top of page
Writer's pictureSita Mandalika

భక్తి -ముక్తి

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Video link

'Bhakthi Mukthi' Written By Sita Mandalika

రచన: సీత మండలీక


ఎవరికైనా సరే, ఒకసారి భక్తి అనేది అలవాటు అయితే ఇక అందులోనే ఆనందం వెతుక్కుంటారు .

తమ జీవన విధానం అందుకు తగ్గట్లుగా మార్చుకుంటారు. చివరి వరకు అదే దారిలో పయనిస్తారు.ఈ కథను ప్రముఖ రచయిత్రి సీత మండలీక గారు రచించారు.

కార్తీక మాసం. ఉదయం ఆరుగంటల సమయం. అందరూ లేచి స్నానాలు చేసి, పూజలు చేసే వేళ అయ్యింది. ఇంకా మంచం మీద నించి లేవ లేక పోతున్నాను. ఈ ముణుకుల బాధ పడలేకుండా ఉన్నాను. డాక్టర్ గారు ఏదొ ఆపరేషన్ చేస్తే తగ్గుతుంది అన్నారు.

ఎండా కాలం, అమ్మాయి రమణి అమెరికా నించి వచ్చి రెండునెలలైనా ఉంటే ఆపరేషన్ చేయించు కుంటాను. ఈ బాధ తో మరో ధ్యాస లేదు. అన్నీ మర్చిపోయి ఇదే ఆలోచన

"అమ్మగోరూ" అన్న పనిమనిషి మంగ పిలుపుతో ఈ లోకానికి వచ్చేను. ఎదురుగా ఉన్న మంగని చూసి ఒక్క క్షణం ఇది మంగేనా అనుకున్నాను. ముఖానికి పసుపు , ఎర్రటి పెద్ద బొట్టు, తలలో పువ్వులు... నిండు ముత్తైదులా ఉంది.

చేతులో పూల సజ్జ నిండా మందారాలు చేమంతులు కింద పెడుతూ "గుళ్లో పంతులుగారు ఇవి మీకిమ్మన్నారండి. మీరు స్నానం చేసి రండి. నేను ఇల్లు ఊడ్చి దీపాలు తోమి రెడీ సేస్తాను" అంటూ దేముడి గదికి హడావిడిగా వెళ్ళింది.

కిచెన్ లో కాఫీ కలిపి తెచ్చేసరికి ఆయన మార్నింగ్ వాక్ పూర్తి చేసుకుని వచ్చి, డ్రాయింగ్ రూమ్ లో రిలాక్స్ అవుతూ, నేనిచ్చిన కాఫీ గ్లాస్ అందుకుంటూ “ఎలా ఉన్నావు? నిన్నటికన్నా ఈ రోజు కొంచెం బెటర్ గా కనపడుతున్నావు. ఆ కొత్త మందు పూర్తి అయ్యేసరికి బాగా నయమవుతుంది” అంటూ తన డాక్టర్ ధోరణి లో సంభాషణ ఆరంభించేరు. ఆయన ప్రశ్నలకి జవాబు చెప్పి, బ్రేక్ ఫాస్ట్ సిద్ధం చెయ్యడానికి కిచెన్ లోకి వెళ్ళేను.

మంగ, దేవుడి దీపాలు ముందు వేసుకుని తోముతూ గుడి విశేషాలు చెప్పడం ఆరంభించింది .

" అమ్మగోరూ! నిన్న మీరు రాలేదు గాని ఎంకన్న పూజ, లచ్చిమి దేవి కుంకం పూజ పంతులు గారు ఎంత బాగా సేసేరండీ. నేను కట్టిన పూలదండలు లచ్చిమి దేవి కి వేసేరండి. నాకైతే గుడినించి రావాలనిపించలేదు. రంగడు రేత్రి 9 గంటలయింది ఇంటికి పోదామే అనే వరకు గుళ్లోనే ఉన్నాను.

మంగ మాటలు విని ఒక్క క్షణం ఆశ్చర్యపోయాను. దీనికి ఇంత భక్తా? గుడీ, గుడి మాటలు తప్ప మరే మాట దాని నోటివెంట రావడం లేదు.

దేముడి దగ్గర కూర్చుని ఏదో యాంత్రికం గా పూజ చేస్తున్నా మనసంతా మంగ మాటలతో నిండి పోయింది. దాని ఇదివరకటి మాటలకి, ఇప్పటి మాటలకి ఎంత తేడా? ఇదివరకైతే తన కూతురి కాపురం, కొడుకు ఉద్యోగం దాని ఆర్ధిక పరిస్థితి.. ఇవే మాటలు. మొగుడి తాగుడలవాటు తో డబ్బులేమీ మిగిలేవి కావని చెప్పేది.

నాకు పెళ్ళై విశాఖపట్నం వచ్చినప్పుడు, మంగ మా అత్త వారింట్లో పని చేస్తుండేది. అప్పటికే దానికి ఇద్దరు పిల్లలు. అందరి కధ లాంటిదే దానిది కూడా. మొగుడు రంగడు తాగుడికి బాగా అలవాటు పడిపోయేడు. రోజూ మంగతో దెబ్బలాడి డబ్బులు తీసుకుని తాగే వాడు. మంగ డబ్బులు చాలక అప్పులు చేసేది.

" ఆ ఎంకన్న కి ఎప్పుడు దయ వస్తుందో.. ఈడి సేత ఎప్పుడు అలవాటు మానిపిస్తాడో.." అని వాపోయేది.

మంగకి ఇద్దరు పిల్లలు. పెద్దమ్మాయి కరుణ, రెండో వాడు రమణ . ఇద్దరూ బాగానే చదువుకునేవారు. స్కూల్ ఫీజు లు కట్టి చదివించలేక 10 వ తరగతి పాస్ అవగానే బంధువుల అబ్బాయికిచ్చి కరుణపెళ్లి చేసింది. రమణ 12 వ తరగతి దాకా చదివి సూపర్ మార్కెట్ లో పని చేస్తున్నాడు. ఇన్ని మార్పులు వచ్చినా రంగడి లో మార్పు లేదు. పైగా తాగుడు ఎక్కువయి పోయింది.

మాకు ఇద్దరు పిల్లలు. పెద్దమ్మాయి రమణి. అమ్మలు అని పిలుస్తాము, ఇంజనీరింగ్ అయ్యేక పెళ్లి చేసేము. అబ్బాయి అచ్యుత్ మెడిసిన్ చదువుతున్నాడు.

అత్త గారు, మామ గారి తో మేం కలిసి ఉండే వాళ్ళం. మామ గారు కూడా డాక్టర్. అత్తగారుసుభద్రమ్మ గారు పూజలు వ్రతాలు, వీటితోనే గడుపుతూఉండేవారు. అత్తగారింట్లో ప్రతి నెల ఏదో ఒక పూజ ఉండ వలిసిందే. ఇంక కార్తీక మాసం వచ్చిందంటే ఆవిడ హడావిడికి అంతు లేదు. పూజలు, వ్రతాలు, భోజనాలు… వీటితోనే రోజులు గడిచేవి. నాకైతే ‘ఇదేనా భక్తి!’ అనిపించేది.

‘హాయిగా ప్రశాంతం గా దేముడి మీద మనసు పెట్టి ఒంటరిగా పూజ చేస్తే సరిపోదా. అది మాత్రం భక్తి కాదా?’ అనిపించేది. కానీ పైకి అనే ధైర్యం చాలక లోలోపే అనుకునే దాన్ని. అత్తగారు పోయిన తరవాత ఈ ముణుకుల నెప్పుల బాధ తో అన్నీ మానేసాను.

"అమ్మగోరూ" అన్న మంగ పిలుపుకి ఈ లోకంలోకి వచ్చి "ఏమిటే మంగా”

అనే సరికి "అమ్మగోరూ! ఇయ్యేల తొందరగా గుడికి పోవాల.పెద్ద పంతులు గారు ఒత్తారుతమ్మా. మద్దినాల రానండి" అంది. ఈ మంగ కి గుడి తప్ప మరో ధ్యాస లేదు అనుకొని "సరే పోవే! రేపు తొందరగా పనికి రా " అన్నాను.

మంగని చూస్తే జాలి వేస్తుంది. కూతురు అత్త వారింటికి వెళ్ళిపోడం దానికి మనసులో మాట చెప్పుకోడానికి కూడా ఎవరూ లేక మరీ దిగాలు పడి పోయింది.

ఒక రోజు "అమ్మగోరూ! రంగడిని వదిలి పల్లె కు పోతానండి. రోజూ ఈ దెబ్బల బాధ, పడ లేకున్నానండి. తాగుడు కోసం డబ్బులివ్వక పోతే బాగా కొడుతుంటాడండి" అని బాధ పడింది.

ఆ రోజు పొద్దున్నే గుడిలోని పంతులు గారు “జానకమ్మా! గుడి చుట్టూ కడిగి ముగ్గులు వెయ్యడానికి ఎవరేనా పని అమ్మాయి ఉంటే చెప్పమ్మా. ఆ రంగి మానేసింది” అని అడిగేరు.

“మంగా! నువ్వు ఈ పని చెయ్యకూడదే, నెలకి 500 రూపాయలిస్తారు. ఆ డబ్బు నేను దాచి పెడతాను రంగడు లాగేయకుండా” అని అడిగేను మంగని.

"అమ్మగోరూ! నేను అంత పెందలకడే పోలేనండి" అంది.

"సరే నీ ఇష్టం" అని ఊరుకున్నాను. రాత్రి ఏమి ఆలోచించుకుందో మర్నాడు

మంగ, “నేను గుడిలో పనికి చేరేనమ్మా” అని చెప్పింది.

మంగ గుడి పనిలో చేరి ఒక ఏడాదయింది. నెల జీతం తీసుకుని నాదగ్గర దాచుకునేది.

“పువ్వులు కూడా కడతానండి” అందిట పంతులుగారి తో.

“స్నానం చేసిన తరవాత కట్టాలి. అలా పువ్వులు ముట్టుకోకూడదు” అన్నారుట పంతులు గారు .

సరే అని రోజూ తెల్లవారి స్నానం చేసి పువ్వులు కట్టడం మొదలు పెట్టింది. ఎలాగేనా కొన్ని డబ్బులు రంగడి తెలియకుండా దాచుకుని ఆ డబ్బు తో మనమరాలికి ఉంగరం కొందామని దాని కోరిక.

ఆ వెంకన్న కూడా గంగకి భక్తి మార్గం చూపెట్టినట్లున్నాడు. రోజూ 5 గంటలికి లేచి గుడి చుట్టూ కడిగి ముగ్గులు పెట్టి పువ్వులు కోయడానికి తోట లోకి వెళ్ళేది. వీటి తోటే దానికి సరిపోతోంది. మిగతా వాళ్ళింట్లో పాచి పనులు చెయ్యడం మానేసింది.

మా ఇంట్లో చేస్తోంది గాని, ఇక్కడ కూడా మానేస్తానంటుంటోంది. గుడి నించి ప్రసాదాలు తెచ్చుకుని ముగ్గురూ కడుపు నింపుకునేవారు.

మంగ గుడి పనులతో రంగడి కి చాలా ఇబ్బంది అయిపొయింది. తాగుడుకు డబ్బులు దొరకడం లేదు.

“పంతులు గారి తో చెప్పి పని మానిపించేస్తాను, జాగరత” అని భయపెట్టేవాడు గాని, మంగ మనసులో వెంకన్న తప్ప మరో ధ్యానం లేదు. దెబ్బలు తిన్నా రంగడిని బతిమాలి గుడికి పోయేది. గ్రహ బలం ఉంటే కొందరిలో భక్తి అబ్బుతుంది అనేది మా అమ్మ. మంగని చూస్తే అది నిజమనిపిస్తుంది. క్రమేపి రంగడి లో కూడా మార్పు వచ్చింది .

ఒక రోజు “మంగా! నేను కూడా గుడి లో ఏదేనా పని చేస్తానే” అన్నాడుట.

ఆ రోజు మంగ పొంగి పోతూ “అమ్మగోరూ! రంగడు గుడిలో తోట మాలి గా జేరేడమ్మా! అంతా ఆ ఎంకన్న దయ” అంటూ చెప్పింది.

గుడిలో ఉత్సవాలు చాలా జోరుగా జరుగుతున్నాయి. సాయంత్రం లక్ష్మి గారు రాగయుక్తం గా పాడుతుంటే ఎంతో హాయి అనిపించింది. మేమొక పదిమంది గ్రూప్. నారాయణీయం నేర్చుకున్నాము. కానీ మా గ్రూప్ లో లక్ష్మి గారు బాగా సాధన చేసి ఎంతో బాగా పాడతారు. ఈ మధ్య నాకు ప్రాక్టీస్ లేక సరిగ్గా కుదరడం లేదు. మళ్ళీ ఆరంభించాలి. రోజు కి రెండు గంటలు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. కల్యాణికి ఫోన్ చేస్తే వస్తుంది. హాయిగా ఇద్దరం కలిసి ఆరంభిస్తాము. చాలా రోజుల తరవాత ఎంతో ఉత్సాహం గా అనిపించింది.

ఇంటికి వెళ్లి పుస్తకాలు అన్నీ రెడీ చేసుకుని పొద్దున్నే పూజ చేసుకోవాలని ప్లాన్ చేసేను.

డిన్నర్ దగ్గర “ఈ వేళ నా మనసు హాయి గా ఉంది” అంటే రఘు నవ్వి ఊరుకున్నాడు.

రాత్రి 10 గంటలయింది .అమ్మాయి దగ్గరనించి ఫోన్ వచ్చింది. దానికి నేను గుడిలో అనుకున్న మాట చెప్పే లోపునే "అమ్మా! నీకొక గుడ్ న్యూస్. నువ్వు చాలా హాపీ ఫీల్ అవుతావు" అంటూ మొదలు పెట్టింది.

"చెప్పవే తొందరగా ఆ న్యూస్ ఏమిటో… నాన్న కి కూడా చెప్పాలి" వినాలన్న నా కుతూహలం ఎక్కువయిపోయింది

" అమ్మా! ఈ సమ్మర్ నేను పిల్లల తో రెండు నెలలకి నీ దగ్గరకి వస్తాను. శ్రీధర్ ఆఫీస్ పని మీద కెనడా వెళ్తున్నాడు. నేను జాబ్ రిజైన్ చేసి తిరిగి వచ్చేక మరొక జాబ్ లో చేరతాను” అని గుక్క తిప్పుకోకుండా చెప్పింది. నా మనసంతా ఆనందం తో నిండి పోయింది.

రఘు నర్సింగ్ హోమ్ నించి రాగానే అమ్మలు ప్రోగ్రాం చెప్పేను.

"ఇంకా చాలా టైం ఉంది. ప్లాన్ చేద్దాంలే" అన్నాడు రఘు.

నాకు మాత్రం నిద్ర పట్టలేదు. ఒక నెల అమ్మలు తో, పిల్లలతో గడిపిన తరవాత ఆపరేషన్ చేయించుకుంటాను. షాపింగ్ అంత కు ముందే చేసి దానికి కావలిసినవన్నీ కొనిపెట్టాలి. అది కొనుక్కోగలదు కానీ నేను కొనిపెడితే ఆ సంతోషం వేరు. ఎండల్లో పిల్లలతో తిరగ లేదు. హాయి గా ఏ .సి రూమ్ లో రెస్ట్ తీసుకుంటారు. మొన్న సరళ వాళ్ళమ్మాయికి కొన్న డైమండ్ నెక్లెస్ చాలా బాగుంది. కుదిరితే ఇంకా మంచిది కొనాలి. నాలుగు షాపులుతిరిగి చూడాలి. ఈ ఆలోచనలతో సరిగ్గా నిద్ర పట్టలేదు నాకు.

పొద్దున్న లేచే సరికి రఘు వాకింగ్ నించి వచ్చి పేపర్ చూస్తున్నాడు. తొందరగా కాఫీ ఇచ్చి బ్రేక్ఫాస్ట్ చేసేసరికి రఘు తయారై వచ్చేడు. మళ్ళీ అమ్మలు రావడం.. వాళ్లకి ఏ సదుపాయాలు చెయ్యడం.., ఏ షాపింగ్ చేయడం.. అన్నీ మళ్ళా మొదలు పెట్టేసరికి రఘు కి చాలా కోపం వచ్చింది.

“పిల్లల బాగోగులు చూడడం వాళ్లకి సరి అయిన దారి చూపడం తల్లి తండ్రుల బాధ్యత, వాళ్ళని దూరం చెయ్యడం కాదు గాని వాళ్ళే మన జీవితం అన్నట్టు ఉండకూడదు. ఇప్పటినించి షాపింగ్ చేస్తే నీ ముణుకుల నెప్పి ఎక్కువవుతుంది. నీ ఇష్టం” అంటూ వెళ్ళిపోయేడు. ఈయనకు ఏమి తెలుసు తల్లి ప్రేమ. కొంచెం అలసట గా ఉంటే క్లుప్తం గా దేముడి దీపం పెట్టుకుని మంచం మీద పడుకున్నాను.

"ఏమ్మా, పండుకున్నారు” అంటూ మంగ వచ్చింది.

"ఏమీ లేదే! తోచక పడుకున్నాను" అన్నాను నేను

“అమ్మగోరూ! నాకు పది రోజులు సెలవిప్పించండి. గౌరి వచ్చి పనిచేస్తుంది” అంది మంగ.

"ఏమే మంగా,కూతురి మీదకి మనసు పోయిందా ఇన్నాళ్లు

సెలవంటున్నావు" అన్నాను.

"లేదమ్మగోరూ! గుళ్లో పండుగలు మొదలయ్యాయి. వారం రోజులవుతాయిట. నేను, రంగడు అక్కడ ఉండాలమ్మా. ఎంకన్నకి, లచ్చిమి దేవి కి పెద్ద పూల మాలలు కట్టాల, పసుపు కుంకుమ పొట్టాలు కట్టాల, ముగ్గులు పెట్టాల… ఒక పనా ఆమ్మా! రోజంతా అక్కడ ఉండాల."

దేముడి భక్తి కి మంగ చూపెడుతున్న శ్రద్దా భక్తులకి జోహార్లు.

" నిన్న నా కూతురు రమ్మని ఫోన్ చేసిందమ్మా గాని ఇప్పుడు రాలేనని సెప్పేను. దాని సంసారం దానిదమ్మా. ఎంకన్నని ఇడిసి పోలేనమ్మా. నా పేనాలు ఇక్కడే ఉంటాయమ్మా"

ఒక్క సారి దాని మాటలకి ఆశ్చర్యం వేసింది. ఈ మమతలు, ప్రేమలు దూరం చేసుకోమని ఎంత బాగా చెప్పింది?

ఆదివారం రఘుకి సెలవు కనక పొద్దున్నే 7 గంటలకి గుడికి బయల్దేరేము. గుడి అంతా సందడి గా ఉంది. మేము వెళ్లేసరికి మంగ పెద్ద పళ్లెం నిండా తులసి దళాలతో పెద్ద మాల కడుతోంది. రంగడు తులసి అందిస్తున్నాడు. అల్లా ఇద్దరినీ చూస్తే ఆశ్చర్యం, ఆనందం కలిగింది.

“ఏరా రంగా చాలా మారిపోయావు?” అని రఘు అనడం తో

“అంతా మంగ మంచి మనసు వల్లయ్యా” అన్నాడు రంగడు .

“మీ అత్తగారి జాతకం లో కేతువు స్థానం బలం గా ఉందే. అందుకే అన్ని పూజలు వ్రతాలు చేస్తుంటారు” అన్న అమ్మ మాటలు గుర్తుకొచ్చేయి. మంగ జాతకం లో కూడా కేతువు స్థానం బలం గా ఉందేమో అనిపించింది.

"అమ్మా! ఈ ఏల సీనివాసుడి కళ్యాణం. తులసి మాలలు ఏసుకుంటారు. లచ్చిమి దేవి మల్లె మాల ఏసుకుంటాది. మల్లెలు, కనకాంబరాలు కలిపి కడతానమ్మా . సూడమ్మా! ఆ అమ్మ అయ్యా ఎంత బాగున్నారో. నాకైతే ఎంకన్న సేవ సేస్తూ పానాలు వదిలెయ్యాలనుందమ్మా" అంది మంగ

"ఏమిటే ఆమాటలు మంగా? జానకమ్మా! దీనికి సెప్పమ్మా.. ఇది పిచ్చిదై పోతన్నాది. కూతురి కాడకి పోవే అంటే పోను అంటాది.. దాన్ని పిల్సుకొత్తానే అంటే దాని సంసారం దానిది అంటాది. నాకేం అరదమవదమ్మా” అన్నాడు రంగడు .

వాడికేంటి.. నాకే అర్ధం అవలేదు, దాని మనస్సు.

వారం రోజుల్లో గుళ్లో ఉత్సవాలు అయిపోయేయి. మర్నాడు మంగ వేకువనే గుడికి పోయి గదంతా కడిగి ముగ్గులు పెట్టి, దీపాలు ముందేసుకుని కూచుంది. దీపాలు తోముతుంటే ఒళ్ళంతా చెమటలు పట్టి చెయ్యి లాగేస్తూ ఉంటే “యెంకన్నా!” అంటూ వెనక్కి పడి పోయింది.

పూజారి గారు ఫోన్ చేసి విషయం చెప్పి, “రఘు బాబుని గుడికి రమ్మనండమ్మా” అన్నారు.

అంబులెన్సు లో మంగని తీసుకుని హాస్పిటల్ కి బయల్దేరేము. రఘు ఎంత ప్రయత్నించినా కొన ఊపిరితో ఉన్న మంగ ప్రాణాలు గాలి లో కలిసి పోయేయి. మంగ ఇక లేదనగానే నాకళ్ళ నిండా నీళ్లు నిండేయి.

కేతువు స్థానం ప్రభావం వల్ల భక్తి మార్గం పొందుతారంటారు. మంగకి భక్తి, ముక్తి కూడా లభించేయనిపించింది.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత్రి పరిచయం : సీత మండలీక

నేను హౌస్ మేకర్ ని. కొడుకులిద్దరూ అమెరికాలో పెళ్ళిళ్ళై స్థిరపడిపోయాక, భర్త ఎయిర్ ఇండియా లో రిటైర్ అయ్యేక ఇప్పుడు నాకు కొంచెం సమయం దొరికింది

కధలు చదవడం అలవాటున్నా రాయాలన్న కోరిక ఈ మధ్యనే తీరుతోంది


156 views0 comments

Comments


bottom of page