top of page

బలి- భీమ బలి


'Bali... Bhima Bali' New Telugu Story


Written By Ch. C. S. Sarma





(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

జగన్మాత తమ కోర్కెలు తీరుస్తుందనే నమ్మకంతో ప్రజలు దేవతలకు జంతుబలులు ఇస్తుంటారు. ఇది వారి నమ్మకం… ఆనందం. అతివలను తృణప్రాయంగా చూచే గోముఖ వ్యాఘ్రాలను మాత …. మహాకాళిగా మారి… ఆ రక్త దాహాలతో శాంతి పొందుతుంది… రాక్షసత్వాన్ని నిర్మూలిస్తుంది.


ఆ వూరి మహారాజు... ఆ ఇంటి యజమాని భీమారావు... అది చిన్న గ్రామం... ఏడాది క్రిందట కరోనాతో అతని భార్య గౌరీ మరణించింది... ఆ ఇంటి పనిమనిషి రత్తమ్మ... ఆమె భర్త అమాస (అమావాస్యనాడు పుట్టాడు) భీమారావు పాలేరు. గ్రామ కాపలాదారుడు... రత్తమ్మకు ఒక కూతురు. పద్దెనిమిదేళ్లు. ఇంటర్ చదువుతూ ఉంది. భీమారావుకు ఒక కొడుకు... ఎమ్మెస్సీ బీఈడీ ముగించి... ఉద్యోగాన జిల్లా... పట్నంలో చేరాడు. అతని పేరు రంగారావు... పది రోజులు సెలవులో ఊరికి వచ్చిన అతను... రత్తాలు కూతురు మల్లికతో చనువుగా నవ్వుతూ మాట్లాడడం... భీమారావు కంటబడింది. మరుదినం కొడుకు ఇంట్లో లేని సమయంలో రత్తాలు, అమాస లను పిలిచాడు.


"దండాలు దొరా!"... చేతులు జోడించాడు అమాస...

"ఆఁ... వచ్చిండ్రా!... వికటపు నవ్వు... "చూడండ్రే!... నాకు డొంక తిరుగుడు మాటలు చేతకావు. సూటిగా ఇసయం చెబుతుండా! మీ కూతురు మల్లికంటే... నాకిష్టం. పెళ్లి చేసుకుంటా. మీ కూతురు మా ఇంటికి మహారాణి అయిపోద్ది మీరు ఊ.. అన్నారంటే... ఏమంటారు?" అడిగాడు భీమారావు.


రత్తాలు, అమాస గాడి నెత్తిన పిడుగు పడినట్లు అయింది...

భీమారావు స్వభావం ఎలాంటిదో ఆ ఇరువురికీ బాగా తెలుసు... తలలు ఎత్తలేక బాధ, భయంతో ఇరువురు తలలు ఏలాడేసారు...


"ఆ!... ఏందిరా!... జవాబు చెప్పండి” గద్దించాడు భీమారావు.

తొట్రుపాటుతో అమాస గాడు "అయ్యా!... అమ్మితో మాటాడి రేపు చెబుతానయ్యా!...” ఎంతో వినయపు జవాబు...


"సరే... వెళ్ళండి. రేపు మాపిటేళ ఆ పిల్ల ఏమందో సెప్పు. అది కాదంటే నీ పాలు కష్టాలు... ఈ భీమారావు ఎలాంటి వాడో తెలుసుగా! పొండి..." కసిరినట్లు శాసించాడు. అట్టహాసంగా నవ్వాడు...


అమాస గాడు రత్తాలు కన్నీటితో వారి ఇంటికి వెళ్లిపోయారు.


"చూడు మల్లికా!... చిన్నప్పటి నుంచి నీవంటే నాకు ఎంతో ఇష్టం... మనం పెండ్లి చేసుకుందాం. అందుకు మా నాన్న ఒప్పుకోడు. మాకు తగిన డబ్బు గల అమ్మాయిని చూచి పెండ్లి చేయడం వారి ఉద్దేశ్యం... అది నాకు ఇష్టం లేదు"... అనునయంగా చెప్పాడు రంగారావు.

ఆ మాటలను రత్తాలు అమాస విన్నారు.


"రేపు రాత్రికి మనం పట్నం వెళ్లి పోదాం. భయపడకు. అక్కడ మనం పెళ్లి చేసుకుందాం. ఈ నా నిర్ణయంలో మార్పు లేదు." వేగంగా ఇంటి నుండి బయటకు నడిచాడు రంగారావు... రత్తాలు, అమాసలను చూశాడు...


నిర్భయంగా ఆగాడు.

"నేను మీ అమ్మాయిని ప్రేమించాను. పెండ్లి చేసుకుంటాను.. మల్లిక నాది..." వేగంగా వెళ్ళిపోయాడు.


మల్లి తల్లీతండ్రిని సమీపించి "ఆ బాబు..." ఏదో చెప్పబోయింది.

"నేను... మీ నాయనా మీ మాటల్ని విన్నాం. ఆ భీమారావు నిన్ను పెండ్లి చేసుకుంటాడంట..." రత్తాలు భోరున ఏడ్చింది. తల్లితో పాటే మల్లికా అసావేరి రాగాలాపన. అమాసగాడు ఇరువురిని ఓదార్చాడు... ఆ రాత్రి వాళ్ళ పాలిట కాళరాత్రి.


***


ఉదయాన్నే లేచి అమాసగాడు కల్లుపాకను చేరాడు. మల్లిగాడు అందించిన సీసాను అందుకొని... గుటగుట త్రాగేసి, ముగిశాక చూపుడువేలిని నిటారుగా నిలబెట్టాడు... నవ్వుతూ మల్లిగాడు మరో సీసానందించాడు. మల్లి గాడికి డబ్బు ఇచ్చి అమాస భీమారావు ఇంటి వైపుకు బయలుదేరాడు. వారి ఇంటి వీధి వాకిట్లో అమాసకు శాస్త్రి గారు కనిపించారు. చేతులు జోడించి "దండాలు శాస్త్రి గారు!..." అన్నాడు.

వాసన... కల్లు వాసన శాస్త్రి గారి ముక్కుపుటాలను పగలగొట్టింది... పై పంచతో ముక్కును మూసుకుని "ఒరేయ్ అమాసా! ఏరా ఉదయాన్నే నెమలి వాహనాన్ని ఎక్కావు?” ముఖం చిట్లిస్తూ అడిగాడు.


"ఆ... ఆ... జాతర పండగ కదా సామీ!..." నవ్వాడు అమాస. క్షణం తర్వాత "ఆ... సామీ!.. తమరు ఇంత పొద్దు కాడే అయ్యగారింటికొచ్చిండ్రు... ఇసయం ఏంటీ?...” వ్యంగ్యంగా నవ్వుతూ అడిగారు అమాస.


"పెళ్లికి ముహూర్తం పెట్టా!..."

"ఎవరికి సామీ!..."

"అయ్యగారికి..."

"పిల్ల ఎవరు సామీ!..."


"నీ కూతురట కదా!..."

"ఓ...ఓ... అదా ఇసయం!..." చింత నిప్పుల్లా ఉన్న కళ్ళను పెద్దవి చేసి ఆ స్వామి ముఖంలోకి చూశాడు అమాస...

శాస్త్రికి భయమేసింది

"అవునురా!... వస్తా!..." శాస్త్రిగారు వెళ్లిపోయారు.


అమాస వేగంగా భవంతి వరండా వైపుకు నడిచాడు.

అప్పుడే నిద్ర లేచి వరండాలోకి వచ్చిన భీమారావు అమాస గాడిని... చూచాడు. చిరునవ్వుతో...

"అమాసా!... కూర్చో!..." ప్రీతిగా చెప్పాడు.


"సామే!... నేను కూకోడానికి రాలా!... ఉదయాన్నే నేను నీకో మాట చెప్పాలిగా... అందుకని వచ్చినా!..."

భీమారావు ఆనందంతో అమాస తాగాడు అనుకున్నాడు చిరునవ్వుతో.


"ఓ... అట్లాగా!... సరే... చెప్పు!..."

"నీవు కోరింది కుదరదు సామే! నన్ను చ్చమించు" తూలుతూ వేగంగా వెళ్ళిపోయాడు అమాస...

భీమారావుకి కరెంట్ షాక్ తగిలినట్లయింది. ఆవేశంతో కుర్చీలో కూలబడ్డాడు.


***


మరుదినం ఉదయం ఐదు గంటలకు గ్రామదేవత ఆలయం దగ్గర సహస్రనామ కుంకుమార్చనను, అభిషేకాన్ని జరిపి ఏడన్నరకల్లా తీర్థ ప్రసాదాలను గ్రామ వాసులందరికీ పంచిపెట్టారు...


సాయంత్రం... ఆరుగంటల నుండి కోలాటం... చెక్క భజన బృందాలు ప్రారంభించారు. పూరిజనమంతా ఆలయం వద్ద వున్నారు... తెల్లరోమం లేని నల్లమేక పోతును అమ్మవారి బలికి సిద్ధం చేశారు... పసుపు కుంకుమలు దాని ముఖానికి రాచారు. గుడిచుట్టూ మూడు సార్లు, తిప్పారు. అమ్మవారికి నేరుగా గుడిముందు నిలబెట్టారు. ఆ బలి కార్యక్రమాన్ని నిర్వహించవలసినది అమాసగాడు. అది వారి కుటుంబ పరంపర... రాంగారావు ఆరుగంటల లోపలే మల్లిక ఇంటికెళ్ళి మల్లికతో ఇంటి వెనక దారిన పొలాలు దాటి రోడ్డును సమీపించి మిత్రుడు తెచ్చిన కార్లో ఎక్కి తాను వుండే జిల్లా పట్టణం వైపుకు వెళ్ళిపోయాడు. రత్తమ్మ చెప్పినమాట, ప్రకారం.. మౌనంగా రంగారావుతో వెళ్ళిపోయింది.


ఆరుగంటలకు పని ముగించుకొని ఇంటికి బయలు దేరిన... రత్తాలును పిలిచి... "రత్తాలు! నీ కూతురు నాకు కావాలి. ఇంటికి వెళ్ళి సిద్ధం చెయ్యి. ఏడుగంటలకు కార్లో వస్తా. మేమిద్దరం పట్నం ఎల్లిపోతాం! సరేనా!..." గద్దించినట్లు అడిగాడు భీమారావు. .

విచార వదనంతో రత్తాలు తల ఆడించి ఇంటి వైపుకు వెళ్ళిపోయింది. తన భర్త అమాసను చంపుతా అని బెదిరించి కొన్ని రోజులు భీమారావు రత్తాలును వాడుకున్నాడు. ఆ కసి రత్తాలు హృదయాన్ని దహిస్తూ ఉంది...


మెడలో వేప మండల మాలతో మేకపోతు గుడి ముందు నిలబడి ఉంది. భీమారావు కార్లో ఊరి చివరన ఉన్న రత్తాలు ఇంటికి బయలుదేరాడు...

అమాస బారెడు పొడుగున్న కత్తిని మేకపోతు తలవైపున నిలబడి పైకెత్తాడు.

తప్పెట్లు తాళాలు మేళాలు జోరుగా మ్రోగుతున్నాయి.


భీమారావు కారును ఆపి దిగి రత్తాలు ఇంటి వైపుకు నడిచాడు.

ఊరి జనం అందరూ ఆనందంగా గుడి చుట్టూ గుమిగూడి వున్నారు.

"తల్లీ నిన్ను క్షమించు. ఆ దుర్మార్గుడు ఎందరి జీవితాలను నాశనం చేసినట్టు నా బిడ్డ జీవితాన్ని తప్పక నాశనం చేస్తాడు. అందునే ఈ నా నిర్ణయం..." చూర్లో దోపివున్న కొడవలిని చేతికి తీసుకుంది రత్తాలు...


"తల్లీ!... అమ్మా!... మమ్మల్ని రచ్చించు రచ్చించు అంటూ…

అమాసగాడు రెండు చేతుల్లో పైకి ఎత్తి పెట్టివున్న కత్తిని వేగంగా క్రిందికి దించాడు. మేకపోతు తల తెగిపోయి క్రిందపడింది...


భీమారావు మెల్లగా తలుపు తెరిచి వంగి తలను లోన పెట్టాడు. మరుక్షణంలో... రత్తాలు చేతిలోని కొడవలి... భీమారావు తలను తాకింది. 'బలి... భీమ... బలి..., ఆవేశంతో అరచింది... అతను కుప్పలా నేల కూలి పోయాడు. మెడ నుండి రక్తం... వికటంగా నవ్వుతూ కసితీర పిచ్చిదానిలా నవ్వింది రత్తాలు.. కొన్ని క్షణాలు... కాళ్ళు చేతులు జాడించి... కన్నుమూశాడు భీమారావు...

వారి శకం ముగిసింది...


విరబోసుకొని వున్న తల జట్టును ఎగదోసుకొని... పవిటతో ముఖాన వున్న చమటను తుడుచుకొని... సిగ ముడేసుకొని అక్కడికి మూడు కిలో మీటర్ల దూరంలో వున్నా పోలీస్ స్టేషన్ వైపుకు గణాచారిలా వేగంగా నడుస్తూ బయలుదేరింది రత్తమ్మ.

***


(అంకితం : ధనబలంతో కాంతా వ్యామోహంతో … ఆడవారిని ఆటబొమ్మలుగా భావించే ద్విపాద పశువులకు గుణపాఠం నేర్పే మహిళలకు… ఆఫీసర్లకు ఈ కథ అంకితం…)

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



Twitter Link


Podcast Link



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.

అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.

మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.

ఇప్పటి వరకు 20 నవలలు, 100 కథలు, 30 కవితలు రాశాను.



32 views0 comments

Comments


bottom of page