top of page

భానుమతి - అహంయాతి

#పురాణం #ఆధ్యాత్మికం #devotional #TeluguMythologicalStories, #VagumudiLakshmiRaghavaRao, #వాగుమూడిలక్ష్మీరాఘవరావు, #భానుమతి - అహంయాతి, #Bhanumathi - Ahamyathi,#TeluguMythologicalStory


'Bhanumathi - Ahamyathi' - New Telugu Story Written By Vagumudi Lakshmi Raghava Rao

Published In manatelugukathalu.com On 31/10/2024

'భానుమతి - అహంయాతి' తెలుగు కథ

రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు


 యాదవ వంశంలో ఒక శాఖ హైహయ వంశం. 

హైహయ వంశం అనగానే హయగ్రీవ స్వామి గుర్తుకు వస్తాడు. 


 "జ్ఞానానంద మయం దేవం నిర్మల స్పటికాకృతిం !

 ఆధారం సర్వ విద్యానం హయగ్రీవముపాస్మహే!!"

అన్న మంత్రం మెదడును పదును పెడుతుంది. ఆలోచనలను విజ్ఞానవంతం చేస్తుంది. పవిత్ర సూర్య కిరణాల తేజస్సున హయగ్రీవ తేజస్సు వేద సంరక్షక తేజస్సులా దర్శనం ఇస్తుంది. సదాలోచనలు హయంలా పరుగులు తీస్తాయి. అలాంటి మహోన్నతమైన సూర్య తేజం హైహయ వంశానికి బీజం అయ్యింది.

 

 ఒకనాడు నక్షత్రాలు అన్నీ శుభ ఫలితాలను ఇచ్చే ప్రదేశంలో ఉన్న వేళ సూర్య నారాయణుడు ప్రకాశ వంతమైన రేవంతుని రూపంలో వైకుంఠానికి పయన మయ్యాడు. దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న రేవంతుని చూసిన దేవతలందరూ రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నారు. రేవంతుని నుండి ఉదయించే తేజోవంతమైన కిరణాలు ఏడు తలలతో ఎగిరే గుర్రం ఉచ్చైశ్రవం లా ఉన్నాయి. 


 గాయత్రి, బృహతి, ఉష్టిక్, జగతి, త్రిష్టుప్, అనుష్టుప్, పంక్తి అనే పేర్లుగల సప్తాశ్వాల కిరణాలు సప్త చంధస్సులు గా మారి శృతిలయలతో రాగయుక్తంగా సంచరిస్తున్నాయి. పవిత్రమైన నవ భావ జాలాన్ని గణ బద్దం చేసి వేద మంత్రాలు గ మలుస్తున్నాయి. 


 వికుంఠ అనే మాతృమూర్తికి జన్మించిన పుత్రుడు దేవతల కోసం, తన కోసం వైకుంఠాన్ని నిర్మించాడు. పాల సంద్ర వైకుంఠ గోడలు ఇంకా గట్టి పడలేదు. వాటిని గట్టి పరచడానికే శ్రీ సూర్య నారాయణుడు రేవంత తేజంతో అక్కడకు వచ్చాడు. 


శ్రీ సూర్య నారాయణ కిరణ తేజస్సు తో వైకుంఠ గోడలు తదితరాలు బాగా ఎండి బంగారు వర్ణం తో కళకళలాడ సాగాయి. బంగారు గోడల వైకుంఠం లో పాల సంద్రం. ఆ సంద్రంలో ఆది శేషుని శయన స్వరూపం. భాను తేజం. నూతన వైకుంఠం. వర్ణనలకు అందని వైకుంఠ నారాయణ తేజో స్వరూపం. 


 వికుంఠ కుమారుడు వైకుంఠుడనే పేర వైకుంఠం లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. దేవతలందరూ వైకుంఠ నారాయణుని పలు రీతులలో స్తుతించారు. వైకుంఠ నారాయణుని వైకుంఠం చూసి నానా విధ స్తుతులతో వైకుంఠం ను ప్రశంసించారు. అది చూసిన శ్రీ సూర్య నారాయణుడు తాను వచ్చిన పని పూర్తయ్యిందని సంతోషించాడు. 


 వైకుంఠుని ధర్మపత్ని శ్రీ మహా లక్ష్మీదేవి. 

 శ్రీ సూర్య నారాయణ తేజస్సు లో మరికొంత కాలం ఉంటే తన లక్ష్మీ కళ మరింత యశసిస్తుంది అని అనుకుంది. అది గమనించిన వైకుంఠ నారాయణుడు శ్రీమహాలక్ష్మి ని కొంత కాలం భూమి మీద నివసించి, శ్రీ సూర్య నారాయణ తేజస్సు లో తపస్సు చేయమని సలహా ఇచ్చాడు. వైకుంఠ నారాయణుని సలహా శ్రీ మహా లక్ష్మి కి బాగా నచ్చింది. 


"ఆహా! భూలోక వాసులు ఎంత అదృష్టవంతులు. శ్రీ సూర్య నారాయణ తేజస్సున సమస్త రోగాలను పోగొట్టుకుంటూ ఆరోగ్యవంతంగా ఉంటున్నారు. చక్కని కళలతో ప్రకాశిస్తున్నారు." అని శ్రీ మహా లక్ష్మి మనసులో అనుకుంది. 


 శ్రీ మహాలక్ష్మి, వైకుంఠ నారాయణుడు అయిన విష్ణుమూర్తి సలహా తో భూలోకానికి వచ్చింది. తమసా కాళిందీ నదుల సంగమ స్థలంలో నిలబడింది. ఆమెకు తన తండ్రి సాగరుడు గుర్తుకు వచ్చాడు. అలాగే సమద్రంలో ఉన్న బడబానలం గుర్తుకు వచ్చింది. అంత బడబ అనే పేరు గల ఆడ గుర్రం రూపంలో తపస్సు చేయసాగింది. 


 కొంత కాలం తర్వాత మహా శివుని కోరిక మేరకు విష్ణుమూర్తి అశ్వ రూపంలో బడబ ను కలిసాడు. బడబ తపస్సు ఉన్నత స్థాయికి చేరింది అనుకున్నాడు. 


ప్రకృతి పరవశించింది. కొండకోనలు ప్రశాంతంగా ఉన్నాయి. పర్ణశాల ల్లో లేళ్ళు కుందేళ్ళు చెంగు చెంగున ఎగిరెగిరి గంతులు వేస్తున్నాయి. రతీమన్మథులు రస విహారం చేస్తున్నారు. అశ్వ రూపంలో ఉన్న విష్ణు మూర్తి, బడబ రూపంలో ఉన్న లక్ష్మీదేవి ని చూసాడు. 

ఒక శుభ ముహూర్తాన లక్ష్మీ దేవికి విష్ణు మూర్తి కి ఒక దివ్య మగ శిశువు జన్మించాడు. భూమి మీద జన్మించిన ఆ దివ్య శిశువు భూమి మీద జీవిస్తేనే బాగుంటుంది అని బడబ రూపంలో ఉన్న లక్ష్మీదేవి అంది. ఆ దివ్య శిశువు ను పెంచగల పుణ్యాత్ముడు ఎవరు? అని విష్ణుమూర్తి ఆలోచించాడు. అతనికి యదు మహారాజు గుర్తుకు వచ్చాడు.

 

విష్ణుమూర్తి ఆ శిశువు ను సంతానం కోసం తపస్సు చేస్తున్న యయాతి మహారాజు కుమారుడు యదు మహారాజు కు ఇచ్చాడు. అంత విష్ణు మూర్తి " యదు మహారాజ! నీ తండ్రి యయాతి మహారాజు ఆవేశంలో యాదవులకు రాజ్యార్హత లేదు అని శపించాడు. సృష్టి లో లోక కల్యాణం కొరకు ఇచ్చే శాపాలు జరుగుతాయి కానీ స్వార్థం కోసం ఇచ్చే శాపాలు జరగవు. ఎందరెందరో యాదవ మహా రాజులను కాల చక్రం చూస్తుంది." అని విష్ణుమూర్తి యదు మహారాజు ను ఆశీర్వదించాడు. 


యదు మహారాజు ఆ మగ శిశువు కు జాతకాదుల ను చూపించి ఏకవీరుడు అని పేరు పెట్టాడు. ఏకవీరుని కొందరు హైహయుడు అని కూడా అంటారు. 


 హైహయుని కుమారుడే కృతవీర్యుడు. ఇతని భార్య పద్మిని. పద్మినీ కృతవీర్యులకు పుట్టిన కుమార్తె భానుమతి. 


 కృతవీర్యుని భార్య పద్మిని దత్తాత్రేయ స్వామి భక్తురాలు. దత్తాత్రేయ స్వామి ని పూజించని దే ముద్ద కూడా ముట్టదు. భానుమతి కి కూడా భక్తి విషయంలో తల్లి పోలికలే వచ్చాయి. " ఓం నమో దత్తాత్రేయాయ" అని భానుమతి అష్టాక్షరీ మంత్రాన్ని అను నిత్యం జపిస్తుంది. 


 పద్మిని కి చాలా కాలం వరకు సంతానం కలగ లేదు. అప్పుడు పద్మిని అత్రి మహర్షి భార్య అనసూయ దేవిని కలిసి పుత్ర సంతానం కలిగే మార్గాన్ని చెప్పమని ప్రార్థించింది. పద్మిని ప్రార్థనకు చలించిన అనసూయ, మంచి పుత్రుడు పుట్టేందుకు తపస్సు చేయవలసిన పంచమి, సప్తమి, నవమి, ఏకాదశి వంటి తిథుల గురించి సవివరంగా చెప్పింది. 


 పద్మిని, అనసూయ చెప్పిన రీతిన తన భర్త కృతవీర్యుని తో కలిసి తపస్సు చేసింది. వారి తపస్సు మహా జ్ఞాన వంతంగా మారింది. వారి తపస్సు కు మెచ్చిన దత్తాత్రేయ స్వామి వారి ముందు ప్రత్యక్ష మయ్యాడు. 


 దత్తాత్రేయ స్వామి తో కృతవీర్యుడు, " స్వామి నువ్వు తప్ప మరెవరూ ఓడించలేని, సమస్త ప్రపంచాన్ని పాలించే కొడుకు మాకు కావాలి. " అని అన్నాడు. 


 దత్తాత్రేయ స్వామి కృతవీర్యుని కోరికను విని చిన్నగా నవ్వుకున్నాడు. "ఈ భూమి మీద జన్మించిన సురులవైన, నరులవైన, అసురులవైన మరెవరివైన కోరికలు మాత్రం మహా విచిత్రం గా ఉంటాయి." అని మనసులో అనుకున్నాడు. అనంతరం కృతవీర్యుని 

కోరికను మన్నించి " తథాస్తు" అన్నాడు. 

 కొంత కాలానికి పద్మిని పండంటి మగ శిశువుకు జన్మనిచ్చింది. పుట్టిన శిశువుకు వేయి చేతులు ఉన్నాయి. ఆ శిశువును చూసి, అందరూ ఈ శిశువు కారణ జన్ముడు అని అనుకున్నారు. 


 కృతవీర్యుడు మగ శిశువు కు కార్తవీర్యార్జునుడు అని పేరు పెట్టాడు. ఇతనికి వేయి చేతులు ఉండటం చేత ఇతనిని సహస్ర బాహు అర్జునుడు అని కూడ అనేవారు. ఆపై పద్మిని మరి కొంత మంది మగ సంతానానికి జన్మనిచ్చింది. ఆపై భానుమతి కి జన్మనిచ్చింది. 


 పద్మినీ కృతవీర్యుల సంతానంలో చదువు సంధ్యలలో తదితర విషయాల్లో కార్తవీర్యార్జునుడు, భానుమతి మంచి పేరు ప్రతిష్టలను తెచ్చుకున్నారు. 


 భానుమతి అనునిత్యం సూర్య భగవానుని, దత్తాత్రేయ స్వామి ని పూజించేది. వారి కరుణాకటాక్ష వీక్షణలకై అనుక్షణం తపించేది. 


 తమ వంశ మూల తేజంలో శ్రీ సూర్య నారాయణ ప్రస్తావన కూడా ఉందని తెలుసుకున్న పద్మిని తన కుమార్తె భానుమతి సూర్య భగవానుని, దత్తాత్రేయ స్వామి ని పూజించడం చూసి మహా మురిసిపోయేది. 


కుమార్తె పూజకు తను అందించగలిగినంత సహాయం అందించేది. త్రివర్ణ పుష్పాలను, త్రిముఖ పుష్పాలను భానుమతి పూజ కోసం పద్మిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసేది. 

 సూర్య భగవానుని కృప భానుమతి ని మహోన్నత తేజస్విని చేసింది. మహా తేజస్విని అయిన భానుమతి తన తండ్రి కృతవీర్యుడు దత్తాత్రేయ స్వామి ని సంతానం నిమిత్తం కోరిన కోరికను తల్లి పద్మిని ద్వారా తెలుసుకుంది. 


అంత తల్లి పద్మిని తో భానుమతి "భగవంతుని అనుగ్రహం అందరికి లభించదు. అది లభించిందంటే వారు మహా అదృష్టవంతులు అనే చెప్పాలి. ఇక దత్తాత్రేయ స్వామి అనుగ్రహం అంటే త్రిమూర్తుల అనుగ్రహం లభించింది అనే అర్థం. భగవంతుని భక్తులు ఇల పై మంచి పేరు ప్రతిష్టలను తెచ్చుకునే సంతానం కావాలని కోరుకోవాలి గానీ నా సంతానానికి మరణం ఉండరాదని లేదా అందరిని చంపే సంతానం కావలని ఇలా గొంతెమ్మ కోరికలు కోరుకోరాదు. భగవంతుడు ప్రసాదించిన శక్తిని సవినయంగా స్వీకరించాలి. ఆ శక్తితో సాధ్యమైనంతగా లోకానికి మేలు చేయాలి. " అని అంది. 


 పద్మిని తన కుమార్తె భానుమతి సదాలోచనలను విని మహదానందపడింది. 


 శ్రీ సూర్య నారాయణ తేజస్సు తో, దత్తాత్రేయ స్వామి దరహాసం తో ప్రకాశించే భానుమతి ని చూడగానే కొంతమంది ప్రజల చర్మ వ్యాధులు మటుమాయం అయ్యేవి. మరి కొందరి మంద బుద్ధి నశించేది. ఇంకొందరి శారీరక శక్తి ఇబ్బడి ముబ్బడిగా పెరిగేది. 


 వరాంగి సంయాతి ల పుత్రుడు అహంయాతి. 

వశిష్ట మహర్షి దగ్గర అహంయాతి సమస్త విద్యలను అభ్యసించాడు. సమరంలో తనకు తానే సాటి అన్నంత పేరు ప్రతిష్టలను తెచ్చుకున్నాడు. అహంయాతి తన కండ బలం తో కొండలను పిండి చేయగలడు అని పుర ప్రజలందరూ అనుకునేవారు. అయితే అహంయాతి తలిదండ్రుల వద్ద వినయ విధేయతలను ప్రదర్శించేవాడు కానీ పరుల దగ్గర మాత్రం కొంచెం అహంకారాన్ని ప్రదర్శించేవాడు. తను కాబోయే రాజును అన్న అహంకారం అహంయాతి లో ఉండేది. 


 కుమారుడు అహంయాతి తత్వాన్ని పసిగట్టిన వరాంగి కుమారుని పై బాధ్యత పెరిగితే గానీ ఆ అహం కారం తగ్గదనే భావనకు వచ్చింది. అదే విషయాన్ని కుల గురువు వశిష్ట మహర్షి కి చెప్పింది. 


 వశిష్ట మహర్షి కి వరాంగి సూచన బాగా నచ్చింది. 

వశిష్ట మహర్షి అహంయాతి ని పిలిచి యజ్ఞ శాలలను సంరక్షించే బాధ్యత ను అహంయాతి కి అప్పగించాడు. 

అహంయాతి కుల గురువు వశిష్ట మహర్షి మాటలను కాదనలేక యజ్ఞ సంరక్షణ బాధ్యత లను స్వీకరించాడు. 

వశిష్టాది మహర్షుల మీద ఉన్న గౌరవంతో తన బాధ్యత లను సక్రమంగా నిర్వహించాడు. 


 అహంయాతి యజ్ఞ సంరక్షణ బాధ్యతను

 నిర్వహిస్తూ, ఋషుల, మహర్షుల ప్రవర్తనా సరళిని గమనించసాగాడు. వారి ఆద్యాత్మిక ప్రసంగాల వలన, వారి శాంతియుత ఆలోచనల వలన అహంయాతి లో ఉన్న అహం నెమ్మది నెమ్మదిగా తగ్గిపోసాగింది. 


 కర్కోటక నాగుడనే నాగ జాతికి చెందిన రాజు కృతవీర్యుని సంపదను చూసి సహించలేక కృతవీర్యుని మీద యుద్దం ప్రకటించాడు. కృతవీర్యుని, అతని సోదరులను, పుత్రులను సమస్తం మట్టు పెట్టాలనే నిర్ణయానికి కర్కోటక నాగుడు వచ్చాడు. కాలకూట విషంతో కూడిన అస్త్రాలను కృతవీర్యుని మీద, కార్తవీర్యార్జునుడు మీద ప్రయోగించాలని కర్కోటక నాగుడు నిశ్చయించుకున్నాడు. కాలకూట అస్త్రాలను అనేకం తయారు చేయించాడు. 


 ఇది తెలిసిన భానుమతి సూర్య భగవానుని అనుగ్రహం తో సూర్య కిరణ అస్త్రాలను తయారు చేసింది. ఆ అస్త్రాలను ప్రయోగించే రీతి పది మందికి నేర్పింది. వాటిని సమరంలో కర్కోటక నాగుని సైన్యం మీద ప్రయోగించింది. 


 భానుమతి ప్రయోగిస్తూ, ప్రయోగింప చేసే సూర్య కిరణ అస్త్రాలకు, కార్తవీర్యార్జునుడు ఒకేసారి వేయి చేతులతో ప్రయోగించే అస్త్రాల ధాటికి కర్కోటక నాగుని సైన్యం తట్టుకోలేక పోయింది. అయినప్పటికి పట్టిన పట్టును వదలకుండా కర్కోటక నాగుడు అధర్మ యుద్దం లో కృత వీర్యుని బంధు వర్గం సమస్తాన్ని, కృతవీర్యుడే ప్రాణం అనుకునే సైన్యాన్ని ఎక్కడికక్కడ సంహరించాలనే దృఢ నిర్ణయం తో రాక్షస యుద్దం చేయసాగాడు.

 

 వరాంగి సంయాతి లకు వశిష్ట మహర్షి ద్వారా కర్కోటక నాగుని అధర్మ రాక్షస యుద్దం గురించి తెలిసింది. వెంటనే కృతవీర్యునికి, కార్తవీర్యార్జునునికి యుద్దంలో సహాయపడమని అహంయాతి ని పంపారు. 


 అహంయాతి మహా సైన్యం తో ఆహవ రంగాన కాలు పెట్టాడు అహంయాతి సైన్యం కర్కోటక నాగుని సైన్యం ను ఊచకోత కోయడం చూచిన కృతవీర్యుడు రథంలో నుండే అహంయాతి కి నమస్కరించాడు. అహంయాతి ని చూచిన భానుమతి, కార్తవీర్యార్జునులు కూడా అహంయాతి కి కృతజ్ఞతా భావంతో నమస్కరించారు. అహంయాతి సమర కౌశల్యాన్ని చూసిన కర్కోటక నాగుడు సమరంలో తనకు ఇక అపజయం తప్పదు అనుకున్నాడు. 


 కర్కోటక నాగునికి కార్తవీర్యార్జునునికి జరిగిన భయంకర యుద్ధంలో కర్కోటక నాగుడు మరణించాడు. ఆతని మహిష్మతి పట్టణం కార్తవీర్యార్జునుని వశం అయ్యింది. 

 సమర అనంతరం వరాంగి బంధు వర్గం, కృతవీర్యుని బంధు వర్గం విందు వినోదాలలో మునిగి తేలారు. ఆ విందు వినోదాలలోనే భానుమతి అహంయాతి ల అంగీకారం తో వారిద్దరికి వివాహం చేయాలని ఇరు వర్గాల పెద్దలు అనుకున్నారు. 


 వరాంగి సంయాతి లు అహంయాతి కి ముందుగా పట్టాభిషేకం చేసారు. ఆ పట్టాభిషేకానికి భానుమతి బంధువర్గం సమస్తం వచ్చింది. 


 భానుమతి అహంయాతి లు ఒంటరిగా కలుసుకున్నారు. మనసు విప్పి మాట్లాడుకున్నారు. మనల్ని ఆవహించిన రతీమన్మథులు మన చెప్పు చేతల్లో ఉండాలి కానీ వారి చెప్పు చేతల్లోకి మనం వెళ్ళకూడదు. ఎక్కడైనా ఎప్పుడైనా అతి సర్వత్ర వర్జయేత్ అనుకున్నారు. 


 ఋషులు, మహర్షులు, రాజర్షులు, జ్యోతిష్య పండితులు రెండు రాజ కుటుంబాల మాటలను అనుసరించి భానుమతి అహంయాతి ల వివాహానికి మంచి శుభ ముహూర్తాన్ని నిర్ణయించారు. ఆ శుభ ముహూర్తాన భానుమతి అహంయాతి ల వివాహం అంగరంగవైభవంగా జరిగింది. ఆ వేడుకకు అనేక దేశాల రాజులు, సామంతులు, తదితరులందరూ 

వచ్చారు. వశిష్ట మహర్షి, గర్గ మహర్షి వంటి మహర్షులు వధూవరులతో అనేకానేక పరిణయ యాగాలు చేయించారు. 

 భానుమతి వివాహం జరిగిన కొద్దిరోజులకే అనారోగ్య కారణంగా కృతవీర్యుడు మరణించాడు. 


కృతవీర్యుని సోదరులు కొందరు పెద్దల సహాయంతో కృతవీర్యుని రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలని చూసారు. అయితే రాజ్యంలోని ఎక్కువమంది పెద్దలు వారికి సహకరించ లేదు. కృతవీర్యుని రాజ్యం అతని సంతానానికి చెందడమే ధర్మం అన్నారు. 


 కొందరు మహర్షులు, పుర పెద్దలు అల్లుడు అహంయాతి ని రాజును చేయమన్నారు. కార్తవీర్యార్జునుడు అతని సోదరులు కూడా అహంయాతి నే రాజును చెయ్యమన్నారు. 



 అహంయాతి తన ధర్మపత్ని భానుమతి తో సంప్రదించి "విస్తృతమైన నా సామ్రాజ్య సంరక్షణా బాధ్యత నాకుంది. కాబట్టి మహిష్మతీ ని రాజధానిగా చేసుకుని కార్తవీర్యార్జునుడు పరిపాలన చేస్తేనే బాగుంటుంది " అని అన్నాడు. 


భానుమతి తన భర్త మాటలే తన మాటలు అని అంది. 

 గర్గ మహర్షి, వశిష్ట మహర్షులు భానుమతి మాటలకే తమ మద్దతును ప్రకటించారు. అయితే కార్తవీర్యార్జునుడు ముందుగ రాజ పదవిని నిరాకరించాడు. " ప్రజలందరికి మేలు చేయని రాజు అసలు రాజే కాదు. రాజ్యం లోని ప్రజలందరికి న్యాయం చేయగలను అనే నమ్మకం నాకు లేదు. " అని కార్తవీర్యార్జునుడు బంధువులతో, మహర్షులతో, పుర పెద్దలతో, భానుమతి తో అన్నాడు. 


సోదరుని మాటలను విన్న భానుమతి దత్తాత్రేయ స్వామి ని ప్రసన్నం చేసుకుంది. సోదరుడైన కార్తవీర్యార్జునుని ఆలోచనా సరళిని మార్చమని దత్తాత్రేయ స్వామి ని వేడుకుంది. 


 దత్తాత్రేయ స్వామి కార్తవీర్యార్జునుని మనసు మార్చి అతనికి సుపరిపాలన కు ఉపయోగ పడే ఎనిమిది వరాలను ఇచ్చాడు. 


 ఎనిమిది వరాలు లభించగానే కార్తవీర్యార్జునునికి తన మీద తనకు కొంచెం నమ్మకం కలిగింది. కార్తవీర్యార్జునుని నమ్మకాన్ని భానుమతి ద్విగుణీకృతం, త్రిగుణీకృతం చేసింది. 


 కార్తవీర్యార్జునుడు మహిష్మతి కి రాజయ్యాడు. 

గర్గ మహర్షి, భానుమతి సుపరిపాలనను ప్రజలకు అందించవలసిన తీరును కార్తవీర్యార్జునునికి తెలిపారు. కార్తవీర్యార్జునుడు గర్గ మహర్షి, భానుమతి లు చెప్పినట్లు కొంత కాలం నడుచుకున్నాడు. అటు పిమ్మట తన స్వంత నిర్ణయాల తో రాజ్య పరిపాలన చేయసాగాడు. 

 కార్తవీర్యార్జునుని సుపరిపాలన చూసి గర్గ మహర్షి, భానుమతి, అహంయాతులు మిక్కిలి సంతోషించారు. 

 భానుమతి మాటలను అనుసరించి అహంయాతి, కార్తవీర్యార్జునుడు దుర్మార్గులైన అనేకమంది రాజులను ఓడించారు. 


 తన భర్త, తన సోదరుడు చేసే యుద్ధాలకు భానుమతి అనేక సూర్య కిరణ అస్త్రాలను తయారు చేయించి ఇచ్చింది. 

 కార్తవీర్యార్జునుడు, అహంయాతి దురితులైన రాజులను సంహరించి, ఆయా రాజ్య ప్రజలను దుర్మార్గులైన రాజుల నుండి సంరక్షించారు. అందుకు ఆ రాజ్య ప్రజలు మిక్కిలి సంతోషించారు. ఆపై ఆయా రాజ్య ప్రజల నుండి వారికి వద్దన్నా సువర్ణం వచ్చి పడింది. 


 భానుమతి తమకు సంక్రమించిన సువర్ణం లో అధిక శాతం నిరుపేదలకు దానం చేసింది. ఆపై సువర్ణ యజ్ఞ శాలలను నిర్మింప చేసింది. ఆ సువర్ణ యజ్ఞ శాల ల్లో భానుమతి మాటలను అనుసరించి, అహంయాతి సహాయంతో కార్తవీర్యార్జునుడు 700 యజ్ఞాలు చేసాడు. 


 కార్తవీర్యార్జునుడు చేసిన ధర్మ బద్ధమైన యజ్ఞాలను చూసి మిక్కిలి సంతసించిన దత్తాత్రేయ స్వామి భానుమతి అహంయాతి కార్తవీర్యార్జునులకు ఎగిరే రథాన్ని బహుకరించాడు. ఆ రథంలో ముగ్గురు ఆనందంగా విహరించారు. 


 భానుమతి అహంయాతి ల సుపుత్రుడు సార్వ భౌముడు. 


శుభం భూయాత్ 


వాగుమూడి లక్ష్మీ రాఘవరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత పరిచయం: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు








42 views0 comments

Comments


bottom of page