#AyyalaSomayajulaSubrahmanyam, #BandhamAsaraBadhyatha, #బంధంఆసరాబాధ్యత, #అయ్యలసోమయాజులసుబ్రహ్మణ్యము, #TEluguFamilyStory
'Bandham Asara Badhyatha' - New Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam Published In manatelugukathalu.com On 30/09/2024
'బంధం - ఆసరా - బాధ్యత' తెలుగు కథ
రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
“అమ్మా! వేడి టీ ఇవ్వవా?ఆఫీసు నుంచి ఇంట్లో అడుగు పెడుతూనే ఓకేక పెడుతూ అలసటగా అక్కడున్న కుర్చీలో కూలబడింది రాధిక.
'తెస్తున్నా' అని వంటింట్లోంచే జవాబిచ్చి టీని రాధికకు ఇచ్చి తనూ ప్రక్కన కూర్చుంది అనసూయ.
“ఇవాళ పని ఎక్కువగా ఉన్నట్లుంది” కూతురు వైపు జాలిగా చూస్తూ అంది అనసూయమ్మ.
“అవునమ్మా, ఇనస్పెక్షన్ కి ఎవరో ఆఫీసర్ వస్తున్నాడు. అందుకని పెండింగ్ పనంతా చెయ్యమని మా బాస్ ఆర్డర్” టీ సిప్ చేస్తూ చెప్పింది రాధిక.
“అది సరే, ఆ ఆళ్లగడ్డ వాళ్ళు ఫొన్ చేశారు” కూతురి చేతిలోంచి కప్పును తీసుకుంటూ చెప్పింది అనసూయ.
“ఏముంది మామూలేగా.. ఏదో ఒక సాకు. జాతకాలు కుదరలేదని”
“సర్లే, .. నచ్చలేదని చెప్పటానికి మాత్రం జాతకాలూ బాగా అక్కరకొస్తాయి” కొంచెం తెచ్చిపెట్టుకున్న నవ్వు తో అంది రాధిక.
"ఇప్పటికి ఓ పది సంబంధాలు చూశాం. అన్నీ ఉన్నాయి. ఉద్యోగం, చదువు, అందం. అన్నీ ఉన్నా కూడా ఏదో ఒక అడ్డు తగులుతోంది నీ పెళ్ళికి " అనసూయ కంఠంలో ఒక నిస్సహాయత ధ్వనించింది.
"నాకిలా అలవాటైపోయిందిలే, " నిరాసక్తంగా చెప్పింది రాధిక.
కొంత సేపు మౌనం గా ఉన్నారు. తరువాత అనసూయ ఇలా అంది. “వాళ్ళు ఇంకో సంగతి చెప్పారు”
మళ్ళీ తల్లి మాట్లాడకపోయే సరికి, చెప్పమన్నట్లుగా సంజ్ఞ చేసింది రాధిక.
"వాళ్ళకు.. అంటే.. ఆ అబ్బాయి వాళ్ళకు ప్రభ నచ్చిందట” మెల్లగా అసలు సంగతి చెప్పింది.
“చెల్లి జాతకం చూడకుండానే సరిపోయిందా?" మొహం ఎరుపెక్కి కోపం వస్తున్నా ఆపుకుంటూ,
అడిగింది రాధిక.
కొంతసేపూ ఇద్దరిమధ్యా మౌనం..
రాధిక ఆ ఇంట్లో పెద్దాడపిల్ల. ఆమె తర్వాత ఐదేళ్ళ వ్యవధిలో ముగ్గరు ఆడపిల్లలు పుట్టారు. రాధిక తండ్రి ఒక ఫాక్టరీ లో సూపర్ వైజర్ గా చేసేవాడు. యాజమాన్యానికి నష్టాలు రావడంతో ఫాక్టరీ మూసేశారు. యజమాన్యం ఇచ్చిన నష్టపరిహారంతో రెండేళ్ళు నెట్టుకొచ్చాడు.
ఇప్పడు పెద్దపిల్ల రాధిక జీతమే ఆధారం. బి. కామ్, పూర్తి కాగానే సర్వే ఆఫ్ ఇండియా లో టెంపరరీ అసిస్టెంట్ గా జాయిన్ అయ్యింది. ముందు చేరితే చాలనుకుంది. పనితీరు నచ్చడంతో పర్మనెంట్ చేసేశారు. ఇదొక్కటే ఆమెకి సంతోషకరమైన విషయం. చాలా సేపటి తరువాత నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ రాధిక అడిగింది “నాన్న ఏమన్నారు?”
“ఏమంటారు? ఇంట్లో పెద్ద కూతురు పెళ్ళి చెయ్యకుండా రెండోదానికి ఎలా చేస్తాం అంటున్నారు. కానీ, మంచి సంబంధం, వదులుకుంటూ ఎలా అంటే వినడం లేదు “ గబుక్కున నోరు జారి నేరం చేసిన దానిలా చూసింది అనసూయ.
‘తనకిప్పుడు 26 ఏళ్ళు. చెల్లి ప్రభకి 24ఏళ్ళు. తండ్రికి ఆదాయం లేదు. తన ఉద్యోగమే కుటుంబానికి ఆధారం. మరో నాలుగైదేళ్ళలో తన కుటుంబం ఒడ్డున పడుతుంది. అప్పటివరకూ తను వీళ్ళతో ఉంటే బావుంటుందేమో; పెళ్ళి చేసుకున్నా కాబోయే భర్త తనలా వీళ్ళ బాధ్యత తీసుకుంటాడా? అనుమానమే; దాని బదులు చెల్లిని చూసి చేసుకుంటా నన్నవాడికి ఇచ్చి పెళ్ళి చేస్తేనే కరక్ట్’
తన ఆలోచనల నుంచి తేరుకుంటూ చెప్పింది రాధిక. “ప్రభకు నచ్చితే పెళ్ళి చేసేద్దాం”
“మరి నువ్వో?” కూతురి నిర్ణయాన్ని ఊహించని అనసూయ ఆశ్చర్యంగా అడిగింది.
“నా పెళ్ళి సంగతి తర్వాత ఆలోచిద్దాం. ముందు ప్రభ సంగతీ చూద్దాం” స్థిరంగా చెప్పింది రాధిక.
"ఎంత గొప్ప మనసే నీదీ..” చెమర్చిన కనులతో కూతురిని హత్తుకుంటూ అంది అనసూయ.
నెల తిరిగేసరికల్లా ఆ ఇంట్లో రెండో అమ్మాయి వివాహం వైభవంగా జరిగింది.
------------------------------------
“అవున్నాన్నా, నేను అతన్ని ప్రేమించాను. అందుకే అతనితో కలిసి తిరుగుతున్నాను" రెండో చెల్లి
విరజ ధైర్యానికి ఆశ్చర్యపోయింది రాధిక.
“సిగ్గు లేదే నీకు? కాలనీలోనే ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ, పైగా పొగరుగా సమాధానం చెబుతున్నావ్?” తండ్రి కోదండం అరిచాడు.
“నాన్నా, ప్రేమించడం క్షమించరాని నేరంలా మాట్లాడకండి. అతడు నన్ను పెళ్ళి చేసు కునేందుకు సిద్దంగ ఉన్నాడు. మీరు కాదంటే ఇంట్లోంచి వెళ్ళిపోయి అతన్ని చేసుకుంటాను. అతనికేం తక్కువ. లక్ష రూపాయల జీతం. నేనతనికి నచ్చాను. కట్నం ఆశించడు. బీహారీ అతను పాండే. కానీ నాకు మాత్రం అభ్యంతరం లేదు. మీరు మాత్రం ఈ సంబంధాన్ని పాడు చెయ్యకండి. నేను సుఖంగా ఉండాలనుకుంటే మా పెళ్ళికి ఒప్పుకోవడం ఒక్కటే మీరూ చేయగలిగింది” నిష్కర్ష గా చెప్పి లోపలి గదిలోకి వెళ్ళిపోయింది విరజ.
దీంతో ఇంట్లోని అందరూ హాల్లో నిశ్చేష్టులయ్యారు.
కోదండాన్ని ఒప్పించేందుకు శతవిధాల ప్రయత్నించి, ఎట్టకేలకు కోదండాన్ని ఒప్పించింది. ఏడాది పూర్తి కాకుండానే రాధిక రెండో చెల్లి పెళ్ళి కూడా మంగళప్రదంగా జరిపించింది.
------------, -----------------------
రాత్రి పదవుతోంది. హాల్లో కూర్చుని అమ్మా నాన్నలతో కలిసి టీవీ చూస్తోంది రాధిక. “ఇంకా ఆనంది రాలేదా రాధీ, ?” అడిగాడు కోదండం.
“ట్యూషన్ కు వెళ్ళింది కదా:ఆలస్యంగా వదిలారేమో, వస్తుందిలే నాన్నా” తనకూ ఆందోళన గానే ఉన్నా దానిని దాచిపెడుతూ చెప్పింది రాధిక.
“దాని వాలకం చూస్తుంటే అలా అనిపించడం లేదు. సినిమాలు, షికార్లు, అర్దరాత్రి, అపరాత్రీ ఇంటికి రావడం పరిపాటైపోయింది” అనసూయ మాటల్లో విచారం కనబడుతోంది.
“ఇలా అయితే దాని జీవీతం ఏమవుతుందో అని నాకు భయంగా ఉంది. తనూ విరి లాగా ఎక్కడ ప్రేమ లో పడిపోయిందో, పడిపోతోందో” దిగాలుగా అన్నాడు కోదండం.
“ఇంకా చిన్నతనం పోలేదులే నాన్నా” చెల్లిని సమ ర్థిస్తూ చెప్పింది రాధిక.
“ప్రొద్దున నీవు ఆఫీసుకు వెళ్ళిం తరువాత నా స్నేహితుడు రాఘవ వచ్చాడు. వాళ్ళ అబ్బాయి అమెరికా లో మంచి ఉద్యోగం లో ఉన్నాడట. మన ఆనందిని వాళ్ళ అబ్బాయికి అడగటానికి వచ్చాడు.
ఈ రూపేనా బంధుత్వం కలుపుకుందామని వాడి ఆశ. ఆ కుర్రాడు నీకంటే చిన్నవాడు. లేకపోతే నిన్నే అడిగేవాడేమో;" సంజాయీషీ ఇస్తూ అసలు విషయం బయటపెట్టాడు కోదండం.
“ఓహో, అదా సంగతి. అయితే ఆనంది పెళ్ళి చేసే ద్దాము నాన్నా! మీ బాధ్యత లన్నీ తీరిపోతాయి కదా, నేను ఊద్యోగం లో చేరి ఎనిమిదేళ్ళు దాటుతుంది. కాబట్టి ఏదో ఒక లోన్ ఈజీగా దొరుకుతుంది మా ఆఫీసులో. పెళ్ళి ఖర్చు గురించి నీవు బెంగపడవద్దు.”
తన ఆమోదం తేలీయజెప్పింది రాధిక.
"తల్లీ, నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాం” అన్నాడు కోదండం.
"నాకు అలవాటైపోయింది లే నాన్నా, నా చెల్లెల్లే కదా: నాకు నిద్ర వస్తోందీ. పడుకుంటాను” అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది రాధిక.
--------------------------‐-------
ఆనంది పెళ్ళి అయి మూడేళ్ళవుతోంది. ఓ ఆదివారం మధ్యాహ్నం సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. అంతకన్నా ఎక్కువగా నిప్పులు చెరుగుతూ ఇంట్లోకి వచ్చి “రాధీ” అంటూ కేక పెట్టాడు కోదండం.
'ఏమైందండీ?' భర్త ను అంత కోపంలో ఎప్పుడూ చూడని అనసూయ కంగారు పడుతూ అడిగింది.
"ఇంకా ఏమవ్వాలే.. ?మనని నడిరోడ్డు మీద నించోబెట్టి, మన కుటుంబ గౌరవం నాశనం చేసింది. ఏమైందో దాన్నే అడుగు..” కట్టలు తెంచుకున్న ఆవేశంతో రాధిక వైపు చూస్తూ అరిచాడు కోదండం.
"ఏంటండీ మీరు అంటున్నది? ఏమయ్యిందే రాధీ?” అయోమయంగా అడిగింది అనసూయ.
"ఏమవ్వాలే ఈ ఇంటికి దేవత అనుకున్న కూతురు అని చెప్పుకోవడానికి కూడా వీల్లేని నీచానికి దిగజారి పోయిందే; ఎదురుగానే ఉందిగా దాన్నే అడుగు.. దాని నిర్వాక మంతా దాని పాపిష్టి నోటితోనే చెప్పమను” అరిచాడు కోదండం.
“ఏమైందే రాధీ, ఏం చేశావే?" కళ్ళలో నీరు ధారగా కారుతుండగా అడిగింది అనసూయ.
“నేను చెప్తాలే అమ్మా, ఏమైంది నాన్నా, రాఘవ బావ గురించేనా మీరు మాట్లాడుతోంది?”
“ఇన్నాళ్ళు నువ్వు గొప్ప త్యాగం చేసి, మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నావని ఎంతో సంబర పడిపోయామే.. పెళ్ళి కూడా చేసుకోకుండా ఇందుకే ఇలా ఉండిపోయావని ఇప్పుడు అర్థమవుతోందే మాకు” 'కోదండం ఆవేశం చల్లారడం లేదు.
"నాకేం అర్థం కావడం లేదు. అసలేమయిందో చెప్పండి” వాడిపోయిన ముఖంతో అడిగింది అనసూయ.
“నీ కూతూరు వాడెవడితోనో కులుకుతోంది. ఇన్నాళ్ళూ ఇది చెళ్ళెల్ల పెళ్ళిళ్ళు చేసి తను అలానే ఉండిపోయిందని ఎంతో బాధ పడుతూ ఉన్నాం. కానీ ఇది అంత అమాయకురాలు కాదు. మన పరువు మొత్తం బజారు కీడ్చిన 'బజారుబతుకు' దీనిది” కోపంతో రగిలిపోతూ గొంతు
బొంగురుపోతోంది.
“ఇలా అనకండి. నా కూతురు అలాంటిది కాదు” అయోమయం నుంచి తేరుకుని అంది అనసూయ.
“ఒక్కసారి కాలనీ లో చుట్టుప్రక్కల అడుగు. అందరూ మొహమ్మీద ఉమ్మేస్తున్నారు. నీ కూతురి నిర్వాకాన్ని”
అనసూయ అలా ఉండిపోయింది. నమ్మలేనట్లు చూస్తూ కూతురి వైపు ప్రశ్నర్థకంగా తల తప్పింది.
"ఎందుకు నాన్నా, అలా అంతలా గొంతు చించుకుంటున్నారు మీరు? నేను చేసింది అస్సలు తప్పు
కానే కాదు. " రాధిక ధైర్యంగా ఎదురు సమాధానం చెప్పింది.
“చూశావా?దీనికి అది చేసిన పనిలో ఏమాత్రం తప్పు కనపడ్డం లేదట. సిగ్గుమాలిన పనులన్నీ చేస్తూ బరితెగించి ఎలా చెబుతోందో చూడు” కోదండం కోపం రాన్రాను తారాస్థాయి కి చేరింది.
“అసలేమయిందండీ” అనసూయ గొంతులో అసహనం పొడచూపింది.
“చివరకు నా నోటితో చెప్పాల్సి వస్తోంది. అది చేసిన పాపం నేనే చెప్పాలనుకుంటా; నా ఖర్మ కాక మరేంటి చెప్పు. నీ నిప్పులాంటి కూతురు నాచారంలో, ఆ రాఘవగాడి తో కులుకు తోంది” ఒక్కొక్క మాటా వత్తి పలుకుతూ కసిగా చెప్పాడు కోదండం.
"నిజమే నాన్నా, మీకలా కనపడ్డంలో ఆశ్చర్యంలేదు. కానీ, ఆనంది పెళ్ళయి ఎన్నాళ్ళయ్యింది నాన్నా;?” సాధ్యమైనంత శాంతంగా అడిగింది రాధిక.
ఇప్పుడా విషయం ఎందుకన్నట్లు చూస్తూ “మూడేళ్లు” అన్నాడు కోదండం.
“మరి ఈ మూడేళ్ళలో మీ పెద్ద కూతురి పెళ్ళి చెయ్యాలన్న ధ్యాస కానీ, బాధ్యత మీకు గుర్తుకు రాలేదేం నాన్నా ?” సూటిగా తండ్రిని అడిగింది రాధిక.
“నా అసహాయత ను ఆసరాగా చేసుకుని అసలు విషయాన్ని పక్కదోవ పట్టిస్తున్నావు?” అక్కసుగా ఆక్రోసించాడు కోదండం.
“పక్కదోవ కాదు నాన్నా, ముగ్గురు చెళ్ళెల్ల బాధ్యత ను తీసుకుని వాళ్ళ పెళ్ళిళ్ళ వరకూ ఏమేమి చెయ్యాలో, చెయ్యాడానికి చెయ్యాల్సినదంతా చేశాను. కానీ ప్రతిగా మీరు నాకేం చేశారు. తండ్రిగా మీ బాధ్యత ఏమైనా చేశారా నాన్నా?” ప్రశ్నల జడివాన కురిపించింది రాధిక.
ఊహించని పరిణామానికి తెల్లబోయాడు కోదండం. అంతలోనే తేరుకుని తన తత్తరపాటును కప్పిపుచ్చుకుంటూ అన్నాడు కోదండం.
“అందుకని మంచీ చెడూ విచక్షణ లేకుండా నీ సుఖం నువ్వు చూసుకుంటావా? ఆడపిల్లకు శీలం ఎంత ప్రాధాన్యత ఉందో? దానికి నువ్వు విలువ నివ్వవా? బాధ్యత గురించి నువ్వు నాకు హితభోదలు చెయ్యాలిసిన పని లేదు. నా తలరాత బాగుండి కంపెనీ నడిచీ ఉంటే.. ఈ రోజు నీతో మాట పడాల్సిన అవ సరమే లేకుండేది”
“లేదు నాన్నా, మీ బాధ్యత ను మీరు మరిచిపోయి చాలా కాలమే అయింది. ఎంతసేపూ చెళ్ళెల్లకు పెళ్ళిచేసి బయటికి పంపేద్దామని చూశారే కానీ, నా పెళ్ళిచేసే ఉద్దేశం మీరు ఎప్పుడో వదిలేశారు” రాధిక కళ్ళలో నీళ్ళు సుడులు తిరిగాయి.
“అవేం మాటలే; మాకు మాత్రం నీకు పెళ్ళి చేసి పంపా లని ఉండదా:” అనసూయ మాటల్లో కూతురిపై ఆగ్రహం ఎగసిపడుతోంది.
తల్లి మాటలకు తల అడ్డంగా ఊపుతూ చెప్పింది రాధిక.
"లేదమ్మా; నేనూ చాలాకాలం అలాగే అనుకుంటూ వచ్చాను. ఆ రోజు రాత్రి ఆనంది పెళ్ళి చేసేద్దాం. అని నేను మీతో చెప్పి నిద్ర పోడానికి లోపలికొచ్చాక ఏమైందో నాకింకా గుర్తుంది ".
------‐------------------------------------
'పోనీలెండి. చాలా తెలివిగా రాధిక ని ఒప్పించారు. ' భర్త తో అంది అనసూయ.
“మరేం చెయ్యను. ఆనంది ఒక్కత్తే పెళ్ళికి మిగిలింది. అనుకోకుండా వెతుక్కుంటూ వచ్చిన సంబంధం. పైగా బాల్యస్నేహితుడు. అమెరికాలో ఉద్యోగం. ఇంతకంటే అదృష్టం ఏం కావాలి?వెయ్యి అబద్దాలు ఆడీ ఓ పెళ్ళి చేయ్యమన్నారు. అందుకే రాధితో అలా అబద్ధం చెప్పాను.
నిజానికి రాధికనే అడిగాడు. ఈడూ జోడూ కూడా బావుంటుంది. కానీ రాధిక పెళ్ళి చేసేస్తే ఆనంది పెళ్ళి ఎలా అవుతుంది. ఇప్పటి వరకూ పెళ్ళిళ్ళయిన పిల్లలవి పెళ్ళి ఖర్చుల నుంచి పురుళ్ళు, పెట్టూపోతలూ ఎవరు చూస్తారు?
నాకా ఏ సంపాదనా లేదు. రాధిక ఉద్యోగమే మనకు జీవనాధారం. మరో నాలుగైదేళ్ళు గడిస్తే రాధిక కు ఇక పెళ్ళి సంబంధాలు రావు. ఇప్పుడే దానికి ఇరవై తొమ్మిది. జీవితాంతం మనను చూసుకుంటూ ఉండి పోతుంది” చాలా నిదానంగా, తాపీగా విడమరచి చెప్పాడు కోదండం.
భర్త మాటలకు నివ్వెరపోయింది అనసూయ. కానీ ఆయన చెప్పిన మాటలు కూడా ఆమెకు సబబు
గానే తోచాయి. బహుశా స్వార్థం తల్లిదండ్రుల బాధ్యత ను కూడా మరిపింపజేస్తుందేమో;
"మీ ఇష్టం మీకెలా మంచిదనిపిస్తే అలానే చేయండి. " తప్పును భర్త వైపు తోసేస్తూ చెప్పింది అనసూయ.
నిద్ర పట్టక అటూ ఇటూ దొర్లుతున్న ఈ మాటలు నెత్తిమీద పిడుగులు పడ్డట్టే అనిపించాయి. దిండులో ముఖం దాచుకుని వెక్కివెక్చి ఏడ్చింది. ఆమెకు ఆ రాత్రి ఓ పీడకలగా మిగిలింది.
----------------------------------------
రాధిక గుర్తు చేసిన విషయాన్ని విని కలవరపడి, ఉలిక్కి పడ్డారు కోదండం, అనసూయ. కూతురు ఎదురుగా దోషులై నిలబడాల్సి రావడం వాళ్ళిద్దరికీ అవమానకరంగా, భరించరానిదిగా ఉంది.
“నిజమే నాన్నా, మీరు అనుకుంటున్నట్టుగా నాకు తెలిసి ఉండవలసిన విషయం కాదు ఇది. కానీ నేను నిద్రపోయానన్న ధీమాతో మీరు అలా అన్నారు. అమ్మ కూడా దానికి అడ్డుపడకుండా వత్తాసు పలి కింది. నా పెళ్ళి గురించి మీరు ఇన్ని వ్యతిరేక ఆలోచనలు చేసినా, మీ స్వార్థం మీరు చూసుకోవాలని అనుకుంటున్నట్టు తెలిసినా మీరు ఎక్కడికీ వెళ్ళ లేరని, ఎక్కడికీ కదలలేరనీ, ఏ సంపాదనా లేదనీ, నేను కూడా మిమ్మల్ని వదిలేస్తే మీరు ఏమైపోతారో అన్న ఆలోచనతో మీ దగ్గరే ఉండిపోయా; మీ ఇద్దరికీ ఎంత గౌరవం ఇచ్చానో, అదంతా విదిలించుకుని, ఇలా ఎందుకు ప్రవర్తించారు?”
“నేను మనిషినే కదా: నాకు ఎన్నో కలలు, కోరికలూ ఉంటాయన్న విషయాన్ని మీరు ఎందుకు మరిచి పోయారు, నాన్నా?నిజానికి రాఘవ బావ నన్ను ప్రేమిస్తున్నానని నాలుగేళ్ళ నుంచి నా వెంటపడు తున్నాడు. అతను నా ఆఫీసే. నా సీనియర్. ఎన్నో విషయాల్లో నాకు అండగా ఉండి సాయం చేసిన ఉత్తమ స్నేహితుడు. బంధుత్వం మాట పక్కన బెట్టచ్చు కూడా.
మీరు అనుకుంటున్నట్లుగా నేను అతనితో సరదాలు, సల్లాపాలు ఏవీ తీర్చుకోవటం లేదు. నాన్నా, మా ఇద్దరీకీ రిజిస్టర్ మ్యారేజ్ అయి రెండు ఏళ్ళు అవుతోంది. సాక్షులు మా మేనేజర్ మరియు ఆఫీస్ స్టాఫ్. మీరు నాపెళ్ళి ప్రసక్తి తీసుకోస్తారని, అప్పుడు రాఘవ బావ విషయం మీతో చెప్పాలని ఎంతగానో ఎదురూచూశాను. ఆశపడ్డాను. అయినా ఇన్నాళ్ళూ మీ బాధ్యత మీకు గుర్తుకు రాలేదు.
ఈ రెండేళ్ళు పెళ్ళయి కూడా రాఘవ బావతో గడప కుండా మీతో నే ఉండిపోయాను, కేవలం మీ కోసమే. కానీ నాకు వెళ్ళిపోయే సమయం వచ్చేసింది. నా భర్త దగ్గరకు వెళ్ళిపోవాలి. మీకు ఇష్టం ఉన్నా, లేక పోయినా నేను వెళ్ళిపోతున్నా. మిమ్మల్నెవరు చూస్తారని మీరేమీ భయపడకండి నాన్నా;
మీ జీవితాంతం మిమ్మల్ని పోషించే బాధ్యత నాతోపాటు రాఘవ కూడా తీసుకుంటానని హామీ ఇచ్చాకే పెళ్ళి చేసుకున్నాను. నిర్భయంగా ఉండండి. మీకే లోటూ రాకుండా చూసుకునే బాధ్యత మాది. మీరేం చేసినా ఎలా ఉన్నా, అమ్మానాన్నలు కదా; కానీ అమ్మా, కనీసం ఒక ఆడదానిగానైనా నామీద జాలి కలగలేదా? ఇప్పుడెందుకమ్మా ఏడుస్తున్నావు? సరే, అవసరమైతే ఫోన్ చెయ్యండి. చెయ్యకపోయినా మిమ్మల్ని చూసేందుకూ తప్పకుండా వస్తూనే ఉంటాను. నా బాధ్యత ను నేనెప్పుడూ మరిచిపోను.” ఆవేశంగా, ఆవేదనగా చెప్పదలచుకున్న నాలుగూ చెప్పి ఆ ఇంటి గడప దాటింది రాధిక.
-----------------------శుభంభూయాత్-----------------------
అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం
రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.
అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.
ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,
ఆంధ్రభూమి, దేశభక్తిసాహిత్య ఈ పత్రిక, సహరి, మిసిమి,తపస్విమనోహరం,మాధురి
మాసపత్రిక,ఉషాపక్షపత్రిక, సుమతి మాస పత్రిక, షార్ వాణి,మన తెలుగు కథలు.కామ్.
బిరుదులు- సాహిత్యవిక్రమార్క- దేశభక్తిసాహిత్య ఈ పత్రిక
ఉత్తమ రచయిత- మనతెలుగుకథలు.కామ్.
కలహంస—- నెలవంక- నెమలీక మాస పత్రిక.
ప్రథమబహుమతులు- నవలల విభాగము- మనతెలుగుకథలు.కామ్ మరియు
తపస్విమనోహరము.
ప్రథమద్వితీయబహుమతులు— కథల విభాగము- సహరి, మనతెలుగుకథలు.కామ్
చారిత్రక నవలలో ప్రథమ, ద్వితీయబహుమతులు.
సాంఘికనవలలో ద్వితీయ, కన్సోలేషన్ బహుమతులు.
ఇవేకాక ఆర్థిక, సామాజిక, ఆరోగ్య, ,రాజకీయ సంబంధించి పెక్కు వ్యాసాలు పత్రికల్లో వస్తూంటాయి.
కవితలు కూడా అన్ని విషయాల మీద కూడా వస్తూంటాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
Kommentare