top of page
Writer's pictureKaranam Lakshmi Sailaja

బలమైన బంధాలు



'Balamaina Bandhalu' - New Telugu Story Written By K. Lakshmi Sailaja

Published In manatelugukathalu.com On 29/07/2024

'బలమైన బంధాలు' తెలుగు కథ

రచన: కే. లక్ష్మీ శైలజ

కథా పఠనం: పద్మావతి కొమరగిరి



మార్గశిర మాసపు చలికి సూర్యుడు కూడా మబ్బులచాటున దాక్కున్నట్లున్నాడు. ఉదయం పదిగంటలైనా ఇంకా లేలేత వెలుగులే ప్రసరిస్తూ ఉన్నాడు. చదువుకునే పిల్లలూ, ఉద్యోగాలు చేసే పెద్దలూ.. అందరూ బయటకు వెళ్ళిన సమయం. 


 అప్పుడు “మధూ, మా ఇంట్లో ఆదివారం జరుగబోయే ‘సత్యనారాయణ స్వామి వ్రతం’ కు రమ్మని పిలవడానికి మీ ఇంటికి వస్తుందట” అని చెప్పింది, కూతురు మాధవికి ఫోన్ చేసి నాగవేణి. 


 “అవునా! ఏ టైం లో వస్తోంది?” అంది మాధవి. 


 “సాయంత్రం వస్తారట” అని నాగవేణి చెప్పగానే

“సరేలేమ్మా. ఆ సమయానికి నేను పిల్లలను తీసుకొని షాపింగ్ కు వెళ్తాలే” అని జవాబిచ్చింది మాధవి. 


 “అందుకే మధూ, ముందుగా చెప్దామని చేశాను” అన్నది నాగవేణి. 


 “అంతేలే. మంచిపని చేశావు” అంది మాధవి. 


 అమ్మయ్య. ఒక పని అయిందన్నట్లు ఫోన్ సోఫాలో పెట్టీ, టి. వి. సీరియల్ ‘విబేధాల విరజాక్షి’ చూడటం లో మునిగిపోయింది నాగవేణి. 


ఆమె కోడలి గురించి కూతురికి చేసిన ఫోన్ వల్ల కోడలు, కూతురే కాదు కొడుకు కూడా వాళ్ళతో కలవ లేక పొయ్యాడు. కోడలి పేరెత్తకుండా అలా మాట్లాడటం ఆమెకు అలవాటు. కూతురు, అల్లుడు కూడా అదేవూర్లో ఇరవై కిలోమీటర్ల దూరం లో ఉన్నారు. కొడుకు, కూతురు ఇద్దరూ కవలపిల్లలు. కోడలు..కూతురుతో కలిసి సంతోషంగా మాట్లాడటానికి విముఖత చూపించే నాగమణి, కోడలు వెళ్ళే సమయానికి కూతురు ఇంట్లో ఉండకుండా వుండటానికి శతవిధాలా ప్రయత్నించి విజయం సాధించింది. అమ్మ చెప్పినట్లు చేస్తేనే అమ్మకు సంతోషమని మాధవి అనుకుంటుంది. 


 అమ్మకిచ్చిన మాట ప్రకారం ఆరోజు సాయంత్రం మాధవి తనభర్త మౌర్య, పిల్లలు మయూర్, మయూరి లతో షాపింగ్ కు వెళ్ళింది. సుమన, మనోజ్ వాళ్ళ కొడుకు ఆదిత్యలతో కలిసి మాధవి వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి మాధవి వాళ్ళ అత్తగారు, మామగారు మాత్రం ఉన్నారు. 


 “రండి. రండి. కూర్చోండి. మౌర్య, మాధవి పిల్లలతో కలిసి ఇప్పుడే మాల్ కు వెళ్ళారు. మీరు వస్తారని తెలిసినట్లు లేదు” అంటూ ఆహ్వానించారు. 


 “అరెరే. మేము ముందుగా ఫోన్ చేసి రావాల్సింది” అన్నాడు మనోజ్ విచారంగా. 


 “అవును. ఈ సారి అలా చేద్దాం” అంది సుమన కూడా. 


 “కరోనా టైం లో ఇల్లు కట్టుకున్నాము కదత్తయ్యా! అప్పుడు ఎవరినీ పిలవలేదు. అందుకని ఇప్పుడు బంధువులందరినీ పిలుచుకొని పూజ చేసుకుందామని అనుకున్నాము” అన్నాడు మనోజ్. 


 అత్తయ్య చిరునవ్వుతో చూస్తే..“మంచి పని చేస్తున్నారు. మానవుడు సంఘజీవి. నలుగురిలో కలవటానికే ఇష్టపడతాడు. తప్పకుండా వస్తాం” అన్నారు మాధవి మామయ్య. 


 అక్కడినుండి మాధవికి ఫోన్ చేసి, రేపు పూజకు తప్పకుండా రమ్మని చెప్పి వచ్చారు వీళ్ళు. 


***


 “ శ్రీ సత్య నారాయణుని సేవకు రారమ్మా

 మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా”


 ఆ రోజు ఉదయం ఫోన్ లో పాట వింటూ ఇంట్లో పూజకు రెడీ చేసుకుంటున్నారు సుమన వాళ్ళు. 


 “పెద్దత్తయ్యా, అత్తయ్యా..పూజ మండపం అలంకరించాను. సరిపోయిందాండి” సత్యనారాయణ స్వామి పటానికి కనకాంబరం, జాజిపూలు కలిపి కట్టిన మాల వేసి సరిచేస్తూ అడిగింది సుమన, నాగవేణినీ నాగవేణి అక్క కృష్ణవేణినీ. 


 “ఆ.. ఆ.. బాగుంది లేమ్మా” అంది అక్కడే కూర్చొని పంచామృత ప్రసాదానికి ఐదురకాల పళ్ళను సన్నసన్న ముక్కలుగా చేస్తున్న కృష్ణవేణి మండపం చూస్తూ సంతోషంగా. 


 “సరిపోయిందిలే” అని పుల్ల విరిచినట్లు జవాబిచ్చింది నాగవేణి కూడా ఒకసారి అటు చూసి. 

 

 కూతురు ఇంట్లో ఫంక్షన్ అంటే రెండు కాళ్ళూ ఒక చోట పెట్టకుండా పనిచేసే నాగవేణి.. కోడలేదైనా ఫంక్షన్ చేసుకుంటూ వుంటే మాత్రం నడుం నొప్పి, కాళ్ళు నొప్పి అంటూ ఉంటుంది. మనోజ్ వాళ్ళ నాన్న అది గమనించినా గమనించనట్లే ఉంటాడు. ఆమెకు కోపమొస్తే ఇంట్లో ఎవరికీ తెలియకుండా తనను, తన పూర్వీకులనూ తిట్టిపోస్తుందని తెలుసు. తన కూతురు కంటే కోడలు అందంగా వుందనీ, ఎక్కువగా చదువుకుందనీ అమెకు అసూయ. అది మాధవితో చెప్పి విభేదాలు సృష్టిస్తుంది. 


 అందుకని సుమన పెద్దత్తయ్య కృష్ణవేణిని ముందుగా రమ్మని పిలిచింది. కృష్ణవేణి వాళ్ళు పక్కనే ఉన్న కోడూరు లో ఉంటారు. కృష్ణవేణి ఎంతో సమన్వయంగా ఇంట్లో అందరితో కలిసిపోతుంది. ఎవరి మాట తోసి పారెయ్యదు. ఇక్కడ తన చెల్లెలు సుమనను ఇబ్బంది పెడుతోందని తెలుసు కనుక చెల్లెలికి కోపం రాకుండా సుమనకు సహాయం చేస్తుంది. తన అక్కే కనుక నాగవేణి కృష్ణవేణిని ఏమీ అనకుండా చూస్తూ వుంటుంది. 


 తొమ్మిది గంటలకు పూజారి గారు వచ్చి సలక్షణంగా పూజ చేయించారు. పూజ టైంకు బంధువులందరూ వచ్చారు. 


 అపార్ట్మెంట్ సెక్రెటరీ గారు ఆ రోజు వాచ్మెన్ తో “వెహికల్స్ అన్నీ బైటేపార్క్ చేయించి, పార్కింగ్ ఏరియా అంతా వాటర్ పైప్ పెట్టీ నీళ్ళు పట్టి క్లీన్ చెయ్యి. షామియానాలు, కుర్చీలు, వేసేటప్పుడు కూడా నువ్వు దగ్గరుండి పని చేయించు” అని చెప్పారు. 

 

 అపార్ట్మెంట్ లో వాళ్ళందరూ కూడా ఆ మాటకు సహకరించారు. “ఈ ఒక్కరోజు వెహికల్స్ బైట పెట్టుకుంటాములె” మ్మన్నారు. పూజ, భోజనాలు కింద బేస్మెంట్ లోనే జరిగిపోయాయి. 


 “మనోజ్.. ఇల్లు బాగుందిరా. నాలుగు రూముల అపార్ట్మెంట్ కాబట్టి ఒకటి స్టోర్ రూం గా కూడా ఉపయోగించుకోవచ్చు. మిగతా మూడు రూములూ బెడ్రూములుగా వుంటాయి” అన్నాడు మనోజ్ పెదనాన్న కొడుకు యశ్వంత్. 


 “అవును అప్పుడు వీడి భార్య కూడా వీడికి ఇప్పుడు అందంగా కనపడుతుంది” అన్నాడు మనోజ్ మేనమామ కొడుకు భరద్వాజ్. 


 “అదేమిటి? సుమన అందంగానే వుంది కదా!?” అంది భరద్వాజ్ భార్య గీత. 


 “ఇల్లు ఇరకటం ఆలి మరకటం అంటారు కదా? ఇల్లు విశాలంగా వుంటే మనసు ప్రశాంతంగా వుండి, భార్య అందంగా లేకున్నా.. అందంగానే కనపడ్తుందట. అదే చిన్నఇల్లయితే అందంగావున్నా కోతిలాగా కనపడ్తుందట” అన్నాడు భరద్వాజ్ నవ్వుతూ. ఆ మాటలకు పక్కనున్న బంధువులందరూ కూడా భరద్వాజ్ నవ్వుతో శృతి కలిపారు. 


 కానీ నాగమణికి మాత్రం కోపమొచ్చేసింది. తన కూతురి ఇల్లు మూడు రూమ్స్ అపార్ట్మెంట్. కానీ కోడలి ఇంటిని అందరూ పొగడటం ఆమెకు కష్టమైంది. విసురుగా అవతలికి వెళ్ళింది. 


 పదిగంటల పైన మాధవి వాళ్ళ కుటుంబం వచ్చింది. మాధవి రాగానే వాళ్ళమ్మ “మాధవీ.. రా. ఇక్కడ కూర్చో” అంది, తన పక్కన కూర్చోమన్నట్టు. 


మాధవి వచ్చి కూర్చొని, వాళ్ళమ్మ మాట్లాడమని చెప్పిన వాళ్ళతో మాత్రం మాట్లాడుతూ కూర్చుంది. 

 

 ముందురోజు కానీ ఆ రోజు ఉదయం కానీ వచ్చి తన తోబుట్టువు ఇంట్లో శుభకార్యానికి చేదోడువాదోడుగా ఉండకుండా ‘నేను ఆడపడుచును. నేను పని చెయ్యను. నన్ను గౌరవించాలి‘ అన్నట్లు కూర్చోవడం కొంతమంది బంధువులు వింతగానూ, కొంత మంది జాలిగానూ చూశారు. జాలి ఎందుకని మాధవికి అర్థం కాదు. బంధుత్వం పోగొట్టుకుంటే రాదని ఆ పిల్లకు తెలియదు. తను కట్టుకున్న కొత్త చీర అందరికీ చూపించుకుంటూ, అందరితో ఫోటోలు మాత్రం తీయించుకుంటూ దూరపు బంధువులాగే వుండిపోయింది మాధవి. 


 ఈ కల్మషాలు ఏమీ తెలియని వాళ్ళ పిల్లలు మాత్రం చక్కగా కలిసి ఆడుకుంటూ ఉన్నారు. మొదట మాధవి పిల్లలు అమ్మమ్మ అరుస్తుందేమోనని కొంచెం దూరంగా ఉన్నా, కాసేపటికి ఆదిత్యతో కలిసిపోయారు. 


 “మయూర్ బావా, నాకు మా స్కూల్ లో స్పోర్ట్స్ పోటీలలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది తెలుసా!” అన్నాడు ఆదిత్య. 


 వెంటనే “కంగ్రాచులేషన్స్” అన్నారు మయూర్, మయూరి. అసూయకు అర్థం తెలియని పది సంవత్సరాల లోపు పసివయసు పిల్లలు వాళ్ళు. కానీ ఆ మాటలు విన్న నాగవేణి మాత్రం వుడుక్కుంది, తన కూతురి పిల్లలకు ప్రైజ్ రాలేదని. 


 మనోజ్, సుమనలకు పీటలమీద హారతి ఇవ్వడానికి మాత్రం మాధవినీ వెళ్ళమంది. మనోజ్ హారతి ఇచ్చినందుకు రెండువేల రూపాయలు ఇచ్చాడు మాధవికి. సంతోషంగా తీసుకుంది మాధవి. నాగవేణి కూడా సంతోషపడింది. 


 భోజనాలు చేద్దామంటూ అందరూ కలిసి వెళ్తుంటే మాధవి విడిగా దూరంగా కూర్చుంది. అది చూసి కృష్ణవేణి మాధవి దగ్గరికి వెళ్ళి ”మాధవీ, రా. కేటరింగ్ వాళ్ళు ఉన్నా మీ వయసు పిల్లలందరూ వడ్డనకు సహాయం చేయండి. మనవాళ్ళకు మనం వడ్డించుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ వుంటే వచ్చే ఆనందం మళ్ళీ దొరకదు” అంటూ మాధవిని లాక్కుపోయింది, భోజనాలు దగ్గరకు. నాగవేణి అక్కవైపు కొరకొరా చూసింది, కూతురికి పని చెప్పినందుకు ఏమనలేక. 


 మాధవి సంతోషంగానే పని చేసింది. నలుగురిలో కలవడానికి ఎవరికిష్టముండదు? అది చూసి ‘అమ్మ మాటలు విని మాధవి సుమనను ద్వేషిస్తూ ఉంది. ఈ పిల్ల మనసు మంచిదే పాపం’ అనుకుంది కృష్ణవేణి. 


 పీటల మీద అందరూ ఇచ్చిన బట్టలను, గిఫ్ట్స్ ను, డబ్బును భోజనాల తరువాత మాధవి సహాయం తీసుకుంటూ సర్దిన్చింది కృష్ణవేణి. పెద్దమ్మ చెప్తే మాధవి కాదని చెప్పదు. ‘అన్ని పనులూ చక్కగా చేస్తోంది. ఎవరూ చెప్పకుంటే అది మాత్రం ఏం చేస్తుంది పాపం? తెలియని తనం’ అనుకుంది కృష్ణవేణి. 


 రెండో బంతిలోనే మాధవి వాళ్ళను కూర్చోబెట్టింది నాగవేణి. భోజనాల తరువాత “అమ్మా మేము ఇంటికి బయలుదేరుతున్నాము” అంది మాధవి హ్యాండ్ బ్యాగ్ తీసుకుంటూ. 

వెంటనే నాగవేణి కంటే ముందు కృష్ణవేణి మాట్లాడుతూ “అదేంటి మాధవీ! అందరితో పాటు నువ్వూ అప్పుడే వెళితే ఎలా? ఇంటి ఆడపడుచువి..ఇంట్లో ఎక్కడి సామాను అక్కడే ఉంది. అమ్మకు, సుమనకు సర్డడంలో కొంచెం సాయం చేద్దాం. ఈ ఊర్లోనేగా మీరుండేది. సాయంత్రం నిదానంగా వెల్దురులేమ్మా!” అంటూ ముందు కొంచెం గంభీరంగానూ, తరువాత కొంచెం అనునయంగానూ మాధవిని వారించి, చేయవలసిన పని సూచించింది. 


 తరువాత “మాధవీ. ఇళ్ళకు వెళ్తున్న వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్స్ ఇద్దాము రా” అంటూ బయట గేట్ దగ్గరకు తీసుకొని వెళ్ళింది మాధవిని. 


అక్కడ మనోజ్, సుమన హడావిడిగా అందరికీ గిఫ్ట్స్ ఇస్తున్నారు. బాగా అలసటతో ఉన్నారు. ఇంకా భోజనాలు చేసినట్లు లేదు. ఒక జ్యూట్ బ్యాగ్ లో స్వామి ప్రసాదం, ఒక చిన్న తులసి మొక్క పెట్టి ఇస్తున్నారు. 


 వెనక్కి తిరిగి చూస్తే నాగవేణి భోజనానికి కూర్చుంటూ ఉంది. కృష్ణవేణి మాధవికి తోడుగా బంధువుల్లో ఇంకొక అమ్మాయిని పిలిచి ఇద్దరినీ ఇంటికి వెళ్తున్న అందరికీ బ్యాగ్స్ ఇవ్వమని చెప్పింది. 


 “మనోజ్, సుమనా.. మీరు భోజనానికి పదండి. బాగా లేట్ అయ్యింది. ఇంకా లేట్ అవుతే కళ్ళు తిరుగుతాయి” అంటూ వాళ్ళను భోజనానికి పంపించింది. తను అక్కడే కుర్చీలో కూర్చొని బంధువులకు ఇంటివారి తరఫున థాంక్స్ చెప్పింది. 


 ఒక ఇరవై నిముషాలకు వెళ్ళే వాళ్ళ హడావిడి తగ్గింది. మాధవి కృష్ణవేణి దగ్గరగా వచ్చి కుర్చీని ఆనుకొని నిలబడింది. ఏదో చెప్పాలనుకుంటోందనిపించింది కృష్ణవేణికి. 


 “ఏం మాధవీ? ఇంటికి వెళ్ళాలని తొందరగా వుందా?” అంది కృష్ణవేణి. 


 “లేదు పెద్దమ్మా.. అదీ..నేను.. ” మాధవి తన మాటలు పూర్తి చెయ్యకుండా ఆగిపోయింది. 


 “ఏంటి మాధవీ?” అంటూ కృష్ణవేణి ప్రశ్నార్థకంగా చూసింది. 

 

 “అది కాదు పెద్దమ్మా. నేను ఇలా పని చెయ్యడం అమ్మకు ఇష్టముండదు కదా. కోప్పడుతుంది. అందుకని నాకు భయంగా వుంది” అంది జంకుతూ. 


 కృష్ణవేణి ఒక్క క్షణం మాధవి వైపు చూసి “కూర్చో మాధవీ” అంది కుర్చీ చూపిస్తూ. 


 “నేను ఇంటి ఆడపడచునట. నేను పని చెయ్యకూడదట. కోడళ్ళే పనిచేసుకోవాలట. అందుకని నన్ను పని చెయ్యనివ్వదు. సుమనతో స్నేహంగా ఉంటే నన్ను అలుసుగా చూస్తుందట. అందుకని సుమనతో ఎక్కువగా మాట్లాడవద్దంటోంది. పిల్లలను కూడా కలవనివ్వదు. నాకు చాలా కష్టంగా వుంటుంది. ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు” కూర్చుంటూ అంది మాధవి విచారంగా. 


 ఆ మాటలకు కృష్ణవేణి కొంచెం కోపంగానే మాధవితో ఇలా అంది. 


 “మాధవీ.. అమ్మ చెప్పినట్లు చేయకుంటే అమ్మ బాధ పడ్తుందనీ, లేదా కోప్పడుతుందని నువ్వు అమ్మ చెప్పినట్టల్లా చేస్తున్నావు. నీకూ ముప్పై ఏళ్ళు దాటాయి. చిన్నపిల్లవి కాదుగా! మంచీ చెడూ తెలుసుకోవాలిగా?“


 మాధవి తల వంచుకుని మౌనంగా వుండిపోయింది. 


 కృష్ణవేణి మళ్ళీ ఇలా అంది ”సుమన కూడా నీ వయసుదేగా. నీలాగే మీ అమ్మను చూసి భయపడుతూ ఉంది. నీతో ఎక్కువ మాట్లాడితే, నీతో పని చేయిస్తే అత్తగారు కోప్పడతారని దూరంగా వుంది. కొత్త అమ్మాయి. మనమే కలుపుకొని పోవాలి”


 తరువాత అనునయంగా “మాధవీ, ఎవరైనా తమ పిల్లలు అందరికంటే ఎక్కువగా ఉండాలని అనుకొంటారు. అలాగే మీ అమ్మకూడా. కోడలికంటే కూతురు ఎక్కువగా ఉండాలని అనుకొని, సుమనను చూసి అసూయ పడ్తోంది. సుమన వాళ్ళమ్మ ఉద్యోగం చేస్తోంది కాబట్టి మంచి చీరలు కట్టేది. మీ అమ్మకంటే బాగుంటుంది కూడా. మొదట అది మీ అమ్మకు అసూయను కలిగించింది. అక్కడనుంచి కోపాన్ని పెంచుకుంటూ వచ్చింది. 


 నీ కంటే సుమన తెల్లగా వుంది, నీ కంటే ఎక్కువ చదువుకుంది, నీ కంటే పెద్ద ఉద్యోగం చేస్తోంది. ఇవన్నీ చూసి సుమన అంటే వ్యతిరేక భావాన్ని పెంచుకుంది. నిన్ను కూడా సుమనకు దూరం చేసి, ‘నువ్వు మాకు శత్రువువి. మేము నీతో కలవము’ అన్నట్లు ప్రవర్తిస్తోంది. నేను రెండు మూడు సార్లు ‘ఇలా చేయడం తప్పు’ అని చెప్పాను కూడా. అందుకే నేను సుమనతో స్నేహంగా వుండి సలహాలు ఇస్తున్నాను. సుమన మనసు కష్టపెట్టుకోకూడదని” అంది కృష్ణవేణి. 


 “దానికి నేనేం చేయగలను!” అయోమయంగా మాధవి. 


 “ఆమె విషయం నీకు సంబంధ లేదు. సుమనతో కలిసి వుండు. ఈ కాలపు పిల్లలు మీరు. ఎప్పుడో పూర్వం లాగా ఆడపడుచులు వేధించారనే మాటలు ఇప్పుడు అవసరమా? నువ్వు తన వయసు దానివి. నువ్వైనా స్నేహంగా వుంటే సుమన సంతోషిస్తుంది. పాపం మనోజ్ ..అమ్మను, నిన్ను ఏమీ అనలేక ఇబ్బంది పడ్తున్నాడు. ఇది నువ్వు తెలుసుకోవాలి. అమ్మను నిందించకుండా సుమనతో నువ్వు కలగొలుపుగా వుండాలి. అమ్మ ఏమనుకుంటుందో అనుకోకు. అమ్మతో కూడా మంచిగా వుండు. నీలో మార్పు వస్తే మీ తోబుట్టువులిద్దరూ సంతోషంగా ఉంటారు. అప్పుడు మీ పిల్లలు కూడా బాగా కలిసి ఆడుకుంటూ పెరుగుతారు. సంతోషంగా ఎదుగుతారు. అది సమాజానికి కూడా ఎంతో మంచిది. ”


 “నేను అలా చేస్తే అమ్మ నామీద కొప్పడుతుందేమో?” అంది మాధవి మళ్ళీ. 


 “లేదు. కొద్దిరోజులకు తను కూడా మారుతుందని నాకు అనిపిస్తోంది. నీకు తెలియక నువు అమ్మ కోసం అలా చేశావు గానీ నీకు ఇష్టమై కాదు కదా? అందుకని ముందు నువ్వు ధైర్యంగా ఉండి, అందరినీ కలుపుకొని వెళ్ళు. నీలోనే ఇప్పుడు మార్పు రావాలి. నువ్వు తెలుసుకుంటే తరువాత తను తెలుసుకుంటుంది” అంది కృష్ణవేణి. 


 మాధవి “సరే పెద్దమ్మా. చూస్తాను పెద్దమ్మా” అంటూ లేచి వెళ్ళింది. కొద్దిసేపటి తరువాత కృష్ణవేణి లోపలికి వెళ్ళేసరికి పూజ మండపం దగ్గర సుమనతో కలిసి నవ్వుతూ మాట్లాడుకుంటూ పూలు, పూజా సామాగ్రి తీసి శుభ్రం చేస్తున్న మాధవి కనిపించింది. 


 ‘అమ్మయ్య. మాధవి ధైర్యంగా సుమనతో కలిసిపోతే కొద్దిరోజులకు ఈ ఇంట్లో అందరూ సంతోషంగా కనిపిస్తారు’ అనుకుంది, మాధవిలో మార్పు చూసి కృష్ణవేణి. 


 ‘తెలుసుకొనవె యువతీ..అలా నడచుకొనవె యువతీ..సాధింపులు, బెదిరింపులు ముదితలకిక కూడవనీ, హృదయమిచ్చి పుచ్చుకునే చదువేదో నేర్పాలని .. తెలుసుకొనవె యువతీ. ’


 భర్తనే కాదు..ఎవ్వరినీ సాధించడం వద్దనే పాఠం. 

సర్వులకూ సర్వదా ఆచరణీయం. 


 సమాప్తం


కే. లక్ష్మీ శైలజ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


 సమాప్తం

రచయిత్రి పరిచయం : నా పేరు K. లక్ష్మీ శైలజ.

నెల్లూరు లో ఉంటాను.

 నేను ఎం. ఏ. ఎం.ఫిల్ చేశాను.

ఇప్పటి వరకు 40 కథలు , పది కవితలు ప్రచురితమైనవి.

జూన్ 2022 న తానా గేయతరంగాలు లో గేయం రచించి పాడటమైనది.

యూట్యూబ్ లో కథలు చదవడం ఇష్టం.


58 views0 comments

Comments


bottom of page