#TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ, #SripathiLalitha, #శ్రీపతిలలిత, #BapukicchinaMata, #బాపుకిచ్చినమాట
Bapukicchina Mata - New Telugu Story Written By - Sripathi Lalitha
Published In manatelugukathalu.com On 06/01/2025
బాపుకిచ్చిన మాట - తెలుగు కథ
రచన: శ్రీపతి లలిత
కథా పఠనం: పద్మావతి కొమరగిరి
"పుత్రోత్సాహం తండ్రికి.."
నాలుగో క్లాస్ పిల్లలకి, తెలుగు పద్యం చెప్తున్న టీచర్ మాటలకి అడ్డంపడుతూ
"టీచర్! అమ్మాయి పుడితే తండ్రికి సంతోషం కాదా? " అడిగింది పదేళ్ల శృతి.
"శృతీ! పుత్రుడు అంటే కొడుకు అనే కాదు, అమ్మాయి కానీ, అబ్బాయి కానీ, పుట్టినప్పుడు పొందే సంతోషం కంటే, వాళ్ళు పెరిగాక, మంచి స్థాయిలో ఉండి, అందరూ వాళ్ళ పిల్లల్ని పొగిడితే, తల్లితండ్రులకు కలిగే సంతోషం ఎక్కువ అని అర్థం" పిల్లలకి వివరించింది టీచర్.
శృతి తల్లి భాగ్య, ఇళ్లల్లో పని చేస్తుంది, తండ్రి యాదయ్య ఆటో డ్రైవర్, ఎయిర్పోర్ట్ పక్కన బస్తీలో ఇల్లు, ఒక్కతే కూతురైన శృతి అంటే తల్లి, తండ్రులిద్దరికీ పంచ ప్రాణాలు.
యాదయ్యకి ఉన్న ఒకే ఒక్క బలహీనత విమానం.
ఎయిర్పోర్ట్ పక్కనే అనడంతో రోజూ ఉదయం, సాయంత్రం ఆ విమానాలని చూస్తూ "జన్మలో ఒక్క సారైనా విమానం ఎక్కాలిరా బుజ్జి" అంటుంటాడు.
"రోజూ ఎక్కుతున్నావే, అదే నీ విమానం బావా!" అంటుంది నవ్వుతూ భాగ్య.
ఆ రోజు సాయంత్రం, ఇంటికి వచ్చిన తండ్రితో, టీచర్ చెప్పిన పద్యం, దాని అర్థం చెప్పి "బాపూ! బాగా డబ్బు సంపాదించి, నేనెక్కిస్తానే నిన్ను విమానం, అప్పుడు నీకు మస్తు సంతోషం కలుగుతుంది" అంది శృతి.
తెలివితో పాటు, దేవుడు శృతికి మంచి స్వరం ఇచ్చాడు! బస్తీలో ఏ పండగ వచ్చినా శృతి పాట ఉండాల్సిందే.
ఆ సంవత్సరం వినాయక చవితికి, బస్తీలో నవరాత్రులు చేస్తున్నారు, లీడర్లు బాగా డబ్బులు పోగుచేసి, కార్యక్రమాలు గొప్పగా చెయ్యాలనే కోరికతో, ఒక వర్ధమాన గాయని, మాధవి ప్రోగ్రాం పెట్టారు. ఆ ప్రోగ్రాంకి బస్తీవాళ్లే కాక, బయట నుంచి కూడా చాలా మంది వచ్చారు.
మాధవి బృందం కొత్తపాటలు, పాతపాటలు పాడుతూ జనానికి హుషారు ఎక్కించారు. శృతికి వాళ్లతో తనూ, ఒక పాట పాడాలనిపించి తండ్రి కి చెప్పింది.
అక్కడ ఉన్న లీడర్ ఒకాయన, యాదయ్యకి బాగా తెలిసిన వాడు అవడంతో, ఆయనతో చెప్పించారు. మాధవి కూడా ఏదో చిన్నపిల్ల కదా, సరదా పడుతోంది అని పిలిచింది.
శృతి స్టేజి మీదకి వెళ్లి, ఏమాత్రం భయపడకుండా, కొత్తగా వచ్చిన సినిమాలో, మాధవి పాడి, చాలా హిట్ అయిన పాట మొదలుపెట్టింది, పక్కన కుర్చీలో ఎంతో విశ్రాంతిగా కూర్చున్న మాధవి, పల్లవి మొదలుపెట్టగానే నిటారుగా కూర్చుని, చరణం అందుకోగానే లేచి శృతి పక్కన నిల్చుంది.
పాట పూర్తి చేసాక, అందరూ చప్పట్లు కొట్టడం ఆపేసినా, ఆమె మాత్రం ఇంకా కొడుతూనే ఉంది.
"నువ్వు సంగీతం నేర్చుకుంటున్నావా?" అడిగిన ఆమెకి "లేదక్కా!" అని సమాధానం చెప్పింది శృతి.
"మీ అమ్మా, నాన్న ఉన్నారా ఇక్కడ" అనగానే యాదయ్య, భాగ్య లేచి ముందుకు వచ్చారు.
"అమ్మా! ఈ వయసులో, ఈ పాట, నేను పాడిన దానికంటే ఇంకా బాగా పాడింది. మీ అమ్మాయికి సంగీతం నేర్పించండి" అంది.
"అవన్నీ మాకు తెలీదమ్మా! మీరే చెప్పండి ఏమి సెయ్యాలో, ఎక్కడ చేర్పించాలో" అన్నాడు యాదయ్య. మాధవి వెంటనే తన కార్డు తీసి యాదయ్యకి ఇచ్చి "మీరు రేపు సాయంత్రం అయిదు గంటలకి శృతిని తీసుకుని ఈ అడ్రెస్ కి రండి" అని చెప్పింది.
అందరూ శృతిని పొగుడుతుంటే యాదయ్య, భాగ్య సంతోషంతో పొంగిపోయారు.
ఇంటికెళ్ళాక భాగ్య దిష్టి తీస్తుంటే "నిన్న మీ టీచరమ్మ చెప్పిందే, ఆ ఉత్సాహం ఇవాళ నాకు వచ్చింది" అని యాదయ్య అంటే, భాగ్య నవ్వింది "మీ బాపుకి 'పుత్రోత్సాహం' పలకడం రాదులే".
మర్నాడు ముగ్గురూ మాధవి చెప్పిన అడ్రస్ కి వెళ్లారు.
అక్కడ బోర్డు చూసి "వాణీ నిలయం, ఇక్కడ శాస్త్రీయ సంగీతం, లలిత సంగీతం నేర్పించబడును, గురువు, చైతన్య" చదివింది శృతి.
వీళ్ళని చూసిన మాధవి, "రండి, మాష్టారూ! నిన్న నేను చెప్పానే ఆ అమ్మాయే శృతి, ఎంత బాగా పాడిందో, మీరు ఒకసారి వినండి" అంది.
చైతన్య, శృతిని తనకి వచ్చిన పాట పాడమన్నాడు, తరవాత తనే రెండు పాటలు చెప్పి పాడించాడు, ఆ తరవాత ఆ అమ్మాయికి కొన్ని స్వరాలు చెప్పి, తను ఎలా అన్నాడో అలా అనమన్నాడు. శృతి తప్పులు లేకుండా చక్కగా పాడింది, ఆశ్చర్యపోయాడు చైతన్య.
"మీ అమ్మాయికి పూర్వజన్మ సుకృతం ఉంది, శిక్షణ ఇస్తే మంచి గాయని అవుతుంది, నేను మీ అమ్మాయికి సంగీతం నేర్పుతాను" చైతన్య మాటలకి
"సారూ! నేను ఆటో నడిపేటోడిని, నా భార్య ఇళ్లల్లో పని చేస్తుంది, ఏదో కష్టపడి మా పిల్లని ప్రైవేట్ స్కూల్ లో చదివిస్తున్నా, నేను ఎక్కువ డబ్బులు ఇవ్వలేను సారూ!" అన్నాడు యాదయ్య.
"సంగీతం నేర్పినందుకు డబ్బులు తీసుకోను, కానీ, రోజూ నేను చెప్పిన టైంకి రావాలి, నేను చెయ్యమన్నట్టు సాధన చెయ్యాలి, గొప్ప గాయని అయ్యి, గురువుగా నా పేరు నిలబెట్టాలి, అదే నాకు ఇచ్చే దక్షిణ" అన్నాడు చైతన్య.
"మీరెలా చెప్తే నేను అలా నేర్చుకుంటాను, బాగా పాడితే, మా బాపుని ఒక్కసారి విమానం ఎక్కించవచ్చా?" అడిగింది శృతి.
"ఒక్కసారేమిటి, మీ నాన్నని విమానాల్లోనే తిప్పచ్చు, కానీ నేను చెప్పినట్టు వినాలి" అన్నాడు చైతన్య.
శృతి సంగీత ప్రయాణం మొదలైంది, ఎన్నింటికి లేవాలి, ఏమి తినాలి, ఎలా సాధన చెయ్యాలి అంతా చైతన్య చెప్పిన ప్రకారం చేసేది.
"సంగీతం నేర్చుకోవడం అంటే చదువు నిర్లక్ష్యం చెయ్యడం కాదు, నిజానికి నీకు ఇంకా జ్ఞాపకశక్తి పెరుగుతుంది, ఇంకా మంచి మార్కులు రావాలి" చెప్పాడు చైతన్య.
ముందు అన్ని పోటీలకు వెళ్లి, అందరూ ఎలా పాడుతున్నారో వినమనేవాడు, ఒక సంవత్సరం తరవాత, శృతిని కూడా పోటీలకు పంపడం మొదలు పెట్టాడు చైతన్య. యాదయ్యకి శృతిని సంగీతానికి తీసుకెళ్లడం, ప్రోగ్రాంలకు తీసుకెళ్లడంతో ఆదాయం సరిగ్గా వచ్చేది కాదు. అందుకని రాత్రి పూట, తెల్లవారుజామున లేచి ఆటో తిప్పేవాడు.
"నీ ఆరోగ్యం పాడవుతుంది బావా! ఇలా సరిగ్గా నిద్ర లేకపోతే కష్టం" అనే భాగ్యత,
"మనకి సరస్వతి లాంటి కూతురు పుట్టింది, అందరూ మన అమ్మాయిని ఇంత పొగుడుతుంటే, మనం ఈమాత్రం కష్టపడక పొతే ఎలా? రేపు మన శృతి మంచి పాటలు పాడి, పేరు తెచ్చుకుంటే మనకి ఎంత సంతోషం" అనేవాడు యాదయ్య.
శృతి పోటీలో గెలిచి, తల్లి, తండ్రిని, గురువుగారిని సంతోష పెట్టడమే, తన గమ్యం, ధ్యేయం అనుకొనేది.
అదే టైంలో, ఒక పెద్ద హిందీ ఛానల్ వాళ్ళు, పదిహేను ఏళ్ళ లోపు పిల్లలకి పెడుతున్న పాటల పోటీలకు ప్రకటన వచ్చింది.
చైతన్య తన సంగీత పాఠశాల నుంచి శృతితో సహా ఒక పదిమందిని పంపాడు. ఆడిషన్స్ లో శృతి ఒక్కతే సెలెక్ట్ అయింది. ఆ తరవాత ప్రోగ్రాం, దగ్గర, దగ్గర మూడు నెలలు పడుతుందని, ముంబై లో ఉండాలని చెప్పారు, శృతితో భాగ్యని రావచ్చు అన్నారు.
"మూడు నెలలు నువ్వు ఒక్కడివి ఉండాలి, మమ్మల్ని వదిలి ఉండడం ఇదే మొదలు, నీ భోజనం ఇబ్బంది, ఎలా బావా? పోనీ పోటీ వదిలేద్దామా?"దిగులుగా అంది భాగ్య.
"నీకు పిచ్చా! నువ్వు చూడలేదా ఆ రోజు ఎంత మంది వచ్చారో, వేలల్లో వస్తే, మన అమ్మాయి సెలెక్ట్ అయింది, నిజంగా పోటీలో చివరి వరకు వస్తే మూడు నెలలు ఉండాలి, మనం ఆ మాత్రం కష్టపడలేమా? నేను మా అమ్మా, అయ్యలకి ఫోన్ చేశాను, వాళ్ళు వచ్చి ఉంటారు" అన్నాడు యాదయ్య.
భాగ్యకి, శృతికి విమానం టిక్కెట్లు పంపారు ఛానల్ వాళ్ళు, అక్కడ ఉండడానికి వాళ్లే ఏర్పాటు చేశారు, ఆ టికెట్ చూడగానే శృతి ఏడ్చింది.
"బాపూ! నిన్ను ఎక్కిద్దామనుకున్నా విమానం" అంటూ,
"మంచిగా పాడి గెలిచిరా బిడ్డా! అదే నేను విమానం ఎక్కినంత " అని ఓదార్చాడు యాదయ్య.
పోటీలో మొదటి రోజు నుంచి అందరి మన్ననలు పొందింది శృతి.
అక్కడ అందరికీ తన కుటుంబ నేపధ్యం చెప్పినప్పుడు ఎవరూ కించపరచలేదు, పైగా ఇంకా ఎక్కువ ప్రోత్సాహం దొరికింది. అలా ఒకో మెట్టు ఎక్కుతూ మొదటి ఆరుగురిలోకి చేరింది.
యాదయ్య ప్రతిరోజూ ఫోన్లో మాట్లాడుతున్నాడు, అక్కడి విషయాలు భాగ్య చెప్తూనే ఉంది.
టీవీలో వీళ్ళని చూసిన బస్తీ వాళ్ళు, యాదయ్య అదృష్టం పొగుడుతుంటే, అతని ఆనందానికి హద్దు లేదు, కానీ ఒకటే లోటు, తను కూడా కూతురితో ఉండలేకపోయాను అని.
ఆ రోజు ఫైనల్స్ కి ఎవరు వెళ్తారో తేలే రోజు, ఆ రోజున ఒక పెద్ద సంగీత దర్శకుడు షోకి వస్తున్నారు. అందరు పిల్లలూ బాగా సాధన చేస్తున్నారు, ఒకసారి ఆయన దృష్టిలో పడితే వీళ్ళ జాతకం మారి పోతుంది.
షో మొదలు అయింది, అక్కడ కూర్చున్నవాళ్ళు, టీవీల ముందు కూర్చున్నవాళ్ళు, ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు ఏ ముగ్గురు ఫైనల్స్ కి వస్తారో అని. ఇద్దరు పిల్లలు పాడాక, శృతి వంతు వచ్చింది. శృతి తన గురువుగారు చైతన్యకి, మాధవికి కృతజ్ఞతలు చెప్పి, తల్లి, తండ్రులు తన కోసం ఎంత కష్ట పడుతున్నారో చెప్పి, పాట మొదలుపెట్టాక అందరూ మంత్రముగ్ధులైపోయారు. పాట ఆపాక అందరూ లేచి చప్పట్లు కొట్టారు.
యాంకర్ వచ్చి "ఎలా ఉంది మా శృతి పాట డైరెక్టర్ గారూ" అని అడిగితే "మీ అమ్మా, నాన్నా ఇక్కడ ఉన్నారా?" అని అడిగారు ఆయన.
భాగ్య లేచి నుంచుని నమస్కారం పెట్టింది ఆయనకి, "అమ్మా! మీరు చాలా అదృష్టవంతులు, మీ అమ్మాయికి సరస్వతీ కటాక్షం ఉంది, భవిష్యత్తులో చాలా పెద్ద గాయని అవుతుంది, ఇపుడు నేను చేస్తున్న సినిమాలో ఒక చిన్నపిల్లకి పాట ఉంది, అది మీ అమ్మాయితో
పాడిస్తాను" అన్నాడు.
భాగ్య నోటివెంట మాట రాలేదు, కళ్లనీళ్లు కారుతుండగా ఆయనకి నమస్కారం పెట్టింది.
శృతి నమ్మలేనట్టుగా చూసి ఏడుస్తూ కూలబడిపోయింది.
యాంకర్ గబగబా శృతిని పట్టుకుని "ఏమైంది? ఇంత మంచి వార్త విని సంతోషపడాలి కానీ ఏడుస్తారా ?" అన్నాడు.
"ఈటైంలో మా బాపు ఉంటే ఎంత బావుండేదో" అంది ఏడుస్తూ.
"శృతీ! నీకు ఒక సర్ప్రైజ్, మీ బాపుని చూద్దామనుకుంటున్నావు కదా! ఇరిగో మీ బాపు" అంటూ యాదయ్యని ప్రవేశపెట్టాడు.
సంతోషం తట్టుకోలేని శృతి "బాపూ!" అంటూ పరిగెత్తి తండ్రిని హత్తుకుంది.
అతని కళ్లలోనుంచి నీరు కారుతోంది. "బాపుకిచ్చిన మాట నిలబెట్టావు బుజ్జి!
నేను ఒక ఆటో డ్రైవర్ని సార్! జన్మలో ఒక్కసారి అయినా విమానం ఎక్కాలని నా కోరిక, నా కూతురు నాకు చెప్పింది, బాపూ! నేను నిన్ను విమానం ఎక్కిస్తాను అని, ఈ రోజు తన వల్లనే విమానం ఎక్కాను, అంతే కాదు, అందరూ నన్ను శృతివాళ్ళ బాపు అని అంటుంటే చాలా సంతోషంగా ఉంది" అని చెప్తుంటే "యాదయ్య గారు! ఎలా ఉంది విమాన ప్రయాణం?" అడిగాడు యాంకర్.
"మస్తు ఉంది సార్!" అంటే, అందరి నవ్వులు, చప్పట్ల మధ్య
"సార్! ఇంకో మాట, ఈ రోజు మా అమ్మాయి వలన నేను అదేందో ఉత్సాహం పొందాను, అదేంది బుజ్జి" అని శృతిని అడిగితే
"పుత్రోత్సాహం" అన్న జవాబుకి అందరు చప్పట్లు కొట్టి హర్షధ్వానాలు చేసారు.
***
శ్రీపతి లలిత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం:
నా పేరు శ్రీమతి శ్రీపతి లలిత.
నేను ఆంధ్రా బ్యాంకు లో ఆఫీసర్ గా పని చేసి పదవీ విరమణ చేశాను.
నా భర్త గారు శ్రీపతి కృష్ణ మూర్తి గారు కేంద్ర ప్రభుత్వం లో గెజెటెడ్ ఆఫీసర్ గా పని చేసి పదవీ విరమణ చేసారు.
నాకు చిన్నప్పటి నుంచి పుస్తక పఠనం , శాస్త్రీయ సంగీతం , లలిత సంగీతం వినడం ఇష్టం.
అరవై ఏళ్ళ తరవాత జీవితమే మనకోసం మనం బతికే అసలు జీవితం అనుకుంటూ రచనలు మొదలు పెట్టాను.
నా కధలు ఫేస్బుక్ లోని "అచ్చంగా తెలుగు " , "భావుక " గ్రూప్ లో , " గోతెలుగు. కం" లో ప్రచురించబడ్డాయి.
ప్రస్తుత సమాజం లో ఉన్న సమస్యల మీద , ఏదైనా పరిష్కారం సూచిస్తూ కధలు రాయడం ఇష్టం.
నేను వ్రాసిన కధలు ఎవరైనా చదువుతారా !అని మొదలు పెడితే పాఠకులనుంచి మంచి స్పందన, ప్రోత్సాహం , ఇంకాఉత్సాహం ఇస్తుంటే రాస్తున్నాను.
పాఠకుల నుంచి వివిధ పత్రికల నుంచి ప్రోత్సాహం ఇలాగే కొనసాగగలదని ఆశిస్తూ.. మీకందరికీ ధన్యవాదాలుతెలుపుతూ మళ్ళీ మళ్ళీ మీ అందరిని నా రచనల ద్వారా కలుసుకోవాలని నా ఆశ నెరవేరుతుంది అనే నమ్మకం తో ... సెలవు ప్రస్తుతానికి.
Comments