#KandarpaMurthy, #కందర్పమూర్తి, #బలిపీఠందద్ధరిల్లింది, #BalipithamDaddarillindi
Balipitham Daddarillindi - New Telugu Story Written By Kandarpa Murthy
Published In manatelugukathalu.com On 16/01/2025
బలిపీఠం దద్ధరిల్లింది - తెలుగు కథ
రచన: కందర్ప మూర్తి
సంక్రాంతి పండగ రోజు లొచ్చాయి. అదొక ప్రసిద్ధ కోడిపందాల నిర్వహణ కేంద్రం. లక్షల రూపాయలు కోడి పందాల మీద బెట్టింగులు జరుగుతుంటాయి. పట్నాల నుంచి ప్రముఖ రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు, సినిమారంగ ప్రముఖులు వచ్చి విలాసవంతమైన విడుదుల్లో ఉంటూ పండగ మూడు రోజులు మద్యం, పందెం కోళ్ళ మషాల ఫ్రైలతో మజా చేసి వెళ్తుంటారు.
వారి వినోద వేడుకల కోసం నెలల ముందు నుంచి తర్ఫీదు ఇచ్చిన పందెం కోళ్లు చురకత్తుల వాడి, మద్యం మత్తులో శరీర అంగాంగాలు రక్తం చిందిస్తూ కొన ఊపిరి ఉన్నంత వరకూ పోరాడుకుంటు చివరికి బలిపీఠం ఎక్కి పట్నం బాబుల మందు పార్టీలకు, వినోదాలకు ఆహుతి అవుతాయి.
పందేల కోసం అనేక మగజాతి కోడి పుంజుల్ని వాటి పుట్టుక జాతకాలు, శరీర దారుడ్యం, వంటి సుళ్లు, కాలిగోళ్ల సామర్థ్యం, శరీర రంగుల ప్రకారం ఎంపిక చేసి నెలల ముందు నుంచి నిపుణులతో కత్తులు లేకుండా పందెంలో తర్ఫీదు ఇవ్వడం, రోజూ పరుగు పందేలు, నీటిలో ఈతలు, బరువు తూకం, జంతు డాక్టరు చేత ఆరోగ్య పరిక్షలు, రోగ నిరోధక యాంటీబయోటిక్ మందులు, శరీర దారుడ్యానికి రోజూ కాజు, పిస్తా, మొక్కజొన్న, రొయ్యల పొట్టు, వేరుశనగ నెయ్యి చెక్కీలు పూట పూటకు తినిపిస్తు, రాత్రిళ్లు మందు మత్తులో. వెచ్చగా ఉంచుతూ రాజభోగాలతో పందేల సమయం వరకు కంటికి రెప్పలా కాపాడుతుంటారు పందెం కోళ్ల నిర్వాహకులు.
అటువంటి పందెం కోళ్ల శిక్షణా కేంద్రం అది. రకరకాల రంగుల పందెం కోళ్ల కాళ్లను నూలు తాళ్లతో కట్టి విశ్రాంతి కోసం చెట్ల కింద కట్టి ఉంచారు.
పందెం కోళ్లు వాటి వాటి సాధక బాధకాలు చెప్పుకుంటు తమ జీవన ప్రమాణం లెక్కించు కుంటున్నాయి. తెల్లని రంగు మీద నల్లని చుక్కలున్న కోడిపుంజు తమది బొబ్బిలి వంశమనీ, ఎరుపు మీద నల్లని చారలు మెడ మీద తెల్లని చుక్కల ఠీవి పింఛంతో ఉన్న మరో కోడిపుంజు తనది పల్నాటి వంశమని, రెక్కలు తోక మీద పంచరంగుల వర్ణం పుంజు రెడ్డి రాజుల వంశమని తమ వంశ చరిత్రలు చెప్పు కుంటున్నాయి.
మా వంశంలో ఓటమి అన్నది లేదని ఎవరికి వారు వంశ చరిత్రలు చెప్పుకుంటున్నాయి. వాటి మాటలు విన్న ఒక అనుభవం గల పందెం కోడిపుంజు అందర్నీ ఉద్దేశించి, "మన మరణ శాసనం మనమే రాసుకుంటున్నాం. మద్యం మత్తులో మనలో మనమే కత్తులు నూరుకుంటూ బలిపీఠం ఎక్కుతున్నాం. ఇలా మన తరంపోతే ఇంకో తరం మనుషుల స్వార్దానికి బలైపోతున్నాము.
మనకు చావు ఎలాగు తప్పదు. కనక భయంకర నరక యాతనకంటే ఒక్క సారే చస్తే నయం కదా ! దీనికొక ఉపాయం ఆలోచించాను. అదేమిటంటే, మనమందరం ఐక్యంగా ఉంటే ఈ గండం నుంచి గట్టెక్కవచ్చు. ఇప్పటి వరకు కత్తులు లేకుండా మన మద్య పోట్లాటలు పెడుతున్నారు. రేపు పందేలప్పుడు మన కాళ్లకు పదునైన చురకత్తులు కడతారు. మస్తుగా మద్యం తాగిస్తారు.
మనల్ని రెచ్చగొట్టి పోరాటానికి పురిగొల్పుతారు.
మనం సహనం కోల్పోకుండా ఒక్క మాట మీద ఉండాలి. కాళ్లకి కత్తులు కట్టిన తర్వాత ఎంత రెచ్చకొట్టినా రోషం తెచ్చుకోకుండా కత్తి కట్టిన కాళ్లు ఎత్తకుండా మైదానంలో
ఒకరికొకరు ఆప్యాయంగా వాటేసుకుందాం. ఈ మనుషులు ఎన్ని ప్రయత్నాలు చేసినా సహనం కోల్పోవద్దు." అని అన్ని పందెం కోళ్ళకు ఉద్భోదన చేసింది. వాటి మద్య ఐక్యతా భావం నూరిపోసింది.
పండగ రోజులొచ్చాయి. మైదానంలో టెంట్లు వేసి కోడిపందేల సన్నాహాలు మొదలెట్టారు. జన సందోహం పెరిగింది. పందాలు మొదలయాయి. గెలుపు కోడిపుంజుల మీద వేల రూపాయలు బెట్టింగులు కాసేరు. నా కోడి పుంజు గెలుస్తుందంటే నేను కాసిన పుంజే గెలస్తుందని సవాల్ విసురుకుంటున్నారు.
పందెం కోళ్లు మాత్రం కత్తులు కట్టిన కాళ్లు పైకి ఎత్తకుండా మెడకి మెడ ఆప్యాయంగా వాటేసుకున్నాయి. పందెం కోళ్ల శిక్షకులు, నిర్వాహకులు విస్తుపోయారు. బెట్టింగ్ రాయుళ్ళు స్థాణువుల్లా నిలబడ్డారు. కోళ్ల శిక్షకులు ఎంత రెచ్చగొట్టినా ఫలితం లేకపోయింది.
కోళ్లు పోరాటం లేకుండా ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటున్నాయి. ఇంతలో జీవకారుణ్య సమితి ఫిర్యాదుతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు పందెం నిర్వాహకుల్ని, పందెం కోడిపుంజుల్నీ స్టేషనుకి తీసుకెళ్లి సెల్ ఒకగదిలో కోళ్లను మరొక గదిలో శిక్షకుల్ని ఎదురెదురుగా ఉంచారు పోలీసులు.
నిర్వాహకులు ఏడుస్తూంటే పందెం కోడిపుంజులు విజయ దరహాసంతో ఆనందం కనబరిచాయి.
***
కందర్ప మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: https://www.manatelugukathalu.com/profile/kandarpamurthy
పూర్తి పేరు : కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి
కలం పేరు : కందర్ప మూర్తి
పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.
భార్య పేరు: శ్రీమతి రామలక్ష్మి
కుమార్తెలు:
శ్రీమతి రాధ విఠాల, అల్లుడు డా. ప్రవీణ్ కుమార్
శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్
శ్రీమతి విజయ సుధ, అల్లుడు సతీష్
విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే పత్రికలలో ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు చదువులు, విశాఖపట్నంలో పోలీటెక్నిక్ డిప్లమో కోర్సు చదివే రోజుల్లో 1965 సం. ఇండియా- పాకిస్థాన్ యుద్ధ సమయంలో చదువుకు స్వస్తి పలికి ఇండియన్ ఆర్మీ మెడికల్ విభాగంలో చేరి దేశ సరిహద్దులు,
వివిధ నగరాల్లో 20 సం. సుదీర్ఘ సేవల అనంతరం పదవీ విరమణ పొంది సివిల్ జీవితంలో ప్రవేసించి 1987 సం.లో హైదరాబాదు పంజగుట్టలోని నిజామ్స్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్) బ్లడ్ బేంక్ విభాగంలో మెడికల్ లేబోరేటరీ సూపర్వైజరుగా 18 సం. సర్వీస్ చేసి పదవీ విరమణ అనంతరం హైదరాబాదులో కుకట్ పల్లి
వివేకానందనగర్లో స్థిర నివాసం.
సుదీర్ఘ ఉద్యోగ సేవల పదవీ విరమణ తర్వాత మళ్లా తెలుగు సాహిత్యం మీద శ్రద్ధ కలిగి అనేక సామాజిక కథలు, బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ,
బాలభారతం, బాలబాట, మొలక, సహరి, సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి, గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త ఇలా వివిధ ప్రింటు, ఆన్లైన్ మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.
నాబాలల సాహిత్యం గజరాజే వనరాజు, విక్రమసేనుడి విజయం రెండు సంపుటాలుగాను, సామాజిక కుటుంబ కథలు చిగురించిన వసంతం, జీవనజ్యోతి రెండు సంపుటాలుగా తపస్వి మనోహరం పబ్లికేషన్స్ ద్వారా పుస్తక రూపంలో ముద్రణ జరిగాయి.
నా సాహిత్య రచనలు గ్రామీణ, మద్య తరగతి, బడుగు బలహీన వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు సమాజానికి ఒక సందేశం ఉండాలని కోరుకుంటాను.
"బలిపీఠం దద్ధరిల్లింది" అనే కథలో కందర్ప మూర్తి గారు సమాజాన్ని ప్రతిబింబించేలా చక్కటి సందేశాన్ని అందించారు. కోడి పందాల రూపంలో మానవుల గుండెల్లోని కఠినత్వాన్ని, జంతువుల బాధలను ప్రతిఫలింపజేశారు. కథలో కోడిపుంజుల ఐక్యత, మానవ స్వార్థానికి వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటు, చివరికి వారి విజయంగా నిలవడం స్ఫూర్తిదాయకం.
ఈ కథ పాఠకులను ఆలోచింపజేసే విధంగా ఉంది. కందర్ప మూర్తి గారు గ్రామీణ వాతావరణం, జంతువుల కష్టాలు, మానవ సంబంధాల లోతులను ప్రదర్శించడంలో ప్రత్యేకమైన శైలిని ఉపయోగించారు. మానవత్వం, ఐక్యత, హింసను నిరాకరించే శక్తి అనే అంశాలను స్పష్టంగా చూపించడం ఈ కథలో ప్రధాన బలంగా కనిపిస్తుంది.
బలిపీఠం దద్దరిల్లింది: కందర్ప మూర్తి ... కొడి పందాలను నిషేధించాలి.
పి. వి. పద్మావతి మధు నివ్రితి