top of page
Writer's picturePratap Ch

బాధ్యత

వారం వారం బహుమతులలో ఎంపికైన కథ (Weekly prize winning story)


'Badhyatha' - New Telugu Story Written By Ch. Pratap

Published In manatelugukathalu.com On 30/11/2023

'బాధ్యత' తెలుగు కథ

రచన: Ch. ప్రతాప్

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



సాయంత్రం అయిదు గంటలు అవుతోంది. ఐటి టవర్స్ పదో అంతస్తులో చాంబర్ లో వున్న నా మనస్సు అల్లకల్లోలంగా వుంది. ఆలోచనల ఒత్తిడి తీవ్రంగా వుంది. అందుకు కారణం ఈ రోజు ఉదయం ఇంట్లో నాకు ప్రణవి మధ్య జరిగిన వాగ్వివాదం.అందుకు కారణం ఏమిటో తెలుసుకోవాలంటే నా జీవితం రెండేళ్ళ ముందుకు రీవైండ్ చేయాలి.


మా పెళ్ళి జరిగి రెండు సంవత్సరాలు అయ్యింది. భాగ్యనగరంలో ఒక ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కోర్సులో ఇద్దరం క్లాస్ మేట్ . ఇద్దరం క్లాస్ లో ర్యాంకుల కోసం తీవ్రంగా పోటీపడేవాళ్ళం. ఆ స్పర్ధ నెమ్మదిగా స్నేహంలోకి మారి. ఆఖరు సంవత్సరం కు వచ్చేసరికి ప్రేమగా మారింది. ఉద్యోగం వచ్చాక పెళ్ళి కూడా చేసుకోవాలనుకున్నాం. అందరు ఐ టి ప్రొఫెషనల్స్ వలే ఎన్నో ఆశలు, ఆశయాలు మా ఇద్దరిలో వుండేవి.ఇద్దరికీ మంచి ఉద్యోగాలు, లక్షల్లో జీతాలు, సామాజిక హోదా, కార్లు, బంగళాలు,విదేశాలలో హాలీడే ట్రిప్స్ ఇత్యాదివి. కులాలు వేరైనా పిల్లలు ఇష్టపడుతుండడంతో ఇరుపక్షాలు అంగీకరించి పెళ్ళి చేసారు. మా ఇద్దరికీ బెంగుళూరులో సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చాయి. జీవితం మూడు సినిమాలు, ఆరు డిన్నర్లుగా సాగిపోతోంది.


అయితే ఇంతలో మా అమ్మ హఠాత్తుగా కన్ను మూసింది. నేనొక్కడినే కొడుకును కావడాన్న మా నాన్నగారిని దశ దిన కర్మలు పూర్తయ్యాక బెంగుళూరు తీసుకొచ్చేసాను. తులసీ వనంలో గంజాయి మొక్కలా ఆ పరిస్థితి అవుతుందని, ఆ మహా పట్టణంలో నేను ఇమడలేనని. స్వగ్రామంలోనే ఏదో విధంగా జీవితం నెట్టుకొస్తానని ఆయన ఎంతగా ప్రాధేయపడినా నేను వినకుండా తండ్రి నా కళ్ళెదుటే వుంటాడన్న ఆలోచనతో బలవంతంగా తీసుకొచ్చేసాను. మొదటి రెండు మూడు నెలలు బాగానే వుంది. ఆ తర్వాతే అసలైన బాగోతం మొదలయ్యింది.


నాన్నగారి కట్టు, మాటతీరు,అలవాట్లు ప్రణవికి ఏ మాత్రం నచ్చేది కాదు. పల్లెటూరి బైతు అని అసహ్యించుకునేది.. కొన్నిసార్లు ఆయన ముఖం మీదే దిక్కుమాలిన అలవాట్లు, దిక్కుమాలిన మనుష్యులు, పల్లెటూరి సంత లాంటి పదాలు వాడేది. అమ్మ బ్రతికివున్నంత వరకు మహరాజులా ఒక వెలుగు వెలిగిన నాన్నగారు ఆ సూటి పోటి మాటలకు ఎంత బాధపడేవారు అన్నది నాకు అర్ధం అయ్యింది. అయితే ప్రణవి మీద ప్రేమ నన్ను ఒక్క మాట కూడా అననివ్వకుండా కట్టిపడేసేది.


చిన్నగా మొదలైన మనస్పర్ధలు చిలికి చిలికి గాలివానగా మారి ఆఖరుకు ఆయనను ఇంట్లోంచి పంపించేయమని పంతం పట్టే వరకు వచ్చింది. నేను ఈ వయస్సులో ఆయన ఎక్కడికి వెళ్తారని , చావైనా, రేవైనా ఆయన జీవితం మనతోనే వుండాలని ప్రణవిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. అయితే నా ప్రయత్నంలో న్ను ఒక శాతం కూడా సఫలం కాలేకపోయాను.


ఒక రోజు ఉదయం నిద్ర లేవడంతోనే సరిగ్గా అదే విషయంపై పెద్ద గొడవ అయ్యింది. ఈ వీకెండ్ కు వెళ్ళి ఆయనను వృద్ధాశ్రమంలో చేర్పించకపోతే, నేను ఇంట్లోంచి వెళ్ళిపోతానని ప్రణవి నాతో వాదనకు దిగింది. నేను మొదట్లో ఆమెను కన్విన్స్ చేయడానికి శాయశక్తులా ప్రయత్నించాను కాని ప్రణవి తన పట్టు విడవలేదు. దానితో ఇద్దరి మధ్య వాదన పెరిగి పెద్దదై నేను ఆవేశంలో ఆమె చెంప చెళ్ళుమనిపించాను. దానితో వెంటనే సూట్ కేసు తీసుకొని గుడ్ బై చెప్పి ఇంట్లోంచి బయటకు వెళిపోయింది ప్రణవి. ఈ తతంగం చూసిన నాన్నగారికి బి పి పెరిగి పోయి కుర్చీలో కూలబడిపోయారు. ఆయనను ఆసుపత్రికి తీసుకువెళ్ళి చెకప్ చేయించి , మందులు కొని తిరిగి ఇంట్లో దింపి, పక్క ఫ్లాట్ వేరిని ఆయనను కాస్త చూస్తుండమని చెప్పి నేను ఆఫీసుకు వచ్చాను. ఎంత సేపు ఆలోచించినా మా నాన్నగారి సమస్యకు పరిష్కారం తోచలేదు. ప్రణవి చెప్పినట్లు నాన్నగారిని స్వగ్రామానికి పంపలేను. అక్కడ వున్న చిన్న ఇంటిని ఆయన ఇక్కడకు వచ్చేముందే అమ్మేసారు. పైగా ఆ ఊరిలో వైద్య సౌకర్యాలు చాలా తక్కువ. ఆయనను ఒక్కరినీ అక్కడ వుంచడం చాలా కష్టం. ఇక్కడ వృద్ధాశ్రమంలో చేర్పించడానికి నా మనస్సు ఎంత మాత్రం ఒప్పుకోవడం లేదు. చెట్టంత కొడుకు బ్రతికి వుండగా తండ్రిని వృద్ధాశ్రమంలో చేర్పించడం ఎంత పాపం ?పైగా లోకం ముఖం మీద ఉమ్మేసి పోదూ?


నాలుగు రోజుల తర్వాత నాన్నగారు కోలుకున్నారు. ఒకరోజు రాత్రి నన్ను పిలిచి తనను వెంటనే వృద్ధాశ్రమంలో చేర్పించమని గట్టిగా చెప్పారు. నా జీవితంలో చరమంకానికి నేను చేరుకున్నాను. మీ ఇద్దరికీ ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు వుంది. నా మూలంగా మీరు మీ జీవితాలను నరకప్రాయం చేసుకోవద్దు. ఒకవేళ మీరు నన్ను చేర్పించకపోతే నేనే వెళ్ళిపోయి చేరిపోతాను అని ధృఢంగా చెప్పడంతో నేను ఇక ఏమీ మాట్లాడలేకపోయాను. ఆ నిర్ణయాన్ని ప్రణవికి చెప్పాను. ఆమె ఇన్నాళ్ళకు తవ వ్యూపాయింట్ అర్ధం చేసుకున్నందుకు చాలా సంతోషంగా వుందని చెప్పింది. ఆయనను వృద్ధాశ్రమంలో చేర్పించాక తిరిగి వస్తానని చెప్పింది.


రేపే అందుకు ముహూర్తం. నేను బ్రతికి వుండగా నాన్నగారిని వృద్ధాశ్రమంలో చేర్పించాల్సివస్తున్నందుకూ లోలోపల అంతరాత్మ తీవ్రంగా క్షోభిస్తోంది. రాత్రంతా నాకు నిద్ర లేదు. ఉదయం భారంగా తెల్లవారింది. కాఫీ, టిఫిన్లు పూర్తయ్యాక నేను నాన్నగారిని తీసుకువెళ్ళి వృద్ధాశ్రమంలో చేర్పించేసాను. ప్రతీ ఆదివారం వచ్చి చూసి వెళ్తానని ఆయనకు మాట ఇచ్చాను. అప్పటివరకు ఎంతో నిబ్బరంగా వున్న నాన్నగారు ఆఖరుసారిగా నన్ను గట్టిగా .కౌగలించుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ ఘటన నాకు జీవితంలో కెల్లా అత్యంత విషాదమైన ఘటనగా అనిపించింది.ఆకాశంలా గంభీరంగా గర్జించినా, ఉరిమినా, అంతలోనే చల్లనైన కరుణా వర్షాన్ని కురిపించడం ఒక్క నాన్నాకే సాధ్యం.


చాలా మంది వృద్ధాప్యాన్ని శాపంగా భావిస్తారు. ఆ వయస్సులో ఎలా గడపాలా అని మధ్య వయస్సు నుంచి ఆలోచన చేస్తుంటారు. వృద్ధాప్యంలో పిల్లలు తమను కళ్ళల్లో పెట్టుకుని చూడాలని ఆశిస్తారు. తమ ఆలనా పాలనా చూడకపోవడంతో వృద్ధాశ్రమాల్లో చేరుతున్న వారు కొందరైతే.. నేటి ఆధునిక సమాజంలో పిల్లలు చూసే పరిస్థితి ఉన్నా ఉద్యోగాల నిమిత్తం దూర ప్రాంతాల్లో ఉండడంతో వృద్ధాశ్రమంలో చేరుతున్న వారు మరికొందరు.


ఇంట్లో వృద్ధులు ఉంటే వారి ఛాదస్తం భరించాల్సి వస్తుందని భావించి, కొందరు వృద్ధాశ్రమాలకు పంపుతున్నారు. మంచంలో ఉన్న వృద్ధులకు సేవలు చేయడం కష్టంగా భావించి వైద్య సదుపాయాలున్న ఆశ్రమాల్లో చేర్పిస్తున్నారు. పేద కుటుంబాల్లో వృద్ధులను భారంగా భావిస్తున్న కుటుంబ సభ్యులు కొందరు ఉచిత వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తున్నారు. అనారోగ్యంతో శుచి, శుభ్రత తగ్గిన వృద్ధులను ఇంట్లో ఉంచుకుంటే వారి వల్ల తమ పిల్లలు అనారోగ్యం బారిన పడతారని ఇంకొందరు వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తున్నారు.


పెద్దవారిని వారి జీవిత చరమాంకంలో కళ్ళలో పెట్టుకొని చూడాల్సిన పిల్లలు తమ తమ బాధ్యతలను విస్మరించి వరిని వృద్ధాశ్రమాలలో చేర్పించే ఘటనలు పేపర్లో చదివినప్పుడు వీరావేశంతో విమర్శించే తాను ఇప్పుడు తన విలువలను పాతిపెట్టి అదే చర్యకు పాల్పడ్డాడు. తనకు, చదువు లేని వారికి ఇక తేడా ఏమిటి ? పరులను విమర్శించే నైతిక విలువ తనకు ఎక్కడ వుంది ?


కొద్ది రోజులకు జరిగిన ఒక సంఘటన నాకు కనువిప్పు కలిగించింది. మా ఇంట్లో వంటతో పాటు ఇంటి పనులు చేసే రంగమ్మ వచ్చి పెద్దవారికి సరిపోయే పాత బట్టలు, దుప్పట్లు ఏమైనా వుంటే ఇవ్వమని అడిగింది. . ఎందుకని అడిగితే చెప్పింది. తన మావగారికి వయస్సు 70 ఏళ్ళని, ఇప్పుడిప్పుడే శరీరం పటుత్వం తప్పి తరచుగా అనారోగ్యం పాలవుతున్నాడని, అతనికి మంచి చెడు అన్నీ తాను, తన భర్తే చూస్తున్నారని చెప్పింది. మందుల ఖర్చులు ఎక్కువవుతున్నందున సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న తన భర్త ఓవర్ టైములు చేస్తుంటే తాను మరి రెండు ఇళ్ళల్లో అదనంగా పనులు కుదుర్చుకుంది.


తన తండ్రి అంటే నా భర్తకు ప్రాణంతో సమానం. ఆయనకు చిన్న కష్టం కలిగినా తట్టుకోలేడు.పని చేసి ఎంత అలిసిపోయి ఇంటికి వచ్చినా తండ్రి పక్కన కూర్చోని స్వయంగా సపర్యలు చేస్తాడు. అటువంటి కొడుకు వున్నందుకు నిజంగా నా మావగారు ఎంతో అదృష్టం చేసుకొని వుండాలి. అందుకే వేణ్ణీళ్ళకు చణ్ణీళ్ళుగా నా వంతు సాయం చేస్తున్నాను అని ఎంతో గర్వంగా చెప్పింది రంగమ్మ.


ఆ మాటలకు నాలో అంతర్మధనం మొదలయ్యింది. కనిపించని దైవం కన్నా కనిపెంచే అమ్మానాన్న మిన్న.సిరిసంపదలు ఎన్ని ఉన్నా కూడా తల్లి దండ్రులను ప్రేమించని జీవితం సున్నా అని ఆ క్షనంలో నాకు అనిపించింది. పిల్లల భవిష్యత్ కోసం తమ సుఖ సంతోషాలను వదులుకొని వారి భవిష్యత్ తీర్చిదిద్దే వారే తల్లిదండ్రులు. ఏమి ఇచ్చిన వారి రుణం తీర్చుకోలేము. ఈ విషయం నాకు జీవితంలో ఎంతో ఆలస్యంగా అర్ధమయ్యింది.


నిరక్ష్యారాస్యులైన రంగమ్మ దంపతులు చాలీచాలని జీతాలతో సతమతమవుతునే జీవితం చరమాంకంలో వున్న తమ తండ్రిని కళ్ళలో పెట్టుకొని అపురూపంగా చూసుకుంటున్నారు. నెలకు లక్షలు సంపాదిస్తున్న తాము ఆయనను గాలికొదిలేసాము. ఇదేనా చదువు తమకు నేర్పిన సంస్కారం ? తల్లిదండ్రులు ఉగ్గుపాలతో తమకు అందించిన నైతిక విలువలు ఏమయ్యాయి ?

ఆ క్షణంలో హరిహరాదులు అడ్డు పెట్టినా సరే సరే తండ్రిని తిరిగి ఇంటికి తెచ్చేసుకోవాలన్న నిర్ణయం తీసుకున్నాను. అదే నిర్ణయాన్ని ప్రణవికి ధృఢ కంఠంతో చెప్పాను.

మళ్లీ ఇదేమి పిచ్చి పని, ఇలా చేస్తే విడాకులిస్తానని బెదిరించబోయింది. " యూ డర్టీ కంట్రీ బ్రూట్, షటప్" అని లాగి పెట్టి చెంప చెళ్ళుమనిపించాను. నువ్వు విడాకులిస్తే నాకెం అభ్యంతరం లేదు. దర్జాగా రెండో పెళ్ళి చేసుకుంటాను. మొగుడి తల్లిదండ్రులను గౌరవించలేని నువ్వు వున్నా చచ్చినా ఒకటే. నౌ గెటవుట్ ఫ్రం మై హౌస్" అని కారు తాళాలు తీసుకొని వృద్ధాశ్రమానికి బయలుదేరాను.


ఆ నిర్ణయం తీసుకున్న వెంటనే నా మనసులో నుండి అన్ని ఆందోళనలు తొలగి ప్రశాంతంగా, హాయిగా అనిపించింది. నా పట్టుదల, ఆవేశం చూసిన ప్రణవి కళ్ళప్పగించి స్థాణువై శిలాప్రతిమలా నిలబడిపోయింది.

***

Ch. ప్రతాప్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు Ch. ప్రతాప్. నేను వృత్తి రీత్యా ఒక ప్రభుత్వ రంగ సంస్థలో సివిల్ ఇంజనీరుగా పని చేస్తున్నాను. ప్రస్తుత నివాసం ముంబయి. 1984 సంవత్సరం నుండే నా సాహిత్యాభిలాష మొదలయ్యింది. తెలుగు సాహిత్యం చదవడం అంటే ఎంతో ఇష్టం. అడపా దడపా వ్యాసాలు, కథలు రాస్తుంటాను.







































137 views0 comments

Comments


bottom of page