top of page
Writer's pictureSabbani Lakshminarayana

బతుకు పుస్తకంలో ఒక నెమలీక



'Bathuku Pusthakamlo Oka Nemalika' - New Telugu Story Written By Lakshmi Narayana Sabbani Published In manatelugukathalu.com On 20/06/2024

'బతుకు పుస్తకంలో ఒక నెమలీక' తెలుగు కథ

రచన: లక్ష్మీ నారాయణ సబ్బని

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



పద్దెనిమిది, పందొమ్మిదేళ్ళ నవ ప్రాయంలో తటిల్లేఖలా మెరుస్తూ ఒక నెమలీక దొరికింది నాకు. అద్వితీయంగా, అపురూపంగా ఉన్న ఆ నెమలీకను ఆనందంగా, అపురూపంగా, ఆత్మీయంగా బతుకు పుస్తకంలో దాచుకున్నాను. ఏ నెమలి తల్లి పించంలోంచి నా కోసమే రాలిపడి దొరికిందో కదా! నా బతుకే మారిపోయింది అప్పటి నుండి! 


బతుకు పేజీలను స్పృశిస్తున్నపుడు నెమలీక నా కన్నుల్లో పడి నన్ను ఆనంద డోలికల్లో ముంచెత్తేది. స్పటికంలోంచి ప్రసరిస్తున్న కాంతిలా మెరుస్తూ ఇంద్ర ధనుస్సు రంగులను కురిపిస్తూ నన్ను ఆహ్లాదంలో డోలలాడించేది. కొన్ని అనుభవాలు మాటలకందవు. మనసుకు, మనసున్న మనుషులకే అందుతాయి! ఉన్నట్టుండి, నా దైనదనుకున్న ఆ నెమలీక అనూహ్యంగా ఒకనాడు నా బతుకు పుస్తకంలోంచి జారి ఎక్కడో పడిపొయింది! ప్రాణం విలవిలలాడిపోయింది అప్పటి నుండి తోడును పోగొట్టుకున్న పక్షిలా! ఆ నెమలీక పోయినప్పటి నుండి బతుకులో ఆలంబన లేకపోయినట్లయ్యింది బతుకులో వెలితి కనిపించింది, ఆర్తి నిండింది. అప్పటి నుండి నెమలీక కోసం నిరంతరం అన్వేషిస్తూనే ఉన్నా. 


ఆ నెమలీక కోసం రోజులు చూశాను, 

నెలలు చూశాను, సంవత్సరాలు చూశాను.


నాలో నేను మథనపడ్డాను, అన్వేషించాను. నెమలీక కోసం పల్లెల్లోకి, పట్నాల్లోకి, చెట్లల్లోకి, గుట్టల్లోకి అడవుల్లోకి, దేశాల్లోకి కూడా చూశాను. నెమలీక చిరునామా ఎక్కడని

కవుల కలాల్లోకి, పుస్తకాల్లోకి తలమునకలై చూశాను. 

నెమలీక లేనపుడు నేను ఒంటరినే, నెమలీక నాలో, నాతో ఉన్నపుడు నేను గుబాళించే పువ్వులా ఉంటాను. 


నెమలీక నాకు జ్ఞానామృతాన్ని, ప్రేమామృతాన్ని పంచుతుంది. 

నేను లేకున్నా నెమలీక ఎప్పుడైనా, ఎక్కడైనా బతుకుతుంది, కాని కలలో కూడా నెమలీక లేకుండా నేను బతుకలేనేమో! 


నెమలీక నా నుండి దూరం వెళ్లిపోయినప్పటి నుండి

నెమలీక కోసం చూస్తున్నాను, నెమలీక కోసం రాస్తున్నాను. 


నా సాధన, నా తపస్సు చూసి ఇప్పుడైనా, ఎప్పుడైనా, నెమలీక నన్ను కరుణిస్తుందనే నమ్మకం నాకు. 


నెమలీక నేను పెంచుకున్న జీవన వృక్షం.

నెమలీక నన్ను సేదదీర్చే కల్పవల్లి.

నెమలీక నన్ను ఒలలాడించే హృదయరాణి.

నెమలీక నన్నెప్పటికీ కరుణిస్తుంది అనే నమ్మకం. 


అలా నెమలీక జాడ కోసం చూస్తూ ఊరట చెందడానికి కమనీయ ప్రదేశాల్లోకి చూస్తూ ఈ భూ ప్రపంచమంతా వెతికాను, బహుశా నిద్రాహారాలు లేకుండా ఒకోసారి! బతుకంతా అన్వేషణ ఒక్క నెమలీక కోసమే అన్నట్లు! అది ఒక్కనాటి అన్వేషణ కాదు నిరంతర నిర్విరామ అన్వేషణ! చూస్తూ చూస్తూ అన్వేషిస్తూ వెళుతూ ఉండగా ఒక శుభ దినము నాడు ప్రకృతి ఒడిలో, కొండ కోన అంచుల్లో, చెట్టు చేమ నీడల్లో నా నెమలీక కనిపించింది మళ్లీ. 


ఒకనాడు, అలనాడు ఎంత రమణీయంగా ఉండేది నెమలీక! నా కన్నుల్లో కాంతులు నింపుతూ కరిగిపోతూ! ఏదీ అలనాటి నెమలీక సుస్వరూపం ? ముప్పది యేండ్ల తర్వాత నెమలీకను చూస్తూ ఆశ్చర్యపోయాను! కళ తగ్గిన వనితలా, మూగపోయిన వీణలా, చెదిరిన గూడులా, వెలిసి పోతున్న బొమ్మలా కనిపిస్తూ నన్ను కలవర పరిచింది! దేవుణ్ణి ప్రేమించినట్లు, దేశాన్ని ప్రేమించినట్లు నేను నెమలీకను ప్రాణప్రదంగా ఆరాధిస్తూ బతికాను! నేను ప్రేమించింది, ఆరాధించింది రూపాన్ని, బాహ్య సౌందర్యాన్ని మాత్రమే కాదు నెమలీక పరిపూర్ణ అంతరంగాన్ని, వ్యక్తిత్వాన్ని అని, నెమలీక నా ప్రాణం అని, నెమలీక నా బతుక్కి ఆలంబన అని, నెమలీక లేనిది నేను బతుక లేనని, 

నెమలీక నా బతుకు పుస్తకానికి అలంకారం అని, నెమలీక నా ఊపిరి, నా శ్వాస, ధ్యాస, నా ధ్యేయం, నా గమ్యం, నా మార్గం అని తలంచి ప్రేమతో మళ్లీ నెమలీకను దగ్గరకు తీసుకోవాలని చేతులు చాచాను. 


కాని నెమలీక కలవర పడింది నా చేతుల్లోకి రావడానికి! 


'నేను, పరాధీనను, బతుకు బంధాల్లో బంధీని నీ బతుకు పుస్తకం లోకి మళ్లీ రాలేను ' అంది.


 ఏది అపురూపమో, ఏది అద్వితీయమో, ఏది ఆనందమో, ఏది తృప్తో, ఏది ప్రశాంతతో అదే అందలేనపుడు, దొరుకనపుడు బతుకులోని దైన్యాన్ని గుర్తుకు చేసుకుంటూ వలవలా నెమలిలా కన్నీళ్లు కార్చాను! అయినా మనసును కుదుట పరచుకున్నాను, నెమలీక నా గుండెల్లోనే ఉంది అని, నెమలీక నా మనసులోనే మమేకమై ఉంది అని. నేను, నెమలీక ఒకటేనని, ఆ స్పృహతోనే బతుకాలనుకున్నాను. ఆశ ఇంకా చావడం లేదు! మళ్లీ ఏనాడో నెమలీకే వచ్చి నా దరికి వచ్చి, నా కన్నుల్లో నిలిచి, నా బతుకు పుస్తకంలో చేరి నన్ను ఆనంద పరవశుణ్ణి చేస్తుంది అని నేను ఇంకా ఆశాజీవిగానే బతుకుతున్నా ఆ నెమలీక కోసం చూస్తూ... 

***

లక్ష్మీ నారాయణ సబ్బని గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: లక్ష్మీ నారాయణ సబ్బని

సబ్బని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా లోని కరీంనగర్ మండలం బొమ్మకల్ గ్రామములో 1-4-1960 నాడు జన్మించారు. పాఠశాల మరియు ఇంటర్మీడియట్ విద్యాశాఖలో మూడు దశాబ్దాలు అధ్యాపక వృత్తిలో పని చేసి ఆంగ్ల ఉపన్యాసకులుగా 2015లో ఉద్యోగ విరమణ పొంది ఉన్నారు. M.A.( English); M.A. ( Hindi); M.Sc.(Psychology), M.A.(Astrology), M.Ed; PGDTE (CIEFL).

మొదలగు విద్యార్హతలు కలిగి ఉన్నారు . తెలుగులో వచన కవిత, కథ, నవల, వ్యాసం, సాహిత్య విమర్శ, సమీక్ష, జీవిత చరిత్ర, పద్యం, పేరడీ మొదలగు వివిధ ప్రక్రియలలో 40 వరకు సాహిత్య రచనలు ప్రచురించి ఉన్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో రాయగలరు. మూడు దశాబ్దాల విద్యా జీవితం మరియు నాలుగు దశాబ్దాల సాహిత్య సేవకు గుర్తింపుగా తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండింటిలోనూ మరియు జాతీయ స్థాయిలో కూడా అనేక అవార్డులు మరియు సన్మానాలు అందుకున్నారు. సబ్బని పొందిన బహుమతులు, అవార్డులు మరియు సన్మానాలు :

 1) "బెస్ట్ పోయెట్ ఆఫ్ ది ఇయర్ 2003 అవార్డు" "పోయెట్స్ ఇంటర్నేషనల్" వార్షిక అవార్డులు 2003, బెంగళూరు

 2) "పులికంటి సాహితీ సత్కృతి" తిరుపతి కథా బహుమతి 2004, ఎ.పి.

 3) "సాహితీ మిత్రులు" సిల్వర్ జూబ్లీ ఫెస్టివల్ అవార్డు, 2005, మచిలీ పట్నం. ఎ.పి.

 4) "సమతా సాహితీ కరీంనగర్" పార్థివ ఉగాది సన్మానం 2005.

 5) "ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం" డాక్టర్ జైశెట్టి రమణయ్య ట్రస్ట్, జగిత్యాల 2005. తెలంగాణ

 6) “సాహిత్య భూషణ్” అవార్డు, సారస్వత జ్యోతి మిత్ర మండలి, కరీంనగర్, 2005

 7) “మే డే-2013” కవితల బహుమతి మరియు ‘ఉగాది కథ బహుమతి-2013” నేతి నిజం’ డైలీ హైదరాబాద్.

 8) “సాహితీ కిరణం” మాసపత్రిక కథా బహుమతి -2013, హైదరాబాద్

 9) జిల్లా నుండి "బెస్ట్ NSS ప్రోగ్రామ్ ఆఫీసర్ అవార్డు". కలెక్టర్, కరీంనగర్-2010.

 10) రాష్ట్ర స్థాయి “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు”, ప్రభుత్వం. ఆంధ్ర ప్రదేశ్, 2013 కొరకు.

 11) కలహంస పురస్కారం -2014, నెలవంక- నెమలీక పత్రిక, హైదరాబాద్.

 12) మహాకవి శేషేంద్ర అవార్డు (హైదరాబాద్) - 2015.

 13) ఉమ్మడిశెట్టి లిటరరీ ఎక్సలెన్స్ అవార్డు , అనంతపురం(A.P) – నవంబర్-2015

 14) మళ్ళా జగన్నాధం స్మారక కవితా పురస్కారం, అనకాపల్లి (ఎ.పి.) -2015

 15) అవార్డు “సాహిత్య శ్రీ”, కాఫ్లా అంతర్జాతీయ సంస్థ, చండీగఢ్, భారతదేశం .OCT. 2016.

 16) “అద్దేపల్లి కవిత సృజన ప్రతిభా పురస్కారం” , విజయవాడ, A.P. నవంబర్.2016.

 17) “నానో కవితా ప్రక్రియా పురస్కారం” , ఆంధ్ర సారస్వత సమితి గోల్డెన్ జూబ్లీ సమావేశాలు, మచిలీపట్నం -2016.

 18) కవిత్వంలో తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం -2018.

19. D.Litt. సెయింట్ మదర్ తెరెసా వర్చువల్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ అండ్ ఎడ్యుకేషన్ నుండి సాహిత్యంలో గౌరవ డాక్టరేట్. 2019 బెంగళూరు.

20. "నవ సృజన్ కళా ప్రవీణ్ అవార్డు" కాన్పూర్ , U.P. 2020

21. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ దేశ్ భక్తి గీత్ రాష్ట్ర స్థాయి రెండవ బహుమతి (T.S.)-2022.

22.ఉత్తమ రచయిత అవార్డు.తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్- హైదరాబాద్, 2023.


38 views0 comments

Comments


bottom of page