'Bammera Pothana' - New Telugu Story Written By Jeedigunta Srinivasa Rao
Published In manatelugukathalu.com On 20/05/2024
(కవులను గూర్చిన కథలు - పార్ట్ 5)
'బమ్మెర పోతన' తెలుగు కథ
రచన : జీడిగుంట శ్రీనివాసరావు
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
ఈయన సంస్కృత భాగవతాన్ని తెలుగులోకి అనువదించిన కవీశ్వరుడు. దుర్భరమైన దారిద్య్ర బాధకు లోనై కూడా రాజులను ఆశ్రయించకుండా తన కావ్యాన్ని భగవంతునికి అకింతం చేసి తరించిన మహా భక్తుడు.
ఒకరోజున, ఈయన తన కొడుకు మల్లన్న సహాయంతో పొలం దున్నుకుంటున్నాడు. ఆ సమయంలో ఆయన బావమరిది శ్రీనాథ మహాకవి పల్లకిలో ఆ దారిన పయనిస్తూ, తన మహిమ ఆ తండ్రికొడుకులకు చూపించ తలచి, పల్లకీని ముందు వైపు మోస్తున్న బోయీలను తప్పుకోమని ఆజ్ఞ చేసాడు. వాళ్ళు తప్పుకున్నప్పటికి, పల్లకీ యధాప్రకారం నడిచిపోతోంది.
మల్లన్న ఆ వింతను తండ్రి పోతన కి చూపగా, ఆయన అరకకు కట్టిన ఒక దున్నపోతును విప్పేయమన్నాడు. మల్లన్న అలాగే చేసాడు. అయినా అరక సాగిపోతోనే వుంది. శ్రీనాథుడు అది చూసి రెండవ వైపు బోయీలను కూడా తప్పుకోమన్నాడు. పల్లకీ, బోయీలు లేకుండానే నడిచిపోతోంది. పోతన్న రెండవ దున్నపోతుని కూడా విప్పించి వేసాడు. దున్నపోతులు లేకుండానే అరక సాగిపోతోంది. శ్రీనాథుడు అది చూసి, పోతన్న తనతో సమాన ప్రజ్ఞావంతుడు అని గుర్తించి, పల్లకీ దిగి పొలంలోకి వచ్చి పోతన్నని " హాలికులకు క్షేమమా " అని పలుకరిచాడు.
పోతన్న ఆ ఎత్తిపొడుపు గ్రహించి
"బాల రసాలసాల నవపల్లవ కోమల కావ్య కన్యకన్
కూళల కిచ్చి యప్పడుపు కూడు భుజించుటకంటె సత్కవుల్
హాలికులైన నేమి, గహనాంతర సీమల కందమూల
గౌద్దాలికులైన నేమి, నిజధార సుతోదర పోషణార్ధమై "
తాత్పర్యం.... కావ్య కన్యకని దుర్మార్గులకు అంకితం యిచ్చి, వాళ్ళు పెట్టే నీచపుకూడు తినేకంటే సత్కవులు అడవులలో కందమూలాలు ఏరుకుని తినడం మంచిది "
అని సమాధానం చెప్పగా, శ్రీనాథుడు సిగ్గుతో తలవంచుకున్నాడు.
పోతన్న యిల్లు అయ్యవార్లంగారి నట్టిల్లుల్లా వుంది. శ్రీనాథుడు సపరివారంగా వచ్చాడు వాళ్లందరికీ భోజనపు ఏర్పాట్లు ఎలా చెయ్యాలో తెలియక, పోతన్న భార్య వంటయింట్లో కూర్చుని విచారిస్తోంది. ఇంతలో సరస్వతీ దేవి ప్రత్యక్షమై, సర్వ ఆభరణ భూషితమైన తన దక్షిణ హస్తాన్ని అటూ, యిటూ ఊపింది. వంటగది భోజన పదార్థాలతో నిండిపోయింది. పోతన్న శ్రీనాథుడికి, అతని పరివారానికి తృప్తిగా విందు పెట్టాడు.
భోజనానoతరo శ్రీనాథుడు తాంబూలం సేవిస్తూ, పోతన రాసిన భాగవతాన్ని చదవడం మొదలుపెట్టాడు.
గజేంద్ర మోక్షం కథలో
"సిరికిం జెప్పడు, శంఖ చక్ర యుగమున్ జేదోయి సంధింపడే
పరివారంబును జీరడభ్రగపతిం బన్నింపడాకర్ణి కాం
తర ధమిల్లము జక్కనొత్తడు వివాదప్రోతిత శ్రీకుచో
పరి చేలాoచలమైన వీడడు గజ ప్రాణావనోత్యాహియై "
అన్న పద్యం చదివి " ఏమిటి బావగారు, గజేంద్రుని రక్షించడానికి విష్ణుమూర్తి ఏ ఆయుధం పట్టుకు వెళ్లలేదన్నారే? మరి వినోదం చూడటానికి వెళ్లాడా?” అని అక్షేపించాడు. పోతన్న ఏమి జవాబు చెప్పకుండా ఊరుకున్నాడు.
ఒక గంట గడిచిన తరువాత పోతన్న హడావుడిగా దొడ్లోనుంచి పరుగెట్టుకుని వచ్చి, “బావ, నీ కొడుకు నూతిలో పడిపోయాడు” అని ఖంగారుగా చెప్పాడు.
శ్రీనాథుడు లబో దిబో అంటూ నూతి దగ్గరికి పరుగెత్తి, నూతి చుట్టూ తిరుగుతున్నాడు. అది చూచి పోతన్న "నిచ్చెనా, నూతిలో దిగే మనుషులని తీసుకురాక నూతి చుట్టూ గంతులు వేయాడానికి వచ్చావా?” అని అక్షేపించి, ఇంటిలోకి వెళ్ళి, గదిలో దాచి వుంచిన శ్రీనాథుడి కొడుకుని తీసుకోనివచ్చి చూపించి, నీ పుత్ర వాత్సల్యం నిన్నెలా పరిగెత్తించిందో, అలాగే విష్ణుమూర్తి భక్త వాత్సల్యంకూడా ఆయుధాలని వెంట తీసుకుని వెళ్ళాలి అనే ఆలోచన కలుగనివ్వలేదు " అని చెప్పాడు. దానితో శ్రీనాథుడు సిగ్గుతో తలవంచుకున్నాడు.
భాగవతం ఎంతో రసవత్తరంగా వుండటం చూసి, దానిని ఏ రాజుకైనా అంకితం మిప్పిస్తే పోతన్న దరిద్రం తీరుతుంది అనే అభిప్రాయంతో, శ్రీనాథుడు ఆ విషయం పోతన్న కి బాగా నూరిపోసాడు. పోతన్న కూడా కాస్త ఆలోచనలో పడ్డాడు. అప్పుడు గుమ్మం దగ్గర సరస్వతీ దేవి జలజలా కన్నీరు కారుస్తూ ప్రత్యక్షమైంది. ఆమెని చూడగానే, ఉగిసలాడుతున్న మనస్సును దృఢపరుచుకుని,
"కాటుక కంటినీరు చనుకట్టు పయింబడ, నేల ఏడ్చేదో
కైటభ ధైత్య మర్ధనుని గాదిలి కోడల! యోమదంబ! యో
హాటక గర్భురాణి! నిను నా కటికం గొనిపోయి యల్ల క
ర్ణాట కిరాట కీచుకులకమ్మ త్రిశుద్ధిగ నమ్ము భారతీ "
అని ఓదార్చాడు.
పోతన్న భాగవతం లో గజేంద్ర మోక్ష కథ రాస్తూ
"అల వైకుంఠపురంబులో నా మూల " అన్నంత వరకు వచ్చి ఆతరువాత ఏమి వ్రాయాలో తట్టక, విసుగుగా బయటకు వెళ్లి, కాసేపు అటూ ఇటూ తిరిగి మళ్ళీ వచ్చేసరికి, తాను వ్రాసిన దానికి “సౌధంబు దాపల” అని ఎవ్వరో చేర్చడం గమనించాడు. అది సాక్షాత్తు విష్ణు దేవుడే చేసాడని బ్రహ్మానందతో
అల వైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌధంబు దా
పల మందారవనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో
త్పల పర్యంక రమావినోది యగు నాపన్న ప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము "పాహిపాహి" యన గుయ్యాలించి సంరంభియై.
అని ఒక్కబిగిని పద్యమంతా పూర్తి చేశాడు.
పోతన్న భాగవతాన్ని అద్భుతంగా వ్రాస్తున్నాడని విని కర్ణాటక ప్రభువు తనకి అంకితం యివ్వమని కబురు చేశాడు. పోతన్న తన గ్రంధము నరులకు అంకితం యివ్వనని జవాబు పంపాడు. దానితో, ఆ రాజు ఆగ్రహంతో పోతన్నని బంధించి తీసుకొని రావలసింది అని తన భటులను పంపాడు. రాజభటులు అట్టహాసంగా పోతన్న యింటికి చేరే సరికి విష్ణుమూర్తి వరాహ రూపంలో ప్రత్యక్షమై, వాళ్ళని తరిమికొట్టాడు.
పోతన్న భాగవతం లో భక్తిరసం చిప్పిలుతూ వుంటుంది. భగవంతుడైన కృష్ణ లీలలు వర్ణించేటప్పుడు పోతన్న కవిత్వం పరాకాష్ట నందుకుంది.
ఆంధ్రప్రదేశ్ లో భాగవతం పారాయణ గ్రంధం గా ఉపయోగపడుతోంది.
అయిదవ భాగం సమాప్తం, త్వరలో ఆరో భాగం మరి కొందరు కవుల కథలతో.
(ఆధారం మా తండ్రిగారు శ్రీ జీడిగుంట రాఘవేంద్ర రావు గారి రచన
-- శ్రీనివాసరావు జీడిగుంట)
జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
Comments