#MohanaKrishnaTata, #తాతమోహనకృష్ణ, #Bahumanam, #బహుమానం, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు
Bahumanam - New Telugu Story Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 09/12/2024
బహుమానం - తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
పూర్వం విక్రమసేనుడు పరిపాలిస్తున్న రాజ్యంలో దారుణం జరిగింది. ఒంటరిగా ఉన్న మహారాణి గారి మందిరంలోకి ఎవరో ప్రవేశించి ఆమెను హత్య చేసారు. అప్పుడు రాజుగారు పని మీద పొరుగు ఊరు వెళ్లారు. ఎంతో కట్టుదిట్టంతో ఉండే రాజ్యంలో ఇలా జరిగినందుకు రాజు చాలా విచారించాడు. దానికి కారణం తెలుసుకోమని రాజు ఆదేశించాడు. ఎంత వెతికినా, ఎవరికీ విషయం అంతు పట్టలేదు. ఇదేదో శత్రువుల పనేమోనని అనుమానించి, ఆ విధంగా కూడా విచారించారు. కానీ, ఏమీ తెలియలేదు.
మహారాణి వారిని హత్య చేసిన వారి గురించి చెప్పినవారికి బహుమానం ప్రకటించాడు రాజు. ఈ సంఘటన వలన తన రాజ్యం పేరు దెబ్బతిన్నదని, సామంతరాజుల దగ్గర కూడా పరువు పొయిందని రాజు అందరిముందు బాధను వ్యక్తం చేసాడు.
ఒకరోజు ఒక యువకుడు రాజుగారిని ఏకాంతంగా కలవాలని కోరాడు. ముందు, అందరూ సందేహించినా, అతని మాటలు వినగా.. ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలని అనగా.. రాజు ఒప్పుకున్నాడు. ఆ యువకుడు ఏకాంతంలో రాజుగారితో..
"మీ రాజ్యంలో జరిగిన ఘోరం గురించి నాకు తెలిసింది.. ఎవరు చేసారో నేను చెప్పగలను.. " అన్నాడు ఆ యువకుడు.
"నీకు ఎలా తెలుసు.. ? నువ్వు చూసావా.. ? ఎక్కడో దూరం నుంచి వచ్చిన వాడివి లాగ ఉన్నావే.. ?" అని ప్రశ్నించాడు రాజు.
"అవును మహారాజ.. నేను ఇక్కడ వాడిని కాదు"
"మరి నీకు ఎలా తెలుసు.. ?నువ్వే చేయించావా.. శత్రురాజులతో చేయికలిపి.. ?"
"లేదు ప్రభు.. ! నన్ను అనుమానించకండి. నేను చెప్పింది వినండి.. "
"సరే.. చెప్పు.. "
"నాకు తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతున్నాయి. ఒక వారం, మా ఆవు తప్పిపోయి ఎక్కడికో వెళ్ళిపోతుందని కల వచ్చింది. మర్నాడు నిద్ర లేచి, చూసేసరికి నిజంగానే మా ఆవు కనిపించలేదు. మర్నాడు, మరో కలలో.. ఆ ఆవు ఎక్కడకి వెళ్లిందో కలలో కనిపించింది.. అక్కడికి వెళ్లి చూడగా, నా ఆవు నాకు దొరికింది. ఇలాగే, ఎన్నో విషయాలు జరిగాయి ప్రభు" అని వివరించాడు ఆ యువకుడు.
"నమ్మలేకున్నాను.. " అన్నాడు రాజు ఆశ్చర్యంగా.
"మొన్న.. మీ రాజ్యంలో మహారాణి గారిని ఎవరో హత్య చేసినట్టుగా కల వచ్చింది.. అలాగే ఇక్కడ జరిగింది. రేపు ఇక్కడ నాకు వచ్చే కలలో.. ఆ హత్య ఎవరు చేసారో తెలుస్తుంది.. " అన్నాడు ఆ యువకుడు.
రాజు అతని సంగతి ఏమిటో తెలుసుకుందామని.. ఆ రోజు రాత్రి అక్కడే అతని బసకి అన్ని ఏర్పాట్లు చేయించాడు. మర్నాడు ఉదయం.. రాజు యువకుని మందిరానికి వచ్చి.. అతను లేచిన వెంటనే, అతను చెప్పే విషయం కోసం వేచి చూస్తున్నాడు.
నిద్రలేచిన ఆ యువకుడు ఎదురుగా మహారాజు గారిని చూసేసరికి, చమటలు పట్టాయి. కంగారుగా చుట్టూ చూస్తూ పారిపోవడానికి చూసాడు. వెంటనే, అది గమనించిన మహారాజు..
"చాలా కంగారు పడుతునట్టున్నావు.. ? కలలో నిజం ఏమైనా తెలిసిందా.. ?"
"అది.. అది.. మరి.. మహారాజా.. ! నాకు వచ్చిన కల ఈసారి తప్పుగా వచ్చిందేమో.. ? "
"నీకొచ్చిన కల నిజమే.. ! మహారాణివారిని హత్య చేసింది నేనే.. ! " అంటూ ఆ యువకుడు పారిపోకుండా కత్తితో అడ్డుకున్నాడు మహారాజు.
"మహారాణిగారిని హత్య చేసింది మీరా.. ? " అన్నాడు అతను.
"అవును నిజమే.. ! నీ గొప్పతనానికి మెచ్చుకోక తప్పట్లేదు. ఆ రోజు నేను అలా చేయక తప్పలేదు. పొరుగు రాజ్యానికి పని మీద వెళ్ళిన నాకు, అక్కడ ఒక సౌందర్య రాశి కనిపించింది. ఆమెను పెళ్ళి చేసుకుంటానని అడిగాను. దానికి ఆమె, తనకి మహారాణి హోదా కావాలని, తనకు పుట్టబోయే వాడే యువరాజు కావాలని, దానికి నా భార్య అడ్డంగా ఉండకూడదని షరతు పెట్టింది. ఆమె కోసమే, నేను ఒక పధకం ప్రకారం ఊరిలో నేను లేనని అందరినీ నమ్మించి.. ఒక రోజు రాత్రి దొంగ లాగ వచ్చి నేనే ఈ హత్య చేసాను. వేరే వారిని ఈ పనికి నియమిస్తే, రహస్యం బయటకు వస్తుందేమోనని నేనే ఈ హత్య చేసాను" అని చెప్పాడు మహారాజు.
"రాజు అయి ఉండి కూడా.. మీరు ఇలా చేస్తారా.. ?" అని గట్టిగా అడిగాడు ఆ యువకుడు.
"ఇంత తెలుసుకున్న నీ ప్రతిభకు.. ప్రకటించిన దానికంటే పెద్ద బహుమానమే ఇవ్వాలి. దానితో పోయిన మా పరువు తిరిగి వస్తుంది.. నేను అనుకున్నది కూడా నెరవేరుతుంది".
"పెద్ద బహుమానం కోసం ఆశపడి ఇక్కడకు వచ్చాను. కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు.. నన్ను ఏమీ చేయకండి మహారాజా.. " అని వేడుకున్నాడు ఆ యువకుడు.
"నేను ప్రకటించినట్టుగా.. నువ్వు కోరినట్టుగా.. నీ ప్రతిభకి మెచ్చి, పెద్ద బహుమానం మీ కుటుంబానికి అందిస్తాను.. దానితో నాకూ మంచి పేరు వస్తుంది".
ఆ యువకుడు బతికుంటే తనకి ఎప్పటికైనా ప్రమాదమే అని తలచిన రాజు.. మహారాణిని హత్య చేసింది ఆ యువకుడే నని.. తనని కూడా చంపడానికి వచ్చి, కత్తి దూసాడని అందరినీ నమ్మించి.. వెంటనే అతనిని ఉరి తీయించాడు.
********
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు
తాత మోహనకృష్ణ
Comentários