'Bhakthi Unda Leda' - New Telugu Story Written By L. V. Jaya
Published in manatelugukathalu.com on 09/03/2024
'భక్తి వుందా? లేదా?' తెలుగు కథ
రచన: L. V. జయ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
"వెంటనే బయలుదేరి రా. మీ నాన్నగారు ఇక లేరు"..
ఎవరో ఫోన్ చేసి చెప్పారు జాగృతి కి. ఒక్కసారిగా నించున్న చోట పడిపోయింది. ఈ విషయం వినాల్సి వస్తుంది అని తెలుసు కానీ ఇంత తొందరగా వినాల్సి వస్తుంది అని అనుకోలేదు. ఏమి చెయ్యాలో తెలియలేదు.
తేరుకుని, వెంటనే బయలుదేరే ఫ్లైట్లు ఏమున్నాయో చూసుకుని, ఎయిర్పోర్ట్ కి బయలుదేరింది జాగృతి. కళ్ళలోంచి నీళ్లు ఆగకుండా వస్తూనే వున్నాయి. ఆ సంవత్సరం లో అప్పటి వరకు జరిగినవి అన్ని గుర్తువచ్చాయి.
జాగృతి వాళ్ళ నాన్నగారు, రమేష్ గారంటే అందరికి చాలా గౌరవం, భయం. ఎవరూ ఆయన మాటకి ఎదురు చెప్పలేరు. రమేష్ గారికి అప్పటికి యాభై రెండు ఏళ్ళు. జాండీస్ రావడంతో, సంక్రాంతి రోజున హాస్పిటల్లో జాయిన్ చేసారు. మనిషి సగం అయ్యి, గుర్తు పట్టలేనట్టుగా అయిపోయారు. రెండు రోజులు హాస్పిటల్లో ఉంచి, చాలా రకాల టెస్ట్ లు చేసాక. "ఈయన ఎక్కువ రోజులు బతకరు. మహా అయితే ఆరు నెలలు. ఇప్పుడు డిశ్చార్జ్ చేస్తున్నాం" అని చెప్పారు డాక్టర్లు. భార్యా, పిల్లలు నమ్మలేకపోయారు.
ఇంకా బాగు అవ్వుతారేమో అన్న ఆశతో, ఇంకో హాస్పిటల్ జాయిన్ చేసారు రమేష్ గారిని. కొన్ని రోజులకి, కొంచెం శక్తి వచ్చినట్టు అనిపించి రమేష్ గారికి. "నన్ను డిశ్చార్జ్ చేసెయ్యండి. హాస్పిటల్ లో ఇంక ఉండలేకపోతున్నాను. " అని మొండిగా అన్నారు రమేష్ గారు. "వద్దు, మీ ఒంట్లో ఇంకా పూర్తిగా తగ్గలేదు" అని భార్య, పిల్లలు ఎంత చెప్పినా వినలేదు. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేయించుకుని, ఉద్యోగానికి వెళ్లిపోయారు. ఆయన పెరిగిన ఊళ్ళోనే ఆయన ఉద్యోగం.
అంతకు ముందు హాస్పిటల్లో, డాక్టర్లు చెప్పిన విషయాన్ని ఎవరూ చెప్పలేకపోయారు. ఆయనకి ఆ విషయం చెప్పి ఆపే ధైర్యం ఎవరికి లేదు.
ఇదిగో ఇప్పుడు ఈ వార్త వినాల్సి వచ్చింది.
ఎయిర్పోర్ట్ కి వెళ్లే దారిలో చాలా గుళ్ల ముందు పెద్ద లైన్లు వున్నాయి. అప్పుడు గుర్తు వచ్చింది జాగృతి కి ఆ రోజు శివరాత్రి అని. 'ఉదయం నుండి గుళ్ళలో అభిషేకాలు మొదలు అవుతున్నట్టు వున్నాయి. ' అనుకుంది జాగృతి.
సాయంత్రం అయ్యింది జాగృతి తన ఇంటికి చేరేటప్పడికి. శివరాత్రి ఘడియల్లోనే అన్ని పనులు అయిపోవాలి అని అప్పటికే తీసుకుని వెళ్లిపోయారు జాగృతి నాన్నగారిని. ఆఖరి చూపు కూడా లేదు జాగృతి కి.
రమేష్ గారి చుట్టాలు, స్నేహితులు, ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళు చాలా మంది వచ్చారు పరామర్శకి. ఆయన భార్యని, తల్లిని ఊరుకోబెట్టడం చాలా కష్టంగా ఉంది అందరికి. రమేష్ గారి గురించి ఎవరికి తెలిసిన విషయాలు వాళ్ళు చెప్పారు.
"పదిహానోయేట తండ్రి పోయారు ఆయనకి. వాళ్ళ నాన్నగారి లాగే టీచర్ అవ్వాలని పట్టుబట్టి అయ్యారు. "
"అందం గా, నీటుగా ఉండటం అంటే చాలా ఇష్టం ఆయనకి. రాత్రి పడుకునేటప్పుడు కూడా తల దువ్వుకుని పడుకునేవారు".
'అందంగా, నీటుగా ఉండాలనుకునే మనిషి, ఆఖరి రోజుల్లో, సగం అయ్యి గుర్తుపట్టలేనట్టు అయ్యిపోయారు' అనుకుంది జాగృతి.
"చాలా మొండి వాడు. వాడి చిన్నప్పుడు, అందరం కలిసి ఒక పెళ్ళికి వెళ్లి, భోజనాలు చేస్తుంటే, కాకి వచ్చి వాడి ఆకులోని అప్పడం పట్టుకుని వెళ్ళిపోయింది. ఇంకోటి తెచ్చి ఇచ్చినా వద్దు అని, ఆ కాకి పట్టుకుని వెళ్లిన అప్పడమే కావాలి అని పేచీ పెట్టాడు. అంత మొండితనం చిన్నప్పటి నుండి " అన్నారు చుట్టాల్లో ఒక ఆవిడ.
'ఆ మొండితనం వల్లే కదా హాస్పిటల్ లో ఉండకుండా వెళ్లిపోయారు' అనుకుంది జాగృతి.
"ఏ గుడికి వెళ్లినా, లోపలకి వచ్చేవారు కాదు. బయటనే ఉండిపోయేవారు. దేవుడి మీద నమ్మకం లేదు అనుకునే వాళ్ళం. "
"తిరుపతి లోను, కాశి లోను మాత్రం గుడి లోపలకి వచ్చారు. "
"తిరుపతి వచ్చినా ఎప్పుడూ గుండు చేయించుకోలేదు. "
"బాగా ఇష్టం అయినవి అందరూ కాసి లో వదిలేస్తే, ఈయన మాత్రం ఇష్టం లేనివి వదిలి వచ్చారు. " అని ఎవరికి తోచినవి, గుర్తు వస్తున్నవి వాళ్ళు చెప్పారు.
"నా కొడుకు చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు చూసాడు. అందుకే దేవుడి మీద కోపం. ఎవరికి ఎంత భక్తి ఉందో మనకి ఎలా తెలుస్తుంది. ఆ దేవుడికి తెలుస్తుంది. అందుకే, ఇలా శివరాత్రి ఘడియల్లో డైరెక్టుగా కైలాసానికి వెళ్ళిపోయాడు నా కొడుకుని " అని ఏడుస్తూ చెప్పారు రమేష్ గారి అమ్మ.
'నిజమే కదా. భక్తి వుందా లేదా అని మనం ఎలా చెప్పగలం? అది భక్తుడికి, భగవంతుడికి సంబంధించిన విషయం. ' అనుకుంది జాగృతి.
***సమాప్తం***
L. V. జయ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం : LV జయ
నా పేరు LV జయ.
https://www.manatelugukathalu.com/profile/jaya
నాకు చిన్నప్పటి నుండి తెలుగు కథలు, పద్యాలూ, సాహిత్యం, సంగీతం అంటే చాలా ఇష్టం.
ఏ విషయాన్ని అయినా సరదాగా తీసుకునే అలవాటు. అదే నా కథల రూపంలో చూపించాలని చిన్న ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను.
ధన్యవాదాలు
コメント