కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
'Baruventha' written by Gorthi VaniSrinivas
రచన : గొర్తి వాణిశ్రీనివాస్
అనుకోకుండా కష్టాలు వచ్చాయి గురునాథానికి.
అప్పట్నుంచి అతని ప్రవర్తన వింతగా మారింది.
పిచ్చిగాని పట్టలేదుగదా అనుకున్నారు ఇరుగు పొరుగు వాళ్ళు. కానీ తన వింత ప్రవర్తనకు కారణం వివరించాడు గురునాథం.
ప్రముఖ రచయిత్రి గొర్తి వాణిశ్రీనివాస్ ఈ కథను రచించారు.
"అన్నయ్యగారూ! ఓసారి ఇలా వస్తారా?మీస్నేహితుడి వాలకం చూస్తుంటే నాకేదో భయంగా వుంది." అంటూ కళ్లనీళ్ల పర్యంతమైంది సువర్చల.
"ఆ! వస్తున్నా ఉండమ్మా!" అన్నాడు పక్కింటి మోహనరావు .
ఒంకెన తగిలించున్న చొక్కా తీసి తొడుక్కుంటూ.
"ఏమైందండీ? ఏంటీ ఆ కంగారు.. చీకటి పడ్డాక ఇంత హడావిడిగా ఎక్కడికీ బయల్దేరారు?" అని అడిగింది మోహనరావు భార్య సౌభాగ్యమ్మ.
"ఏం లేదు. మన రామనాధం ఏదో హడావిడి చేస్తున్నాట్ట. మా సువర్చల చెల్లెమ్మ త్వరగా రమ్మంటోంది." అన్నాడు
“అవునా.. నేనూ వస్తానుండండి” అని తలుపు దగ్గరికేసి పక్కింటికి బయల్దేరింది సౌభాగ్యమ్మ.
"ఏమైందమ్మా ఇంత హడావిడిగా రమ్మన్నావ్. మావాడేడీ?" అన్నాడు మోహనరావు
"ఆగదిలో కూర్చుని పాటలు పాడుతున్నారు. ఆయన పరిస్థితి చూస్తే నాకెందుకో భయంగా ఉందన్నయ్యా"అంది సువర్చల.
"పాటంటే మామూలు పాటేనా లేక వేలంపాటా?! పాటకే అంత భయపడాల్సిందేముంది
ఏవయ్యా వేణూ! మీనాన్న ఏదో హడావిడి చేస్తున్నాట్ట ఏవిటీ సంగతి? అన్నాడు మోహనరావు
"అవునంకుల్! నిన్న వాళ్ళ బావకి యాక్సిడెంట్లో మణికట్టు చిట్లిందని బ్యాండేజ్ వేశారని అత్తయ్య ఫోన్ చేసి చెప్పింది. మూడు వారాలపాటు కదలకూడదని డాక్టర్ చెప్పారట, తర్వాత అమెరికా నుంచి అక్క ఫోన్ చేసి తనకు ఉద్యోగం పోయిందని చెప్పింది అప్పటినుంచీ నాన్న వింతగా ప్రవర్తిస్తున్నారు" చెప్పాడు వేణు.
"అంతేకాదు అన్నయ్యగారూ! నిన్ననే ఆయనకి ఈ నెల పూర్తి జీతం రాదని, డెభై అయిదు శాతమే ఇవ్వగలం అని ఆఫీసువాళ్ళు చెప్పారట. ఎవరైనా జీతం తగ్గుతుందంటే ఇంటికొచ్చి రంకెలేస్తారు. కంపెనీ వాళ్ళని నోటికొచ్చినట్టు నానా తిట్లూ తిట్టి తృప్తిపడతారు లేదా ఖర్చులు తగ్గించుకోమని ఇంట్లోవాళ్లపై విరుచుకుపడతారు.
అదేవిటోగానీ ఈయనమాత్రం 'ఉందిలే మంచికాలం ముందుముందునా' అని తెగ పాటలు పాడుతున్నారు.
తడిగుడ్డేసుకుని పడుకుంటా అంటూ మీతో చెప్పకూడదు గానీ తడి టవల్ కట్టుకుని పడుకున్నారు.ఈయన వింత చేష్టలు నాకర్ధం కావట్లేదు
క్రితం నెల అబ్బాయికి ప్రమోషన్ వచ్చినప్పుడు, మాకు మనవడు పుట్టాడని తెలిసినప్పుడు కూడా పెద్దగా స్పందన లేకుండా కూర్చున్నారు. పోన్లే స్థితప్రజ్ఞులయ్యారనుకున్నా. ఇప్పుడు ఈ వింతానందం దేనికో అర్ధం కావట్లేదు" అంటూ చీర కొంగుతో కళ్ళు తుడుచుకుంది సువర్చల.
"ఏవోయ్! మా చెల్లెల్ని ఇంతలా బెదరకొడుతున్నావ్ !ఏవిటీ కథ. కొత్త పెళ్ళికొడుకు లాగా ఆ గదిలో ఏం చేస్తున్నావ్?ఇలా బయటకి వచ్చి కూర్చో." అన్నాడు మోహనరావు.
"చీకటి వెలుగుల రంగేళీ జీవితమే ఒక దీపావళి"
అని పాడుకుంటూ వచ్చాడు రామనాధం.
"ఏవిటిరా మోహనుడా! నీ హడావిడి. హాయిగా పాటలు కూడా పాడుకోనివ్వవా ? నా సంతోషానికి విఘాతం కల్పించడానికి మందీ మార్బలంతో వచ్చావా దుర్యోధనా? సంధి చేసుకో బతికిపోతావ్.లేదా యుద్ధానికి కాచుకో చితికిపోతావ్
చెల్లియో చెల్లకో...." అంటూ పద్యం అందుకున్నాడు రామనాధం
"చాల్లే ఊరుకోరా! ఏవిటీ నీ ధోరణి. నాకర్ధం కావట్లేదు. చెల్లెమ్మ కంగారు పడుతోంది.అటుచూడు ఎలా కన్నీళ్లు పెట్టుకుంటోందో" అన్నాడు మోహనరావు.
"నేను సంతోషంగా ఉంటే నీకు కన్నీళ్లేందుకే పిచ్చిదానా! 'నేను నవ్వాను లోకం ఏడ్చింది నేను ఏడ్చాను లోకం నవ్వింది 'అన్నట్టుంది నీ వ్యవహారం." అన్నాడు రామనాధం.
"ఏడిసినట్టుంది. నవ్వేటప్పుడు నవ్వాలి.ఏడ్చేటప్పుడు ఏడవాలి. తారుమారుచేస్తే కంగారుకాదేంటి?" అంది సువర్చల.
"ఎప్పుడు ఏది చెయ్యాలో అదే చేస్తున్నాను తారుమారేం చేయట్లేదు.
క్రితం నెల అన్నీ శుభవార్తలే విన్నాను. అప్పుడే అనుకున్నాను.ఈ నెల ఏవో దుర్వార్తలు వినాల్సొస్తుందని.
అలాగే జరిగింది. మళ్లీ నెల వస్తుంది. మంచి వార్తలెన్నో తెస్తుంది. ఈ బాధను తలపొసేకంటే రాబోయే సుఖాలకి వెల్కమ్ చెప్పటం ఎంతహాయో నీకేంతెలుసు.
ఇంతోటి దానికి ఏడుపులూ పెడబొబ్బలూ దేనికి.
శ్రీకృష్ణుడు అర్జునిడికి పద్దెనిమిది అధ్యాయాలు, ఏడు వందల శ్లోకాలు చెప్పి శోకం వద్దు నాయనా కష్టం వెనక సుఖం వస్తుంది. ఇది చక్ర భ్రమణం .చింతించవలదు అని చెప్పాడు.
అదే గీతని మనం చిన్నప్పటి నుంచీ ఇప్పటికి
పది సార్లు చదివుంటాం. కొన్ని పద్యాలు కంఠతా పట్టాం. ఏం నేర్చుకున్నాం?కష్టం వస్తే కుంగిపోవడం సుఖం రాగానే పొంగిపోవడం
సంతోషాలు క్షణికమైతే బాధలూ క్షణికాలేగా.
కానీ కష్ట క్షణాలు త్వరగా గడవ్వు. అందుకే
ఏదో ఒక వ్యాపకంలో వాటిని దాటటానికి ప్రయత్నిస్తున్నా. సుఖంలోకి ప్రయాణిస్తాం కదా. అందుకే కష్టం రాగానే నవ్వుకుంటా. ఏ తప్పా...'బాధే సౌఖ్యమనే భావన రాజీవోయ్'
అని పాడుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు
రామనాధం
"ఆలోచిస్తే అన్నయ్యగారి మాటల్లో సత్యం కనబడుతోందండీ
.
మనమందరం కూడా పాటించాల్సిన గీతా వాక్యాలవి.
ఎన్నో చదువుతాం,వింటాం. కానీ అసలు సమయం వచ్చినప్పుడు అన్నీ మర్చిపోతాం.
ఇతరులకు చెప్పేటప్పుడు మాత్రం మళ్లీ గుర్తొస్తాయి.
అన్నయ్యగారిలా ఆందోళనను హ్యాండిల్ చేసుకోగలిగితే ఈ సుగర్లు బీపీ లు రావు. ఎవరైనాసరే కొన్ని వ్యక్తిగత వ్యాపకాలు పెట్టుకుని సంతోషాన్ని వెతుక్కుంటూ
కొన్ని ఇబ్బందికర పరిస్థితుల్నించి గట్టెక్కాల్సిందే
తర్వాత ఎట్లాగూ కాలం మారుతుంది. మంచి రోజులొస్తాయి.లీడర్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే జట్టు అంత బలంగా ఉంటుంది. ఇంటి యజమాని స్ట్రాంగ్ గా ఉంటే కుటుంబం బాగుంటుంది ఏమంటారు" అంది సౌభాగ్యమ్మ.
ఉల్లాసంగా ఉండటం ఒక అలవాటుగా మార్చుకుంటే జీవితం అంత బరువు కాబోదని అర్ధం చేసుకుని మనం అలాగే వుందాం. అన్నారు అక్కడి వాళ్ళంతా.
***శుభం***
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత్రి పరిచయం : గొర్తి వాణిశ్రీనివాస్(గృహిణి)
విశాఖపట్నం.
భర్త : గొర్తి శ్రీనివాస్ గారు
ఇద్దరు పిల్లలు. కుమార్తె, కుమారుడు
గత కొంతకాలంగా సామాజిక సమస్యలను అధ్యయనం చేస్తూ
కథలు , కవితలు రాస్తున్నాను. సమాజంలోకి, వ్యక్తులలోకి, మనసులలోకి
తొంగి చూస్తాయి నా రచనలు.
హాస్య రస ప్రధాన రచనా ప్రక్రియ మీద మక్కువ ఎక్కువ.
కథలు, కవితల పోటీలలో బహుమతులతో పాటు వివిధ పత్రికలలో ప్రచురణ.
సామాజిక ప్రయోజనం కలిగిన కొత్త ఆలోచనకు బీజం వేయగలిగే రచన చేసినపుడు కలిగే తృప్తి నా రచనలకు మూలధనం.