిట్లు తినడం నాకు ఇష్టం లేదు.. "


"అయితే.. ఎప్పుడు వెళ్తున్నావు డాక్టర్ దగ్గరకి.. ?"


"ముందు.. మేడం ని కలిసి మాట్లాడాలి.. అప్పుడు వెళ్తాను.. "


"ఒక ఫ్రెండ్ గా నీకు ఏమైనా సహాయం కావాలంటే చేస్తాను.. " అంది రాణి


ఉషకి మంచి ఫ్రెండ్ రాణి. చాలా సంవత్సరాల నుంచి ఇద్దరు మంచి ఫ్రెండ్స్. ఉష తనకి ఏం కష్టం వచ్చినా.. ఏమైనా సాయం కావల్సి వచ్చినా రాణి నే అడుగుతుంది. 


ఆ రోజు సాయంత్రం ఉష మేడం ని కలవడానికి వాళ్ళింటికి వెళ్ళింది.. 


"హలో.. ! మేడం నీరజ గారిని కలవాలి.. "


"చెప్పండి.. నేనే.. "


"నా పేరు ఉష.. మీరు పేపర్లో ఇచ్చిన ప్రకటన చూసాను. మీకు నా అవసరం ఉంటుందేమోనని వచ్చాను.. "


"నువ్వు దీనికి ఒప్పుకుంటున్నావని మీ ఇంట్లో తెలుసా.. ?"


"నాకు ఎవరూ లేరు మేడం. పర్వాలేదు.. నాకు డబ్బులు చాలా అవసరం.. అందుకే దీనికి ఒప్పుకున్నాను.. "


"ఉండు అమ్మాయి.. కాఫీ తీసుకుని వస్తాను.. " అంది నీరజ.


ఈలోపు ఉష ఇల్లంతా చూస్తున్నాది. ఎక్కడ చూసినా అందమైన బొమ్మలు.. అవీ పిల్లల బొమ్మలు. పిల్లలంటే ఎంత ఇష్టం కాకపోతే.. అన్నీ ముందే కొని పెట్టుకుంటుందని అనుకుంది ఉష. అంతా కాస్ట్లీ ఫర్నిచర్. అది ఒక పెద్ద ఇల్లు. సినిమాలో, సీరియల్స్ లో చూపిన విధంగా.. చాలా రిచ్ గా ఉంది. ఇంత రిచ్ గా ఉన్న నీరజ ఇంట్లో.. పనివాళ్ళు లేకపోవడం ఆశ్చర్యం అనిపించింది ఉషకి. 


"ఇదిగో కాఫీ.. ! తీసుకో అమ్మాయి.. "


"థాంక్స్ మేడం.. "


"నా పేరు నీరజ. నాకు పెళ్ళి అయి చాలా సంవత్సరాలు అయింది.. కానీ పిల్లలు లేరు. నాకు పిల్లలు కనడానికి ఇక అవదని డాక్టర్ చెప్పడంతో.. ఇంక జీవితం లో తల్లిని అయ్యే ఛాన్స్ లేదేమోనని బాధపడుతున్న టైం లో.. నా ఫ్రెండ్ అయిన డాక్టర్ సరళ.. నాకు ధైర్యం చెప్పి.. ఇలాగ వేరే స్త్రీ ద్వారా అద్దె గర్బం తో పిల్లల్ని కనొచ్చని చెప్పింది. నాకు చాలా డబ్బు ఉంది.. కానీ, ఇంట్లో ఆ చిన్ని నవ్వులు.. ఆ అల్లర్లు లేవు. మా అయనని ఇంకో పెళ్ళి చేసుకోమంటే, ఆయనకి ఇష్టం లేదు. నన్ను ప్రేమించి పెళ్ళిచేసుకున్నారు. నాకు నువ్వు ఉన్నావు చాలు.. పిల్లలు లేకపోయినా పర్వాలేదని అంటారు. 


ఎవరినైనా పెంచుకోవడంకంటే, సొంత పిల్లలైతే బాగుంటుందని మా ఫ్రెండ్ చెప్పడంతో ఇలా చేస్తున్నాను. నువ్వు చేస్తున్న ఈ పని వల్ల నాకు అమ్మని అయ్యే అవకాశం కల్పిస్తున్నావు. మా అత్తగారు 'ఎప్పుడు నా చేతిలో మనవడిని పెడతావు.. ' అని ఒకటే గోల పెడుతున్నారు. ఆవిడ పెద్ద కొడుకు దగ్గర అమెరికా లో ఉంటారు. పెద్ద కొడుకు అమెరికాలో పెద్ద పొజిషన్ లో ఉన్నాడు. అప్పుడప్పుడు ఇక్కడకు వస్తుంది. ఈసారి వచ్చేసరికి మనవడిని చేతిలో పెట్టాలని చెప్పి మరీ వెళ్ళింది.. "


"మీరు చాలా మంచివారు మేడం. మీకు అంతా మంచే జరుగుతుంది.. "


"నా బిడ్డని నీ కడుపులో తొమ్మిది నెలలు మోయ్యాలి.. బిడ్డ పుట్టిన తర్వాత, నాకు అప్పగించాలి. దానికి నీకు నేను ఇరవై లక్షలు ఇస్తాను. నచ్చితే.. ఈ అగ్రిమెంట్ మీద సంతకం చెయ్యి. ఇంకో విషయం.. ఈ విషయం ఎవరికీ తెలియకూడదు.. కావాలంటే, నువ్వు నా ఇంట్లోనే ఉండొచ్చు.. "


"అలాగే మేడం.. నెలలు నిండిన తర్వాత.. మీ దగ్గరకే వచ్చేస్తాను.. అప్పటివరకూ నేను వేరే చోట ఉంటాను. "


"అలాగే ఉష.. "


ఓకే.. అని డాక్యుమెంట్ మొత్తం చదువుకుని.. సంతకం పెట్టింది ఉష. 


"రేపు మనం డాక్టర్ దగ్గరకు.. వెళ్లి కలుద్దాము. డాక్టర్ నా ఫ్రెండ్. ఆవిడ దగ్గరుండి అన్నీ చూసుకుంటుంది.. నీకు ఏమీ భయం లేదు"


"అలాగే మేడం.. "


ఈలోపు నీరజ భర్త అక్కడకు వచ్చి.. ఉష గురించి అడిగి తెలుసుకున్నాడు. చూడగానే, ఉష పై కోరిక కలిగింది నీరజ భర్త నరేష్ కు. 


"మిస్ ఉష.. డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చేస్తాను. మా ఆవిడ కన్నా నువ్వు చాలా అందంగా ఉన్నావు. మా ఆవిడకు పిల్లల కోసం ఇంత కష్టపడడం ఎందుకు చెప్పు.. ? నువ్వు నాకు బాగా నచ్చావు. నా కోరిక నువ్వు తీరిస్తే, ఈ డాక్టర్, హాస్పిటల్ ఏమీ అక్కరలేదు.. అంతా నేచురల్ గా అయిపోతుంది. నీకు నేను ఇంకో పది లక్షలు ఇస్తాను.. ఏమంటావు?"


నరేష్ మాట్లాడిని మాటలకి.. కోపంగా చూసి అక్కడ నుంచి వెళ్లిపోయింది ఉష. అవసరం తనది.. ఏం చేస్తుంది మరి.. ! నీరజ గారి మంచితనం చూసి.. ఆమె పిల్లల కోసం తపన చూసి.. ఏమీ అనకుండా ఉంది ఉష. మొగుడు ఇలాంటి వేషాలు వేస్తే, ఏ పనివారు మాత్రం ఇక్కడ పనిచేస్తారు మరి.. ! అందుకే ఎవరూ లేరేమో.. అనుకుంది ఉష.. 


మర్నాడు డాక్టర్ ని హాస్పిటల్ లో కలిసిన ఉష.. ప్రాసెస్ మొత్తం తెలుసుకుంది. డాక్టర్ చాలా ఓపికగా అన్నీ వివరంగా చెప్పింది. అన్ని జాగ్రతలు చెప్పి.. ఉష కి ధైర్యం చెప్పింది. ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యింది. అనుకున్న ప్రకారం గర్బం దాల్చింది ఉష. నీరజ చాలా ఆనందపడింది. ఏదో తనే గర్బం దాల్చినంతగా ఆనందపడింది నీరజ.. 


"ఉష.. ! నీకు కావాల్సిన మందులు, పండ్లు అన్నీ నీకు పంపిస్తాను. అన్నీ టైం కు తినాలి.. మందులు అవీ ఖచ్చితంగా వాడాలి. నీకు ఎప్పుడైనా సాయం కావాలంటే, ఎప్పుడైనా మా ఇంటికి రావొచ్చు.. "


"అలాగే మేడం.. మీరు అంతగా చెప్పాలా.. ! నా కడుపులో బిడ్డ మీదే కదా.. ! మీరు ఎలా చెబితే అలాగే చేస్తాను.. " అంది ఉష.. 


*****


'అమ్మకి రోజు రోజుకూ నా మీద డౌట్ పెరుగుతోంది. ఇప్పుడు ఇంక ఇంట్లో ఉండడం మంచిది కాదు. ఎక్కడైనా వేరే ఇల్లు తీసుకుని వెళ్లిపోవాలి. లేకపోతే, ఇంట్లో విషయం తెలిసిపోతుంది. అప్పుడు నా మీద కోపం, నాన్న మీద చూపిస్తుంది అమ్మ. అది నేను అస్సలు భరించలేను.. ' అని అనుకుంది ఉష 


ఉష భయపడినట్టుగానే.. ఒక రోజు సాయంత్రం ఇంట్లో తన విషయం తెలిసిపోయింది. 


=================================================================================

ఇంకా వుంది.. 

బాధ్యత - పార్ట్ 2 త్వరలో

=================================================================================

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:



Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు

తాత మోహనకృష్ణ




166 views0 comments

Comments


bottom of page