#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #TajMahal, #భారతీయసంస్కృతి, #ప్రజలులేనిపల్లెటూళ్లు, #తేటగీతిమాలిక

గాయత్రి గారి కవితలు పార్ట్ 3
Bharathiya Sanskruthi - Gayathri Gari Kavithalu Part 3 - New Telugu Poems Written By - T. V. L. Gayathri Published In manatelugukathalu.com On 05/03/2025
భారతీయ సంస్కృతి - గాయత్రి గారి కవితలు పార్ట్ 3 - తెలుగు కవితలు
రచన: T. V. L. గాయత్రి
1.
భారతీయ సంస్కృతి.
(తేటగీతిమాలిక )
ప్రేమ ప్రేమంచు వలపుతో వివిధ గతుల
వెర్రి పరుగును పెట్టుచు కుర్రకారు
చేరు కొనలేరు సంసార తీరమెపుడు
బరువు బాధ్యతల మునుగు వయసు లేదు.
పెద్ద వారిని తలచరే వేడ్కలందు
గంతు లెన్నియో వైచుచు కామితులయి
జీవనంబును సాగించ చేదు మిగులు
క్రొత్త ముచ్చట లందున కొరత కలుగు.
ప్రేమ పైత్యములో బడి వేళమరచి
చదువు సంధ్యలు వీడిన ఛాత్రులిపుడు
జీవితంబున స్థిరపడు చేవ తరుగ
దీనులై వగపొందుచు తిరుగుచుంద్రు.
నేటి యువతకు తెలియవు నీతులిపుడు
క్లబ్బు పబ్బుల దుష్టమౌ కాల మందు
కూలి పోయిన యువతకు మేలు కలదె?
శాస్త్ర జ్ఞానమున్ బడయుచు చక్కనైన
భారతీయపు సంస్కృతిన్ వైభవముగ
నాచరించిన సంపద లందుచుండు
తల్లి దండ్రుల పల్కులన్ దలను దాల్చి
సాధు మతులయి దంపతుల్ సర్దుకొనుచు
ధరణి యందున శాంతులై తరల వలయు.
వంశ గౌరవంబును నిల్పి వసుధ యందు
పిల్ల పాపలన్ బెంచుచు ప్రేమతోడ
వరలు చుండగా జాతికి భవ్యమైన
భాగ్య రాసుల నందించు వారు ఘనులు.//
************************************
2.
ప్రజలు లేని పల్లెటూళ్లు
(తేటగీతి మాలిక ).

కరువు కోరలు చాచంగ కలిమి కరిగి
పల్లె టూరిలో జనులిప్డు బ్రతుక లేక
బీడు భూముల దున్నగా బెదురుచుండి
వలస పోవుచు నుండిరి పల్లె వీడి.
సన్నకారు రైతులిపుడు చావలేక
కూలి పనులను జేయగా కుములుచుండి
తిండి గింజల కోసము దిగులునొంది
బుట్టతట్టపట్టి వలస పోవుచుండ్రి.
మోట బావులు మన్నుతో మునిగి యుండె
చుక్క జలమైన దొరకక సొమ్మసిలుచు
పశువు లచ్చోట విడువంగ ప్రాణములను
పల్లె వీడుచు రైతులు పరుగులిడిరి.
కళకళలతోడ పల్లెలు కలిమి నిడగ
భాగ్యరాశులతోజనవాహినికడు
గలిసిమెలిసిcగడుపుచుండ కాలమెల్ల
వాడవాడలు శాంతితో వర్థిలునిట.
పల్లెలకుప్రాణమనుచుvనీరమ్ముvకొరకు
బావులను చెరువులనట బాగు చేసి
పొలములకు జలములువెట్ట బొంగి పొరలు
సిరులతో పల్లె లన్నియు వరములిడుచు.//

టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
Profile Link:
留言