top of page
Writer's pictureSrinivasarao Jeedigunta

భలే స్నేహితులు 



 'Bhale Snehithulu' - New Telugu Story Written By Jidigunta Srinivasa Rao

Published In manatelugukathalu.com On 04/03/2024

'భలే స్నేహితులు' తెలుగు కథ

రచన : జీడిగుంట శ్రీనివాసరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్




“మీ ఫ్రెండ్ వచ్చినట్టున్నాడు, తలుపులు విరిగేడట్లు కొడుతున్నాడు, ఆ వంకాయలు నేను తరుగుతాను కానీ ముందు వెళ్లి తలుపు తీయండి, ఎప్పుడో భోజనం కి టిఫిన్ కూడా తినకుండా వంకాయలు తరగడం మొదలెట్టారు” అంది స్వప్న.


“నీకు వంకాయలు అంటే చిన్న చూపు కదా, ఏరి మరి పొట్లకాయ వండుతావు. అందుకే ముందే తరిగి పెడితే వండుతావని..” అంటూ లేచి వెళ్లి తలుపు తీసాడు మూర్తి.


“యేమిటిరా బారేడు పొద్దుయేక్కినా తలుపులు బిగించుకుని కూర్చుంటారు, ఏం చేస్తున్నారు” అంటూ లోపలికి వచ్చాడు సుబ్బారావు.


“పగలైనా రాత్రి అయినా ఈ వయసులో మనం చేసేది ఏముంది కానీ, ఏమిటి అంత కంగారు పడుతున్నావ్” అన్నాడు నవ్వుతు మూర్తి.


“వుండరా! మా చెల్లమ్మ చేతితో యిచ్చిన కాఫీ తాగుతో చెప్తాను” అన్నాడు వంటగది వైపు చూస్తో.


“కాఫీ కి ముందు అత్తయ్య హోటల్ నుంచి తెప్పించిన గారెలు కూడా రుచి చూడరా” అన్నాడు మూర్తి.


“వడలు మీ ఇద్దరికి సరిపడి తెప్పించుకుని వుంటారు, నాకు కాఫీ చాలులే” అన్నాడు సుబ్బారావు.


“ఎందుకో రా ఉదయం ఎడమ కన్ను అదిరింది, ఎందుకైనా మంచిది అని యింకో ప్లేట్ ఎక్సట్రా తెప్పించనులే, వేషాలు వెయ్యకుండా ముందు గారెలు తింటే నే కాఫీ” అన్నాడు మూర్తి.


“బాగానే వుంది మీ స్నేహితుల సరసం”, అంటూ యిద్దరికి లారీ టైర్ అంత పెద్ద సైజు వడల ప్లేట్స్ అందించింది స్వప్న. “వదినని కూడా తీసుకుని రావలిసింది అన్నయ్య” అంది సుబ్బారావు తో.


“ఎలా వుంది రా గారే/’ అని అడిగాడు సుబ్బారావు ని మూర్తి. 


“మా అత్తగారు చేసినట్టు వున్నాయి, నీకు ఈ అత్తయ్యా హోటల్ ఎక్కడ దొరికింది రా నా ప్రాణానికి” అన్నాడు సగం తిని వదిలిసిన ప్లేట్ ని పక్కన పెడుతో.


“దాని దుంప తెగా, ఎంత మోసం చేసింది” అంటూ సగం కొరికిన వడ ని ప్లేటులో పడేసాడు మూర్తి.


కాఫీ పట్టుకుని వచ్చిన స్వప్న “ఏమిటి ఎవ్వరు తినకుండా కూర్చున్నారు?” అంది.


“బాగుండలేదు గాని చెరో రెండు బిస్కట్స్ యివ్వు, ఆదివారం మొత్తం నాశనం చేసింది అత్తయ్య హోటల్” అన్నాడు మూర్తి భార్య తో. 


“ఒరేయ్ నాకు బిస్కెట్ వద్దుకాని, కొద్దిగా మాదిఫలరసం వుంటే ఇవ్వరా నాలుకకి రాసుకుంటాను” అన్నాడు సుబ్బారావు.


“ఆపరా బాబూ, ముందు నువ్వు అంత హడావిడి గా వచ్చిన పనిఏమిటి, సింహాద్వారం ని టేకు తో చేయించుకునేది యిందుకే, నీలాంటి వాళ్ళు ఎంత భాదిన విరగకుండా వుంటుంది అని” అన్నాడు మూర్తి.

“ఏమిలేదురా, రేపు మా నాన్నగారి తద్దినం, ఆయన వున్నన్నాళ్లు పనసపోట్టు దొరికితే చాలు, లాటరి తగిలినంత ఆనందంతో కూర వండించుకుని తినే వాళ్ళు. యిన్నాళ్ళు ఈ విషయం గుర్తుకు రాలేదు. నిన్న మీ చెల్లెలు అంది మావగారికి పనసపోట్టు కూర యిష్టం కదా, మీ ఫ్రెండ్ వాళ్ళ తోటలో పనస చెట్టు విరగ కాసింది, అడిగి రెండు కాయలు తీసుకుని వచ్చి రేవు బ్రాహ్మన్స్ కి కూర వండి వడ్డీస్తే పితృదేవతలు సంతోషిస్తారు అంది. ఆడవాళ్లు గమనించినట్టు మనం గమనించలేము రా, అది ఎప్పుడు చూసిందో మీ దొడ్లో పనస చెట్టుని” అన్నాడు సుబ్బారావు. 


“నీకు ఎలాగో కూరలు తరగడంలో నైపుణ్యం వుంది కాబట్టి ఒక పెద్ద సైజు పనసకాయ పొట్టు కొట్టి రేపు ఉదయం ఏడుగంటలకల్లా మా ఇంటికి తీసుకుని రా, రేపు మా నాన్నగారి తద్దినం ఆయన కిష్టమైన పనసపోట్టు కూర తో సంతృప్తి పరుస్తాను’ అన్నాడు సుబ్బారావు.


“ఒరేయ్ ఏదో తోటకూర, పాలకూర లాంటివి తరిగి మీ చెల్లెలు కి సహాయం చేస్తానని, నన్ను పనసపోట్టు కొట్టమంటానికి నీకు నోరు ఎలా వచ్చింది రా సుబ్బారావు” అన్నాడు మూర్తి.


“పనస కాయ పొట్టు కొట్టడం, పనస పండు వలవడం రానివాడివి పనస చెట్టు ఎందుకు పెంచుతున్నావు, వెధవ వేషాలు వెయ్యక రేపు పనస పొట్టు సప్లై బాధ్యత నీదే, నీకు పుణ్యం వస్తుంది లేరా, పద మంచి పదునైన కాయ సెలెక్ట్ చేస్తాను” అంటూ లేచాడు సుబ్బారావు.


యిహ వీడిని తప్పించుకోవడం కష్టం అనుకుని తోటలోని పనస చెట్టు దగ్గరికి తీసుకొని వెళ్ళాడు మూర్తి.


“ఒరేయ్ ఆ మూడో వరుసలోని రెండో కాయ, అదే బూడిద గుమ్మడి కాయంత వుంది చూడు అది కోసి, పొట్టు కొట్టుకుని రా” అంటూ “ఒరేయ్ మీ దొడ్లో బచ్చలి పాదు వుంది అని చెప్పలేదేమిటి రా, కొంత బచ్చలి ఆకు తీసుకొని వస్తే కందా బచ్చలి కూర చేయిస్త. భోక్తలు ఆనందంగా తింటారు” అన్నాడు సుబ్బారావు.


“నీ మొహం రెండు వేడి కూరలు, వేడిచేసి మంచం ఎక్కితే నీకు పాపం పట్టుకుంటుంది, అందుకే బచ్చలి ఆకు తీసుకొని వెళ్ళు, పనసపోట్టు కూర మీ అమ్మ తద్దినానికి తీసుకుని వెల్దువుగాని” అన్నాడు మూర్తి.


“వద్దులేరా, మొదట పనస పొట్టు కూర పెడతాను అనుకుని మానెస్తే మంచిది కాదు. అసలే పితృదేవతలతో పని, పనస పొట్టు తీసుకొని రా” అని వెళ్ళిపోయాడు సుబ్బారావు.


అన్నం తిని మెల్లగా నిచ్చిన తీసుకొని తోటలోకి వెళ్తున్న భర్తని చూసి స్వప్న, ‘ఏమిటి నిచ్చేన వేసుకొని పనసకాయ కోసేద్దామని అనుకుంటున్నారా, చూడండి చేతులు ఎలా వణుకుతున్నాయో, లోపలికి పదండి” అంది.


‘ఎలాగే, వాడికి రేపు పనసపోట్టు అందించాలి అంటే యిప్పుడు పని మొదలు పెట్టాలి’ అన్నాడు మూర్తి.


“నేను మీకు ఒక ఉపాయం చెప్పి ఈ గండం గట్టేక్కిస్తాను” అని చెవిలో ఏదో చెప్పింది మూర్తి కి.


రాత్రి అంతా కలత నిద్రతో గడిపి ఉదయమే స్నానం చేసి పనస పొట్టు ని సంచిలో పోసుకుని సుబ్బారావు ఇంటికి బయలుదేరుతున్న భర్తతో “యింకా 8 గంటలు కూడా కాలేదు, టిఫిన్ తిని వెళ్ళండి” అంది స్వప్న. 


“సుబ్బారావు యింట్లో తింటాలే” అన్న మూర్తి ని చూసి నవ్వుతో, “బాగానే వుంది, ఈ రోజు తద్దినం పెడుతో టిఫిన్ లు తినరoడీ, ముందు ఈ నాలుగు మైసూర్ బజ్జిలు తిని వెళ్ళండి, పక్క వీధిలో వున్న మీ ఫ్రెండ్ ఇంటికి రెండు నిమిషాలలో వెళ్ళచ్చు” అంది.


ఏమో అనుకున్నాడు గాని వేడి వేడి బజ్జిలు తింటో వుంటే హాయిగా అనిపించింది మూర్తికి.


తిండి పని కానిచ్చుకుని, సుబ్బారావు ఇంటికి వెళ్ళాడు.


సంచితో మూర్తి ని చూసిన సుబ్బారావు మొహం చాటంత చేసుకుని “పనస పొట్టు తెచ్చేసావు, నీకు అభ్యంతరం లేకపోతే ఈ రోజు మా యింట్లో భోజనం చెయ్యచ్చుగా” అన్నాడు.


“ఏమోరా, తద్దినం భోజనం అయిన వాళ్ళు తప్పా బయట వాళ్ళు తినకూడదు అంటారు, అందుట్లో మీ చెల్లెలు కి మహా పట్టింపు” అని చెప్పి తిరిగి వచ్చేసాడు మూర్తి.


ఉదయమే స్వప్న యిచ్చిన కాఫీ తాగుతో, “నిన్న సుబ్బారావు పనస పొట్టు బాగా లాగించి వుంటాడు, అందుకనే ఫోన్ కూడా చెయ్యలేదు” అన్నాడు మూర్తి. 


“వస్తారు లేండి స్నేహితుడి కోసం తెగ ఆరాటపడిపోతున్నారు” అంది స్వప్న నవ్వుతు. 


“యిదిగో తోటలో ఏదో చప్పుడు అవుతోంది, ఏ గొడ్డో వచ్చిందేమో చూడు” అన్నాడు మూర్తి పేపర్ అందుకుంటో.


“ఏమండీ ఒకసారి అర్జెంటుగా యిటు రండి” అని భార్య అరుపులు విని, ఏ మేకో, గొడ్డో వచ్చి వుంటుంది అని కర్ర తీసుకుని తోటలోకి వెళ్ళాడు. అక్కడ పనస చెట్టుని పరిశీలన గా చూస్తున్న సుబ్బారావు, నవ్వుతున్న స్వప్నని చూసి, “నువ్వు తోటలోకి ఎప్పుడు వచ్చావు రా?” అన్నాడు మూర్తి.


“ఒరేయ్ ఆ కర్ర యిటు యివ్వరా, ముందు నిన్ను నాలుగు వుతకాలి, చెట్టు కి వున్న కాయలు వున్నట్టే వున్నాయి, నాకు పనస పొట్టు ఎక్కడ నుంచి తెచ్చావురా” అన్నాడు సుబ్బారావు.


సుబ్బారావు చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకొని వచ్చి “ముందు అలా కూర్చొని మీ చెల్లమ్మ యిచ్చే కాఫీ తాగు, తరువాత జరిగింది చెపుతాను” అన్నాడు మూర్తి.


“ఒరేయ్ నువ్వు ఒకసారి నా వంక చూడరా, నాకు యిప్పుడు డబ్భై ఏళ్ళు, నీకు కూడా అంతే, ఈ వయసులో కూడా తండ్రి తద్దినం తండ్రికి యిష్టమైన కూరలతో పెట్టాలని నువ్వు అనుకోవడం నాకు చాలా ఆనందం వేసింది. అయితే నేను ఆ కడవంత పనసకాయని పొట్టు కొట్టి తీసుకుని రమ్మన్నావు, అది నా వల్ల అవుతుందా చెప్పు, అందుకనే రైతుబజార్ కి వెళ్లి మంచి పదునైన పనస కాయ కొట్టించి తీసుకుని యిచ్చాను, ఏ బాగుండలేదా” అన్నాడు మూర్తి.


“బాగుంది కానీ, కొద్దిగా మాగుడు వాసన వచ్చింది, అదికాక యింటికి వెళ్లిన తరువాత అనుకున్నాను, పాపం వాడి వల్ల ఏమవుతుంది అంత పనసకాయ కొట్టడం, నేనే బజార్ తీసుకొని వెళ్లి కొబ్బరి బొండాం కొట్టే వాడికి డబ్బిచ్చి కొట్టించు కుంటే బాగుండేది అని. కూర తిన్న తరువాత తెలిసింది నువ్వు ఏదో యిటువంటి పని చేసివుంటావని. అందుకే దొడ్డి దారిన వచ్చి పనస చెట్టు వంక చూస్తే, ఎక్కడ కాయలు అక్కడే వున్నాయి” అన్నాడు సుబ్బారావు.


“సారి రా నీ కోరిక తీర్చలేకపోయాను, రేపాదివారం మనమిద్దరం ఒక కాయను తీసుకొని వెళ్లి పొట్టు కొట్టించి మీ చెల్లెలు చేత పనస పొట్టు కూర, మామిడికాయ పప్పు వండించుకుని తిందాం. మా చెల్లెలు ని కూడా తీసుకుని ఉదయమే వచ్చేసేయి, టిఫిన్, భోజనం యిక్కడే” అన్నాడు మూర్తి.


శుభం


జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.











63 views0 comments

Comments


bottom of page