top of page

బెడిసి కొట్టిన ప్లాన్

#PadmavathiDivakarla, #పద్మావతిదివాకర్ల, #BedisiKottinaPlan, #బెడిసికొట్టినప్లాన్, #TeluguCrimeThriller


Bedisi Kottina Plan - New Telugu Story Written By - Padmavathi Divakarla

Published In manatelugukathalu.com On 07/03/2025

బెడిసి కొట్టిన ప్లాన్ - తెలుగు కథ

రచన: పద్మావతి దివాకర్ల

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



వారం రోజుల పాటు ఔట్ డోర్ షూటింగ్ లో బిజీగా గడిపిన హీరో ప్రకాశ్ బాబుకి ఆ రోజే కాస్త సమయం చిక్కడంతో విశ్రాంతి తీసుకుంటున్నాడు. సోఫాలో వెనక్కు వాలి సెల్ ఫోన్ చూస్తున్నవాడల్లా హఠాత్తుగా ఫోన్ రింగైయ్యే సరికి ఫోనెత్తాడు. 


"హల్లో, ప్రకాశ్ బాబు గారూ! నమస్కారం! నా పేరు రామభద్రం. నేను మీ అభిమాన సంఘం అద్యక్షుణ్ణి. మీరే నా అభిమాన హీరో. మీ నటనంటే నాకెంతో ఇష్టం. నేను మీ అభిమానిని." అని ఫోన్లో అవతలవైపు నుండి వినబడటంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు వర్ధమాన హీరో ప్రకాశ్ బాబు.


ఇప్పుడిప్పుడే కొన్ని సినిమాలు చేసి పేరు తెచ్చుకున్నాడు ప్రకాశ్ బాబు. అందరిలాగే తనకి కూడా అభిమాన సంఘాలు, అభిమానులు ఉండాలన్న కోరిక ఉందతనికి. ఇప్పుడు తనకి కూడా పెద్ద హీరోల మాదిరే అభిమాన సంఘం ఒకటి ఉందన్న విషయం అతనికి చాలా ఆనందం కలిగింది.


"చెప్పండి రామభద్రం గారూ! నా పట్ల మీ అభిమానానికి కృతజ్ఞతలు." చెప్పాడు హీరో ప్రకాశ్ బాబు.


"మా ఊళ్ళో మీ సన్మాన సభ ఏర్పాటు చెయ్యాలని నిశ్చయించుకున్నాం. మీరు నటించిన 'అగ్ని పుష్పం' సినిమా అఖండ విజయం సాధించిన సందర్భంగా ఈ సన్మాన సభ ఏర్పాటు చేసి మిమ్మల్ని సత్కరించుకోవాలన్నది మా ఆశయం." చెప్పాడు రామభద్రం.


అతని మాటలు ప్రకాశ్ బాబుకి చాలా ఆనందాన్ని కలుగజేసాయి. అయినా కొద్దిగా బెట్టు చెయ్యదలచి, "నేనింకా పెద్ద పెద్ద సినిమాలు చెయ్యలేదు, నాకు సన్మానమేమిటి?" అన్నాడు మొహమ్మాటంగా.


ప్రకాశ్ బాబు మాటలకు పెద్దగా నవ్వాడు రామభద్రం.

"అమ్మో...మీ గొప్పదనం మీకు తెలియదు. మీరు ప్రభాష్, సూపర్ స్టార్ మహేశ్ బాబుతో పోల్చదగిన హీరో. కొన్నేళ్ళల్లో వాళ్ళని కూడా మించిపోగలరు. త్వరలోనే మీ పాన్ ఇండియా సినిమా రావాలని, అఖండ విజయం సాధించాలని మాలాంటి అభిమానులు ఆశించడంలో తప్పు లేదనుకుంటాను." అన్నాడతను.


రామభద్రం మాటలు హీరో ప్రకాశ్ బాబుకి మరింత ఆనందాన్ని కలుగజేసింది.


"సరే! మీ అభిమాన సంఘం జరుపుతున్న సన్మాన కార్యక్రమానికి నేను హాజరవుతాను. ఏ తేదిన ఉందో చెప్పండి, నిర్మాతలతో నా డేట్స్ అడ్జస్ట్ చేసుకోవాలి కదా!" చెప్పాడతను సంతోషంగా.


"తప్పకుండా! సన్మాన కార్యక్రమం జరిగే స్థలం, తేదీ మీకు త్వరలో తెలియపరుస్తాను. ఇక్కడకి రావడానికి ఫ్లైట్ టికెట్లు పంపుతాను. ఆ రోజు పూర్తిగా మీ అభిమానుల కోసమే కేటాయించాలి సుమా!" అని చెప్పి ఫోన్ పెట్టేసాడు రామభద్రం.

 ******

ముందు అనుకున్నట్లుగానే రామభద్రం ఫ్లైట్ టికెట్ పంపాడు. ఫ్లైట్ దిగిన హీరో ప్రకాశ్ బాబును రిసీవ్ చేసుకోడానికి వచ్చాడు రామభద్రం. తనను తాను పరిచయం చేసుకొని ప్రకాశ్ బాబు చేతికి పుష్పగుఛ్ఛం అందించాడు. అతను తప్పించి ఇంకెవరూ తనను కలసుకోవడానికి రాకపోవడంతో కొంత నిరుత్సాహం కలిగింది. అయినా అతను చెప్పినట్లు సన్మాన కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తాడన్న ఆశ మాత్రం కలిగింది. అతని ఆలోచనల్ని పసిగట్టినట్లున్నాడు రామభద్రం.


"సెక్యురిటీ ప్రాబ్లెం సార్! మీరు వస్తున్నారని ప్రచారం జరిగితే విమానాశ్రయం జనంతో కిక్కిరిసిపోయి, తొక్కిసలాటలాంటి ప్రమాదాలు జరిగినా జరగొచ్చు. మా ఊళ్ళో మీకున్న క్రేజ్ అలాంటిది మరి! సన్మాన సభ కోసం మాత్రం ఘనంగానే ఏర్పాట్లు చేసాను లెండి." అనేసరికి ప్రకాశ్ బాబు ఛాతీ గర్వంతో రెండించీలు పెరిగింది. 


సన్మానం ఘనంగా జరిగి, పబ్లిసిటీ వస్తే అంతకంటే మరేం కావాలి తనకు! 


అతనితో పాటు కారెక్కాడు ప్రకాశ్ బాబు. కారు ముందుకు దూసుకుపోయింది. ఒక గంట తర్వాత నగరానికి దూరంగా ఉన్న ఓ పెద్ద బంగళా ముందు కారాపాడు రామభద్రం. వాళ్ళక్కడికి చేరుకోగానే అరడజను మంది అభిమానులు తనని చుట్టుముట్టడంతో ఆనందంతో తబ్బిబ్బయ్యాడు ప్రకాశ్ బాబు.

 ******

నాలుగు రోజులగా హీరో ప్రకాశ్ బాబు షూటింగ్ కి హాజరుకాకపోవడంతో అతనితో చిత్రం నిర్మిస్తున్న నిర్మాత నిర్మలరావు ఆందోళన చెందాడు. ప్రకాశ్ బాబు ఫోన్ స్విచ్చాఫ్ వస్తోంది. అతని తల్లి తండ్రులకి ఫోన్ చేసాడు. వాళ్ళు కూడా అప్పటివరకూ ఏదో ఔట్ డోర్ షూటింగ్ లో బిజీగా ఉండి ఫోన్ ఎత్తలేదేమో అనుకున్నవాళ్ళ కాస్తా ఇప్పుడు బెంబేలెత్తిపోయారు. వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు. అతన్ని తమ సినిమాల్లో బుక్ చేసిన నిర్మాతలు, దర్శకులు ఉన్నట్లుండి హఠాత్తుగా మాయమైన ప్రకాశ్ బాబు ఎక్కడున్నాడో తెలియక తికమక పడ్డారు. 


వార్తా పత్రికలు, టివి, మీడియాలు అతని అదృశ్యం మీద రకరకాల కథనాలు వెలువరించసాగాయి. మరో వర్ధమాన నటిమణితో అతనికి అఫైర్ ఉన్నట్లు, ఆమెతో వెళ్ళిపోయి పెళ్ళి చేసుకొని తిరిగి రావచ్చని పుకార్లు పుట్టించారు కొంతమంది. కొన్ని మీడియాలు మరో అడుగు ముందుకేసి, ప్రేమ వ్యవహారం బెడిసికొట్టడం వల్లనో, సినిమా పరిశ్రమలో పోటీ తట్టుకోలేకో ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చొని చిలువలు పలువులుగా రాసారు. ఆ క్రమంలో ఆత్మహత్యకు పాల్పడిన కొంతమంది నటీనటుల ఉదంతాలు ఉటంకించారు. అవన్నీ వినీ, చదివీ ప్రకాశ్ బాబు తండ్రి తిరుమలరావు మరింత బెంబేలెత్తిపోయాడు.


టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్న ఇన్స్పెక్టర్  ప్రశాంత్ మీద క్షణక్షణానికి ఒత్తిడి పెరిగిపోసాగింది. మీడియావాళ్ళు, ప్రకాశ్ బాబు తల్లితండ్రులే కాక, అతని అభిమానులు మాటిమాటికీ ఫోన్లు చేస్తున్నారు. ఉన్నతాధికార్లనుండి, రాజకీయ నాయకుల నుండి కూడా ఒత్తిడి మొదలైంది. ప్రకాశ్ బాబు తండ్రి తిరుమలరావుని విచారించాడు.


"మా వాడికిగానీ, నాకు గానీ విరోధులెవరూ లేరు. ఇప్పుడిప్పుడే కేరీర్లో నిలదొక్కుకుంటున్నాడు కాబట్టీ, ప్రేమ వ్యవహారాలు లాంటివేమీ కూడా లేవు. ఈ మధ్య కొన్ని సినిమాలు హిట్ అవడంతో ఓర్వలేని సహనటులు ఎవరైనా ఈ పని చేస్తే మాత్రం చెప్పలేను." తన సందేహం వెలిబుచ్చాడు అతను. 


హీరో ప్రకాశ్ బాబు మాయమవడం వెనుకగల కారణాలేమిటా అని తీవ్రంగా ఆలోచించాడు ప్రశాంత్. అతని తండ్రి చెప్పినదానిబట్టి ప్రకాశ్ బాబు ఏ ప్రేమ వ్యవహారాల్లోనూ ఇరుక్కోలేదు. శతృవులెవరూ కూడా లేరు. నిర్మాతల్ని, దర్శకుల్ని, స్నేహితుల్నీ విచారించి డిప్రెషన్లోనూ లేడని నిర్ధారించుకున్నాడు. మరి ఉన్నట్లుండి ఏమైనట్లు? ఎవరైనా అతన్ని కిడ్నాప్ చెయ్యలేదు కదా అన్న అనుమానం ప్రశాంత్ కి కలిగింది. డబ్బు కోసమో, మరే ఇతర కారణం వల్లో ఎవరైనా కిడ్నాప్ చేసారేమో!


ప్రకాశ్ బాబు స్నేహితుడు శ్రీధర్ని అడిగి కొంత సమాచారం రాబట్టాడు ఇన్స్పెక్టర్  ప్రశాంత్. విశాఖపట్నంలో తన అభిమాన సంఘం తరఫున ఘనంగా సన్మానం జరగబోతున్నట్లు, ఫ్లైట్ టికెట్లు అందినట్లు కూడా తెలిపిన తర్వాత ఆలోచనలో పడ్డాడు ప్రశాంత్. విచారించాక ప్రకాశ్ బాబు ఫ్లైట్లో వెళ్ళడం నిజమేనని తేలింది. విశాఖపట్నం వెళ్ళి పరిశోధించడానికి పూనుకున్నాడు ప్రశాంత్. 


విమానాశ్రయం సిసిటివి ఫుటేజ్ లో ఒక వ్యక్తిని కలిసి, ఆ తర్వాత అతను కారెక్కినట్లు తెలిసింది. ఆ కారెటువెళ్ళిందో ఎంత ప్రయత్నించినా తెలియలేదు. దానికున్న నంబర్ ప్లేట్ ఫేక్ అని తేలింది. 


 వెంటనే స్థానిక పోలీసుల్ని కలుసుకొని సిసిటివి ఫుటేజ్ ఇచ్చి అన్ని పోలీసు స్టేషన్లకి పంపమన్నాడు. తనకి ఈ కేసులో సహకరించిన వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ శ్రీరాంతో మాట్లాడుతూ ఉండగా తిరుమలరావు నుండి ఫోన్ వస్తే ఎత్తాడు.


"ఇన్స్పెక్టర్  గారూ, మావాడ్ని ఎవరో కిడ్నాప్ చేసారు. ఇప్పుడే ఫోన్ వచ్చింది. రెండు కోట్ల రూపాయలు ఇమ్మని, లేకపోతే చంపేస్తామని బెదిరించాడు." ఆందోళన చెందుతూ చెప్పాడు తిరుమలరావు.


తను అనుకున్నట్లుగానే ప్రకాశ్ బాబు కిడ్నాపయ్యాడన్న మాట!


"మీరేం కంగారు పడకండి. ఆ ఫోన్ నంబర్ నాకు పంపండి. ట్రేస్ చెయ్యడానికి ప్రయత్నిస్తాను. మళ్ళీ ఫోన్ వేస్తే వాళ్ళని మాటల్లో పెట్టి, డబ్బులు ఎప్పుడు, ఎలా ఇవ్వాలో కనుక్కోండి. డబ్బులు సర్దుబాటు చెయ్యడానికి సమయం అడగండి." అతనికి ధైర్యం చెప్పాడు ఇన్స్పెక్టర్  ప్రశాంత్.

తిరుమలరావు పంపిన ఫోన్ నంబర్ గురించి ఆరా తీస్తే ఓ మెడికల్ స్టోర్ నుండి వచ్చిందని తేలింది. 


అక్కడ ఆరా తియ్యగా ఓ వ్యక్తి వచ్చి, సెల్ ఫోన్ మరిచిపోయినట్లు, అర్జెంట్ గా కాల్ చేసుకోవాలని తమ ల్యాండ్ లైన్ నుండి చేసినట్లు తెలిసింది. అక్కడున్న సిసిటివి ఫుటేజ్ తీసి పరిశీలించాడు. ఫోన్ చేసిన వ్యక్తి, విమానాశ్రయంలో ప్రకాశ్ బాబును రిసీవ్ చేసుకున్న వ్యక్తి వేర్వేరు అని తేలింది. అంటే...ఈ కిడ్నాప్ లో ఒకరి కన్నా ఎక్కువ మంది హస్తం ఉందన్నమాట అనుకున్నాడు ప్రశాంత్.


సిసిటివిలో లభించిన ఫుటేజ్ పట్టుకొని, ఇన్స్పెక్టర్  శ్రీరాంతో కలిసి మరికొంత సమాచారం సేకరించిన తర్వాత త్వరలో చిక్కుముడి విడిపోతుందన్న అభిప్రాయం కలిగింది ప్రశాంత్ కి.


సాయంకాలం తిరుమలరావు నుండి మరోసారి ఫోన్ వచ్చింది.


"ఇన్స్పెక్టర్  గారూ! ఇప్పుడే మళ్ళీ కిడ్నాపర్ల నుండి ఫోన్ వచ్చింది. రేపు ఉదయం కల్లా డబ్బులు రెడీ చేసుకోమని, ఇక్కడికే వచ్చి డబ్బులు తీసుకొని, మా అబ్బాయిని వెంటనే వదిలేస్తామని చెప్పాడు. ఎక్కడ అందజెయ్యాలో గంట ముందు చెప్తానన్నాడు. పోలీసులకు చెప్పినా, ఏ విధంగానైనా మోసానికి పాల్పడ్డా అబ్బాయిని హత్య చేస్తామని గట్టిగా బెదిరించాడు. మీరే వాణ్ణి ఎలాగైనా కాపాడాలి ఇన్స్పెక్టర్  గారూ! మా వాడు డబ్బులన్నీ నాకే ఇచ్చినా, కిడ్నాపర్లు అనుకున్నట్లు మా వద్ద అంత డబ్బు లేదు. ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు. మీరే ఎలాగైనా మా వాణ్ణి రక్షించాలి." బాగా బెదిరిపోయి ఉన్నాడేమో ఏడుస్తూ చెప్పాడు తిరుమలరావు.


"మీరేం వర్రీ అవకండి తిరుమలరావు గారూ! వాళ్ళు మళ్ళీ ఫోన్ చేస్తే డబ్బులు సర్దుబాటు చేస్తాం అని మాత్రమే చెప్పండి. మా పరిశోధన కొంచెం ముందుకి సాగింది. త్వరలో దుండగులను పట్టుకొని, మీ అబ్బాయిని వాళ్ళ బారినుండి రక్షిస్తాం." అతనికి ధైర్యం చెప్పాడు ఇన్స్పెక్టర్  ప్రశాంత్.

"మొత్తం భారమంతా మీ మీదే వేసాను ఇన్స్పెక్టర్  గారూ!" దిగులుగా చెప్పాడు తిరుమలరావు.


అతనికి మళ్ళీ ధైర్యం చెప్తూ ఫోన్ పెట్టేసాడు ఇన్స్పెక్టర్  ప్రశాంత్.


మరో రెండు గంటల తర్వాత, నగర శివార్లలో ఉన్న బంగళాని చుట్టుముట్టారు పోలీసులు. అప్పడే హీరో ప్రకాశ్ బాబుని తీసుకొని బయలు దేరబోతున్న కిడ్నాపార్లు కొద్దిపాటు ప్రతిఘటన అనంతరం లొంగిపోయారు. కిడ్నాప్ ప్లాన్ కి సూత్రధారి అయిన రామభద్రంతో పాటు ఉన్న ఆరుగుర్నీ తమ కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. 


అతి చాకచక్యంగా కిడ్నాపర్లని పట్టుకొని, హీరో ప్రకాశ్ బాబుని విడిపించినందుకు ఇన్స్పెక్టర్  ప్రశాంత్, శ్రీరాంనూ అభినందనలతో ముంచెత్తారు ఉన్నతాధికార్లు, మీడియా. తిరుమలరావు అయితే కళ్ళనీళ్ళు పెట్టుకొని ఇన్స్పెక్టర్  ప్రశాంత్ కి చేతులు జోడించి నమస్కరించాడు. ప్రకాశ్ బాబు తల్లి వసుంధర కొడుకు తిరిగి వచ్చినందుకు ఆనందబాష్పాలు రాల్చింది.


అనంతరం ఏర్పాటైన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, "హీరో ప్రకాశ్ బాబు కనపడకుండాపోయిన నాలుగు రోజులవరకూ రకరకాల ఊహాగానాలు చేసారందరూ. మా విచారణలో అవన్నీ నిరాధారమైనవని తేలాయి. అతన్ని కిడ్నాప్ చేసినవాళ్ళు ఫోన్ చేసేసరికే, ఇక్కడికి చేరి పరిశోధన మొదలుపెట్టాం. సిసిటివి ఫుటేజ్ లో కనిపించిన కారు రిజిస్ట్రేషన్ నంబర్ ఫేక్ అని తేలింది. కిడ్నాప్ గ్యాంగ్ లో ముఖ్యుడైన రామభద్రం పాత నేరస్థుడే అయినా, వేషం కొద్దిగా మార్చుకోవడంతో అతన్ని గుర్తుపట్టడంలో విఫలమయ్యాం. 


నగరంలో పలు చోట్ల సిసిటివి ఫుటేజ్ పరిశీలించగా, దారిలో ఓ పెట్రోల్ బంక్ లో, కారులో పెట్రోల్ పోయించాడు. వాళ్ళకి డబ్బులు చెల్లింపు చేసేటప్పుడు నగదు ఇచ్చి ఉంటే అంత తేలిగ్గా పట్టుబడక పోను. ఫోన్ పే ద్వారా చెల్లించడంతో ఫోన్ నంబర్, అతని అకౌంట్ వివరాలేకాక, బాంక్ నుండి అతని విలాసం కూడా తెలిసింది. అతని ఇంటిపై నిఘా పెట్టి, ప్రకాశ్ బాబును బంధించి ఉన్న బంగళాని కనుగొని ముట్టడించాం. 


అప్పుడే అక్కణ్ణుంచి బయలుదేరి తిరుమలరావు నుండి డబ్బులు వసూలు చేసుకోవడానికి బయలుదేరబోతున్న ఆ ముఠావాళ్ళు తేలిగ్గా పట్టుబడ్డారు. కొద్దిపాటి ప్రతిఘటన అనంతరం పోలీసులకు లొంగిపోయారు. సరిగ్గా ఇలాంటి కిడ్నాపులే ఈమధ్య ముంబై నగరంలో జరిగాయి. వర్ధమాన నటులను, టివి తారలను సన్మానం పేరుతో కిడ్నాప్ చేసి డబ్బులు గుంజుకొని వదిలేసారు. బహుశా ఆ విధంగా హీరో ప్రకాశ్ బాబుని కిడ్నాప్ చేసి లబ్ధి పొందుదామని అనుకొని ఉంటారు. కానీ, బ్యాడ్ లక్, మాకు దొరికిపోయారు. వాళ్ళ ప్లాన్ బెడిసికొట్టింది." తమ పరిశోధనా వివరాలు తెలిపాడు ఇన్స్పెక్టర్  ప్రశాంత్.


ఇన్స్పెక్టర్  ప్రశాంత్, శ్రీరాం - ఇద్దర్నీ ప్రశంశలతో ముంచెత్తారందరూ.


సమాప్తం


పద్మావతి దివాకర్ల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:


పేరు పద్మావతి దివాకర్ల. నివాసం బరంపురం, ఒడిషా. ఇప్పటి వరకు వంద కథల వరకూ వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ఆంధ్రభూమి, సహరి, హాస్యానందం, కౌముది, గోతెలుగు అంతర్జాల పత్రికలలో కథలు ప్రచురించబడ్డాయి. బాల సాహిత్యం, హాస్య కథలు రాయటం చాలా ఇష్టం.


Comments


bottom of page