కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link
'Bandhavyalu' written By Sita Mandalika
రచన : సీత మండలీక
కాలంతో పాటు అమ్మాయిల ఆలోచనలలో కూడా మార్పు వస్తోంది.
పెళ్లి గురించి, తమ లైఫ్ పార్ట్నర్ గురించి కొన్ని అభిప్రాయాలు ఏర్పరచుకుంటున్నారు.
పేరెంట్స్ ఆలోచనల్లో కూడా క్రమంగా మార్పు వస్తోంది.
అమ్మాయిలు తమ నిర్ణయాన్ని తెలపడం తప్పు కాదని, అది తమను ఎదిరించడం కాదని పేరెంట్స్ ఆలోచించడం మొదలయ్యింది.
ఈ కథను ప్రముఖ రచయిత్రి సీత మండలీక గారు రచించారు.
“ 'ఇంకా గాయత్రి పెళ్లికి రెండు నెలలు ఉంది కదా! గాయత్రిని, మైత్రేయిని , విశాఖపట్నం పంపు వదినా. ఇక్కడ నేను, అక్క శైలజ ఉన్నాము కదా, కొన్నాళ్ళు పిల్ల లిద్దరూ మాతో గడిపి వస్తారు. గాయత్రి పెళ్ళైపోతే మళ్ళీ ఎన్నాళ్ళకో…' అని అపర్ణ ఫోన్ చేసిందండీ” అంటూ మీనాక్షి, తన భర్త సాంబశివరావు తో భోజనాల వేళ చెప్పింది.
"సరే చూద్దాం లే" అని శివరావు తేలికగా తీసుకున్నాడు.
"అలా అనకండి. అపర్ణ, శైలజ వీళ్ళని ఎంతో ఆప్యాయం గా పిలుస్తున్నారు. పంపడానికి మీరు ఎందుకు వెనక్కి తీస్తున్నారు?"
"పిల్లలు లేక పొతే నాకు తోచదు మీనాక్షీ"
"పది రోజులు అత్తయ్యలతో గడుపుతాం నాన్నా" అని ఇద్దరు పిల్లలూ కూడా ఒకే సారి అనడం తో శివ రావు గారు ఒప్పుకోక తప్పలేదు.
ప్రయాణం నిశ్చయం అయి టిక్కట్లు కొన్న దగ్గిరనించీ గాయత్రికి మైత్రేయి కి ఒకటే జాగ్రత్తలు చెప్పడం ఆరంభించేరు శివరావు గారు.
" అంతలా జాగ్రత్తలు చెప్పడం అవసరం లేదండి. గాయత్రి ఇంజినీరింగ్ అయి ఉద్యోగం చేస్తోంది. మైత్రేయి ఫైనల్ ఇయర్ లో ఉంది. వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు చూసుకో గలరు. మీరు బెంగ పడకండి" అంటూ మీనాక్షి వంట పని లో పడింది.
మీనాక్షి చిన్నప్పటినించీ పిల్లలకి ధైర్యం నూరి పోస్తూనే ఉండేది."ఆడ పిల్లలు అన్నిటికి నోరు మూసుకుని ఉండకూడదు.నోరు విప్పి మీ అబ్భిప్రాయం బయట పెట్టాలి. అలా అని ప్రతీ విషయం లోను హక్కులంటూ వాదన లోకి దిగకూడదు. జీవితం లో స్వయం కృషి తో పైకి రావాలి" అంటూ పిల్లలకి చెప్పేది.
శైలజ అత్త ఇంట్లో నాలుగు రోజులు, అపర్ణ అత్త ఇంట్లో నాలుగు రోజులు గడపాలని నిశ్చయించేరు పిల్లలిద్దరూ. శైలజత్త ని చూడగానే ఎంతో సంతోషం అనిపించింది ఇద్దరికీ.
శైలజ కూడా ఇద్దరినీ ఎంతో ఆప్యాయత తో దగ్గిరగా తీసుకుంది. అపర్ణ కూడా శైలజ ఇంటికి పిల్లలని చూడడానికి వెంటనే వచ్చేసింది. ఇల్లంతా పెళ్లి సందడి లా ఉంది.
“గాయత్రీ! మైత్రేయికి కూడా ఎదో మంచి మ్యాచ్ రెడీ గా ఉందని చెప్పేడు మీ నాన్న.
‘తనకి కూడా వచ్చే ఏడు చేసేద్దామనుకుంటున్నాము’ అని నాతో అన్నాడు. పిల్లల పూచీ అయి పోతే మీ అమ్మా నాన్నా హాయిగా యాత్రలు చేస్తూ ఊళ్లు తిరగచ్చు" అంది శైలజ.
గాయత్రికి ఆ మాట అంతగా నచ్చలేదు.
ఆఫీస్ నించి రాగానే భర్త కి చాలా సపర్యలు చేసేది శైలజ. ఏ భార్యయినా భర్తకి మంచి నీళ్లు, కాఫీ అందిస్తుంది. కానీ శైలజ, భర్త అలిసి పోయాడని బాధ వ్యక్తం చేస్తూ సేవ చెయ్యడం లో ఒక ప్రత్యేకత ఉంది.
ఆ వేళ ఆ ప్రత్యేకతలేమీ లేక పోయేసరికి రాఘవకి విపరీతమైన కోపం వచ్చింది. 'ఎంతయినా పుట్టింటి వారి సమావేశం కదా …..' అనుకున్నాడు .
“అయ్యో సారీ అండీ! గాయత్రి, మైత్రేయి వచ్చేరు. అపర్ణ కూడా వచ్చింది. రోజంతా సరదాగా గడిచి పోయింది. ఆ సందడి లో నేను మిమ్మల్ని చూసుకోలేదు” అని చాలా నొచ్చుకుంది
“కాఫీలప్పుడు పొద్దున్నే చెప్పేవు కదా” అంటూ పిల్లల్తో ‘హలో’ అన్నాడు రాఘవ.
"గాయత్రీ! నువ్వు కూడా భర్తకి సేవ చెయ్యడం నేర్చుకోవాలమ్మా" గాయత్రితో చెప్పాడు రాఘవ
“మా అక్క కనక మీకు ఈవిధంగా సేవలు చేస్తోంది.ఇలాంటి సేవలు ఈ రోజుల్లో ఎవరు చేస్తారండీ. మీ అమ్మాయి వినోద పెళ్ళై వెళ్లి పోయిన తరవాత అక్క కి పని లో హెల్ప్ చేసేవారు కూడా ఉండరు” అంటూ అపర్ణ తన మనస్సులో బాధంతా బావ గారి తో వెళ్ళ కక్కింది
“ఇంట్లో ఎంత మంది ఉన్నాము అపర్ణా.. ఇద్దరమే కదా” అంటూ రాఘవ అక్కడినించి మేడ మీద కి వెళ్ళిపోయేడు.
మరో మూడు రోజులు శైలజ ఇంట్లో గడిపి, అపర్ణత్త ఇంటికి వెళ్ళేరు గాయత్రి , మైత్రేయి.
అపర్ణత్తకి, సుధీర్ మావయ్యకి పెళ్ళై 25 ఏళ్ళు అయింది. అయినా వాళ్లిద్దరూ కొత్తగా పెళ్లి అయిన జంటలా జీవితం లో ఏ బాధ లేనట్టుంటారు. ఇద్దరి మధ్య ఎంతో అనురాగం. ఇద్దరిదీ ఒకే మాట. వాళ్ళని చూస్తే 'వివాహ బంధం ఇంత మధురం గా ఉంటుందా’ అనిపించింది గాయత్రి కి.
వాళ్ళ ఇంట్లో గడిపిన నాలుగు రోజులు నాలుగు ఘడియల్లా అయిపోయాయి.
రెండు నెలల్లో గాయత్రి. అఖిల్ ల పెళ్లి అంగ రంగ వైభవం గా జరిగి పోయింది .పెళ్లి
తరవాత వాళ్ళ జీవితం ఒక ఏడాది ఆనందం గా గడిచింది . తరవాత మెల్లిగా చిన్న చిన్న
అభిప్రాయ బేధాలు మొదలయ్యేయి. అవి భార్య భర్తల మధ్య సాధారణంగా వచ్చేవే .అవి
అంతటి తో ఆగిపోతే బాగుండును .కానీ వాళ్ళ మధ్య అది జరగ లేదు. చిలికి చిలికి గాలి వానలా
తయారయ్యేయి. ప్రతీ చిన్న విషయానికి ఇద్దరి మధ్యా వాదనలతో, ఇంట్లో శాంతి లేకుండా
పోయింది .
అఖిల్ బాగా తెలివైన వాడు. చాలా పెద్ద సంస్థ లో జాబ్ చేస్తున్నాడు. అందమైన
గాయత్రిని ఇష్ట పడి పెళ్లి చేసుకున్నాడే గాని గాయత్రి తెలివి తేటలని, తను చేస్తున్న
సామాన్యమైన జాబ్ ని చిన్న చూపు చూసే వాడు. తన తెలివి తేటలపై అతనికి అపారమైన
నమ్మకం. ఆ కారణంగా తక్కిన వారిని అగౌరవంగా చూసేవాడు. అదే గాయత్రికి నచ్చేది
కాదు. రోజూ ఈ వాదనల కన్నా విడిపోడమే మంచిదనిపించింది.
అదే నిశ్చయం తో ఒక రోజు గాయత్రి పుట్టింటికి వచ్చేసింది. తల్లి తండ్రులకి వాళ్ళ విషయం విపులంగా వివరించి వాళ్ళ నిశ్చయాన్ని తెలియజేసింది.
"కలిసి ఉండడం మానడం మీరే నిశ్చయించుకుంటారా గాయత్రీ.పెద్ద వాళ్ళని సంప్రదించాలని అనిపించ లేదా" అని తల్లి తండ్రి అనడంతో
"ఇద్దరికీ అసలు సరిపోక పోడం తో ఒక దగ్గర ఉండలేకపోయాం అమ్మా" అంటూ అతి సులువుగా తేల్చి చెప్పేసింది గాయత్రి.
ఈ పిల్ల ఇలా వచ్చేసిందంటే మైత్రేయి పెళ్లి ఎలా అవుతుందో అని తన బాధ భర్త తో చెప్పుకుంది వరలక్ష్మి.
"పిల్లలకి ధైర్యం ఉండాలి. వాళ్ళ మనో భావాలు బయటికి వ్యక్తం చెయ్యాలి అంటూ వాళ్ళకి నేర్పేవు. దాని ఫలితమే ఇది” అంటూ కొంచెం కోపం గానే అన్నాడు శివ రావు.
‘ధైర్యం నేర్పేనే గాని ఆలోచించ కుండా భార్య భర్తలు విడిపొమ్మని చెప్పేనా’ అని మనసులో అనుకుని మౌనం గా ఉంది పోయింది వరలక్ష్మి.
ఈ సంఘటన తరవాత శివరావు దంపతులు మైత్రేయి పెళ్లిని, శివరావు స్నేహితుడి
కొడుకు తో నిశ్చయించేరు. ఒక ఘంట పరిచయం తో జీవిత బాగా స్వామిని ఎన్నుకోడం
కష్టమెమో అనిపించింది మైత్రేయికి. అబ్బాయి నచ్చేడా అని అడగగానే నవ్వి ఊరుకుంది
మైత్రేయి కి సమ్మతమే అనుకుని ఇంకా ప్రశ్నలు వెయ్యక నెల రోజుల్లో ముహూర్తం పెట్టించేరు.
ఆ రోజు గాయత్రి , మైత్రేయి బయటకు వెళ్లి సాయంత్రానికి తిరిగి వచ్చేరు. మైత్రేయి మొహం లో ఆనందం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. నల్ల పూసల దండ, తల నిండా పువ్వులతో, కొత్త పట్టుచీర తో పెళ్లి కూతురులా ఉందేమిటి అనుకున్నారు శివరావు, వరలక్ష్మి.
వాళ్లిద్దరితో పాటు ఒక అందమైన అబ్బాయి కూడా ఉన్నాడు.
" అమ్మా! ఇతను సుధీర్. నా ఫ్రెండ్, కొలీగ్. మేమిద్దరమూ పెళ్లి చేసుకున్నాము” అంటూ బాంబు పేల్చింది మైత్రేయి.
" నీ పెళ్లి కూడా నిశ్చయం అయింది కదా, ఎవరి అనుమతి తీసుకుని ఈ పని చేసేవు." అని గట్టిగా అరిచేడు శివరావు.
"ఎవరి అనుమతి ఎందుకు నాన్నా? మేమేమి మైనర్ లం కాదు. ఇది మా పెళ్లి. మా జీవిత భాగస్వామి ని ఎంచుకునే హక్కు మాకు కూడా మీరు ఇవ్వాలికదా. కేవలం పెద్దలు నిశ్చయించడం అంత మంచిది కాదు. తరవాత కలిసి జీవించేది మేము కదా” అని నిర్భయం గా చెప్పింది మైత్రేయి.
"ఏం మాట్లాడుతున్నావు మైత్రేయి? ఎవరి తో చెప్పకుండా పెళ్లి చేసుకోడం కాక ఇంకా సమర్ధించు కుంటున్నావా? మేము ఎంత బాధ పడుతున్నామో నీకు అర్ధం అవడం లేదా.. " అంది వరలక్ష్మి
“ఇందులో బాధ ఎందుకమ్మా? నాకు సుధీర్ నాలుగేళ్ళనించీ తెలుసు. మా మధ్య ఎటువంటి అభిప్రాయం బేధాలు లేవు. ఒక వేళ ఏమైనా చిన్న ఇష్యూస్ ఉన్న మేము ఒకర్నొకరు సమాధాన పరుచుకో గలం. ఈ నాలుగేళ్ల స్నేహం వల్ల మేము ఒకరినొకరు బాగా అర్ధం చేసుకున్నాం” అంది మైత్రేయి
“ఏమిటి మైత్రీ! నేను అమ్మా ఎలా ఉన్నాము? మేమే కాదు . మా తరం వాళ్ళందరూ హాయిగా లేరా? మీ తరం వాళ్ళు కూడా పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు చేసుకుని పిల్లల తో హాయి గా ఉండడం లేదా” అని కలగ జేసుకుంటూ అన్నారు శివరావు గారు.
" నాన్నా! ఇదివరకు ఆడ పిల్లకి స్వతంత్రం లేదు. వాళ్ళు ఒక గిరి గీసుకుని బయటకు వచ్చే వారు కారు.పెళ్లి, భర్త, పిల్లలు… అదే జీవితం వాళ్లకి. వాళ్ళ కోరికలు, చదువులు, ఉద్యోగాలు చెయ్యాలని ఉన్నా అవి అణుచుకుని వివాహ జీవితం లో త్యాగం చేసేవారు..కానీ ఇప్పటి పిల్లల భావాలు వేరు. వారి జీవితాన్ని వారే అందం గా దిద్దుకుంటారు. చూడండి. మీకు తెలిసిన అబ్బాయితో అక్క పెళ్లి చేసేరు. ఏమైంది? వాళ్ళిద్దరికీ అసలు పడలేదు. పాపం! అక్క జీవితం ఏమైందో మీకు తెలుసు . నాన్నా! మేము హాయిగా ఉంటామనే ఈ పెళ్లి చేసుకున్నాము” అని ఆవేశం తో అంటున్న మైత్రేయి మాటలకి ఇద్దరూ ఆశ్చర్య పోయారు.
‘సరే.. పెళ్లి అయిపోయింది’ అని ఇద్దరూ రాజీ పడి అల్లుడిని ఆహ్వానించేరు
ఇలా ఒక సంవత్సరం గడిచింది. మైత్రేయి, సుధీర్ సుఖం గా కాపురం చేసుకుంటున్నారు. గాయత్రి స్కూల్ లో పని చేస్తోంది.ఆమెకు మళ్ళీ ఎలా పెళ్లి చెయ్యాలా అన్న ఆలోచన లో ఉన్నారు శివరావు వరలక్ష్మి.
శివరావు గారు ఆ రోజు తీరిక గా బాల్కనీ లో కూర్చుని ఆలోచనలో పడ్డారు. ‘సమాజం లో లవ్ మ్యారేజ్ మంచిదా లేక అరేంజ్డ్ మ్యారేజ్ మంచిదా అని తర్జన భర్జన జరుగు తోంది . కానీ దీనికి ఒక వైపు సమాధానం దొరకదు. వివాహం ఏ విధం గా చేసుకున్నా దాని సఫలత, వైఫల్యం.. భార్యా భర్తల మీద ఆధారపడి ఉంటుంది. ప్రస్తుత వాతావరణం లో పెళ్లి చూపుల్లో గడిపిన ఒక రెండు గంటల్లో.. లేక కలిసి తిరిగిన కొన్ని రోజుల్లో.. ఒకరినొకరు అర్ధం చేసుకోడం చాలా కష్టం. భార్య భర్తల మధ్య అవగాహన ఉండాలి. ఒకరినొకరు అర్ధం చేసుకుని జీవితం సుఖం గా గడపచ్చు. అప్పుడే దాంపత్య జీవితం సాఫీ గా సాగుతుంది.ఇది లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా సూత్రం ఒకటే’ అని ఒక నిశ్చయానికి వచ్చి హాయిగా గాలి పీల్చుకున్నారు శివరావు గారు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత్రి పరిచయం : సీత మండలీక
నేను హౌస్ మేకర్ ని. కొడుకులిద్దరూ అమెరికాలో పెళ్ళిళ్ళై స్థిరపడిపోయాక, భర్త ఎయిర్ ఇండియా లో రిటైర్ అయ్యేక ఇప్పుడు నాకు కొంచెం సమయం దొరికింది
కధలు చదవడం అలవాటున్నా రాయాలన్న కోరిక ఈ మధ్యనే తీరుతోంది
Pullela V Somayajulu • 2 days ago
Bagaane vundi.clarity kadhalo takkuva