#DrKanupuruSrinivasuluReddy, #కనుపూరుశ్రీనివాసులురెడ్డి, #బస్తీ, #Basthee, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు, #సామజికసమస్యలకథలు
వారం వారం బహుమతుల పథకంలో ఈ వారం ఉత్తమ కథగా (26/01/2025) ఎంపికైన కథ

Basthee - New Telugu Story Written By Dr. Kanupuru Srinivasulu Reddy
Published In manatelugukathalu.com On 26/01/2025
బస్తీ - తెలుగు కథ
రచన : డా. కనుపూరు శ్రీనివాసులు రెడ్డి
నిన్న జరిగిన సంఘటన డా. రేవంతు మనసును చిన్నా భిన్నం చేస్తుంది. చదువుకోవాలనే తపనను ఆర్ధికస్తోమత అణగదోక్కటం సహించలేకపోతున్నాడు. సంపాదనకోసం ముక్కు పచ్చలారని చదువుల సరస్వతులను వ్యభిచారానికి ప్రోత్సహించడం జీర్ణించుకోలేక పోతున్నాడు. దారిద్రానికి వ్యభిచారం దళారి కాకూడదు. బడుగు ఆడపిల్లల జీవితానికి అర్ధం కాకూడదు. ఏదయినా చెయ్యాలి. ? వెళ్ళాలి.. నచ్చచెప్పాలి.. నయాన్నో భయాన్నో ఆ ఆలోచన ఆచరణలోకి రాకుండా చూడాలి.
పది స్వీటు ప్యాకెట్సు తెప్పించి ఉదయం కారులో పెట్టమంటే ఆశ్చర్యపోయాడు సుబ్బయ్య. డాక్టర్ రేవంత్ నమ్మినబంటు!! ఎందుకు ఎక్కడికని అడగటానికి భయపడ్డాడు.
ఇద్దరూ బయలు దేరారు.
“బస్తీ తెలుసా ?”
“ఏ బస్తీ.. అంటే చార్మినార్ బస్తీనా సార్ ?”
“ కాదు. హైదరాబాద్ శివార్లలో ఇందిరానగర్, భూషణ్ నగర్ అవేనా..!!”
“ఇంకా చాల ఉన్నాయి బాబు, సిరిలిగంపల్లి, కూకట్ పల్లి, అయినా అక్కడకు మనమెందుకు ?“
“మొన్న చావు బ్రతుకుల్లో ఒకతన్ని తీసుకుని ముగ్గురమ్మాయులు వచ్చారుకదా !”
“మయగమ్మి.. ఆ.. ఆ అతను.. నాకు తెలిసినోడే ఆటో డ్రైవర్.. కూతుళ్ళు తీసుకు వచ్చారు”
“అతనిని చూడటానికి వెళ్ళుతున్నాము. ఆ బిడ్డల ఏడుపు, బాధ చూడలేక పోయాను. వాళ్ళ కధ విన్న తరువాత సహాయపడాలనిపించింది. మూడురోజులు తిండి తినకుండా ఉన్నారు. తెలుసుకుని నీతో చెప్పితే తినిపించావు. పెద్ద అమ్మాయి ఇంటర్లో మంచి మార్కులు వచ్చాయని చెప్పింది. చదువు మానేస్తాను. దగ్గరిలో కాలేజీ లేదని చెప్పింది. పూట గడవడమే కష్టంగా ఉందని చాలా మొహమాట పడుతూ చెప్పలేక చెప్పింది. అందుకే.. !”
“నాకూ చాలా కష్టం అనిపిచింది బాబు. అయినా ఇప్పుడు గవర్మెంటు వాళ్ళు ఇస్తున్నారు కదా బాబు. మనకెందుకు ? వాళ్ళమ్మ రాలేదు. వదిలేసిందేమో ఈడ్ని”
“ లేదు ! వాళ్లమ్మే చదువుకు అడ్డు పడుతుందంట. అతని పేరు ఏమిటన్నావు ?“
“రామచంద్రయ్య !”
“ఉండేది తెలుసా !”
తలూపాడు.
“అవున్లే ! మందు బాబులుకదా !”
తల దించుకున్నాడు సుబ్బయ్య.
ఆ అమ్మాయి చాలా బాగుంటుంది. మా సార్ కి ఇలాంటి అమ్మాయయితే.. వెంటనే తన వెధవ బుద్దికి మొటిక్కాయ వేసుకున్నాడు. చిన్న బిడ్డ!!
“అందుకనే ముగ్గరిని బిసి హాస్టల్లో పెట్టి, వాళ్ళ అమ్మా నాన్నలను నీకు తోడు ఉంచుతాను.”
ఆశ్చర్యంగా చూసి వద్దు అని చెప్పలేక తల గీరుకుంటూ, “ఇక్కడే ! కొంచెం ముందు” అన్నాడు.
దగ్గరకు వెళ్ళిన తరువాత ఒక గుట్టమీద కారు ఆపి, ఆ ప్రదేశం వైపు చూస్తే, ఒక పాడుపడిన పెద్ద ఇనుప రేకుల ఫాక్టరీలా ఉంది. అక్కడక్కడ కరెంటు పోల్సు, గాలికి ఎగురుతున్న ఇండ్ల కప్పులపై ప్లాస్టిక్ షీట్లు, కాగితాలు, తడికెల చుట్టూ చుట్టినట్లు ఉన్నాయి, ఎండాకాలంలో మనుషులుగా ఉండే వాళ్ళు ఉండలేరు. గాలిలో వింత అరుపులు ఏడుపులు భయంకలిగించేటట్లు అర్ధంగాని ఘోషగా విన్పిస్తున్నాయి.
పుణ్య భూమి నాదేశం నమో నమామి. అన్నపూర్ణ నా దేశం సదా స్వరామి.
ప్రపంచంలో అతి పెద్ద మురికి వాడలు సౌత్ఆఫ్రికా, నైరోబి, కెన్యా, మెక్సికో; ఇండియాలో దారవి- బొంబాయి; ఆరంజ్ టౌన్.. కరాచి పాకిస్తాన్లో బంగ్లాదేశ్ లో ఉన్నాయి. డ్రగ్ మాఫీయాలు, ఉమెన్ ట్రాఫ్పికింగ్ లకు పుట్టుక ఇక్కడే అవుతుంది. పల్లెల్లో గడవక పనికోసంగాక మోజుతో ఇక్కడికి వచ్చి అష్టకష్టాలు పడుతారు. కూటికోసం చేయరాని పనులు చేస్తారు.
గాఢ నిట్టూర్పు వదిలి ముందడుగు వేసాడు. నడుస్తుంటే.. బురద కాలువలు, దాని మద్య రాళ్ళు, నడవాలంటే కష్టమే? ఆ ప్రదేశంలో మనుషులు ఉంటారా? వీళ్ళు మనుషులేనా? ఎందుకు బ్రతుకుతున్నారు? ఏం బావుకుందామని? ఛీ.. ఏవిటి తన ఆలోచన? పేదరికాన్ని గురించి హీనంగా అనుకోకూడదు అని తల విదిలించుకున్నాడు.
“బాబూ ! చూసి నడవండి జాగ్రత్త! రాళ్ళు జారుతాయి, నిదానంగా అడుగువెయ్యండి. బురద కంపు!!” అంటూ ముక్కు మూసుకున్నాడు సుబ్బయ్య.
నడుస్తున్నాడే గాని, ఆలోచనలతో తెలియని అలజడి!! ఇలాంటి పెరుగుదలలో పిల్లలు ఎలాంటి వ్యక్తిత్వంతో తయారవుతారు ? ఎలాంటి భావి భారత పౌరులవుతారు?
ఎదురుగా ఎవరో వచ్చి తగిలారు. పడబోయి సుబ్బయ్యను పట్టుకున్నాడు రేవంత్. చూస్తే ముందు ఒక స్త్రీ నిలుచుని కోపంగా అరుస్తుంది.
ఏవిటో అర్ధంగాలేదు రేవంతుకు. ? వింటే, నానా బూతులు తిట్టుతూ, పై పైకి వస్తుంది. రేవంతే భయపడ్డాడు. ఆమెతో మరో నలుగురు ఆడంగులు కలిసారు.
“అందా హై క్యా? చెప్పల్సే మారుదూన్గా! కౌన్రేతూ? బస్తీవాలా! ఇజ్జత్ కరాబ్ చేస్తావ్.”
“అమ్మా! చూడక తగిలింది. మాఫ్ కర్దో. ” అంటూ బ్రతిమలాడాడు సుబ్బయ్య.
“మాఫ్ కర్దూన్గా! దేవో దస్ హజార్. దేదో!!” అంటూ పై పైకి రాసాగారు.
నిజంగా భయ పడ్డాడు రేవంత్. డబ్బులు ముఖాన కొట్టితే పోతుంది అని జేబులో చేయ్యపెట్టాడు.
సుబ్బయ్య అడ్డు తగిలి, “బాబూ ! మీరు గమ్మనుండండి. ఇచ్చినా వదలరు.” అంటూ, “మై పోలీసుకో బులాదూన్గా” అని బెదిరించాడు.
ఆ మాట ఎప్పుడన్నాడో అంతే, చేతికి ఏది ఆందితే దాంతో కొట్టుతూ, ”బులావ్.. బులావ్ రే ! క్యా సోచ్తా రే! బులావ్.. బులావ్ !” పైపైకి వచ్చేసారు.
సుబ్బయ్య దెబ్బలు తిని, బ్రతిమలాడుకొని, వెయ్యి రూపాయలిచ్చి బయటబడ్డారు. గుమికూడిన వారు చోద్యం చూస్తున్నారు. కలగ చేసుకోలేదు.
నాలుగు అడుగులు వేసారో లేదో ఒక ఇంట్లోనుంచి మురికి నీళ్ళు వీధిలోకి విసిరారు. ముద్ద ముద్ద అయిపోయిన సుబ్బయ్య, రేవంత్ ఆశ్చర్యంగా చూసారు.
“ఏం అప్పిడి పాకరే! పొంగో పొంగో ! యారు ఇల్లే ఇంగే. అడిచడమే! పోరికి పసంగ్ ! లం.. కోసం.. ! “ అని గుడ్లురిమింది.
తిరిగి ఎదో అనబోయి జరిగింది గుర్తొచ్చి మానుకున్నాడు. ముఖ కడుకుందామని అటు ఇటు చూసాడు రేవంత్. దూరంగా ఒక పది మంది ఆడోల్లు బిందెలతో బురద గుంట ప్రక్కన కూర్చొని పెద్దగా బూతు రామాయణాలు, దోపిడీ భారతాలు మాట్లాడుతున్నారు. ఇరిగి పోయిన కొళాయిలో నుంచి సన్నగా కారుతున్నాయి నీళ్ళు. వీళ్ళను చూసారుగాని పట్టించుకోలేదు. ఒకమ్మాయి మాత్రం చూసి ముందుకు రాబోయి అమ్మల్ని చూస్తూ ఆగిపోయి తెగించి గబుక్కున చెంబడు నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చింది.
అంతే! అక్కడున్న ఆడంగులు నానా మాటలు మాట్లాడుతూ విరుచుకు పడ్డారు. ‘నీ మిన్దగాల్లా ? బేరం కుదుర్చుకున్తున్నావా? ఆడకి పో ఆ స్కూల్లోకి. ఎందుకా గుడిసెనకాలకు పో! మేమూ చూస్తాము. చాలా రోజులయ్యింది అది చూసి. లం.. చుక్క నీళ్ళకు చస్తుంటే వొళ్ళు తడిమించుకుంటావా తూ! నీ బతుకు చెడ! అందుకే వాడు..!”
అంతే! రేవంత్ అసహ్యంతో తల వాల్చుకుని వెనక్కు తిరిగాడు.
“సార్ ! మరీ ఆసహ్యంగా ఉంది. ముఖం కడుక్కోండి.”
“నిజమే! కంపు. మరి వాళ్ళు.. ?”
“పట్టించుకోబాకండి. ఎదో ఒకటి మాట్లాడాలి ! నోళ్ళు గమ్మనుండవు. సంస్కారం లేని గాడిదలు. ”
ఆ మాటకు రేవంత్ ఈ అమ్మాయి ఇక్కడిది కాదు అనుకున్నాడు. అదే అన్నాడు. మాట్లాడలేదు. ముఖం నల్లబడింది. తల వంగి పోయింది. అది చూసి ఎందుకడిగానా అనిపించింది. తలెత్తి చూసింది. కళ్ళలోనుంచి బోట బోట కన్నీళ్లు కారు తున్నాయి.
ఎం చెయ్యాలో ఎందుకేడుస్తుందో అర్ధం గాలేదు రేవంత్ కు. సుబ్బయ్య, ”ఎడవబాకమ్మా! వాళ్ళమన్నా చేస్తారనా?” అనునయించాడు.
ఇంతలో ఒక యువకుడు వచ్చి ఆ అమ్మాయిని జుట్టు పట్టుకుని, “లమ్డీ ముండ.. ఇంట్లో పడున్డమంటే బేరం కుదుర్చు కుంటున్నావా?” అంటూ బరబరా లాక్కు పోయాడు.
ఒక్కరు కదలలేదు ఆడంగులు. వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. “ఆ పిల్లను చావగోడతాడు. అనుమానపు పిశాచి ముండాకొడుకు. పాపం మంచి పిల్ల!! తన దగ్గరుండేది అందరికి పెడతాది. ఈ తాగుబోతు కర్కోటక ముండా కొడుకుని నమ్మి ఎట్లా వచ్చేసిందో ? వాళ్ళింటిలో డ్రైవరంట!!”
“పెద్దింటోల్ల పిల్లంట. చదువుకోనుడాదంట. దానికేం పోయ్యేకాలమో ఈ దరిద్రుడ్ని.. !”
“అమ్మ అబ్బను కష్ట పెడితే అంతే! కొవ్వుబట్టికాకపోతే! ఈ కాలం పిల్లలు మరీ బరి తెగించారు. అడుక్కు తినేవాడితో కూడా లేచి వస్తున్నారు సినిమాలు..!! లం..కు బలిసి పోయింది. ”
ఇంత దుర్ఘంధంలో బ్రతుకుతూ సువాసన నిజాలు మాట్లాడుతున్న వాళ్ళ మాటలు వింటూ తన కంపు సంగతి బురద సంగతి మరిచి పోయాడు. నిజంగా ఆకర్షణ, వ్యామోహంగా మారి, అందు లోనుంచి ప్రేమ అనే అబద్దం పుడుతుందేమో ? క్షణిక శారీరక అవసరానికి ప్రేమ అనే తెగులుకు తల్లిదండ్రుల ప్రేమాభిమానాలను కిల్లర్ ఎరువులతో చంపబడును అనే బోర్డు తగిలించుకుంటారేమో ?
నేటి తరం క్షణికం మీదనే ఆశాసౌధాలు నిర్మించుకుని, కూలిపోతే, దుర్భర జీవితాలను పడకల్లోకి తెచ్చుకుంటున్నారు.. భారత దేశపు ఖ్యాతి, భావితరాల భవిష్యత్తు నేటి తరం మీదనే ఉందనే సంగతి పూర్తిగా మరిచిపోయారు.
ఎక్కడ్నుంచో అరుపు వినిపించింది, “ఒమే! పరం మొగుడు కారుకింద పడ్డాడంట”
అంతే. ఎక్కడివక్కడ పారెసి క్షణంలో మాయమయి పోయారు ఆడంగులు. ఆశ్చర్య పోయాడు. పట్టణాలలో పక్కింటోడు కూడా రాడు. ఎవడు చస్తే మనకేం అనే నాగరికత సామెత ఇంకా గుండెల్లో గూడు కట్టలేదేమో!
***
“ఏంది మామా! దాన్ని ఎత్తుకుపోవడం ఎంతసేపు?”
ఆ మాట వినిపించిన వైపు చూసాడు. వేషాలు సినిమా హీరో కుర్ర రౌడీలను మరిపిస్తున్నాయి. కళామతల్లి డబ్బుకు ..రికం చేసి పుట్టించిన ఉద్దారకులు అనుకున్నాడు. నలుగురు యువకులు సిగిరెట్లు తాగుతూ ఒక బండ మీద కూర్చొని ఉన్నారు.
“దాని తల్లి! నలుగురం తగులుకున్నామా ఇకెక్కడ లేస్తుంది. ఎవరితో చెప్పినా పట్టించుకునేవాడెవ్వడు. మొన్ననే పొంగినాయి గుమ్మడికాయలు. అబ్బ చూస్తుంటే..! పోలీసు మావ కూడా నాతో అన్నాడు పట్టుకు రమ్మని. ఏం భయంలే! మన తర్వాతనే!” అంటూ భళ్ళున నవ్వి సీసాను పూర్తి చేశాడు.
అరా కొర చదివి వయసును, తెలివిని, ఆడదాని పొందు కోసమే ఉపయోగించే విజ్ఞాన వంతులు. అరుగు మీద కూర్చుని ప్రణాళికలు వేస్తున్నారు. మందులో, మత్తులో, మగువలో, దేశ భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నారు కాబోయే పరిపాలకులు. ఇలాంటి వారే హాజీ మస్తానులుగా, దావూద్లుగా సమాజంలో అల్లకల్లోలం సృష్టించే కుంపట్లుగా తయారవుతారు.
“ఒరేయ్! గమ్మనుండరో వాళ్ళోస్తున్నారు “ అనుమానంగా అందరూ రేవత్ సుబ్బయ్యలను చూసారు.
“ఎవడికి భయమంట పోలీసోడే గుంటలకోసం మన కాళ్ళు బట్టుకుంటుంటే!” లెక్కలేనట్లు అన్నాడు. రేవంత్ సుబ్బయ్య వాళ్ళ వైపు చూడకుండా దాటి పోయారు. ఎండ విపరీతంగా ఉంది. చెమటతో గుడ్డలు తడిచి పోయాయి. దగ్గరలో గుంపుగా చెట్లు ఉంటే వాటికింద నిలుచున్నారు.
వెనక ఎదో శబ్దం అయ్యింది. తిరిగి చూసాడు. ఆ చెట్లల్లో ఎదో కదులుతున్నట్లు అనిపించి భయం వేసింది. కాస్సేపటికి మాటలు వినిపించాయి. ‘నా మొగుడొస్తాడు.. నా మొగుడొస్తాడు’ అని ఏడుస్తున్నట్లు స్త్రీ గొంతు, ‘చ.. కొంచే సేపు గమ్మునుండవే’ అని మగ గొంతు అంటూ పెనుగులాడుతున్నట్లు అనిపించింది.
అర్థమయి సుబ్బయ్య వైపు చూసాడు. పోదాం అన్నట్లు సుబ్బయ్య అడుగు ముందుకు వేసాడు. కాళ్ళకింద నలిగిన ఆకుల చప్పుడకు ఒంటి మీద గుడ్డలున్నాయో లేదో చూడక బయటకొచ్చి భయంగా చూస్తున్న స్త్రీ, దాన్ని లాగుతూ మగాడు వీళ్ళను చూసి పరుగులు పెట్టారు.
అలాగే నిలిచి పోయాడు రేవంత్.
“ఎందుకు బాబు అంత ఆశ్చర్య పోతారు”
ఆ మాటతో తిరిగి చూసాడు.
‘మన హస్పిటల్లోకూడా ఎన్నో జరుగుతున్నాయి’ అనబోయి.. !.
ఎవరో పలకరించినట్లు అనిపించి ఉలిక్కి పడి చూస్తే ఎదురుగా ఎవరో వ్యక్తి, బక్క చిక్కి మాసిపోయిన లాల్చి పైజమా వేసుకుని, నెరిసి పోయిన గడ్డంతో, ముఖాన కాలం గజిబిజీగా గీసిన గీతలతో నిలుచుని ఉన్నాడు. అందరికంటే తేడాగా అనిపించాడు.
“ఇవి మామూలుగా ఎక్కడైనా జరిగేవే ! సృష్టే ఒక కాముక వలయం. చాటుగా రాత్రి పూట జరిగేవి ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం, మండుటెండల్లో జరుగుతున్నాయి. ఆడది వొంటరిగా దొరికితే చాలు!! సిగ్గు ఎవరికీ లేదో తెలియడం లేదు. పుట్టించిన దేవుడికా తలరాతరాసిన కాలానికా?? ”
ఆ మాటను దాటేస్తూ, “మీరెవ్వరు? ఇక్కడెందుకు ఉన్నారు. చూస్తే చదువుకున్న వాళ్ళుగా ఉన్నారు “ అడిగాడు రేవంత్.
“చదువు చెప్పడానికి వచ్చి చదువుకుంటున్నాను “ అని నవ్వాడు.
“ఇక్కడ స్కూల్స్ ఉన్నాయా ?”
“ఒకటికి మూడు. రెండు మూతబడ్డాయి అనే దానికన్నా మూయించారు. కొన్ని జూదానికి తాగుడుకు, వ్యభిచారానికి ఉపయోగపడుతున్నాయి. పిల్లలు ఎక్కువ మంది మధ్యహ్నం భోజనం కోసం వస్తారు. పనోళ్ళు తినేసి వీళ్ళకు నీళ్ళ మెతుకులు వేస్తారు. దాన్ని కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఒక్కొక ఇంటిలో ఇదు ఆరుగురు ఉంటారు. ఇంటికి ఇంటికి మద్య చోటుండదు. కానీ ఒకరి జోలికి ఒకరు పోరు. కొన్ని దుర్మార్గాలు జరుగుతుంటాయి. జరిగితే మాత్రం నెత్తురు ఏరులై పారుతుంది” నొసలు రాసుకున్నాడు.
ఇంతలో కాకులు గంగనా గోలుగా చెట్టు చుట్టూ తిరుగుతూ విపరీతంగా అరవడం, కుక్కలు భయంకరంగా మొరగటం, పిల్లులు కీచుగొంతుతో అరవడం మొదలుపెట్టాయి.
అనుమానంగా రేవంత్ ఒక సారి పైకి చూసాడు. ఇక్కడ తప్పదు. ఆకలి ! అందుబాటులో ఉన్నది. ఒక్కటని లేదు. వాటిని హింసించి దొరికిందాన్ని ఎలుకలు, తొండలు, కప్పలు. పందిపిల్లలు, పావురాళ్ళు, కాకుల్ని క్యాట్ బాల్తోకొట్టి, కాల్చుకోని తింటారు.
ఆ వయస్సులోనే సారాయి తాగుతారు, బంగు తాగుతారు, ఆడపిల్లని ఎత్తుకుపోయి చెరుస్తారు. అవి ఆటలు, తమాషాలు. పర్యవసానాలు తెలియవు. పాపం!! పుట్టుక, పరిస్థితులు, వ్యక్తిత్వాన్ని ఏర్పరుస్తాయి. మోసం, అబద్దం, దోపిడి రక్తంలో ఇంకిపోయి ఉంటుంది. నాగరికత అడ్డదారుల్లో షడ్రుచులు కావాలంటుంది.
డబ్బుకోసం సమాజంలో పెద్దమనుషులుగా చెలామణి అవుతున్న వాళ్ళు చేసే దరిద్రపు పనులు కంటే ఎక్కువ చెయ్యరు వీళ్ళు!! అవకాశాలను తెలివిగా ఉపయోగించుకుని మంచి వ్యాపారాలు చేసే వాళ్ళు ఉన్నారు. పిల్లల్ని చదివించుకునే వాళ్ళు, వృద్దిలోకి వచ్చిన వారు ఉన్నారు. కానీ చాలా తక్కువ!! ”
ఒకతను మోటారు బైకులో స్పీడుగా వస్తూ, పారిపోతున్నా ఆడోళ్ళను అనకూడని మాటలు అంటూ, తాకకూడని స్థలాలో తాకుతూ, విసురుగా మోటారు బైకులో వీళ్ళను దాటి పోబోతూ ఆగి మాస్టర్ని చూసి నవ్వి రేవంతును, సుబ్బయ్యను అనుమానంగా చూస్తూ,
“ఎందుకోచ్చారంట? ఎంతలో కావాలంట ! పది, వెయ్యి, పదేలు.. గంటా.. రోజా.. వారమా ? ఒర్జినా, నలిగిందా. బాగా నలిగిందా? ట్రబుల్ ఫ్రీ. రూమ్ మీరు బుక్ చేసుకోవాలా! ఏ నా కొడుకు మీ దగ్గరకు రాడు. నేను గ్యారంటీ!!” అంటూ రేవంతును చూసి కళ్ళు ఎగరేసి జేబు రుమాలను గిర గిర తిప్పి మెడకు కట్టుకుంటూ అడిగాడు.
“వాళ్ళు అలాంటి వాళ్ళు కాదులే ! నువ్వెళ్ళు” అన్నాడు మాస్టారు.
“ఏం ! పతిత్తులా ? మాకు తెలుసు పట్నం చీకటి భాగోతాలన్నీ! ముసిలోడికైనా కుర్ర..!” ఇంకా ఎన్నో బూతులు. ఆ మాటలు వినలేక చెవులు మూసుకోలేక నిరామయంగా నిలుచుండి పోయాడు రేవంత్.
“వాడి మాటలు పట్టించుకోకండి. అందరినీ వాడిలాగే ఒకే ఘాటికి కట్టేస్తాడు. కొంత వరకు నిజం ఇక్కడున్న ఆడ బిడ్డలు వయసుకు రాగానే వీడి అంగటిలో పెట్టాల్సిందేనట! లేకుంటే అంతే ! ఆకలి..!! సినిమా మోజు, ఆకర్షణ జల్సాల కోసం లోబడి పోతారు. అమ్మాబ్బాలే పంపుతారు.’ అన్నాడు.
సహజం. సిగ్గుపడాల్సింది ఏమీలేదు అన్నట్లు చెప్పాడు. రేవంతుకు భయం వేసింది. బహుశా రామచంద్రయ్య పిల్లల్ని తల్లి అలా చేసే ప్రయత్నంలో ఉందేమో ? మనసు మూగగా రోదించింది.
“వెళ్లి పోదాం సార్ ! పొద్దు పోతుంది. వాన వచ్చేటట్టుంది. ఉక్కబోసిపోతుంది. ఇక్కడెక్కడో దగ్గరిలో ఆ చంద్రిగాడి ఇళ్ళు.. ! ” అటుయిటు చూస్తూ అన్నాడు సుబ్బయ్య.
రేవంత్ “క్షమించండి ! మళ్ళీ కలుసుకుందాము. శెలవు “ మాష్టారుకు నమస్కరించి క్షణకాలం సుబ్బయ్య కళ్ళల్లోకి అర్ధంకానట్లు చూసి, తేరుకుని, చాలా దూరం నడిచి చుట్టుప్రక్కల చూసాడు.
ఎదురుగా ఒక రేకుల గుడిసె. అన్నియిండ్లకంటే పెద్ద వ్యత్యాసంగా లేదు. పది గజాలకు పైనుండదు.
ప్రక్కన్నే చిన్న గదిలాగ నాలుగువైపులా రేకులు, పైన ఒక ప్లాస్టిక్కు షీటు రెప రెప లాడుతుంది ఓ పెద్ద బురద గుంట, ఆ మురికివాడ మురుగంతా అక్కడ చేరి పందులు పోర్లాడుతున్నాయి. చుట్టూ కొండలంత బండరాళ్ళు ఉన్నాయి. అక్కడ నివసించే వాళ్ళకు పాయిఖానాల స్టలం అదే. కాస్త ఎడంగా ఉంది, ఈ ఇండ్లు.!!
తమ ముందే బెరుకు లేకుండా ఆడ వాళ్ళు దొడ్డికి కూర్చుంటున్నారు. రేవంతే చూడలేక తల దించుకున్నాడు. పందులు పై పైకి వస్తుంటే, వాటిని తరుముతూ, అరుస్తూ, తమ పని కానిస్తున్నారు. ఆ బురద గుంటల్లోని నీళ్ళతోనే కడుక్కుంటున్నారు.
ఇదే కాబోలు స్వచ్చభారత్ అని సిగ్గు పడ్డాడు రేవంత్. ఆలోచించలేక పోయాడు. ఎక్కడుంది లోపం? పుట్టించడం ఎందుకు ? అదృశ్యంగా ఆటలాడుకోవడం ఎందుకు ? జన్మ నివ్వడం ఎందుకు ? జన్మ రాహిత్యకోసం పోరాటం చెయ్యమనడం ఎందుకు ?
ఆ ఇంటి ముందు నడి వయసు స్త్రీ కూర్చుని దగ్గరగా వస్తున్న వీళ్ళనే గమనిస్తూ ప్రక్కకు తిరిగి పెద్దగా క్యాకరించి ఊసి ముఖం తిప్పుకుంది.
సుబ్బయ్య దగ్గరగా పోయి, ” అమ్మా ! రామచంద్రయ్య ఉండాడా ?” అడిగాడు.
చివ్వుక్కున తల తిప్పి కోపంగా, “ఎందుకా ? ఆడితో ఏమ్పని?” అని గర్జించింది. భయపడ్డాడు సుబ్బయ్య.
“అదే మొన్న.. హాస్పిటల్.. పిల్లలు.. ??”
ఎదో గుర్తుకొచ్చినట్లు, “చెప్పినాడు. చెప్పినాడు!!” వెలిగిపోతున్న ముఖంతో సంతోషంగా పెద్దగా అరుస్తూ గబుక్కున లేచింది.
“ఓలమ్మో! ఇంటికే వచ్చేసినారా ! అనుకున్నా! నా బిడ్డ సోకు అట్టాటిది. లచ్చలుపోసి జవురుకు పోతారు. రండి సామి! కూకోండి. ఓలమ్మీ! సారోచ్చినాడు! ఓరయ్యో! అయ్యగారోచ్చారు. బేగిరా!”
ఆదుర్దాగా పిల్లలు వచ్చారు. అందరి శరీరాలు చెమటతో తడిచి ముద్దయి, ముఖాలు కందిపొయి ఉన్నాయి. రేవంతును చూడగానే ఆరిపోయిన దీపాలు ఒక్కసారిగా వెలిగాయి.
“మీ నాన్న?” స్నేహ పూర్వంగా నవ్వుతూ అడిగాడు రేవంత్.
అమ్మవైపు చూసారు. “తాగి పడున్డాడు కొడుకు! మేయ్! లేపు బో! మొద్దు ముండా కొడకా.. అమ్మికి మంచి బేరం తగిలింది, బయట్రా సచ్చినోడా” లోపలికి కేక వేసింది.
ఆ అరుపుకు తడబడుతూ జారిపోయిన లుంగీని చుట్టుకుంటూ వచ్చివీల్లనుచూసి సిగ్గుతో ముఖం చాటేస్తూ నిలబడటానికి ప్రయత్నిస్తూ నమస్కారం చేసాడు.
రేవంతుకు చాలా బాధ వేసింది. చావులోనుంచి బయటపడిన తరువాత, వెళుతూ, తాగనని బిడ్డల్ని చదివించుకుంటానని మీరు సహాయం చేస్తే వెయ్యి జన్మలు మీ మేలు మరువనని ఎంత నమ్మించాడో!! బిడ్డలమీద ఎన్ని ప్రమాణాలు చేసాడు. నాలుగు రోజులకే..!!
“పోదాం పద సుబ్బయ్యా! ఈ వెదవను బిడ్డల్ని అమ్ముకొని తాగి చావనీ! “అంటూ కోపంగా ముందుకు అడుగువేసాడు.
అంతే! ఒక్కుదుటున కాళ్ళు జవిరి పట్టుకుని, “క్షమించండి సామీ! అంతా ఈ లంజ మూలంగానే. పోద్దోస్థమానమూ రాచి రంపాన పెడుతుంది. నా బంగారు తల్లుల్ని అమ్మేస్తామని, పెద్దదాన్ని యాపారంలో పెడదామని. చదువుల సరస్వతితో రంకు చేయించమని! యాడ చచ్చేది. తట్టుకొని బతడానికి ఈ సారా!
తీసుకు పొండి బాబు. వాళ్ళకు మంచి బతుకు ఇవ్వండి. మానేస్తా.. నేను మనిషినవుతా.. బతికినంత కాలం మీ కాళ్ళ దగ్గర పడి ఉంటా! ఇప్పుడే తోడుకెల్లండి.. ఉంటే ఈ దరిద్రపుది ఏమయినా చేస్తాది. బుజ్జిలు గుడ్డలు సర్దుకోండి.. పొండి!!” అన్నాడు బిడ్డల వైపు చూసి రామ చంద్రయ్య. వాళ్ళు ఎం చెయ్యాలో తెలియక అమ్మాబ్బలను చూస్తుండి పోయారు.
“చచ్చినా నేనొల్ల! బంగారు గుడ్లు పెడతాయి. మా నోట్లో ఈరం పోయికండి. పొండి.. పొండి. మళ్ళీ ఈడకోచ్చారంటే చీపర ఇర్గతది. ముండా కొడుక్కి బతకడం తెలవదు. తాగుబోతు పంది నా కొడుకు! పొండి!! చదువంట.. చదవు!!
ఆకరాకి ఏంటట చేసేది ఇద్యోగంలో అడిగినోడికంతా ఉత్తినే కాళ్లెత్తాలంట. నా బిడ్డ రోజుకు పది ఏలు.. లచ్చలు సంపాదిస్తాది. బ్రతిమలాడుకొని ఇచ్చిపోతారు. పొండెహే ! వొచ్చినారు.. చదువంట.. వాడుకోడానికి దొంగ నాబట్టలు!!” చీదరించుకుంటూ అంది.
“ఎమ్మో! మాటలు సరిగ్గారానీ ! ఎవరనుకున్నావు. ఇంకో కూత కూసావంటే పగిలిపోద్ది. ” అంటూ దూకాడు సుబ్బయ్య.
ఇంతలో, ’ చెక్కి! చెక్క లంజా!’ అనే గాడ్రింపు వినపడింది.
ఆ మాట వినపడగానే భయంతో గజ గజ గజ వణికిపోతూ పిల్లల్ని ఇంటి లోపలకి తోసి మాట వినవచ్చిన వైపు చూసి, “ఓ లమ్మో ! ఈ దొంగానాబట్ట వస్తున్దాడే” అంటూ లోపలి దూరింది.
*****
“ఒసేయ్ లం.. చెమికీ చుక్కిచెక్కా !” ఎద్దేవా చేసినట్లు అరిచాడు..
“చంద్రిగా! ఒరేయ్ గాడిద కొడకా!!” అని మళ్ళీ పెద్దగా అరిచాడు. భార్యాభర్తలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ, భయంతో వినయంగా లోపలనుంచే చేతులు కట్టుకుని బయటపడ్డారు.
రేవంత్, సుబ్బయ్య అతని వైపు చూసారు. ఎదురుగా, తెల్లటి శుభ్రమైన గుడ్డలు, షోగ్గా నల్ల కళ్ళద్దాలు, బంగారు వాచీ, నాలుగు వేళ్ళకు రకరకాల ఉంగరాలు వేసుకుని, డాబుగా నిలుచున్నాడు ఏనుగులాంటి ఓవ్యక్తి!! అతని చుట్టూ, మరో నలుగురు వస్తాదుల్లాంటి మనుషులు, చేతులు కట్టుకుని కాపలాగ ఉన్నారు. వీళ్ళెవరో సినిమా గూండాలుగా ఉన్నారే, అనుకున్నాడు రేవంత్.
“ఏహె లే లం..డా ! నగురుపోతుండవు. కట్టు యిప్పుడే!! తీసుకున్న పైసలన్నీ! ఏన్నాళ్ళ కిందో మోటారు చూపి దొబ్బుకుంటిరి కదవే! చాలా అయిపోనాది ఈ సరికి. మోటరెత్తు కెళ్తా! ఏ నాయాలు, అడ్డం వస్తాడో చూస్తా!” అంటూ హూంకరించాడతను.
“అన్నన్న.. అంత, పని చేయమాక, నా బిడ్డల బతుకు బుగ్గిపాలవుద్ది. నీకాల్మొక్కతా! జరా దయయుంచరాదే! పది రోజుల్లో కట్టేస్తా! ” అంటూ ఆమె కాళ్ళమీద పడిపోయింది.
ఆటో కదిలించారు. చెక్కమ్మ అడ్డుపోతే తన్నారు. “ఇస్తానంటున్నారు కదా ఈసారికి !” అంటూ అడ్డుబోయాడు రేవంత్. వాళ్ళు తోసిన తోపుకు రేవంత్ విసురుగా క్రింద పడబోయాడు. సుబ్బయ్య అదాట్టుగా పట్టుకున్నాడు.
లేచి నిలుచున్న రేవంత్ ను చూసి, ”మీరెందుకు యిక్కడ” అంటూ అనుమానంగా సుబ్బయ్య వైపు చూసాడు.
“ఏంలేదు. వీళ్ళందరు ఎలా బ్రతుకుతున్నారోనని? చూడటానికి వచ్చాం.” సుబ్బయ్య చెప్పాడు.
“ ఇచ్చింది తినేసి మళ్ళీ కనిపించరు. ఎంత పెట్టినా ఎక్కడదీ చాలదు. బాగు పడేది కల్లో మాట. ఎన్నిచేసాం వీళ్ళకు! ఇండ్లు కట్టుకునేందుకు పట్టాలిప్పించాం అటుపోగానే ఇటు అమ్ముకుని, వేరొక దగ్గర గుడిసేసుకుంటారు. స్కూల్స్ కట్టించాను. కంప్యూటర్లు తెప్పించాను. మినిస్టర్లతో, సెక్రటరీలతో కాళ్ళా వెళ్ళా పడిపడి, కరెంటు యిప్పించాను. నీళ్ళుతెప్పించాను.
కంప్యూటర్లను అమ్మేసారు. టి వి లు అంతే. ! కోట్లు ఖర్చుబెట్టినా అదేదో పద్యం ’శునకపు.. అదే.. కనకపు సింహాసనం.. ’ అదే’ వెనుకటి గుణమేలమాను గద్దరా! కూదా కాదు.. కదరా! సుమతి అంతే!! ఇస్తరాకు నిండా బువ్వ పెడితే.. తినరు! అది ఎత్తుకెళ్ళి కుప్ప తోట్టి లో పారేస్తే, అప్పుడు కుక్కల్లాగా పందుల్లాగా, కాట్లాడుకుంటూ తింటారు. అట్లా తింటేనే తృప్తి!! మారరు సార్ ! మారరు. ” అన్నాడు. ఎంతో అసంతృప్తిగా తల అటుయిటూ తిప్పుతూ, రాత అన్నట్టు నొసటి మీద చేత్తో అడ్డంగా గీక్కున్నాడు ఆ శాంతి పావురం.
చెమటతో జిడ్డుకారుతున్న ముఖం తుడుచుకొని “ఆటోని కదిలించండిరా !” అరిచి తన వాళ్ళ వైపు చూసి సైగచేసాడు. అంతే చెక్కమ్మ గగ్గోలుగా ఏడుస్తూ, కాళ్ళు పట్టేసి బ్రతిమలాడటం మొదలుపెట్టింది.
ఆమెను నానా బూతు మాటలని, “చుప్ చుప్, మార్ దుంగా?” అంటూ చెప్పుతీసుకొని నోరుమూయించి రేవంత్ వైపు చూసాడు శాంతి పావురం.
“ఎంత యివ్వాలి వాళ్ళు ?”
ఆ మాటలోని అధికారానికి కాస్సేపు రేవంత్ కళ్ళల్లోకి చూసి, “ఆ ఎంత.. పదివందలు దానికి వడ్డీ ఇరవై వందలు! కొంపతీసి మీరిస్తారేమి.. ఆపని మాత్రం చెయ్యమాకండి. ఎంట్రుక్కూడా మిగల్చరు”
వంద యివ్వాల్సిఉన్నా యిలాంటి నీచులు వదలరు అని అనుకుంటూ, జేబులో చెయ్యిపెట్టాడు.
“ఒద్దు బాబూ! మేం సర్దిచెప్పుకుంటాం మీరెళ్ళండి. ” అంటూ అడ్డొచ్చాడు రామచంద్రయ్య.
“ఇయ్యనీ అయ్యా ! ఈ దొరబాబుకే యిచ్చుకుంటాం ! ఆ కర్కోటక ముండాకొడుకు పీడవదుల్తాది. పక్కల్లోకి నా పెద్దబిడ్డను పంపించమన్నాడు, ఈ పంది నా కొడుకు !”
ఎలాంటి భయం లేకుండా, అలా మాట్లాడటం చూసి ఆశ్చర్యపోయాడు రేవంత్.
“ఇదిగో నీకియ్యాల్సింది వెయ్యి రూపాయలే కదా? రెండువేలంటా ఉండావేంది. ” అని రెట్టించింది.
“వడ్డీ ఎవరిస్తారువే ! నువ్వు పడుకుంటావా? నీ కూతుర్నిపంపిస్తావా?” అంటూ ఒక్కదూకు దూకాడతను.
“మొఖం పగులుద్ది. నీపెళ్ళాన్ని పంపించుకోరా ! నువ్వెందుకు ఎండలో తిరుగుతావ్. ? అదేకదా చేస్తుండేది. నువ్వు ఆ తెల్లోల్లకు సప్లయిచేసే కదా జల్సాగా ఊరిమీద పడి బకరాలు చేస్తున్దావు! ఆడపిల్ల సవర్తైన.. పెద్ద మనిషి కాగానే బోణీ కడుపు నువ్వేకదా చేసేది ” అంటూ గాండ్రించి ఊసింది.
“చంపండిరా దాన్ని, గొంతుపిసకండి. !” అని ఒక్కఅరుపు అరిచాడు, తెల్లగుడ్డల శాంతిపావురం.
అంతే. నలుగురు మొగోళ్ళు ఆ మనిషిని జుట్టుపట్టుకుని, నేలమీదతోసి పిడిగుద్దులు గుద్దుతూ కాళ్ళతో తన్నసాగారు. శాంతి పావురం తిడుతూ అరుస్తూ వాళ్ళను ప్రోత్సహిస్తున్నాడు.
రామచంద్రయ్య కూతుళ్ళు అడ్డుబోతే, వాళ్ళనూ వదిలిపెట్టలేదు ఆ ఆడపిల్లలు. ఆ మృగాల చేతులు, తాకకూడని చోట తడుముతూంటే, యింట్లోకి పారిపోయారు. చివరకు, పట్టి బలవంతాన, ఆ మనిషిని వాళ్ళనుంచి విడిపించి లోపలికి తోసి, ఆయాసపడుతూ దారికి అడ్డు కూర్చోనేసాడు రామచంద్రయ్య. ఆ మనిషి లోపల్నుంచి అరుస్తూనే ఉంది.
సుబ్బయ్య ఆటోకి అడ్డంగా నిలబడి, “అయ్యగారు యిస్తానంటున్నారు కదా!” అన్నాడు.
“ఎవరిచ్చినా యిక ఆగేది లేదు. రేపు ఉదయంలోగా ఆ గుడెసె తగలబెట్టి యిక్కడ్నుంచి తరమక పోతే నాపేరు మార్చుకుంటా. చూపిస్తా! నాతఢాకేవిటో చూపిస్తా!!” అంటూ ఆటోను నెట్టుకుంటూ ముందుకు పోసాగారు.
ఇంతలో లోపల్నుంచి చెమ్మక్కొచ్చి, అతని కాళ్ళుచుట్టేసి, “తప్పయి పోనాదయ్య ! నన్నుతన్ను, చంపు. రాత్రికి రమ్మన్నా వస్తా! కోడికూర తెస్తా! ఇప్పసారా తెస్తా!” అని నెత్తినోరు బాదుకుంటూ కాళ్ళావేళ్ళా పడసాగింది.
ఏం తగ్గలేదు శాంతి పావురం!!
చెక్కమ్మ శోష వచ్చినట్లు పడిపోయింది ఆ శాంతి పావురం ఆటోతో ముందుకు వెళుతున్నాడు సుబ్బయ్య మాట్లాడుతూ కూడా నడుస్తున్నాడు.
గబగబా నాలుగడుగులు వేసి అతని ముందు నిలబడి, “వాళ్ళతరపున ఆ డబ్బునేనిస్తాను, నామాటవిను. ” అంటూ ప్రాధేయపడ్డట్టుగా అధికారంతో అడిగాడు రేవంత్.
ముందుగా మొరాయించినా తరువాత తగ్గాడు ఆ శాంతి పావురం. చాలా పెద్ద త్యాగం చేసినట్లు చాలా ఉదారంగా యిస్తున్నట్టు యిచ్చి ముడుచుకు కూర్చున్న చెక్కమ్మ వైపు గుడ్లురిమి, జాగ్రత్త అని చేయిచూపించి. వెళ్ళిపోతూ, బూతు సైగచేసి రేవంత్ చేయి తీసుకుని నొప్పిపుట్టేటట్లు నలిపేసాడు. కంపరం పుట్టింది.
*****అతను పోతున్నవైపే చూస్తూ, చాలాసేపు ఉండిపోయాడు రేవంత్. రామచంద్రయ్య పిల్లల్నిచూసి మొహమాటంగా నవ్వుతూ నిట్టూర్పువదిలాడు.
“ఎందుకుసార్ ! ఆడికి డబ్బులిచ్చారు.. మావల్ల మీకెంత నష్టం. యాడికి తీసుకుపోతాడు దాన్ని.. సాయంత్రంలోగా యింటి ముందుండదా?” చాలాపౌరుషంగా అటోయిటో తేల్చేసిటట్లు అన్నాడు చంద్రయ్య. నువ్వు అంతటివాడివే అన్నట్లు నవ్వి, ఆ పిల్లల వైపు చూసాడు రేవంత్.
నమస్కరించి, గౌరవంగా తలలు వంచారు.
“ఆ పాపిష్టోడిచ్చింది వందరూపాయలు, రోజుకు పదిరూపాయలు వడ్డీ తడిపి మోపడయ్యింది. పనిచేస్తున్న దగ్గర జీతాలివ్వలే? ఇదిగో, ఈ ఎదవముండల్ని చదివించి, ఎవడికో చప్రాసి ఎదవకు యిచ్చేదానికి ఆయన తెచ్చిందంతా తగలేస్తుండే! నేనాడపోయ్యేది. సినిమాలో చేర్పిస్తానని సుబ్బిగాడు లొట్ట లేస్తున్నాడు. రోజుకు లచ్చ అని నర్సిగాడు ప్రాణాలు తీస్తున్నాడు. ఈ ముండా కొడుకు చదువో చదువు అని ఏడుస్తుండే ! ” అంటూ రాగాలు మొదలుపెట్టింది చెక్కమ్మచుక్కి.
“చదివించు. నీ బిడ్డలు తెలివిగల వాళ్ళు. మంచి భవిష్యత్తు ఉంది.”
“చచ్చినా ఆ దరిద్రపు పని చేయ! కష్టం లేని యాపారానికి పంపూతా. లచ్చలు కుమ్మరిస్తారు. ”
ఎన్నో విధాల చదువు గొప్పతనం సభ్యత సంస్కారాల గురించి నచ్చ చెప్పినా మొండిగా వాదించింది. చాలా కోపం వచ్చింది రేవంతుకు. విసిగి పోయాడు.
“నీ బిడ్డల్ని కూడా నీలాగే ఏడవమంటావా? నువ్వు అనిపించుకున్న దరిద్రపు బూతుమాటలు అనిపించుకొమంటావా ? ఎవడంటేవాడు వోళ్ళు రుద్దుతుంటే సంతోష పడుతావా? నవ్వు తల్లివా లేక బ్రోతల్ కంపెనీ దళారి లం..వా !”
జేబులోనుంచి తీసి డబ్బు విసిరి ముఖాన కొడుతూ, “ఇదిగో పది వేలు. సుబ్బయ్య పడుకుంటాడు. మీ అమ్మకూడా అందరి దగ్గర పడుకొని నిన్ను కన్నట్టు ఉంది”
ఆ మాటలు ఎలా అనగలిగాను అని ఆశ్చర్యపోయాడు రేవంత్.
విసురుగా సివంగిలా లేచింది. “నా తల్లినంటే నేను వోప్పుకోను. మా తల్లి బంగారం. కష్టాలలోకూడా ఒకరి దగ్గర చేయిచాపలేదు. తను కష్టపడి పనిచేసి మమ్మల పెంచింది. పదిమందికి పెట్టింది!!” గుండెలపై కొట్టు కుంటూ ఏడుపు ఎక్కువ చేసింది.
“మరి అంత ఉత్తమరాలి కడుపునపుట్టి, నీ పిల్లల తల్లి ఎవరంటే ఏం చెప్పమంటావు ? తల్లిగా నీ బిడ్డల్ని లం..కం చేయిస్తావన్న మాట. లం.. తల్లి అంటే ఎగిరి గంతు లేస్తావన్న మాట. సిగ్గుపడు.
ఎక్కడైనా దూకి చావు. లం.. నాతల్లి, లం.. మేము అని మెడలో బోర్డ్లు కట్టుకు తిరగమను. పదిమంది ఎత్తుకు పోయి రోడ్డుమీద రెప్ చేసి చావుబత్కుల్లో ఉంటే జవురు కొచ్చుకుందువుగాని. కుక్కలు గతికిన మాంసపు ముద్దల్ని కాకులకు గద్దలకు వేస్తూ బూతు నేర్పించు. దరిద్రపుదానా !
నేను దరిద్రపు బ్రతికాను నా బిడ్డలైనా గొప్పగా బ్రతకాలని అనుకోని తల్లి ఒక తల్లేనా ? లంజలకు పుట్టిన బిడ్డలు లం..గాక ఏమవుతారు ? ఎక్కడైనా చావండి. రా ! సుబ్బయ్యా పోదాం ” అని ఆవేశాన్ని అణుచుకోలేక ముందుకు కదిలాడు.
నిర్ఘాంతపోయి తలబాదుకుంటూ ఏడుస్తూ దిక్కుతోచనట్లు చూస్తూ ఉండిపోయింది చెక్కమ్మ.
రేవంత్ చాలా వడి వడిగా అడుగులు వేసాడు. తల మొద్దుబారిపోయింది.
హఠాత్తుగా నిలిచి చుట్టూచూసాడు. గుడ్డిదీపాలు వెలుగుతున్న మహా జీవిత కుంభమేళ అజ్ఞానోదయపుటరణ్యం ; క్రిమినల్ ఆర్టు ఆఫ్ లివింగ్ ప్రధాన కూటమిలో, ఎన్నో మనుషులనబడే బ్రతికున్న శవాలు వింత వింత శబ్దాలు చేస్తూ మండుతున్నట్లు అనిపించింది. ప్రతి కన్నీరు ఒక గ్రంధం.!! ప్రతి అరుపు, ఆలోచనలను రేక్కించే వేదాంతమర్మం.!!.
విపరీతమైన శబ్దాలు చేస్తూ కాకులు చుట్టూ తిరగసాగాయి. ఒక్కసారిగా ఆకాశం నల్లబడింది చీకటి లోతుల్లో జవాబులు వెతుకుతూ, తిరిగి చూసాడు. దూరంగా సుబ్బయ్యతో పిల్లలు పరుగెత్తుకుంటూ రావడం కనిపించింది. సుబ్బయ్య పలకరించే వరకు కదల్లేదు రేవంత్.
సమాప్తం
డా: కనుపూరు శ్రీనివాసులు రెడ్డి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం : డా.కనుపూరు శ్రీనివాసులు రెడ్డి..
నమస్తే ! నా కధ ప్రచురణకు నోచుకున్నందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు. నా గురించి గొప్పగా ఏమీ లేదు. సాహిత్యం అంటే మక్కువ. ప్రయోగాలు చెయ్యాలని అభిలాష. చాలా సంవత్సరాల ముందు కధలు రాసేవాడిని. అన్నీ కూడా ఆంధ్రప్రభ, ఆంద్ర జ్యోతిలలో ప్రచురితమైనవి. కొన్ని కారణాల వలన సాహిత్యానికి దూరం అయినాను. 2010 నుండి నవలలు, భావకవితలు రాయడం మొదలుపెట్టాను. మరో హృదయం-మరో ఉదయం{నవల} ,గీతాంజలి అనువాదం, నీకోసం అనే భావకవిత్యం, చీకటిలో మలివెలుగు {నవల} ప్రచురించడం జరిగింది.
ఊరికే మంచి మాటలతో సరిపెడితే చాలదు ... మంచి చేతలు, ఆచరణ ఉండాలి.
అట్టడుగు - పేద వారి బస్తీ నివాసుల ... జీవితాల్లో ... వెలుగు నింపటానికి ... మంచి విద్య, ఉపాధి, వేతనం ఇతరత్రా ద్వారా ... ప్రత్యేకంగా ఆడ పిల్లలను వ్యభిచారి పని నుండి + వేరే బానిస పని నుండి కాపాడటానికి
...
ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి ... అని మా సూచన
పి.వి. పద్మావతి మధు నివ్రితి
బస్తీ: కె. శ్రీనివాసులు రెడ్డి
కళ్ళలో నీళ్ళు తెప్పించాయి. దేవుడే దిగివచ్చి వారికి మంచి చేయాలని ఆకాంక్షిస్తూ.
పి.వి. పద్మావతి మధు నివ్రితి